అంతర్జాలంలో తెలుగు భాషాభివృద్ధి – 2 (వివరణ, కవితలు)

మొదట వివరణ ఇస్తాను. అంతర్జాలంలో భాషాభివృద్ధి టపాకి నేను అనుకోని స్థాయిలో
మీరు స్పందించినందుకు మనఃపూర్వక ధన్యవాదాలు.

దీనికి నేపథ్యం చెప్పాలి. ఈ విషయం నేను కొంతకాలంగా అనేక విధాల నా ముఖపత్రంలో ప్రస్తావిస్తున్నాను. ప్రత్యేకించి కనీసం నా ముఖపత్రంలో తెలుగులోనే వ్యాఖ్యలు రాయమని అనేక విధాల చెప్తూ వస్తున్నాను. నాకోరిక మన్నించి చాలామంది అలాగే చేస్తున్నారు. కొందరు కొత్తగా మొదలు పెట్టేరు. ఒకరు తెలుగు ఫాంట్స్ కొనవలసివచ్చిందని కూడా చెప్పేరు. ఇది కే్వలం నామాటయందు గౌరవం మాత్రమే కాదు. తెలుగుభాషయందు వారికి గల అభిమానం అని గుర్తించి వారిని అభినందిస్తున్నాను. ధన్యవాదాలు.

పోతే, నా వ్యాసంలో నేను చేసిన ఒక పొరపాటు కూడా మీ వ్యాఖ్యలద్వారా గుర్తించేను. హాస్యంగా, వ్యంగ్యంగా కొన్ని టపాలలో సృష్టించిన పదాలు ఈ వ్యాసంలో చేర్చడంవల్ల కొంత అస్పష్టత వచ్చింది మూలవాదనకి. నెట్చెలులు, ఎకడమీకం వంటివి ఆయా టపాల్లో పాఠకులు ఆదరించడంతో వాటిని నా కొత్త పదాలజాబితాలో చేర్చేను. అవి చాలామటుకు ఆ సందర్భంలోనే అంటే హాస్యం, వ్యంగ్యం చెల్లిన చోట మాత్రమే బాగుంటాయి. ఆ విషయం స్పష్టం చేయకపోవడం నా పొరపాటే. ఇది నాదృష్టికి తెచ్చిన మిత్రులకు ధన్యవాదాలు.

నేను ప్రధానంగా చెప్పదలుచుకున్నది – నిత్య జీవితంలో సర్వసాధారణమైన పదాలు అనేకం వాడడం మానేసి ఇంగ్లీషు పదాలు వాడుతున్నారు, అది అనవసరం, అర్థరహితం అనే. ఇది నాకు ముఖపుస్తకంలో అధికంగా కనిపించడంచేత ప్రత్యేకించి ఈ వ్యాసం రాయడం జరిగింది. ఉదాహరణకి సండే, మండే, మార్నింగు, ఈవెనింగ్, మిత్రాస్, వాటర్, ఫుడ్, బ్యాగ్, ఫెమిలియర్గా, హేపీగా, బ్యూటిఫుల్గా … వంటి పదాలు. తెలుగులో వీటికి సమానార్థకాలు తేలిగ్గానే అందరికీ తెలిసినవే ఉన్నాయి, అవి ఎందుకు వాడరు అని నా ప్రశ్న. అంతే కాక, ఇంగ్లీషులిపిలో రాస్తున్న తెలుగు. కనీసం నా పేజీలోనైనా అలా రాయకండి అంటే కూడా అలా రాసేవారు వారానికి ఒకరిద్దరు ఉంటున్నారు అదేదో నన్ను సవాలు చేయడానికేమో అన్నట్టు. అంచేత కూడా నావ్యాసం ఎవరూ సీరియస్ గా (ఈపదానికి తెలుగు పదం ఎవరైనా చెప్పగలరు) తీసుకోరేమో అనిపించింది. అలాటి నిస్పృహ కొంతా, నాకు అలవాటయిపోయిన హేళన, వ్యంగ్యం కొంతా కలిసి అలా వచ్చింది నావ్యాసం. అది నా పొరపాటే. మన్నించవలసిందిగా కోరుతున్నాను.

నాజాబితాలోని ఏ పదాలు వాడుకలోకి తీసుకురావచ్చు అన్నది ముఖ్యం కాదు. ప్రధానంగా తెలుగుమాటలు వాడండి, తెలుగు అక్షరాలు రాకపోతే మళ్ళీ నేర్చుకోండి అని మాత్రమే నావాదనా, అభ్యర్థనాను.

ముఖపత్రంలో నాకోరికపై నా మిత్రులు రాసిన పద్యాలు ఇక్కడ కొన్ని చేర్చాను ఇక్కడ. మిగతా పద్యాలు రేపు పెడతాను.

మరొకసారి ఈ టపా సీరియస్ గా తీసుకున్న మిత్రులందరికీ ధన్యవాదాలు.

1. వసుధా రాణి
వంకాయ కూరను మెంతి
కూరి వండ చిరుచేదాయకూర
యని భారతమ్మ తెలుప భారతమ్మని
తలచి మాలతమ్మ దుఃఖించే.

2. పద్మా కుమారి
వంకాయ వంటి కూర
మాలతి వంటి టెంగ్లీష్ పడని ఇంతి
టెంపరితనం నచ్చని జనం
భారతావనిన అరుదుసుమీ అనగ
భారతమ్మను తలచి మాలతమ్మ దుఃఖించే.

3. టేకుమళ్ళ వెంకటప్పయ్య
తే.గీ. గ్రంధ చౌర్యము బెరిగెను కనగ యవని
కలికి పాఠాలు నేర్పేటి కలియుగంబు
భారతమ్మకు కష్టాలు భారమాయె
మాలతమ్మకు కన్నీరు మాన్ప రమ్మ!

ఆంగ్ల భాషకు చాచకు అఱ్ఱులెపుడు
భార్య వెలయాలు తేడాను బాధ్యతెరిగి
మమ్మి డాడీల సంస్కృతి మాను కొనర!
కమ్మ నయినట్టి తెలుగున కబురు వినర!

4. శ్రీదేవి శ్రీపాద
మావ -తాత పిలుపులె
మసక బారి పోయాయి,
అమ్మ -నాన్న పిలుపులె
అసలు లేక పోయాయి.
తియ్యందనమే ఎరుగని
తెల్లవాడి భాష ముందు,
తేనెలొలుకు పాటలాంటి
తెలుగు భాష చిన్నబోయే.
ఆంగ్ల భాషకధికారమిచ్చి
అమ్మ భాష మరిచిపోయి,
పరాయి భాష మోజులో
మాతృభాష విడనాడే
భారతమ్మ బిడ్డలను జూచి
మాలతమ్మ దుఃఖించె.

5. జె.బి. జరుగుమిల్లి –
కలతచెందకుమమ్మ మాలతీ భారతీ
మీ కనుసైగతోనే కబుర్లు , కధలూ, కావ్యాలూ
తెగులు తొలగి తెలుగు (వెండి) తెర
మనసలరించగ మొక్కి వేడుదు.

6. కృష్ణ వాసంతిక
తెలుగు తెగులోచ్చినట్ల్లాయే ననుచు కుములు,
మాలతమ్మని చూచి కడు సంతసించి
తెలుగు భాషకు ఇక లోటు రాదు అనుచు,
సంతసించెను భారతి కడు ప్రేమ తోడ.

000
(గమనిక: మరి కొన్ని కవితలు రేపు.)

వెనకటి టపా లింకు ఇక్కడ

(ఏప్రిల్ 26, 2016)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

4 thoughts on “అంతర్జాలంలో తెలుగు భాషాభివృద్ధి – 2 (వివరణ, కవితలు)”

  1. ఏవరూ సీరియస్‌గా తీసుకోవడం లేదు అనేందుకు ఎవరూ పట్టించుకోవడం లేదు అనవచ్చేమోనండీ. సీరియస్‌కి ఇతరత్రా సందర్భాల్లో గంభీరం లాంటి పదాలు (రాతలో) వాడుకలో ఉన్నాయి.

    మెచ్చుకోండి

నాటపా మీకు నచ్చిందో లేదో చెప్తే చాలు. బాగులేకపోతే ఎందుకు లేదో చెప్పినా సంతోషమే.

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s