అంతర్జాలంలో భాషాభివృద్ధి 3 – పద్యం, గద్యం

మిత్రుల మిగతా రచనలు ఇదుగో చదివి మీ అభిప్రాయాలు రాయగలరు. ధన్యవాదాలు.

7. వసంత లక్ష్మి
మాట మాతృభాష అట
రాత నేర్చిన మరొక
దేశ భాషట ..
అక్కటా ! ఈ తెలుగు వారి
టెంపరితనం చూడండి !

ఐటీ అట అంతా మన వారి
ప్రతిభే నట ..
ఏ కాలమున కైనా ,
ఏ దేశ కార్యం అయినా
మన టెల్గు వారి ఐ టీ మాటే
చెల్లునట ..అక్కటా !

అరబ్బు కైనా
అమర్చి పెట్టును
కుడి నుండి ఎడమకు
లిపి అన్ని వాడుక పరికరములందు
మన తెలుగు వారే ..
అక్కటా , నీ భాష ఏదయా !
అనగా , నిర్లిప్త ,విషాద మోము
ధరింతురు ..అక్కటా !

తెలుగు భాష ఎంత సుందరం
ఎంత మధురం ,ఆభై ఆరు విడి విడి
అక్షరాలతో విన సొంపుగా ,
కంటి కింపుగా
ఇటాలియన్‌ ఆఫ్ ది ఈస్ట్ అని
కొనియాడబడుతూ , ఎన్నాళ్ళు
ఎన్నేళ్ళు మనియింది !

ఇరవై ఆరు విదేశీ అక్షరాలలోకి
చీర కట్టిన విదేశీ వనిత
అవస్థలు పడుతున్నట్టూ
తడబడు అడుగులతో
టింగ్లీష్ పదాలతో తెలుగు
కృత్రిమ అందాలతో ..అక్కటా !

మన తెలుగు ,మన భాష ..
మన లిపి , మన పాటలూ
మన కథలూ ,మన రచనలూ
అన్నీ మన లిపిలో ..ఇంక తప్పదు
ఈ మార్గం , ఈ మార్గం తప్పదు ఇంక ..

ఏ పరికరం అయినా
తెలుగు లిపి పూరించుకుని
శంఖం పూరించండి ..
ఇక పై మా భాష తెలుగు భాష
అమ్మ భాష ..మాతృ భాష అంటూ
తెలుగు అక్కటా ! ఇక్కటా కాదు ..
మన అందరి భాష ..
మనం అందరం మాట్లాడే భాష లోనే
రాసుకుందాం , మాటలు పంచుకుందాం .

తెలుగు వెలుగులు
చిమ్మి ..ఈ అజ్ఞానం అంధకారాలు
తొలిగి పోవాలని
కంకణం కట్టుకుందాం
మాలతి గారి మాట
మా మాటా ..మా బాట ..అని
ఎలుగెత్తి చాటుదాం

8. కృష్ణవేణి చారి
ఈ మధ్య నేను ఆన్లైన్లో చూస్తున్న తెలుగు సినిమాలు చూస్తే అసలర్థం అవడం లేదు నిజంగా అది తెలుగు భాషా లేక వాడుక భాషని కలగాపులగం చేసి, హాస్యం కోసం అసభ్యంగా మార్చినదా అని.
“కేక, కెవ్వు, నువ్వు పులిహార”- ఇలాంటి నుడికారాలని వింటుంటే. ఇలాంటి వింత వింత ప్రయోగాలవల్ల నాకొచ్చిన పాత కాలపు తెలుగు కాస్తా ఈ ఆధునికతని సంతరించుకుని మరీ సంకరమైపోతుందేమో అన్న భయంతో అలాంటి సినిమాలు చూడటం మానేశాను.

విశ్వనాధ సత్యనారాయణలూ, రాచకొండ విశ్వనాథ శాస్త్రులూ, మీరు ఈ భాష వినలేదు. అదృష్టవంతులు. ధన్యులు. నేనూ మీకాలంలో పుట్టి ఉండవలిసినది. ప్చ్.
భారతమ్మ బిడ్డలను జూచి మాలతమ్మ దుఃఖించె.

000
ఈ వ్యాసాల, కవితలమీద వస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే నాకు మరింత నీరసం వస్తోంది. కానీ ఊరట కలిగించేవిగా లేవు.
దయ చేసి, మీరు గానీ మీకు తెలిసినవారు కానీ ఈ పరిస్థితి మార్చడానికి ఏం చేస్తున్నారో తెలియజేయగలరు. ధన్యవాదాలు.

ఈ టపాకి సంబంధించిన మొదటి టపా ఇక్కడ
రెండో టపా ఇక్కడ
000
(ఏప్రిల్ 27, 2016)

గ్రంధకర్త మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

9 thoughts on “అంతర్జాలంలో భాషాభివృద్ధి 3 – పద్యం, గద్యం”

 1. ఈ వ్యాఖ్యలు చూస్తుంటే మరింత నీరసం వస్తోంది కానీ ఊరట కలిగించేవిగా లేవు. దయ చేసి, మీరు గానీ మీకు తెలిసినవారు కానీ ఈ పరిస్థితి మార్చడానికి ఏం చేస్తున్నారో తెలియజేయగలరు. ధన్యవాదాలు.

  ఇష్టం

 2. అలాగేనండి.
  మీరన్నట్లు ఎక్కువ ఉదాహరణలు అక్కర్లేదు. నేను అన్ని ఉదాహరణలు ఇచ్చిన కారణం తెలుగుభాష ఎంతగా భ్రష్టు పట్టిపోయిందో అని మరోసారి తలుచుకుని విచారించడానికే (నేను ముఖపుస్తకం వగైరాల్లో లేనులెండి).
  మీరు చేస్తున్న ప్రయత్నం వృధా ప్రయాస అనుకోకండి. మీరు చేస్తున్నది విశిష్టమైన కృషి. కాస్తయినా జనాల్లో ఆలోచన కలిగించినా చాలు.

  ఇష్టం

 3. కొన్ని వాక్యాలు ఏ భాష అని చెప్పాలో కూడా సాధ్యం కానివి కాలమహిమతో నిత్యం వినిపిస్తున్నాయి:
  ౧. మార్కెట్ బందు ఉంది.
  ౨. ఈ జంగిల్లో టైగర్స్ లేవు
  ౩. మస్త్ ఫీచర్స్ ఉన్నాయి.

  చాలా దశాబ్దాల క్రిందట నేను హైదరాబాదు వచ్చిన క్రొత్తలో ౭౦ల్లో జరిగిన ముచ్చట ఒకటి. నరసింహం అని నా స్నేహితుడు అమలాపురం అబ్బాయి ‘పెరుగు’ అని చెబితే కాంటీనులో అబ్బాయికి అర్థం‌కాలేదు. వేలు పెట్టి చూపితే అతడన్న మాట ‘పెరుగంట వేంది తెలుగులో దై అనలేవా’ అని!

  ఇష్టం

 4. మీరు తెంగ్లిష్ అన్ని ఉదాహరణలు ఇవ్వఖ్ఖర్లేదండి. అనుదినమూ ఆ భాష ముఖపుస్తకంలో చూసి చూసి తల వాచిపోతోంది. అందుకే మొదలు పెట్టేను ఈ ప్రయత్నం. ముఖపుస్తకంలో కనీసం నా పేజీలో ఆ చెత్త భాష రాయవద్దని కఠిన నియమం. మీరు కూడా సుమన్ లతగారిలా మరిన్ని తెలుగు మాటలు రాస్తూండండి. ధన్యవాదాలతో

  ఇష్టం

 5. “తలగడ” (డాక్టర్ సుమన్ లత గారు) – ఆహా ఎంత కాలమయింది ఈ మాట విని!

  ప్రస్తుత భాషలో చాలా ఆణిముత్యాలున్నాయండీ. మచ్చుకి కొన్ని ఇక్కడ చెబుతాను, “ఓకేనాండి?”🙂

  “ఫుడ్ తిన్నావా?”, “టూ అవర్స్ వాటర్‌లో సోక్ చెయ్యాలి”, “డౌ (dough) కి వాటర్ ఏడ్ చేసి మిక్స్ చెయ్యాలి”, “పాన్‌లో ఆయిల్ వేసి హీట్ చెయ్యాలి”, “ఈవెనింగ్ కాల్చెయ్”, “రేపు నాకు మారేజ్‌లుక్స్” (పెళ్ళిచూపులన్నమాట), “నీ ఫేసులో టెన్షన్ కనిపిస్తోంది”, రేప్పొద్దున్న పదకొండు గంటలకి రా అని చెబితే “పదకొండు అంటే లెవెనాండి?” అనే ప్రశ్నలు – ఇలాంటి ఆణిముత్యాలు మా అదృష్టం కొద్దీ మాదేశంలో మాకు రోజూ వినిపిస్తుంటాయి.

  సినిమాల్లో “వెరైటీ”గా (వాళ్ళ పరిభాషలో చెప్పాలంటే) ఉండాలని రాయడం మొదలెట్టిన తెంగ్లిష్ సంభాషణలు, సినిమా వాళ్ళని అనుకరించడమే జీవితాశయం అనుకున్నట్లుండే టీవీ ఛానెళ్ళ ఏంకర్లు, ఏంకరిణులు, టీవీ కార్యక్రమాలు, వీళ్ళందరి ప్రభావంలో పడిపోయిన సామాన్య ప్రజలు – వెరసి భాషని ఈ స్ధితికి తీసుకొచ్చారు. దానికితోడు తెలుగుభాషకి ప్రాధాన్యత తగ్గిపోయిన స్కూలు చదువులు (తెలుగులో మాట్లాడితే పిల్లల్ని దండించే స్కూళ్ళు కూడా ఉన్నాయని వార్తల్లో వింటుంటాం). బాగా ముదిరిపోయిన జబ్బు ఇది. భవిష్యత్తులో నయమవుతుందనే ఆశ కూడా లేదు నా మట్టుకు.

  ఈ భ్రష్టుత్వం బాగా ఎక్కువయిపోయిందని, పర్యవసానంగా కొంతకాలానికి తెలుగుభాష ఓ రకమయిన pidgin లా తయారవుతుందనీ నాకు అనిపిస్తుంది.

  ఇష్టం

 6. డా. సుమన్ లతగారూ, చాలా బాగా చెప్పేరు. కొంతకాలం క్రితం బాగా ప్రాచుర్యం పొందిన కథ చెప్పులు కుట్టేవాడిగురించి. కథలో రచయిత చెప్పులు కుట్టేవాడు అంటే tanner అని అర్థం ఇచ్చేరు. అది చూసి నాకు మతి పోయింది.
  ఒక తరం పొతే ఒక భాష కూడా కొంత కుంటు పడుతూ ఉంటుంది అని – అన్న మీవాక్యం అక్షరసత్యం. నిజానికి అలా నిలుపులేకపోతున్నది మనమే అంటే మరింత బాధ.
  ధన్యవాదాలు.

  ఇష్టం

 7. మాలతి గారూ,మీ వ్యాసం ,దానిపైన వ్యాఖ్యలు ,గద్యాలు ,పద్యాలు చదివేను .అందరి బాధా సామూహికంగా పంచుకుంటూ ,ఒకేలా ఆలోచిస్తున్నామా అనుకుంటున్నాను (.అదీ ఒక తరం వారిమేమో )
  అట్టు , పులుసు ,తువ్వాలు ,మేజోళ్ళు ,తలగడ /దిండు ,గావంచా లాటి ,(కొన్ని హిందీ పదాలయినా) ఇళ్ళలో కొద్ది ఏళ్ల క్రితం వరకు విరివిగా ఉపయోగించే ఈ పదాలు ప్రయోగించిన ప్రతిసారీ నేను అర్థం చెప్పవలసి వస్తోంది .(ఇంగ్లీష్ లో ).
  నేను ఎప్పుడూ నా విద్యార్థులకి ఒక్కటే చెప్తాను —–ఒక తరం పొతే ఒక భాష కూడా కొంత కుంటు పడుతూ ఉంటుంది అని
  .తమాషాగా చిప్సులు ,జెమ్స్లులు ,సాక్సులు లాటి ప్రయోగాలే విన వలసి వస్తోంది . మీరు చెప్పినట్లు మన భాష లో కావాల్సిన పదాలున్నా ఎందుకో ఈ వ్యామోహం ? — సుమన్ లత

  ఇష్టం

 8. వసంత లక్ష్మి గారూ, కృష్ణవేణి గారు ఇరువురు రమ్యంగా వ్రాసారు . మీ ప్రయత్నం సఫలం అవుతుంది మాలతీ గారూ ! మువ్వురుకీ అభినందనలు.

  Liked by 1 వ్యక్తి

టపాలో చర్చించిన అంశంమీద వ్యాఖ్యానాలు తెలుగులో రాసిన వ్యాఖ్యలు మాత్రమే అంగీకరింపబడతాయి. తెంగ్లీషులో రాసిన వ్యాఖ్యలు కూడా నాకు సమ్మతం కాదు. కోరుతున్నాను

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s