కథల్లో కబుర్లలో అలంకారవిశేషాలు

అలంకారాలమాట వస్తే ఉపమా కాళిదాసస్య అని గబుక్కున వచ్చేస్తుంది కానీ నేనిక్కడ మరీ అంత లోతుగా చర్చించబోవడం లేదు. కథల్లో, నిత్యవ్యవహారంలో కనిపించే అలంకారాలవిషయంలో

నా ఆలోచనలు పంచుకోడం మాత్రమే చేయబోతున్నాను. ఆడపిల్లకి బొట్టూ కాటుకా నగలూ నట్రాలాగే ఈ అలంకారాలూ అన్నది అందరికీ తెలిసినదే.

పది రోజులక్రితం చలమచర్ల రంగాచార్యులుగారి అలంకారవసంతం కనిపించింది. తేలికపదాలలో, తేలిగ్గా అర్థమయే పద్యాలు రాసి 98 అలంకారాలను వివరించేరు. తేలిక అంటే మరీ అంత తేలిక కాదు. నాకు కొన్నిచోట్ల అర్థం కాలేదు. ఈ వ్యాసం చివర రంగాచార్యులుగారి పుస్తకం పిడియఫ్ లింకు ఇచ్చేను.

ఈ చిన్ని పుస్తకం అవతారికలో రచయిత ఆసక్తికరమైన అనేక సంగతులు – కావ్యము, కావ్యహేతువు, కావ్యస్వరూపము వంటివి – చక్కగా వివరించారు. మూడు వేల ఏళ్ళకి పూర్వమే భరతముని అలంకారాలు నాలుగు అన్నారు కానీ తరవాతికాలంలో దండి 34కి, మమ్మటుడు 58కి, 17వ శతాబ్దంనాటికి అప్పయ్యదీక్షితులు 115కి పెంచేరుట.

ఇది చూసేక ఆ పెంపకం ఎలా జరిగిందీ, ఏమేమి చేరిస్తే అన్ని అయేయి అని నాకు కుతూహలం కలిగింది. రంగాచార్యులుగారే నిరోష్ట్యము అన్న అలంకారందగ్గర చేసిన వ్యాఖ్యానం గమనింపదగ్గది. నిరోష్ఠ్యములో ప, బ లాటి ఓష్ఠ్యములు లేకుండా రాసినట్టే గుడులు, తలకట్లు లేకుండా కూడా పద్యాలు రాస్తారు కానీ అవన్నీ “రస భావాది విశేషములు లేకపోవుటచే ప్రతిభావంతులగు కవులు ఈ గడ్డిపూలకై ఎక్కువ ప్రాకులాడరు,” అని వచించేరు. నిజానికి 115 విధాలుగా గుర్తించడానికి కూడా ఇలాటి తేడాలే కారణమేమో. ఇది ఒక రకమైన సాహిత్య కుస్తీపట్లు అనిపించింది వారి వ్యాఖ్య చూసేక. అందులో శ్రమ ఉండవచ్చు కానీ అవి చదువుతున్నప్పుడు ఆ కొత్తదనం అట్టే సేపు నిలవకపోవచ్చు పాఠకులకి.

ఉపమ ఒక్కటే అలంకారం, మిగతావన్నీ ఉపమకి వివిధ రూపాలు అని అప్పయ్యదీక్షితులు వ్యాఖ్య. ఏ అలంకారమైనా ప్రధానంగా ఎత్తి చూపేది పోలికలే ఒకే రకంగా కానీ వైరుధ్యం చూపుతూ కానీ. చెప్పదలుచుకున్నది మరింత ప్రగాఢంగా వినేవారి మనసులో ముద్ర వేయడానికో, అర్థం వివరించడానికో అలంకారాలు జోడిస్తారు కదా. వీటిలో రచయిత ప్రతిభనిబట్టి అలంకారం మరింత విశేషంగా ఆవిష్కృతమవుతుంది.

నిత్యజీవితంలో మాటలసందర్భంలో ఈ అలంకారాలు సర్వసాధారణం. ఉదాహరణకి, “నిన్ను చూస్తే గుండె చెరువైపోతోంది” అంటే నిజంగా చెరువు అయిపోయిందని కాదు కదా. చెరువులో నీళ్ళని తలపింపజేయడంద్వారా ఆ మనిషి క్షోభ పరిమాణం తెలియజేయడం మాత్రమే. “ఇదేం కూర? పచ్చగడ్డిలా ఉంది,” అన్నా “అబ్భ ఆ పలువరస ముత్యాలకోవే,” అన్నా అలంకారాలే. ఎవరినైనా అందంగా ఉంది అని చెప్పడానికి మాఅమ్మ “తలంటిస్నానంకోసం నగలు తీసినట్టు ఎంతో కళగా ఉంది” అనేది. నగలు లేకపోయినా అందంగా ఉంది అన్న అర్థంలో. ఈమధ్య అమెరికాలో ఎన్నికలరభస చూస్తుంటే capitalistదేశంలో ప్రజాస్వామ్యం విరోధాభాసాలంకారం (oxymoron) అనిపిస్తోంది నాకు!

ఇటీవల కథలమీద కవితలమీద వస్తున్న వ్యాఖ్యలు, స్పందనలలో వైవిధ్యం నాకు చెప్పలేనంత ఆశ్చర్యంగా ఉంటున్నాయి. నాచిన్నతనంలో కథలు చదివినప్పుడు రచయిత అభిప్రాయం ఏమయిఉంటుందో చూసేవాళ్లం. ఇప్పుడు రచయితకి “నేను ఏం చెప్పగలనా?” అని చూస్తున్నాడు పాఠకుడు, ఆ రచనలో తాను గ్రహించగల విషయాలకంటే రచయితకి ఏదో ఒకటి చెప్పడమే ప్రధానమయినట్టు. ఇది ఒక స్ఫూర్తితో అర్థవంతంగా చేస్తే తప్పకుండా ఆదరణీయమే. కానీ “చెప్పడమే” ప్రధానం అయితే మాత్రం ఇబ్బంది. ప్రతి పాఠకుడు తప్పనిసరిగా కథకి కానీ కవితకి కానీ మెరుగులు దిద్దాలని నియమమేమీ లేదు. అసలు ఎవరైనా కథ చదివేక ఎంతసేపు ఆలోచిస్తున్నారు వ్యాఖ్య రాసేముందు అని కూడా నాకు ఒకొకప్పుడు సందేహం కలుగుతోంది. ఒక ఉదాహరణ చెప్తాను.

సైకియాట్రిస్టులు రోగిని పరీక్ష చేస్తున్నప్పుడు అవలింబించే ఒక పద్ధతి – ఏదో ఒక బొమ్మ చూపించి ఆ బొమ్మ చూడగానే ఏ వస్తువు గుర్తొచ్చిందో చెప్పమని అడుగుతారు. ఏ ఇద్దరికీ ఒకే వస్తువు తోచదు. అలంకారాలగురించి ముఖ్యంగా ఉపమానాలగురించి ఆలోచిస్తుంటే ఈ పద్ధతి జ్ఞాపకం వచ్చింది.

ఆ మధ్య ప్రసంగవశాత్తు నేనొక రుబాయత్ లో ఒక పాదం ఉదహరించేను “కన్నె ఎవరొ చనిపోయి మన్ను కాగ పూచినది సుమ్ము ఈ మల్లెపూవు సొగసు” అని. దానిమీద చిన్న చర్చ జరిగింది. ఒకరిద్దరు “కన్నె చనిపోవడం” మీద దృష్టి కేంద్రీకరించి వ్యాఖ్యానించేరు. దాంతో నాకు అసలు మూలంలో ఏముందో తెలుసుకోవాలనిపించి వెతికితే ఇతర అనువాదాలు కనిపించేయి ఇంగ్లీషులనూ తెలుగులోనూ కూడా. ఒకొక అనువాదం ఒకొక రకంగా ఉంది.

I sometimes think that never blows so red
The Rose as where some buried Caesar bled;
That every Hyacinth the Garden wears
Dropt in its Lap from some once lovely Head.
కడు నరుణమ్ముగా నెచట కన్నెగులాబి హసించు నచ్చటన్‌
పడదగు మున్ను ‘సీజరు’ నృపాలుని రక్త మటంచు నెంతు, ఎ
క్కడ వికసించు దాసనలు గంపలు గంపలుగా వనాల న
క్కడ నొక అప్సరస్సఖి నిగారపువీడెము రాలియుండెడిన్‌. 18
(సి. ఆర్. రెడ్డి అనువాదం, ఇంగ్లీషు మూలం.)

రాజ విభవాల సీజరు రక్తమెచట
మట్టిలోపల కలిసెనొ అట్టి చోట
పూచిన గులాబిపూవుల పూత ఎరుపు
ఏ గులాబిలకును కాన మీ జగాన
కన్నె ఎవ్వరో చనిపోయి మన్నుకాగ
పూచినదిసుమ్ము ఆ మల్లెపూవు సొగసు.
(ముద్దుకృష్ణ అనువాదం.)

జలజల మంజులార్భటుల జాల్కొను నీ సెలయేటికోవల\న్‌
మొలచిన లేతపచ్చికల మోటుగఁ గాలిడఁబోకు, దేవదూ
తల రుచిరాధర ప్రకృతిఁ దాల్చెనొ! సుందర మందగామినీ
లలిత శరీరమృత్కణములం జిగిరించెనొ యేమొ కోమలీ! (దువ్వూరి రామిరెడ్డి అనువాదం. పానశాల)

చూసేరా, ఒకొకరు ఒకొకలా అనువదించేరు. మూల పర్ష్యన్ భాషలో ఏ పదం ఉందో, ఈ రచయితలు పర్ష్యన్ నించి అనువదించేరో, మరో భాషలోనించి అనువదించేరో నాకు తెలీదు. అంటే నేను ఇక్కడ చెప్పడానికి ప్రయత్నిస్తున్నది పద్యంలో భావం ప్రధానం. ఉపమానం ఆ భావంవరకే తీసుకోవాలి. మంచి యౌవనంలో ఉన్న యువతి మనోహరంగా ఉంటుంది. పూవుని చూస్తుంటే కవికి అదేవిధమైన ఆహ్లాదం కలిగింది. ఒక అందమైన అమ్మాయి ఈ పూవయి మళ్ళీ జన్మించిందేమో అనిపించేవరకే ఆ పోలిక. అక్కడ ప్రధాన్యం యువతి అందానికే గానీ ఆమె జీవితం ఎలా ముగిసిందన్న ఆలోచనకి కాదు. ఉమర్ ఖయ్యాం తాత్వికచింతన స్థూలంగా చూసినా అదే అభిప్రాయం కలుగుతుంది.

ఏ ఉదాహరణ తీసుకున్నా మనంం గమనించవలసిన విషయం ఇది. చంద్రవదన అంటే చంద్రుని చూసినప్పుడు మనసు ఎంతగా పొంగిపోతుందో ఆ అమ్మాయి మొహం చూసినప్పుడు కూడా అలాటి ఆహ్లాదమే కలుగుతుందనే కానీ చంద్రుడికి మచ్చ ఉంది కనక అమ్మాయిమొహంలో మచ్చ ఉంది అనం. పున్నమినాటి చంద్రుడా, పాడ్యమినాటి చంద్రుడా అని అడగం. తాట వొలిచేస్తాడు అంటే నిజంగా అరటిపండు వొలిచినట్టు చర్మం ఒలిచేస్తాడు అని కాదు కదా. రెండు వస్తువులను పోల్చినప్పుడు ఆ సందర్భంలో రచయిత తాను చెప్పదలుచుకున్న భావానికి అనుగుణమైన, ఉభయసామాన్యమైన ఒక గుణం మాత్రమే తీసుకోడం జరుగుతుంది. రచయిత ఏ గుణాన్ని ఏమి చెప్పడానికి ఎంచుకున్నాడు అన్నది పాఠకుడు గమనించాలి.

ఇది ఇంత సుదీర్ఘంగా రాయడానికి కారణం – ఈమధ్య కవితలమీదా కథలమీదా కూడా పాఠకులవ్యాఖ్యలధోరణులు విపరీతంగా, ఒకొకప్పుడు అర్థం కాకుండా ఉండడం. వ్యాఖ్యానించేవారు వ్యాఖ్యానించేముందు ఆలోచించుకోవాల్సిన విషయం ఇది. నేను ఉపమానాలవిషయమే చెప్పిన ఇతర అంశాలకి కూడా వర్తిస్తుంది.
000
చలమచర్ల రంగాచార్యులుగారి అలంకారవసంతము
(మే 8, 2016)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s