మనలో మనమాట 14 – కార్యమునంటి కారణముండవచ్చు ….ముండకపోవచ్చు!

కార్యకారణన్యాయము అని ఒక న్యాయం ఉంది. ఏ కార్యానికైనా వెనక కారణం ఒకటుంటుంది వివరిస్తూ. కాకతాళీయం అంటే కొబ్బరిమట్టమీద కాకి వాలితే, కాయ రాలిపడింది అని.

ఇక్కడ కారణకార్యన్యాయం లేదని నొక్కి వక్కాణిస్తున్నారు. కాకి వాలకపోయినా పండు రాలిపడేది అన్న అర్థంలో వాడతాం ఆ సామెత. ఆమాట అలా ఉంచుదాం ప్రస్తుతానికి. ధైర్యమువలనను సాహసమువలనను లక్ష్మి చేకూరును అని మరో సుభాషితం. కానీ తన్మూలంగా వచ్చే పరిణామం మరొకటి దాన్ని వెన్నంటి ఉండగలదు. సాధారణంగా ఆ మాట చెప్పరు.

నేను అమెరికా రాకముందు, వస్తాననని కలలో కూడా అనుకోకముందు, ఓ ఆచార్యులవారు అమెరికనువ్యవస్థని ఎంతో మెచ్చుకుంటూ ఓ చిన్నకథ చెప్పేరు. వారి ఆఫీసులో ఓ గుమాస్తా స్థాయి ఉద్యోగికి (ఇక్కడ administrative asssitant లాటి శ్రవణానందకరమైన పేర్లు పెడతారు చిన్నా పొన్నా ఉద్యోగాలకి కూడా) మేనేజరుధోరణి నచ్చలేదు.
సాటివారితో చెప్తే, చాలామంది విని ఊరుకున్నారు. కొందరు నిజమే బాగులేదంటూ తలలూపేరు. “ఆయనతోనే చెప్పేస్తాను, నాకేం భయం,” అన్నాడు గుమాస్తా. “చెప్పొచ్చు,” అన్నారు వారు సందిగ్ధంగా.

మర్నాడు ఆ గుమాస్తా నేరుగా మేనేజరుదగ్గరికి వెళ్ళి, “నువ్వు నాకు చెప్తున్న పనులు న్యాయం కాదు. నేను చెయ్యను,” అని చెప్పేసేడు.

“అదే మనదేశంలో అయితే అయ్యగారు ఏ పని చెప్పినా చేసేసి, వెనక సణుక్కుంటాడు కానీ ఆయనమొహమ్మీద చెప్పగలడా?” ఆచార్యులవారు నాతో ఎంతో గొప్పగా. అప్పట్లో నేను కూడా ఆహా, ఓహో, అవును సుమా అనే అనుకున్నాను.

అమెరికా వచ్చేక తెలిసింది. అలా చెప్పడానికి గుమాస్తాలకి స్వేచ్ఛ ఉంది. అలాగే వారి యజమానులకి కూడా స్నేచ్ఛలున్నాయి. పైన చెప్పినట్టు గుమాస్తాగారు ఎంతో దైర్యంగా తనమనసులో ఉన్న విషయం వెల్లడించేసేక, ఆ యజమానిగారు ఆ గుమాస్తా చిత్తశుద్ధిని ఎంతో మెచ్చుకుని, “బాగుంది. నువ్వు చెప్పింది నిజమే. చాలా బాగుంది. నువ్వు ఎంతో చిత్తశుద్ధితో నీమనసులో మాట నేరుగా నాతోనే చెప్పినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఏ పనికైనా చిత్తశుద్ధి ముఖ్యం. నీచిత్తశుద్ధిని మెచ్చుకుంటూ నీకు మంచి కితాబు కూడా రాసి ఇస్తాను. నువ్వు రేపట్నుండీ పనిలోకి రానఖ్ఖర్లేదు. నీ ఉద్యోగం ఈరోజుతో సరి,” అని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే చేస్తాడు కూడాను.

ఏ పని చెయ్యడానికైనా నీకు స్వేచ్ఛ ఉంది. ఆ వెనక రాగల ఫలితాలకి కూడా ఒడి పట్టి సిద్ధంగా ఉండడం కూడా స్వేచ్ఛ అనుకో, హక్కు అనుకో, ధర్మం అనుకో, కర్మ అనుకో అది కూడా ఉంటుంది. నిప్పు పట్టుకుంటే చెయ్యి కాలినట్టే. నిప్పు పట్టుకోడం నువ్వు సంపూర్ణమైన అవగాహనతో అంటే ఒంటిమీద తెలివి ఉంచుకుని చేసిన పని. ఫలితం మాత్రం “అబ్బే నేనిది కోరుకోలేదు,” అంటే చెల్లదు. అలాగే మాటాడ్డమూను. నరం లేని నాలుక ఎటు తిరిగితే అటు తిరగనిచ్చి మాటలు తూటాల్లా వాడేసేయడం నీ అధీనంలోనే ఉంటుంది కానీ పరిణామం మాత్రం నీ చేతిలో ఉండదు. అది అనుభవించక తప్పదు. దానికి కూడా సిద్ధపడితే నీఇష్టం వచ్చినట్టు వాగొచ్చు.

ఈమధ్య ప్రతివారూ హక్కులగురించి మాటాడ్డం ఎక్కువయిపోయింది. హక్కులంటే ఉన్న హుషారు కర్తవ్యం అంటే ఉండకపోవడమే నాకు ఆశ్చర్యం కలిగించే విషయం. మన ఇళ్ళల్లో తరుచూ వినిపించే పదం ధర్మం. వ్యక్తిధర్మం, స్వామి (కుటుంబయజమాని) ధర్మం, సాంఘికధర్మం, … ఇలా మనకి దర్మం పేరున చెల్లుతున్నవి అనేకం ఉన్నాయి. అసలు మనలో హక్కులకంటే ధర్మానికే ప్రాధాన్యం ఎక్కువ. ఆమాటకొస్తే హక్కులూ స్వేచ్ఛలూ బొమ్మా బొరుసూ అనుకుంటాను.

అమెరికాలో రిపబ్లికనుల మూలసూత్రం “నీకు ఏం కావాలన్నా అది సంపాదించుకోడానికి పాటు పడాలి” అని. అది మంచి సూత్రమే. అయితే ఏమి సంపాదించడానికి ఎలాటి “పాటు” పడుతున్నారు అని ప్రశ్నించుకుంటే, జరుగుతున్నది చూస్తుంటే చాలా బాధగా కాకపోతే అయోమయంగా ఉంటుంది. ఒళ్ళొంచి పని చేసేవాళ్ళకి దొరికేసొమ్ముకి ముప్ఫై రెట్లు ఉంటోంది తెలివితేటలుపయోగించి వారిచేత పని చేయించుకునేవారికి. ఒకసారి మా పెద్దన్నయ్య అన్నాడు, “కష్టపడి పని చేయడం కాదు, తెలివిగా పని చేయడం తెలియాలి,” అని. అంటే కాయకష్టం కాదు, “తలకాయకష్టం” అని. అంటే ఇతరుల కాయములతో నీ తలకాయ ఉపయోగించి చాకిరీ చేయించుకోడమే అని తరవాత తెలిసింది నాకు. అది “పాటు పడి” సంపాదించుకోడం కాదు. ప్రస్తుతం రిపబ్లికను అభ్యర్థిలా వాక్కుతో పాటు పడడం మాత్రమే. చాకిరొకరిదీ, సౌఖ్యమొకరిదీ అని ఏదో సినిమాలో ఎవరో రచయిత చెప్పినట్టు.

కాయకష్టం ఘనత పాశ్చాత్యదేశాలు మాత్రమే గుర్తించేరనుకోడం భ్రమ. ఇలా మాటాడుతుంటే నాకు అసందర్భంగానే చిన్నప్పుడు చదివిన కథ ఒకటి జ్ఞాపకం వస్తోంది. ఒక స్వామివారు ఊరిశివార్ల ఒక ఎత్తైన పీఠంమీద నిలబడి తలతో పని చేయడంలో గల ఔన్నత్యంగురించి గంటలతరబడి ఉపన్యాసం ఇస్తున్నాడుట. పాపం ఆయన ఉపదేశిస్తున్న సువాక్కులు అర్థం కాక ఈయన ఎప్పుడు అసలువిషయానికి వస్తాడా అని ఎదురు చూస్తున్నారు అమాయకంగా శ్రోతలు. అలా కొన్ని గంటలో రోజులో అయేక ఆయన శోషొచ్చి తలా కాళ్ళూ లుమ్మలు చుట్టుకు పోతూ మెట్లమీంచి దొర్లుకుంటూ కిందకి పడిపోయేడు. ఏం జరిగిందో అర్థం కాని ప్రేక్షకులు ఓహో తలతో పని అంటే ఇదే కాబోలు అనుకున్నారుట.

వాక్యాతుర్యంతో ఎదటివారిని బుట్టలో పడేసి సొమ్ము చేసుకోడానికున్న విలువ కాయకష్టం కంటె అధికతరంగా చెల్లుతోందిప్పుడు. ఇలా ఆలోచిస్తే కారణకార్యన్యాయం సరిగా పని చేయడం లేదని అనిపిస్తోంది నాకు. ఎందుకంటే ఒకడు గొప్పవాడు కావడానికి వేరేవాడు పని చే్యడం జరుగుతోంది.

ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే హక్కులు హక్కులంటూ చేస్తున్న ఆర్భాటం కూడా నిజంగా హక్కులకోసమూ కాదు. ఆ హక్కులవల్ల చెప్పలేనంత సుఖశాంతులో వ్యక్తిగౌరవమో వచ్చేస్తాయనో కాదు. ప్రస్తుతం జరుగుతున్నది ఆ పేరు పెట్టి కొందరు పబ్బం గడుపుకోడంకోసమే. ఇక్కడ కార్యకారణసంబంధం ఏమిటంటే కారణం ఒకడూ కార్యం ఒకడూ అనుకోవాలేమో మరి.
సూక్ష్మంగా నామాట – స్వేచ్ఛ చాలు బాధ్యతలమాటెత్తకు అనడం అన్యాయం. అమెరికాలో కోర్టులలో జరుగుతున్న మరో వితండవాదన కూడా నాకు అర్థం కాదు.

ఒకడు ఏమీ తోచడం లేదనో మరేదో అలాటి కారణంతోనో మరొకడిని కాల్చి చంపేస్తాడు. అలా చంపడం నేరం కనక అతడికి పౌరహక్కులు కూడా వెంటనే రద్దు అయిపోతాయనే నా నమ్మకం. చట్టాన్ని వ్యతిరేకించేవారికి ఆ చట్టం రక్షణ ఇవ్వడం అర్థరహితం. కానీ ఇక్కడ నేరస్థులతరఫున న్యాయవాదులు అలాటి కుంటిసాకు ఏదో చెప్పి వాళ్ళని విడుదల చేయించేస్తున్నారు. ఇది కూడా కార్యకారణన్యాయాన్ని సమర్థంచేదిగా లేదు.
000

(మే 13, 2016)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s