మనలో మనమాట 15 – తాళాలు దొరికేయి

అవును, ముందు పోతేనే తరవాత దొరకడం. రెండు వారాలక్రితం పోయేయి కానీ పోయేయని మొదలు పెడితే, అయ్యో పోయేయా, ఎక్కడ పోయేయి, ఎలా పోయేయి, అవే పోయేయా, నువ్వు పారేసుకున్నావా …

అంటూ నువ్వు గాభరా పడిపోతూ నన్ను కొరుక్కు తినేస్తావేమోనని మొదటే సుఖాంతమేలే అని నీ మనశ్శాంతికోసం అలా మొదలు పెట్టేను. సరే, ఇప్పుడు ఎలా పోయేయో చెప్తాను. అసలు అవి పోయినప్పుడు చాలా డీలా పడిపోయేను. ఎందుకంటే అంతకుముందు జరిగిన మరోసంఘటన చెప్పాలి.

అది చెప్పేముందు ఇదంతా రాయాలని ఎందుకనిపించిందో చెప్తాను. ఇందాకా కూరా నారా కొనుక్కుని చెకౌట్ చేసుకుంటుంటే, నా పక్కనుంచి పోతూన్న అమ్మాయి చటుక్కున ఆగి, నీతాళాలు పారేసుకున్నావు అంటూ వంగి నాకాళ్ళదగ్గరున్న తాళాలు నాచేతిలో పెట్టి వెళ్ళి పోయింది. నేను ఉలిక్కిపడి, మళ్ళీనా అంటూ తాళాలు అందుకుని, అవి నావి కావని గ్రహించి, హలో అని ఆ అమ్మాయిని పిలిచేను కానీ అప్పటికే ఆవిడ చాలా దూరం వెళ్ళిపోయింది. హుమ్, నా నిజతాళాలు పోయినప్పుడు ఇలా ఎందుకు జరిగి ఉండకూడదూ అని విచారిస్తూ అక్కడున్న డెస్క్ క్లర్కుకి ఆ తాళాలిచ్చేసి బయట పడ్డాను. అప్పుడన్నమాట ఇదంతా రాసుకోవాలనిపించింది నాకు.

తాళాలెలా పోయేయో చెప్తాను. రెండు వారాల క్రితం బజారుకెళ్ళి పాలూ, కూరలూ బండిలో వేసుకుని బయటికొచ్చేసేను. ఇంటికొచ్చి చూసుకుంటే ఇంటితాళాలు కనిపించలేదు. హయ్యో అని హడావుడిగా మళ్ళీ దుకాణానికెళ్ళేను. అదృష్టవశాత్తు కారు తాళాలు విడిగా ఉంచుకున్నాను కనక వెళ్ళగలగేను. అదృష్టం అవునో కాదో … ఎందుకంటే అన్ని తాళాలూ ఒకే గుత్తిలో ఉంటే కారు కదిలేది కాదు కదా. అప్పుడు తాళాలకోసం వెంటనే అక్కడిక్కడే వెతుక్కుని ఉండేదాన్ని. కానీ విడిగా ఉండబట్టే కదా కారు తోలుకు ఇంటితాళాలసంగతి ఆలోచించకుండా వచ్చేసేను. సరేలే, అదో యక్షప్రశ్న. మొత్తమ్మీద దుకాణానికైతే మళ్ళీ వెళ్ళగలిగేను కానీ తాళాలజాడ మాత్రం కనుక్కోలేకపోయేను. ఇలాటప్పుడే నాకారు స్వయంచోదక వాహనం కానందుకు సంతోషం కలుగుతుంది. లేకపోతే తాళాలు లేనందున నేను దిగాలుపడి దిక్కులు చూస్తుంటే కారు దానంతట అది ఇంటికి పోయేదేమో అనుకుంటాను!!

సరే ఇంటికొచ్చి ఇంటర్కంలో మేనేజరుబటను తట్టేను. ఆవిడ తలుపు తెరిపించేక, నేను నావాటాలోకి వెళ్ళి ఆలోచిస్తూ కూర్చున్నాను. ఇక్కడ మరోమాట కూడా చెప్పాలి. అది రహస్యమే కానీ అమెరికన్ దొంగకి తెలుగు రాదు కదా అన్న దీమాతో చెప్పేస్తున్నా. నువ్వు మళ్ళీ ఎవరితోనూ అనవని కూడా ధైర్యం. నేను ఇంటితలుపు తాళం వెయ్యను. ఎందుకంటే సింహద్వారానికీ నావాటా ముఖద్వారానికీ చాలా దూరం. దొంగ ఎవరైనా బిల్డింగులో ప్రవేశించినా అనేక వాటాలు దాటుకుని నావాటాకే వెతుక్కుంటూ వస్తాడని అనుకోను. ఒకవేళ వచ్చినా నావాటా ప్రవేశించి, కలియజూసి, “హయ్యో రామా, ఇదేమిటి అయ్యవారి నట్టిల్లులా … పాపం ఎలా బతుకుతోందో,” అని జాలి పడి మరో ఇంట్లోంచి దొంగిలించి తెచ్చుకున్న వస్తువులు నాకొదిలేసి పోతాడని నా నమ్మకం.

ఇంతకీ మేనేజరుతో తాళాలు పోయేయని ఎలా చెప్పడమా అని ఆలోచిస్తున్నాచెప్పేను కదూ. నేను అంత సుదీర్ఘంగా ఆలోచించడానికి అంతకుముందు జరిగిన మరో సంఘటన చెప్పాలి. నెల రోజులయిందేమో, underground garageలో దొంగలు పడి ఒకటి రెండు ట్రక్కులలో రేడియోలూ అవీ తస్కరించుకు పోయేరుట. బహుశా ప్రత్యేకమైన మోడల్ కోసం చూస్తున్నారు కాబోలు ట్రక్కులు మాత్రమే తడిమేరుట. ఏమైతేనేం, ఆ కారణంగా మొత్తం బిల్డింగు తాళాలన్నీ కొత్తవి వేయించేరు.

తెలిసింది కదూ నా వెరపుకి కారణం. ఇప్పుడు నేను తాళాలు పారేసుకున్నందుకు ఆవిడ, “మొన్నే కదా కొత్త తాళాలు వేయించేం, ఇప్పుడు మళ్ళీ నీవల్ల … ” అంటూ ఎగిరి పడుతుందేమోనని. కాని ఏం చేస్తాం, ఖర్మ అనుకుంటూ నెమ్మదిగా ఫోను తీసి, “తాళాలు పోయేయి” అన్నాను గొంతు బాగా తగ్గించి.

“ఓ, అలాగా. సరే మరో గుత్తి ఇస్తాను,” అందావిడ. నేను ఆశ్చర్యపోయేను కానీ ఆమాట ఆవిడతో అంటే కొరివితో తల గోక్కున్నట్టే కదా అనుకుని ఊరుకున్నాను.

ఇంతకీ ఇప్పుడు ఎక్కడున్నాం చెప్మా? తాళాలు ఎలా పోయేయో చెప్పడం అయిపోయింది కదా. ఇంక ఎలా దొరికేయో చెప్పేస్తే సరిపోతుంది. ఇందాకా చెప్పేను కదా నావి కాని తాళాలెవరో నాకు అందించేరని. అప్పుడు తోచింది మరోసారి ఆ స్టోరు క్లర్కుని అడిగితేనో అని. ఎందుకంటే ఎవరికైనా దుకాణం బయట ఆవరణలో దొరికిఉంటే మళ్ళీ పని గట్టుకు లోపలికెళ్ళి స్టోరుక్లర్కుకి ఆ తాళాలు ఒప్పగించే సమయమూ ఓపికా ఉండవు. అలాటివారు మళ్ళీ బజారు చేసుకోడానికొచ్చినప్పుడు ఆ తాళాలు తెచ్చి ఇవ్వొచ్చు కదా అని.
అలా ఆలోచిస్తూ నిలబడిపోయేను. అక్కడున్న క్లర్కుఅమ్మాయి ఏం కావాలంది. రెండు వారాలక్రితం నాతాళాలు ఎక్కడో పడిపోయేయి అన్నాను.

ఉండు చూస్తాను అంటూ ఆ అమ్మాయి గబగబా డెస్కు వెనకనున్న సొరుగు లాగి చూసింది. నీ తాళాలెలా ఉంటాయో తెలుసా అంది. రెండు రింగులు జోడించేను, మొత్తం ఐదు తాళాలున్నాయి అన్నాను. రెండు రింగులు ఎందుకు జోడించేనో చెప్తే ఈ కథ మరీ సాగదీసినట్టుంటుంది. అంచేత అదిప్పటికి వదిలేద్దాం. ఇంతకీ అలాటివేవీ కనిపించలేదంది.

సరేలే, ఎవరికి మాత్రం పట్టింది ఇలాటివి అనుకుని బయటికి నడిచేను నా బండి తోసుకుంటూ. ఇంతలో మరో అమ్మాయి పరుగెత్తుకుంటూ వచ్చి, నువ్వేదో పారేసుకున్నావుట అంది.

ఇంకా ఏమున్నాయి పారేసుకోడానికి అనుకుంటూ లోపలికెళ్ళేను. హోహోహహో ఏమని చెప్పుదు నా ఆనందము! నా తాళాలు ఎత్తి పట్టుకుని ఇవేనా అని అడుగుతూ దర్శనమిచ్చింది మొదటి క్లర్కు. పట్టలేని ఆనందముతో కృతజ్ఞతలు చెప్పి. దేవుడు నీకు మేలు చేయుగాక అని దీవించి, ఇంటికొచ్చేసేను.

ఇంటికొచ్చేక తోచింది నిజంగా ఆ తాళాలు ఎవరికి దొరికేయో, ఎవరు అంత శ్రద్ధగా పని గట్టుకుని ఆ తాళాలు డెస్క్ క్లర్కుకి ఇచ్చేరో వారికి కృతజ్ఞతలు చెప్పుకోలేదు. చెప్పడానికి వారెవరో తెలీదు. ఇప్పుడే కాదు ఎప్పటికీ తెలీదు కదా!!!

ఇందలి నీతులు రెండు.
ఎప్పుడు మంచి ఏ రూపంలో జరుగుతుందో మనకి తెలీదు. మనకి ఎవరు సాయం చేసేరో తెలియకపోవడం కూడా జీవలక్షణమే.
ఈ కథ చెప్పినతీరు. మన ప్రాచీనసాహిత్యంలో చాలా కథలు ఇలాగే ముందుకీ వెనక్కీ పోతూ సాగుతాయి. ఇలా కూడా కథ చెప్పొచ్చు.

ఇంకా ఒక ప్రశ్న కూడా ఉంది. అదేమిటంటే ఈ ధోరణి గందరగోళంగా ఉందా? ఉంటే మరేం అనుకోకు. నాకు చేతనయినట్టు చెప్పేనంతే. నువ్వు మరో పని చెయ్యొచ్చు. నీకు నచ్చినట్టు నీమాటల్లో మళ్ళీ రాసుకో. లేదా మరో కథ కూడా రాసుకోవచ్చు. ఏమంటావు?
000

(మే 20, 2016)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

7 thoughts on “మనలో మనమాట 15 – తాళాలు దొరికేయి”

 1. యింత ఓపెన్ సీక్రెట్ !

  రేపు వాడు గూగల్ ట్రాన్స్లేట్ లో ఈ టపా తర్జుమా జేసి చదివితే యేమి గాను !

  తాళములు పోయె! దేవుని దయ వలన య
  నగను మళ్ళీ దొరికెనుగ ! నగరపు కత
  నిది గద జిలేబి ! తూలిక ఈ రహస్య
  ము తెలిపె! నిడను బీగము! ముదము గాను 🙂

  జిలేబి

  మెచ్చుకోండి

 2. మీ తాళాలు దొరికేయి చాలా సంతోషం . మీకు ధన్యవాదాలు . మీ తాళాల కథ చెప్పి నాకు రాసుకునేందుకు సులభతరమైన సూచన అందించారు. ఇక రాసుకునే వాళ్ళకి రాసుకున్నంత. పాపం చదువరులకే … 🙂

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.