మనలో మనమాట 16 – అసలు సుఖంవెక్కడున్నాది?

“కులాసాగా ఉన్నావా?”

“అంటే?”

“సుఖంగా ఉన్నావా, బాగున్నావా, మరే చిరాకుల్లేవు కదా … ఎలా అడగమంటావు?”

ఎలా అడిగినా ఒకటే. జవాబూ అంతే. బాగున్నాను. బాగానే ఉన్నాను. ఏదో జరిగిపోతోంది …

నిట్టూర్చేను అప్రయత్నంగానే.

ఏమిటా సుఖం? ఎలా కొలుస్తావు? భగవంతుణ్ణి నమ్ముకుంటే, తపస్సులూ, పూజలూ చేస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయి. సౌభాగ్యం అంటే? శ్రీకృష్ణుడు మూడు గుప్పెళ్ళ అటుకులతో కుచేలుడికి అష్టైశ్వర్యాలూ ప్రసాదించేడుట. కుచేలుడు దినము జరుగుబాటుకోసం బాల్యమిత్రుడిని సాయం అడిగేడు కానీ అష్టైశ్వర్యాలూ కోరినట్టు కనిపించదు. అసలు కుచేలుడు అంటేనే ఆగర్భదారిద్ర్యానికి మారుపేరు. మరి ఆయనకి అష్టైశ్వరాలు వచ్చేస్తే, “కుచేలుడు” కాడు. పైగా అష్టైశ్వర్యాలూ వచ్చేసిన తరవాత ఆయన జీవనవిధానం మారిందా? ధోరణి మారిందా? తెలీదు. ఆ సకల సంపదలూ అనుభవించాలంటే మారాలి కదా. మారకపోతే అవి ఉన్నా ఒకటే ఊడిన ఒకటే. కేమన్ దీవుల్లోనూ స్విస్ బాంకుల్లోనూ సంపదల్లా. సరే సరే నాకూ తెలుసు ఆ కథలో ప్రధానం స్నేహం, భక్తీ అని. భక్తికీ సంపదకీ లంకె పెట్టకుండా ఉంటే బాగుండు అనిపిస్తోంది. ఏదో అసంతృప్తి, గందరగోళం.
అసలు సంతోషం అంటే ఏమిటో. డబ్బుతో ఆనందం కొనుక్కోలేం అంటూ కథలూ ఉపన్యాసాలూ కోకొల్లలు. మరోవేపు ఆ ఆనందంకోసమే సంపాదనలు. ఆ సంపాదనకోసం రాత్రింబవళ్ళు ఆరాటం. అసలు డబ్బు ఎవరు కనిపెట్టేరో. ఈ డబ్బు కనిపెట్టకముందు సుఖం లేదా?

అసలు సుఖం అంటే ఏమిటి? ఇల్లు లేకపోతే ఇల్లు, ఇల్లుంటే ఇంకొంచెం పెద్దిల్లు, సైకిలుంటే స్కూటరు, స్కూటరుంటే కారు, కారుంటే ఇంకొంచెం ఖరీదయిన కారు, ఒక కారుంటే రెండు కార్లు … ఎన్ని ఉన్నా అంతకన్నా ఇంకొంచెం ఎక్కువ కావాలన్న తపన, పై అంతస్థుకి ఎగబాకాలన్నరంధి.

దేశదేశాలు సందర్శించడం మాట తలుచుకుంటే దేశాటనం అంటే మునుస్వామయ్యగారు గుర్తొస్తారు. నాలుగేళ్ళయిందనుకుంటా కలిసి. అప్పట్లో 70 దేశాలు చూసేం అన్నారు. వాటిగురించి రాయండి అన్నాను. ఎక్కడ గుర్తుంటాయండీ అన్నారాయన. ఆవిడ చూపిన ఫొటోలు చూస్తే నాకు తమాషాగా అనిపించింది. కొన్ని బొమ్మల్లో అయితే వెనకున్న దృశ్యం కన్నా ఆ దంపతులే ప్రముఖంగా కనిపించేరు. వాళ్ళు అక్కడి తిన్నెలు సంచరించేం అని గుర్తుగా కాబోలు. ఆ బొమ్మలు పెట్టుకుని రాయొచ్చు కదా అన్నాను నేను ఒదలకుండా. ఆయన తల అడ్డంగా ఆడించేరు. ఏదో రోజులు గడవడానికే తిరిగినట్టుంది కానీ ఆ దేశసంంస్కృతి తెలుసుకుందాం అని కాదేమో. అయినా దేశంలో నెలరోజులు గడిపినంతమాత్రాన ఏం తెలుస్తుంది? … ఏమీ తెలీదని నాకు ఈమధ్య బాగానే అర్థం అయింది అమెరికా వచ్చి వెళ్ళినవాళ్ళు ఈ దేశసంపదనీ, నీతినియమాలనీ మెచ్చుకుంటుంటే. హ్మ్.

అద్సరే గానీ అసలు ఏదైనా తెలుసుకున్నతరవాత ఏం చేస్తాం? … ఇలా అడిగితే బాగుండదులే.

సుఖమూ అంతే. రిమోట్ లేని రోజుల్లో టివీ దగ్గరికి వెళ్ళి ఛానెలు మార్చవలసి వచ్చేది. ఇప్పుడు రిమోటు లేకపోతే క్షణం గడవదు. ఇప్పుడు ఎంచక్కా ఆరడుగులదూరంలో సోఫాలో విలాసంగా వెనక్కి వాలి ఛానెలు తరవాత ఛానెలు కుప్పిగెంతులేసుకుంటూ పోవచ్చు. మరి సుఖంగా ఉందా? నిజంగా మనస్సాక్షిగా చెప్పాలంటే సుఖం కంటే నష్టమే ఎక్కువ. ఆ సౌకర్యంవల్ల స్థిమితంగా ఒక ఛానెలు పూర్తిగా చూసే అలవాటు పోయింది. ఎంత ఇష్టమైన కార్యక్రమం అయినా అవతల మరో చానెలులో ఏం ములిగిపోతోందో అన్న యావే. అక్షరాలా మతిస్తిమితం లేకుండా పోయింది! ఒక విషయంమీద దృష్టి నిలపడం లేదిప్పుడు. చిన్నవిషయమే కానీ ఏ విషయం తీసుకున్నా ఇలాగే అనిపించడం లేదూ? మాలుకెళ్తే మెట్లెక్కం ఎస్కలేటరో ఎలివేటరో ఉంటే. నిజానికి ఒంట్లో ఓపికున్నవాళ్ళు మెట్లెక్కితేనే ఆరోగ్యం కదా. వీధిచివరున్న దుకాణానకి కారేసుకునే వెళ్తాం. కాలినడకన వెళ్లే ఎన్ని పువ్వులూ కాయలూ, సోగరెమ్మలూ చూసేవాళ్ళో! కారులో తిరగడంవల్ల వారికి అనుభవంలోకి రాకుండా పోతున్న సృష్టి అందాలు ఎన్నో. నేను రోజూ నడుస్తూ చూసే ఎన్నో మొక్కలూ, పువ్వులూ … వాటిని పెంచుతున్నవారు ఎక్కడో ఆఫీసుల్లో మగ్గుతున్నారు. లేదా మరో దేశసౌందర్యం చూడ్డానికి వెళ్తారు. నేనో మరి? వాటికి చేస్తున్నదేమీ లేదు. చీడ పట్టిందా, ఎరువు కావాలేమో అన్న తహతహ లేదు. తీరిగ్గా వాటిపక్కనుండి పోతూ, ఆగి రెండు నిముషాలపాటు వాటిసౌందర్యం మనసారా తిలకించి ముందుకు సాగిపోతాను. నాకు ఇల్లు లేదు. తోటలూ దొడ్లూ లేవు. మరి లేదన్న చింతతో సతమతమవనా? కనిపిస్తున్నవి చూసి ఆనందించనా? నాకు రెండోదే బాగుంది. అందుకేనేమో అన్నాడు

స్వర్గమ్మునుగూర్చి నాకు సర్వమ్ము తెలియు
మనసు సంతసపడుటకు మంచి యూహ (గాలిబ్ గీతాలు).

స్వర్గసుఖాలు అంటారు కానీ ఆ సుఖాలు మరి ఇక్కడే దొరికితే వేరే స్వర్గంకోసం తాపత్రయపడడం ఎందుకూ అని కాబోలు ఆయన ఊహ. అందమైన అమ్మాయికోసం ఆయన పడే వేదన చూస్తే అనిపిస్తుంది ఆయనకి స్వర్గసుఖాలకంటే ఆ వేదనే ఎక్కువ అభిమతమేమేమో. ఈ ఊహ ఎలాటిదయి ఉండాలి – ఎక్కడో ఎప్పుడో చిక్కగలదిగానా, ఇప్పుడు ఎదురుగా కనిపిస్తున్నదానితో తృప్తి చెందేదిగానా?

సుఖం మాటకొస్తే, ఏదైనా ఇంతే. ఇన్ని సౌకర్యాలు లేని రోజుల్లో ఉన్నచోట ఉండి తిన్న చోట తింటూ బతుకు గడుపుకున్న రోజుల్లో కంటే ఇప్పుడు ఎక్కువ సుఖంగా ఉన్నాం అని చెప్పగలమా? ఏమో, బహుశా ఆరోజుల్లో సుఖానికి వేరే నిర్వచనం ఉండేదేమో. అదేమయిఉంటుంది?

సంతోషమూ సుఖమూ ఒకటేనా? రెండూ ఒకటి కాదు. మరి సంతోషానికి సుఖానికీ సంంధం ఉందా?
ఆ మధ్య టీవీలో ఒక వార్త చూసేను. ప్రపంచదేశాలన్నీ తమదేశపు భాగ్యం (GDP)తో కొలుస్తుంటే భూటాన్ రాజు ప్జల సుఖసంతోషాలు (GDH) కొలమానంగా నిర్ణయించేడుట నాలుగు దశాబ్దాల క్రితమే. అక్కడినుండి ఏదేశంలో ఆనందం ఏస్థాయిలో ఉందో పరిశోధనలు మొదలయేయి. ఎలా కొలుస్తాం అంటే ఇదుగో ఈ 8 అంశాలు ప్రాతిపదికగానట – ఆరోగ్యం శారీరకంగానూ మానసికంగాను, కాలక్షేపాలూ, సాంఘిక సామాజిక బలాబలాలు, విద్య, జీవన స్థాయి, బాధ్యతాయుత ప్రభుత్వం, పర్యావరణ. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ వీటికీ డబ్బుకీ సంబంధం కూడా ఉంది కదా. మరి GDP అంటే ఉత్పత్తి అనే సాధారణ అర్థం అయినా ఆ ఉత్పత్తివలన అందుకునే డబ్బే నిజంగా లెక్కలోకి వచ్చేది. అంచేత ఆ GDPకి వెనక మళ్ళీ ఉన్నది డబ్బే. ఎలా చూసినా డబ్బు ఏలిన్నాటి శనిలా పట్టుకునే ఉంటుందనిపిస్తోంది.

ప్రపంచం మొత్తంలో తమదే మహోన్నతదేశం అని ఎలుగెత్తి చాటుకుంటున్న (చాటుకొను క్రియాపదం గమనించవలె) అమెరికా ఆ ఆనందంకొలతల్లో 13వ స్థానంలో ఉంది.

అసలు అమెరికా ఆనందంలో అనేక వైరధ్యాలు కనిపిస్తాయి తరిచి చూస్తే. ఉదాహరణకి, ఏ పని అయినా తమకి ఆనందం కలిగించేదిగా ఉండాలంటారు. Fun. చదువు, ఉద్యోగం ఏదైనా సరే ఫన్నుంటేనే మిన్న. లేకున్న దానిఉనికి సున్న.
మామూలుగా సుఖం అంటే తినడానికి తిండీ, కట్ట బట్టా, తల దాచుకోడానికి ఓ గూడూ ఉంటే సుఖంగా ఉన్నట్టే లెఖ్ఖ. ఆ మీదట గంజినీళ్లకంటే కూరా పచ్చడీ, గడ్డ పెరుగూ కొత్తావకాయ ఘాటుగా ఉంటే సుఖమే కాదు సంతోషం కూడా. ఆరోగ్యం మాట వేరే చెప్పఖ్ఖర్లేదు కదా. కానీ ఇదంతా చాదస్తంగా కూడా కనిపిస్తుంది ఈ రోజుల్లో. ఆమాత్రం లేనివాళ్ళుంటారా, అదీ ఓ బతుకేనా అని విరగబడి నవ్వేవాళ్ళు కూడా ఉన్నారేమో.

పంది బురద మెచ్చు కానీ పన్నీరు మెచ్చునా అని తీసిపారేస్తాం కానీ భూటాన్రాజు లెక్కలో చూడు. ఆనందం కొలతలో నీకు పన్నీటి జలకాలు ఏ స్థాయి ఆనందం కలిగిస్తాయో పందికి బురదలో పొర్లినప్పటి ఆనందం కూడా అదే స్థాయిలో ఉండదని ఋజువేదీ? పందికి నువ్వు పన్నీటి జలకం ఏర్పాటు చేస్తే, అది ఆనందించదు అన్నది నీ అభిప్రాయమే కానీ పందితో ఈ విషయం చర్చించిన జాడలు లేవు కదా. అంతే కాదు. బురద ఆరోగ్యకరం అన్నది కూడా గమనించాలి. ఒంటినొప్పులకి బురద పట్టు వేస్తారని తెలుసు కదా. అంటే ఏమిటీ, పంది ఆ బురదలో పొర్లి ఆరోగ్యంగా ఉంటోంది అనే అనుకుంటాను నేను.

నిన్న రాత్రి నువ్వేం చేసేవు. మంచంమీద తలగడామీద తలగడా సద్దుకుంటూ, ఈ తలగడా కాదు ఆ తలగడా, పట్టుదుప్పటీ కాదు నూలు దుప్పటీ, ఈ పక్క కాదు ఆ పక్క అంటూ మార్చుకుంటూ, దొర్లుతూ, మెలికలపాములా గిలగిల్లాడుతో ఎంతసేపు గడిపేవు? అలా అర్థరాత్రివరకూ విలవిల్లాడి సరీఘ్ఘా అనువు కుదిరేక మరి ఆ మంచంమీంచి లేవగలిగేవా నాలుక పీక్కుపోతున్నా, కడుపుబ్బిపోతున్నా? లేదు. ఎందుచేతా అలా పడుకోడం నీకు అంత సుఖంగా ఉంది గనక. అప్పటికి అంతకి మించిన సుఖం లేదు.

నిన్న పక్కవాటాలో పిల్ల కుడికాలు మడమకి కట్టుతో ఊతకర్రలతో కనిపించింది. ఏమయిందంటే ఎత్తుమడమలజోడుతో నడుస్తూ బోర్ల పడిందిట, మడమ బెణికింది. ఎందుకు ఈ ఎత్తుమడమలతో ఈ అవస్థలు. పొడుగ్గా కనిపించడంకోసం. నిజానికి అందరికీ తెలుసు ఆ ఎత్తు మడమలమూలంగా మరో గుప్పెడు పొడుగు కనిపించడమే కానీ నిజంగా అంత పొడుగు కాదు అని. బహిరంగ రహస్యం. అసలు ఈ మడమలచరిత్ర చూడు. మొదట ఓ అంగుళంతో మొదలయి, రాను రాను రెండూ, మూడూ, ప్రస్తుతం నాలుగంగుళాలు అయింది. చదునుగా మొదలయిన మడమ సూదిమొన అయింది. ఆ సూదిమొనమీద సర్కస్ అయి, దానికి మళ్ళీ మరో ప్లాస్టిక్ కప్పు తయారు చేయడం మొదలు పెట్టేరు. ఆ కప్పులు ఆ సూదిమొనని పట్టుకుని ఉండవు. అవి ఊడి ఎక్కడో పడిపోతాయి కనక మరో రెండు కొని దాచుకుంటారు. ఎందుకొచ్చిన బాధ ఇదంతా. బహుశా వీళ్ళు గాలిబ్ గీతాలు కంఠతా పట్టి ఉండాలి. ఎందుకంటే నొప్పి లేకపోతే ఆనందం ఎలా తెలుస్తుందంటాడు గాలిబ్. ఇంతకీ పక్కింంటి పిల్ల మాట – ఎందుకంటే ఆ జోళ్ళు వేసుకున్నవేళ తానేదో చాలా పొడుగన్న అపోహ. నిజం. అపోహ మాత్రమే. దాంతో ఇదీ అని నిర్వచించలేని ఆనందం. నీజోళ్ళు బావున్నాయి అని మరో అమ్మాయి మెచ్చుకుంటే అదో ఆనందం. ఇవన్నీ ఆ క్షణానికే కదా. కాదేమోలే. నాపేరు నాలో భాగం అయినట్టే ఆ జోళ్ళు ఆ అమ్మాయిలో భాగమేమో.

ఒకమాట మాత్రం నిజం. కావలిస్తే మళ్ళీ చెప్తాను ఇవన్నీ ఏమంత ఏడ్చి మొత్తుకునే మాటలు కావని. కానీ వాటివిషయంలో నీ స్పందన ఎలా ఉంది, ఆ క్షణంనించి తరవాతి క్షణానికి ఎలా ప్రయాణిస్తున్నావు అన్నవే నీ జీవితాన్ని నిర్దేశిస్తాయి అని చెప్పడానికే ఈ సోది అంతాను. ఎత్తుమడమలజోళ్ళు “ఇవాళ ఒకరు మెచ్చకుంటే పోనీ, రేపు మరొకరు మెచ్చుకుంటారు” అని ముందుకి సాగుతావా, “అయ్యో ఇంత డబ్బు పోసి కొన్నాను, ఇన్ని అవస్థలు పడ్డాను వాటితో నడవడానికి” అంటూ కుళ్ళి కుమిలిపోతూ రాత్రంతా గడుపుతావా అన్నది నీచేతుల్లో ఉంది. నీకర్మకి నువ్వే కర్తవి కాదూ?

నా స్నేహితులంతా జీవితం లెక్కప్రకారం సాగించుకుపోయేవారే – చదువు, ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు, కొత్త మేడా, మళ్ళీ వాళ్ళ చదువులూ, అమెరికాలో ఉద్యోగాలూ, పెళ్ళిళ్లూ, వాళ్ళ పిల్లలూ, కొత్త మేడా, మళ్లీ వాళ్ళ పిల్లలు … అంతా సాఫీగా నిగనిగలాడే తారురోడ్డుమీద కొత్తకారులా ఆనవాయితీప్రకారం సాగిపోతుంది. నాకు ఒక్కటీ అలా జరగలేదు. అంచేతేనేమో ఈ తలతిక్క ఆలోచనలు.

అన్నట్టు ఇందాకా పేరుమాట చెప్పేను కదూ. పేర్లసంగతి వస్తే తప్పకుండా కథల్లో పేర్లసంగతి మాటాడాలి. మునుపు పిల్లలకి తాతతండ్రులపేర్లూ దేవతలపేర్లూ పెట్టేరు కానీ ఇప్పుడు షోగ్గా, ప్రత్యేకంగా ఉండాలంటున్నారు కదా. సంతానం సంగతి నేనేం చెప్పలేను కానీ కథల్లో పేర్లు మాత్రం సాధారణంగా రచయితలు పాత్రలకి తగ్గపేర్లే పెడతారు, అన్వర్థకంగా కానీ వ్యంగ్యంగా కానీ. ఏమైనా పేర్లు ఆ జాతి సంస్కృతిని తెలిపేవిగా ఉండేవి కానీ ఇప్పుడు మనదేశంలో మాత్రం అలా లేదు. అంచేత అనువాదాలు చేస్తున్నప్పుడు కూడా ఇష్టం వచ్చినట్టు మార్చేస్తున్నారు. ఇదుగో ఇక్కడే అసలు సంగతి, నామాట ….

చేసిన పాపం చెబితే పోతుందంటారు. అవునో కాదో తెలీదు కానీ నేను కథలు అనువాదం చేయడం మొదలు పెట్టిన కొత్తలో కథల్లో పేర్లగురించిన సందేహం వచ్చింది. నా అనువాదం ఎలా ఉందో చూడమని అమెరిను స్నేహితులని అడిగినప్పుడు ఒకరిద్దరు ఆ పేర్లు మార్చమని సలహా ఇచ్చేరు. వారిమాట విని ఒకటి, రెండు కథల్లో మార్చేను కూడాను. కొంతకాలం అయేక అర్థమయింది. పదిమందిని సలహా అడిగితే పది రకాల సలహాలు చెప్తారు. ఒక సలహా ప్రకారం మార్చడం మరొకరికి చూపడం, వాళ్ళు మరో సలహా … ఇలా కొంతకాలం అయేక గ్రహించేను. సలహాలు అడగొచ్చు కానీ పాటించవలసిన అవుసరం లేదు. ఎన్నిసార్లు మార్చినా, అది నచ్చనివారు ఉంటారు. ఆ రోజుల్లోనే Roots లో ప్రధానపాత్రని పేరు మార్చుకోమని హింసించడం చూసేను. అప్పుడర్థమయింది ప్రతిఒక్కరికీ బారసాలనాడు పెద్దలు పెట్టిన పేరుకి ఏ సంస్కృతిలోనైనా ఎంత బలమైనస్థానం ఉందో. ఆ తరవాత మార్చడం మానేసేను. మనం రాసింది కొందరికి నచ్చుతుంది. కొందరికి నచ్చదు అన్నది ప్రధానసూత్రం చేసుకున్నాను అప్పట్నుంచీ. ప్రతి ఒక్కరికీ నచ్చడం ఏనాటికీ జరగదు కనక ప్రతి ఒక్కరినీ సలహాలు అడిగి లాభం లేదు. నాకు ఏది బాగుందో అదే నా అనువాదం. అదే నేను. అంటే నాపేరుమీద వచ్చిన అనువాదాల్లో పేర్లు మూలంలో ఉన్న పేర్లే.

ఏమిటో … నేనిలాటి అవకతవక ఆలోచనలు చేస్తాను కనకే నాకు ఎవరితోనూ పొత్తు కుదరదు అనుకుంటా. ఈ పాటికి బహుశా నువ్వు కూడా లేచి వెళ్ళిపోడానికి సిద్దమవుతున్నావేమో. సరేలే, మళ్ళీ నీకు వినాలనని అనిపించినప్పుడు కనిపించు.
సర్వే జనాః ఎవరిపద్ధతిలో వారు సుఖినో భవంతు!

000
(గమనిక – ఇక్కడిదాకా వచ్చినవారికి నా ధన్యవాదాలు. ఈ తలా తోకా లేని రాతలు రాయడానికి కారణం కేవలం తెలుగు నుడికారం మరోమారు తలుచుకోడానికే. దీనిలో సందేశాలూ, సంఘోద్దరణ కార్యక్రమాలూ గట్రా లేవు. చిత్తగించవలెను – మాలతి)

(మే 30, 2016)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

10 thoughts on “మనలో మనమాట 16 – అసలు సుఖంవెక్కడున్నాది?”

 1. మీ స్పందనకి ధన్యవాదాలు వనజగారూ. మీకు ఆలోచించడానికి నారచన కారణమయిందంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఊహించనివి జరగడం ఆనందమే
  అలా జరకపోతే నిరాశ మాత్రం కాదు. అది వాస్తవాన్ని వాస్తవంగా గుర్తించడం అని నేను అనుకున్నాను.

  మెచ్చుకోండి

 2. అలాగా! దేవేంద్రుడు పందిఅవతారం ఎప్పుడూ వినలేదు. డ్రైవరులేని కారుని తలుచుకుంటే నాకు మాత్రం భయంగానే ఉందండి. ఎన్ని యంత్రాలు ఫెయిలవుతున్నాయో చూడండి ప్రతిరోజూ.

  మెచ్చుకోండి

 3. చాలా విషయాలు ఒకే పోస్టులో చర్చించారు.మొత్తంగా మీ అభిప్రాయాలతో (GDHతో సహా)ఏకీభవిస్తున్నాను. నాక్కూడా ఇలాంటి ఆలోచనలే వస్తాయి,తలా తోకా లేకుండా చెప్తావేమిటీ అంటుంటారు. ఆటిట్యూడ్ కి డబ్బుకీ లింక్ లేదసలు.(కలవారింట్లో పుట్టినా జీరో స్థాయికి దిగజారినా కాస్త కష్టపడితే డబ్బు అదే వస్తుంది అన్న నా నమ్మకం ఇప్పటి రోజుల్లో వెర్రితనంలాగా కనపడుతున్నది.)

  కుచేలుడికి శ్రీకృష్ణుడంటే ఈర్ష్య లేదు కనుకనే సంపద చిక్కింది.సంపద కలిగాక కుచేలుడు తోక ఝాడిస్తే కృష్ణుడు ఊరుకుంటాడా ? కటీఫ్ చెప్పేయడూ ? అపుడు స్నేహం గురించి చెప్పుకోడానికేముంటుంది ?

  మెచ్చుకోండి

 4. చిత్తగించానండీ. చాలా ఆనందంగా. బ్రహ్మాండంగా వ్రాసారు. మనిషిలో ఉండే ఈ‌ సుఖలాలస అనేదే మనిషికి బలమూ‌బలహీనతా కూడా. మానవనాగరికతాపురోభివృధ్ధికి మూలకారణం కూడా అదే.

  అన్నట్లు పంది ప్రస్తావనచేసారు. అదే, దాని సుఖం దానికే తెలుసూ అని. ఒకప్పుడు దేవేంద్రుడికి ఒక పంది జన్మ ఎత్తి తీరవలసిన పరిస్థితి వచ్చిందట. అప్పుడు నారదమహర్షిని కలిసి, మహాత్మా, ఆ జన్మకు పోగానే మీరు నన్ను ప్రబోధించండి, వెంటనే ఆ శరీరం వదిలి వచ్చేస్తాను అని కోరాడు. కాని తీరా నారదుడు అలా చేయగానే, ‘అయ్యా, మీకేంతెలుసు ఈ పందిజన్మలో ఉన్న హాయి. దీన్ని వదలిపెట్టి రావటం అసాధ్యం, మన్నించండి, దీన్ని పూర్తిగా గడిపాకే తిరిగి వస్తాను’ అన్నాడట. ఏ ఉపాధికి ఆ ఉపాధికే దాని పరిమితుల్లోనే సుఖసంతోషాలు ఆమోదయోగ్యంగా ఉంటాయి కాబట్టి ఏదీ నిమ్నయోని కాదు మరేదో ఉత్తమయోనీ‌ కాదు. అదీ సంగతి.

  ఉన్నంతలో సుఖంగా ఉండటమే సుఖపడటం. సెల్‌ఫోనులు లేనిరోజుల్లోనూ సుఖంగా బ్రతకలేదా? అసలు కరంటే లేని రోజుల్లోనూ సుఖంగా బ్రతకలేదా? ముందు రాబోయే తరాలవాళ్ళకు మరేదో మరింత సుఖకరమైనది తప్పక దొరుకుతుంది. వాళ్ళు ఆ సదుపాయంలేని మనం ఎలా అవస్థలు పడుతూ బ్రతికామా సుఖం లేకుండా అని జాలిపడతారు కదా. మాటవరసకు రాబోయే రోజుల్లో కార్లకు డ్రైవర్ అనే మనిషి అవసరమే ఉండదు. వాళ్ళైతే మనని తలచుకొని మాన్యువల్ డ్రైవింగ్‌తో మనతరాలవాళ్ళు ఎలా సుఖరహితంగా బ్రతికారా అని అనుకుంటారు తప్పకుండా.

  మెచ్చుకోండి

 5. నాకు ఒక్కటీ అలా జరగలేదు… అలా జరగడం సుఖమేమో కానీ నిజమైన సంతోషం కాదు,అవదు కదా ..మాలతీ గారూ . ఊహించనివి జరగడమే అప్పుడప్పుడు నిరాశ ని అనుభవించడమే ఆనందం అంటాను నేను. మంచి విషయాలు చదివి కొంత ఆలోచించడం మొదలపెట్టాను. ధన్యవాదములు.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s