మనలో మనమాట 17 – నువ్వా? మీరా?

తెలుగులో ఉన్నన్ని సంబోధనలు ఇంగ్లీషులో లేవు. మనకి “నువ్వు”, “మీరు” తేడాలతో వాటిని అంటిపెట్టుకు ఇతరవిధాల సంబోధనలు కూడా అనేకం. వీటితోపాటు అమ్మా, అక్కా, అన్నా, బాబూలాటి మాటలు కూడాను.

బ్లాగులోకంటె ముఖపత్రంలో ముఖాముఖీ కబుర్లకి అవకాశాలెక్కువ. ఎదురెదురుగా కూర్చుని మాటాడుకున్నట్టే. సామీప్యం ఉన్నట్టే ఉంటుంది కనక అప్పుడప్పుడు ఎవరో ఒకరు “మీరనకండి” అంటారు. ఈ సూచనలు పదే పదే కనిపించడంతో సరదాగా అడిగేను “ఎవరిని మీరు అనాలి, ఎవరిని అనఖ్ఖర్లేదు, మీరే చెప్పండి,” అని. “నన్ను నువ్వు అనకూడదు” అని ఎవరూ అనలేదనుకో. ఎవరిని అనాలన్నమాట ఎలా ఉన్నా వచ్చిన జవాబులు సరదాగా ఉన్నాయి. అంచేత ఆ మాట నీచెవిని కూడా వేదాం అని ఇక్కడికి మోసుకొచ్చేను ఆ కబురు. లేదులే అక్కడితో సరి పెట్టేయను. ఈ విషయంలో నావిషయం – నాకేది సమ్మతమో – కూడా చెప్తాను. అప్పుడు బ్లాగు చదువరులకి కూడా తెలుస్తుంది కదా “ఇదీ నావరస” అని. అసలు మన మర్యాదలతీరే వేరు. ఒకొక ఇంట్లో ఒకొక ఆనవాయితీ అంతే గానీ హట్ హూట్ నన్ను నువ్వంటావా, కళ్ళు నెత్తికెక్కేయా అంటూ ఎగిరి పడడం తక్కువే.
లేకపోలేదు కానీ తక్కువే అంటున్నా. కొందరిళ్ళల్లో ఆలుమగలిద్దరూ ఒకరినొకరు నువ్వూ నువ్వూ అనుకుంటే కొందరిళ్ళల్లో ఇద్దరూ మీరనే సంబోధించుకోడం చూస్తున్నాం. క్షత్రియకుటుంబాలలో పూర్వమే కాదు ఇపుడు కూడా దంపతులు ఒకరినొకరు మీరనే గౌరవించుకుంటారు. గుంటూరు ప్రాంతంలో వైదికకుటుంబాల్లో ఇద్దరూ నువ్వు అనుకోడం ఉంది. పాటకజనంలో అందరూ నువ్వూ నువ్వూ అనే పిలుచుకుంటారు. పల్లెల్లో పాలేర్లు భూస్వాములని నువ్వు అనడం తప్పు కాదు.

ప్రాంతాలనిబట్టి కూడా ఆనవాయితీలు తెలుస్తాయి. ఒకాయన నాతో, “మేం చిత్తూరోల్లం. మాకు ఈ అండీ గిండీ అలవాటు లేదు. మీరేం అనుకోబాకండి,” అన్నారు. తిరపతిలో ఉన్నప్పుడు ఒకతను నాతో, “ఏరా అంటాడు నన్ను, నేనేం ఆయన బామ్మర్దినా?” అన్న తరవాత కానీ నాకు తెలీలేదు ఆ ప్రాంతంలో “రా” అనడం ఎంత తప్పో. విశాఖపట్నంలో స్నేహితులు ఒరే, ఒసే అనుకోడం మామూలే. అందులో తప్పు లేదు.

ఇవే ధర్మసూత్రాలు, వీటినే విధిగా పాటించాలి అనడం లేదు నేను. ఇలా ఆలోచించుకుంటూ పోతే, ఎవరు ఎవర్ని “రా”కొట్టొచ్చు అన్నది అంత తేలిగ్గా తీర్మానాలు చేయలేం అనే.

అడిదము సూరకవి పద్యం నీకు గుర్తుందా సీతారామరాజుని మెచ్చుకుంటూ “నీకు నీవే సాటి” అన్నాడు. సభికులు మెచ్చుకున్నారు. రాజుగారు కూడా మెచ్చుకున్నారు కానీ నొచ్చుకోకుండా వుండలేకపోయారు తనంతటి ప్రభువుని నువ్వు అంటూ ఏకవచనంలో సంబోధించినందుకు.
సూరకవి వెంటనే,
క. చిన్నప్పుడు రతికేళిని
నున్నప్పుడు కవితలోనన్ యుద్ధములోనన్
వన్నెసుమీ ‘రా’ కొట్టుట
చెన్నగునో పూసపాటి సీతారామా!
పిల్లలవిషయంలో, పడగ్గదిలో, కవిత్వంలో, యుద్ధాలలో ఏకవచనం తప్పు కాదు అంటూ రాజుగారిని సమాధానపరిచాడు. (అడిదమ సూరకవి వ్యాసం లింకు ఇక్కడ)

ఇప్పుడు మనం ఆ జాబితాలో ముఖపుస్తకమిత్రులని కూడా చేర్చుకోవాలేమో. నెలరోజులక్రితం నాకో వినతిపత్రం వచ్చింది నా మిత్రమండలిలో చేర్చుకోమంటూ. నేను ఒప్పుకున్నాను. వెంటనే నా ఉత్తరాలపెట్టెలో “నువ్వు ఒప్పుకున్నందుకు సంతోషం చెల్లీ” అని కబురొచ్చింది. అది నాకు కొత్తగా అనిపించి, ఎందుకైనా మంచిదని తాత్సారం చెయ్యకుండా వెంటనే, నాకు “ఈ వావివరసలు ఇష్టం లేదనీ, నారాతలు చదివి అక్కడే తమ అభిప్రాయాలు చెప్తే సంతోషిస్తాన”నీ జవాబిచ్చేను. మర్నాడు నాటపాకింద మళ్ళీ ఈ అన్నాచెల్లీ వరస కలిపి తనకి అదే ఇష్టం అంటూ వ్యాఖ్య పెట్టేరాయన. నేనింకేం చెప్పలేక నామిత్రమండలిలోంచి ఆయనపేరు తొలగించేసేను. కయ్యానికీ, వియ్యానికీ, నెయ్యానికీ కూడా ఒకేరకమైన అభిప్రాయం రెండుపక్కలా ఉంటేనే చెల్లేది. నాకు ఈ చెల్లి సంబోధన అలవాటు లేదు. మాయింట్లో మేం అందరం పేర్లతోనే పిలుచుకుంటాం.

ముఖపుస్తకంలో చూస్తున్నాను చాలామంది అన్నా, అక్కా, తమ్ముడూ అనుకోడం. క్రమంగా ఒకరిళ్ళకి ఒకరు వెళ్ళడం, ఆతిథ్యాలిచ్చుకోడం, ఫొటోలు దిగడం, వాటిగురించి జాలంలో బ్లాగడం, స్నేహం మరింత బలపరుచుకోడం కొందరివిషయంలో జరుగుతాయి కానీ నావిషయంలో అలా జరగలేదు. స్వతహాగా నేను ఎవరికీ వేగిరం దగ్గర కాలేను. నాబ్లాగు మొదలుపెట్టిన కొత్తలో కొందరు ఇలాగే దగ్గిరయి, స్వవిషయాలు మాటాడుకునే స్థాయికి పరిస్థితి చేరింది కానీ ఇతర కారణాలవల్ల ఆ స్నేహాలు ముగిసేయి. దాదాపు ఒక ఏడాదిగా వ్యక్తిస్నేహాలు పెంచుకోడం మానుకున్నాను. ముఖాముఖీ కలవడంలేదు. ఫోనులోనూ మాటాడను అని కూడా గట్టిగా నిర్ణయించేసుకున్నాను. ఇంగ్లీషులో ఒక నానుడి ఉంది చూడూ “ఏ ఒక్కజీవీ ఏకాంతదీవి కానేరడు,” అని. నేను మాత్రం వాస్తవజీవితంలో దాదాపు ఆ స్థాయికి చేరుకున్నాను. కనీసం ఆ పొలిమేరల్లో తారట్లాడుతున్నాను.

అంతర్జాలంలో స్నేహాలు virtual స్నేహాలు. అవి నారాతలకే పరిమితం. నారచనలు ఆధారంగా ఎవరైనా నన్ను ఒక విధంగా ఊహించుకుంటే అది ఊహ మాత్రమే అని నీకూ తెలుసు కదా. నిజజీవితంలో నాబతుకేమిటో నా స్థితిగతులేమిటో తెలుసుకోడం నీకు నిజంగా సాధ్యం కాదు. నేను రెండస్థులమేడగురించి కథ రాస్తే నాకు రెండస్థులమేడ ఉందనుకోడం అమాయకత్వమే కదా. ఈమధ్య నాకు సెల్లు లేదు ఇల్లు లేదంటే ఆశ్చర్యపోయేవారిని చూసి ఆశ్చర్యపోవడం నాకో ఆట అయిపోయింది.

నా పరిచయాలన్నీ సాహిత్యరంగానికే పరిమితం అన్నాను కదా. నాకంటె పెద్దవాళ్లు నలుగురు ఉన్నారు కానీ వాళ్ళందరూ నన్ను మీరనే అంటారు. అంచేత నాకు ఆ పదమే బాగా అలవాటయిపోయింది. వెనకటి పరిచయాలు తప్పిస్తే కొత్తగా పరిచయమైన వారెవరైనా నువ్వు అంటే నాకు ఎబ్బెట్టుగానే ఉంటోంది మరి. అట్టే వివరాలకి పోను కానీ మొత్తమ్మీద ముఖాముఖి కలవడం, మాటాడుకోడంద్వారా సొంత విషయాలు మాటల్లోకి వస్తాయి అనిపించింది. నాకు అది ఇష్టం లేదు అని చెప్తే వినిపించుకోనివాళ్ళే ఎక్కువ. ఇది ఆడవారిలోనే అంటారు కానీ మగవాళ్ళు కూడా తటస్థపడ్డారు నాకు. బహుశా ఇది కూడా నాప్రత్యేకతేనేమో. ఇంతకీ నేనేదో చాలా గొప్పదాన్ని, మీరందరూ నాకు మంగళారతులు పట్టాలి సదా అని కాదు. నాకు అదే అలవాటు అయిపోయిందీ, అంచేత నేను అలాగే జరుపుకుంటాను అంటున్నాను. అంతే.

పోతే, నేను ఎవరిని నువ్వు అనొచ్చు అన్నవిషయంలో కూడా జాగ్రత్తగానే ఉంటున్నాను. వారికి వారయి చెప్తే తప్ప స్వతంత్రించి నువ్వనను.

సూక్ష్మంగా నాపద్ధతి ఇది –
1. “నువ్వు” అనమని నాకంటె చిన్నవాళ్ళు అడిగితే సరేనంటాను.

2. నాకంటె చిన్నవారయినా విజ్ఞతలో విద్వత్తులో నన్ను మించినవారిని “నువ్వు” అనమన్నా అనలేను. జ్ఞానానికి విద్వత్తుకి ఇవ్వవలసిన గౌరవం ఇవ్వడం మన సంప్రదాయం.

3. “అమ్మా” అన్న పిలుపు మనసంప్రదాయంప్రకారం బాగుంది కానీ అక్క, చెల్లి, అన్న, తమ్ముడు వంటివి ఇప్పుడు కొత్తగా అలవాటు చేసుకోడం నాకు కష్టమే మరి.

4. అన్నిటికంటె ముఖ్యమైన సంగతి – చాట్ చెయ్యను. వ్యక్తిగతవిషయాలతో ప్రైవేటు మెసీజీలు పెడితే నాకు సమ్మతం కాదు.
ఏకవాక్యంలో నా స్నేహాలన్నీ సాహిత్యానికే పరిమితం.
000

(జూన్ 3, 2016)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

10 thoughts on “మనలో మనమాట 17 – నువ్వా? మీరా?”

 1. బాగుందండీ మాలతి గారూ

  ఓర్నీ ! దీని వెనుక యింత మేటరు ఉందా 🙂

  ఏరా ! నేనా ! నువ్వా
  పోరా ! హుర్రే ! జిలేబి పోకడ తెలిపెన్
  ఔరా మీరూ ఉండే
  వారే చిత్తూ రులోన ! వాహ్వా ! చీర్స్!

  మెచ్చుకోండి

 2. అలాగా. భూమి గుండ్రముగా నుండును అని పాత సంప్రదాయాలు ఈవిధంగా వెనక్కి వచ్చిన మామూలే. నేను వ్యాసంలో రాయడం మర్చిపోయేను మరోమాట. మనవాళ్లు అలవాటు చేసుకున్న అంకులులు, ఆంటులూ ఏదో ఇంగ్లీషుపద్ధతి అనుకుంటారు కానీ అమెరికాలో రక్తసంబంధీకులు కానివారిని అలా ఎవరూ పిలవరు. రక్తసంబంధీకులలో కూడా ఒక తరంలోనే. తరవాత – వేలు విడిచిన… – కజిను అనే వాడుక.

  మెచ్చుకోండి

 3. మనది కూడా సూక్ష్మంగా తమరి పద్ధతేనండీ.
  మరోమాట: భాషనిబట్టికూడా ఈసంబోధనలు మారుతాయి. అరవంలో ఆడవారిని, భార్యలనైనా ‘అమ్మా’ అనడం మామూలే. కాలాన్ననుసరించి కూడా. ఈమధ్య యూతు ఆడామగా ఒకర్నొకరు “ఒరే ఒసే” అనుకోడం మామూలైంది.

  మెచ్చుకోండి

 4. మీరు సూరకవిగారి చాటువుని ఉదహరించినందుకు సంతోషం. దానిగగురించి నేను ఇప్పుడు ఒక వ్యాఖ్య వ్రాయబోతే ఒక పెద్ద టపా ఐపోయింది. వివరంగా దాన్ని నా శ్యామలీయం బ్లాగులో చూడగలరు. చూడండి: అడిదం సూరకవి గురించి

  మెచ్చుకోండి

 5. మీ ఆలోచనల్లో మంచి క్లారిటీ ఉందండి. ఇలా ఉండాలి అని నిర్ణయించుకొని, అలానే జరుపుకోవటం కొద్ది మందికి మాత్రమే సాధ్యం. ఇక ఈ సంభోధనలు గురించి చెప్పాలంటే, మా నెల్లూరు లో కొద్దిగా ఏకవచన ప్రయోగమే ఎక్కువ. మా వైపు కూడా ఇలానే వరుసలు కలిపేస్తారు అతి సులువుగా. నాకెందుకో ఆ పధ్ధతి అలవాటు కాలేదు. ఇంట్లో మా అన్ననే అన్నా అని పిలవను .. 😀

  మెచ్చుకోండి

 6. మీరు సరిగా అర్థం చేేసుకున్నందుకు చాలా సంతోషం వనజగారూ. పిల్లికి గంట కట్టేదెవరనీ అందరూ ఊరుకుంటే ఇలాటి సున్నితవిషయాలు ఎప్పటిక తెలియవు. ఈరోజుల్లో ముఖ్యంగా నాగరీకంపేరుతో మూస మాటలకి అలవాటు పడిపోతున్నారు. మీకు గిట్టనివి, నాకు తెలీనివి కూడా చెప్తారని ఆశిస్తున్నాను.

  మెచ్చుకోండి

 7. నిర్మొహమాటంగా … మీకు నచ్చని విషయాన్ని, మీ ఇష్టాన్ని బాగా చెప్పారు. అందరూ ఇలా ఉండటమే శ్రేయస్కరం అని నేనూ అనుకుంటున్నాను. పెద్దలు మీరూ అనుభవంతో చెపుతున్నారు. అందుకు హృదయపూర్వక ధన్యవాదాలు మాలతీ గారూ !

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.