వినిపించని ధ్వనులు (కథ)

హారతి మేలుకుని కిటికీ ప్లాస్టిక్ బద్దల్లోంచి చారలు చారలుగా కనిపిస్తున్న ఆకాశం పరికించి చూసింది, ఓ ఈరాత్రి కూడా పోలేదన్నమాట.

మూడు ఇరవై. వాచీ చూడలేదు. చూడఖ్ఖర్లేదు.

 మొదట్లో చూసేది కానీ ఆ అవుసరం లేదని ఈమధ్యనే తెలిసిపోయింది. ప్రతిరోజూ అదే సమయానికి మెళుకువ వస్తుంది. “రాత్రి ప్రాణం పోలేదన్నమాట” అనుకుని అలవాటయిన స్తోత్రం స్మరించుకోడం మొదలు పెట్టింది. స్తోత్రం పూర్తి కాకముందే మళ్ళీ నిద్రలోకి జారుకుంటుందని తనకి తెలుసు. మళ్ళీ కళ్ళు తెరిచేసరికి ఐదు యాభైమూడు. ఇంత ఖచ్చితంగా టైము ఎలా కుదురుతోందో తెలీదు కానీ ప్రతిరోజూ ఇంతే. … చెప్పుకోదగ్గ విచిత్రాలేమీ లేవు. ప్రతి చర్యా లెక్కప్రకారం అతిమామూలుగా కొనసాగుతాయి.

మొహం కడుక్కున్నాక కాఫీ, బ్లాగు, ఉత్తరాలు, ముఖపుస్తకం వీటితో ఓ అరగంట

000

టీవీలో వార్త – క్లబ్బులో కాల్పులు, 50మంది మరణం, మరో యాభైమంది క్షతగాత్రులు. ఏ ఛానెల్ చూసినా అట్టుడికినట్టుడికిపోతోంది ఆ దౌర్జన్యకాండ వివరాలతో. హింసని కేంద్రం చేసుకుని తమఘనతని చాటుకుంటున్న అభ్యర్థుల ఓటి ప్రమాణాలూ హీనంగా నీచంగా హాస్యాస్పదంంగా ఉన్నాయి! ఇంతకుముందు ఎన్ని కాల్పులు జరగలేదు? ఎంతమంది ఎన్ని ప్రమాణాలు చెయ్యలేదు? ఎన్ని తరాలుగా ఎన్ని యుగాలుగా ఈ దారుణ మారణహోమాలు జరుగుతున్నాయో. నిరసనలు, ధర్మబోధలు, కొత్త చట్టాలు … ఏవీ నిజంగా మానవులలో మార్పు తెచ్చినట్టు కనిపించదు.

000

పక్కమీంచి లేవబోతే మోకాలు కలుక్కుమంది. ఇదేమిటి చెప్మా నిన్న బాగానే ఉంది కదా. నేను పడుకుని ఆ కాలుని అధికంగా కష్టపెట్టేనేమిటి!! రెణ్ణెల్లవుతుందనుకుంటా ఏపూట ఎక్కడ ఈ నొప్పి కనిపిస్తుందో తెలీడం లేదు.

నెలరోజులక్రితం ఇలాగే మోకాలునొప్పి అని క్లినిక్ ని పిలిస్తే, అర్జంటు కాదని పది రోజులతరవాత కానీ రమ్మంది డాక్టరమ్మ. ఆపూట మోకాలు నొప్పి లేదు.

“మరి నొప్పి లేకపోతే దేనికి మందివ్వను?” అనడిగింది ఆ కలికాలధన్వంతరి.

“ఇవాళ మోకాలు కాదు మణికట్టు నొప్పెడుతోంది. ఇదే చూడండి.”

“నేను మోకాలుడాక్టరుని, మోకాలు మాత్రమే చూసాను. మణికట్టుడాక్టరు వేరు. పేరిస్తాను. ఆవిడని చూడండి.”

మరో పది రోజులు పోయేక ..

“ఇవాళ మణికట్టు కాదు, మోచెయ్యి నొప్పిగా ఉంది. ఇదుగో, ఇక్కడ.”

“మోచెయ్యివైద్యుడు వేరే. పేరిస్తాను. పిలిచి చూడు.”

000

హారతి ఇంటికొచ్చేసింది మరే వైద్యవరులతోనూ ఏర్పాటూ చేసుకోకుండానే. మరి ఆ మోచేయిడాక్టరుని చూడడానికి వెళ్ళినరోజున మణికట్టు కాక మెడ నొప్పి కావచ్చు. ఇలా డాక్టరు తరవాత డాక్టరు నాలుగు స్తంభాలాట ఆడుకుంటూ పోతే ఇతర నొప్పులెలా ఉన్నా తలనొప్పి ఖాయం. అప్పుడింక తలనొప్పిడాక్టరుని వెతుక్కోవాలి! హాహా లేదులే. తలనొప్పికి డాక్టరెందుకూ, రెండు అలీవ్ మాత్రలు వేసుకుంటే సరి.

హారతి వంటగతి ప్రవేశించి, కిస్మిస్ పళ్ళు నానవేసిన నీళ్ళు తాగుతూ అత్తయ్యని మరోమారు తలుచుకుంది. ఇదెలా జరిగిందంచే నెలరోజులక్రితం రవలడ్డుకోసం కిస్మిస్ పళ్ళు కొంది. ఆతరవాత  మిగతావాటితో ఏం చెయ్యడమా అని ఆలోచిస్తుంటే అమ్మ చెప్పిన అత్తయ్యవైద్యం ఒకటి గుర్తొచ్చింది.

అత్తయ్య రెండోకొడుకుకి పుల్లల్లా కాళ్ళూ, గుమ్మడికాయలా పొట్టా – లివర్ కాబోలు. అత్తయ్య రాత్రి ఐదారు కి్స్మిస్ పళ్ళు నీళ్ళలో నానేసి ఆనీళ్ళు పొద్దున్న వాడిచేత తాగించేదిట. లివరవునో కాదో కానీ వాడు కోలుకున్నాడు. తరవాత యాభై ఏళ్ళు బతికేడు.

హారతి కూడా చూదాం అని నాలుగుపళ్ళు నీళ్లలో వేసి ఉదయం తాగితే  రోజూలా నీరసం లేదు ఆ పూట. అంత వెంటనే ఫలితం కనిపించడం భ్రమే కావచ్చు కానీ తనకి ఆ రోజు హాయిగా అనిపించడం నిజం. వారం రోజులవుతోంది. ఆ ద్రాక్షనీళ్ళతో బాగున్నట్టే ఉంటోంది. బహుశా ఆ ద్రాక్షనీళ్ళు  ద్రాక్షాసవంగా పరివర్తన చెందే స్థాయికి తొలిమెట్టేమో. అయితే మరి వైను తాగవచ్చునా? ఏమో తెలీదు. ఆ ప్రయోగం హారతి చేయదలుచుకోలేదు. మిత్రులెవరైనా చేయదలుచుకుంటే వాళ్ళిష్టం (చిరునవ్వుతో).

000

తాను నిలిచి కర్పూరహారతిలా నిలిచి వెలగాలని పెట్టేరుట ఆపేరు. తరిచి చూసుకుంటే ప్రస్తుతం తన జీవితం హారతికర్పూరంలా హరించిపోతున్నట్టుంది.

20 ఏళ్ళనించీ ఎదురు చూస్తోంది ఆ రోజుకోసం. రమ ఇప్పటికీ వెక్కిరిస్తూనే ఉంటుంది 60 దాటి బతకనన్నావు కదా అని. ఎందుకలా అనుకుందంటే తనజాతకంలో వాక్యాలు రెండు తనని అలా నమ్మేలా చేసేయి. అన్ని జాతకాలలోలాగ ఈ జాతకురాలికి గొప్ప యోగము గలదు అని రాయలేదు సిద్ధాంతిగారు. “ఈ జాతకురాలికి భుక్తికి లోపము ఉండదు” అని రాసేరు. అది సత్యమే అయింది. ఘనంగా చెప్పుకోగల మేడలూ, ఖరీదయిన కార్లూ లేకపోయినా దేహి అని ఎవర్నీ కాణీ అప్పు యాచించకుండా జరిగిపోతోంది. రెండోది “ఈజాతకురాలికి 60 సంవత్సరములకు తక్కువ చెప్పకూడదు” అన్నది. అదుగో అక్కడే మొదలయింది. ఆ తరవాత ఆలోచనలు అన్నీ అదే దారిలో నడిచేయి – తనవయసు మేనమామకూతురు – ఇద్దరూ కలిసి ఆడుకునేవారు చిన్నతనంలో – 60 దాటగానే హరీమంది. ఇహ నావంతు అనుకుంది హారతి అప్పుడే. క్రమంగా 61, 62, 63 … పోలేదు. అప్పుడే రమతో అంది ఏదో మాటల్లో. “రెండు దశాబ్దాలయినా ఇంకా ఉన్నావు రాయిలా,” అంటుంది వీలు దొరికినప్పుడల్లా. ఆ తరవాత అన్నయ్య ఏదో మాటలసందర్భంలో “మనవంశంలో ఎవరూ 80 దాటి బతకలేదు,” అన్నాడు. తరవాత ఇంట్లో ఒక్కొక్కళ్ళే పోతూంటే హారతి లెక్కలేసుకుంటూ చిదానందముద్ర పట్టి గమనించసాగింది. ప్రస్తుతం పోయినవాళ్ళ వయసులు – 64, 70, 78, 80కి వారం ఉందనగా, తరవాత 79. ఒక్కరూ 80వ పుట్టినరోజు చూడలేదు. ఎలా అనుకోడం తను 80లు చూస్తానని.

కానీ ఈవిషయం ఎవరితో గానీ మాటాడ్డం కష్టం. ఎందుకో చావుమాటెత్తితే ఝడుసుకుంటారు అందరూ! కానీ మృతియె లేకున్న రుచి ఏది బ్రతుకులోన అంటాడు గాలిబ్. రుచిమాటెలా ఉన్నా మృతి మాత్రం ప్రకృతి సహజం. చక్రవర్తులు, మహా కవులు, మహా యోగులు ఎవరు ఉండిపోయేరు కనక. అందరూ కొంతకాలం ఉండి తరవాత పోయినవారే.

కొంతవరకూ హారతి పుట్టి పెరిగిన వాతావరణం కూడా కావచ్చు. ఎప్పుడూ ఎవరికీ ఎదురు చెప్పలేదు. పెద్దలకి ఎదురు చెప్పకూడదు అన్నసంప్రదాయంలో పెరిగింది. తాతగారు మాటాడరు కానీ ఉరిమి చూస్తే చాలు చెట్టంత కొడుకులు తలొంచుకు నిలబడడమే కానీ నోరిప్పలేదు. అమ్మమ్మ కొంపలు ములిగిపోతున్నా పల్లెత్తి ఒక్క పలుకు లేదు. చిన్న కనిపించీ కనిపించని చిరునవ్వుతో తలూపడమే కానీ పెదమి కదిపి అలా కాదూ అనలేదు. అవునని కూడా అనలేదు. ఆవిడమనసులో ఏముందో ఆవిడని పుట్టించిన బ్రహ్మకి తప్ప ఎవరకీ తెలీదు.

000

హారతి లేచి నిత్యసంచారానికి బయల్దేరింది. వీధివార కాలిబాటమీద ఓ చిన్నపిల్లాడు ఓ వెదురుతట్టనిండుకు రంగుసుద్దలతో కూర్చుని సిమెంటుగచ్చుమీద లతలూ, చక్రాలూ, చదరాలూ గీస్తున్నాడు. వాడిఅమ్మా నాన్నా కాబోలు ఇద్దరు పెద్దలు కూడా యథాశక్తి తమ చిత్రకళ ప్రదర్శిస్తున్నారు ఆ సిమెంటుగచ్చుమీద.
DSC00461
హారతి ఆగి చిరునవ్వుతో వాళ్ళని చూస్తోంది. “ఏదైనా గియ్యి,” అన్నాడతను ఓ సుద్ద అందిస్తూ.

హారతి నవ్వి “ఏం గీయను?” అంటూనే ఆ సుద్దముక్క అందుకుని, “ఆహా ఇవాళ నాకు బహు సుందరం,” అని రాసి అతనివేపు చూసి, “సరేనా?” అంది.  అతను అటో చూపు విసిరి, మరో సుద్దముక్క ఇస్తూ, “ఏదైనా గీయి,” అన్నాడు.

తాను రాసింది అతనికి నచ్చలేదు కాబోలు. హారతి ఆ సుద్దముక్క తీసుకుని తనకి చేతనైన ఒకే ఒక బొమ్మ పద్మం గీసి అతనివేపుచూసింది. అప్పటికే అతను తాను గీస్తున్న గీతలతో చాలాదూరం వెళ్ళిపోయేడు. హారతి ఓ క్షణం ఆలోచించి చేతిలో మిగిలిన సుద్దముక్క అక్కడే పడేసి ముందుకు సాగిపోయింది.

మర్నాడు కెమెరా తీసుకుని వెళ్ళింది ఆ గచ్చుమీద చిత్రకళ బొమ్మ తీసుకోడానికి.

తాను రాసిన వాక్యం, గీసిన పద్మం కూడా తుడిచిపెట్టుకుపోయేయి. ఆమేర శుభ్రంగా కడిగేసి ఉంది. వాళ్ళు వేసుకున్న బొమ్మ మాత్రం ఉంది. హారతి అదే బొమ్మ తీసుకుని ముందుకి సాగింది.

హారతికి ఆ క్షణంలో హఠాత్తుగా మరొక వాస్తవం స్ఫురించింది.

000

నేనక్కడ ఏం రాసేను అన్నది ప్రధానం కాదేమో అతనికి. గీయి అన్నాడు కానీ నన్ను మెచ్చుకో నాబొమ్మ మెచ్చుకో అనలేదు. ఈ బొమ్మలు నీకు బాగున్నాయా, నేను అందంగా గీసేనా అనడగలేదు. నేనే అడిగేను నామాట నీకు నచ్చిందా అని. అలా అడగడంలో నామాటని నువ్వు మెచ్చుకోవాలి అన్న ఆశ లేదూ? హ్మ్. వాళ్ళు ఆ గీతలు సరదాకి గీస్తున్నారు. కాలక్షేపానికి గీస్తున్నారు. గీయడం గీయడం కోసమే. అంతే. గీతలవల్ల గలిగే ఆనందమే కానీ గీసింది అద్వితీయం, అద్భుతం అవునా కాదా అని కాదు. సిగ్గుచేటు కాదూ!

ఇంకా ఆలోచిస్తుంటే నారాతలద్వారా రోజూ ఆ ముఖపత్రంలో నేను చేస్తున్నదీ అంతేనేమో. ఏదో ఒకటి రాయడం, ఎవరేమన్నారు, ఎవరేమనుకుంటున్నారు, ఎంతమంది బాగుందన్నారు, ఎన్ని వేలిముద్రలు – ఇవన్నీ ఏమిటి? వీటిలో “నేను” అన్న అహమిక ఎంత బలంగా స్థగితమయి ఉంది?! ఎవరినో అనడం కాదు.

చూడు. ఏం చేస్తున్నావో … నీముఖపత్రం చూసుకున్నతరవాత మిగతా  ముఖపత్రాలు, అక్కడ ఓ వేలిముద్రో, మెప్పో గిలికి మరో కాయితానికి … తేలిగ్గా సాగిపోవడం వాలిగాలిలో కాయితప్పడవలా …

“…. గారు ఇక లేరు.”

“అయ్యో. అంతటి … మరొకరు లేరు. ,,, గారి సేవ అమోఘం. అద్వితీయం. వారి లేని లోటు ఎవరూ తీర్చలేరు …”

ఏమిటో ఈ సానుభూతి ప్రకటనలు. … చచ్చినవాడికళ్ళు చారెడన్నట్టు ఆ మనిషి ఎంత మంచివాడో ఎంత గొప్పవాడో తమకి ఎంత ఆప్తుడో … నమ్మాలనిపించదు. ఆ చెప్పేదేదో వాడు బతికుండగానే చెప్తే సంతోషించి ఉండేవాడు కదా. చెప్పేరేమోలే. చెప్పే ఉంటారు. కానీ ఇంత కొట్టొచ్చినట్టు కనిపించదు. హా, అందరికీ ఇలాగే చెప్తారు అనుకని ఊరుకుంటారు.

ఆ వెంటనే, “ఆహా, భలే జోకు.”

తరవాతిపేజీ, “అబ్భ, ఎంత చక్కగా ఉంది.”

మరో పేజీ, …

తరవాతి క్షణం, “అబ్భ, అద్భుతమైన కవిత. మీరు తప్ప మరొకరు ఇలా రాయలేరు.”

…జాలం, జీవితం … ఎక్కడయినా అంతే. క్షణం తరవాత క్షణం. దినం తరవాత దినం, సన్నివేశం తరవాత సన్నివేశం, సంఘటన తరవాత సంఘటన, ఒక పని తరవాత మరో పని, ఒక ఆలోచన తరవాత మరో ఆలోచన …

చావుపుట్టుకలు కూడా అంతే. చావు బతుకులో భాగం నిశ్శబ్దంలో ముప్పేటగా అల్లుకుపోయిన శబ్దాలలాగే. వాటిని విడదీయలేం. బతుకుభయమూ లేదు. మృత్యుభయమూ లేదు. బతుకుతున్నందుకు విచారం లేనట్టే చావంటే కూడా విచారం ఉండకూడదు.

వ్రాత వ్రాసెడు హస్తమ్ము వ్రాసి

కదలి వ్రాయుచును పోవుచుండ

ఆ వ్రాతలోని పంక్తి సగమైన

మరి రద్దు పరచలేవు

000

హారతి పక్కమీద వాలింది ఆలోచిస్తూ. ఈ రాత్రి గడిచేక రేపు లేస్తానో లేవనో తెల్లవారి లేచినప్పుడు తెలుస్తుంది. లేవకపోతే మరో అధ్యాయం.

000

(జూన్ 15, 2016)

 

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

6 thoughts on “వినిపించని ధ్వనులు (కథ)”

  1. అచ్చు పత్రికలలో ఉండదు కానీ బ్లాగులో ఉంటుంది తప్పకుండాను. సరి చేసుకోడంమాటే కాక మీ పొలిక కూడా బాగుంది కనక ఇది కూడా ఉంచుతున్నాను. ధన్యవాదాలు వనజగారూ.

    మెచ్చుకోండి

  2. *నిశ్చల తటాకంలా కొద్ది సేపు.. అని చదువుకోవాలని మనవి . ఎవరైనా రేపటికి ఉంటే నిన్నటి తప్పిదాన్ని సరిచేసుకునే అవకాశం ఉంటుందేమో ..ఇలాగే !

    మెచ్చుకోండి

  3. సత్య సందర్శన … నిశ్చల తాటాకంలా కొద్దిసేపు . వ్యాఖ్య వ్రాయాలన్న ఆలోచన రాయి వచ్చిపడ్డాక .. ఇంతే కదూ మరణం అంటే !

    మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s