మనలో మనమాట 18 – అతిథులే ఆచార్యులు

మనవాళ్ళు అతిథి దేవో భవ అంటారు. ఆచార్య దేవో భవ అంటారు. మరి గణితంలో చూస్తే, ఒక వస్తువు మరో రెండు వస్తువులకి విడివిడిగా సమానం అయితే, ఆ రెండు వస్తువులూ కూడా ఒకదానికొకటి సమానం అని కదా సిద్ధాంతం.

ఆ లెక్కన అన్నమాట అతిథి దేవుడితో సమానం అయితేనూ, ఆచార్యుడు దేవుడితో సమానం అయితేనూ, అతిథి ఆచార్యుడితో సమానం అని.
ఇప్పటికి చాలామార్లే చెప్పి ఉంటాను మాయింటికి వచ్చేవాళ్లు తక్కువని. అంచేత నాకు అతిథిమర్యాదలు అట్టే పట్టుబడలేదు. అంటే ఇష్టం లేదని కాదు. చెయ్యాలనే ఉంటుంది. చాలా తాపత్రయపడతాను కూడా. ఎవరేనా ఓ పూట, ఓ గంటసేపే అయినా వస్తారంటే, నేనేం చెయ్యాలి వారిని సంతోషపెట్టడానికి అని మూణ్ణెల్ల ముందునించీ ఆలోచిస్తాను. అదేలెండి మూణ్ణెల్లముందే వారు వస్తున్నారని తెలిస్తే. లేకపోతే, వారు వస్తున్నాం అని చెప్పినదగ్గర్నుంచీను.

ఇద్దరు ముగ్గురున్నారు అలాటి స్నేహితులు నాకు. ఇంటిముందునించో వీధిచివర్నుంచో, “ఎక్కడికో వెళ్ళి వస్తున్నాం. మీయింటిదగ్గర ఆగి రెండు నిముషాలు నిన్ను చూడ్డానికొస్తున్నాం,” అని చెప్తారు. వీరు అభ్యాగతులు. వారికి నేను చెయ్యగలిగేదేమీ ఉండదు సాధారణంగా. నాలుగైదుమాట్లు చెప్పేను, “మాయింటికే అని కాకపోయినా ఇటు వస్తున్నారని మీకు ముందే తెలుసు కదా. అది నిర్ణయించుకున్నప్పుడు కాకపోతే కనీసం మీ ఉళ్ళో బయల్దేరుతూ ఓమాట నాచెవిని వేయవచ్చు కదా, నాకు కొంత వెసులుబాటు ఉంటుంది,” అని.

నేను ఎన్నిమార్లు చెప్పేనో అన్నిమాట్లూ వాళ్లు, “అయితే ఏం అయిపోయిందిలెద్దూ, నువ్వేదో మాకోసం చెయ్యాలని కాదు కదా మీయింటికొచ్చేది,” అంటారు. “చారూ అన్నం పెట్టినా చాలు,” అని కూడా నన్ను ఓదారుస్తారు. ఆమాట అనడానికి బాగానే ఉంది కానీ మనకలా ఉండదు కదా. అదే మాట నేను వాళ్లింటికెళ్ళినప్పుడు అంటే చెల్లదు. కుర్చీకి నన్ను కట్టేయరు కానీ అంతపని చేసి అప్పటికప్పుడు రెండో మూడో కూరలూ పచ్చళ్ళూ చేసి, తినేవరకు వదల్రు.

అసలు విషయం – నాలాటి అక్కుపక్షులు అంటే నాలుగు మెతుకులు ఉడకేసుకు ఏ గోంగూర పచ్చడితోనో గడిపేసే రకాలకి ఫ్రిజునిండా దట్టించి పెట్టిన ప్లాస్టిక్ డబ్బాలలో కూరలూ నారలూ ఉండవు. మరి ఎంతో దూరంనించి ఎన్నో ఏళ్ళతరవాత ఇంటికొచ్చినవారికి కొంతలో కొంతైనా, నా శక్తికొలదీ చెయ్యాలనే ఉంటుంది కదా.

మరో బాధ కూడా ఉంది. లేడికి లేచిందే ప్రయాణం అన్న సూక్తి అక్షరసత్యం నాపట్ల. ఏదో పని చేసుకుంటూనో చేసుకోకుండానో అలా తిరిగొద్దాం అనిపిస్తే ఠపీమని లేచి వీధిలోకి వెళ్ళిపోతాను. అంటే వాళ్ళు ముందు చెప్పకపోతే వాళ్ళు వచ్చేవేళకి నేను ఇంట్లో ఉండే అవకాశం లేకపోవచ్చు కూడాను. అలా కాక ఊళ్లోకొచ్చి మరెవరింట్లోనో భోజనాలూ మంతనాలూ ముగించుకుని, వెనక్కి వెళ్ళబోతూ నన్ను పిలిచేం అంటే, “మేం పిలిచేం మీరింట్లో లేరుష అంటే అది కేవలం “మేం పిలిచేం, నువ్వు ఇంట్లో లేవు,” అని చెప్పుకోడానికి మాత్రమే పనికొస్తుంది. నేను దాన్ని మొక్కుబడి చర్య అనే అంటాను.

మొత్తమ్మీద అతిథులు మాయింటికి రావడం జరుగుతుందనుకుందాం కథ కొనసాగాలి కనక –

నేను లంచి అంటాను కానీ వాళ్ళు మొహమాటపడుతూ, “లంచీ కంచీ ఎందుకులెద్దూ, ఊరికే వస్తాం, కొంచెంసేపు కూచుని కులాసాగా కబుర్లు చెప్పుకుందాం,” అంటారు. ఎన్నో ఏళ్లగా తెలిసినవాళ్ళు కనక నేను కూడా అట్టే పట్టు పట్టకుండా, అలాగే, “నీకు ఎలా ఇష్టమయితే అలాగే చేద్దాం,” అంటాను.

అలాటి శుభముహూర్తంలోనే నాకు మరోసంగతి గుర్తొస్తుంది. ఎన్నో ఏళ్ళకిందట వారింంట్లో ఉల్లిపాయ పకోడీలో, మిరపకాయ బజ్జీలో చేస్తే మహ ఇష్టంగా తిని ఉంటాను. అంచేత హడావుడిగా వంటింట్లో ఏం ఉన్నాయో చూసుకుని, గ్రహములన్నీ అనుకూలంగా ఉండి, బజ్జీలు చేయగల మిరపకాయలు కనిపిస్తాయి. ఆహా, నాభాగ్యము అనుకుని “వస్తాం అని చెప్పేసి మాయింటిముందు ప్రత్యక్షమయిన అతిధులకోసం” మిరపకాయబజ్జీలు చేసేస్తాను. టీ తాగుతారో, కాఫీ తాగుతారో మర్చిపోయి ఉంటాను. రెంటికీ వీలుగా నీళ్లూ, పొళ్ళూ సిద్దం చేసి ఉంచుతాను. మిరపకాయ బజ్జీలు కాకపోతే కాకరకాయ కూర అనుకోండి లంచి కుదిరితే. ఏదో ఒకటి – ఇలా హడావుడి పడిపోవడం జరగడం నిశ్చయం.

తెలుగుదేశంలో కొంతకాలం గడిపిన ఒక అమెరికను ప్రొఫెసరు నాతో అన్నారు, “కనిపించిన ప్రతివారూ మాయింటికి రా మాయింటికి రా అని పిలిచేస్తారు. నాకు వీలు కాదంటే ఊరుకోరు. కాదూ కూడదూ తప్పకుండా వచ్చి తీరాలి, ఒక్క ఐదు నిముషాలు అలా వచ్చి పొండి. తెలుగు భోజనం తినకుండా వెళ్ళడానికి వీల్లేదు … అలా సరే వస్తా అనేవరకూ వదల్రు. తీరా వెళ్తే వస్తారనుకోలేదన్నట్టు చూస్తారు,” అన్నారు.

మనం అతిథిమర్యాదలపేరున బలవంతం చేసేతీరు అనుభవైకవేద్యం. ఈమధ్య ఇది అంతగా కనిపించడంలేదు. అవతలివారు వద్దు అన్నా వీల్లేదన్నా సరేనని ఊరుకుంటున్నారు.

నేను ఇండియాలో ఉన్న రోజుల్లో అంటే 40 ఏళ్ళక్రితం ఈ మర్యాద ఇంకా ఉంది. ఓసారి ఒక ప్రొఫెసరుగారు భోజనానికి పిలిచేరు. నేను సందేహిస్తూనే వెళ్ళేను. ఆయన ధర్మపత్ని కాస్త పాతకాలపు ఆచారాలు తెలిసినమనిషి. నేనేమో అట్టే తినగలమనిషిని కాను. ఆవిడ ఒక్కటేస్తాను ఒక్కటేస్తాను – అమ్మ పెట్టే రెండూ కాదు, గారెలే – అంటూ వడ్డించేస్తుంటే నాకు నానావస్థా అయింది. నాముందున్న అరిటాకుమీదకి వంగి రెండు చేతులూ అడ్డం పెట్టి, నేనింక తినలేనండి దాదాపు కళ్ళనీళ్ళతో విన్నవించుకోవలసి వచ్చింది. ఆవిడకి మాత్రం నాపద్ధతి నచ్చలేదు. చిరాకు ఏమాత్రం దాచుకోకుండా, “మొండితనం,” అంది. ఆమాట నాకూ నచ్చలేదు. ఆవిడది మాత్రం మొండితనం కాదూ?

ఇంతకీ వెనకటి కత – నేను వీలయినంతలో ఏవో చేసేసి, మూడుగంటలకి వస్తాం అన్నవారికోసం ఒంటిగంటనించీ ఎదురు చూస్తూంటాను. వాళ్లు మధ్యాన్నం లంచికీ సాయంత్రం భోజనానికీ కాకుండా మధ్యస్థంగా నాలుగున్నరకి తేల్తారు. దారిలో ఇంకెక్కడికో వెళ్ళి మరేవో పనులు చూసుకుని, ఇంకెవరింట్లోనో లంచి తిని … అలా అలా సాగుతూ ఆఖరికి మాముంగిట తేలేరన్నమాట.
నేను చేసినవి చప్పగా చల్లారిపోతాయి. లేకపోతే, అతిథులు కారం తినడం మానేసి ఉంటారు. లేదా, లంచి ఆలస్యంగా తినడంచేత జీలకర్ర పోచకైనా చోటు లేదు కుక్షిలో అంటారు. ఆ తరవాత హాయిగా కబుర్లు మొదలవుతాయి. నేనెలా ఉన్నాను, వాళ్లెలా ఉన్నారు … మీ అబ్బాయి, మాఅమ్మాయి, మా అల్లుడు, మీ అమ్మాయి, మాకోడలు, మీ మనవడు … తరవాత ఇక్కడ చలి, అక్కడ ఎండలు, ఇక్కడ నాయకులు, అక్కడ వినాయకులు, ఇప్పటి కతలు, వెనకటి వ్యతలు… గంటన్నర గడిచిపోతుంది. మళ్లీ మరో చుట్టు మీ అమ్మాయేం చేస్తోంది, మాఅబ్బాయి … గా ఉన్నాడు, మీ అమ్మాయి … మరో పది నిముషాలు, అన్నట్టు సూపర్ బౌలు మీరు చూడరా? ఆఁ? మీరు చూస్తారా, టీవి పెడతాను, … కొంచెం సౌండు పెంచండి, … ఆఁ … ఏమిటీ … వినపడ్డంలేదు, టీవీగోలలో … అలా నాస్వరమూ, టీవీ స్వరమూ పెంచుకుంటూ పోతాం ఓ మరో గంటసేపు. నాకు నోరు నొప్పెట్టి, వారినో ప్రశ్న అడిగి ఊరుకుంటాను. ఒకొకప్పుడు ఆ ఒక్క ప్రశ్నకి సమాధానం ముప్పావుగంట సాగదీయబడుతుంది. … మీరు కథలు రాస్తున్నారా? … ఏదో గిలుకుతుంటా … ఇండియాలో పత్రికలకి పంపిస్తారా? … లేదు, ఈమధ్య నేను ఎక్కడికీ పంపడంలేదు. …

ఇలా మరో గంట గడిచేక, ఇంక వెళ్తాం అంటారు. అప్పటికి భోజనాల వేళ. అంచేత ఉండండి. ఎలాగా భోజనాలవేళ అయింది కదా. తిని వెళ్దురు గాని అంటాను.

లేదంలే, రాజుగారింటికొస్తాం అని చెప్పేం. ఓమాటు అటు తొంగిచూసి వెళ్ళిపోతాం. మళ్ళీ ఆలస్యం అయితే రోడ్డుమీద రద్దీ, కష్టం, మరోసారి వస్తాంలే అంటూ లేస్తారు.

వాళ్ళు వెళ్ళేక, అదేమిటి, ముప్ఫైయేళ్ళగా తెలుసంటున్నావు, మరి ఇప్పుడు కొత్తగా అడుగుతారేమిటి కతలు రాస్తున్నావా అని? అంటుంది అంతసేపూ మొత్తం నాటకం తిలకిస్తున్న మాపొరుగు అమ్మాయి..
వాళ్ళని సాగనంపి, టీవీ కట్టేసి, అదంతేలే … ఏదో ఒకటి మాటాడాలి కదా … వాళ్ళకీ నాకూ కూడా కావలిసింది పొద్దు గడవడమే కదా అంటాను తగ్గుస్వరంలో.

మరో తరగతి నాకతలు చదివినవారు. కథలు చదివేం అన్నారు కనక మిమ్మల్ని చూడాలనుకుంటున్నాం అంటే కథలగురించి మాటాడుతారనుకుంటాను. పోనీ నావి కాకపోతే తమకి నచ్చిన మరో రచయితకథలు. తీరా వచ్చేక మాటలెలా ఉంటాయో వేరే టపాలో రాసేను. పిల్లలు ఉన్నవాళ్ళయితే వాళ్ళని తీసుకొస్తారు. దురదృష్టవశాత్తూ మాయిల్లు పిల్లలవినోదాలకి అనువైనది కాకపోవడంచేత మరింత ఇరకాటం అవుతుంది. వాళ్ళకి ఏవో తాత్కాలిక కాలక్షేపం కల్పించడం, వాళ్లగురించి మాటాడడంతో సరిపోతుంది. నేననుకున్నట్టు సాహిత్యం కబుర్లేం ఉండవు. ఇది నాకు కొత్తే మరి. నామటుకు నేను రచయితలుగా మాత్రమే పరిచయమైనవారిని కలుసుకున్నప్పుడు వాళ్ళింటి కబుర్లూ మాయింంటి కబుర్లూ మాటాడుకోలేదు.

మీరనొచ్చు మామూలుగా అందరూ ఎల్లవేళలా సాహిత్యమే మాటాడరు. తెలుగువాళ్ళం ఏవో కబుర్లు చెప్పుకోడం మామూలే అని. నిజమే. నాకు మాత్రం కొరతగానే ఉంటుంది. ఏం చెయ్యను? నాకు అలా ఉండదు మరి.

ఇంతగా ఇదంతా ఎందుకు రాస్తున్నానంటే ఏడాది క్రితం ఒకావిడ నాబ్లాగు చూస్తుంటాననీ మిమ్మల్ని కలుసుకోవాలని ఉందనీ అంటే సరే అన్నాను. పైన చెప్పినట్టే నేను కథలగురించి మాటాడాతారనుకోడం, అలా జరక్కపోవడం జరిగింది. ఆ తరవాత నేను ఓ మెయిలిచ్చేను కానీ ఏ జవాబూ లేదు. ఇప్పుడు, ఇంతకాలం అయేక, మొన్న ఆవిడదగ్గర్నుంచి నాకు మెయిలొచ్చింది చాలాకాలం అయింది కలిసి మళ్ళీ కలుద్దాం అని.

నాకు చెప్పలేనంత ఆశ్చర్యం కలిగింది. ఆనాడు పిల్లలతోనే గడిచింది కానీ ఆహా మంచి చర్చ జరిగింది అని కానీ కొత్త విషయాలు తెలుసుకున్నాను అని చెప్పుకోడానికేమీ లేవు. ఇప్పుడు మళ్ళీ కలవాలనుందంటే ఏమనుకోవాలో తెలీడం లేదు. అసలు ఈవిడొక్కరే కాదులే. ఇంకా కొందరున్నారు. వారు చెప్పాలనుకున్నది చెప్పాలనిపించినప్పుడు చెప్పడమే కానీ నేను మెయిలిస్తే పలకనివాళ్ళు. ఇది కూడా ఒక్క నాజాతకంలోనే ఉందేమో తెలీదు.

“ఔతే అతిదులు ఆసార్లెట్ల ఔతారు?”

ఉలిక్కిపడి అటు చూసి, “వచ్చేవూ. మరో అతిథి కానీ అతిథివి. చెప్పా పెట్టకుండా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తావు,” అన్నాను రవంత చిరాకుతో.

“అస్లు నీకతేంటో అజా పజా తేల్చీదాం అనొచీను.”

“ఏముంది తేల్చడానికి?”

“నివ్ ఏటి సేస్తన్నవో గమనం సేసుకున్నవ అని అడగతన్న. నీకు ఇచ్చకాలు నచ్చవంతవు. మరి నీముకసేయితల్తో నివ్ సెప్పుకునే ఊసులన్నీ ఏటి? ఆమీన అంతా నీయిస్టంవే అంటవు. నీకు కావాల్చినట్టే అంత సాగాలంటవు. నివ్వు ఏరంటవు. నీకేంవి తోస్తే అదే యేదం అంటవు.”

నాకు మహా చిరాకేసింది ఆ వరస చూస్తుంటే.

“అదేం కాదు. నేను మిగతావాళ్ళమాటలు కూడా వింటున్నాను,” అన్నాను చిరాకు నణుచుకుంటూ.
“ఆరిమాట నీకు నచ్చితేనే గద. నానడగతన్నది నీవు ఆడ రాసీయన్నీ పెపంచకాన్ని ఉద్దరింసీయేనేటి అని అడగతన్న,” అంది సంద్రాలు మరింత రెచ్చిపోతూ.

“అదేదో ఐదు నిముషాలు కాలక్షేపానికి. నేనెవరింటికీ వెళ్ళలేదు కదా.”

సంద్రాలు గుర్రుగా నావేపు చూసింది.

“ఇంతకీ ఏమంటావు?”

“నానంటన్నది సంగంవంటె ఏటి అని నివ్ సూస్కోనం నేదు. కతలు సదూతవు. టీవీలో నాటకాలు సూస్తవు. అయన్నీ ఏటి? యేరే మడుసులు, ఆల్ల కస్టంవూ సుకంవూ, మంచీ సెబ్బరా కావా? అయన్నీ నీకు బాగనె ఉన్నయి గద. అందుసేత నీయింటికొచ్చీవోరూ అంతే. మంచి సెబ్బర మాటాడతరు. అస్లు నీకు స్నేయితం బుద్ది నేదు. ఎవురన్న బయం నేదు. ఎవురికీ జవాబు సెప్పుకోను అంట సొద ఎడతవు. నాకేటి అనిపిస్తన్నదొ తెల్స. సూడంగ సూడంగ నివ్వు ఆ పబిలికనాయననాగే మాటాడతన్నవు. నీకూ రంపరికం వచ్చేసినాది.”

హా?! తుళ్ళిపడ్డాను. ట్రంపరికం, ట్రంప్ కళలు, నాకొచ్చేసేయంటోంది సంద్రాలు.

అయ్యో భగవంతుడా! అని తల పట్టుక్కూచున్నాను. ఇంత బతుకూ బతికి ఆఖరికి ఆఖరికి ఇలా తయారయేనా?

000

(జూన్ 23, 2016)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

4 thoughts on “మనలో మనమాట 18 – అతిథులే ఆచార్యులు”

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.