బాల్యం – 1

  పిల్లలచదువులగురించి పెద్దలు పడే ఆరాటం కథలు చాలానే వచ్చేయి. ఆ సందర్భంలో  పిల్లలమనసులు ఆవిష్కరించడానికి చేసిన యత్నం ఇది. 60వ దశకంలో నవల రాయాలని మొదలు పెట్టినట్టున్నాను. మొదటి అధ్యాయంతోనే ఆగిపోయింది. ఇప్పుడు పూర్తి చేసే ఓపిక లేదు. అంచేత ముగింపు ఇచ్చేసి చిన్నకథగా (2 భాగాలు) ప్రచురిస్తున్నాను. ఈ కథలో వాతావరణం ఆనాటిదిగా గ్రహించగలరు. 

000

మాలిగుడిసెముందు కోడి చుట్టూ ఓమారు చూసి “తెల్లారిందని వీళ్ళకి చెప్పాలి” అనుకుంది. 

“అప్పుడే తెల్లారిపోయిందా. ఈరోజైనా జీతండబ్బులిస్తారో లేదో,” అనుకుంటున్నాడు మాలి పక్కమీంచి లేస్తూ.

“ఉఁహుఁ. ఇంకా తెల్లారలేదు. ఇంకొంచెంసేపు పడుకోవచ్చు,” అనుకుంటున్నాడు రాముడు కళ్ళు గట్టిగా మూసుకుని.

“లే, లే. బల్లోకెల్లవేటి?” అంటూ గట్టిగానే కసిరింది సీత తమ్ముణ్ణిగురించి. అలా అనడంలో “నువ్వు బడికెళ్ళొచ్చు,” అన్న అక్కసుంది. “నన్నెల్లొద్దన్నాడు అయ్య” అన్న నొప్పి ఉంది.

అదే సమయంలో “కన్నా, లేవవే. తెల్లారిపోయింది,” అంటూ ముద్దుముద్దుగా కృష్ణ  అను నామధేయం గల కూతుర్ని సరోజమ్మ లేపడానికి ప్రయత్నిస్తోంది.

“ఎందుకు తెల్లవారిపోయింది?” అని ప్రశ్నిస్తోంది కన్నా కళ్ళు తెరవకుండానే.

రెండిళ్ళవతల “ఇంక లేచి స్నానం చెయ్యి బాబూ,” అంటూ రామనాథంగారు అప్పటికే చాలాసేపట్నుంచి చదువుకుంటూ కూర్చున్న కొడుకు మనోహర్ని హెచ్చరించేరు.

అప్పటివరకు కలుగులో ఎలుకలా తూర్పున దిగంతాల్లోంచి తొంగి చూస్తున్న కర్మసాక్షి మొహమాటం వదిలి కొంచెం పైకి లేచేడు.

కన్నా ముచ్చటగా ముస్తాబయింది. ఉగాదికి కుట్టించుకున్న కొత్త పువ్వులపరికిణీ కట్టుకుంది. ఊదారంగు సాదా జాకట్టు వేసుకుంది. రెండు జడలు వేసుకుంది. ఓ జడలో నాజూగ్గా మల్లెచెండు ఓ చివర దోపింది. కన్నుల కాటుక దిద్దింది.  ఊదారంగు బొట్టు గుండ్రంగా దిద్దింది.

“వెళ్తున్నానమ్మా,” అని చెప్పడానికొచ్చిన కూతుర్ని చూస్తూ సరోజమ్మ, “దీనికి ఓణీలు కొనాలి,” అనుకుంది.

తల్లి  దేన్నిగురించి ఆలోచిస్తోందో, తనకెందుకు జవాబివ్వలేదో గమనించకుండానే కన్నా ఛెంగున గెంతి పరుగెట్టుకు వెళ్ళిపోయింది. అలా పరుగెత్తి ఎంతో దూరం వెళ్ళలేదు. గేటుదగ్గర నిలబడి సితకోసం చూస్తోంది. సీత ఎంతకీ రానందువల్ల విసుగేసి రోడ్ మధ్యకి వెళ్ళి నిలబడి కనిపించినంత మేరా చూసింది. కానీ సీత కనిపించలేదు. విసుక్కుంటూ చిరాకు పడుతూ రోడ్ చివరికి వెళ్ళి చూసింది. గబగబ నడిచి మనోహర్ ఇంటివరకూ వచ్చింది. వాడు అప్పుడే బయల్దేరుతున్నాడు.

“సీత రాలేదా?” అనడిగేడు కృష్ణని చూసి.

“ప్చ్. ఇంతవరకూ చూసి వచ్చేసేను.” ఇద్దరూ కలిసి సీతఇంటికి వెళ్ళబోతుండగా రాముడు వచ్చేడు.

“ఏరా, సీతేదీ?” కృష్ణ అడిగింది.

“రాదు. మాఅయ్య నన్నెల్లమన్నాడు,” అన్నాడు రాముడు.

“ఎందుకు రాదూ?”

“ఆడగుంటలకి సదుగెందుకు. సదిగింది సాల్లే. నివ్వెల్లు అంటన్నడు.”

“ఆడగుంటలయితె అక్షరాలు కొంకరగా కనిపిస్తాయేంటి? ఎవరు చదివినా క క లాగే కనిపిస్తుందా మరోలా కనిపిస్తుందా? ఆడి తప్పరాదు అంటే అది ఆడపిల్లల్లకి వేరుగా ఉంటుందేమిటి?” కృష్ణ విసుగ్గా అంది.

“ఏటో మరి,” అన్నాడు రాముడు. వాడిక్కూడా సీత బడికి వస్తేనే బాగుణ్ణని ఉంది.

రాముడు వాళ్ళల్లోకి చిన్నవాడు. ఈ యేడే ఫస్టుఫారంలోకి వచ్చేడు. మనూ, కృష్ణ third formలోకి వచ్చేరు. సీత స్కూలికి వస్తే అది కూడా third formలో ఉండేదే. వాళ్ళిద్దరూ క్లాసులోకి వెళ్తుంటే సీత ఇంట్లో కూర్చోడం వాడికి నచ్చలేదు. ఏం? సీత వాళ్ళకంటే ఏం తీసిపోయింది? సీతని తల్చుకుంటే వాడికి జాలేసింది.

“పోనీ, నేనెల్లి పిల్చుకొచ్చీసీదా?” వాడికి తోచిన ఒకే ఒక ఉపాయం అదీ.

“పిల్చుకొచ్చీ,” అంది కృష్ణ.

“అదెలాగ? మీనాన్న పుస్తకాలకీ, జీతానికీ డబ్బియ్యడు. అల్లరవుతుంది. Attendance registerలో పేరు లేకపోతే మేష్టరు క్లాసులోకి రానియ్యడు,” మనూ కష్టాలెకరువు పెట్టేడు.

“స్కూలికి టైమయిపోతూంది,” రాముడికి హఠాత్తుగా తన కొత్త క్లాసు గుర్తొచ్చింది. ముగ్గురూ స్కూలికి బయల్దేరేరు.

రాముడు అక్కసంగతి మర్చిపోయేడు కానీ కృష్ణకీ మనూకి బాగులేదు. సీత  వచ్చి ఉంటేనే బాగుండు అనిపిస్తోంది. స్కూల్లో కూడా వాళ్లిద్దరికీ మోచేతిదగ్గర ఎవరో మిస్సయినట్టే అనిపిస్తూనే ఉంది. పిల్లలందరూ సీతేదీ అనో అలా ఉన్నావేం అనో అడుగుతూనే ఉన్నారు కృష్ణని. మనూ పిల్లలతో కలిసిపోయేడు కానీ కృష్ణకే మరీ కష్టంగా ఉంది.

సీత లేకుండా మిగతావాళ్ళతో ఆడాలనిపించడం లేదు. ఆఖరికి మాష్టారు కూడా అడిగేరు సీత రాలేదేం అని. అది తెలివైనది అని కాదు కానీ దానిమనసు మంచిది. ఎవరికి ఏం కావాలన్నా అది ప్రత్యక్షమవుతూంటుంది. అమెరికావాళ్ళలా కాకుండా ఆంధ్రా సితమ్మలా ప్రవర్తిస్తుంది. (1). సీత పక్కనుంటే కృష్ణని ఎవరూ పలకరించరు. కానీ సీత తనని చెయ్యి పుచ్చుకు లాక్కుపోతుంది. అందరూ సీతచుట్టూ తిరిగితే సిత తనచుట్టూ తిరుగుతుంది. అది తనకి గర్వకారణం. ఈ కారణాలచేత కృష్ణప్రియకి ఎంత కోపం రావాలో అంత కోపం వచ్చింది తనతో చెప్పకుండా ఆగిపోయినందుకు సీతమీదా, తనని అడక్కుండా మాలి సీతని మానిపించేసినందుకు మాలిమీదాను.

సాయంత్రం సరాసరి సీతఇంటికి వెళ్ళింది. సిత కోడిపిల్లల్ని బుట్టకింద పెడుతోంది.

“ఏం చేస్తున్నావే?” కృష్ణప్రియ కోపంగా అడిగింది.

కృష్ణని చూడగానే సితకి సంతోషంవేసింది. “నువ్వొచ్చేవే,” అని పలకరించింది. “వెంకటలక్ష్మి, రాజ్యం, సుందరి, రమణ అందరూ వచ్చేరా క్లాసుకి? క్లాసులో ఏంటి చెప్పేరు?” అంటూ స్కూలు విశేషాలు అడిగింది.

కృష్ణప్రియకి ఈ ప్రశ్నలు వింటుంటే ఇంకా కోపం వచ్చింది. “ఆఁ అందరూ వచ్చేరు. నువ్వెందుకు రాలేదూ?”

స్నేహితురాలిని చూస్తుంటే సీతకి నవ్వొచ్చింది. “సత్తెబామలాగున్నావే,” అంది నవ్వుతూనే.

“నేనెలాగున్నాననని నిన్నెవరూ అడగలేదు. నువ్వెందుకు రాలేదని అడుగుతున్నాను. అందరూ నన్నడగడఁవే సీతేదీ, సీతేదీ అంటూ. జవాబు చెప్పలేక చచ్చేను. ఆఖరికి మాష్టారు కూడా అడిగేరు.”

అందరూ తనగురించి అడిగేరు అని తెలియగానే సీతగుండెలు అవ్యక్తానందంతోనో మరి దేనితోనో వేగంగా కొట్టుకున్నాయి.

“రాముడు చెప్పలేదూ? అయ్యెల్లొద్దన్నాడు,” సీత నిదానంగా జవాబు చెప్పింది.

“చెప్పాడు. కానీ నువ్వెంందుకొప్పుకున్నావు? ఏడీ? మీనాన్న ఎక్కడ? నేనడుగుతాను ఎందుకు మానిపించీసేడో?”

సీత ప్రేమగా కృష్ణప్రియభుజంమీద చెయ్యేసి, నులకమంచందగ్గరికి తీసుకెళ్ళింది. వాళ్ళిద్దరూ ఒక వయసువాళ్ళే అయినా సితకున్న ప్రపంచజ్ఞానం కృష్ణకి లేదు. ఆ సంగతి సీతకే బాగా తెలుసు. అందుకే కృష్ణని స్నేహితురాలిలా కాక చీకట్లో పెరట్లోకి వెళ్ళడానికి భయపడే చిట్టి చెల్లెలులా చూసుకుంటుంది.

“అది కాదే. స్కూలికొచ్చి సదివితేనే సదువేటి? నువ్వు  సదూకునొచ్చి నాకు సెప్పు,” అంది.

“నేం చెప్పను. అసలు నువ్వెందుకు మానీయాలీ?” చిల్లు పడ్డ గ్రాంఫోను రికార్డులా అదే మాట పదే పదే అడుగుతుంటే ఏం చెప్పాలో సీతకి తెలీలేదు.

“ఇస్కూలంటే మాటలేటి? జీతం నేదంటరు గానీ ఏవో స్పెసలు ఫీజులనీ సందాలనీ తేతెమ్మంటరు. అవి కాక లాటరీలూ ఎక్సకర్సనులూ అంటరు. ఉతికి ఆరేసిన బట్టలేసుకు రా అంటరు. పుస్తకాలూ, పెన్సిల్లూ  కావాల. మాలాటాల్లకి అయన్నీ ఏడొస్తయి సెప్పూ?” అంది.

కృష్ణకి అర్థం కాలేదు. అదొక పెద్ద ఖర్చు అనిపించలేదు. “మానాన్నగారితో చెప్తానుండు,” అనేసి ఇంటికొచ్చేసింది విసుక్కుంటూ.

ఎంతసేపటికీ టిఫినుకి రాని కూతురుకోసం ఎదురు చూస్తోంది సరోజమ్మ. వరండాలో కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తోంది కృష్ణ. ఆవిడకి కంగారు పుట్టింది. “ఏంవైందే? ఎవరైనా ఏఁవైనా అన్నారా?”

కృష్ణప్రియ చాలాసేపు మాటాడలేదు. మాటాడగలిగినప్పుడు చెప్పినమాట ఆవిడకి అంత హృదయవిదారకమైనదిగా అనిపించలేదు.

“సర్లే. అది స్కూలికి రాకపోతే అంత ఏడవడం ఎందుకూ? సాయంత్రం ఇద్దరూ ఆడుకుంటూనే ఉంటారు కదా. రోజూ దాన్నిక్కడికే రమ్మను. పద టిఫిను తిందువు గాని.”

ఆవిడ చెప్పదలుచుకున్న ఓదార్పుమాటలు, కృష్ణప్రియ సమస్యకి పరిష్కారం, ప్రస్తుత కర్యవ్యం ఒక్క వరసలో చెప్పేసి తన పోర్షను అయిపోయిన నటిలా ఇంట్లోకి వెళ్ళిపోయిందావిడ.

తనకి ఇంత బాధగా ఉన్న విషయం తల్లి అంత తేలిగ్గా ఎలా తీసుకోగలిగిందో కృష్ణకి అర్థం కాలేదు. తల్లివెనకే నడుస్తూ, “అది కాదమ్మా ఎందుకు మానిపించేయాలి?” అంది.

“సరేలే. అందరూ తూగగలరుటే. డబ్బుండొద్దూ అందులోనూ వాడి సంపాదనతో. ధరలు చూస్తే మండిపోతున్నాయి. వాడికొచ్చే వందలో నాలుగు రాళ్ళు వెనకేసి దాని పెళ్ళే చేస్తాడా, గంజి కాచుకు గొంతు తడుపుకుంటాడా.”

కృష్ణకి విసుగేసింది. అమ్మెప్పుడూ ఇంతే, తనొకటి అడిగితే వేరొకటి చెప్తుంది అనుకుని గబగబ టిఫిను తినేసి పాలు తాగేసి వెళ్ళిపోయింది సీతదగ్గరికి. సీతదగ్గర కూర్చుని వేరుశనక్కాయలు తింటూ కబుర్లు చెప్పుకుంటుంటే తృప్తిగా ఉంది. సీతగురించి ఎవరు ఏమేం అడిగేరో, తనేం చెప్పిందో, కొత్తక్లాసు విశేషాలు, కొత్త పిల్లల ఆకారాలు మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉంది మాలి వచ్చి “పదండమ్మాయిగోరూ, సీకటడిపోనాది. ఇంటికాడ దింపుతా,” అనేవరకూ.

మాలితో ఇద్దరూ నడుస్తుంటే కొంతదూరం వచ్చేక కృష్ణకి గుర్తొచ్చి అడిగింది, “ఏం మాలీ, సీతని ఎందుకు మానిపించేసేవూ,” అని.

ఆ స్వరంలో ఇందాకటి జోరు లేకపోవడం చూసి సీత చిన్నగా నవ్వుకుంది. దానికి ఇదంతా ఇలాగే జరుగుతుందని ముందే తెలిసినట్టు అనిపిస్తోంది.

మాలి నెమ్మదిగా నడుస్తూ ముందూ వెనకా చూస్తూ నెమ్మదిగా అన్నాడు, “తఁవరు సిన్నోరు. తఁవకి తెలీదండి. నాను పెద్దోన్నయిపోతన్నను. మరో రెండేల్లు నాసర్వీసు. మరి నాను రిటేరయిపోనాక ఏఁవున్నది? ఈ నాలుగు డబ్బులు గూడ కల్ల పడవ్. సైకిలు సూస్కో వోరగా నడండమ్మా. మీనాగ దాన్ని బియేలూ యమేలూ సదించలేను. కనీసం కులపోన్ని సూసి పెల్లయినా సెయ్యాల. అందుకే అమ్మగోరికాడ నాలుగు డబ్బులు గూడపెడతన్న.”

కృష్ణకి ఆశ్చర్యం వేసింది. తన తల్లి కూడా మాలితో కుమ్మక్కయిందన్నమాట.

“సూస్కోవాల తల్లీ. రాముడు గూడ పెద కాలాసుకొచ్చినాడు. నానూ కాలీజీకీ పొద్దున్నే ఎల్తే సాయంకాలానికొస్తాను. మరీ ఆడూ అంతే గంద. మరి ఇది కూడా ఇస్కులికెల్లిపోతే ఇంటికాడెవరుంటరు? మాకేంవీ ఆస్తుల్లేవు గానీ ఆ ఉన్న రొండు బొచ్చెలు ఎత్తుకుపోయే యెదవలు వస్తన్నరు ఆకుల్నాకీవోడికి మూతుల్నాకీవోడనాగే. అయ్యయ్యో సూసీరా కార్లు నడిపీ యదవలు మడుసుల్ని కానుకోరు. మాసీతమ్మ పక్కన నడాపోతే ఏమైపోయీవోరూ. రోడ్డుమీన ఒక శెనం పరాగ్గా ఉన్నా ఫైసలయిపోతరు ..”

మాలి మాటలు వినడం మానేసి సీతా కృష్ణా కబుర్లు చెప్పుకుంటూ ఇంటిదాకా వచ్చేసేరు.

సరోజమ్మ వీధిగుమ్మందగ్గర స్తంభాన్నానుకుని కన్నాకోసం ఎదురు చూస్తోంది. కూతుర్ని చూడగానే భయంస్థానంలో విసుగూ, ఆపైన చిరాకూ దరిమిలా కోపమూ వచ్చేసేయి ఆవిడకి.

“ఏఁవేఁ అర్థరాత్రిదాకానా ఆటలు? చీకటి పడకముందే కొంప చేరాలని తెలీదు,” అంటూ కసిరింది.

“వస్తున్నా కదా,” అంది కన్నా మెల్లిగా.

మాలి అమ్మగారిదగ్గరా, కృష్ణ సీతదగ్గరా శలవు తీసుకుని వెనుదిరిగేరు.

“నువ్వు చెప్పమ్మా సీతని స్కూలికి పంపమని,” అని కృష్ణ అంటుండగానే ఎటు వాళ్ళు అటు పోయేరు. కన్నా తనగదికి వెళ్ళి బట్టలు మార్చుకుని భోజనానికొచ్చేసరికి, అప్పటికే తమ్ముడు భోజనం చేసి వెళ్ళిపోయేడు.j

రరవాయి భాగం ఇక్కడ

000

(1) అమెరికా సంగతి ఆరుద్ర కవిత ఆధారం అనుకుంటాను. ఏదో పద్యంలో “ఎక్కడ ధర్మగ్లాని జరిగినా అమెరికావారు తయారు” అని చదివినట్టు గుర్తు.

 

(జులై 8, 2016)

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s