బాల్యం – 2

(మొదటి భాగం ఇక్కడ)

సరోజమ్మ దేవీస్తవం చదువుకుంటూ హడావుడిగా వంటింట్లోకీ పెరట్లోకీ తిరుగుతోంది. తులసిమొక్కముందు నాపరాతిపలక చేత్తో తుడిచి, నీళ్ళ జల్లి బియ్యప్పిండితో ముగ్గు పెడుతోంది.

కన్నా వచ్చి కాఫీ అడిగింది. “వంటింట్లో ఉంది, తీసుకో,” అని చెప్పి, ముగ్గు పెట్టడం ముగించి హడావుడిగా ఆవిడ కూడా వంటింట్లోకి వెళ్ళింది. ఉదయం ఏడున్నరవుతోంది.

“వాడొచ్చేడేమో చూడు,” అని కన్నానుద్దేశించి ఓ కేక వేసి కూర తరగడానికి కూచుంది కత్తిపీటముందు.
సీత వెనుదిరిగి ఓమారు చూసి, కాఫీ చప్పరిస్తూ లేదు అంది.

“అలా వీధిగుమ్మంవరకూ వెళ్ళి చూసి రా. అరిగిపోవు. ఝాం పొద్దెక్కినా పువ్వులు తేకపోతే పూజెలా అవుతుంది, వంటెప్పుడవుతుంది,” అందావిడ చిరాగ్గా.

తల్లికోపం చూసి కన్నాకి కోపం వచ్చింది. వీధిగుమ్మంవరకూ వచ్చినవాడు లోపలికి రాడూ? రుసరుసలాడుతూ వీధిగుమ్మంవరకూ వెళ్ళి, ఆపైన కనిపించినంత మేర చూసి వచ్చి, లేడు అంది.

సరోజమ్మ ఆ పూటకి తులసీదళాలతోనూ పసుపూకుంకుమలతోనూ పూజ కానిచ్చి పని అయిందనిపించుకుంది. కన్నం అన్నం తింటుంటే, “స్కూల్లో రాముడు కనిపిస్తే అడుగు పువ్వులెందుకు తేలేదో,” అంది సరోజమ్మ.
కన్నా సరేనంది కానీ తీరా స్కూలికెళ్ళేక ఆ సంగతే జ్ఞాపకం లేదు. సరోజమ్మకి కూడా మర్నాడు మళ్ళీ పూజవేళకే గుర్తొచ్చింది. భర్తతో చెప్పింది. ఆయన కాలేజీ ప్రిన్సిపాలు. కనుక్కుంటాలే అన్నారు కానీ ఆయనకసలు కాలేజీకి వెళ్ళింతరవాత ఇంటిసంగతులేమీ గుర్తుండవు. ఇంక పూజాసుమాలసంగతి వేరే చెప్పాలా?

మర్నాడు మాలి తమఇంట పూసిన తొలి ఫలసంపెంగ తీసుకొచ్చేడు సరోజమ్మకోసం. వాడిమీద అరిచిందావిడ, “ఏరా రాముడుగాడు పూలు తేడం మానేసేడు. ఏం అబ్బాయిగారి పాంటివ్వండి, షర్టివ్వండి అంటూ ఇంటిచుట్టూ తిరుగుతాడు. పూజకి నాలుగు పువ్వులు తేడం మాత్రం కష్షఁవా?”

మాలి, “నేను కూడా చెప్పేనమ్మగోరూ, ఇండంలేదు. ఆడికి నామోషీగా ఉందంటడు పూలు తెచ్చీనానికి. నానెల్లని
కూకుడుండిపోనాడు.”

సరోజమ్మ ఆశ్చర్యపోయింది, “ఔన్రా పువ్వులు తెస్తే నామోషీవా?”

“ఏటో ఆడిగోల ఆడిది. ఇండంనేదమ్మగోరూ. ఇస్కూల్ల పిల్లగోల్లెవరో సూసి ఏటి ఆరింట పాలికాపు పన్సేస్తన్నవ అన్నారంట. నాన్సప్పినానండి. అంటె తప్పేటి పాలికాపులంగాక మంతుర్లవాఁ ఏటని. ఇనకున్నడు. పోనీ ఆడిమాట ఒగ్గీండి. రెపుట్నుంచి నానొట్టుకొస్త. పూజకి పూలట్టుకొస్తే మన గోరవం కొరవడతాదేటి. అస్లు నన్నడితే పున్నెంవే గద.”

“ఓరి వెధవా. నాకళ్ళముందు పుట్టేడు అంతవాడయేడా? పువ్వులు తెస్తే అవమానమా? ఊరికే తెస్తున్నాడేమిటి? బిళ్ళకుడుముల్లా నెల తిరిగేసరికి రెండు రూపాయలు పుచ్చుకోడం లేదూ? ఆ పైన పిల్లాడిబట్టలు చిరుగైనా పట్టని పాంట్లూ చొక్కాలూ వాడి ఎదాన కొట్టడం లేదూ?”

“పోన్లెండమ్మా, సిన్నకుంక. ఆడికేటి తెలుస్తాది మరేద. నాన్తెస్తనంటన్న గంద.”

సరోజమ్మ మరో వరస మాలినీ, రాముణ్ణీ, వాళ్ళజాతినీ తిట్టిపోసి లోపలికి వెళ్ళిపోయింది. మర్నాడూ మూడోనాడూ మాలి తెచ్చిచ్చేడు పూలు. నాలుగోరోజు రాలేదు. ఐదోరోజు వచ్చినప్పుడు నాలుగోరోజు రానందుకు సంజాయిషీ ఇచ్చుకున్నాడు. ఆరోరోజు ఆలోస్యంగా వచ్చేడు. ఏడోరోజూ, ఎనిమిదోరోజూ కనిపించలేదు. పధ్నాలుగోరోజు రాలేనని పదమూడోరోజు చెప్పేడు. ఒక్కమాటలో ఆవిడకి పూలు ఖచ్చితంగా ప్రతిరోజూ అందడం లేదు.

“ఆ బాబు కాలీజీ ప్రిన్సిపాలు అవుతే మాఅయ్య కాలీజీలో తోటమాలి. ఆయమ్మ ప్రిన్సిపాలు గాదు. నాను ఆయమ్మ బంట్రోతుని గాను. నానెందుకు ఆఁవెకి దినమూ పూలు తీసికెల్లాల?” అని రాముడుగాడు ఎవరితోనో అన్నాడని, వాళ్ళు తనకి చెప్పేరని కన్నా తల్లికి చెప్పింది.

రాముడుగాడ్ని నిలేసి అడిగితే తానలా అనలేదనీ, తాను అలా రోజూ పూలు తెస్తున్నందుకు మిగతా పిల్లలు గేలి చేస్తున్నారనీ, అది తనకి చిన్నతనంగా ఉందనీ చెప్పేడు.
000

కొత్త క్లాసు, కొత్త పుస్తకాలు, తలకి మించిన homework వీటితో కృష్ణ గమనించలేదు కానీ సీతని తరుచూ కలవడం పడడం లేదు. మొదట్లో పది రోజులపాటు సీతఇంట్లో కృష్ణ, కృష్ణఇంట్లో సీతా కనిపించేరు కానీ అనతికాలంలోనే తగ్గిపోయింది. కలిసినప్పుడు కూడా ఎంతసేపు చెప్పినా స్కూలు విషయాలు – తానక్కడ ఏం చేసిందో, ఏ మేష్టరు ఏ ప్రశ్నలు వేసేరో, ఏ పిల్లలు ఏ మేష్టరుని ఎలా ఏడిపించేరో గంటా గంటన్నరసేపు చెప్పి ఆ తరవాత, “నువ్వు మాటాడవేం?” అనడిగేది.
సీత నీరసంగా “ఏం మాటాడను?” అనేది. “ఏంవుంది మాటాడ్డానికి?” అనేది. కృష్ణ మూతి ముడుచుకు వెళ్ళిపోయేది. తనకే తెలియకుండా సీతకి దూరం కాసాగింది.

ఓరోజు సీత కృష్ణకి రోడ్డుమీద కనిపించింది. హఠాత్తుగా అనుకోకుండా నాలుగు రోజులతరవాత సీత కనిపించడంతో ఎక్కడలేని అభిమానం పొంగి పొర్లింది కృష్ణమనసులో. “సీతా” అంది ఉక్కిరిబిక్కిరి అయిపోతూ సీతభుజంమీద ఆప్యాయంగా చెయ్యేసి.
“కనిపించడంలేదేఁవేమే?” అంది ప్రేమగా. “అవున్లే నేనెందుకు జ్ఞాపకం ఉంటానూ?” అంది నిష్ఠూరంగా.

సీత నిర్వికారంగా నవ్వి, “తీరలేదే?” అంది.

కృష్ణకి అర్థం కాలేదు. స్కూలూ హోంవర్కూ లేని సీతకి తీరనంత పనులేముంటాయి? సీత సూటిగా సమాధానం చెప్పలేదు.

“ఉండదనుకుంటే ఉన్నది, నేదనుకుంటే నేదు,” అంది.

అంత ఎండలో మిట్టమధ్యాహ్నంవేళ అది ఎక్కడికి వెళ్తోందో కృష్ణకి అర్థం కాలేదు. సీత అప్పుడు చెప్పింది తాసిల్దారుగారింట్లో పనికి కుదిరిందిట. వాళ్ళమ్మాయికి కాఫీ, టిఫినూ పట్టుకెళ్తోందిట.

కృష్ణ మండిపడింది, “ఏదీ ఆ కోతిమొహం కోమలికేనా, పదోక్లాసులో ఉందీ? నువ్వు కాఫీ పట్టుకెళ్తున్నావా? సిగ్గు లేదూ?”
సీత మాటాడలేదు. అయ్యతో ఆ వాదనలన్నీ ఇంతకుముందే అయిపోయేయి. మాలి చెప్పేడు, “రేపో మాపో అమ్మాయిగోరు ఉజ్జోగం సేయరా? ఎవురు ఏం సేసినా ఆ పైసలకోసంవే గద. సిన్నకూలీ పెద్ద కూలీ అంతే యత్తేసం. ఇంక తాసిల్దారుగోరి బార్య పుట్టింట నాను పని సేస్తి. అమ్మాయిగోరు బూమ్మీద పడిన్నాటినుంచి నాకెరిక. ఉప్పుడు ఆరికి సాయం గావాలంత నాను ఒల్లగాదంటనా? మరియేదేనా? సీతని అంపుతాలే అంటి.”

“ఛీ అదేం పని. చెయ్యనని చెప్పేసెయ్. నిన్ను స్కూలు మానిపించడమే చాలు. పన్లోకి తోల్తాడా. అదే రాముడయితే ఏం అనడా,” అంది కృష్ణ.

సీతకీ తెలుసు కానీ ఏం చేయగలదు. రాముడు పువ్వులు పట్టుకెళ్ళడం అవమానం అంటే మాలి ఏం అనలేదు. తను తీసుకెళ్తానన్నాడు కానీ తనూ సరిగా చేయడం లేదు. మరి తనని మాత్రం వీళ్లింటికీ వాళ్ళింటికీ పనికి పంపొచ్చు!? తనూ అంతే.
తండ్రి ఎంత చెప్తే అంతే. గట్టిగా చెప్పలేదు చెయ్యనని.

“సాయంత్రం ఓమారు రారాదూ?” అనడిగింది సీత కృష్ణని. కృష్ణఇంటికే వెళ్తే సరోజమ్మగారి అజమాయిషీలో కదలకుండా మెదలకుండా కూర్చోవాలి. సీతఇంటికే వస్తే ఇద్దరూ సరదాగా బీచికెళ్ళొచ్చు.

ఆ సాయంత్రం కృష్ణ వచ్చింది. ఇదివరకులా ఇద్దరూ అలలమధ్యకి వెళ్ళలేదు. సీతకి దిగులుగా ఉంది. సీతని చూస్తుంటే కృష్ణకి అదేమిటోగా ఉంది.

కనుచీకటి పడుతోంది. దూరంగా అలలమీద స్టీమర్లు కదిల్తున్న రాజప్రాసాదాలలా తేలిపోతున్నాయి. వాటిని చూస్తూ సీత చెప్పింది అయ్య ఊళ్లో లేడని. కృష్ణకి తెలుసు లేడని. క్రితంరోజు మాలి తల్లితో చెప్తుంటే వింది కానీ కారణం తెలీదు. ఆమాటే అంది సీతతో. ఆ లోటు పూర్చి చేసింది సీత. అనకాపల్లిలో ఎవరో కుర్రాడున్నాడుట. మాటాడ్డానికి వెళ్ళేడు.

“ఏమిటీ? పెళ్ళా?” అంది కృష్ణ ఉలిక్కిపడి.

సీత మాటాడలేదు. దానికీ అలాగే ఉంది. తనఈడు పిల్లలంతా స్కూలికి వెళ్ళి చదువుకుంటున్నారు. అసలు ఎవరో చెప్పేరు అంత చిన్నవయసులో పెళ్ళి చేయడానికి గవుర్నమెంటోరు ఒప్పుకోరని.

“పోలీసులకి తెలిస్తే పట్టుకుంటారే,” అంది కృష్ణ.

సీత నవ్వింది. మొన్నటికి మొన్న రంగయ్యమామ చేసుకోలేదూ? దానికి ఎనిమిదేళ్లే. దానిమాఁవ పోలీసే. పెళ్ళివేళకి దర్జాగా వచ్చి దీవించి వెళ్ళేడు. జరుగుతున్న పెళ్ళిళ్ళన్నీ పోలీసులకి తెలీకుండనే జరుగుతున్నాయా?

“అయితే నీకిష్టమేనా?” అడిగింది కృష్ణ మరేం అన్లేక.

“ఇస్టంవో కస్టంవో నన్నెవరడుగుతారు? అయ్యా రావుడత్తా ఎల్లేరు. ఆల్లే మాటాడుకొచ్చీత్తారు.” ఆగొంతులో బాధ ధ్వనించింది. కృష్ణకి కూడా సీతని రక్షించడానికి ఏమైనా చేయాలనిపించింది. ఆ అసురుసంధ్యవేళ ఆ పిల్లలిద్దరికీ తమకేదో అన్యాయం జరిగిపోతోందని తోచింది కానీ అదేంవిటో దానికి ప్రతిగా ఏం చెయ్యాలో తోచలేదు.

“పోనీ, ఎక్కడికైనా పారిపోతేనో?” కృష్ణ సలహాకి సీత సావిత్రిలా నవ్వింది.

“ఇది సినిమా అనుకుంటన్నవేటి. కతల్లోనూ సినిమాల్లోనూ అవుతే ఆడాల్లు సాయిసం సేసి పారిపోతారు. గొప్పోల్ల ఇల్లల్ల బడతారు. పేంవించుకుంటారు. పాటలు పాడుకుంతారు. పెల్లి సేసేస్కుంటారు. నాలాటిది ఎక్కడికి పారిపోతాది? సంద్రంలోకి పోవాలంతే,” అంది సీత.

“పోదూ ఒట్టి కబుర్లు చెప్తావు,” అంది కృష్ణ కానీ దానికీ మనసులో బెరుగ్గానే ఉంది.

ఇద్దరూ దిగులుమొహాలతో ఇళ్ళు చేరుకున్నారు.

కృష్ణకి తల్లినడగాలనుంది సీతకి ఇప్పుడే ఎందుకు పెళ్ళి చేస్తున్నారని. కానీ తల్లి సరైన సమాధానం చెప్పదేమో. నీకెందుకంటుంది.
కృష్ణ మర్నాడంతా ఉదాసీనంగానే ఉంది. అలా ఉన్నావేం అని అడిగినా సమాధానం చెప్పలేదు. ఆ సాయంత్రం మళ్ళీ సీతదగ్గరికి వెళ్ళింది. మాలి ఇంట్లో లేడు. సీతా రావుడత్తా ఉన్నారు. కృష్ణని చూడగానే అమ్మాయిగోరు అంటూ రావుడు లేచి నిలబడింది. సీత గబుక్కున లేచి, కృష్ణచేయి పుచ్చుకుని పద అంటూ లాక్కుపోయింది.

దార్లో చెప్పింది. దాదాపు నిశ్చయం అయిపోయనట్టేనట. అబ్బాయి సన్నగా ఎర్రగా ఉంటాట్ట. స్కూల్లో ప్యూనుట. ఐదో ఫారంవరకూ చదివేడుట. ఇల్లుందిట. ఆదివారం పెళ్ళిచూపులకొస్తాట్ట. సీతమొహంలో సిగ్గుతెరలు లీలగా గోచరించేయి కృష్ణ అమాయకపుకళ్ళకి. అయినా ఊహలు మాత్రం తక్కువేం లేవు.

“అది కాదే మరి నువ్వు ఒప్పేసుకుంటావా? ఇంకా చూడలేదు కదా,” అంది. అడగడుగునా దానికి అభ్యంతరాలే గోచరిస్తున్నాయి.

“చెప్పేను కదా ఆదివారం వస్తన్నడని,”

“అవుననుకో. అప్పుడు నీకు నచ్చనడనుకో. అయినా చేసేసుకుంటావా?”

కృష్ణకి సీత ఒప్పుకోకపోతే బాగుండునని ఉంది. దానికి ఇష్టమే అనుకోడం కష్టంగా ఉంది. సీత కూడా ఆ ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పేస్థితిలో లేదు. “రానియ్. చూదాం,” అంది.
000

అనుకున్న ఆదివారం వచ్చింది. కృష్ణ పరుగెత్తుకు వెళ్ళలేదు. సీతే పరుగెత్తుకు వచ్చింది. సీతమొహం చూడగానే కృష్ణకి తెలిసిపోయింది. సరోజమ్మ కూడా సరసమాడింది “మొగుణ్ణి చూసుకున్నావా?” అంటూ.

సీత ముసిముసి నవ్వులు నవ్వుతూ సిగ్గుగా తలొంచుకుంది. కృష్ణకి మాత్రం చాలా కోపం వచ్చింది. ఇద్దరూ డాబామీదికి వెళ్ళేక అడిగింది, “అంత బాగున్నాడా? బాగా తెల్లగా ఉన్నాడా?”

“తెల్లంగనే ఉన్నడు కానీ కుంచెం పొట్టి.”

“అయితే నీకిష్టమేనన్నమాట.”

“ఏమో కన్నా. నన్నడక్కు. నాకేంవిటో బయంగ ఉన్నది.”

ముందంతగా చూడలేదు కానీ “తలెత్తు పిల్లా ముకం సూస్తం,” అందిట అబ్బాయితల్లి. అలా తలెత్తి చూసినప్పుడే అబ్బాయిని చూసిందిట తను. అప్పుడే అబ్బాయి కూడా తనవేపు చూస్తున్నాట్ట. దాంతో తనగుండెలు టపటప కొట్టుకున్నాయిట. “రౌడీఏసాలు నాయెంక సూసి నవ్వినాడు,” అంది సీత బుంగమూతితో. ఆ స్వరంలో కోపం లేదని కృష్ణకి కూడా తెలిసిపోయింది.
మర్నాడు మాలి వచ్చి నిశ్చితార్థం చేసుకున్నాం అని చెప్పేడు సరోజమ్మతో. వాడు తనదగ్గర దాచుకున్న వంద రూపాయలూ తెచ్చి ఇచ్చింది. మరో ముప్ఫై ఇచ్చి పిల్లకి ఏమైనా కొని పెట్టమని చెప్పింది. మాలి ఆ డబ్బు అందుకుని కళ్ళకద్దుకుని, అమ్మగారికి దణ్ణం పెట్టి పదికాలాలపాటు సల్లగుండు తల్లీ అన్నాడు. ఖర్చులకోసం వెయ్యి రూపాయలు అప్పు చేసేట్ట. చీటీ కట్టిన ఐదువందలు, మరో ఐదు వందలు. కుర్రాడికి వాచీ, సైకిలు ఉంగరం కొనిస్తాట్ట. పిల్లకి బంగారు కమ్మలు పెడతాట్ట. అంతకంటె నానేం సేయలేను అన్నాడు. అంత పెట్టగలిగినందుకు వాడికి సంతోషంగా ఉంది. అంతకంటె ఎక్కువ పెట్టలేనందుకు బాధగా ఉంది. పెళ్ళి చేస్తున్నానన్న పొంగు ఉంది. చేసి పిల్లని పంపేయాలి కదా అన్న వ్యథ ఉంది. పెళ్ళికి నువ్వు తప్పకుండా రావాలని కృష్ణకి నొక్కి నొక్కి చెప్పింది సీత.

పెళ్ళి నూకాలమ్మగుళ్ళో చేసేరు. సీత స్వయంగా కృష్ణనే కాక హెడ్ మాస్టరుగారినీ, మనూని, మిగతా క్లాసు పిల్లల్నీ కూడా పిలిచింది. పిల్లలందరూ చందాలేసుకుని స్టీలు పళ్ళెం కొనిచ్చారు. కృష్ణకి సీత నచ్చింది కానీ దానిచుట్టాలు నచ్చలేదు. వాళ్ళ మాటలు, తీరు, అలంకరణలూ అన్నీ దానికి అసహ్యంగానే ఉన్నాయి. మొగపెళ్ళివారు మరీ ఎడ్డెమనుషుల్లా కనిపించేరు. పెళ్ళికొడుకు మాత్రం బాగున్నాడు. వాణ్ణి చూడగానే సీత ఎందుకు ఒప్పుకుందో అర్థమయిపోయింది.
పెళ్ళి బాగానే జరిగింది. సీత అత్తారింటికెళ్ళిపోయింది. వెళ్ళేముందు సరోజమ్మ ఇంటికొచ్చి ఆవిడకీ ప్రిన్సిపాలుగారికి కాళ్ళకి దణ్ణం పెట్టింది. సరోజమ్మ పళ్ళూ పువ్వులూ ఓ జాకట్టుగుడ్డా దానిచేతిలో పెట్టి దీవించేరు.

సీత కృష్ణని కౌగలించుకుని ఏడ్చింది. కృష్ణకి కూడా పట్టలేనంత దుఃఖం వచ్చింది. ఇద్దరూ ఒకరినొకరు మర్చిపోమనీ, ఉత్తరాలు రాసుకుంటూ ఉంటామనీ బాసలు చేసుకున్నారు. సిత వెళ్ళిపోయేక రెండురోజులపాటు కృష్ణకి అన్నం సయించలేదు. ఎవరితోనూ మాటాడ్డంలేదు. ఎక్కడ పడితే అక్కడ కూలబడి ఉసూరుమంటూ కూర్చున్న కూతుర్ని చూస్తే సరోజమ్మకి కూడా బాధగా ఉంది. ఆఖరికి ఆవిడ గట్టిగా నాలుగు చీవాట్లు వేసేక కృష్ణలో కొంచెం చైతన్యం కనిపించింది.
000

సీత దగ్గర్నుంచి ఉత్తరం వచ్చింది. అక్కడ చిన్న ఇల్లు అద్దెకి తీసుకున్నారుట. ఇద్దరూ బాగానే ఉన్నారుట. అన్నవరం, సింహాచలం వెళ్ళివచ్చేం అని రాసింది. వాడు చాలా మంచివాడుట. తనని ఎంతో బాగా చూసుకుంటున్నాడుట. ఇంచుమించు రోజూ సినిమాకి వెళ్తున్నారుట.

కృష్ణ ఆ ఉత్తరం వందమార్లు చదువుకుంది. ఏవో కొత్త ఆలోచనలు రాసాగేయి. తెలుగు పుస్తకం చదువుదాం అని తీస్తే చేయీ చేయీ పట్టుకుని నూకరాజుతో సింహాచలం మెట్లెక్కుతున్న సీత కనిపించింది. సీత సిగ్గుపడుతూ నూకరాజువేపు చూసినట్టు చూస్తూ నవ్వినట్టు కూడా కనిపించసాగింది. సాయంత్రం సినిమాకెళ్తే సినిమాలో నాయకీనాయకులు సీతా నూకరాజులా కనిపించేరు.
పోస్టుకార్డు తీసుకుని సీతకి ఉత్తరం రాసింది. ఉత్తరంనిండా స్కూలు విశేషాలే. ఆ తర్వాత సీతదగ్గర్నించి మళ్ళీ ఏ కబురూ లేదు.
సీత ఊరు విడిచి వెళ్ళిపోయినరోజు కృష్ణ వెక్కి వెక్కి ఏడ్చింది పక్కమీద పడుకుని. నాలుగు రోజులు అన్నం తినలేదు. రెండు వారాలపాటు ఏదో పారేసుకున్నట్టు ఉసూరుమని కాళ్ళీడ్చుకు స్కూలికి వెళ్లొస్తుండేది. సరోజమ్మకి దిగులు పట్టుకుంది దీన్ని ఓదారికి తీసుకురావడమా అని. ఆఖరికి ఓ రోజు స్కూలినించి వచ్చి మధ్యగదిలో కిటికీదగ్గర కూర్చుని వేపచెట్టుమీద వాలిన కాకుల్ని చూస్తున్న కృష్ణని సరోజమ్మ, “ఇలా అన్నం నీళ్లూ మానేసి బెంగటిల్లిపోడఁవేవిటి ఎంత స్నేహాలయితే మాత్రం. ఎవరు మాత్రం ఎక్కడివాళ్ళక్కడ కలకాలం ఉండిపోతారేమిటి? నేనూ మీనాన్నా పుట్టడమే ఇలా ఇక్కడ పుట్టేమేమిటి? సీత కాకపోతే గీత మరో నేస్తం వస్తుంది. రేప్పొద్దున్న నువ్వు మాత్రం పెళ్ళి చేసుకు పోవూ మొగుడితో?” అంటూ గట్టిగా అరిచింది.

కృష్ణ తెల్లబోయి తల్లివేపు చూస్తూ, “స్కూల్లో రమణ, సీతాలక్ష్మి, జానకీ వాళ్ళందరూ నేను డాక్టరవుతాను, నేను ఇంజినీరవుతాను అని ఏవేవో చెప్తున్నారు. నేనేం అవుతానా అని ఆలోచిస్తున్నాను,” అంది.

ఈమారు తెల్లబోవడం సరోజమ్మవంతు అయింది. పిల్లలు ఎంతలో ఎదిగిపోతారూ అంటూ విస్తుపోయిందావిడ.

(అయిపోయింది)
000
(జులై 9, 2016)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s