వ్యాఖ్యానాలు – నా అనుభవాలు

సారంగలో నావ్యాసానికి లింకు ఇక్కడ

పూర్తి పాఠం, చిన్న సవరణలతో. ఇక్కడ ఇస్తున్నాను.

—-

కొంతకాలంగా రచయితలకీ పాఠకులకీ మధ్యన ప్రచ్ఛన్నయుద్ధం జరుగుతోంది విమర్శలవిషయంలో. వ్యాఖ్యలు సూక్ష్మంగా ఉంటాయి కానీ అవి కూడా విమర్శలే నాకు సంబంధించినంతవరకూ. రెంటిలోనూ జరిగేది రచనమీద చదివినవారు చదవడం అయేక వారి స్పందనలను తెలియజేయడమే జరుగుతుంది కనక.

పండితులు తమ అభిప్రాయాలను పత్రికలలో చర్చించుకోడం వీరేశంలింగం, కొక్కొండ వెంకటరత్నంపంతులు గార్ల కాలంలోనే ఉంది. అంతకుపూర్వం పెద్దన, ధూర్జటి, తెనాలి రామకృష్ణుడు, ప్రెగడ నరసరాజు వంటి కవులు సభలలో ఒకొరినొకరు విమర్శించుకోడం, ఆక్షేపించుకోడం ఉండేది.

19వ శతాబ్దంలో విద్యావంతులని ప్రొత్సహించే ఆశయంతో పత్రికలు వెలువడ్డాయి. ఈనాడు జాలపత్రికలు “మీరు కూడా రచయితలే,” అని పాఠకులని రాయమంటూ ప్రోత్సహిస్తున్నారు. ఈ సంప్రదాయానికి నాంది పత్రికలు ప్రారంభించినరోజులలో సంపాదకులు స్త్రీవిద్య ప్రోత్సహించడమే.

పండితులూ సాహతీవేత్తలూ శల్యపరీక్ష చేసి రాసే విమర్శలజోలికి పోబోవడం లేదు నేను ఈ వ్యాసంలో. నా అనుభవాలు అన్నాను కదా. నాఅనుభవంలో అలాటి విశ్లేషణలు జరగలేదు కనక నేనేమీ చెప్పలేను.

నేను కథలు రాయడం మొదలు పెట్టేక, అంటే 50వ దశకంలో అభిప్రాయాలు గమనించడం మొదదలు పెట్టేను. ఆ రోజుల్లో వారపత్రికలే ఈ అభిప్రాయప్రటనలకి వేదిక. కథ చదివేక కార్డో inland కవరో తీసుకుని అభిప్రాయం రాసి ఆ పత్రికకి పంపితే అది మళ్ళీ పాఠకుడు చూసుకోడానికి కనీసం మరో రెండు వారాలు పట్టేది. అది కూడా ఆ పత్రిక ఎడిటరు వేసుకోడానికి అంగీకరిస్తేనూ, ఎడిట్ చేయకపోతేనూ మాత్రమే పాఠకుడు తాను రాసింది రాసినట్టు చూసుకునే అవకాశం. అంటే డబ్బు ఖర్చూ, కాలయాపనా కూడా అన్నమాట. నిజానికి చాలామంది పాఠకులు వ్యాఖ్యానాలు రాయడానికి మొహమాటపడేవారు కూడా ఆరోజుల్లో. ఇప్పటికీ మీ అమ్మమ్మనో వాళ్ళమ్మనో అడిగి చూడండి. ఏమో, నాకేం తెలుసులెద్దూ అంటారు. ఈమధ్య ముఖపుస్తకంలో “మీరేం అనుకుంటారో అని friend request పెట్టలేదు” అన్నవారు నాకు కనిపించేరు. రచయితలయందు పాఠకులకు గల గౌరవమర్యాదలనేపథ్యం ఇలాటి సందర్భాలలో అర్థమవుతుంది.

20వ శతాబ్దం ఉత్తరార్థంలో వారపత్రికలలో సాహిత్యపరంగా కూడా మంచి చర్చలు జరిగేయి. మహీధర రామ్మోహనరావు, కొడవటిగంటి కుటుంబరావు, పురాణం సుబ్రహ్మణ్యశర్మవంటి రచయితలచర్చలు కనిపిస్తాయి 70, 80 దశకాలలో ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ వంటి పత్రికలలో. భారతి, కృష్ణాపత్రికలలో కూడా ప్రముఖ రచయితలు అభిప్రాయాలను ప్రచురిస్తూ ఉన్నారనే గుర్తు. పోతే సాధారణ పాఠకులవ్యాఖ్యలు ఒక్కొక కథమీద ఒకటో రెండో నామమాత్రంగా కనిపించేవి. గత 20 ఏళ్లలో అంతర్జాలంలో పత్రికలూ, బ్లాగులూ, మిత్రసంఘాలూ చెప్పుకోదగ్గ స్థాయిలో వచ్చేయి. పాఠకులసంఖ్య లెక్కకు మిక్కిలిగా వృద్ధి పొందింది, పొందుతోంది. రచయితల సంఖ్య కూడా ఇతోధికంగా పెరిగింది.

ఈ నేపథ్యంతో నా అనుభవాలు చెప్తాను. పత్రికలలో నాకథలకి “ఈ కథ ఎందుకు రాసేరో అర్థం కావడంలేదు,” అని ఒక వ్యాఖ్య ఉంటే “చాలా బాగా రాసేరు,” అని మరో వ్యాఖ్య ఉండేది. ఒక కథమీద రెండో మూడో అభిప్రాయాలు కనిపిస్తే ఘనం. అంతర్జాలం ప్రవేశించేక, పాఠకులతో ముఖాముఖీ virtual స్థాయిలోనే జరగడం మొదలయింది. ఇది కొంతవరకూ ఆనందదాయకమే.

ఘనంగా కాకపోయినా నా పుస్తకంమీద జరిగిన ఒక చర్చ ఈవ్యాసానికి పనికొచ్చేది ఉంది. అది 20వ శతాబ్దం ఉత్తరార్థంలో స్త్రీల రచనావ్యాసంగానికీ, వారి సాహిత్యప్రస్థానానికీ దోహదం చేసిన ఆర్థిక, సామాజిక పరిస్థితులను విశ్లేషిస్తూ నేను రాసిన పుస్తకంమీద వేలూరి వెంకటేశ్వరరావు ఈమాట.కాంలో రాసిన సమీక్ష. నాకు ఆనందమూ, ఆశ్చర్యమూ కలిగించిన సమీక్ష. నేనెంత గొప్పదాన్నో అని కాక కేవలం వస్తువుని విశ్లేషిస్తూ రాసిన సమీక్ష అది. ఆ సమీక్షమీద వచ్చిన వ్యాఖ్యలలో ఈ వ్యాసానికి పనికొచ్చే వ్యాఖ్య బుజ్జాయి అన్నపేరు (బహుశా కలంపేరు)తో రాసింది, “ఎందుకిప్పుడు ఇది రాయడం. పాసిబూరె,” అని. ఆ వాక్యం గౌరవప్రదంగా నాకు అనిపించలేదు కానీ అక్కడ సైటులో ఎవరూ దాన్ని తప్పు పట్టలేదు. ఆ బుజ్జాయే అడిగిన రెండు ప్రశ్నలకి నేను మర్యాదగానే జవాబులిచ్చేను అది సీరియస్ గా జరుగుతున్న చర్చ అన్న అభిప్రాయంతో. ఆయనకి ప్రశ్నలడగమే కానీ పుస్తకం చదివే ఉద్దేశం లేదని అర్థం అయేక పుస్తకం చదివితే వారి ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయని చెప్పి ముగించేసేను.

ఇప్పుడు ఆలోచిస్తుంటే మరో కోణం తోస్తోంది నాకు. ప్రతి పత్రికకీ తరుచూ వ్యాఖ్యానించేవారు కొందరుంటారు. పాఠకులకి ఈ వ్యాఖ్యాతల ధోరణి తెలిసి ఉంటుంది. అలాటి సందర్భాలలో “పాసిబూరె” లాటి పదాలు హేయంగా కనిపించవు. అతనలాగే మాటాడతాడు కానీ చాలా తెలివైనవాడు అంటూ సమర్థిస్తారు. నేను ఆ వ్యాఖ్యలన్నీ చూడను కనక ఆ పదం నాకు అసమంజసంగానే అనిపించింది. వ్యాఖ్యానాలు రాసేవారు తమగుంపులో వారే కాక ఇతరులు కూడా చదువుతారనీ, అపార్థాలకీ తావు అవుతాయనీ కూడా గ్రహిస్తే ఇలాటి వ్యాఖ్యలు రావు. ఇది కూడా నాకు అనుభవం అయింది :).

పై చర్చ అయినతరవాత నేను రాస్తున్న ఊసుపోక ధారలో ఈ వ్యాఖ్య వాడుకున్నాను. బహుశా మీలో కొంతమందికైనా తెలిసే ఉంటుంది ఈ ఊసుపోక కతలలో ప్రధానాంశం హాస్యం, వ్యంగ్యం అని. అనేక సందర్భాలలో నామీదే నేను హాస్యం, వ్యంగ్యం విసురుకున్నాను. ఈ platform అలాటిది కనక సహజంగానే ఆ బుజ్జాయి వ్యాఖ్యని  వ్యంగ్యాత్మకం చేసేను, అమెరికాలో celebrity roastలాగ అనుకోవచ్చు. దానిమీద కొడవళ్ళ హనుమంతరావు వ్యాఖ్యానించేరు. ఆయనకి నారచనలంటే గౌరవమనీ, నేను బుజ్జాయిని అలా హేళన చేయడం మాత్రం బాగులేదనీ వారి వ్యాఖ్య సారాంశం. ఇక్కడ నాకు ఆశ్చర్యం కలిగించి విషయం నేను తీసుకున్న అంశాన్ని బుజ్జాయి పాసిబూరె అంటే ఆయనకి ఆభ్యంతరకరంగా కనిపించకపోవడం. హాస్యప్రధానమైన ఊసుపోకలో నేను హాస్యంగా రాసింది అభ్యంతరకరంగా కనిపించడం. నేను ఈమాట.కాంలో మర్యాదగానే జవాబిచ్చేను అన్నది ఆయన గమనించేరో లేదో నాకు తెలీదు. నాబ్లాగులో జరిగిన చర్చ అంతా ఇక్కడ పెట్టను. ఈవ్యాసం చివరలో లింకు ఇస్తున్నాను ఆసక్తి గలవారు చూడవచ్చు.

ముఖపుస్తకంలో చేరేక ఈ వ్యాఖ్యానాలధోరణిలో వచ్చిన మార్పులు నాకు మరింత స్పష్టం అయేయి. ఇది మరొక సంప్రదాయంగా రూపొందిందన్నా తప్పు లేదేమో.

Facebook ప్రధానంగా స్నేహితులు తమ స్వంత కబుర్లు చెప్పుకోడానికీ బొమ్మలు పెట్టుకోడానికీ ప్రారంభించినది. అయినా అనతికాలంలోనే సాహిత్యం, సంగీతం, పద్యం, కథ, సినిమా, పుస్తకాలు – ఇలా ఎవరి అభిమానవిషయాలనుబట్టి వారు పేజీలు ప్రారంభించడంతో “ముఖపుస్తకం కేవలం కాలక్షేపం కబుర్లకి మాత్రమే కాదు” అన్న స్థితికి చేరింది. అలాగే పూర్వ పరిచయాలున్న మిత్రులే కాక కొత్తవారు కూడా మిత్రత్వం కోరడం, పేజీస్వంతదారులు దాన్ని అంగీకరించమో నిరాకరించడమో కూడా జరుగుతోంది. వీటివల్ల వచ్చే ఇతర అనర్థాలు ప్రస్తావించను కానీ వ్యాఖ్యలకి సంబంధించినంతవరకూ మాత్రం చెప్తాను.

అన్ని రంగాలలోలాగే ఇక్కడ కూడా మంచీ చెడూ కూడా ఉన్నాయి. బాగున్నవి – నాసందేహాలకి సూటిగా వివరంగా సమాధానాలు రావడం. ఇది నాకు చాలా నచ్చింది. ఇందుకే ముఖపుస్తకంలో నావ్యాసంగం కొనసాగిస్తున్నది. రెండో భాగం నాకు అంతగా నచ్చనిది – సీరియస్గా అడిగిన ప్రశ్నలకి హాస్యధోరణిలో జవాబులివ్వడం. ఉదాహరణ ఇస్తాను.

“కరుణ ఏవ ఏకో రసః” అని భవభూతివాక్యం. నాకు ఈ వాక్యం పరిచయమే కానీ పూర్వాపరాలు తెలీవు. అంచేత నా పేజీలో అడిగేను. సంగతి సందర్భాలు తెలిసినవారు చక్కగా వివరించేరు. నేను సంతోషించేను. అదే సమయంలో మరొకతను ప్రవేశించి “ఇంకా చాలా రసాలున్నాయి. నీరసం, నిమ్మరసం …” అంటూ వ్యాఖ్య పెట్టేడు నా టపాదగ్గర. నేను వెంటనే అలాటి వ్యాఖ్యలమూలంగా అసలు విషయం పక్కదారి పట్టే అవకాశం ఉందనీ, అంచేత అలా రాయవద్దని చెప్పేను. దానికి అతను, “నాకు హాస్యం ఇష్టం. అష్టావధానంలో అప్రస్తుతప్రసంగంలాగే ఇది,” అని సమర్థించుకున్నాడు. నాకు మాత్రం కాదనే అనిపించింది. అష్టావధానం ఒక సాహిత్యప్రక్రియ. అందులో అప్రస్తుత ప్రసంగం కేవలం ఆ అవధానం చేస్తున్నవారి ప్రతిభాపాటవాలు పరీక్షించడానికి చేసేది.  అక్కడ చెల్లింది కదా అని ప్రతి చోటా అప్రస్తుతప్రసంగం చెల్లుతుందనుకోడం సరి కాదు. ముఖ్యంగా సీరియస్గా ఒక విషయం చర్చిస్తున్నప్పుడు హాస్యం, హేళన, వ్యంగ్యం ప్రయోగిస్తే, నాకే కాదు సీరియస్గా సమాధానాలిస్తున్నవారికి కూడా నిరుత్సాహంగానే ఉంటుంది. వారిని కూడా కించపరచినట్టే అవుతుంది. ఇంతకుముందు చర్చించిన పాసిబూరె లాటిదే ఇది కూడా.

పూర్వకవులూ, ఆ తరవాత వీరేశలింగం, కొక్కొండ వెంకటరత్నం పంతులువంటివారు వ్యక్తిగతంగా పత్రికలలోనే ఒకరినొకరు హేళన చేసుకున్న సందర్భాలు ఉన్నా వారందరూ వ్యక్తిగతపరిచయాలు గలవారు. ఏమాట ఎక్కడ నప్పుతుందో తెలిసినవారు. అంతర్జాలంలో అలా కాదు. అంతా తెరవెనక భాగోతమే. నూటికి తొంభైతొమ్మిది పాళ్ళు ఎవరు ఎవరో తెలీదు. ఏ ఉద్దేశంతో ఏమాట అంటున్నారో తెలీదు. తరుచూ కనిపించే పేర్లమూలంగా తెలిసినట్టు అనిపించినా అది నిజంగా తెలియడం కాదు.

ఈ రోజుల్లో మామూలయిపోయిన రెండో రకం వ్యాఖ్యలు – రచయిత రాసిన వాక్యం సంపూర్ణంగా కాక ఏదో ఒకమాట తీసుకుని పక్కదారి పట్టించడం. అంటే సూటిగా నావాక్యానికి వ్యాఖ్యానం కాక అందులో ఒక మాట తీసుకుని మరో కోణం చెప్పడం. ఒకొకప్పుడు ఆ కోణానికి సందర్భశుద్ధి ఉండదు. కిందటేడు ముఖపుస్తకం నాపేజీలో నేను ఇది పోస్టు చేసేను –

రచయితకి మరణం రెండు మార్లు.

ప్రాణం పోయినప్పుడు

ప్రజలు మరిచినప్పుడు.

రెండోమరణం రెండు రెట్లు దారుణం.

దీనిమీద వచ్చిన ఒక వ్యాఖ్య “ఆ రచయిత చావడమే మేలు” అని. ఈ వ్యాఖ్య ఇంగ్లీషులో ఉంది, “he  better die.”  నేను  రాసింది  రచయిత రచయితగా   పాఠకులదృష్టిలో  ఎంతకాలం అన్నది.  పాఠకులు మరిచిపోతే ఎంత మంచి రచయిత అయినా ఎన్ని రచనలు చేసినా మృతుడితో సమానం అన్న భావానికి గురి అవుతాడు అని. ఆ రచయిత చచ్చిపోవడమే మంచిది అన్న వ్యాఖ్యలో ఆ భావం లేదు. నేను వివరణ అడిగితే, “విశ్వనాథ సత్యనారాయణలా ఎవరూ రాయడంలేదు, ఈరోజుల్లో మంచి సాహిత్యం రావడం లేదు” అన్నారు ఆయన. నావాక్యంలో మరణం మాట ఉంది కనక తానలా వ్యాఖ్యానించేనని కూడా చెప్పేరు. నా రెండో వాక్యంలో మరణం అంటే మానసికంగా రచయిత అనుభవించే మరణం అని. ఎ.వి. రమణమూర్తిగారు ఈ వివరణ ఇవ్వడంతో నాపని తేలిక అయింది.

నాపోస్టుకీ వ్యాఖ్యాత కొంపెల్ల శర్మ వెలిబుచ్చిన అభిప్రాయానికీ మధ్య గల తేడా గమనించండి. విశ్వనాథవారిలా  రాసేవారు  మళ్ళీ పుట్టకపోవచ్చు.  కానీ ఆ కారణంగా తెలుగు సాహిత్యం  అక్కడితో ఆగిపోయిందనో  ఆగిపోవాలనో అనడం సబబేనా? అన్నది ఒక ప్రశ్న. మిగతా రచయితలందరూ నిజంగా రచయితలు కాకుండా  పోతారా అన్నది  మరో ప్రశ్న.  మరి కొంపెల్ల శర్మ  కూడా సాహిత్యం  సృష్టిస్తూనే ఉన్నారు  గదా,  వారు కొనసాగించడాన్ని ఎలా సమర్థించుకుంటారు అన్నది మూడో ప్రశ్న. ఈ ప్రశ్నలు ఇక్కడితో ఆపుతాను. నా మొదటి వాదన – ఒక రచనకీ దానిమీద వచ్చిన వ్యాఖ్యలకీ ఎడం ఎంతగా పెరిగిపోతోందో, ఎంత అర్థరహితం అయిపోతోందో తరిచి చూసుకుందాం అంటున్నాను.

మూడోరకం వ్యాఖ్యలు రచనలో అంశాలను రచయితకు ఆపాదించి వ్యాఖ్యానించేవి. నేను రాసే కథల్లోనూ వ్యాసాల్లోనూ నా అనుభవాలు ఉన్నా అవి సార్వజనీనం అనుకున్నప్పుడే వాటిని కథల్లో వ్యాసాల్లో చొప్పిస్తాను. అంటే అది ఒక్క నా అనుభవమే కాదు, చాలామందికి వర్తిస్తుంది అని. అలాటప్పుడు అది నా ఆత్మకథ అయిన్నట్టుగా నాజీవితంలో ఇతర విషయాలు ప్రస్తావించడం, నాకు “సముచిత” సలహాలివ్వడం, సానుభూతి చూపడం వంటివి చేస్తున్నారు. అపార్థం చేసుకోకండి. నేను ఈ విషయం ఇక్కడ ప్రస్తావిస్తున్నది ఇది నా ఒక్క అనుభవమే కాదు అని చెప్పడానికే. చాలామంది రచయితలు నాతోనే ప్రత్యక్షంగా చెప్పేరు వారికి కూడా ఇలాటి  అనుభవాలు ఎదురవుతున్నాయని.

ఈ విషయంలో చిన్న ప్రయోగం చెయ్యదలుచుకుని నేను ముఖపుస్తకంలో రెండు పోస్టులు పెట్టేను. ఒకటి నాపేరుతోనే.

చిన్న చిన్న నొప్పులు చీమల్లా గులాబీముళ్ళలా

ప్రాణాంతకాలు కావు కానీ పనులు చేసుకోనివ్వవు.

ఇది నా స్వంత అనుభవమని చెప్పలేదు. ఏం చెయ్యమంటారని సలహాలు అడగలేదు. అయినా సలహాలు వచ్చేయి. సుప్రసిద్ధులయిన కవులూ, వేదాంతవిదులూ చెప్పిన వాక్యాలు ప్రతిరోజూ కనీసం 5, 6 కనిపిస్తాయి ముఖపుస్తకంలో. ఆ ప్రవచనాలదగ్గర ఏ సలహాలూ ఉండవు.

అది ఋజువు చేసుకోడానికి నాపేరు చెప్పకుండా కొన్ని వాక్యాలు రాసేను.

“కవులు ఉపాధ్యాయులు సుభాషితములు చెప్పుదురు.

నటులు, నాయకులు నటింతురు”

– అజ్ఞాతకవి.

“కవులు స్వీయ అనుభవము వ్రాసినను అది లోకసామాన్యముగ మాత్రమే ఆవిష్కరింతురు. కొందరు అమాయకులు దానిని కవిజీవితమునకు అన్వయించి స్పందించవచ్చును. నేను గాడిదగురించి వ్రాసిన నన్ను గాడిదగా గుర్తించవచ్చును. స్వర్గమునుగూర్చి వ్రాసిన నేను స్వర్గవాసినయితినని తలపవచ్చు.”

– అజ్ఞాత కవి.

ఈ పోస్టులమీద చర్చ వస్తువుమీదే జరిగింది. నేనే రచయితని అని కొందరు గ్రహించేరని తరవాత తెలిసింది కానీ వ్యాఖ్యానాలలో వ్యత్యాసం సుస్పష్టం.

స్థూలంగా చెప్పాలంటే పూర్వం రచయితలు, స్థానికులూ, వ్యక్తిగతస్థాయిలో పరిచయాలు ఉన్నవారూ విమర్శలూ, వ్యాఖ్యానాలూ వైయక్తికస్థాయిలో నడుపుకున్నారు. ఇప్పుడు సాహిత్యవేదిక virtual వేదికగా రూపాంతరం పొందింది. వ్యాఖ్యాతలు తదనుగుణంగా తమపద్ధతులని దిద్దుకోవాలి. జాలపరిచయాలు ఇతరత్రా వ్యక్తిగత పరిచయాలుగా మారే అవకాశం ఉంది కానీ ఒక రచయితపేరు తరుచూ అంతర్జాలంలో చూసినంతమాత్రాన ఆ రచయితతో హాస్యాలాడే పరిచయం ఏర్పడిపోయినట్టూ కాదు, సమంజసమూ కాదు. వస్తువుమీద దృష్టి ఉంచి చేసిన వ్యాఖ్యలకి ఉన్న గౌరవం హేళనకీ, ప్రధానాంశాన్ని వదిలేసి తమకి తోచినట్టు రాసే వ్యాఖ్యలకీ ఉండదు. రచయితలు విమర్శలను ఆదరించడంలేదు అని రచయితలని తప్పు పట్టేముందు విమర్శలూ, వ్యాఖ్యలూ ఆమోదించదగ్గవిగా ఉన్నాయో లేదో కూడా చూడాలి.

రచయితలూ వ్యాఖ్యాతలూ – ఇరు పక్షాలవారూ వస్తునిష్ఠతో తమ ఆలోచనలు వ్యక్తం చేస్తేనే వీరికీ వీరికీ కూడా గౌరవమూ, సాహిత్యానికీ గౌరవమూను క్షీరనీరన్యాయంగా. లేకపోతే తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదం అయి అర్థరహితం అయిపోతుంది చర్చ.

000

తాజాకలం: నేను పైన “కరుణ ఏవ ఏకో రస:” భాసుడు అన్నాడని రాసేను. ఈవ్యాసం సారంగ పత్రికలో ప్రచురించేక ఎ.కె. ప్రభాకర్ అది భవభూతి వాక్యమని విశదం చేసేరు. అలాగే Srinivas Vuruputuri పూర్తి శ్లోకం ఇచ్చేరు. ప్రభాకర్ గారికీ, శ్రీనివాస్ ఉరుపుతూర్ గారికీ ధన్యవాదాలు. ఇలాటి వ్యాఖ్యలే కదా నిజంగా రచయితకీ, పాఠకులకీ కూడా ఉపయోగపడేవి.

Srinivas Vuruputuri says:

July 14, 2016 at 8:59 am

ఏకో రసః కరుణ ఏవ నిమిత్త భేదాత్

పృథక్ పృథక్ ఇవ ఆశ్రయతే వివర్తాన్

ఆవర్త బుద్బుద తరంగ మయా వికారాన్

అంభో యథా సలిలమేవ తు తత్ సమస్తం.

ఈ శ్లోకం ఇక్కడినుండి సేకరించేరుట.


వ్యాసంలో ప్రస్తావించిన ఊసుపోక టపాకి లింకు ఇక్కడ

(జులై 12, 2016)

మీ వ్యాఖ్యలు ఇక్కడ కానీ సారంగలో గానీ ప్రచురించవచ్చు.
ధన్యవాదాలు.

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

6 thoughts on “వ్యాఖ్యానాలు – నా అనుభవాలు”

 1. విపులంగా మీ అభిప్రాయం వివరించినందుకు చాలా సంతోషం చంద్రిక గారూ. మీరు ఇంత మంచి తెలుగులో రాస్తున్నందుకు ప్రత్యేకంగా అభినందనలు.
  నా పోస్టులు మీకు నచ్చుతున్నందుకు చాలా సంతోషం. “అమెరికావారు గట్టిగా అరవకుండా” అన్నది బాగానే ఉంది కానీ నాకు తెలుగులో రాయడం ఇష్టం కనకనూ, తెలుగువారికోసం కనకనూ తెలుగులో రాసేను. 🙂
  నాకు చిన్నప్పట్నుంచి అలా మాటాడడమే అలవాటు. ఈమాట మీరు ఇతర రచయిలగురించి అన్నమాటకి సమాధానంగా కూడా చెప్తున్నాను.
  మీరన్నమాట నిజమే. కొందరు రచయితలు పాఠకులంటే గౌరవం లేనట్టు ప్రవర్తిస్తున్నారు. మీలాగే నేను కూడా వారికి దూరంగా ఉంటాను. వారికి నేను చప్పగలిగిందేమీ లేదు. మీలాగే నేను కూడా వారికి దూరంగా ఉంటాను. నా వ్యాసం చివరివాక్యంలో చెప్పినట్టు వారూ వీరూ కూడా ఒకరిొనకరు గౌరవింంచుకోడం నేర్చుకోవాలి. దురదృష్టవశాత్తు ఆధునిక సమాజం ఒక్క రచయితలకే కాదు అందరికీ కూడా స్వోత్కర్ష, నాకే తెలుసన్న అహంకారం తిరుమంత్రం చేసింది.

  మెచ్చుకోండి

 2. చాలా బాగా విషయం చెప్పారు మాలతి గారు. విషయం ఏదైనా సరే చెప్పడం లో అనుభవజ్ఞులు మీరు 🙂 అమెరికా వారు గట్టిగా అరవకుండా ఖచ్చితమైన కంఠం తో తెలుగు లో చెప్తున్నట్లే ఉంటుంది మీరు చెప్తుంటే!! మరి అన్ని ఏళ్ళు అమెరికా లో ఉండటం వలననేమో . నాకు ఈమధ్య వచ్చిన మీ టపాలలో ‘మనలో మనమాట 18 – అతిథులే ఆచార్యులు’ చాలా బాగా నచ్చింది. కొన్ని అనుభవాలు కూడా దానికి తోడయ్యాయేమో మరి.
  సారంగ లో మీరు చెప్పిన విషయం అంతా బానే ఉంది కానీ రచయితలే పాఠకుల మనోభావాలని క్రించపరుస్తున్నప్పుడు ఏం చేయాలి అన్నదే నా ప్రశ్న? మీరు చెప్పినట్లు అందరూ రచయితలు అయిపోతున్నారు. నేనూ అలా ఒక బ్లాగరు ని అయిపోయిన దాన్నే 🙂 కథ అయినా, వ్యాసం అయినా ఈ మధ్య ఒక కులాన్ని తిట్టడమో, ఏదో ఒక వాదం గురించి చెప్పడమో చేస్తున్నారు. నా లాంటి పాఠకుల కి ఏదో ఒక కథ కాలక్షేపానికి అని చూడగానే గందరగోళ వ్యవహారం లాగా ఉంటోంది. ఈ మధ్య ఈ రచయితలని గుర్తు పెట్టుకుని కొంచం దూరం గా ఉంటున్నాను. ఇటువంటి రచయితలకి కూడా ఏవైనా సూచనలు మీ పద్ధతి లో సూచనలు చేయమని నా విన్నపం.

  మెచ్చుకోండి

 3. వ్యాఖ్యలు యేలా గుండా
  లోయ్ ? ఖ్యాతి గలుగు జిలేబి లూరెడి పలుకున్
  విఖ్యాతటపా మాలతి
  సౌఖ్యము గా వ్రాసెనోయి సారం గరయన్ !

  చీర్స్
  జిలేబి

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s