మనలో మనమాట 20 – తప్పులున్నాయి, తరవాత మీఇష్టం

కాయితంమీద కలం పెట్టి ఉత్తరాలు రాసుకునే రోజుల్లో చివర్లో “తప్పులున్న క్షమించవలెను,” అని ఒక వాక్యం చేర్చేవారు. భాషలో పొరపాట్లతోపాటు రాసిన విషయంలోనో రాసితీరులో మర్యాదాలోపం అయితేనో క్షమించమని ఆ విన్నపం. అదొక లాంఛనం, అంతే. నిజంగా తప్పులున్నాయని గానీ, దండన విధించమని గానీ కాదు.

ప్రాచీనకాలంలో రాతిమీద చెక్కిన శాసనాలలో అక్షరదోషాలు ఉండేవా అని నాకు ఇప్పుడు అనుమానం వస్తోంది. నాకు తెలీదు. తాటాకు గ్రంథాలలో తప్పులుండేవో లేదో కూడా నాకు తెలీదు. బహుశా ప్రెగడ నరసరాజు మొదలు పెట్టేడోమో ఈ సంప్రదాయం  పెద్దల పద్యాలలో తప్పులు పట్టగలనంటూ. ఈయనెవరో గానీ ఈ తప్పులు పట్టువిద్య తప్ప మరే విశేషాలూ తెలీవు మహానుభావుడిగురించి.

ప్రెగడ నరసరాజు ప్రగల్భాలూ స్వోత్కర్షలగురించి తెనాలి రామకృష్ణడు చెప్పిన పద్యం ఎవరికైనా తెలీకపోతే ఇదుగో,

తెలియనివన్ని తప్పులని దిట్టతనాన సభాంతరంబునన్

పలుకగ రాదురోరి పలుమారు పిశాచపు పాడె గట్ట నీ

పలికిన నోట దుమ్ము వడ భావ్య మెరుంగక పెద్దలైన వా

రల నిరసింతువా ప్రగడ రాణ్ణరసా విరసా తుసా భుసా !!

అచ్చు పత్రికలు వచ్చేక, గాలీలో ఒకొక అక్షరమే బోర్లేసి కూర్చేరోజులలో పుస్తకాలలో తప్పులు రావడం, ఆ తప్పులను ప్రూఫ్ దిద్దుకుని మరో రెండో మూడో పేజీలు “తప్పొప్పుల పట్టిక” చేర్చడం జరిగేది. ఎంతమంది ఆ పట్టిక చూసుకుని ముందుకీ వెనక్కీ వెళ్లి పుస్తకం చదువుకునేవారో అన్నది అనుమానమే.

000

సారంగలో నా వ్యాసం వచ్చేక, నాకు తప్పులకత రాయాలనిపించింది. నిజానికి ఇది రెండోమారు నేను రాయడం. ఇంతకుముందు ఒత్తులేవీ  అని ఒక పోస్టు రాసేను. దానికి ఇది అనుబంధం అనుకోవచ్చు. సారంగ లో ప్రచురించిన వ్యాఖ్యానాలు నా అనుభవాలు వ్యాసానికి కూడా అనుబంధం అనుకోవచ్చు.

ఆ వ్యాసంలో నేను కరుణ ఏవ ఏకో రసః వాక్యం భాసుడి వాక్యం అని రాసేను. ఈ విషయం ముఖపుస్తకంలో చర్చించేను కానీ అప్పుడు కవిపేరు చెప్పలేదనుకుంటాను. సారంగలో వ్యాఖ్యాతలు, ఎ,కె. ప్రభాకర్ ఆ కవి భాసుడు కాదనీ, భవభూతి అని చెప్పేరు. శ్రీనివాస్ ఉరుపుతూర్ శ్లోకం పూర్తిగా ఉదహరించేరు.

ఏకో రసః కరుణ ఏవ నిమిత్త భేదాత్

పృథక్ పృథక్ ఇవ ఆశ్రయతే వివర్తాన్

ఆవర్త బుద్బుద తరంగ మయా వికారాన్

అంభో యథా సలిలమేవ తు తత్ సమస్తం. (http://stotram.lalitaalaalitah.com/2011/11/quotable-quotes-from-sanskrit-classics.html నుండి సేకరించారుట.).

ఇవి ఎన్నదగిన వ్యాఖ్యానాలు. వీటివల్ల నేను ఒక ముఖ్యమైన అంశం సరి దిద్దుకోడానికీ, వ్యాసం మరింత పరిపుష్టం చేయడానికీ వీలయింది. భవిష్యత్తులో ఎవరైనా ఈ వ్యాసం చూస్తే, విషయం సుబద్ధంగానూ సప్రమాణంగానూ ఉపయోగపడతాయి. అదీ నేను వ్యాఖ్యాతలనుండీ ఆశించేది. అలాగే పొరపాటున ఒకే వాక్యమో పేరానో రెండుమార్లు వస్తే అది ఎత్తి చూపితే కృతజ్ఞతలతో ఆహ్వానిస్తాను.

ఇక్కడ మరో ముఖ్య విషయం ఆనందంగా చెప్పుకుంటాను. పైన చెప్పిన పొరబాటు గురించి ఆ సైటు సంపాదకులలో ఒకరైన కల్పనా రెంటాలకి మెయిలు ఇచ్చేను వీలయితే ఆ పొరపాటు సరిదిద్దమని కోరుతూ. సాధారణంగా అచ్చుపత్రికలలో ఇలా తప్పులు దిద్దడం సాధ్యం కాదు. జాల పత్రికలలో ఎంతమంది సంపాదకులు ఇలాటి అధిక శ్రమకి సుముఖులో నాకు తెలీదు. అందుకు వారిని నేను తప్పు పట్టను. వీరంతా అనేక  వ్యాపకాలమధ్య ఈ పత్రికలు నడుపుతున్నవారే కనక ఈ దిద్దిబాట్లు సాధ్యం కాదంటే నాకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో నా అభ్యర్థనను మన్నించి, కవిపేరు సరి దిద్దిన కల్పనా రెంటాలకి మనఃపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇందుమూలంగా.

ఇప్పుడు నిజ తప్పులగొడవ చెప్తాను. ప్రెగడ నరసరాజు తప్పులు పట్టడానికి ఆద్యుడేమో అన్నాను కదా. నిజంగా నాకు తెలీదు. ఇది నా ఊహ మాత్రమే. ఏమైనా ఆ రోజుల్లో అదొక ప్రత్యేక కళ అయిఉండాలి. అందుకే ఆయన తప్పులు పట్టడంో తనకంటే ఘనుడు లేనని ప్రముఖకవులని సవాలు చేస్తూ ఊరూరా తిరిగేడు.

ఆధునిక కాలంలో ఈ తప్పులు పట్టడానికి కారణాలు వెతికేముందు తప్పులెందుకొస్తున్నాయో చూదాం.

1, ప్రధానంగా కంప్యూటరు తెరమీద అక్షరాలు సరిగా కనిపించకపోవడం ఒకటి కావచ్చు. ప్రస్తుతం నేను వాడుతున్న Kingwriterలో ద్విత్వాక్షరాలు కొన్నిచోట్ల కిక్కిరిసిపోయి ఉంటాయి. లైను ఎడం పెంచడానికి ప్రయత్నించేను కానీ సాధ్యం కాలేదు. అలాగే కొన్ని Keyboard layout లో ఏ అక్షరం ఎక్కడుందో కనుక్కోలేకపోవడం మరో కారణం. ఈ కారణంగానే కొన్ని పదాలకి కొత్త వర్ణక్రమాలు దాదాపు స్థిరపడిపోయాయి. ఉదాహరణకి జ్ఞానంకి జ్నానం, వృద్ధుడు కి వ్రుద్ధుడు, మృతుడుకి మ్రుతుడు చెప్పుకోవచ్చు.

 1. మాండలీకాలు. ఒక ప్రాంతంలో వచ్చేడు అంటే మరో ప్రాంతంలో వచ్చాడు అనొచ్చు. ఇంకా వచ్చిండుఅనో వచ్చినాడు, ఒచ్చినాడు, ఒచ్చేడు … ఇలా అనేక విధాలు అంటున్నారు, రాస్తున్నారు. ఇది చాలామందికి స్పష్టంగానే తెలుసు కానీ తెలీనివి కూడా అనేకం ఉన్నాయి. మాండలీకం, కుటుంబసంప్రదాయాలమాట వదిలేసినా మేం ఇలాగే మాటాడతాం అని ఎలా వినిపిస్తుందో అలా రాయడం పద్ధతిగా జరుగుతోంది. ఉదాహరణకి లక్ష్మివారం లక్షింవారం అని పలకడం ఉంది. అక్షరదోషం లేకుండా రాయాలంటే లక్ష్మివారం, పలికినట్టు రాస్తే లక్షింవారం. ఇది గుర్తించనివారు లక్షింవారం తప్పు అని ఎత్తి చూపవచ్చు.
 2. ఇది నిజానికి ఎక్కువగా జరుగుతున్నది. తొందరపాటు. ముఖ్యంగా అంతర్జాలంలో గుంపులు అరచేతిలో ఐఫోనులో అంగుళంన్నరచదరప కీబోర్డుమీద గబగబ టైపు చేసేస్తున్నప్పుడు తప్పులు దొర్లుతాయి. దిద్దుకునే ఓపికా ఉండదు, తీరికా ఉండదు.

అమ్మా, బాబూ, ఇదీ నేపథ్యం నేను చెప్పదలుచుకున్న విషయానికి. నాకు భాషాభిమానం ఉందని ఒట్టి గొప్పలు చెప్పుకోడం కాదు. ఆచరణలో కూడా పెట్టడానికి యథాశక్తి ప్రయత్నిస్తాను మీరు నమ్మినా నమ్మకపోయినా. తప్పులు లేకుండా రాయడానికి చాలా తాపత్రయపడతాను. పది సార్లు రాసింది చూసుకుంటాను. అయినా రెండో మూడో తప్పులు దొర్లుతాయి. పైన చెప్పిన కారణాల్లో మొదటిది కొంతవరకూ నాపట్ల నిజం.

ఈ మధ్య తరుచూ కనిపిస్తున్న వ్యాఖ్య “తప్పులున్నాయి, దిద్దుకోండి” అని. నేను బ్లాగు మొదలు పెట్టిన కొత్తలో అంటే 2008లో ఈ వ్యాఖ్య కనిపించినప్పుడు చాలా గాభరా పడిపోయి మళ్ళీ మళ్ళీ చూసుకుంటూ వచ్చేను కానీ అనతికాలంలోనే గ్రహించినదేమిటంటే అలా తప్పులు లేకుండా రాసినంతమాత్రాన పాఠకులసంఖ్యేమీ పెరగలేదు సరి కదా తప్పులున్నాయని ఎత్తి చూపినవారు కూడా పోస్టులు చదువుతున్న జాడ లేదు. అంటే పదోతరగతి composition classలో లాగ పాఠం చెప్పడంవరకే వారి ధర్మం అయినట్టు. అందరూ చదువుతారని హామీ ఏమీ లేదు. నిజానికి అలా తప్పులు పట్టేవాళ్ళు కూడా అలా చెప్పడంతో తమ పని అయిపోయినట్టు ఊరుకుంటారు.

అనేక తప్పులతో అచ్చయిన నా పుస్తకాలు ఆఫీసుకి టైమయిపోతున్నా ఆపకుండా చదివేసిన వారున్నారు. నాపేరు ఏనాడూ వినకపోయినా పుస్తకం లైబ్రరీలో చూసి సందేహిస్తూనే తీసుకుని పూర్తిగా చదివేసినవారున్నారు. చెప్పొచ్చేదేమిటంటే ఈమధ్య తప్పులు పట్టడం ఫేషనయిపోయినట్టుంది. “తప్పులంటే నాకు అసహనం,” “తప్పులుంటే చదవలేను” అనుకునేవారకి చదవడానికి తప్పుల్లేని పుస్తకాలు ఎన్ని దొరుకుతున్నాయో నాకు తెలుసుకోవాలని ఉంది. ఆశ్చర్యపోకండి. ఎడిట్ చేయడమే వృత్తిగా స్వీకరించి డబ్బు తీసుకుని ఎడిట్ చేసినపుస్తకాల్లో కూడా, ఇంగ్లీషు పుస్తకాల్లో  కూడా తప్పులు చూసేను నేను.

ఒకమారు ఒకమ్మాయి నావ్యాసంలో తప్పులున్నాయని చెప్పింది. ఆ తరవాత కొన్ని రోజులయేక ఆ అమ్మాయే మరొక బ్లాగులో విషయంమీద వ్యాఖ్యానించింది. ఆ వ్యాసంనిండా లెక్కకు మిక్కిలి అక్షరదోషాలున్నాయి. మరి అక్కడ అక్షరదోషాలగురించి వ్యాఖ్యానించలేదేం అని అడిగితే ఏం చెప్తాం అని నాన్చేసిందా అమ్మాయి. అంటే అక్కడ విషయం తనకి నచ్చింది కనక తప్పులు బాధించలేదు. నాపోస్టులో విషయం నచ్చలేదో, నేను సరిగా ఆవిష్కరించలేదో కానీ అక్షరదోషాలు మాత్రమే కనిపించేయి ఆవిడకి. ఇది అమెరికాలో సర్వసాధారణం. విషయంమీద వ్యాఖ్యానించడానికి ఏమీ లేకపోతే (కనీసం వారిదృష్టిలో),  వర్ణక్రమంమీదకి దాడి చేస్తారు లేదా ఏదో ఒకటి వ్యాఖ్యనించాలన్న తపనతో చెప్తారు.

నాబ్లాగు చూసేవారిలో సాహిత్య అతిరథులూ, మహారథులూ కూడా ఉన్నారు. నేను మాటాడేవిషయాలమీద వారికి ఏ అభిప్రాయాలూ తోచవేమో ఫాంటు సైజు పెంచండి, ఫలానావాక్యం ఇలా ఉండాలి, ఫలానాచోట స్పెల్లింగు సరిగా లేదు లాటివ్యాఖ్యలు మాత్రమే రాస్తారు. నేను రాసేవిషయాలు తమకి బాగులేకపోతే నాబ్లాగు చూడడం మానేయవచ్చు. అది మరి నా జాతకమేమో తెలీదు కానీ విషయంమాట ఎత్తకుండా కేవలం అక్షరదోషాలగురించే వచ్చే వ్యాఖ్యలు నాకు ఎక్కువగానే ఉంటున్నాయి.

ఇన్ని ఆక్షేపణలు చూసేక, నాకళ్ళు కూడా ఈ తప్పులమీద పజుతున్నాయి. అయితే అవి నన్ను అందరూ అనుకున్నంతగా బాధించవు. విషయం నాకు నచ్చితే చదువుకుంటూ పోతాను. నచ్చకపోతే, తప్పులు లేకపోయినా, దానికి బంగారు మలామా వేసినా చదవను.

నాకు ఓపినంతవరకూ తప్పులు లేకుండా చూసుకుంటున్నాను. మూడో నాలుగో తప్పులుండొచ్చు. ఆపైన మీఇష్టం. తప్పులున్నాయని చెప్పడానికే నాకు వ్యాఖ్యలు రాయకండి. విషయంమీద మీకు శ్రద్ధ ఉంటే, దానిమీద చెప్పగలిగినదేమైనా ఉంటే, చెప్పి, విషయానికి సంబంధించిన పొరపాట్లు ఏమైనా ఉంటే చెప్తే ఉభయత్రా లాభం. అలా చేసినందువల్ల నావ్యాసం ఎక్కువ ఉపయోగపడుతుంది.

సూక్ష్మంగా చెప్పాలంటే ఎంత జాగ్రత్త పడ్డా అనేక కారణాలవల్ల అక్షరదోషాలు వస్తున్నాయి. వస్తువు వదిలేసి అక్షరదోషాలమీద మాత్రమే వ్యాఖ్యానించడం పెట్టెలో వస్తువుని వదిలేసి పెట్టె కంటికి ఎంత నదురుగా కనిపిస్తోందో చూడడంలాటిదే.  నాక్కావలసింది నేను చెప్పింది మీకు నచ్చిందా లేదా, ఎందుకు అన్నది మాత్రమే. వస్తువు పట్టించుకోకుండా అక్షరదోషాలగురించి వ్యాఖ్యానిస్తే నాకు కూడా పట్టదు మీవ్యాఖ్య.

000

(జులై 15, 2016)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

14 thoughts on “మనలో మనమాట 20 – తప్పులున్నాయి, తరవాత మీఇష్టం”

 1. తప్పులు వెదుకుటె పనిగా
  తప్పక ప్రతి బ్లాగు దూరి తలమునకలుగా
  తప్పులె వెదికెడు ఘనులకు
  ఒప్పదు రచనా మనోఙ్ఞ మొప్పరు గుణముల్ .

  తప్పులు వెదికే వారలు
  తప్పక తమ రచన చదివి తమలో గల యీ
  తప్పులు వెదికే దుర్గుణ
  మిప్పటికైనా విడుచుట మేలగు నండీ .

  మెచ్చుకున్నవారు 2 జనాలు

 2. ఇండియాలో కేసీఆర్ ని తిట్టేవాళ్ళెంతమంది ఉన్నారో పొగిడేవాళ్ళూ అంతేమంది ఉన్నారు.ఇపుడు జనాలు చరిత్ర చూడడం లేదు,వాళ్ళవల్ల మనకొరిగేది ఏమైనా ఉందా అని మాత్రం చూస్తున్నారు.రచనల విషయమైతే అప్పటికపుడు మనకు ఎంటర్టైన్మెంట్ ఉందా లేదా అన్నది మాత్రమే చూస్తున్నారు.వ్యాకరణం గురించి పాత తరమే పట్టించుకుంటున్నది.ఇప్పటి తరానికి తెలుగు రావడమే గొప్ప !

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 3. అలాగేనండి. ఒకొకరికి ఒకొక అభిప్రాయం ఉంటుంది. ప్రస్తుతం అమెరికాలో ట్రింప్ మాటతీరుని ఎంతమంది ఆహ్వానిస్తున్నారో ఎంతమంది గర్హిస్తున్నారో చూసేరా. అదీ లోకంతీరు.

  మెచ్చుకోండి

 4. మీరు వేేరే తప్పులగురించి రాస్తున్నారు. ఇక్కడ నేను ప్రస్తావించింది కేవలం అక్షరదోషాలగురించే. ఒక కథలో పాత్రల ప్రవర్తన తప్పా ఒప్పా, అది ఆవిష్కరించిన తీరు సమంజసమా కాదా అన్నది వేరే సంగతి.

  మెచ్చుకోండి

 5. తెలియనివన్ని తప్పులని దిట్టతనాన సభాంతరంబునన్

  పలుకగ రాదురోరి పలుమారు పిశాచపు పాడె గట్ట నీ

  పలికిన నోట దుమ్ము వడ భావ్య మెరుంగక పెద్దలైన వా

  రల నిరసింతువా ప్రగడ రాణ్ణరసా విరసా తుసా భుసా !!
  రామకృష్ణ కవి తప్పులు పట్టేవార్ని గురించి అంతబాగా చెప్పేక మరి ఇంకెందుకు తప్పుల వెతుకులాటలు అసలు ఈ రోజుల్లో తెలుగు చదివేవారే కరువయ్యారు మరి అందులో తప్పులు వెతుకులాటలా….. కానీ సాహిత్యం చదువుకున్న వారి తీరే వేరు…. మాంఛి స్వీటు తిన్నట్లు ఉంటాయి వాళ్ళ విమర్శలు….. ధన్యవాదాలు.

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 6. తప్పులు ఎత్తిచూపిస్తే చాలా మంది తమ తప్పులు ఒప్పుకోరు సరికదా నాకే నీతులు చెపుతారు. వ్యాకరణంలో గానీ భాషలో గానీ ఒక్క తప్పుకూడా లేకుండా ఎంతో అందంగా వ్రాసే కల్పన తన తన్ హాయి కధ విషయంలో నేను ఎత్తి చూపిన తప్పులను ఒప్పులుగా ప్రచారం చేసుకున్నారు.మనసు పట్టు తప్పిన తరువాత మగాడైనా ఆడదైనా పిల్లలకోసం మనసు చంపుకుని కాపురం చేయడమేమిటో నాకు అర్ధమే కాలేదు.పిల్లల కోసం మనసు చంపుకుని బ్రతకాలా ? మనం అమలుచేయ(లే)ని నీతులను రచనల్లో ఎలా చెపుతారో అన్నది మరొక సందేహం !ఎవరిని మోసం చేయాలని ?

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 7. చాలా బాగా చెప్పేరు. మీకు నారచనలు నచ్చుతున్నాయంటే నాకు చాలా ఆనందంగా ఉంది ధన్యవాదాలు.
  మీ బ్లాగు ఇప్పుడే చూసేను. మీనాన్నగారి పాకలేఖ బాగుంది. శుభాకాంక్షలు.

  మెచ్చుకోండి

 8. తప్పొప్పులు అనేవి చూసే దృష్టిని బట్టి మారుతూ వుంటాయి అని నేననుకుంటూ వుంటాను. ఇష్టులయినవారి తప్పులు ఒప్పుగానూ, కానివారి ఒప్పులయినా తప్పులుగానూ – చూడాలనుకుని మరీ చూసేవారే ఎక్కువ.

  పెద్దవారుగా మీరు చెప్పే మాటలు, పంచుకునే అనుభవాలు నచ్చుతాయి నాకు 🙂

  ~ లలిత

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 9. సరేనండి. నిజానికి మీ వ్యాఖ్య కూడా ప్రధానాంశాన్ని కొంచెం పక్కకి లాగినట్టున్నా ముద్రారాక్షసాలు ఎలా వస్తే ఎలా సమర్థించుకోవాలన్నట్టుంది. ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 10. బాగు వాగు !

  కంప్యూటరు టయిపింగు ల తో కొన్ని సౌకర్యాలు కని బెట్టానండి ; ముద్రా రాక్షసాలైనా కొన్ని పదాల విరుపులు భలే వచ్చెవి ; కామింట్ల లో వేగంగా టయిపు చేసేటప్పుడు కొన్ని నూతన పదాలు పడటం తో అట్లాంటి పదాలెవరన్న లేవే అంటే లేవా , ఎవరూ పుట్టించక పదాలేలా బసతాయి (వస్తాయి :)) అని వీరతాళ్లు మనకు మనమే వేసేసు కోవడం అంతే 🙂

  ముద్రా రాక్షస మందురు
  నిద్రా భంగిమ యనంగ నిక్కము నిదియే
  చిత్రాతిచిత్రములన వి
  చిత్ర పదంబులు తయారు చిటికన జూడన్ 🙂

  చీర్స్
  జిలేబి

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s