మనలో మనమాట 22 – శరీరమే చెప్తుంది ఏం కావాలో

ఈ పోస్టుకి కోడిగుడ్డుతో సరాగాలు అని పేరు పెడదాం అనుకున్నాను కానీ ఇది అంతకంటే విస్తృతమైన వ్యవహారం. అసలు ఈ పోస్టుకి చాలా పేర్లు పెట్టొచ్చు. ఇంతకముందు రాసిన నా ఆరోగ్యసూత్రాలు కి ఇది రెండోభాగం అనుకో. లేదా వంటలపుస్తకం-రెండో భాగం, నా యోగా యాగీ అంటూ. అంచేత ఇది చదివినవారికి అనేక పోస్టులు చదివిన ఫలము కలుగును. సకల సౌభాగ్యములమాట మాత్రం చెప్పలేను.

ప్రధానంగా నేను ఏ రోజు ఏం తింటాను అన్నది నా మెదడు ఉపయోగించో జాలంలో ఎవరో చెప్పిన అనన్యసామాన్యమైన రెసిపీ చూసో  జరగదు. నా దేహమే నాకు చెప్తుంది. ఇంకా నిర్దుష్టంగా చెప్పాలంటే ఆజ్ఞలే. నేనలా చెయ్యను అనడానికి నాకు అధికారం లేదన్నమాట.

“నేను” అంటే నాదేహం అదే నీదేహమే కదా ఈ చరాచరజగత్తులో అని అడక్కు. శరీరం లేకపోతే నేను లేను అని నాలుగోతరగతి కుర్రాడు కూడా చెప్పేయగలడు. అదే సత్యము నీకు సంబంధించినంతవరకూ. నాకు సంబంధించినది వేరే ఉంది. ఇది చెప్పడానికే ఈ పోస్టు.

నాదేహంతో నా సంభాషణ సుమారుగా ఇలా ఉంటుంది. నాకు నాలుక పిడచకట్టుకుపోతోందనుకో.

“లేచి మజ్జిగలో ఓ ఉప్పురాయి వేసుకు తాగరాదూ.”

ఆకలేస్తున్నట్టుంది.

“నాకివాళ పకోడీలు తినాలనుంది.”

పకోడీలేమిటి ఎవరైనా వింటే నవ్వుతారు. మధ్యాహ్నంపూట సంపూర్ణాహారం తినాలి.

“వీల్లేదు. నాకు పకోడీలే కావాలి.”

000

“నాకిప్పుడు మైసూరుపాకు కావాలి.”

శనగపిండి లేదు. రేపు చూదాంలే.

“వెళ్ళి తీసుకురా శనగపిండి, మంచి నెయ్యి కూడా తీసుకురా.”

000

సంచారానికి సమయం అయింది. కాళ్ళు లాగేస్తున్నాయి. ఇవాళ ఎక్కువ దూరం వెళ్ళను.

“పోషకపదార్ధాలు తినాలని చెప్పేను కదా.”

నాకు చిరాకు వేస్తుంది. పకోడీలు, మైసూరుపాకు తింటే ఎలా వస్తుంది బలం అంటే  వినదు శరీరం. సరే, ఏం చేస్తాం, ఈ అనశ్వర శరీరం ఉంటేనే కదా నేను ఉండేది. అది చెప్పినట్టు వినాలి అని వారినీ వీరినీ, అడిగీ, అంతర్జాలం చూసీ అనేక పోషకహారాల వివరాలు సేకరించేను. టోఫూ, చియా గింజలు బాగానే ఉన్నాయి. అలాగే కాటేజి ఛీజ్ నాకు చాలా నచ్చింది. సెజ్జగింజలు పొడి కూడా చాలా మంచిది అన్నారు కానీ ఒకసారి కొన్నిది బాగుంది, రెండోమారు కొన్నది కొంచెం చేదుగా ఉంది. వేయిస్తే చేదు చస్తుందన్నారు. ఏమైనా ఇంకా ఏమేం ఉన్నాయా అని ఆలోచిస్తున్నాను.

“కోడిగుడ్డు తిను.”

నాదేహం ఇలాటి అర్జీలు పెట్టినప్పుడు నిజంగానే నాకు కోపం వస్తుంది. అంటే కోడిగుడ్డు తింటే నా బ్రాహ్మణ్యం మంట గలిసిపోతుంది, కాశీలో ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని కాదు. ఈ దేశం వచ్చినప్పుడే అది మంట గలిసిపోయింది నాకే తెలీకుండా. ఎలా అంటే ఏ హోటలుకో వెళ్లినప్పుడు అతి జాగ్రత్తగా పరిశీలించి వెజి సూపు తెమ్మని అడుగుతాను. కొంతకాలం అయేక తెలుసుకున్నది వెజీ అంటే కూరగాయలు కూడా ఉన్నది అనే కేవలం కూరగాయలతో మాత్రమే చేసినది కాదు. ఆ తరవాత తెలిసింది కేవలం కూరగాయలే ఉన్నా ఏ చికెన్ స్టాకో ఉంటుంది. మరి ఒకమారు వ్రతభంగం అయింతరవాత ఇక ఏం తిన్నా తినకపోయినా ఒకటే కదా.

ఒక సారి విస్కాన్సిన్లో ఏదో హోటలులో ఇలాగే వెజీ సూపడిగితే, ఆ సర్వరు చాలా విచారంగా మొహం పెట్టి, అందులో చికెన్ స్టాక్ ఉంది అన్నాడు. విస్కాన్సిన్లో భారతీయ సంస్కృతి తెలిసినవారు ఎక్కువ. అతనికి అంత తెలిసినప్పుడు అతని జ్ఞానాన్ని నేను గౌరవించాలి కదా. అఁచేత సరే అయితే మరేదైనా తీసుకురా అన్నాను.

ఇంతకీ నాకు పోషకపదార్థములు అవుసరం అని తెలిసేక, బోలెడు పరిశోదనలు చేసేను అన్నాను కదా. ఇచ్చే నాథుడు లేడు కానీ ఒక యం.ఫిల్ అయినా వచ్చి ఉండేది నేను సేకరించిన సమాచారానికి.

సరే. సున్నపుకాయ కథ. అన్నట్టు చెప్పేనా నా కాలేజీరోజుల్లో కొత్తగా ఆధునిక తిళ్లు మొదలు పెట్టినవాళ్లు కేకులాటివి ఇంట్లో చేసేవారు. కానీ కోడిగుడ్డు అన్న పదానికి, పదానికి మాత్రమే అభ్యంతరం. అంచేత సున్నపుకాయ అనేవారు!

నేను చాలాకాలంగానే కేకు,, ఐస్క్రీంలాటివి తింటున్నాను. వాటిలో కోడిగుడ్డు సొన ఉంటుందని తెలుసు కూడా. అంచేత నాకు అభ్యంతరం లేదనే చెప్పాలి మాటల్లో చెప్పాలంటే. తినడానికొస్తే మాత్రం ఆమ్లెట్ లాటివి తినను అంటే తినలేను. నా నాలుక ఆ రుచికి సుముఖం కాదు. ఇష్టపడుతూ తింటేనే కదా ఒంట బట్టేది.

అంచేత దానికి ప్రత్యామ్నాయ పద్ధతికోసం ప్రయోగాలు మొదలు పెట్టేను. మొదట అందరిలాగే రెండు గుడ్లు చితక్కొట్టి ఆ సొనలో కొంచెం పాలూ, ఉప్పూ, పచ్చి మిరపకాయలూ, ఉల్లిపాయలూ వేసి నూనెలో వేసి వేయించేను.

“బాగులేదు.”

టొమోటోలు, కొత్తిమీర వేసేను.

“ఉఁ ఉఁ నాకు బాలే.”

ధనియాలూ, జీలకర్రా పొడి కొట్టి కలిపేను.

“యాక్.”

చెక్కా, మొగ్గా, యాలకపొడి … మొత్తం అరలో ఉన్న పచారీసామానులన్నీ కుమ్మరించి మరికొంచెంసేపు వేయించేను.

“ఛీ. నాకొద్దు కాక వద్దు.”

ఆఖరికి నాకు అర్థమయింది. నాబుర్రలో “గుడ్డు రుచి బాగుండదు” అని గట్టిగా పాదుకుపోయింది. నేను చేస్తున్నంతేపూ ఆ భావం నా బుర్రలో అలా మెదుల్తూనే ఉంటుంది. ఇంకెవరయినా చేసి పెడితే తప్ప నాకు కోడిగుడ్డు తినే యోగం లేదు. మరో పద్ధతి ఏమిటంటే నాలుక కాలిపోయేంత కారం, అగ్నిమాపకదళంవారి అవుసరం అయేంత కార,ం తగిలిస్తే కొంత లాభం కనిపించవచ్చు. అంటే ఆ కారం నసాళానికంటి

ఆ తరవాత మరే రుచీ తెలీదు. హ్మ్. లేదులే, ఈ రెండూ జరిగేవి కావు.

అప్పుడే తెలిసింది ఒక చెంచాడు అవిసెగింజల పొడి ఒక గుడ్డుకి సమానంట పోషకాహారం దృష్ట్యా. అంచేత ఇప్పుడు అవిసె గింజలమీద పడ్డాను. కూరల్లో కొంచెం పొడి చల్లేస్తే బాగానే ఉంది.

“తింటే సరా? అవి అరిగితేనే కదా ఒంటికి పట్టడం.”

ఇది యోగా యాగీ అధ్యాయం. ఎక్కడ నొప్పి ఉంటే దానికి సంబంధించిన ఆసనం పేరుతో కాళ్ళో, చేతులో, వెన్నెముకనో శ్రమ పెట్టడం అన్నమాట. ఉదాహరణకి, లాప్టాపు ఒడిలో పెట్టుకుని గంటలతరబడి పని చేస్తూనో, చేస్తున్నట్టు నటిస్తూనో కూర్చుంటే అయిన పని ఏమీ కనిపించకపోయినా దండలూ, మోచేతులూ పట్టేయడం ఖాయం. ఇది తెలిసేక, లాప్టాపు సేవ తగ్గించేసేను. ఫరవాలేదులే, నా స్నేహితులందరూ అర్థం చేసుకుంటారు. అంతే కాదు. రెండు బరువులు రెండు చేతులతో పుచ్చుకుని వ్యాయామంలాటిది కూడా చేసేస్తే దండలు మళ్ళీ దారిలోకొస్తాయని కూడా గ్రిహించేను.

DSC00098నవ్వకు మరి. డాక్టరు నావల్ల సాధ్యం కాదన్న పని ఈ బరువులమూలంగా సాధ్యమయింది.

మోకాళ్ళసంగతీ అంతే. మనకి సోఫాలూ, కుర్చీలూ, వాహనాలూ వచ్చేక నేలమీద కూర్చోడం తగ్గిపోయింది. దాంతో అవసరం అయినప్పుడు, ఏ సంగీత కచేరీల్లోనో, టికెట్టు లేకుండా టెనిస్ చూసినప్పుడో కింద కూర్చుంటున్నారు కానీ అప్పుడప్పుడు వాళ్ళు ఆ సమయాల్లో పడే అవస్థ కూడా చూసేను. అందుకే చెప్తున్నా. నామాట విని రోజూ కొంచెంసేపు నేలమీద కూర్చోడం అలవాటు చేసుకో. నాకు ఆ అలవాటు ఉందిలే. ఏదో ఓ సమయంలో కాళ్ళు వెనక్కి మడిచి కూర్చుంటాను. అది వజ్రాసనంట. అలాగే పడుకున్నప్పుడు తిన్నగా వెల్లకిలా పడుకుంటే శవాసనం. రోజూ రాత్రి పడుకున్నప్పుడు అది అయిపోతుంది. అప్పుడే ఊపిరి బిగబట్టి ప్రాణాయామం కూడా చేస్తాను. మెట్లున్నచోట ఎలివేటరూ, ఎస్కిలేటరు ఎక్కను.

అంతే కాదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఏ రోజూ ఎట్టి పరిస్థితుల్లోనూ కదలకుండా ఒకే చోట అరగంటకంటే ఎక్కువసేపు కూర్చోను. కూర్చోలేను. ఏదో వంక లేచి తిరుగుతూనే ఉంటాను. ఏమీ లేకపోతే ఈ కుర్చీలోంచి ఆ కుర్చీలోకి. టెనిస్ ఆటగాళ్ళు చూడు బంతికోసం ఎదురు చూస్తున్నప్పుడు కదుల్తూ ఉంటారు కానీ బొమ్మరాళ్ళలా నిల్చోరు కదా. అదన్నమాట సూత్రం.

000

ఈ పోస్టుకి సంబంధించిన ఇతర పోస్టులకి లంకెలు

 1. నా ఆరోగ్యసూత్రాలు.
 2. నా వంటలపుస్తకం రెండే పుటలు

 

(ఆగస్ట్ 1, 2016)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

6 thoughts on “మనలో మనమాట 22 – శరీరమే చెప్తుంది ఏం కావాలో”

 1. నిజంగానేనండీ మనం నిత్యజీవితంలో చేసే ఎన్నో పనులు అనవసరంగా సుఖంపేరుతో మానుకుంటున్నాం. నేను అన్నీ రాయలేదు కానీ చాలా ఉన్నాయి మన శరీరాన్ని అదుపులో పెట్టే చిన్న చిన్న పనులు. అంతెందుకు, మన పూజ చూడండి, కూర్చుంటాం, నిలబడతాం, ప్రదక్షణలు, ప్రణామాలు… మీ ఆదరణకి ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 2. నిజంగానే ఎన్ని ప్రశ్నలో వేస్తే తప్ప వీళ్ళ వంటలు తెలీవు. శరీరాన్ని అదుపులో పెట్టుకోడం కొంతవరకూ మనమీదే ఆధారపడి ఉంటుందన్నది నాకు ప్రత్యక్షంగానే అనుభవం. పెరుగు కలిపి చూస్తాను మళ్ళీ ఎప్పుడయినా చేసినప్పుడు. ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 3. < "వెజీ అంటే కూరగాయలు కూడా ఉన్నది అనే కేవలం కూరగాయలతో మాత్రమే చేసినది కాదు."
  ——————
  🙂. అవునండీ మాకు కూడా ఆ జ్ఞానోదయం అయింది. మేం ఓ రెస్టారెంట్లో veg ravioli తెమ్మని చెప్తే తీసుకొచ్చాడు, మరోసారి సందేహ నివృత్తి కోసం వెజ్జే కదా అని అడిగితే, ఆ ఆ వెజ్జే కొంచెం చికెన్ మాత్రం కలిపాం అన్నాడు 🙁. వెజ్ అంటే మన నిర్వచనానికీ వాళ్ళ అవగాహనకీ మధ్యన ఏదో తేడా ఉండటం వల్లనేమో ఇటువంటి అనుభవాలు ఎదురవుతుంటాయి. నాకయితే ప్రతిసారీ బారిస్టర్ పార్వతీశం ఓడ ప్రయాణంలో అనుభవమే గుర్తొస్తుంది.
  కేక్ సంగతి తెలుసుగానీ ఐస్క్రీం లో కూడా గుడ్డుసొన కలుపుతారా! ఎంత అమాయకంగా ఐస్క్రీంని నమ్మాం ఇంతకాలం! 🤔
  "సున్నపుకాయ" తో మీ ప్రయోగం బాగుంది. కాస్త పెరుగుకూడా కలిపి చూడవలసింది 🙂.
  శరీరాన్ని కాస్త వంగదీయడం కోసం చివర్లో మీరు సూచించిన చిట్కాలు బాగున్నాయి. నేను కూడా ప్రయత్నిస్తాను. థాంక్స్.

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.