మధ్యమపురుష కథనం – చర్చ

ఎ.వి. రమణమూర్తిగారు ఒక ఇంగ్లీషుకథ పరిచయం చేస్తూ కథ మధ్యమపురుషలో రాయడం ఆ రచయిత సాధించిన ప్రత్యేకత అన్నారు. మధ్యమపురుషలో కథనం ఎలా సాధ్యం అన్నవిషయం నేను చాలాకాలంగా ఆలోచిస్తున్నాను. తొలిసారిగా నాకు ఈ సందేహం కలిగింది 2007లో నేను బుచ్చిబాబుమీద వ్యాసం రాస్తున్నప్పుడు. ఆయన లత రాసిన మిగిలిందేమిటి నవలమీద ఇలా వ్యాఖ్యానించేరు

మొత్తంనవల “ఉత్తమపురుషలో కాక మధ్యమ పురుషలో రాస్తే హుందాతనం, సమన్వయం చేకూరేది … హాస్పిటల్‌లో విద్య చేసిన “దురంతం” (రాజాతో) మరొకరు చెప్పివుంటే, పదును తగ్గి వుండేది. సభ్యత హెచ్చి వుండేది. జీవితంలోలాగే సాహిత్యంలో కాస్తంత అసభ్యత, అశ్లీలత అవసరమనుకునేవారిలో నేనొకణ్ణి. కాని మన సంఘం అంతదూరం వెళ్లడానికి చాలాకాలం పడుతుంది” అంటారు బుచ్చిబాబు. (ఆంజనేయశర్మ. సాహితీలత. పు. 86).

మధ్యమపురుషలో రాయడం ఎలా సాధ్యం అని అప్పట్నుంచీ ఆలోచిస్తున్నాను. మధ్యమపురుష అంటే ఒకరు నాతో మాటాడినప్పుడు నువ్వు అనో మీరు అనో చెప్తుంటే అది మధ్యమపురుష కథనం అవుతుంది. అంటే ఈ కథనంలో శ్రోత వాస్తవానికి  పాఠకుడు కావాలి.

రమణమూర్తిగారు ప్రస్తావించిన కథలో రెండు పాత్రలు. ఒక పాత్ర రెండోపాత్రకి తమ ఆఫీసులో ఉన్న ఇతరపాత్రలగురించి వివరించడం. రమణమూర్తిగారే చెప్పినట్టు మామూలుగా మనం చూసే కథ లక్షణాలు తక్కువ ఈ కథలో. కథకుడు ఒకొక పాత్రనే పరిచయం చేస్తూ కొనసాగిస్తాడు కథని. ఆ పాత్రగురించి చెప్తున్నప్పుడు ఆయన అనో ఆవిడ అనో ప్రథమపురుషలో చెప్పడం జరిగింది. ఒకొక పాత్రని పరిచయం చేస్తూ చెప్పిన వివరాలతో మరో కథ రాయొచ్చు అనిపించింది నాకు.

ఈ కథలో ఒకచోట “అంటే నా అభిప్రాయం ఏమిటంటావా? ఇదుగో చెప్తున్నా.” అంటాడు కథకుడు. దాంతో శ్రోతగా మరొక పాత్ర ఉన్నట్టు అర్థం అవుతుంది పాఠకుడికి. అదే ప్రశ్న నిజానికి కథకుడు పాఠకుడిని ఉద్దేశించి అడగొచ్చు. ఉదాహరణకి “నాఅభిప్రాయం ఏమిటన్న అనుమానం నీకు కలగొచ్చు. చెప్తా విను,” అంటే అది మధ్యమపురుషలో పొడిగించినట్టు కనిపిస్తుంది. పాఠకుడు తానే ఆ ప్రశ్న వేసినట్టు అనుభూతి పొందడానికి అవకాశం కలుగుతుంది.

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారి విమానం ఎక్కబోతూను కథ అంతా రెండు పాత్రలమధ్య సంభాషణగా సాగుతుంది. ఇది మధ్యమపురుషలో సాగిన కథ అనొచ్చు. ఎక్కడా ఒక్క ముక్కైనా లేదు  కథకుడిపరంగా అనడానికి సాక్ష్యంగా. ఈ పాత్రలు ఎవరు, సందర్భం ఏమిటి వంటి ప్రశ్నలన్నీ పాఠకుడు ఆ సంభాషణలోనుండే గ్రహించాలి. అయితే ఇందులో కూడా రాజుగురించి, శత్రువులగురించి ప్రథమపురుషలో ప్రస్తావించడం ఉంది.

మల్లాది కృష్ణశాస్త్రిగారి సోఽహం కథనం కొంతవరకూ ఇలాగే సాగుతుంది. ఆకథకోసం మళ్ళీ వెతికేను కానీ దొరకలేదు. నాకు గుర్తున్నంతవరకూ ప్రారంభం మధ్యమపురుషతోనే కానీ ప్రథమపురుష, ఉత్తమపురుష ప్రయోగాలు కలగాపులగంగా కలిసిపోతాయి మధ్యలో. అసలు కొ్న్ని చోట్ల ఎవరు మాటాడుతున్నారు అని నాకే సందేహం కలిగినట్టే గుర్తు. అందుకే అంటున్నాను కేవలం మధ్యమపురుషలోనే కథంతా “నువ్విలా చేసేవు, అలా అన్నావు,” అంటూ సాగించలేరు కదా.

మౌఖికసాహిత్యంలో కొంతవరకూ ఈ మధ్యమపురుష ప్రయోగం కనిపిస్తుంది. కథకుడు శ్రోతలకి కథ అక్షరాలా చెప్తాడు కనక మధ్యమ పురుష ప్రయోగానికి అవకాశాలు ఎక్కువ.

జానపదసాహిత్యంలో కథనం ఒకరితో ఒకరు కష్టసుఖాలు చెప్పుకోడంగా సాగడం చూస్తాం అంటారు నాయని కృష్ణకుమారిగారు. ఆవిడే ఇచ్చిన ఒక ఉదాహరణ,

కోడలా, కోడలా, కొడుకు పెళ్ళమా, పచ్చిపాలమీద మీద మీగడేదమ్మా

వేడిపాలలోన వెన్న ఏదమ్మా

అని అడుగుతుంది అత్త.

ఓ అత్తమ్మ, నీ ఆరళ్ళె గాని పచ్చిపాలమీద మీగడుంటుందా

వేడిపాలలోన వెన్న ఉంటుందా

అని కోడలు ఎత్తిపొడుస్తుంది.

బుసిరాజు లక్ష్మీదేవి దేశాయిగారు ఏకపాత్రాభినయంలో కూడా ఈ పద్ధతి ఉందని వ్యాఖ్యానించేరు. ఏకాపాత్రాభినయంలో కూడా మధ్యమపురుష అన్నివేళలా అవుసరం లేదేమో. ఆలోచించాల్సిన విషయమే.

ఏకాపాత్రాబినయం కానీ బహు పాత్రాభినయం కానీ తీసుకున్న అంశాన్నిబట్టీ ఆవిష్కరించేవిధానాన్నిబట్టీ ఉంటుంది. ఏకపాత్రాభినయంలో ఒక పాత్రని మాత్రమే ప్రదర్శిస్తారు. బహుపాత్రాభినయంలో ఒకే వ్యక్తి అనేక పాత్రలను అభినయిస్తాడు. ఒకపాత్ర మరొకపాత్రతో మాటాడడం ప్రదర్శిస్తే మధ్యమపురుషలో ఆ ప్రదర్శన సాగడానికి వీలుంది. ఉదాహరణకి కుంతీదేవి కర్ణుడిని వరం అడిగిన సందర్భం నటుడు ప్రదర్శించడం చూదాం. కుంతీదేవిని మాత్రమే ఆవిష్కరిస్తే ఏకపాత్రాభినయం. కర్ణుడి సమాధానం కూడా నటుడు ప్రదర్శిస్తే ద్విపాత్రాభినయం. రెండు సందర్భాలలోనూ ఎదటిపాత్రని ఉద్దేశించి మాటాడినా ఇతరపాత్రలప్రస్తావన వస్తుంది. ఆమేరకి ప్రథమపురుష కూడా చొప్పించడం జరుగుతుంది.

రమణమూర్తిగారివివరణలో కొంత భాగం ఇస్తున్నాను. ఆయన ఈ విషయంలో చాలా పరిశోధన చేసేరు కనక ఆయనే విడిగా మరో వ్యాసం రాస్తే బాగుంటుందని నా కోరిక. ఆ వ్యాఖ్యలో ప్రధానంగా చెప్తున్నది ఇదీ అనుకుంటున్నాను,

—–

“పాఠకుడిని ప్రొటాగనిస్ట్ స్థానంలో కూచోబెట్టి, అతన్ని కథలో భాగంగా చేయడం వల్ల రచయితకీ, పాఠకుడికీ మధ్య ఉండే దూరం తగ్గుతుందేమోగానీ, పాఠకుడు తనకి నచ్చే లేదా నచ్చని చాలా అనుభవాలద్వారా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ ప్రయాణంలో నచ్చకపోవడానికే ఆస్కారం ఎక్కువ. మనకి తెలుగులో కూడా అడపాదడపా ఈ దృష్టికోణంలో కనిపించే కథలు ఉన్నాయి కానీ, ఈ ఇబ్బంది లేని కథలు ఉన్నాయేమో వెతకాలి!

అలా – పాఠకులకి పఠనానుభవంలో ఎలాంటి తేడానీ కనిపించనీయకుండా ఈ ‘Orientation’ కథ నడిచింది కాబట్టి ఈ కథని పేర్కొనడం జరిగింది. మీ దృష్టిలో అలా ‘నొప్పితగలనీయకుండా’ నడిచే కథలు (సెకండ్ పెర్సన్ దృష్టికోణంలో…) ఇంకా ఏవైనా ఉన్నాయా?  ముఖ్యంగా తెలుగులో…”

—–

రమణమూర్తిగారు శ్రోతని protagonist అన్నారు కానీ ఈ కథలో ప్రధాన పాత్ర కథకుడే. రెండో పాత్ర శ్రోత. కథనం అంతా కథకుడిదృష్టికోణంలోనుండే జరిగింది.

పైకథలో పాఠకులకి పఠనానుభవంలో ఎలాంటి తేడా లేదని రమణమూర్తిగారు అంటున్నారు. ఇది సాధారణీకరించలేం అనుకుంటాను. నామటుకు నేను ఇది వ్యక్తిగతం అనుకుంటాను.

ఈరోజుల్లో ఏ పురుషలో రాసినకథ అయినా, పాఠకుడు కథలో ఏదో ఒక పాత్రతో తమని పోల్చుకుని వ్యాఖ్యానించడమే ఎక్కువగా కనిపిస్తోంది. అందుకు కొంత కారణం కథలో ప్రధానాంశాలు.

ఈ ఆలోచనలనేపథ్యంలో నాకు సంపూర్ణంగా మధ్యమపురుషలో కథనం అనడానికి  ఆస్కారం లేదనే అనిపిస్తోంది.

000

ఎ.వి. రమణమూర్తిగారు ప్రస్తావించిన ఇంగ్లీషు కథకి లంకె:

Orientation: A Short Story by Daniel Orozco

(ఆగస్ట్ 3, 2016)

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

2 thoughts on “మధ్యమపురుష కథనం – చర్చ”

  1. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారిదే ఇంకో కథ వుండాలండీ – పూర్తి మధ్యమపురుషలొ సాగినది. నేనూ వెతుకుతున్నాను – గుర్తు రాక. దొరికిన వెంటనే మళ్లీ వచ్చి మీకు చెప్తాను – ఇక్కడే.

    ~ లలిత

    మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.