మనలో మనమాట 23 – నేనేం చెయ్యాలో నాకు చెప్పకు

ఈ మధ్య చెప్పడం ఎక్కువయిపోయింది. “నీ ప్రవర మార్చు,” అని ముఖపుస్తకంవాడు నాకివాళ చెప్పేడు. ఘోరం, ఘోరాతిఘోరం. ఇది నాస్వతంత్రభావాలకి గొడ్డలి పెట్టు కాదూ? 

update infoఈ మధ్య ఈ సాంఘికమీడియాలు అనుక్షణమూ నేను అత్యవసరంగా చేయవలసిన కర్మలు గుర్తు చేయడం చూస్తుంటే మహ చిరాగ్గా ఉంది. ఎవరెవరి పుట్టినరోజులు, పెళ్ళి రోజులే కాక ఎవరితో ఎప్పుడు స్నేహం మొదలయిందో ….లాటివి తెల్లారి లాప్టాపు తెరిచేసరికి హాజరు! అవి గుర్తు చెయ్యడమే కాక వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పమని తాఖీదు ఇస్తుంది. ఫలానావారు నీ స్నేహాన్ని అంగీకరించేరు, వారిగోడమీద ఏదైనా రాయి అని చెప్తుంది. అంతకంటే, ఎవరు ఎందుకు నాస్నేహం కోరుతున్నారో చెప్తే బాగుండు. ఎందుకంటే వారు నాతో స్నేహం కోరడం నాకు గౌరవప్రదమనా, వారికి గౌరవప్రదమనా, నేను వారిగోడలమీద రాతలన్నీ చదువుతాననా, లేదా వారు సృష్టిస్తున్న గుంపులన్నటిలోనూ నన్ను కూడా చేర్చేయవచ్చనా? అదీ ఇదీ ఏదీ కాదు, వారికి నిజంగా నేను రాసేవి చదివే కోరిక ఉందనా? ఇది తెలిస్తే ముఖపుస్తక స్నేహాలవల్ల కలిగే చిరాకులు సగానికి సగం తగ్గిపోతాయి కదా.

నూటికి 90పాళ్ళు నేను రాసేవి చదవడం మాత్రం కాదనే అనిపిస్తోంది. ఎందుకంటే, నేను పబ్లిక్ అని పెట్టిన టపాలు వారు చూస్తున్నట్టు కనిపించదు. చూస్తున్నట్టు కనిపించినవారు ప్రత్యేకించి మీస్నేహం కోరుతున్నాం అంటూ అర్జీలు పెట్టుకోరు. సరేలే, శాఖాచంక్రమణం అయిపోయింది.

జీమెయిలూ, యాహూలాటి సర్విసులు చూసేవా నీ ఫోన్నెంబరియ్యి. నీ password దాస్తాను. నీ ఖాతాలన్నీ నాకియ్యి. నీకు తేలిగ్గా అమర్చి పెడతాను,  మీఇంటి ఆనుపానులు చెప్పు. నీ ఆస్తిపాస్తులన్నీ ఎక్కడున్నాయో చెప్పు అంటూ ఎంతమంది మనమీద దాడి చేస్తున్నారో చూసేవా.  నాకివేం  అవసరం లేదు మొర్రో అని ఎంత మొత్తుకున్నా సరే ఏలిన్నాటి శనిలా వదల్రు. గూగుల్ వాడ్ని చూడు. ఇంటర్నేట్టు ఎక్కగానే కనిపిస్తుంది Default search engine గూగుల్ కి మార్చమని. సరే అన్నతరవాత కూడా ఆ హెచ్చరిక కనిపిస్తూనే ఉంటుంది.

అలాగే ఇంటిజాగ్రత్తలు – కొంతకాలం క్రితం నీ ఇంటిభద్రత మేం చూస్తాం అంటూ పోనుమీద ఫోను చేసేవాళ్ళని వదల్చుకోడం ఓ యజ్ఞం అయిపోయింది నాకు. నాకు అవసరం లేదు, మాభవంతికి కావలిసిన భద్రత యజమానులే చూసుకుంటారు అన్నా టెలిమార్కెటరులు ఒకరితరవాత ఒకరు వదలకుండా. ఆఖరికి విసుగేసి ఒకరోజు అడిగేను, “నేను ఇప్పుడు నీ సర్విస్ అంగీకరించకపోతే నీ పాయింటు నిరూపించుకోడానికి నువ్వే మాయిల్లు దోపిడి అయే ఏర్పాటు చేస్తావా?” అని. దాంతో ఆటకట్టు అయిపోయింది.

ఇంకా ఎక్కడెక్కడ మనకి ఏది కావాలో, ఏది ముఖ్యమో చెప్పేవాళ్ళమాట అడక్కు.

దేశంలో ఏమూల ఏం జరుగుతోందో చూదాం అని టీవీ వెలిగిస్తే పది నిముషాలపాటు విశేషాలు చెప్పి, “కదలకు, ఇప్పుడే వస్తాను,” (నిజంగా ఇవే మాటలు ఇంగ్లీషులో) అంటూ యాంకరి లేక యాంకరుడు నిష్క్రమిస్తాడు. ఆ తరవాత నాప్రాణానికి అరగంట అనిపిస్తుంది కానీ నాలుగు నిముషాలపాటు నువ్వక్కడే కదలకుండా కూర్చుని నీకు లేని జబ్బులగురించి, వాడమ్మజూపిన మందుగురించి, దానివల్ల కలిగే దుష్పలితాలగురించీ వింటూ కూర్చోవాలి. మందులు కాకపోతే సెక్సుజీవనం, కొత్త కార్లు, జీవితభీమా పథకాలు, పళ్ళు తోముకోడం, కళ్లజోళ్ళు, కూరలు తరుక్కునే కత్తులు, గడ్డం గీసుకునే కత్తులూ, ఆపైన ఆడవాళ్ళ అవసరాలకి సంబంధించిన అనేకానేక వస్తుసంచయం వీటికి అంతే లేదు. నేను చూసే నాలుగు ఛానెలులలో నాలుగున్నర గంటలలో ఈ సోది కనిపించి తల తినేస్తుంటే రోజంతా టీవీ చూసేవాళ్ళు ఎలా భరిస్తారో అనిపించదూ?  ఈ  ప్రకటనలు  చూస్తుంటే ఇవి తప్ప జీవితం లేదేమో అనుకోవాలి. ఒకొకప్పుడు ఇవన్నీ లేని బతుకేల అని నాబతుకుమీద నాకే విరక్తి కూడా పుడుతుంది.

ఇది చట్టసమ్మతమైన brainwashing అనీ దీనిని తీప్రంగా ఖండిస్తున్నాను నేను. ప్రతి చిన్న విషయానికీ హక్కులు హక్కులు, స్వేచ్ఛ స్వేచ్ఛ అంటూ శివాలెత్తిపోయే జనులు వీటికి మాత్రం అభ్యంతరం చెప్పరు ఏంచేతో మరి. ఎంచేతేమిటిలే. ఇది సమాచారయుగం కదా. సంగతులు తెలుసుకోవాలి అని వారి వాదన. నాకు మాత్రం విషయం చెప్పడం వేరు, అదే పనిగా ఉక్కిరిబిక్కిర చేసేస్తూ పదే పదే ఊదరపెట్టేయడం వేరూ అనే అనిపిస్తుంది.

జీమెయిలు కేలంజరు మరో వింత నేను అచ్చుకోవలసిన నెలసరి బిల్లులు ఫలానా రోజున చెల్లించాలని కాలెండరులో గుర్తు పెట్టుకున్నాను. ఇవాళ ఒకటో తారీకు, ఇంటద్దె ఇచ్చుకో అని నాకు హెచ్చరిక రాలేదేం అని నేనే గుర్తు తెచ్చుకుని ఫరీక్షించి చూసుకుంటే తెలిసిందేమిటంటే ముందు నెలలో నేను చూడడం అయేక చెత్తబుట్టకి తరలించేసేను కనక  జిమెయిలువాడు ఆ పని నేను చూడకముందే చేసేస్తున్నాడు అని. అది నాసౌకర్యంకోసమేనట. అంచేత నేను ఏ రోజు ఏ బి్ల్లు చెల్లించాలో గుర్తు పెట్టుకుని ఆ రోజు చెత్త బుట్టలో చూస్తే కనిపిస్తుంది ఆ హెచ్చరిక!

ఇ-కార్డు ఒకమారు ఎవరికైనా పంపితే, ఆ తరవాత ఆ ఇ-కార్డు కంపెనీవాడు  ఆజన్మాంతం ఆ ఒక్క పుట్టినరోజే కాక నీకు తెలిసినవారందరి పుట్టినరోజులూ కూడా గుర్తు చేస్తాడు. నేను పుట్టినరోజుల మనిషిన కాను. అన్నిరోజులలాగే అదీను అనుకుంటాను. అట్టే హడావుడి చెయ్యను. అసలు చాలామందికి తెలీదు. కానీ Department of Motor Vehicles వాడూ, విల్లు రాసిన లాయరూ మాత్రం తప్పనిసరిగా గుర్తు పెట్టుకుంటారు. ఇవి ఎంత ఖచ్చితంగా జరుగుతాయంటే, వాళ్ళదగ్గరినించి కాయితం రాకపోతే నేను నా అస్తిత్వాన్ని శంకించవలసివస్తుందన్నమాట.

కార్ల కంపెనీవాళ్లు, ఇంస్యూరెన్సువాళ్లూ సరే సరి. 15 ఏళ్లక్రితం కొన్న కారుకి ఇప్పటికీ నాకు తాఖీదు వస్తూనే ఉంది, ఒక్క సంవత్సరంపాటు మాత్రమే ప్రసాదించిన Manufacturer’s warranty కాలం చెల్లిపోయింది, వెంటనే కొనసాగించకపోతే దాని కాలం చెల్లిపోతుందని. నాయనా, అది ముగిసిపోయి 14 ఏళ్ళయింంది అని చెప్పి చూడు. నీగోడు నీదే, వాళ్ళగోల వాళ్ళదే.

సంగీతకచేరీకి వెళ్ళేవాళ్ళు సాధారణంగా సంగీతజ్ఞానం ఉన్నవారే కదా. నాలాటివాళ్ళు ఏ యూట్యూబులోనో ఓ పావుగంటసేపు విని ఆనందిస్తారు కానీ పని గట్టుకు కచేరీలో మూడు గంటలసేపు కూర్చుని వినరు. ఉన్నా ఏ నూటికో కోటికో ఒకరు. అలాటప్పుడు గాయకులు రాగాలగురించి, మేళకర్తలగురించీ కచేరీ ఆపేసి కబుర్లు చెప్పడం బాగుంటుందా? బాగుండదు. కచేరీకి అవాంతరంగానే అనిపిస్తాయి ఆ పాఠాలు. సంగీతం ఏకధారగా ప్రవహించే ఏరులా సాగాలి. అలా విని ఆస్వాదించడంలో ఉన్న ఆనందం ముక్కముక్కలుగా కబుర్లమధ్య ఉండదు.

బజారుకెళ్తే నాకు ఏ బట్టలు ఎంత అందాన్నిస్తాయో చెప్పేవాళ్ళున్నారు. “ఆ ఎరుపు నీమొహంలో అరుణిమ ఇనుమడిస్తుంది,” అంటాడు. “ఈ నీలం నీకళ్ళలో నీలిమెరుపులు కలిగిస్తుంది,” అంటుంది మరొక సుంందరి.

“ఈ సినిమా లేక ఆ ప్రోగ్రాము చూడకపోతే నీ జన్మ వృథా,”

“నామాట విను. నేనొక్కడ్నే నిన్ను రక్షించగలవాడిని,”

“ఈ పుస్తకం నువ్వు చదవకపోతే తరవాత విచారిస్తావు. మళ్ళీ చెప్పలేదనకు.”

“నామాట విను. పప్పుకూర … లో తిను.”

“నామాట వినకపోతే చెడిపోతావు,” అని చిన్నప్పుడు తల్లిదండ్రులు చెప్పేవారు. ఇప్పుడు తల్లిదండ్రులు కాదు ముఖపుస్తకంలోనో అంతర్జాలంలో ఏ జాలవైద్యులో చెప్పే మాటలే వేదవాక్కులయిపోయేయి. నీమొహం ఆరడుగులదూరంలోనుంచైనా చూడని వాడెవడో ఏ అర్థరాత్రో నిద్రమత్తుతోనో మందుమత్తుతోనో ఎడా పెడా టైపు చేసి పారేసిన సలహాకున్న విలువ నువ్వు భూమ్మీద పడ్డనాటినుండి చూసిన అమ్మో నాన్నో చెప్తే లేదు. ఎందుకంటే, ఆ మిత్రుడు నీ బాతాఖానీ టపాలు ముప్పైటపాలకి వేలిముద్రలు వేసేడు. అమ్మా, నాన్నా వెనకటి తరం వాళ్ళు. “నీకు తెలీదమ్మా, లేదా నాన్నా, నీచిన్నప్పుడులా లేదు ప్రపంచం,” అంటారు.

మాఅమ్మాయి “నీకు తెలీద”న్నరోజులున్నాయి. అప్పుడు దానికి పదేళ్ళే. ఇప్పుడలా అనదు. అందుకే చెప్తున్నా నామాట విను. ఎవరిమాటా వినొద్దన్న నామాట ఎలా వింటాను అంటావా?

ఏమో మరి.

000

(ఆగస్ట్ 6, 2016)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

2 thoughts on “మనలో మనమాట 23 – నేనేం చెయ్యాలో నాకు చెప్పకు”

  1. ఇంగ్లీషు లిపిలో రాస్తున్న తెలుగుని తెంగ్లీషు అంటున్నారు ఫేస్బుక్ లో. అందరికీ తెలుసనుకున్నాను. మీతెలుగు చాలా చాల మేలండి. మీరు వాడుతున్న ఇంగ్లీషు ఫరవాలేదు. కరీ ఆయిల్లో ఫ్రై చేసి లాటివి నాకు చాలా చిరాకు కలిగిస్తాయి. సరే అనడానికి ఓకే, బాగుంది అనటానికి బ్యూటిఫుల్ అనడం ఎందుకు అని నా ప్రశ్న.

    మెచ్చుకోండి

  2. Google, FaceBook లాంటి సోషల్ నెట్ వర్కింగ్ కంపెనీలు చేసే personal-space-intrusion గురించి బాగా చెప్పారు మీరు. మీతో 100 శాతం ఏకీభవిస్తున్నాను 🙂

    మీ బ్లాగ్ పోస్ట్ కి వ్యాఖ్య పెట్టే ప్రతీసారీ నాకనుమానమే – నా (తెలుగు + ఇంగ్లీష్) మిశ్రమ వ్యాఖ్య ప్రచురిస్తారో లేదో అని 🙂 ఇంతకీ “తెంగ్లీషు” అంటే ఏంటండీ ?- తమాషాకి అడగట్లేదు- నాకు నిజంగానే తెలీదు.

    ~ లలిత

    మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s