మనలో మనమాట 24 – గ్రామసింహమా! నాసంగతి చెప్పనా మరి?

పాశ్చాత్యదేశాల్లో పెంపుడు కుక్కల చరిత్ర ఎప్పుడు మొదలయిందో నాకు తెలీదు కానీ అక్కడే మొదలయిఉండొచ్చు. మనదేశంలో అనాదిగా ఉన్నట్టుంది. మహాప్రస్థానంలో శునకప్రస్తావన ఉంది కదా. అది నిజంగా కుక్క కాదులే కానీ ధర్మరాజు ఆ కుక్కవిశ్వాసం గుర్తించి దాన్ని వదలి స్వర్గానికి వెళ్ళడానికి ఒప్పుకోలేదు అంటే ఆ క్షణంలో అది కుక్క ప్రేమే.

ఇరవయ్యో శతాబ్దంలో మనదేశంలో కలవారి ఇళ్లల్లో ఓ కుక్క, ముఖ్యంగా ఆల్సేషియన్ జాతి కుక్కకాపురం మొదలయింది ఇంగ్లీషువారిపాలనలోనే అనుకుంటా. దాంతోపాటే “కుక్క ఉంది జాగ్రత్త,” అన్న హెచ్చరికలు కూడా వచ్చేయి. గత 30 ఏళ్ళనించనుకుంటా మధ్యతరగతి ఇళ్లల్లో కూడా కనిపిస్తున్నాయి ఇవి. ఇవి అనడానికి లేదేమో, ఆయన, ఆవిడ అనే సంబోధిస్తున్నారు ఈమధ్య కుక్కలను. ఈ సంప్రదాయం కూడా ఆంగ్లేయులనించి వచ్చిందో మనవాళ్ళకే స్వతహాగా ఉందో మరి. కుక్కలు ఒకొక ఇంటిలో అంతటి ప్రాముఖ్యం  వహించడం నిజం. ఇది సూక్ష్మంగా నాందిపలుకు.

ముందుకి సాగేముందు పెంపుడుకుక్కలు గలవారందరికీ నా మనవి ఒకటుంది. వారు వారి శునకరాజునో రాణీనో ఎంతో ప్రేమగా చూసుకుంటున్నందుకు ఇవే నా జోతలు. కాకిపిల్ల కాకికి  ముద్దు  అయినట్టే  కుక్కని పెంచుకున్నవారికి కుక్కలున్నూ.

అమెరికాలో ఈ గ్రామసింహాలకోసం వెరసి ఎంత ఖర్చు పెడుతున్నారో, వాటికి ఎన్ని సౌకర్యాలున్నాయో వేరే టపాలో రాసేను.  ఈ టపా కుక్కని తక్కువ చేయడంకోసం కాదని మనవి. ఈ టపాలో మరొక కోణం ప్రస్తావిస్తున్నాను. మీకందరికీ అభిప్రాయాలూ ఇష్టాయిష్టాలూ ఉన్నట్టే నాకూ ఉన్నాయి. అవి విడమర్చి చెప్పడమే ఈ టపా  ఉద్దేశం. అంతకంటే మరే దురుద్దేశమూ లేదు. లేదు గాక లేదు.

నేను నిత్యసంచారం చేస్తానని నీకు తెలుసు కదా.  ఆ దారిలోనే కుక్కలు కూడా నడుస్తుంటాయి.  ఇంతకుముందు కన్నా ఇక్కడ వీరి దర్శనాలు ఎక్కువగా ఉండుటచేత నా ఇబ్బంది మరింత కొట్టొచ్చినట్టు  కనిపిస్తోంది. కనీసం నాకలా అనిపిస్తోంది. ఓ చేత ఒకటో రెండో కుక్కలూ, మరో చేతిలో సెల్లులో కబుర్లు  చూసుకుంటూ వేరే లోకంలో ఉన్నట్టు సాగిపోయే అమ్మాయిలకీ అబ్బాయిలకీ వీధిలో ఇతరులు కూడా  ఉంటారనీ, తాము కాలిబాట పూర్తిగా ఆక్రమించేసేమనీ తోచినట్టు కనిపించదు.

DSC00462తోచని పిల్లల్లాగ ఆ కుక్కలు ఆదరాభిమానాలకోసం దారిన పోతున్నవారిమీదకి ఎగిరిపడుతున్నాయని  గ్రహించినట్టు కనిపించదు.

మనూళ్ళలో ఊరకుక్కల్లాగా  అనను  కానీ  అవి  ఇచ్చవచ్చిన రీతి  సంచరిస్తున్నాయనే  అనిపిస్తోంది.  వాటిని పెంచుకుంటున్నవారు అంగరక్షకుల్లా వాటితో కూడా కూడా ఉన్నట్టు కనిపిస్తారు కానీ అది వాటి  స్వేచ్ఛకి అంతరాయాలు కలగకుండా చూసుకోడానికి మాత్రమే. ఆ మీదట వాటి అవసరాలు తీర్చుకున్నాక ఆ జాగా శుభ్రపరచడానికీను. ఆ కుక్క గానీ దాన్ని పెంచుకున్నవారు గానీ నాజోలికి వచ్చినప్పుడే నాకు  ఇబ్బందిగా ఉంటోంది. కదాచితుగా కంటకప్రాయంగా కూడా ఉంటోంది.

నాపాట్న నేను నాలోకంలో నేనుండి నడుచుకుంటూ పోతుంటే, ఎదురొస్తున్న కుక్కొకటి కొదమసింగమవలె నామీదికి ఉరికితే ప్రేమగానే కావచ్చు, స్నేహపూరిత హృదయకమలంతో కావచ్చు, నేను మాత్రం  తుళ్ళిపడడం తప్పదు. రెండు పిడికిళ్ళు గట్టిగా బిగించి, గుండెలకదుముకుని, కావు కావుమని అలనాటి గజేంద్రునివలె మొరపెట్టుకుంటాను. ఆ తరవాత హో హో నో నో అని ఇంగ్లీషులో  బొబ్బలెడతాను. మరి వాళ్ళకి ఆ కథ తెలీదు కదా. ఇదంతా అసంకల్పంగానే జరిగిపోతుంది. కుక్కస్నేహానికి నా   ప్రతిస్పందన  అదీ. అంతే.

ఇక్కడ మరో రెండు విషయాలు కూడా గమనించాలి.

 1. ఆ కుక్క ఏమీ చెయ్యదు అని వారు నమ్మవచ్చు కానీ నాకు తెలీదు కదా.

ఇలాటి “చాలా మంచి కుక్క” నోట కాటు తిన్నవారు కోర్టుకెక్కడం నేను చాలానే చూసేను. పైగా ఆ కోర్టులో కాటు తిన్నవాడు పక్కనుండగానే మాకుక్క కరవదు అంటూ వాదించడం చూసేను.

 1. మరి నాకు ఆ కుక్కబుద్ది ఉండాలి కదా. అది నన్నేం చేయకపోవచ్చు కానీ నేను దాన్ని ఏం చేయగలనో వారికి తెలీదు కదా. నిజంగా ఏదో చెయ్యగలనని కాదు, వారికి ఆ అనుమానం రావాలి. ప్రజలని  రక్షించవలసిన పోలీసే “నాప్రాణహాని,”అంటూ ఏ ఆయుధమూ లేనివాణ్ణి కాల్చిపారేసే రోజులివి.

ఎవరి కుక్క వారికి ముద్దు. కానీ ఊళ్ళోవాళ్ళందరూ దాన్ని అంతగానూ ముద్దు చేయాలనుకోడం తగదు.

 1. ఆ కుక్కకి బయట తిరగడం సరదా అంటారు.

ఇది నాకు అర్థమవుతుంది. జలచరాలకి జలమూ, ఖేచరములకి ఖగమూ, భూచరములకి  అంటే  మనకి (మనుషులు), జంతువులకీ భూమి ఆవాసాలు. మనిషి ఇల్లు కట్టుకోడం మొదలు పెట్టేక కూడా ఆ నాలుగ్గోడల మధ్యా ఉండలేకే బయట తిరుగుతాడు. నేను అందుకే తిరుగుతాను. అంచేత ఆరుబయట   హాయిగా విహరించవలసిన జీవులని ఇంట్లో ఉండమంటే అది వాటికి  ఆనందదాయకం  కాకపోడంలో  ఆశ్చర్యం లేదు.

ఇంతకీ ఆ తల్లీ, తండ్రీ తమ కుక్కలగురించి ఎన్ని మంచిమాటలు చెప్పినా నాకు మాత్రం అలా ఉండదు.  వారు నాఅవస్థ కూడా గమనించాలనే అనుకుంటాను. గమనించరు సరి కదా నాకు ధైర్యపూరిత వచనాలు  చెప్తారు. అవి ఇలా ఉంటాయి –

స్నేహపూరితకుక్క

నిన్నేం చెయ్యదు.

దానికి మనుషులంటే ఇష్టం.

మరి నేనేం అనుకుంటానూ?

అవునౌనౌనౌనౌనౌను, మీ కుక్క చాలా మంచిది.

కానీ

నాకు ఆ స్నేహపూరిత గుణం లేదు.

నేను కూడా మంచిదాన్నే

నేను కూడా దాన్నేం చెయ్యను

దానికి ఇష్టం ఉండొచ్చు. కానీ నాకు ఇష్టం లేదు.

ఇలాటి మాటలు ఎన్నో నేను కూడా చెప్తూ వచ్చేను. వారికున్న సౌమ్యత నాకంఠస్వరంలో కనిపించదు.

ఆ తరవాత కొంతకాలం రాత్రీ పగలూ, తపస్సు చేసినంత శ్రద్ధగా, నాచిరాకుని అదుపులో పెట్టుకుని నా తత్త్వమేమిటో వారికి తెలియజేయడానికి ప్రయత్నించేను. చాలా సినేరియోలు రాసుకుని ప్రాక్టీసు చేస్తూ వచ్చేను.

“మీకుక్క స్నేహపూరితం కావచ్చు. నేను కాదు.”

“అవును మంచి కుక్కే. మరి నాకు లేదు ఆ బుద్ధి.”

“అది మంచి కుక్కే. నేను మంచికుక్కని కాను.”

“సరేనండి. నాకిష్టం లేదు.”

“సరే.”

ఎన్ని సంభాషణలు రాసుకున్నా ఆ క్షణం వచ్చేసరికి మాత్రం నాకు పట్టలేనంత చిరాకు, కోపం వస్తున్నాయి పరుగెత్తుకుంటూ నామీదమీదకి వచ్చేసే ఆ శునకాలని చూస్తే.

పైన చెప్పేను కదా కుక్కగొలుసు ఒక చేతిలో అని. వీధిలోకి వచ్చినప్పుడు కుక్కకి గొలుసు తగిలించక పోవడం చట్టరీత్యా నేరం. అయినా అందరూ ఆ నగ తగిలించరు. కొందరు చేతిలో గొలుసు ఉంటుంది కానీ  రెండో చివర కుక్కమెడలో ఉండదు.  అదేమంటే  అది దిక్కుమాలిన కుక్క,  గొలుసు దానికిష్టం ఉండదు  అని తెలిసింది.

ఇంకా కొన్ని సంగతులు కూడా తెలుసుకున్నాను. ఇదుగో చెప్తాను – పెంచుకున్నవాళ్ళు చాలా ముద్దుగా చూసినా అలా చూడబడని కుక్కలు కూడా చాలా ఉన్నాయి. అంటే హింసలకు గురై వీధిన పడ్డ జీవులు. అవి సరదాకో కుక్కంటే ప్రేమతోనో పెంచినవి కావు. గుర్రప్పందేలలాగే, కుక్కలపందేలూను. వాటికిచ్చే శిక్షణ  పరమ దారుణంగా ఉంటుందిట. పందేలకి పనికిరాని కుక్కలని చిత్రహింసలకి గురి చేస్తారు కూడా. ఇలాటి కుక్కలని ఆ దుర్మార్గులనుండి  రక్షించి,  ఇష్టపడ్డవారికి  పెంపకానికి ఇస్తారు.  అలాటి సేవకి  ఖర్చు  కొన్ని  కోట్లలో ఉంటుంది. అసలు ఈ బాధితజంతువులని రక్షించే సంస్థలు టీవీ ప్రకటనలకే లక్షలకి లక్షలు ఖర్చు  పెడుతున్నారంటే ఇది ఎంత పెద్ద సమస్యో ఊహించుకోవచ్చు.

ఇక్కడే మరో విషయం కూడా ప్రస్తావిస్తాను బాధ్యతని నిర్లక్ష్యం చేయడంగురించి. ఇళ్ళల్లో వాటిని ఎలా  చూసుకుంటారో తెలీదు కానీ బయటికి వచ్చినప్పుడు మాత్రం తమబాధ్యతని కనీసం ఒక విషయంలో  మరిచిపోతారు. బయటికి తీసుకొచ్చేక, అవి చేసే గలీజు ఎత్తి తీసుకుపోయి  చెత్తకుండీలో  పారేయడం  వారి బాధ్యత మాత్రమే కాదు, చట్టం కూడాను. కానీ అందరూ చెయ్యరు. నేను నడిచే రెండున్నర మైళ్ళ దూరంలో కనీసం 5,6 బోర్డులు ఇలాటివి

DSC00028కనిపిస్తున్నాయంటే, వీరు ఎంత బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారో తెలుస్తుంది.  ప్రభుత్వం  కలగజేసుకుని  చట్టం చేసిందంటే అది అంత పెద్ద సమస్య అనే కదా. అది చూస్తే నాక్కూడా కోపం వస్తుంది. తమ ముంగిలి శుభ్రంగా ఉంచుకుంటారో లేదో తెలీదు కానీ మరొకరి ముంగిళ్ళలో ఇలాటి మురికి వదిలేసి తమకేమీ  పట్టనట్టు నడిచిపోయేవారు అవును అమెరికాలోనే ఉన్నారు.

అసలు నేను మనిషిపిల్లలని కూడా చూడగానే గబుక్కున ఎత్తుకుని కూచి కూచి అంటూ మురిపాలకి పోను. అదన్నమాట కథ. నా అభి్ప్రాయంలో పెంచుకున్నవారికి ఎంత ప్రేమైనా ఉండు గాక, వీధిలో కనిపించినవారు కూడా ఆ కుక్కని అంత ముద్దు చేస్తారనో చేయాలనో అనుకోడం అత్యాశే. కొందరిని చూసేను అలా ఏ  కుక్క కనిపించినా ఎంతో ప్రేమతో లాలనగా ముందుకి వంగి, దానిమూతి చేత పుచ్చుకు బోలెడు ఊసులాడతారు. అది వాళ్లిష్టం. ఒక్కమాటలో, ఆ స్నేహబుద్ధి రెండువేపులా ఉండాలి. కుక్కకి నేను ఇష్టమయినా నాకు కుక్కంటే ఇష్టం లేకపోతే స్నేహబంధం కుదరదు.

ఉపసంహారం.

ప్రస్తుతం నాచుట్టుపట్ల రెండుమైళ్ళ పరిధిలో కుక్కగల ప్రతివారికీ తెలిసిపోయింది నావ్యవహారం. అల్లంత దూరంలో నేను కుక్కని పసిగట్టినట్టే వారు నన్ను పసిగట్టి, గుబుక్కున కుక్కని ఎత్తుకోడమో, కూర్చోమని ఆజ్ఞాపించడమో, పక్కకి తప్పుకుని నాకు దారి ఇవ్వడమో చేస్తున్నారు.

నేను కూడా ఎంతో మప్పితంగా దన్యవాదాలు చెప్పుకుని, ఒకొకప్పుడు ఫరవాలేదులే అని చెప్పి (అప్పుడు చెప్పినా ఒకటే చెప్పకపోయినా ఒకటే‌) గబ గబ వారిని దాటి పోతున్నాను.

ఈవిధంగా మేం అందరం సర్వజీవసౌభ్రాతృత్వం పాటిస్తూ, శాంతియుతసహజీవనం సాగిస్తున్నాం.

అయితే రెండు ప్రతిపాదనలు చేయకుండా ఈ టపా వదల్లేను,

1 మనపిల్లలకి కొత్తవాళ్ళదగ్గరికి వెళ్ళొద్దని చెప్తాం. కుక్కలకి ఇల్లు అలవాటు కావడానికి ఇచ్చే శిక్షణ ఉంది, ఆ శిక్షణలో ఇది కూడా చేర్చాలి, “వీధిలో కొత్తమనిషి పిలిస్తే తప్ప దగ్గరికి వెళ్ళరాదు.”

 1. కుక్కలు దైహిక అవసరాలు ఇంట్లోనే తీర్చుకోవాలి. లేదా మనుషులకి ఏర్పరిచినట్టే public restrooms కుక్కలకి కూడా రెండు మూడు వీధులకొకటి చొప్పున కట్టించాలి.

000

శునకేంద్రభోగాలు లింకు ఇక్కడ

000

(ఆగస్ట్ 11, 2016)

 

 

 

 

రచయిత: మాలతి

మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

4 thoughts on “మనలో మనమాట 24 – గ్రామసింహమా! నాసంగతి చెప్పనా మరి?”

 1. అవును. ఈ టపా రాసేక, మనలాటి శత్రుత్వం లేకపోయినా కుక్కలతో మిత్రబుద్ది కూడా లేనివారు చాలామందే ఉన్నారని తెలిసింది. మనదేశంలో కుక్కలకి beauty parlor… అంతేలెండి గుడ్డిగా అనుకరించడం అలవాటయిపోయింది. సాటి మనుషులమాట మరిచిపోతారు.

  మెచ్చుకోండి

 2. గ్రామ సిం హాలు అంటే నాకూ చాలా భయమండీ. ఎవరైనా ఇంటికి రమ్మంటే ముందే చెప్పేస్తాను మీ మీ కుక్కలని నా కంటికి కనబడని చోట కట్టేస్తేనే వస్తానని.

  ఇంక సంబోధన విషయానికి వస్తే వాటిని He, She అనడానికి బోల్డు బాధ పడినా వాటి యజమానులని సాధ్యమైనంత వరకూ నొప్పించకుండా వుండడానికి ప్రయత్నిస్తాను – ఒక్కోసారి తప్పదు మరి 🙂

  అమెరికాలో సరే ఒకసారి ఇండియా వెళ్లినప్పుడు రాజమండ్రిలో Beauty Parlour for Dogs అన్న బోర్డ్ చూసి ఏమనుకోవాలో కూడా తోచలేదు.
  ~ లలిత

  మెచ్చుకోండి

 3. దానికేముందండి బల్లిని చూసి భయపడేవాళ్ళు లేరూ అలాగే. తిరగడంమాటకొస్తే, నిజమే, వాటిని స్వేచ్ఛగా ఆరుబయట తిరగనివ్వడమే బాగుంటుంది.

  మెచ్చుకోండి

 4. మనలో చాలా మందికి ఎందుకో కుక్కంటే మీలానే భయం వుంటుంది. అదే ఇక్కడ పెరిగినవారిలో చాలా తక్కువ లేదా అసలుండదేమొ!
  వారికి మన భయాలు అర్థమయ్యే అవకాశం లేదు. మా ఆవిడక్కూడా మీలాగే భయం. మా అమ్మాయికేమో విపరీతమైన యిష్టం.

  అయినా ఈ నేలా, గాలి, వెలుతురూ మనకేకాదు అనుభవించే హక్కు వాటికీ సమానంగా వుంది. కుక్కలకే కాదు అన్ని జీవులకూ వుంది. కాకుంటే మళ్ళీ తన అవసరాలకోసం మనిషి కుక్క పక్షపాతిగా మారాడంతే!

  అవి స్వేచ్చగా సంచరించే చోటులన్నీ మనం ఆక్రమించి, రహదారులూ, ఇళ్ళూ, బళ్ళూ కట్టి వాటిని అక్కడ తిరగొద్దు, ఇక్కడ పెంట పెట్టొద్దూ అనడం చిత్రం కాదూ!

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.