మనలో మనమాట 25 – మనం మనం తిమ్మనం

“ఈ బూపెపంచికంలో సమస్త జీవరాసులున్నూ ఒకటే కులం,” అంది సంద్రాలు.

“మనుషలంతా అనా?” అన్నాను స్పష్టం చేసుకోడానికి. 

“మడుసులు, పసూలు, పచ్చులూ, తిమింగిలాలూ అన్నీను.”

“కాదులే. విజ్ఞానశాస్త్రజ్ఞులు కోతులు పరిణామక్రమంలో మానవులుగా అవతరించేరన్నారు కానీ పశువులూ, పక్షులూ లాటివి చేర్చలేదు ఈ కులంలో,” అంటూ సైన్సు పాఠం పెట్టేను.

“ఆలకి తెల్దులే. అస్లు పెపంచకాన్ని సుస్టించిందెవురూ?”

“ఏమో. మనవాళ్లు బ్రహ్మ అంటారు. ఇంగ్లీషువాళ్లు వాళ్ళదేవుడంటారు.”

“అద్సరి. బెమ్మదేవుడు గాని ఏసుపెబువు గానీ ఒక మడిసినే గద ఆదిని పుట్టించింది. ఆమీన మల్లి ఆడమడిసిని చసీడు. అనగ ఏటీ? ఓల్ ముత్తం మానవులందురూ ఆఇద్దిరినించే వచ్చీరు. అనాగే ఆ బెమ్మే మిగతా జీవులన్నటినీ సుస్టించేరు గెన్క ఆయన సమస్త జీవులకూ తండ్రి. ముత్తం బూపెంపచికంలో పేణులన్నీ ఆరి కుటుంబంవే. అదీ కత.”

సంద్రాలుతో వచ్చిన చిక్కే ఇది. ఆవిడనమ్మకాలు ఆవిడవి. అవి మార్చడం ఆవిణ్ణి పుట్టించిన బ్రహ్మతరం కూడా కాదు. కానీ …

సంద్రాలుమాటల్లో కొంత తర్కం కనిపించకపోలేదు. మరి మనం వంశం అని చెప్పుకుంటాం కదా. ఋషులు కానీ మరో మహానుభావుడు గానీ వారిపిల్లలు, మనవలు, మునిమనవలు అంతా వారి వంశం. వంశంలో ఒకడు వృద్ధిలోకి వస్తే వంశాన్ని మెచ్చుకుంటాం. అలా వేరు వేరు వంశాలున్నాయి.

“మరి ఈ కులాలూ, గోత్రాలూ తంటా ఎప్పుడు మొదలయిందంటావూ?”

“కులాలు వుర్తులపెకారం వచ్చేయంతరు. అదీ ఎనకమాలెప్పుడో నిజిం కానీ ఉప్పుడు గాదు. డాట్రీ సేసీవోన్ని డాటరీ ఉజ్జోగం సేస్తన్నాడంటరు గానీ డాటరీ కులం అంటన్నర? నేదు. అందుసేత కులంవంటే అరతం మారిపోనాదన్సెప్పాల.”

“లేదులే. మాకులంవాడు డాక్టరీ చేస్తున్నాడు అంటారు. కులంమాట వదల్రు.”

“మరి పాతకాలంల ఏ కులపోడు ఏ పని సెయ్యాలో, ఎట్ట బతకాలో సెప్పినట్టు, సేసినట్టు ఉప్పుడు సేస్తన్నరా?” అంటూ మరో లాపాయింటు లాగింది సంద్రాలు.

మ్. లేదు. ఖచ్చితంగా పాతకాలంలో కులాలవారీగా పాటించే జీవితం ఇప్పుడు నూటికి నూరుపాళ్లూ అచ్చంగా అలాగే లేదు. ఇప్పుడు కులవ్యవస్థ అన్నది శిఖపట్లకి మాత్రమే పనికొస్తున్నట్టుంది.

“మరోటడగత సెప్పు. యెనక బెమ్మల అగ్గరారం, మాలపల్లి అంటా ఏరుగ ఉండీవి. ఉప్పడట్ట సెల్తదా? బాపనోల్ల బాబు కమ్మోరి అమ్మాయిని పెల్లాడతడు. నాయిల్ల బొట్టి మాలోల్లపిల్లగాని మనువాడతాది. ఇయన్నీ ఉప్పుడు మమ్మూల్లే గాదా. అదెట్ట జరిగిందంటవు?”

“గొప్ప గొప్ప సంస్కర్తలు పూనుకుని ప్రజలను ప్రబోధితులని చేస్తేనూ,” అన్నాను నా టీవీజ్ఞానంతో.

సంద్రాలు తల అడ్డంగా ఆడించింది. “ఇసుమంటియి ఎవురికైన ఆరి బుర్రల్లొనే పుట్టాల. అది ఆరి పూరవజలమ సుకర్తంసేత జరగతాది.”

సంఖసంస్కర్తలూ, పురోభివృద్ధికాముకులూ పూనుకుంటేనే వాళ్ళకి ఆ బుద్ధి పుట్టిందని చెప్దాం అనుకున్నాను సంద్రాలుముందు నేనెంత, నాతెలివెంత?

కానీ వెనకబడినకులాలవారికి న్యాయం జరగడం లేదన్నభావం నాబుర్ర తొలుస్తోంది.

అంచేత ఒంట్లో బలం అంతా కూడగట్టుకుని లోగొంతులో చిన్న నస పెట్టేను,

అసలు కులప్రసక్తి కూడదని కొందరు చాలా గట్టిగా వాదిస్తున్నారు. కళ్ళెర్ర చేస్తున్నారు. మరో పక్క నిత్యజీవితంలో కులప్రసక్తి లేకుండా అనేక స్థాయిలలో స్నేహాలు కలుపుకుంటూ హాయిగా చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్నారు. అసలు అడిగేవాడు లేక గానీ, మీకుటుంబంలో గానీ మీపరిచితులలో గానీ ఒక్కరైనా ఉన్నారా కేవలం తమ కులంవారికే సాంగత్యం పరిమితం చేసేసుకుని, మిగతా కులాలవారందర్నీ దూరంగా – నన్ను ముట్టకు నామాలకాకీ అంటూ – భజన చేసేవాళ్లు? అవసరాలనిబట్టీ, పరిస్థితులనిబట్టీ, చుట్టూ ఉన్న సమాజాన్నీబట్టీ ఒకొకరి వైఖరీ ఎన్నో రకాలుగా మారుతోంది. నామటుకు నాకు “మాకులంవాడు” అని ఉద్యోగం చూపితే తప్పు అనిపించదు. “మాకులంవాడు కాడు” అని ఉద్యోగం మాత్రం ఒప్పుకోను. మొదటిపద్ధతిలో కలుపుగోరుతనం ఉంది. ఆత్మీయత ఉంది. రెండోపద్ధతిలో కుళ్ళుబుద్ధి ఉంది. కపటం ఉంది.  అంటే మంచి చేయడానికి కులం కారణం అవచ్చు కానీ చెరుపుకి కాకూడదు. హ్మ్. ఎవరికి నచ్చుతుంది ఈ వాదన? ఎవరు ఒప్పుకుంటారు?

“నాను మరొటి గూడ అడగతన్న, సెప్పు. మా ముత్తవ్వకాలంల అది వొండుతే మీవోలు తినీవోరా? నేదు. ఉప్పుడు నానొండితే మాదొరతోబాటు నివ్వు బల్లకాడ కూకుని తింటన్నవ్. మరి వప్పటి తప్పు ఉప్పుడు ఒప్పయిపోనేదా?”

అవును. తక్కువకులంవాడు కూలిపని చేస్తున్నంతకాలం ఎడం పెడతారు. ఆ మనిషే నానా అగచాట్లూ పడి కలెక్టరయితే సరిబంతి భోజనాలకి ఏ ఆచారాలు అడ్డు రావు. ఇంట్లో ఉల్లి తినరాదంటారు హోటల్లో ఎగబడి తింటారు. ఎంత శ్రద్దగా సంప్రదాయాలని పాటించేవారూ వెసులుబాటుకోసం తడుముకుంటూనే ఉన్నారు.  దేశకాలపరిస్థితులమహిమ!

000

ఇంతకీ ఈ పోస్టు కేవలం కులంగురించే కాదు. మరింత విశాలపరిధిలో ఒకరు మరొకరిని “మనవాడు” అనో “మనవాడు కాడ”నో అనుకోడంగురించి.

స్థూలంగా అందరూ సమానఁవే అని ఎంత అరిచి మొత్తుకున్నా చిన్నా పెద్దా ఏదో ఒక అంశం ఆధారం చేసుకుని వేరు పెడుతూనే ఉంటాం. కులం ఒక్కటే కానక్కర్లేదు. ధనం, ఉద్యోగం, స్థావరం, దేశం,  భాష – కొలిచే సాధనం ఏదైనా కావచ్చు. అంతెందుకూ చిన్న ఉదాహరణ చెప్తాను. ఇక్కడ నేను “మనలో మనమాట” అంటే నీమాటా, నామాటా మనఇద్దరిమధ్యా మాటలు అనే కదా. మరి ఇందులో చిన్న తిరకాసు లేదూ? ఓ పక్క మనం అందరం చెప్పుకునే మామూలు మాటలే ఇవీ అనీ, మరో పక్క మనిద్దరిమధ్యే ఉంచుకోవలసిన మాట అనీను. మరెవరితోనూ అనకేం అని అర్థాంతరం. నువ్వు మళ్ళీ మరొకరితో మనిద్దరిమధ్యే సుమా అంటూనే ఇదే మాటే చాటింపు వేసేయొచ్చనుకో. అది వేరే కథ.

అన్నట్టు సందర్భం వచ్చింది కనక ఈ “మన” పద్ధతిగురించి చెప్పుకుందాం. మనిల్లు, మనూరు లాటివి మనకే చెల్లింది. మనం మనం తిమ్మనం అన్న పలుకుబడివెనక చాలా కథ ఉందిట. ఇంతకీ తిమ్మనం తినడానికి తీయగానూ, చూడ్డానికి ఒద్దికగా ముద్దలాగానూ ఉంటుంది. అలాగే మనమూనూ అని రూఢ్యర్థం.

నువ్వూ చూసే ఉంటావు మనదేశంలో నలుగురికోసం నిర్దేశించిన కారులో ఎనిమిదిమంది ఎక్కుతారు. ఇరుక్కుని అంటావా, ప్రేమగా అంటావా చెప్పు. రెండోదయితే తిమ్మనమే.

తెలుగువాళ్ళలో “నీ”, “నా” కంటే “మన” వాడుకే ఎక్కువ. మనఇల్లు, మనవాళ్ళు, మన భాష, మన జాతి – ఇలా చెప్పుకోడం మన కలుపుగోరుతనం, కలిసికట్టుతనం ప్రదర్శించుకోడానికే కానీ తదితరులని వేరు పెట్టడానికీ కాదు, వారు తక్కువనీ కాదు.

ఒకసారి ఏమయిందో తెలుసా. మనదేశంనుంచి కొత్తగా వచ్చిన ఒకావిడ మా ఇంటికొచ్చింది. ఆవిడ ఇల్లంతా కలియజూస్తూ, “ఇదంతా మనిల్లేనా?” అనడిగింది. నాకు ఆ వాచకం జ్ఞాపకం రావడానికి రెండు క్షణాలు పట్టింది. మనవాడు, మనఊరు, మనభాష, మనిల్లు – ఇవన్నీ మన మాటతీరులో ఉన్నాయి. అదొక గొప్ప భావం, గొప్ప అనుభవం. అంతే గానీ “మనిల్లేనా?” అని ఆవిడడిగితే, నేను అవునంటే, ఆ వెంటనే ఆవిడ పిల్లా మేకా మూటా ముల్లే వేసుకొచ్చేసి మాయింట్లో మకాం పెట్టేస్తుందని కాదు కదా. మనం ఎవరింటికైనా వెళ్తే, “మళ్ళీ రావాలి మీరు.  రెండ్రోజులుండేలా రండి,” అంటారు. “ఈయిల్లు మీయిల్లే అనుకోండి,” అంటారు. నువ్వు అదే మొదటిసారి ఆ ఇంట అడుగుపెట్టడం అయినా సరే, ఎంత కొత్తవాళ్ళయినా సరే. మన మాటతీరది. నాకు ఎన్నోమార్లు అనుభవం అయింది ఇది. మొన్నటికి మొన్న ఆ అమ్మాయి “నా పోస్టు నీపోస్టే అనుకో,” అన్లేదూ, అలాగే ఇదీను. మాట అన్నంతమాత్రాన ఆ యిల్లు నాయిల్లు అనుకునేస్తాననీ కాదు. పదే పదే వారింటికెళ్ళి అక్కడ మకాం పెట్టేస్తాననీ కాదు కదా. నీకు మాత్రం తెలీదేమిటి. అదొక సంప్రదాయం, అంతే.

ఇలా ఆలోచిస్తూ నడుస్తున్నాం. అంతలో  భౌ, భౌ, భౌ, భౌ వినిపించి ఉలిక్కిపడి వెనక్కితిరిగి చూసేను, మూడంకెలా ముడుచుకుపోతూ.

సంద్రాలు నవ్వింది, “మనోల్లోలే. ఐన అరిసీ కుక్కలు కరవ్వు.”

యజమాని, హెయ్ అంటూ అదిలించి, ఆ రెండు ముద్దుకూనలను పక్కకి లాగేడు.

“రెండోకుక్క అరవడం లేదు కదా. అయినా మనవాళ్లంటావేమిటి. ఏవంక చుట్టం అనీ?” అన్నాను విసుగ్గా.

“గాదులె. అయి మన పొరుగుదేసంయంట. తిబెటునించి ఒవురో తెయ్యి ఈరికి అమ్మినారు.”

“టిబెట్ మనపక్కదేశం కాదు. నేపాల్ కి పక్కదేశం. ఆ మాట వదలెయ్. టిబెటయితే బుద్ధదేవుని బుద్ధి రాక్కర్లేదా?”

“ఆ ముకం సూడు. నివ్ పలకరిచనేదని వెస్టపడతన్నది.”

“సాటి కుక్క కనిపిస్తే కబుర్లు చెప్పుకోడం చూసేను కానీ నేను పలకరించలేదని బాధ పడ్డం ఏమిటి?”

“ఈ బూపెపంచికంలో జీవులు సమస్తమూ ఒకిటే కుటుంబంవని సెప్పలే?”

సమస్త జీవులకీ ఈ “మన”భావం ఒకటే అంటే నాకు నమ్మకం కలగడం లేదు.

నేను సంద్రాల్తో గట్టిగా వాదిస్తుండగానే, ఎదురుగా మరో శునకయజమాని మరో జాగిలంతో రంగప్రవేశం చేసేడు.

నన్ను తేరిపార చూస్తున్న రెండు కుక్కలూ గబుక్కున అటు తిరిగి వెళ్ళిపోయేయి. ఆ పెంపకపుతండ్రి కూడా అటు తిరగేడు. ఆ రెండు కుక్కలూ మూడో కుక్కతోనూ, ఈ మనిషి ఆ మనిషితోనూ కత్తు కలిపేసారు.

నేను సంద్రాలువేపు చూసేను, “చూసేవా మరో కుక్క కనిపించగానే నాఅక్కర లేకుండా పోయింది దానికి. కుక్క కుక్కతోనూ, మనిషి మనిషితోనూ.”

“నివ్ గూడ ఆల్లమాదిరే మాటాడతన్నవ్. అస్లు మడిసంత బుద్దిమాలినోడు నేడు నోకంల. కులంపేర్న సంగాలెడతడు. మల్ల కులం ఒద్దంటడు. మనదేసిం,మన రాస్టరం, మన బాస, మనబడి, అంట ఒంకలు సూపుతడు స్నేయితం కలపుకోనానికి. మల్ల పని గాకపోతె స ఇయన్ని తప్పంటడు. మడిసి బుర్రే గోల్మాలయిపోనాది. అందురిలోన ఒకే జీవుడున్నడు అన్న గేనం ఉండాల. ఒప్పుడు ఇయన్నీ శాన సిన్న యిసయాలైపోతయి. మడిసి కల్పిచ్చుకున్నయే” అంది సంద్రాలు.

చెప్పేను కదా సంద్రాల్తో వాదించి గెలవడం నాతరం కాదనిో.

000

(ఆగస్ట్ 24, 2016)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

4 thoughts on “మనలో మనమాట 25 – మనం మనం తిమ్మనం”

  1. ఎప్పుడైనా ఎవరైనా “మనం, మనవాళ్లు” అన్నమాట వాడితే అందులో ఏ “మనం” కి నేను చెందుతానో అని తిక-మక పడతాను నేను 🙂
    ~ లలిత

    మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s