నీబలం నీకు తెలీదు

“ఏటాలోసన?” అంది నామొహంలోకి గుచ్చి చూస్తూ.

గుప్పెడు పళ్ళు పట్టుకు వచ్చింది సంద్రాలు. ఇటొస్తూ దారిలో కనిపిస్తే కోసుకొచ్చిందిట. ఆ వెనకే తారకం కూడా వచ్చేడు.

“చాలాకాలం అయింది కనిపించి. అంతా పనేనా?” అన్నాను అతడిని చూస్తూ.

“లేదండి. మాఊరికెళ్ళేను చూసి చాలాకాలం అయిదని.”

“జాగిలోరు గొప్ప గొప్ప పీచీలు సెప్తాడు నిద్దరోతున్న జాగిలాలని ఉసి గొలిపినట్లె.  అయి ఇనీస్తే నీకు గొప్ప బలవుం పొడుసుకొచ్చీస్తాదన్నమాట, అనుమంతులోరినాగ.  బాలసెందురుడిని  శానమ్మ ఎత్తిపొడవలే? అనాగె. అపుడు నివ్ గబుక్కుని  లేడిపిల్లనాగ లేసీసి రంగంనోకి ఉరికీసి ఎంతో గనకార్యేలు సాదించేస్తవు ఆపైన.”

తారకం అయోమయంగా నావేపు చూసేడు, “జాగిలోరా?”

“Zig Zaglar అని సుప్రసిద్ధ ప్రోత్సాహకవేత్త. నువ్వు చాలా బాగా రాణించగలవు,  నీకు చాలా శక్తి ఉంది అని అందరికీ మాటలు చెప్తూ లక్షలార్జించేడు.”

“ఆయన్ని మీకు తెలుసా?”

నేను మాటాడలేదు. నాజీవితంలో అది గర్వపడదగ్గ సంగతిగా నేను భావించను.  నేను చేసినవన్నీ చిన్న ఉద్యోగాలే అయినా కొన్ని చెప్పుకోడానికి నాకు మొహమాటం లేదు. కొన్ని మాత్రం తలుచుకుంటే నామనసు కుతకుత ఉడికిపోయి కూలిపోతుంది.

“అదేటిమాట. నీబిడ్డ సెప్పుకుంటాది గద గొప్పగ మాయమ్మకి సొంత కుంపెని  ఉండీదని.”

నేనూరుకున్నాను సందిగ్ధంగా తలూపి. అది చెప్పుకుంటుంది. తల్లి ఏం చేసినా పిల్లలకి గొప్పగానే ఉంటుంది మరి.

“అయితే మీకు పనికిరాలేదేమిటి ఆయన ప్రోత్సాహకర వాక్కులు?”

ఆఖరికి నోరు పెగిలింది నాకు. “సంద్రాలంటున్నది అది గాదులే. ఆసభలో జరిగిన మరో కత.”

“ఆ కత గూడ సెప్పరాద?”

“నువ్వే చెప్పు.”

“చెప్పండి మరి,” అన్నాడు సంద్రాలువేపు తిరిగి, కుర్చీలో సద్దుకు కూర్చుని.

సంద్రాలు నావేపు చూసింది చెప్పనా అన్నట్టు. నీఇష్టం అన్నట్టు తలా చేయీ ఆడించేను. నిజానికి నాకైతే ఆ జీవితం సిగ్గుగానే అనిపించినా ఆ సంఘటన మాత్రం  తమాషాగా చెప్పుకోడానికి బాగానే ఉంటుంది మరి.

సంద్రాలు మొదలు పెట్టింది తారకం ఎదుట కూర్చుని. “ఈయమ్మ యాపారం  సేసిందని తెల్సింది గంద. యాపారాలోల్లు ఈ సబలు బెడతరు. యాపారాల్లో  మెలుకువ్లు సప్తటరు. నిజింగ అయి అందురుకి పనికొస్తనుకోమాకు. అందుల కిటుకదె. నీకు ఏంవీ అరతం గాకున్నా ఏదో ఉండాది గావల అనుకుంతవు నివ్. అదన్నమాట నిజింగ జరిగీది.”

“ఈమెగారికి ఆయనమాటలు నచ్చలేదంటారా?” తారకం అన్నాడు విసుగు  కనపడనీయకుండా.

“ఆ బాబు నీకు ఎంత బలంవున్నదో నీకు తెలీదు నాను సూపిస్త. నాకు అసింటొకరు గావాల, ఎవురొస్తరు? అనడిగినాడు. ఎవురూ సేయెత్తనేదు. అప్డు ఈ యమ్మ నానొస్తనంట లేసింది.”

తారకం నావేపు నమ్మలేనట్టు చూసేడు. “మిగతా అందరూ ఏమవుతుందో అన్న  భయంతోనే కదా ముందుకి రాలేదు.”

“అదే మరి. అందురూ బయపడీసోటికి ఈయమ్మ ఉరుకుతూ పోతాది.”

“ఆ తరవాతేమయిందయితే?”

“ఆ బాబు నీకేమైనా ఆపరేసనులు అయీ అయినాయా అని అడిగీడు. ఈయమ్మ నేదన్నాది. సరి రమ్మని యేదికమీదికి తీసుకుపోనాడు. ఆడ రొండు కొయ్య కురిసీలు యెనక్కి తప్పి ఎడంగ అమర్సినాడు. ఆటిమజ్జన ఈమెని నిలబడమన్నాడు. ఆయెంట యేయో మంతరాలు సదివి, ఈమెని ఎత్తి ఆ కురిసీలమీన పండబెట్టినాడు, ఓ కురిసిమీన మెడ, రొండో కురిసీమీన మడంవలూని. అంటే మజ్జన మెడనించీ కాలవర్కూ  దన్ను నేకండా.”

తారకం కళ్ళు మరింత విచ్చుకున్నాయి.

“ఆయన మరోకురిసీమీన కాలేసి, ఈయమ్మ పొట్టమీదికెక్కి నిలబడ్డాడు. ‘సూసేరా  ఈమెబలం’ అన్నడు. జనాలు నోరెల్లబెట్టి కిక్కురుమనకండ సూస్తన్నరు. మరి ఈ యమ్మేంవో వంద పవున్లన్నదో నేదో. ఆయనేంవో నూటఎనబయి పవున్లుంటడు.”

తారకం మొహంలో ఆశ్చర్యం, అనుమానం, భయం ఒక్కుమ్మడిగా ముంచుకొచ్చేయి.

“మీకెంత ధైర్యంవండీ!” అన్నాడు నావేపు తిరిగి.

“ధైర్యం కాదు. నేను అట్టే ఆలోచించను. ఏమవుతుంది మహా అయితే .. అని.”

“మహా అయితే … ఆ తరవాత ఏం అనుకున్నారు? పూర్తి చెయ్యండి మరి.”

“ఏం లేదు. అది తరవాత కదా తెలిసేది. అంచేత మహా అయితే …అనుకునేసి  ఊరుకుంటాను.”

“ఏదీనైన ఈయమ్మ అంతె. కిందటోరం అయేటో పల్లు ఏటో తెలీకండ తినీసింది.”

“ఏం పళ్ళండీ?”

“తెలీదు,” అన్నాను తల అడ్డంగా ఆడిస్తూ.

“ఇప్పటికీ తెలీదా?”

“తెలీదు. నాచిన్నప్పుడు మాయింట్లో రకరకాల పళ్ళచెట్లుండేవి. ఆ చెట్లకింద తిరుగుతూనో చెట్టెక్కో అందిన పండు కోసుకుతినడం నాకు అలవాటే కదా. అంచేత ఏ పళ్ళ చెట్టు చూసినా ఓ నిముషం ఆగి ఆ కాయలేమిటో అనుకోకుండా ఉండలేను. ఈ  కాయలు కనిపించినప్పుడు కొంచెం ఆలోచించేను కానీ ఏమయితే అయిందిలే  అనిపించి ఓ పచ్చికాయ కొరికి చూసేను. వగరుగా ఉంది. సరే ఇది పచ్చికాయన్నమాట, అనుకుని ఎర్రగా ఉన్నది దోరపండు అనుకుని కొరికి చూసేను. తియ్యగా బాగుంది. మొత్తమ్మీద ఆకుపచ్చ, పసుప్పచ్చ, పసుపూ ఎరుపూ, ఎర్రటి ఎరుపూ మొత్తం  గుత్తులు గుత్తులుగా నయనానందకరంగా ఉన్నాయి కదా అని ఫొటో తీసేను. బొమ్మ  బాగుందని ఫేస్బుక్కులో పెట్టేను. చాలామందికి నచ్చింది.

DSC00114DSC00140మరువం ఉష arbutus  unedo అని లింకు ఇచ్చింది. https://en.wikipedia.org/wiki/Arbutus_unedo. నాకేమో ఇవి strawberry ఆకారం లేదు కదా అని. మర్నాడు మా పొరుగువారికి బొమ్మ చూపించి అడిగితే, కాయలు తీసుకొచ్చి చూపమన్నారు. సరే మళ్ళీ వెళ్ళి ఓ చిన్న సంచీలో గుప్పెడు కాయలు తీసుకొచ్చేను.  ఇద్దరికీ తెలీదుట అవేమిటో. ఒకావిడ తిని చూసీ తెలీదంది. రెండో ఆవిడ తిని చూడడానికి కూడా ఒప్పుకోలేదు.నీలా నాకు ధైర్యం లేదు. అవేమిటో తెలీకుండా నేన తిననుఅంది” అన్నాను నవ్వుతూ.

“నవ్వుతారేమిటి. నిజమే కదా,” అన్నాడు తారకం.

“చెప్పేను కదా మూడు రోజులయింది నేను తిని. నాకేం కాలేదు.”

“కొన్ని పరిణామాలు వెంటనే కనిపించవు. మనజాగ్రత్తలో మనం ఉండాలి.”

“ఆమధ్య ఇండియానించి ఒకావిడ వచ్చింది మాయింటికి నాలుగేళ్ళ కొడుకుని తీసుకుని. ఇద్దరం ఇంటిముందు వాకిట్లో తిరుగున్నాం. ఆ అబ్బాయి చెట్టుకింద రాలిన ఆపిల్ తీసుకుని కొరికేడు. నేను చూసి, ఉండు, కడిగిస్తాను అన్నాను. ఆ తల్లి ఏమందో  తెలుసా?”

“ఏమంది?”

“తిననీ. immune system అలాగే కుదురుకుంటుంది అని.”

“అలాటి వితండవాదనలవల్లే మనదేశంలో రోగాలు రొచ్చులూ.”

“జాగర్తలో ఉండాల్లే. అవుతే అదే పనిగా  సిన్నా సితకా  పెతీదానికీ పానాల  పోతాయేంవో అనుకుంట  గాబరా   పడరాదు.  ఈ సుట్టుపట్ల   పల్లవ్రుచ్చాలు శానా  ఉన్నయి. అంటే యేటీ, పూరువులు మంచీ సెబ్బరా ఆలోసించి పల్లసెట్లు నాటినారని తెలస్తన్నది. నీకెరిక నేదేమో. అమిరికల జనీ ఆపుల్సీడు అని ఒకాయన దేసంనిండ ఆపులు యిత్తనాలు పాతుంట పోయినాడంట. మనదేసంల గూడ పల్లసెట్లు పాతీసీవోరు. అప్పట్లో ఊర్నించి ఊరికి నడిసిపోయేవోరు గంద. ఆలకి దారిల తింటానికని.”

“అది గాదమ్మా. తినొచ్చు అని తెలిస్తే సరే. తెలీకుండా తింటే అవి విషం అయితేనో?”

సంద్రాలుకి కూడా చిరాకేసినట్టుంది, “సూడు బాబూ. నీకు తోసింది నివ్ సెయ్.  నివ్ తినకు. నానేటి అంటన్ననో నాను సెప్పిను. అంతె. ఏటి తింటె ఏటవుతాదో  అని బయపడినోల్లెవురూ కొత్త ఇసీయాలు గనిపెట్టనేదు గంద. బయపడీవో్ల్లు సుకంగ ఉండారు. ఆరికి కూడా రోగం, రొచ్చు వస్తాది గానీ ఆరు మందులూ మాకులూ  తిని నయం సేస్కుంటరు. అవుతే  పెపంచకంలో కొత్తగ ఒచ్చినయన్నీ ఎట్ట వొచ్చినయో సూసినవా నివ్వు? అందరూ నడిసీమార్గంల గాక మరొక మాగరంలో  నడిసి దయిర్యంగా ఎల్తరు. ఆలమూలంగనె మనకి కొత్త కొత్త మెసీనులూ అయ్యీ  ఒచ్చినయి. అదీ అస్సులు నిజిం సత్తెపెమానం,” అంది సంద్రాలు వెళ్లడానికి లేస్తూ.

తారకం మొహం ఉల్లిపొరకాయితంలా పాలిపోయింది.

అతనికీ నాకూ కూడా తెలుసు సంద్రాలు మాటల్లో ఆంతర్యం, “ఏ పిరికివాడూ ఏ ఘనకార్యమూ సాధించలేదు.”

తారకం రెండు నిముషాలు మాటాడకుండా కూర్చున్నాడు. తరవాత ఆలోచిస్తూ మెల్లిగా లేస్తూ, “ఆ జాగిలోరి ఉపన్యాసం మీకు ఆ పండు తినే ధైర్యం ఇచ్చించి ఉండాలి.  నిజం చెప్పండి. అవును కదూ?” అన్నాడు.

అతనిమొహంలోకి గుచ్చి చూసేను. ఏదో ఒక ఆసరా కావాలి ఈరాత్రి సుఖంగా  నిద్రపోవాలంటే అన్నట్టున్నాయి ముఖకవళికలు. అది పాడు చేయడానికి నేనెవర్ని?

నవ్వేసి ఊరుకున్నాను.

000

(ఆగస్ట్ 30, 2016)

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

3 thoughts on “నీబలం నీకు తెలీదు”

 1. నీ బలము నీకు తెలియదు
  కాబోలనుకుని జిలేబి కాస్తా లాగిం
  చా బో ! కుదేలు మనకుం
  డా బోలే నా యుసుర్లు సంద్రా లమ్మో !

  జిలేబి

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s