శాపమా? వరమా?

అది యొక కీకారణ్యము. అంబరము చుంబించు వృక్షశ్రేణితోనూ, వాడి ములుకుల చెలగు గుబురు పొదలతోనూ, గజిబిజిగా ఎల్లెడల గజిబిజిగా అలుముకొనిన లతలతోనూ చూచువారికి భీతి గొలుపుచున్నది. క్రూరమృగములు విచ్చలవిడిగా సంచరించుచు మానవులకిది ఇరువుకాదని చాటి చెప్పుచున్నట్టు భయంకరముగా హుంకారములు సలుపుచున్నవి. అట్టి కాననమున పదునొకండు వత్సరముల బాలిక యొకర్తు దారి తప్పిన హరిణకిశోరమువలె బెదురు చూపుల చూచుచు తిరుగాడుచున్నది. అకటా, ఈ మానవులెంత దయావిహీనులు. పట్టుమని పండ్రెండు వత్సరములైనను లేని చిఱుతుకను ఏకాకింజేసి, సింహములు, భల్లూకములు, మదగజములు విచ్చవిడిగా తిరుగు భయంకర కీకారణ్యమున ఒంటరి చేసి విడువ దగునే!

ఆ బాలిక అవ్విధమున యా యడవిలో పరిదీనవదనయై తిరుగుచుండుగా, గంగాజలమును గొను నెపమున ఆదారిన పోవుచున్న మునివరుడొకండు ఆ బాలికను గని రిచ్చ వడి, ఆ చిన్నదానిని సమీపించి, ఆదరము నొప్పు నెమ్మోముతో, నిట్టుల పలికెను, “బాలామణీ, దారి తప్పి ఇటకేతించిన హిమవత్పర్వతపుత్రికవో, బాల్యక్రీడల అటనిట పరువులెత్తుచు కందుకము వెదకు నెపమున ఇయ్యెడకేతించిన జనకరాజతనయవో, సాక్షాత్ రాజరాజేశ్వరీదేవి ఇంట వెలసిన పట్టివో అననొప్పు ఎవతెవీవు? ఈ కాననమున ఒంటరివై చరింపదగునే? నిను గన్న తల్లిదండ్రులు నిన్ను గానక వెతచెంది నీకై ఎంతగా పరితపించుచున్నారో గదా. రమ్ము, నిన్ను తోడుకొని బోయి వారికిని నీకును ఉపశమనమును కలిగింతు.”

లోకబాంధవుడైన పరమశివుడే ఈ రూపమున తన వెత దీర్ప అవతరించేనేమో యన బ్రహ్మతేజస్సుతో అలరుచున్న ఆ మునిసత్తముని ముఖారవిందమును గని, మనమున ఆందోళనము నెమ్మదింపగ, ఇంచుక సాంత్వన బొందినదయి, ఆ బాలామణి ఇట్లు నుడివెను, “మునివరా, మిమ్మలను గని, తమ చల్లని భాషణలు విని నామానసము పరమపవిత్రమైన గంగాజలములో తనిసినరీతి సాంత్వన బొందినది. మహాత్మా, ఏను ఎవరినో, ఇచటికి ఎట్లు వచ్చితినో ఎరుగనైతిని. మూడు దినములుగా దిక్కు తెలియక తిరుగుచూ, ప్రాంతమున లభించిన కాయలతోనూ స్వాదుజలములతో ఆకలి, క్షత్బాధలను దీర్చుకొనుచు పొద్దు పుచ్చుచుంటిని. తమ్ము జూడ త్రికాలజ్ఞులని దోచుచున్నది. నా జన్మవృత్తాంతమును తెలిపి నన్ను కృతార్థురాలని సేయుమని అర్థించుచున్నాను,” అనుచు ఆ బాలిక అంజలి ఘటించి, ఆమునికి పాదాభివాదములు సేసెను.

ఆ మునిశేఖరుండును పరితృప్తుడై, తన యోగదృష్టిచేత ఆ కౌమారి జన్మవృత్తాంతమును ఎరిగినవాడై, ఇట్లు పలికెను, “కౌమారీ, నీ జన్మవృత్తాంతము ఏను నాయోగదృష్టిచే ఎరిగితి.”

000

తుళ్ళి పడి లేచి కూర్చుని చుట్టూ చూసేను.

“ఏటి కలా? రాచ్చసులూ, దెయ్యాలూ సూసినావేటి?” నాభుజాలు పట్టుకు కుదిపి లేపి సంద్రాలు నవ్వుతూ అంది.

మళ్ళీ పరీక్షగా చుట్టూ చూసేను.

ఇది దండకారణ్యం కాదు.

నావయసు పదకొండు కాదు.

ఎదుట నిల్చింది బ్రహ్మతేజస్సుతో వెలుగుతున్న మునివరుడు కాదు,

సంద్రాలు! మొహంలో మాత్ర ఆ కళలు కనిపిస్తున్నాయి, జటాజూటమూ, గడ్డాలూ,   మీసాలూ తక్కువగా.

మళ్ళీ చూసేను గ్లాసుతో మంచినీళ్ళు తెచ్చుకుని కూర్చుంటూ. నాజన్మవృత్తాంతం  తెలీకుండా కలలోంచి లేపేసినందుకు సంద్రాలుమీద కోపం వచ్చింది కూడా. కానీ, ఏంచేస్తాం. కష్టాల్లాగే కలలు కూడా చెప్పి రావు కదా. రమ్మన్నప్పుడు అసలే రావు.

“నీనించి నేనెలా ఎందుకు ఇక్కడ అవతరించేనో తెలీకుండా పోయింది,” అన్నాను  విసుగ్గా.

“నాను సెప్తాలే.”

ఆహా, నా అంచనా తప్పు కాదన్నమాట. కలలోని సర్వజ్ఞుడయిన ఋషిపుంగవుడే సంద్రాలు.

“నివ్ ఈ బూనోకంల అవుతరిచ్చకమున్ను బెమ్మగారి బారియగారికి ఇస్టసకిగ ఉండీదానివి. ఆయమ్మకి నివ్వంటె సానా ఇస్టం కూడా ఉండీది. అవుతే నివ్ ఇప్పట్నాగే అప్పుగూడ ఆసికాలాడీదానివి. మూర్కం, పొగురు, గోరోజినం, గండ్రతనం …”

“సరే అర్థమయింది నేనెలాటిదాన్నో. ఆ తరవాతికథకి పద.”

సంద్రాలు కిలకిల నవ్వి, “సంపెస్సుగ ఉంటాదనీ.”

“ఆహా సస్పెన్సు కావలసినంత కూడింది. ఇక కథ ముందుకి సాగకపోతే చదివేవాళ్ళు ఇక్కడ్నించి లేచిపోతారు.”

“ఓ పాలి సరస్పతమ్మోరు పజ్జాలు సదూతున్నది. నివ్వు అది గాదు అంట సాచ్చాత్తు చదూలతల్లిని తప్పు పడితివి.”

“అయ్యో అలా చేసేనా?” అన్నాను నొచ్చుకుంటూ. నిజమే మరి. సాక్షాత్తూ వాగ్దేవిని నేను తప్పు పట్టడమేమిటి, పొగరు కాకపోతే.

“ఆదీ మరి. ఆయమ్మ గూడ నీకింత పొగరు తగదు, నివ్వెల్లి బూలోకంలో యేరేవోల్లకి రాయనం, సదడం సెప్పుకంట బతుకు అని సాపం ఇచ్చీసినాది.”

అయ్యయో ఎంత ఘోరం జరిగిపోయింది. మరి నేను శాపవిముక్తి ఏమిటి అని అడగలేదా? అనుకుంటూ మోకాళ్లమీద తల ఆన్చి కొంచెంసేపు అదేదో సినిమాలోలా ఏడ్చి, అదేమాట సంద్రాల్ని అడుగుదాం అనుకుంటూ తలెత్తాను.

సంద్రాలు మాయమయిపోయింది.

నా జన్మవృత్తాంతం కొంత తెలిసింది కానీ సాంతం తెలీలేదు. నాకు తెలిసిన అన్ని కథల్లోనూ శాపం పొందినవాళ్ళంతా విముక్తి కూడా పొందేరు కదా మరి నామాటేమిటి అని ఇంకొంచెంసేపు విచారించి, మైసూరు బోండా చేసుకునే పనిలో పడిపోయేను.

000

ఇదంతా ఎలా మొదలయిందంటే వారం రోజులక్రితం, నా కిండిల్ రీడరులో ఓ పుస్తకం కనిపించింది. పుస్తకం పేరు కథకుల గాథలు. రచయిత వేదం చంద్రశేఖరయ్యగారు. ఆయన వేపేరీ, మద్రాసులో ప్రధానాంధ్రోపాధ్యాయులు. ఐదవ, ఆరవ ఫారం పిల్లలకి పాఠ్యగ్రంథంగా ఉపయోగపడడానికి వీలుగా సరళమైన భాషలో రచించేరు 1956లో. కథాంశం బృహత్కథకి అవతారికలో ప్రస్తావించిన వరరుచి, గుణాఢ్యుల కథలు. పుస్తకం చివర ప్రశ్నలున్నాయి. గుండెమీద చెయ్యి వేసుకు చెప్పాలంటే, మళ్ళీ పుస్తకం చూడకుండా జవాబులు చెప్పలేను.

మచ్చుకు ఆనాడు సరళభాష అనదగ్గది ఇలా ఉంది

vararuchiఇదంతా ఒక వాక్యం. ఈ పుస్తకంలో  నాకు పరిచయం  లేని పదాలు కొన్ని  కనిపించేయి. అప్పుడే నాకు ఒక చిలిపి కోరిక పుట్టింది. ఇప్పుడు నేను అలాటి శైలిలో రాయగలనా అని. చూదాం అని మొదలు పెట్టేను. ప్రారంబంలో మొదటి రెండు పేజీలు అదీ కథ.

ఆ రెండు పేజీలు రాయడానికి పదిమార్లు ఆంధ్రభారతి నిఘంటువు సంప్రదించేను. చెప్పొచ్చేదేమిటంటే, ముఖపుస్తకంలో నామిత్రులని తెలుగులో రాయమని ప్రోత్సహిస్తున్నాను. చాలామందికి నాతెలుగుమీద గొప్ప నమ్మకం. అది నిజం కాదని చెప్పడంకోసమే ఈ కథలాటి కథ.

000

నా ఎదురుగా ఆరేళ్ళ రూప్మీ కూర్చుని పలకమీద ఏదో రాసుకుంటోంది.

dscf0369తలెత్తి నన్ను చూసి కొన్ని తెలుగు పదాలు అడిగింది.తరవాత పలకమీద రాయమంది. బల్లకి చెరోవేపూ కూర్చుని ఉన్నాం.

నేను ముందుకి వంగి ఆ పలకమీద మొహం (తను అడిగినందున) అని రాసి ఉచ్చారణ కూడా చెప్పేను.

రూప్మీ పలకవేపు రెండు నిముషాలపాటు తేరి చూసి, “నావేపు నించా నీవేపునించా?” అనడగింది.

నేను నవ్వి, “నీవేపునించే అన్నాను,” ఆ అమ్మాయికి ఆ సందేహం రావడం నాకు ఆశ్చర్యంగానే అనిపించింది.

ఇది శాపం కాదేమో అని కూడా అనుకున్నాను ఆ క్షణంలోనే.

000

అథోజ్ఞాపికలు –

కథకుల గాథలు పిడియఫ్ కాపీకి కథకుల గాథలు

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

6 thoughts on “శాపమా? వరమా?”

 1. బాగు బాగు ! అర్థం కాలే 🙂

  నాటి కథలను చదివెనూ
  సాటిగ రాసెను జిలేబి సంస్కృతి తెలుపన్ !
  నేటి జనులెల్ల యర్థము
  దీటు గరయ నాంధ్రభారతిన్జూడవలెన్ !

  జిలేబి

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 2. నేను ప్రస్తావించిింది వేదం చంద్రశేఖరయ్యగారి కథకుల గాథలు అని చెప్పేను కదండి. ఆ పుస్తకానికి లింక చివరలో ఇచ్చేను కూడాను.
  చిట్టి పొట్టి వాక్యాలలో అట్టే ఆలోచించుకోడానికి ఉండదు. మరీ అంత సుగమం చేయడం నాకయితే నచ్చదు. సుదీర్ఘమైన వాక్యాలు మెదడుకి పని పెడతాయి. అవి చదవడం, వాటిగురించి ఆలోచిస్తూ కొంతకాలం గడపడం నాకిష్టమే.

  మెచ్చుకోండి

 3. బాణుడి కాదంబరి ఇలా మొదలౌతుం దనుకుంటాను.

  “ఆసీ దశేష నరపతి శిరః సమభ్యర్చితశాసనః పాకశాశన ఇవా పరః కర్తామహాశ్చర్యాణాం ఆహర్తః క్రతూనాం చతురుదధివేలావలయితభువో‌ భర్తా……. ….. ….. ….. ….. ….. ….. ….. ….. ….. ….. …… …… …… ….. …. … ..రాజా శూద్రకోనామః” అని.

  ఈ ఒక్క వాక్యమే మొత్తం పేజీ అంతా నిండి ఉంటుంది. అంతసేపు చదివిన తరువాత శూద్రకుడనే రాజు ఉండెను అనే చిన్న వాక్యంలో బాణకవి పదులకొద్దీ విశేషణాలను దీద్ఘసమాసాలతో కూర్చి మరీ హడలెత్తించాడని బోధపడుతుంది. ఆసీత్ అంటే ఉండెను. రాజా శూద్రకో నామః అంటే శూద్రకుడు అనే రాజు. సులభంగా చెప్పాలంటే ఉన్నాడండీ .. ఇలాంటివాడు అలాంటివాడు అబ్బో అంతటి వాడు ఇంతటి వాడు…. శూద్రకుడని ఒక రాజు అని కవి ఒక వాక్యాన్ని నిర్మించాడన్నమాట – అదీ పేజీదాటిన నిడివితో.

  సంస్కృతభాషపట్ల విపరీతమైన అభిమానం ఉన్న మన వాళ్ళు కూడా యథాశక్తి అలాంటి చేంతాడు వాక్యాలు వ్రాయాలన్న ఉబలాటంతో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసారు. ఇప్పుడైతే మనకి వింతగా అనిపిస్తుంది.

  నేను ఇంగ్లీషు భాషని అభ్యాసం చేస్తున్న స్కూలుదశలో నాక్కూడా పొడుగుపొడుగు ఇంగ్లీషు వాక్యాలు వ్రాయటం పట్ల భలే మోజుగా ఉండేది. మానాన్నగారు ఆ విధానం పాతది – ఇప్పుడంతా చిన్నచిన్న వాక్యాలు సూటిగా స్పష్టంగా ఉండేలా వ్రాయటమే చేస్తున్నారని బోధించి వారించి ఆ మోజును మానిపించారు.

  డిగ్రీకాలేజీలో మాకు లార్డ్ క్లైవ్ అని ఒక పాఠ్యగ్రంథం ఉండేది. అందులో అన్నీ పూర్తిపేరానిడివి వాక్యాలే! అక్కడక్కడ ఒక్కోవాక్యం పేజీలో సింహభాగాన్నే ఆక్రమించేది.

  అన్వయం సరిగ్గా ఉండేలా మరీపేద్ద వాక్యాలు వ్రాయటం‌ కేవలం పాండిత్యవిన్యాసం. అవి చదువుకోవటం విద్యార్థులకు ప్రాణసంకటం.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s