భావముద్రలు అప్రమేయం!

ఇవి నా భావముద్రలు మాత్రమే!

ఇటీవల గ్రహించిన కొన్ని వాస్తవాలతో, జాలస్నేహాలు నేర్పిన కొత్తపాఠాలతో, దరిమిలా వచ్చిన చర్చలతో కొన్ని విషయాలు స్పష్టం చేయడంకోసం రాస్తున్నాను  ఇది. భావముద్రలు మూడు వర్గాలుగా విభజించవచ్చు.

 1. మన ప్రమేయం లేకుండా వాటికవే ఏర్పడేవి.
 2. మనచర్యల లేదా రాతలమూలంగా,  మళ్ళీ మన ప్రమేయం లేకుండానే,  ఎదటివారి మనసులో పడేవి.
 3. మనం పని గట్టుకుని ఎదటివారిలో కలిగించేవి.

ఇవి ఎలా పడతాయన్నది చెప్పలేం. ఉదాహరణకి మామూలుగా పొడుగ్గా ఉన్నవాళ్ళకి పొట్టివాళ్లంటే చిన్నచూపు అంటాననుకోండి. ఆ ముద్ర ఎలా ఏర్పడింది అంటే  ఖచ్చితంగా చెప్పలేం. ఏదో కారణం వెతుకుతాం.  బహుశా నేను ఇంకా పొట్టిగా  ఉన్న రోజుల్లో పొడుగ్గా ఉన్నవారు అర్థచంద్రాకారంలో ముందుకి ఒంగి నామొహంలో మొహం పెట్టి పట్టలేనంత ప్రేమ కురిపిస్తూ నాతో మాటాడ్డం కావచ్చు. వయసు మీరేక కూడా నా ఎత్తు అక్కడే ఆగిపోవడంతో పొడుగువాళ్ళంటే నాకున్న అభిప్రాయం కూడా అక్కడే ఆగిపోయి ఉండవచ్చు. ఇది నా భావముద్ర, ఇది అర్థరహితం.

అలాగే నేను ఈదేశం వచ్చిన కొత్తలో అమెరికనులంత మేధావంతులు ఈ  భూప్రపంచంలో లేరనుకున్నాను.  దీనికి కారణం  నేను ఇక్కడికి రాకముందు  మనదేశంలో  ఈదేశంగురించి అందరూ  మాటాడుకునే  మాటలు, సినిమాలు,  పత్రికలూ …  వీటన్నటివల్లా  ఒక భావముద్ర  పడిపోయింది.  ఇక్కడికొచ్చేక క్రమంగా తెలిసింది అదొక అపోహ మాత్రమే అని. అంతేగాదు,  ఇక్కడివారికి మనగురించి కూడా అలాగే  చాలా  అపోహలున్నాయని.  ఇది నా ప్రమేయం లేకుండా జరిగింది కనక  మొదటి వర్గానికే చెందుతుంది.

 1. మన చర్యలమూలంగా ఏర్పడినివి.

అసలు ఇందుకోసమే అంటే నా మేధాసంపత్తిగురించి పాఠకులకి కలిగే భావముద్రల గురించి చెప్పడానికే ఈ పోస్టు మొదలు పెట్టేను. మొదట నా వ్యాసాలగురించి రెండు మాటలు చెప్తాను.

అది ఇలా ప్రారంభమయింది.

నేను తూలిక.నెట్ సైటు ప్రారంభించి, మొల్ల రామాయణంమీద  రాసిన వ్యాసం  కొందరు యూనివర్సిటీ పండితుల కళ్ళ బడింది.  అప్పుడు  నేను చాలా  మేధావంతురాలిని  అనుకుని  నాతో వారు  కొన్నాళ్ళు  ఉత్తర ప్రత్యుత్తరాలు  జరిపేరు. ఆ తరవాత అదంతా భావముద్ర మాత్రమే అని గ్రహించి తప్పుకున్నారు.  మొల్ల కాకపోతే మరో వ్యాసం. ఎవరో ఒకరు చూడ్డం, అహో ఒహో అనుకోడం, తరవాత చల్లారిపోడం – అనతికాలంలోనే ఈ వరస నాకు మామూలైపోయింది. కాదు,  ఇది నా భావముద్ర కాదు. నిజంగానే జరిగింది.

నా చరిత్రలో ఆ అధ్యాయం ముగిసీ ముగియకముందే మరో ప్రణాళిక –  తెలుగు తూలిక – మొదలు పెట్టేను. ఇక్కడా పాఠకులవరస అంతే. కొన్నాళపాటు  పాఠకులు  ఏవో భావముద్రలు తెలిసో తెలియకో ఏర్పర్చుకోడం, తరవాత అబ్బే  ఇదంతా ఉత్తుత్త ఆర్భాటమే అనుకుని తప్పుకోడం జరిగింది, మరియు జరుగుతూ  వస్తోంది. ఆ వరసలోనే, నారాతల్లో అచ్చుతప్పులో హేళనో, కనిపించినప్పుడల్లా ఎవరో ఒకరు నన్ను “మీరే అలా రాస్తే ఎలా, మిమ్మల్ని చూసి మిగతా వారు కూడా అలాగే రాస్తారు,” అంటూ నాకో “గురుస్థానం” ఆపాదించడం జరిగింది. ఇది రెండో తరగతి  భావముద్ర అన్నమాట. ఇలాటివి మీక్కూడా అనుభవమయి ఉండొచ్చు.

మామూలుగా రచయితలెవరూ “నన్ను అనుసరించు” అని చెప్పరు.  అది   ఒకరో ఇద్దరో మహాకవులకి చెల్లుతుందేమో కానీ నాలాటి సామాన్యరచయితలెవరూ,  చిత్తశుద్ధి గల రచయితెవరూ, చెప్పరు. ఆ రచయితలు కూడా “ఎవరు నన్ను  అనుసరిస్తారో, నేనిలా రాయకూడదు” అని జంకుతూ  రాయరు.  తమకి  ఇష్టమైన పద్ధతిలో రాయడమే చిత్తశుద్ధితో రాయడం అంటే. అది నచ్చినవారు చదువుతారు.  నచ్చనివారు చదవడం మానేస్తారు. మానేయడం మంచిదే కూడా. ఎందుకంటే –  అందరి విషయంలో  చెప్పలేను  కానీ నాకు  సంబంధించినంతవరకూ  మరొకరికోసం  నాపద్ధతి నేను మార్చుకోలేను. మార్చుకుంటే అది నటన,  స్వార్థం  అనిపించుకుంటుంది.

భావముద్రల ప్రస్థానంలో బ్లాగు మూలంగా కొంత, ముఖపత్రంమూలంగా ఇతోధికంగానూ తెలుసుకున్నది ఏమిటంటే, ఈనాడు నారచనలు చదువుతున్నవారందరూ  నాకంటె ఎక్కువ చదువుకున్నవారే. వీరు చదివిన పుస్తకాలలో పదోవంతు కూడా  నేను చదవలేదు. ఈనాటి యువతకి తెలిసినదాన్లో పదోవంతు కూడా నాకు తెలీదు.  మరి వీరంతా నారచనలు ఎందుకు చదువుతున్నారంటే, బహుశా నాకు  తెలిసినవి వారికి తెలియకపోవడం కావచ్చు, మరేవో జ్ఞాపకాలు తవ్వి తీయడం  కావచ్చు. ఏమైనా ప్రస్తుతం ఏ భావముద్రలూ లేవు తెలుగు తూలిక సంబంధించినంతవరకూ. వాళ్ళూ నేనూ కూడా సుఖపడ్డాం ఆవిధంగా.

మనం రాసేదాన్ని బట్టి భావముద్రలు ఏర్పడతాయి అన్నాను కదా. నేను  నాట్యంగురించి రాస్తే నాకు నాట్యం వచ్చు అనుకోవచ్చు. సంగీతంగురించి రాస్తే  పాడగలననుకోవచ్చు. లేదండీ నేను పాడలేను అంటాననుకోండి. పోదురూ ఏదో  మర్యాదకి అలా అంటున్నారు కానీ మీరు పాడలేకపోవడమేమిటి అంటారు. అప్పుడు నాకు తంటా.

నాకు పండితశ్రీ ముఖం ఉన్నట్టు కనిపించడంవల్ల నాకు కలిగిన మరో ఇబ్బంది   దేశదేశాల ఉన్న తెలుగువారు, తెలుగులు కానివారూ కూడా కుప్పలుతిప్పలుగా  వార్తలూ విశేషాలూ నా ఇన్బాక్సులో పారేస్తుంటారు. వారి పుస్తకాలు, వారి  సన్మానాలకి ఆహ్వానాలు, తామందుకున్న బిరుదులు అన్నీ నాకు తెలిసిపోతుంటాయిఅన్నట్టు పురస్కార తిరస్కార రచయితలు  నాకు  ఎలాటి  వర్తమానాలూ     పంపలేదు. ఇంతకీ నాబాధ ఏమిటంటే నారాతలు వారు చదివినట్టు కనిపించదు కనక. అంటే నిజంగా నా అభిప్రాయాలేమిటో, నేను ఆ రచనలని ఆదరిస్తానో వారికి తెలియదు. గుడ్డిగా నాపేరు అంతర్జాలంలో కనిపిస్తోంది కనక నన్ను వారి మిత్రచిట్టాలో పెట్టేస్తారు. లేదా నేను కేవలం  వారికృషిని  ప్రచారం  చేయడానికే  పుట్టేననుకుంటారేమో తెలీదు.

ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, నాకు అక్కరున్నా లేకపోయినా, నేను కాలు కదపకుండాదేశంలో వార్తలు అందిపోతుంటాయి ఈ విధంగా.  ఇవి  నాకు ఏదో విధంగా  పరిచయమున్న  వారికి సంబంధించిన వారైతే అర్థం  చేసుకోగలను.  లేనిపక్షంలో  వారిని భావముద్రలకి గురైనవారిగా భావించి, ఆ వార్తలని చెత్తబుట్టకి దాఖలా  చేసేస్తుంటాను. మరీ వదలకుండా అదే పనిగా గుప్పించేస్తే, ముందు మర్యాదగా  నాపేరు తమచిట్టాలోంచి తొలగించమని  చెప్తాను.  ఆ తరవాత  వాటిని స్పాముగా  గుర్తించేస్తాను.

ఇక వ్యాఖ్యాతలని గుర్తు పట్టడానికి ప్రయత్నించినప్పుడు కూడా ఈ భావముద్రలు  ఎంత మోసం చేస్తాయో తెలుస్తుంది. మారు పేర్లు, కలంపేర్లు, ముద్దుపేర్లు, ఒకొక  పత్రికకి ఒకొక పేరు, ఒకొక పోస్టుకి ఒకొకపేరు – ఇలా పేర్లు వేయి విధములు.  బారసాలనాడు పెట్టిన పేర్లు కలికంలోకి కూడా రాకుండా పోవచ్చు కొందరివిషయంలో. అంచేత ఏం జరుగుతుందీ అంటే ఆడువారా, మొగవారా, చిన్నవారా, పెద్దవారా, ఆంద్రదేశంలో ఉన్నారా, అమెరికాలో ఉన్నారా – ఇలా అన్నీ సందేహాలే. వీటిని  జాగ్రత్తగా  విడదీసుకుని,  పరీక్షగా చూసి,   ఏ పోస్టుమీద  ఎలా వ్యాఖ్యానిస్తున్నారు,  ఎంత నిజ సమాచారం ఇస్తున్నారు, పోస్టు చదివి రాస్తున్నారా, లేక తమకి తెలిసిన విషయాలు మాత్రం రాస్తున్నారా, పేరు చూసుకోడానికా, తమపేరు మనం చూస్తాం అనా – ఇలా చేయడం నాకొక విశిష్ట వ్యాపకం. ఆ తరవాత పెద్దవాళ్ళనుకున్నవాళ్ళు చిన్నవాళ్ళనీ, మగవారనుకున్నవారు ఆడవారనీ, తెలుగు రాదేమో అనుకున్నవారు  తెలుగు సాధికారికంగా నేర్చినవారనీ తెలుస్తుంది. అలా తెలుసుకుని ఆనందించడం కూడా నా “విశిష్ట వ్యాపకం”లో భాగమే.

ఇంకో విషయం కూడా చెప్పాలిక్కడ. కొందరివిషయంలో నా భావముద్రలు వాస్తవానికి భిన్నంగా పడడానికి కారణం వాళ్ళు పెట్టుకునే ప్రవర బొమ్మలు. కొందరు మంచి పరువంలో ఉండగా, చక్కగా మేకప్పయి తీయించుకున్న బొమ్మ బాగుందని పెట్టుకుంటారు కానీ ఇది రెండో మూడో దశాబ్దాలక్రితంది అని చెప్పరు. లేదా ఓ నవమోహనాంగిలాటి సినిమాతార బొమ్మ, సీగానపెసూనంబ బొమ్మ, బుడుగు బొమ్మ వాడుకున్నప్పుడు కూడా నాకు వారిని గురించిన భావముద్ర సృష్టించుకోక తప్పదు. ఒకొకప్పుడు వారితో మాట కలిసేక, నేనిలా ఉంటానండీ అని వారు సప్రమాణికంగా చెప్పేక ముందు పడ్డ భావముద్రని మార్చుకోడానికి నానా అవస్థా పడతాను. ఒకొకప్పుడు ఆ మార్పు కుదరక ఆ పేరు చూసినప్పుడల్లా నాకు కవలపిల్లలని చూసినట్టుంటుంది! మొట్టమొదట నామనసులో పడిన భావముద్రతో దరిమిలా నేనెరిగిన నిజస్వరూపంతో కలిసి.

అలాగే నేను ముఖపత్రంలో తెలుగులో రాయమని కొంచెం గట్టిగానే చెప్పడం మొదలు పెట్టేక, నా ప్రయత్నం లేకుండా పాఠకులలో కలిగించిన భావముద్ర –  తెలుగుభాషని నేను ఉద్ధరించడానికి కంకణం కట్టుకున్నానని. అది నిజం కాదు. నిజం ఏమిటంటే, నాకు తెలుగు వినే అవకాశం చాలా తక్కువ కనక, ఎవరికి కావలసినవి  వారు చర్చించుకోడానికే తమ పత్రాలు సృష్టించుకుంటారు కనక, నాకిష్టమైన  శబ్దాలు  వినడానికీ, చూడడానికీ, చదువుకోడానికీ నాపేజీలో తెలుగులో రాయండని  విన్నవించుకుంటున్నాను. అది నచ్చినవారే నామిత్రవర్గంలో ఉన్నారు. లేనివారు  తప్పుకున్నారు. అంచేత నేను ఉద్యమం నడుపుతున్నానని అనుకోడం నాప్రమేయం లేకనే పడిన భావముద్ర. మూడో వర్గానికి చెందిన ముద్ర అన్నమాట.

పోతే నేను వాడుతున్న భాష దృష్టిలో పెట్టుకుని శిష్ట(జన)వ్యావహారికంగురించి  గురించి కూడా చెప్పి ముగించేస్తాను ఈ ధోరణి.

ఈ శిష్టజనవ్యావహారికం ఉద్యమంగా మొదలయి ఒక శతాబ్దం గడిచిపోయింది. ఈ  విషయంలో అప్పుడప్పుడు ఇంకా వ్యాసాలు వస్తూనే ఉన్నాయి. దాదాపు అన్ని వ్యాసాలూ గిడుగు రా్మ్మూర్తి పంతులిగారి భాషాసేవతోనే మొదలవుతాయి. శిష్ట అన్న  విశేషణం ఎందుకు ఎలా చేర్చడం జరిగిందో నాకు తెలీడం లేదు. వ్యావహారికం అంటే  చాలు కదా. రామ్మూర్తిపంతులుగారు అలాగే మొదలు పెట్టేరు. ఈ శిష్ట బహుశా  అసభ్యం కానిది అన్న అర్థంలోనేమో. లేదా పండితులు మాత్రమే శిష్టులనేమో. కానీ    పత్రికలలో “వాడుక భాష” మామూలయేక రచయితలకు పాండిత్యం కావాలన్న  నియమం లేదు. నిజానికి ఈ పాండిత్యం కారణంగానే

ఈ శిష్టవ్యావహారికం అన్నది అభ్యుదయ రచయితలు రాసిందే – అంటే చాసో, శ్రీశ్రీ  వంటి తూర్పుప్రాంతంలోని ప్రముఖ రచయితలు రాసిందే అని నిర్ణయించేసినట్టు  కనిపిస్తోంది. తరవాత ఇతర ప్రాంతాలలో రచయితలు తమప్రాంతంలో వాడుకలో ఉన్న భాషల రాస్తూండడంతో, ఏ ఒక్కపదం ఇలాగే రాసి తీరాలనే నియమానికి గంటు  పడింది.

జానపదసాహిత్యాన్ని సాహిత్యంగా గుర్తించలేదు చాలా కాలం. నాకు తెలిసినంతవరకూ 1940లలో ఖండవల్లి లక్ష్మీరంజనంగారు జానపదసాహిత్యానికి సాహిత్యస్థాయి కల్పించేరు. అంటే సామాన్యప్రజలు ఎలా మాటాడుకుంటే అదే సాహిత్యం. మాండలీకం వాడుకలోకి రావడానికి కూడా ప్రాతిపదిక అయింది.

ఇదంతా ఎందుకు అంటే నేను పది రోజులక్రితం ముఖపుస్తకంలో “నామొహంలా ఉంది” అన్న వాక్యంగురించి చిన్న చర్చ పెట్టేను. ఇది ఎదటివారమాటనో, ఒక వస్తువునో తేలిగ్గా తీసిపారేసే  సందర్భంలో  వాడతాం  విశాఖపట్నం ప్రాంతంలో.  ఇతరప్రాంతాల్లో  దీనికి భిన్న రూపాలు ఉన్నాయా అన్నది  నాసందేహం. ముఖం, మొహం, ముగం, ముకం … ఇలా రకరకాలుగా వాడతారని తెలిసింది. అలాగే ఫలహారం వ్యాకరణరీత్యా  సరి కాకపోయినా అల్పాహారం అన్న అర్థంలో వాడుకలో ఉంది. నిజానికి ఫలహారం  అంటే పళ్ళే కానక్కర్లేదు చిన్న భోజనం ఏదిైనా ఫలహారమే. ఇలా ఆలోచించుకుంటూ పోతే, నాకు తోచినది దైనందిన జీవితంలో  నాలుక ఎలా తిరిగితే అలా వినబడుతుంది పదం. విన్నది విన్నట్టు రాస్తే  గుణింతాలు అనేక రకాలుగా కనిపిస్తాయి. వ్యావహారికభాషలో ఇవన్నీ ఆదరణీయమే. అంటే వాడుకభాషకి వ్యాకరణమూ లేదు. నిర్దిష్టమైన గుణింతాలూ లేవు.

ఈ సందర్భంలో గిడుగు రామ్మూర్తి పంతులుగారిని తలుచుకోడం సమంజసం. వారు ఆంధ్రపండిత భిషక్కుల భాషాభేషజం అన్న పుస్తకంలో ఒకే పదానికి వేరు వేరు రూపాలుండడం గురించి చక్కగా వివరించేరు, శనగలు, శెనగలు, శనిగెలు, సెనిగలు  ఉదాహరణగా చూపిస్తూ. రామ్మూర్తిగారి పుస్తకంమీద నా వ్యాసం ఇక్కడ

ఇప్పుడు, అంటే కంప్యూటరులో రాయడం మొదలయేక, “రాయడం” లేదు. కీలమీద వేలేసి పదాలు “కొట్టుకుంటూ” పోతాం కానీ “రాయడం” లేదు కదా. పొల్లులూ,  దీర్ఘాలూ, ఒత్తులూ కూడా కీబోర్డు దయే. నా లాప్టాప్ లో చా దా ఒక్కలాగే కనిపిస్తాయి కళ్ళు పొడుచుకు చూస్తే తప్ప. లేదా సందర్భాన్నిబట్టి చదువుకుంటూ పోతాం. ఞ  వత్తు ఎలా ఇవ్వాలో చాలామందికి తెలీదు. అంచేత జ్ఞానం జ్నానం అయిపోయింది.  అలాగే వ్రుద్ధుడు, గ్రుహము లాటివి. ఇలాటి నేపథ్యంలో తప్పులు పట్టడం గొంగళీలో వెంట్రుకలు ఏరడంలాటిదే.  నాలుక ఎలా తిరిగితే అలా, ఎవరికి ఎలా వినిపిస్తే అలా  రాసుకుంటూ పోతున్నాం ఇప్పుడు.  ఇవన్నీ ఆలోచించేక శిష్టవ్యావహారికానికి వ్యాకరణం లేదు అనుకుంటున్నాను. వందేళ్ళక్రితం గిడుగు రామ్మూర్తి పంతులు గారు ఈమాట అన్నారు ఇప్పుడూ పరిస్థితి అదే అంటున్నాను.  ఇది నా భావముద్ర.  వ్యాకరణం  పూర్తిగా లేదని  కాదు కానీ  అనేక సందర్భాలలో అది వారి అలవాటు అని అంగీకరించడమే ఉత్తమము.

నేను తప్పులు రాసిన సందర్భాలు లేకపోలేదు.   పండితమ్మన్యులు,  భాషాయోష  లాటి పదాలు వాడినప్పుడు తెలిసినవారు సరైన అర్థాలు చెప్పడం, నేను దిద్దుకోడం  జరిగింది. అంచేత తప్పులు మరీ అసందర్భం అయినప్పుడు చెప్తే నాకు సమ్మతమే.-

 1. శ్రమ పడి ఇతరుల మనసులలో కల్పించేవి

ఇది ఒక కళగా చెప్తారు ఉద్యోగంకోసం ఇంటర్వ్యూలకి హాజరయే అభ్యర్థులవిషయంలో. “తొలి భావముద్రకి మలి అవకాశం దొరకదు,” అని ఒక నానుడి ఉంది. కొన్ని విషయాలలో ఆ తొలి భావముద్రకి అంత బలం మరి. సంబంధాలు కుదిర్చేటప్పుడు పూర్వం పెళ్ళిళ్ళ పేరయ్యలూ, ఇప్పుడు అమ్మాయిలూ అబ్బాయిలూ కూడా ఎదటివారిమీద సుముఖమైన భావముద్రలు కలిగించడానికి పడే తాపత్రయాలగురించి నేను వేరే చెప్పఖ్ఖర్లేదు కదా. నాకంటే మీకే ఎక్కువ తెలుసు.

అలాగే ఈనాడు సాహిత్యరంగంలో సుముఖ భావముద్రలు వేసేయడానికి పడే  అవస్థలూను. అందరూ కాదులెండి. మీమాట కాదు, వేరేవాళ్ళమాట చెప్తున్నా.

ఉదాహరణకి స్త్రీవాది అని నిరూపించుకోవాలంటే,  అమెరికా  విశ్వవిద్యాలయాలలో  ఉచితవేతనం పొందాలంటే  నాలుగు  ప్రముఖ స్ర్రీవాద  పుస్తకాలు  చేత  ధరించి పదిమంది కలిసిన చోటల్లా ప్రత్యక్షం అవుతారు.  తిరిగొస్తూ పనిలో పనిగా  సంప్రదాయవాదులని కలుసుకుని సంప్రదాయంమీద తమకున్న అసాధరణ ప్రబల  ఆసక్తిని  ప్రదర్శించడానికే నలుగురికళ్ళా, నోళ్ళా పడడం కూడా చేస్తారు.  ఏఎండకి ఆ గొడుగు పట్టడంలాటి హేయమయిన జాతీయాలు ఇక్కడ వాడడం న్యాయం  కాదు.  ఇదంతా అనుకూల భావముద్ర వేయు ప్రయత్నముగానే గ్రహించాలి.

మరి కొందరు  వ్యాఖ్యలతో   మొదలు పెట్టి,  సంపాదకుల  దృష్టిలో పడి, తరవాత ఎడా పెడా వారం వారం వ్యాసాలు రాసిపారేస్తారు.  ప్రముఖ రచయితలతో  ఇంటర్వ్యూలూ,  వాళ్ళతో ఫొటోలూ,  వాళ్లగురించి నాలుగు మాటలూ –  లాటివి  సద్యఃఫలితాలని ఇవ్వొచ్చు.

ఒక్కమాటలో భావముద్రలు మనం సదా వేస్తాం,  వేయించుకుంటాం ప్రయత్నపూర్వకంగానో అప్రయత్నంగానో.  ఉదాహరణకి  నేను ఇదంతా  రాయడం  మీమీద ఏదోరకం ముద్ర వేయడానికే అని మీరనుకోవచ్చు. నేను  చేయగలింగిందేమీ లేదు.

నమోనమః

000

(సెప్టెంబరు 26, 2016)

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

10 thoughts on “భావముద్రలు అప్రమేయం!”

 1. అప్రమేయమేల? అపురూప మైనదీ
  పోష్టు , పడును భావ ముద్ర లరయ ,
  మార్గ దర్శు లైన మహనీయ వ్యక్తుల
  ననుసరింతు రితర మనుజు లిలను .

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 2. చాలా సంతోషం వసుధా రాణీ, మీరూ మీలాటివారే నాకు స్ఫూర్తి, మళ్ళీ రాయాలనిపించేలా చేసేవి. మీ ఆదరాభిమానాలకి మనఃపూర్వక ధన్యవాదాలు

  మెచ్చుకోండి

 3. మీకు మా పైన భావముద్ర వేయాలన్న ఉద్దేశం ఉన్నా లేకున్నా మీ ముద్ర మీ బ్లాగులు మీముఖపుస్తకం చూసిన వారిపైన పడుతుంది..నా మటుక్కి నేను మిమ్మల్ని చక్కని కధకురాలు,విశ్లేషకురాలు అనుకుంటున్నాను. మీ ప్రతి పోస్టును నేను క్షుణ్ణంగా చూస్తాను.ప్రతి వ్యాఖ్యను మీరే ఉద్దేశంతో రాసారా అని చూసే ప్రయత్నం చేస్తాను.

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s