మనలో మనమాట 28 – శాంతము లేక సౌఖ్యము లేదు …

సుఖంవెక్కడున్నాది అంటూ దిక్కులు చూస్తూ ముందొక టపా రాసేను కానీ దానికి సంబంధించిన ఆలోచనలు నన్నింకా వెన్నాడుతూనే ఉన్నాయి వేటకుక్కల్లా.

అంచేత మళ్ళీ మరోమారు అదే విషయం పరామర్శిస్తూ మరికొన్ని ఆలోచనలు రాస్తున్నాను.

సుఖం అంటే ఏమిటి? అని కొందరిని అడిగేను. ఇళ్లూ, వాహనాలూ, ఆస్తిపాస్తులూ, వంశోద్ధారకులూ, వాళ్లచదువులూ, వాళ్ళ పెళ్ళిళ్లూ, ఉన్నతోద్యోగాలూ, మళ్ళీ వాళ్ళ పిల్లలు … ఇలా చాలా సుఖాలను ఏకరువు పెట్టేరు. ఆలోచించు. ఈ సుఖాలన్నిటికీ అంటే ఇళ్లూ, వాహనాలూ వీటన్నిటికీ డబ్బు కావాలి అ డబ్బుకోసం ఎన్నో కష్టనష్టాలు అనుభవిస్తాం. వీటన్నటిమధ్య అనుభవిస్తున్న సుఖం పాలెంత అని నా సందేహం. ఎప్పుడు ఏది చాలు అనుకుంటాం? అనుకోగలం?

సుఖానికి సంపదలే కావాలా? ఏమో మరి. భుక్తికోసం కుచేలుడు కృష్ణుడిదగ్గరికి వెస్తే, కృష్ణుడు అష్టైశ్వర్యాలూ ప్రసాదించేడు. వరలక్ష్మీ వ్రతం, దుర్గపూజ, సత్యనారాయణవ్రతం లాటివి చేస్తే ఇహలోక సుఖాలూ, సంపదలూ ప్రసాదిస్తాయనే చెప్తాయి. పరలోకప్రాప్తి ప్రసక్తి కూడా ఉంది కానీ నామీద మాత్రం ఇహలోకసౌఖ్యాల భావముద్రలే గట్టిగా పడ్డాయి.

అసలు ఈ సుఖం అనే పదం ఎలా పుట్టిందో నాకు తెలీదు. అంటే భాషాశాస్త్రం పుస్తకాలు చూస్తే పదం వ్యుత్పత్తి తెలియొచ్చు కానీ నాకు అది సంతృప్తినిస్తుందనుకోను.

కొంతమందికి సుఖం అంటే శరీరాన్ని పదిలంగా ఉంచుకోడమే. కూర్చున్నచోటినించి కదలరు తలుపు తీయడానికైనా. “నువ్వు తలుపుకి దగ్గరగా ఉన్నావు, వెళ్ళి తీయి” అని పక్కనున్నావిడకి ఆదేశిస్తారు. అలాటివారిగురించి మా అమ్మ అంటూండేది, “లేచి తలుపు తీస్తే ఏం పోయింది, శరీరం తూచి పోయేటప్పుడు అప్పగిస్తారేమిటి?” అని. బద్దకానికి పరాకాష్ఠ అది.

ఆధునికయుగంలో శరీరం అలవకుండా కాపాడుకోడానికి అనేక సాధనాలు. అవన్నీ మీకూ తెలుసు కద. నిజానికి అవి లేనప్పుడు ఏం చేసేవారో కొందరికి తెలియకపోవచ్చు. కానీ ఈ రోజుల్లో కార్లు, మోటారు సైకిళ్లూ ఇవన్నీ ప్రయాణ సాధనాలు. చాలాదూరం వెళ్ళాలంటే ఇవి పనికిరావచ్చు కానీ వీధి చివర కొట్టుకి కూడా ఎగిరి ఈ వాహనంమీద దూకేవారిని చూసేను. పైగా, వీటివల్ల జరుగుతున్న ప్రమాదాలు కూడా ఆధునీకమే. కారు లేనిరోజుల్లో కారు ప్రమాదాలూ లేవు కదా. ఈ కార్లలో కూడా ఎన్ని సుఖాలు! సంగీతం, జిపియస్, automatic shift, ఒకొక సదుపాయం చేరినప్పుడల్లా, నడిపేవాడికి మరింత సౌకర్యం, దాంతోనే చేతిలోని చక్రంమీద ధ్యాస కూడా తరిగిపోతుంది కదా. త్వరలోనే self-driving కార్లు వస్తున్నాయి. ఇంక ఎన్ని ప్రమాదాలకి అవకాశమో ఆలోచిస్తే నాకు చాలా కోపం వస్తోంది. సుఖం ఎక్కువయినకొద్దీ బుద్ధి పని చేయడం తగ్గుతుంది. ఆ తరవాత ఔచ్, ఇందులో గ్లిచ్ ఉంది అంటూ కంపెనీలవాళ్ళు కారుని వెనక్కి పిలుచుకోవచ్చు కానీ ఈలోపున ఎన్ని ప్రాణాలు పోతాయో. ఇలా సుఖంపేరున లేని తద్దినాలు తలకెత్తుకుని మనమే మనబతుకులకి నిప్పెట్టుకుంటున్నాం.

పూర్వకాలంలో సుఖాలగురించి మాటాడినప్పుడు ఇలాటి సుఖాలు కాదు కదా.పాండవోద్యోగం ఘట్టంలో కృష్ణుడు అడిగిన కుశలప్రశ్నలు చూస్తే సదనాలకీ వాహనాలకీ, అలుపెరుగని పనులకీ కాక ధర్మనిర్వహణకి ఎక్కువ విలువ ఉన్నట్టు కనిపిస్తుంది. “ఎప్పుడొచ్చేవు, అన్నదమ్ములూ, పిల్లలూ, చుట్టాలూ, నీ ప్రభుత్వాన్ని జాగ్రత్తగా చూసుకునే కర్ణుడూ అందరూ బాగున్నారా అని అడిగేడు సుయోధనుడిని. వంశోన్నతిని గోరు భీష్ముడు మొదలయినవారంతా నీ తేజంబు హెచ్చించుతూ మెలగుతున్నారా అంటాడు. సుయోధనుడు రాజు. ఆయనకి రాజ్యం ముఖ్యం. ఆ ప్రశ్నలన్నీ ఆ రాజవైభవానికి అనుగుణంగా ఉన్నాయి. అర్జనుడిని యశస్కులయిన అన్నలు, మంచిమనసుగల తమ్ములు బాగున్నారా, వృకోదరుడు అన్నమాట వింటూ శాంతంగా ఉంటున్నాడా అంటాడు.

ఈ ప్రశ్నలు చూస్తే ధర్మనిర్వహణ, కర్తవ్యనిర్వహణకే ఎక్కువ ప్రాధాన్యం అనిపిస్తోంది నాకు. అవి ఉన్నప్పుడే, వాటితోపాటే మానసికమైన ఆనందం కూడాను. కుటుంబంలో వారు ధర్మం పాటిస్తే మనసుకి హాయి కదా. భాగవతంలో ఒకచోట మాత్రం నేను క్షణకాలం ఆగవలసి వచ్చింది.

capture-4జగత్తు సృష్టించేతలంపుతో తనకు సుఖశయనం ఆపేక్షించి మొదట జలం సృష్టించేడుట. ఆఖరికి ఆ మహావిష్ణువు కూడా పడకసుఖం మొదట చూసుకున్నాడు. ఆహా.

ఏమైనా, సుఖం అన్నది అనాదిగా ఉందన్నది నిర్ధారణ అయిపోయింది. సుఖం ఒక్క శరీరానికి మాత్రమే పరిమితయినది కాదు. మాటవరసకి అందం చూడు. బాహ్యసౌందర్యం కాదు చూడవలసింది అంటారోపక్క మళ్లీ తెల్లారి లేచి అద్దంలో మొహం చూసుకోని మనిషి కానీ, అమ్మవార్లనీ అయ్యవార్లనీ ఓపినంతలోనే ఆభరణాలతో అలంకరించని భక్తులు గానీ ఉన్నారా? లేరు. అంతెందుకూ సౌందర్యలహరిలో దేవీస్తుతి, కనిపించే అందం వర్ణనలే. అయితే ఆ అద్భుత సౌందర్యం అంతస్సౌందర్యానికీ ప్రతీకగా ఆవిష్కరించబడింది. నా ఈ అలోచనలు అజ్ఞానం అనో అరకొర జ్ఞానం అనో తీసిపారేయవచ్చు విజ్ఞులు. నిర్గుణధ్యానానికి సగుణధ్యానం తొలిమెట్టు అనొచ్చు కానీ ధ్యాస భగవంతునిమీద నిలపడానికి ఆ అలంకారాలు తోడవుతున్నాయని ఒప్పుకోకతప్పదు అనే అనిపిస్తోంది.

అంటే నవకాయ పిండివంటలతో ముక్కు వరకూ మెక్కి, అది అరిగేవరకూ వాలుకుర్చీలో వాలి కునుకు తీయడమే సుఖం కాదు. పంచేంద్రియాలూ అనుభవించే తృప్తి, ఆనందం కూడా సుఖాన్నిస్తుందనే అనుకోవాలి. కంటికి నదురుగా కనిపించే వస్తువు, చెవికింపుగా వినిపించే సంగీతం, వేళ్లకి మృదువుగా తగిలే పూవూ, నోరూరించే పండూ … అన్నీ కలిగించేది సుఖమే కదూ.

నేనీమధ్య శ్రీమదాంధ్ర మహాభాగవతం చదవడం మొదలు పెట్టేను. ఈమద్య ఏమిటిలెండి, పుస్తకం జాలంలోంచి తీసుకుని మూడేళ్ళకి పైనే అయింది. ఎప్పుడు మొదలు పెట్టినా ఎవరు ఎవరితో మాటాడుతున్నారో అర్థం కాక వదిలేస్తూ వచ్చేను. ఇంతకాలంతరవాత, అనేక ప్రయత్నాలతరవాత అర్థం అయిందేమిటంటే శ్రీమహావిష్టువు బ్రహ్మకీ, బ్రహ్మ నారదుడికీ, నారదుడు వ్యాసుడికీ, వ్యాసుడు (ఈయనే కృష్ణ ద్వైపాయనుడు) తనకుమారుడయిన శుకుడికీ, శుకుడు పరీక్షత్తుకీ చెప్పేడు. అని సూతుడు శౌనకాది మహామునులకి చెప్పేడు. మరి సూతుడు ఎవరిదగ్గర్నుంచి ఈ భాగవతకథనం విన్నాడో తెలీలేదు. ఎక్కడో నేనే తప్పిపోయినట్టున్నాను. ఇంకా విదురుడు తన పూర్వజన్మవృత్తాంతం వివరించడం కూడా ఉంది. నాకు కలిగిన ఒక సందేహం శుకుడు ఏ ఒక్కచోటా గోదోహనమాత్రకాలం – ఆవుపాలు పితికినంతకాలం కంటె ఎక్కువసేపు నిలవడుట. మరి పరీక్షత్తుకి ఏడురోజులపాటు భాగవతగాథ చెప్పడం ఎలా జరిగింది? ఏమో మరి. ఇవన్నీ గుర్తు పెట్టుకోడానికి నాకు అంత టైం పడుతోందన్నమాట మాత్రం నిజం.

అసలు ఇక్కడ మరోమాట కూడా చెప్పాలి. చాలామందిలా నేను వారానికి మూడు పుస్తకాలు చదివిపారేసే రకం కాదు. కంటబడ్డ ప్రతి పుస్తకం చదివి తీరాలన్న నియమం లేదు నాకు. చదవకపోతే కొంపలు ములిగిపోవన్న గట్టి నమ్మకం కూడా ఉంది. అంచేత ఏం చదివేను, అందులో ఎంత తలకెక్కిందీ చూసుకుంటూ తీరిగ్గా రోజుకు రెండో మూడో పేజీలు చదువుతూ గడుపుతాను.

మహా భాగవతం సంగతి మరో రెండు మాటలు చెప్పి ముగించేస్తాను. మూడేళ్ళనించీ చూస్తున్నానని చెప్పేను కదా. ఆఖరికి నాలుగు నెలలక్రితం మొదలు పెట్టి రెండు అద్యాయాలు పూర్తి చేసేను.

కొన్ని పద్యాలు చి్న్నప్పుడు స్కూల్లో చదువుకున్నవి ఫలరసాదులగురియవే పాదపములు, మందారమకరంద మాధుర్యమున లాటివి కనిపించినప్పుడు ఓహో ఇది ఇక్కడుందన్నమాట అని సంతోషపడిపోయేను.

ఈ పుస్తకంలో కొన్ని మాటలకి అర్థాలు ఇచ్చేరు. ఏమాటకి అర్థం ఇవ్వాలి అన్నవిషయంలో ఆ సంపాదకులనిర్ణయం నాకు తమాషాగా ఉంది ఎగ్గు, అజ్ఞత, ఆర్తి లాటి మాటలకి అర్థాలు చూస్తే. ఈమాటలకి అర్థాలు తెలీనివాళ్ళున్నారని వాళ్లు అనుకున్నారనిపించదూ? ఒకొకప్పుడు ప్రాచుర్యంలో ఉన్న అర్థం కాక ఇతర అర్థాలు కూడా ఉంటాయి. తోయము అంటే నీరు అని తెలుసు కానీ స్నేహము, విధము లాటి అర్థాలు కూడా ఉన్నాయని ఈ పద్యం చూసినప్పుడే తెలిసింది, అదే, వారు చెప్పేక. ఈ పద్యం నాకు చాలా నచ్చింది.
capture-3అయితే నాకు తెలీనిమాటలు ఇంకా చాలా ఉన్నాయి కానీ వాటికి అర్థాలు లేవు. ఈపాటికి మీకు అర్థమయే ఉండాలి. నాకు చదవడం ఒక సుఖకరమైన వ్యాపకం. అంటే అందరిలాగా కప్పదాటుగానో వేలితో కాయితంమీద తడుముకుంటూ లీలామాత్రంగా విషయం ఏమిటో మూడు క్షణాల్లో తెలుసుకునేసి, హమ్మయ్య చదివేసేను అని పక్కన పెట్టేయడం కాదు. దానిమీద రెండు పేజీల సమీక్ష రాసిపారేయడం కూడా కాదు. నేను తీరిగ్గా ఒకొక అక్షరమే చూసుకుంటూ, పదాలమధ్య విరుపు ఎక్కడుందో చూసుకుంటూ అందులో నాకు తెలిసిన మాటలు కనుక్కున్నప్పుడు ఆనందపడిపోతూ చదువుతాను. Word search ఆటలాగ అన్నమాట. ఉదాహరణకి ఈ వాక్యం చూడు.

capture1కామము దహించె మధ్య విరామం ఉండాలి. మ తరవాత కామా ఉండరాదు. ఆ వాక్యం సరిగా చదవాలంటే కామము దహించే క్రోధ మహా మహిమను రుద్రుడు అట్టి అవమర్షంబున్ ..గెలిచిరి అనంగా – అనం తరవాత కామా ఉండరాదు ఇలా చూసుకుంటూ అన్నమాట చదువుతాను.
ఇదీ నా భాగవతపఠన సమాచారం.

ఇక పోతే కష్టాలూ, సుఖాలూ మాటకొస్తే, ఒకటి అనుభవిస్తేనే రెండోది ఎక్కువ బలంగా నాటుకుంటుంది. కష్టపడి ఆర్జించిన సొమ్ము ఎక్కువ సంతృప్తి కలిగిస్తుంది ముదనష్టపు సిరికన్నా. కానీ చాలామంది అది గ్రహించరు. కలిసొచ్చిన సిరి ఆరిపోయేవరకూ ఖర్చు పెట్టేస్తారు ఆనందాలపేరుతో. ఆ తరవాత మళ్ళీ ఎక్కడినించి వస్తుందా అనుకుంటూ దిక్కులు చూస్తారు.

మీకు ఈ వితండవాదం అంతా చిరాకుగా ఉందనిపిస్తే సరే నామాట వినొద్దు. మహా మేధావి దలైలామా మాట వినండి. ఆయన కూడా సుఖం అంటే సంతోషం అనే చెప్తున్నారు. అన్నట్టు చెప్పేనా దలైలామా, నేనూ ఇద్దరిదీ సింహలగ్నమే. దక్షిణ ఆఫ్రికా క్రియాశీలి Desmond Tutu టిబెట్ క్రియాశీలి దలైలామాతో సుఖసంతోషాలగురించి మాటాడితే, ఏం మాటాడతారు? నాకు ఈ విడియో చూస్తుంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ వీరిద్దరినీ activists అనాలేమో, అంటే ఆందోళనకారులు అని నిఘంటువులో ఉంది కానీ నీకు వీరు ఆందోళన కలిగిస్తున్నట్టు కనిపించలేదు, ధర్మసూక్ష్మాలు వివరిస్తున్నట్టే తప్ప.

ఈ సుఖసంతోషాలగురించి ఇంకా చెప్పవలసినవి మరో రెండు మాటలున్నాయి. వచ్చే టపాలో చెప్తానవి.

మీకు ఈ టపా చదివేక సుఖంగా ఉందనిపిస్తే కింద వ్యాఖ్యలపెట్టెలో చెప్పండి.
000
(అక్టోబరు 29, 2016)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

4 thoughts on “మనలో మనమాట 28 – శాంతము లేక సౌఖ్యము లేదు …”

  1. బాధే సౌఖ్యం ఏదో సిినిమాపాటలా ఉంది. మీరలా అనుకున్నతరవాత నేనింక వేరే చెప్పేదేముంది. ఎవరికి ఏది సౌఖ్యం అనుకుంటే అదే సౌఖ్యం.

    మెచ్చుకోండి

  2. మాలతి గారూ మీరు between the lines మాత్రమే కాకుండా between the words కూడా చదివి ఆనందిస్తున్నారు. మీ వచ్చే టపాలో ‘సుఖం, సంతోషం’ కి తేడా కూడా మీమాటల్లో వివరించగలరు.
    కష్టాలప్పుడు ‘బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్’ అనుకుంటుంటుంటాను నేను.

    మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s