మనలో మనమాట 30 – scrabble ఆడ్డంలో కష్టసుఖాలు!

ఈ ఆటలో సుఖం చెప్పేముందు ఈనాటి జీవనశైలిలో సరదా లేక కాలక్షేపాలకి గల అత్యంత ప్రాధాన్యతగురించి రెండు మాటలు చెప్పాలి.

dsc00214మా బిల్డింగులో ఒకమ్మాయి ఉంది నేను కనిపించినప్పుడల్లా ఆగి రెండునిముషాలు మాటాడుతుంది. ఆమాటల్లో తరుచూ వచ్చే ప్రశ్న “నువ్వు funకేం చేస్తావు?” అని. వీళ్ళ జీవితాల్లో fun అనబడే సరదాకి చాలా ప్రాముఖ్యం ఉంది. నిజానికి ఈ పదానికి సరదా, వినోదం, ఆనందం అని చెప్పుకోవచ్చేమో కానీ ఈ పోస్టుకి సంబంధించినందవరకూ ఫన్ననుటే మేలు. ప్రతీ పనీ ఫన్నవాలి. ఫన్నయితేనే పెన్నిధి. చదివే చదువూ, చేసే ఉద్యోగం, కాపురం, అన్నీ ఫన్నుగా ఉండాలి. నిత్యనూతనంగా కూడా ఉండాలి. వాటిని ఫన్నుగా ఉంచడానికి నానాయాతనా పడతారు. అన్నట్టు ఆ యాతనలు కూడా ఫన్నుగానే ఉండాలంటారు కానీ నాకు అనుమానమే!

మొదటిసారి ఆ అమ్మాయి నన్నలా అడిగినప్పుడు నేను రచయితని, కతలు రాసుకుంటాను అన్నాను కొంచెం గర్వంగానూ చాలా వినయంగాను. ఆహా రచయితా అని ఆశ్చర్యపోవాలని నా రహస్య ఆశ. ఆ అమ్మాయి మొహం వెలగలేదు ఆశ్చర్యంతో గానీ అనుమానంతో గానీ. బహుశా రాయడం వృత్తి, సరదా ఎక్కడుంది అని కాబోలు. నేను చేస్తున్నపని నాకు ఆనందంగా అంటే ఫన్నుగా ఉంది. మరి వృత్తి కూడా ఫన్నుగానే ఉండాలని కూడా వీరి నమ్మకం కదా. ఆ అమ్మాయి ఒక నిముషం నామొహంలోకి పరీక్షగా చూసి, “ఓహో, అలాగా, మరి ఫన్నుకోసం ఏం చేస్తావు?” అనడిగింది.

నేను కూడా ఆలోచనలో పడ్డాను. ఏం చెప్పాలో నాకు తోచలేదు. అక్కడికది వదిలేసి కుశలప్రశ్నలడిగేసి ఆ సంభాషణ ముగించేసేం. ఎంచేతో ఈ మధ్య తను అట్టే కనిపించడంలేదు. ఆవిధంగా నాకూ ఆ అమ్మాయికీ కూడా ఆ గోల తప్పిపోయింది.

ఇంతకీ మీకింకా నేను ఫన్నుకేం చేస్తానో మీకు తెలుసుకోవాలనుంటే, చదువు సాగించండి.

నాకు scrabble ఆడడం సుఖం. ఆడుతుంటే హాయిగా ఉంటుంది. సాధారణంగా ఎప్పుడు ఆడతానంటే – పొద్దున్న లేచి కాఫ్యాదులు అయేక, మధ్యాహ్నం కునుకు తీసేముందు, రాత్రి పడుకునేముందు, తోచనప్పుడు, పని లేనప్పుడు, ఉన్న పని వాయిదా వేయాలనుకున్నప్పుడు, చిరాగ్గా ఉన్నప్పుడు,  ఆకలేసినప్పుడు, ఆకలేయనప్పుడు, జీవితంమీద విరక్తి పుట్టినప్పుడు ఒక ఆట ఆడితే మనసు ప్రశాంతం అయిపోతుంది. ఇ-రీడరుతో ఆడడంలో మరింత ఎక్కువ సుఖం. ఎందుకంటే ఆ యంత్రానికి ఆలోచనా పాలోచనా లేదు కదా. దానికి నిఘంటువులో పదాలన్నీ కరతలామలకం కనక తనవంతు రాగానే ఠపీమని పదం పడేస్తుంది. అంచేత ఒక ఆటకి పట్టే సమయం కూడా తక్కువ.

మరో సుఖం – మామూలుగా అట్టపెట్టెలో వచ్చే ఆటలో మరొకరితో ఆడుతున్నప్పుడు అవతలివారి పెట్టిన పదాల్లో తప్పులు పట్టడం, మనదే తప్పయితే మనవంతు ఆట వదులుకోవలిసిరావడం ఉంటాయి. కానీ ఈ ఇ-రీడరులో అవతలివారిని రొకాయించడానికి లేదు కానీ మనం తప్పు పెడితే మాత్రం ఎంతో మర్యాదగా, “అలాటి మాట లేదు, మరోటి చూడు,” అంటుంది. అంచేత మనకి నష్టం లేదు. అంచేత కూడా నాకు ఇది సుఖకరంగా ఉంది.

అయితే ఇందులో సుఖకరం కాని విషయాలు కూడా ఉన్నాయి. అది మనిషి కాదు కనక మనం తగువేసుకోడానికి వసతి లేదు. ఉదాహరణకి xi, ix ఉన్నాయి. రోమన్ అంకెలు 11, 9. కానీ ఆటలో 11 ఒప్పుకుంటుంది కానీ తొమ్మిది ఒప్పుకోదు. అలాగే అనేక సర్వనామాలు. జపాన్ ఫరవాలేదు కానీ చైనా పనికిరాదు. దాల్ ఉంది కానీ చారు లేదు. అదేం అనడగడానికి లేదు. అలాగే అది పెట్టేసే కొన్ని పదాలు కూడాను. నేను పని గట్టుకుని అవి గుర్తు పెట్టుకు ఆట ఆయిపోయేక నిఘంటువు చూస్తానా, కొన్ని దొరుకుతాయి, కొన్ని దొరకవు. దొరికినవి కూడా అన్నీ గుర్తుండవు నాకు.  ఒకొకప్పుడు మాట గుర్తుంటుంది కానీ అర్థం గుర్తుండదు. అయితేనేం, ఆటకి పనికొస్తుంది కనక అదే చాలు,

గుర్తున్న పదాల్లో zebu నాకు భలే నచ్చింది. జేబు అంటే brahmin అని ఉంది. అంటే మనిషి బ్రాహ్మణుడో, పరబ్రహ్మో నాకర్థం కాలేదు. దీనికి ప్రతిగా, కక్ష తీర్చుకోడానికి నేనేం చేస్తాను తెలుసా, నాదగ్గరున్న అక్షరాలతో నా ఇష్టం వచ్చినట్టు ఒక పదం కూర్చేసి, ఇలాటి పదం ఉండే ఉంటుందిలే అనుకుంటూపెట్టేస్తాను. ఒకప్పుడు అది పదం అవుతుంది, ఒకప్పుడు కాదు. అయితే మాత్రం ఏం? నేనేమీ రాజ్యాలూ, తమ్ముళ్ళనీ, ఇల్లాలినీ పణం ఒడ్డి ఆడడంలేదు కదా. ఒక పదం ఉందని తెలుసుకోడంలో ఎంత ఆనందం ఉందో లేదని తెలుసుకోడంలో కూడా అంతే ఆనందం ఉంది. నాకు ఉంటుంది.

Wadi అన్న పదం అంగీకారమేన్ట. ఆ పదం కంప్యూటరు పెడితే నేను వడియాలు అనుకున్నాను కానీ తరవాత నిఘంటువు చూస్తే కాదని తెలిసింది. వానాకాలంలో మాత్రమే నీటితో నిండే ఏరుట. చూసేరా, నా స్వంత పదకోశం ఎలా అభివృద్ధి చెందుతోందో.

ఆ ఊపులోనే నా పదకోశం ఉరువు తెలుసుకోవాలనిపించింది. ఇంగ్లీషు పదకోశం అంటే నాకు తెలిసిన ఆంగ్లపదాలు ఎన్ని ఉన్నాయో తెలుసుకోడానికి అప్పులున్నాయి (apps). నేను చూసుకుంటే నా పదకోశం ఉరువు English White collar professionals తో పోలిస్తే సుమారు గా 65 శాతం ఉందని తెలుసుకుని మహా ఆనందపడిపోయేను. మరి తెలుగు పదాలు లెఖ్ఖ పెట్టుకోడానికి ఇలాటి అప్పులున్నాయో లేదో తెలీదు. తెలిస్తే బాగుండు. మ్.

ఇందాకా చెప్పేను కదా నాకు తోచిన అక్షరాలు నాగ్గరున్న అక్షరాలతో ఇలాటి మాట ఉండి ఉంటుందిలే అనుకుని ఓ పదం కూర్చేస్తానని. నిన్న shalier అని పెట్టేను. అలాటి పదం ఉందని నాకు తెలీదు కానీ పెట్టేసేను. అది అంగీకారం అయిపోయినతరవాత, ఆట ముగించేసేక, నిఘంటువులో చూసేను. Shale ఒక రకం శిలావిశేషం. చూసేరా, ఇలా నాకు కొత్త మాటలు తెలుస్తాయమన్నమాట. నిజంగా అవన్నీ గుర్తుంటాయనీ కాదు, నేను రాయబోయే ఇంగ్లీషు కథలోనో వ్యాసంలోనో ఇవన్నీ వాడతాననీ కాదు కానీ అలా చేయడం ఒకరకమైన ఆనందాన్ని కలిగిస్తుంది నాకు.

వెనకటి టపాలో భాగవతం చదువుగురించి చెప్పేను కదా. ఇంచుమించు ఇది కూడా అంతే. పదాలు తెలుసుకోడంలోనే ఆనందం.

నాకు గల మరో ఫన్ను ముఖపుస్తకం. దాన్నిగురించి మరో టపాలో రాస్తాను.

000

(నవంబరు 8, 2016)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

7 thoughts on “మనలో మనమాట 30 – scrabble ఆడ్డంలో కష్టసుఖాలు!”

 1. Crypto-Quip ఎప్పుడూ వినలేదు. నేను స్క్రాబుల్ ఒక్కటే ఆడతాను. టెనిస్ ఒక్కటే చూస్తాను. అంతే. అత్తయ్యగారి కథలు మీరు చదువుతానంటే నాకు చాలా సంతోషంగా ఉంది. చదివేక మీ అభిప్రాయం చెప్పగలరు వీలయితే. ధన్యవాదాలు.
  ఆమధ్య మీరు మీబ్లాగు చూడమంటే చూసేను. కానీ వ్యాఖ్య పెట్టబోతే, తీసుకోలేదు. నాకు blogspot బ్లాగులతో ఎప్పుడూ పేచీయే.

  మెచ్చుకోండి

 2. నేను ఫన్నుకి Crypto-Quip చేస్తాను – మీరెప్పుడైనా చేసారేమో అని చిన్న కుతూహలం – బావుంటుంది. ఇక్కడ ఉదాహరణ ఇవ్వలేను గాని దానిమీదో చిన్న బ్లాగ్ పోస్ట్ రాద్దామనుకుంటున్నాను – అప్పుడు తప్పక మీకు చూపిస్తాను.

  ఒక మాట – మీ “అత్తయ్యగారి కథలు ” పుస్తకం ఈ మధ్యనే నాకు దొరికింది – ఒక స్నేహితురాలు పంపగా – ఈ సెలవులలో చదవాలి – కథలన్నీ చదివాక వచ్చి మీకు చెప్పాలి అనుకుంటున్నాను 🙂

  మెచ్చుకోండి

 3. నేను ఫ్రాన్స్ లో ఒక ఏడాది గడిపినప్పటి మాట. ఒక ఆదివారం నాతో పనిచేసేతను వాళ్ళింటికి లంచ్ కి పిలిచాడు. తిన్న తరువాత scrabble ఆడుదాం అన్నాడు, నేను, మాఆవిడ, అతను, వాళ్ళావిడ. అది ఫ్రెంచ్ scrabble. నాకు కొంచెంగా ఫ్రెంచ్ వచ్చినా, మేం ఫ్రెంచేతరులం కాబట్టి మేం french-english dictionary వాడుకోవచ్చనే ఒప్పందం. చివరికి నేను గెలిచాను. అది ఫన్ను.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s