నసాంకేతికాలు రెండో పాదం.

నా నసాంతిక విద్య ఎలా మొదలయిందో, ఈ విద్యలో ఎంత ప్రావీణ్యం ఎలో సంపాదించేనో వివరించి 8 ఏళ్ళయింది. అది ప్రాథమిక విద్య అనుకుంటే ఇది పైస్థాయి అన్నమాట.

చెప్పేను కదా customer supportని పిలిస్తే, కంప్యూటరు పెట్టెలోంచి తీసేవా, electric cord కంప్యూటరుకి తగిలించేవా, రెండో కొస గోడమీద outletకి తగిలించేవా అంటూ బ్రహ్మ నారదుడికి బోధించినచోట ఎత్తుకుంటాడు. ఆ మెట్లన్నీ ఎక్కడం అయిపోయింది, నేనిక్కడున్నాను అంటూ చెప్పబోతే పాపం ఆ క.ప్ర. (customer service ప్రతినిధి) ఓపిగ్గా పూర్తిగా వింటాడు. అందుకు సందేహం లేదు. అది వాళ్ళ కంపెనీ పాలసీ అని కూడా చెప్తాడు కొండొకచో. నేను చెప్పడం పూర్తయిందని నమ్మకం కుదిరేక, నాకంత కష్టం కలిగినందుకు సానుభూతి వెలిబుచ్చి, నా ఓరిమిని కొనియాడి, ఆ తరవాత కంప్యూటరు పెట్టెలోంచి తియ్యి అంటూ మళ్ళీ మొదటికొస్తాడు.

ఇంతకీ అసలు నాకొచ్చిన కష్టాలేమిటో, వాటిని పరిష్కరించుకోడానికేం చేసేనో చెప్తాను. అది రెండు స్థానాలలో – జాలంలోనూ, ముఖపుస్తకంలోనూ – జరగడంచేతనూ, వాటిని నాకు నేనే పరిష్కరించుకోడంచేతనూ నేను నా సాంకేతిక విద్యలో రెండోపాదం ప్రవేశించేనని చెప్పుకుంటున్నాను.

ఓం ప్రథమంగా తెలుసుకోవలసింది ఫోనులో పిలిస్తే పైన చెప్పిన తంతు కానీ చాట్, ఇమెయిలయితే కొన్ని మెట్లు దాటేయవచ్చు.

  1. జాలకష్టాలు. ప్రత్యేకించి ఇమెయిలు చిక్కు.

నేను నెలరోజులక్రితం ఇతర మాధ్యమాలలో అంటే ఇంగ్లీషు పత్రికలలో చర్చలలో ఓ వేలు పెడదాం అని సరదా పుట్టి మరో తెరపేరుతో ఓ ఐడి పెట్టుకున్నాను hotmail లో. దాంతో వచ్చింది తంటా. password తప్పు, నీ ఖాతా తొలగించేం, అనీ ఫలానా చోటికి వెళ్ళి పునరుద్ధరించుకోమనీ తాఖీద వచ్చింది. సరే ఆ పేజీకి తరలి తొంగి చూస్తే, అది నిజ మనిషి కాదు, అగోచర సహాయకారి (virtual). సరే నా సొద చెప్పుకుంటే, పని చేస్తున్నట్టే కనిపించింది. కానీ నీ సెల్ నెంబరియ్యి, అక్కడికో కోడు పంపుతాం అంది. అదుగో అక్కడే వచ్చింది తంటా. ఈ డెవలపర్లూ, ప్రోగ్రామరులూ గట్టిగా నమ్మే విషయాల్లో ఒకటి – ప్రతి మనిషికీ సెల్లులు, లాప్టాపూ, ఐపాడూ, టాబ్లెట్టూ వంటివి అన్నీ ఉంటాయని. నాలా ఓదో ఒక్క డొక్కుతో పని జరుపుకునే నిర్భాగ్యులు బోల్డుమంది ఉంటారని అనుకోరు. వాళ్ళ పద్ధతి చూస్తుంటే నాలాటివారికి “అక్కడ స్థానం లేదని బోర్డు కట్టుకోడమే తరువాయి” అనిపిస్తుంది.

నాకు అమిత తంటా ఎప్పుడు కలిగిందంటే, Microsoft email account తెరిచేక, విండోస్ ప్రవేశించడానికి సంకేతచిహ్నం అడిగితే ఆ ఇమెయిల్ సంకేతచిహ్నం ఇచ్చేను. నేను వేరే అవుసరంకోసం సృష్టించుకున్న తెరపేరూ, ఆ సంకేతచిహ్నం జీడిమరకలా స్థిరమయిపోయింది. అది నేను చాలా ఆలస్యంగా గ్రహించేనని వేరే చెప్పక్కర్లేదు కదా.

“సెల్ నెంబరు లేకపోతే పోన్నెంబరియి, మేం ఫోను చేస్తాం” అనొచ్చు కదా. అదీ లేదు. నేనే పిలవడానికి కూడా లేదు.

అలా కొంతకాలం కుస్తీ పట్లయేక, కాస్త మంచీ మర్యాదా తెలిసినవాడయితే “నేనింకేం చెయ్యలేను. ఇది నాకార్యకలాపాలకి సంబంధించింది కాదు. Microsoft వాళ్ల ఫోన్నెంబరుందా, ఉంటే ఆ నెంబరు పిలువు అని చెప్పి, ఇంకా తరవాతేం జరిగిందో తనకి చెప్పమని కూడా చెప్పి శలవు తీసుకున్నాడు.

అప్రస్తుతమే కానీ నాకు specialitiesతో కూడా చిక్కుగానే ఉందని చెప్పకతప్పదు. పూస కొడతాను కానీ లడ్డూ చెయ్యను, మోచేయి చికిత్స చేస్తాను కానీ మణికట్టు చెయ్యను అంటూ మొత్తం పనినో శరీరాన్నో ముక్కలు ముక్కలు చేసేస్తున్నారు. అక్కడికి మోచేతికీ మణికట్టుకీ సంబంధం లేదన్నట్టు. ఇది నిజంగా నాకు అనుభవైకవేద్యం.

ఇంతకీ తరవాతేం జరిగిందంటే, మళ్లీ వింటడో్స్ ప్రవేశించబోతే నా సంకేతం అడగడం, నేనిచ్చింది కాదనడం అయింది. ఇదేదో ఏలిన్నాటి శనిలా ఉందనిపించిందంటే నమ్ము. నేను సరిగ్గానే టైపు చేసేను. అది మాత్రం మళ్ళీ చెప్పమంది. నాలుగు చుట్లయేక నీకు గుర్తులేకపోతే మార్చుకోవచ్చు, ఇదుగో ఈ లింకు తెరిచి మార్చకో అని ఓ బోడి సలహా తగలేసింది నీలితెరమీద. అక్కడా నాకు ఒళ్ళు మండింది. తెరుచుకోని తలుపుదగ్గర పని చేయని లింకు ఇస్తే ఏం లాభం? విండోస్ తెరుచుకుంటేనే కదా ఆలింకులోకి ప్రవేశం?!

అప్పుడన్నమాట ఇట్నంచి అటు నేనే ఆ ప్రతినిధికి పాఠం పెట్టేను గట్టిగా, “అసలు తెర తీయకపోతే జాలంలోకి ఎలా వెళ్తాను, నాసంకేతం ఎలా మార్చుకుంటాను?” అని. ఎదుట మనిషి కాదు కదా. రెండు రోజులు ఇమెయిలూ లేదు ఏ మెయిలూ లేదు. కానీ విశేషం ఏమిటంటే ఆ పనికిమాలిన సలహా మాత్రం కనిపించడం  మానేసింది. అది నేను సాధించిన మొదటి విజయం. ఆ తరవాత మళ్ళీ తెర తెరుచుకోడం జరిగింది. ఎలా అంటే నాకు తెలీదు. కానీ మళ్ళీ మూత పడకుండా హడావుడిగా మరో తెరపేరుతో మరో ఖాతా పెట్టేను hotmail కాదు. outlook ఖాతా. నిజానికి ఈ రెండూ Microsoft వాళ్ళవే కనక, ఈ సారి విండోస్ లాగిన్ కష్టం పరిష్కారం అయిపోయింది.

ఆ ఊపులోనే Microsoft login కాకుండా మరో వసతి కూడా ఉందని కనిపెట్టేను. అది login on local machine. ఇక్కడ మనం ఏ సంకేతమూ ఇవ్వకపోతే, మొత్తం సంకేతచిహ్నం గోల వదిలిపోతుంది.

హెచ్చరిక. ఆహా మాలతి లాప్టాపులో సంకేతచిహ్నం రక్షణ లేదు, అంటే ఆ లాప్టాపు తస్కరించేస్తే ఆవిడరాతలన్నీ తస్కరించేయవచ్చు అని కాపీరాయుళ్ళెవరేనా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. నారాతలన్నీ బ్లాగులోనో, ముఖపుస్తకంలోనో బాహాటంగా ఎల్లరకూ అందుబాటులో ఉన్నాయి. నా లాపుటాపులో అంతకు మించి ఏమీ లేవు. మా అమ్మ అన్నట్టు తస్కరులకు దొరికేది రాగి తీగెలూ, ప్లాస్టిక్ పెచ్చులూ మాత్రమే.

ఇంక ముఖపుస్తకం కత.

సెప్టెంబరులో యం.యస్ సుబ్బలక్ష్మిగారి శతజయంతి సందర్భంలో United Nations విడుదల చేసిన స్టాంపు నా statusమీద పెడితే, ఆ స్టాంపుమీద నాపేరు ప్రముఖంగా కనిపించింది, ఆవిడబొమ్మ నాదే అయినట్టు. లేదా, ఆ బొమ్మలో ఉన్నావిడ పేరు నిడదవోలు మాలతి అయినట్టు. అది తొలగించే ప్రయత్నంలో పొడి అక్షరాలు మా.ని. అని పెడితే తప్పుకుంటాయేమో అని చూసేను. కానీ పని చెయ్యలేదు సరి కదా మా.ని. అన్న పొడి అక్షరాలు కూడా అందంగా లేవు. ఏదో మానీయమన్నట్టుంది. సరే బాగులేదు మళ్ళీ వెనక్కి మార్చేద్దాం అనుకుని ప్రయత్నించేను. ఆ క్షణంలో నేను ఒక ప్రయోగం చేసి చూస్తున్నాననే అనుకున్నాను. కానీ ముఖపుస్తకంవారు వెంటనే “నీపేరు మా.ని, 60 రోజులవరకూ మార్చడానికి వీల్లేదు” అన్నారు. నిజానికి అది నాకు నచ్చలేదు. అక్కడ నామిత్రులకీ నచ్చలేదు. సరే, ఏం చేస్తాను, అడిగినవారందరికీ జవాబులు చెప్పుకుంటూ 60 రోజులూ అందరం భరించేం.

60వ రోజున తెల్లారగట్ల లేచి గబగబ దంతధావనం, కాఫ్యాది నిత్యాలు ముగించుకుని, చీకట్లోనే ముఖపుస్తకం తెరిచేను పేరు మార్చడానికి. నేను సరిగ్గానే టైపు చేసేను కానీ ఇంటిపేరు నడదవోలు అని వచ్చింది. అయ్యో అనుకుంటూ మళ్ళీ తప్పు దిద్దుకోబోతే, మళ్ళీ అదే జవాబు. “నీపేరు నడదవోలు మాలతి, అది మార్చాలంటే మళ్ళీ మరో 60 రోజులు తపస్సు చేయాలి” అని. ఈలోపున మిత్రులు ఎందుకు నడదవోలు అని మార్చుకున్నారు అని అడగడం మొదలు పెట్టేరు. కనీసం కొందరైనా ఈవిడకి పేరు పిచ్చిలా ఉంది అని అనుకునే ఉంటారని నా అనుమానం. నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది కూడాను పేరు ఇంత పరీక్షగా చూసేవాళ్ళున్నారా అని. కొంత మురిసిపోయేను కూడా.

ఇంతలో మరో విశేషం జరిగింది. నా మిత్రమండలిలో లేనివారొకరు ఒక వ్యాఖ్య పట్టేరు. వ్యాఖ్యలో దోషం లేదు కానీ అదెలా సాధ్యం అయిందనే నాకు తికమక అయింది. నామిత్రులు కానివారికి చదివే వసతే కానీ వ్యాఖ్యానించే వసతి లేదు కనక నాకు సందేహం కలిగింది hack చేసేరేమోనని.

ప్రతి చర్యకీ ప్రతిచర్య ఉన్నట్టే, hack అయితే సంకేతచిహ్నం మార్చురకోమంటారు. అలా చెయ్యడానికి settings ప్రవేశించేను. అక్కడ report problem నొక్కితే, కనిపించిన మెను చూసి తెల్లబోయేను. నావెనకటి రెండు పేర్లూ కలిపి మొత్తం మూడు పేర్లు – నడదవోలు మాలతి, మా.ని., నిడదవోలు మాలతి – కనిపించేయి. ఆహా పండె నానోములు అనుకుంటూ నా నిజనామధేయ నిడదవోలు మాలతి మీద నొక్కేను.

మళ్లీ ఇక్కడ మరొక సారి గుర్తు చేస్తున్నాను. పైన విండోస్ ప్రవేశంలాగే ఇక్కడ కూడా అనిపించింది నాకు. ఎందుకంటే, నేను నా ఖాతా హాకయినట్టుంది అని ఎప్పుడు చెప్పేనో ఆ సమయంలో ఉన్న పేరే కదా లెక్కలోకి రావాలి. వెనకటిపేర్లమీద ఇప్పుడు hack చేయడం సాధ్యమా? నాకు తెలీదు

ఏమయితేనేం, సందు దొరికింది కదా అనుకుని, అట్టే నస పెట్టకుండా, నా నిజనామధేయంమీద నొక్కేసేనే కానీ ఇంకేం చిక్కులొస్తాయో అని గుండెలు కొట్టుకుంటూనే ఉన్నాయి.

నా statusమీద నాపేరు చుక్కల్లో చంద్రుడిలా మెరుస్తూ కనిపించినతరవాత కూడా భయమే. అది నాకొక్కదానికే కనిపిస్తోందా? ఒక్క నిముషమో ఒక్క గంటో మాత్రమే కనిపిస్తుందా? ఈ పేజీ తెరిచి ఉన్నంతసేపే కనిపించి మళ్లీ మాయమయిపోతుందా? సరే, ఇంకేమైనా నాచేతుల్లో లేదు అనుకుంటూ కొంతకాలం వేచి చూచి, ఆపేరు అలాగే నిలబడి ఉన్నందుకు సంతోషించి ప్రకటించుకున్నాను నామిత్రులకి

అలాగన్నమాట 60 రోజులు ఆగకుండా వెనకటిపేరు దొరకపుచ్చుకుని నా పేరు నిలబెట్టుకోగలిగేను.

000

(నవంబరు 28, 2016)

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s