నువ్వుండిపోతావేంటి? (కథ)

తెల్లారగట్ల నాలుగ్గంటలకి లేచి, ఫిల్టరులో వేణ్ణీళ్ళు పోసి, ముఖపుస్తకం తెరవగానే కనిపించిన మొదటివాక్యం “అమ్మ ఇక లేదు” అని. ఆ వెంటనే మరొక టపా, “ఇంకా ఇప్పుడే కాదు.”

ఉలిక్కిపడ్డాను. ఎవరిని అంటున్నారో నాకర్థం కాలేదు. మనకి చాలమంది అమ్మలున్నారు. ఎవర్నో ఎందుకు. నన్ను కూడా చాలామంది అమ్మ అనే అంటారు కదా ముఖపుస్తకంలో. అయిన నేనింకా ఉన్నానని నాకు తెలుసు కనక మరో రెండు తెరపట్లు దిగేను మరెవరైనా స్పష్టం చేస్తారేమోనని. ఎక్కడా దొరకలేదు.

“నేనూళ్ళో ఉండను కానీ జయలలిత పోతే ఇదే నాసంతాపం.”

సరే తెలిసింది ఆ అమ్మ జయలలిత అని. ఈ సంతాపాలు ప్రకటించడం ఎంత హాస్యాస్పదమయిపోయిందో అని కూడా అనిపించింది. అసలు RIP అని పెడితేనే నాకు చిరాగ్గా ఉంటుంది. ఆమాత్రం ఒక పూర్తి వాక్యం రాయలేనివాళ్ళు ఏమాత్రం విచారిస్తున్నట్టు అని. అంతకంటె ఘోరం ఒకరు పెట్టినపోస్టుమీద లైక్ కొట్టడం.

పైన చెప్పినవాక్యం “ఆవిడ పోయినప్పుడు ఇదే నాసంతాపంగా తీసుకోండి,” అన్నవాక్యం చావుబతుకుల్లో కొట్టుకుంటున్న ప్రాణి చూస్తే ఏమనుకుంటుంది? సరే, ఎప్పుడో అప్పుడు నేను కూడా పోతాను కదా, ఇప్పుడే నాక్కూడా చెప్పేయి అని రాయాలనిపించింది నాకైతే. కనీసం నేను పోయేక ఎవరు ఏమనుకుంటారో నాకు ఇప్పుడే తెలుస్తుంది కూడాను.

ముందు చూసిన వాక్యం మళ్ళీ కనిపించలేదు. ఎవరో తొందర పడి పెట్టేసేరు అని. ఎవరో చనిపోయేరని నాకు మొట్టమొదట తెలిసిందని చెప్పుకోవడంలో కూడా ఒక ఆనందం ఉందేమో. ఏమిటో ఈ చావుతో చచ్చే చావుగా ఉంది అనుకునే వాళ్ళు కూడా ఉండే ఉంటారెక్కడో.

000

ఈ చిన్నికత నాలో నిరంతరం చెలగే ఆలోచనలు మళ్ళీ రేపింది.

అసలు ఈరోజుల్లో చావు మాటెత్తితే హడలిపోయి జీవితం ఎంత ఆనందమయమో, ఎంత ఆనందంగా అనుభవించాలో చెప్పేవాళ్ళు ఎక్కువయిపోతున్నారు. నాకు ఇలా చెప్పేవాళ్ళు నాకు చాలామార్లే తటస్థపడ్డారు. అమంగళము ప్రతిహతమగుగాక అని చెవులు మూసుకుంటారు. నేను చావునీ బతుకునీ కూడా ఒక్కలాగే చూస్తాను. అసలు ఇప్పుడంటే అదో భయంకరస్వప్నం అన్నట్టు ఉలికిపడి దానికి వ్యతిరేకంగా మాటాడ్డం నాగరీకం చేసేరు కానీ కొంచెం వెనక్కి తిరిగి చూడండి. చావు అన్నది ఊతపదంగా ఎన్నిరకాలుగా వాడుకలో ఉందో.
“అర్థరాత్రయినా ఇంటిధ్యాస లేదు. ఎక్కడ చచ్చేడో?” అంటే నిజంగా చచ్చిపోయేడని కాదు కదా. అలాటిదే ఎదుటిమనిషిని “ఎక్కడ చచ్చేవే?” అనడగడం కూడాను. చచ్చిపోయినమనిషి ఎదుట కనిపించడు కదా అలా నిలదీసి అడగడానికి.

బహుశా నేను చిన్నప్పుడు పురాణకాలక్షేపాలకి హాజరవడం కావచ్చు. మన పురాణకథల్లో మానవజన్మగురించి చాలా చర్చలున్నాయి కదా. అవన్నీ ఇక్కడ పెట్టను కానీ చాలామందికి తెలిసే ఉంటుంది జీవితం బుద్బుదప్రాయం. జాతస్య మరణం ధృవంలాటివి. అసలు బిడ్డ పుట్టినప్పుడు ఏడుస్తూ పుడతాడు. మళ్ళీ ఈ ప్రపంచంలోకి నన్ను పడేసేవా అనిట. పోయినప్పుడు చుట్టూ ఉన్నవాళ్ళు ఏడుస్తారు. మమకారంచేత. ఆ మమకారం కూడదని మన శాస్త్రాలు చెప్తున్నాయి. నాకు ఆ బ్రహ్మజ్ఞానం వచ్చేసిందని చెప్పను కానీ నాకు అలా వదిలేసుకోడంలో కొన్ని సుళువులు కనిపించేయి. ముఖ్యంగా బంధుమిత్రులు ఇలా చెయ్యలేదు, అలా చేసేరు అని బాధ పడడంకన్నా వాళ్ళు నా బందుమిత్రులు కారు అనుకోడంతో గొడవొదిలిపోయిందనిపించింది. అంచేత అలా చేస్తున్నా. తెలిగ్గా దొరకనివాటికోసం అనేక కష్టనష్టాలకోర్చి, శ్రమ పడి గెలుచుకోడం ఒక పద్ధతి. అదే జీవితంలో గమ్యం కొందరికి. నాకా ఓపిక లేదు. అంటే నేను దేనికోసమూ కష్టపడనూ లేదు. సాధించిందీ ఏదీ లేదు. ఆధునికసమాజంలో ఆవిధంగా నాజీవితం నిరర్థకం. అసలు మహా మహా చక్రవర్తులూ, జ్ఞానులూ, వేదాంతవిదులూ, కవులూ నిర్గమించినతరవాత ప్రపంచం ఆగిపోలేదు. అంచేత కూడా కావచ్చు. నాతరవాత కూడా ప్రపంచానికేమీ లోపం ఉండదనే అనిపిస్తుంది.

ఇంతకీ, నిజంగా ఆ క్షణం వచ్చినప్పుడు అంటే ప్రాణం పోయేవేళ చివరి క్షణంలో పోతున్నానన్న స్పృహ ఉంటుందని కూడా గ్రహించేను. నాకు తెలిసినవారు చివరిక్షణాల్లో ఆప్తులని దగ్గరికి పిలిచి పోతున్నానని చెప్పడమో చేసౌంజ్ఞ చేయడమో చేసి ప్రాణాలు వదిలేసేరని విన్నాను.

అప్పుడు భయపడ్డారా, వారికి ఏం కనిపించింది అన్నది తెలీదు. కనీసం నేను పోయేటప్పుడు తెలిస్తే మాత్రం తప్పకుండా చెప్తాను, సైన్సుకి అది నా చివరిసేవగా.

000

ఒకసారి నాపుట్టినరోజుకి మాఅమ్మ మైసూరుపాక్ చేసింది. నేను మరేదో కోపంలో ఉండి, “నాకక్కర్లేదు, నేను తినను” అన్నాను. “ఎందుకు తినవు?” అని కసురుకుని, “ఇప్పుడు నేనున్నాను కనక చేసేను.  ఆతరవాత నువ్వు కావాలన్నా చేసేవాళ్ళుండరు,” అంది. ఇరవైఏళ్ళతరవాత, నేను అమెరికాకి వచ్చేక ఆ మాట నాకు అర్థం అయింది. ఇక్కడ ఓ కప్పు కాఫీ కావాలంటే నేను పెట్టుకుంటే ఉంది లేకపోతే లేదు. ఆరోజున మళ్ళీ మా అమ్మని తలుచుకున్నాను. ఇలాటి మాటలు మాఅమ్మే కాదు చాలామంది దగ్గర వినడంవల్ల కావచ్చు నాకు చావంటే బతుకులో భాగంగానే అనిపిస్తుంది కానీ ఆశ్చర్యంగానో భయంకరంగానో అనిపించదు.

000

ఇదంతా తవ్వి తీసి కాయితమ్మీద పెట్టడానికి జయలలిత తొలికారణం అయితే, మా అమ్మాయి మలికారణం. ఆ మధ్య ఒకరోజు మాఅమ్మాయినీ అల్లుడినీ భోజనానికి పిలిచేను.

ఇద్దరికీ తెలుగు వంటకాలు చాలా ఇష్టం. నేనిక్కడ లేనప్పుడు హోటల్లో తినేవారు. అంచేత సాధారణంగా దేశీహోటళ్ళలో దొరకని వంటకాలు చేయడానికి ఉద్యుక్తురాలినయి, కందిపచ్చడితో మొదలు పెట్టేను. అసలు నా కందిపచ్చడి ఊరూ వాడా చెప్పుకుంటారు. దేశీదుకాణంలో తాజా తాజాగా  మామిడికాయలు కనిపించేయి. మామూలుగా ఇక్కడ అన్నిటినీ తాజా అనే అంటారు. ఒకసారి నేను అమాయకంగా, “ఇవి నిజంగా తాజా కాయలేనా?” అని అడిగితే, దుకాణంవాడు చింకి చేటంత మొహం చేసుకుని, “తెచ్చినప్పుడు తాజాగానే ఉన్నాయి,” అన్నాడు.

సరే, ఇంతే ప్రాప్తం అనుకుని తెచ్చి తాజా తాజాగా కొత్తావకాయ పెట్టేను. నిజం చెప్పొద్దూ, చూస్తుంటే ఎర్రగా కళకళ్ళాడుతూ నాకే ముచ్చటేసింది.

అలాగే వంకాయ ఇగురూ, పుళిహోరాను. అదేం ఖర్మో అన్నపూర్ణలాటి తెలుగు వాళ్ళు పెట్టిన హోటళ్లలో కూడా బిరియానీయే కానీ పుళిహోర ఉండదు. ఇడ్లీతో కొబ్బరి పచ్చడి పెడతారు కానీ వేరుశనగపప్పు పచ్చడి పెట్టరు. అలాటివన్నీ తలుచుకుంటూ ఏమేం చేయాలో జాగ్రత్తగా ఆలోచించి వంటకాలు జాబితా తయారు చేసుకునేసరికి మూడు రోజులు పట్టింది.

వంకాయలు చూసేక, ఇగురు కాదు వంకాయ పచ్చికారం చేదాం అనిపించింది. చూడబోతే కొత్తిమీర లేదు. అప్పటికప్పుడు గబగబా వీధి చివర బంగ్లాదేశీ దుకాణానికెళ్ళేను. అక్కడే పచ్చి పనసకాయ కనిపిస్తే అదీ తెచ్చేను నువ్వులపొడి వేసి కూర చేస్తే ఎంత రుచో అనుకుంటూ. చివరితీర్పుగా పుళిహోరలో ఆవకాయ ఊట కలిపేను. ఇలా చూసి చూసి అపురూపంగా చేసిన నావంటకాలు చూస్తుంటే నాకే బోల్డు ఉత్సాహం వచ్చేసిందనుకో.

అనుకున్నవేళకి ఇద్దరూ వచ్చేరు. భోజనాలకి వేళయింది. ఇద్దరూ చెరో పళ్లెం తీసుకుని కూరా, పచ్చళ్లూ, పుళిహారా, అలసంద గారెలూ వడ్డించుకుని బల్లదగ్గర కూర్చున్నారు. నేను కూడా మరో పళ్లెంలో పెట్టుకుని కూర్చున్నాను.

పిల్లా, పిల్లాడూ బహు మురిసిపోతూ ఇలాటి వంటకాలు తినడానికి పెట్టి పుట్టాలిలాటి విసుర్లతో ముగించేరు. నేను వాళ్లని గమనించనట్టు నటిస్తూ ముగించేను.

“పుళిహోర ఎలా ఉంది?” అన్నాను.

“ఏం?”

“ఏం లేదులే” అన్నాను.

ఇద్దరూ వెళ్ళిపోయేరు మరోమారు అంతమంచి భోజనం పెట్టినందుకు ఆనందం వెలిబుచ్చి. నాకు మాత్రం తృప్తి లేదు.

నాలుగు రోజులనాడు పిల్ల మళ్ళీ వచ్చింది. “ఇలా రా. నీకో మాట చెప్పాలి,” అని పక్కన కూర్చోపెట్టుకుని నిదానంగా వివరించేను, “చూడు, pizza, casseroleలాటివాటిల్లో రకరకాల కూరగాయలన్నీ కుప్పగా పడేసి ఒకే వంటకం చేసేస్తారు. మనం అలా చెయ్యం ముక్కలపులుసయితే తప్ప. అంచేత తిన్నప్పుడు కూడా అంతే. ఒకొక వంటకం ఒకొక రుచి. దేని రుచి దానిదే. మొన్న పుళిహోరలో ఆవకాయ ఊట కలిపేను. అంచేత ఆ రుచి వేరు. ఇవన్నీ విడివిడిగా తింటేనే చౌరుచులూ తెలుస్తాయి కానీ అన్నీ కుప్ప పోసేసి కలిపేసుకు తింటే ఏమీ తెలీదు.” అని.

“మరి నువ్వు చెప్పలేదు కదా,” అంది అమ్మాయి.

“చెప్పేదేమిటి. నీకు తెలీదా మనం ఎలా తినేవాళ్ళమో. అన్నిట్లోనూ ఆవకాయ కలిపేసుకుంటే కూరలరుచేం తెలిసింది?”

“నాకు ఆవకాయ ఇష్టం అని నీకూ తెలుసు కదా. అసలు ఇలాటి ఆవకాయ తిని ఎన్నాళ్లయిందో తెలుసా. మళ్ళీ నువ్వు పోయేక ఎవరు చేసి పెడతారు నాకిలా?”

… … … మూడు నిముషాలపాటు.

నాకింక మాటాడ్డానికేం లేదు. నాకు తల తిరిగి నోట్లోకొచ్చింది కానీ అదేం కనిపించనీయకుండా తనూ ఆయనా ఎంతగా ఆ రుచులు తింటూ ఆనందించేరో, తరవాత రెండురోజులపాటు అవే తలుచుకున్నారో చెప్తుంటే వింటూ కూర్చున్నాను మరో పావుగంటసేపు.

ఆ తరవాత అది వెళ్ళడానికి లేస్తూ, ఇక మీదట ఏదైనా మరీ ప్రత్యేకం అని అనుకుంటే నేను ముందే చెప్పాలని తాఖీదిచ్చి వెళ్ళిపోయింది. అంతవరకూ నాకూ తెలీనే లేదు తప్పంతా నాదేనని.

000

“తిక్క కుదిర్నాదా?”

సంద్రాలవేపు దిగులుగా చూసేను.

“వంటకాలమాట మాటాడుతుంటే చావుమాటెందుకొచ్చిందా అని ఆలోచిస్తున్నా.”

“నివ్వంటవు గెన్క చిన్నమ్మగోరిగ్గూడ అదీ మాటొచ్చీసినాది. ఏగూటి సిలక ఆగూటి పలుకే పలుకుతాదని తెల్దేటి నీకు.”

అవును. ఏదో మాటలసందర్భంలో ఒకమారు కాబోలు అన్నాను. సందర్భం చెప్పను కానీ ఏదో మాటలసందర్భంలో నాగురించి తనకి అనేక దురభిప్రాయాలు ఏర్పడ్డాయని తెలిసేక, ఒకసారి అన్నాను, “నేనుండగానే నీకేం సందేహాలున్నాయో చెప్పు, తరవాత నీకు ఎవరు చెప్తారు?” అని. అప్పటికింకా చిన్నతనం, 13, 14 ఏళ్ళుంటాయేమో. “నీకు చావు లేదు. నువ్వు ఎప్పుడూ ఇలాగే ఉంటావు,” అంది. ఆ తరవాతెప్పుడూ మాఇద్దరిమధ్యా చావుమాట రాలేదు. మళ్ళీ ఇదుగో, ఇప్పుడే. అఁచేతన్నమాట నేను ఉలిక్కిపడ్డాను.

మొదట్లో చెప్పినట్టు నాకేం బాధ లేదు కానీ ఈ రోజుల్లో ప్రతిమాటా “ప్రోత్సాహకరంగానూ, ఆనందపరిచేదిగానూ, ఉత్తేజకరంగానూ” ఉండాలి. ఎవరు గానీ ఎప్పుడు పోతానో అనగానే పదిమంది మొదలు పెడతారు, ప్రో .. ఆ … ఉ … వాక్యాలు. ఇంకా కొంత మెట్టవేదాంతం కూడా కలుపుతారు మరి కొందరు.

అంచేత మీతో అనడం మానేయగలను కానీ నేను చావుగురించి ఆలోచించకుండా ఉండలేను.

ఇందుకు నాచుట్టూ ఉన్న వాతావరణం కూడా దోహదం చేస్తోంది. నువ్వే చూడు. ఆరేళ్లప్పుడు ఈమాట వింటే ఏమీ అనిపించదు. అదేమిటో కూడా తెలీదు. ఇరవైఏళ్ళప్పుడు ఇంట్లో ఎవరో ఒకరు పోతే హృదయం బద్దలవుతుంది. యాభైలు వచ్చేసరికి ఈ పదం చాలామార్లే వినడం జరుగుతుంది. వైరాగ్యఛాయలు క్రమంగా మనసులో చోటు చేసుకుంటాయి. 80లు దగ్గర పడ్డాక అందులో వింత లేదనే అనిపిస్తుంది. కొందరుంటారనుకో అది అంగీకరించలేనివాళ్లు. కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే మాత్రం అన్ని నాటకాల్లాగే ఈ నాటకానికీ తెరపడుతుంది అన్న స్పృహ కలుగుతుంది. అంగీకరిస్తాం.

“నివ్వుండిపోతావేటి? నివ్వూ ఉండిపోవు, నానూ ఉండిపోను. అందరంవీ కొన్నాల్లుండి తరవాత పోతాం. అంతె.”

అదొక్కటే సత్యం.

000

(డిసెంబరు 5, 2016)

 

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

2 thoughts on “నువ్వుండిపోతావేంటి? (కథ)”

  1. చావు పుట్టుకలు రెండు సహజం.కానీ పుట్టుకని తీసుకున్న అంత ఆనందంగా చావుని ఎందుకు తీసుకోలేం అని ఆలోచిన్చేదాన్ని చిన్నప్పటి నుండి.పెద్దయ్యాక కొంచెం అర్థం అయ్యింది ఏమిటంటే …పుట్టినప్పుడు అందరు సంతోషపడతారు.చనిపోయాక అమ్మయ్య వీళ్ళు పోయారు అంతే చాలు అనుకోకుండా బతికితే చాలు.

    మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s