తాపత్రయం (పెద్ద కథ)

పక్కింటి రేడియోలోంచి ఏ.యం. రాజా కాబోలు పాడుతున్నాడు, “నల్లనిమీసం తెల్లబారినా చిల్లరకోరికలు చావవురా ..” తను మీసాలే ఉంచలేదు. అందుకే తనకి కోరికలే లేవనుకున్నాడు. చలిగాలికి పొడి ఆరిపోయిన పెదవులు కించిత్ చలించేయి నవ్వే యత్నంలో. ఒక నిట్టూర్పు వెలువడింది అప్రయత్నంగా. ఎందుకు తనకీ వేదన?

మమకారాలు

వద్దు వద్దనుకుంటూనే పెంచుకుంటాం.

వదిలించుకుంటున్నాం అనుకుంటూనే మరింత లోతుకి దిగబడతాం

కపిలతీర్థం రోడ్డుమీద కొంచెంసేపు తిరిగొస్తే మనసు కుదుట పడుతుందేమో అని చొక్కా తొడుక్కుని బయల్దేరేడు. వెనక్కి వస్తూ కోదండరామస్వామి ఆలయంలోకి తొంగిచూసేడు. పూలంగిసేవ కాబోలు జనం ధ్వజస్తంభంవరకూ బారులు తీర్చి ఉన్నారు. నిన్నా మొన్నటివరకూ అమ్మ “గుడికి వెళ్ళరా,” అంటే సరేనని బయల్దేరి సింహద్వారందగ్గిర ఆగిపోయేవాడు ఎవరో పగ్గాలేసి లాగినట్టు. “అదేమిటిరా?” అంటే “చెప్పులు పోతాయేమోనని,” అనేవాడు. ఇవాళ ఏ శక్తి తన్నిటు నడిపిస్తోంది? కొళాయిదగ్గర కాళ్ళు కడుక్కుని ప్రదక్షిణం చేసేడు, గుడి వెనకవేపు ఇద్దరు కుర్రాళ్ళు హలంతశబ్దాలు వల్లిస్తున్నారు. బాగా మాసిన అంగవస్త్రం కట్టుకు, నీటుగా పట్టెవర్ధనాలు తీర్చిదిద్ది వైష్ణవులఅబ్బాయి స్తంభం పట్టుకు ఊగుతూ, “మైకంలో ఉన్నాను, మన్నించాలి” అంటూ పాడుతున్నాడు. ఎవరో వృద్ధురాలితో వచ్చిన మూడేళ్ళ పసిపాప అతనిమొహంలోకి చూసి సిగ్గు పడుతూ ఆవిడచాటుకి వెళ్ళిపోయింది. శంకరం అప్రయత్నంగా చిరునవ్వు నవ్వేడు. ఆ ఇద్దరిమొహాలూ చూసి ఆవిడా నవ్వింది. ఒక్క క్షణం స్నిగ్ధమాధురి పారిజాతాల పరిమళంలా గుప్పుమంది. అది మరో ప్రపంచం! అక్కడ కల్పకం ఉంటుంది.

బాధగా అతనిహృదయం మూలిగింది. కల్పకం ఎవరు? ఇంట బుట్టిన తోబుట్టువా? కలిసి ఆడుకున్న బాల్యస్నేహితురాలా? వరసైన మేనత్తకూతురా? – ఏదీ కాదు.

అటువేపు మంటపంమీద ఎవరో స్వామి వేదాంతం బోధిస్తున్నాడు. “జగత్తు మిధ్య. మమకారాలు పతనానికి నాంది. కోరికలు చంపుకోండి. క్షణికసుఖాలకి లొంగిపోయి శాశ్వతమైన పరమపదం వదలుకోరాదు. నిత్యమైన శాంతి లభించేది నిశ్చల గుర్వంఘ్రియుగ్మగత చిత్తములకు …”

శంకరం గుండె తడుముకున్నాడు. అది అక్కడ నిశ్చలంగా స్థగితమై ఉంది. అప్రతిష్ఠ. ఎవరైనా వింటే ఏవగించుకుంటారు.

“సంసారబంధం తప్పించడానికి యత్నించేకొద్దీ బిగుసుకునే ఉచ్చు. అది తప్పించుకోగలిగినప్పుడే మోక్షం. గ్రహించుకోండి. ఎవరూ ఎవరికీ ఏమీ కారని తెలుసుకోండి. మనిషి పుట్టినప్పుడు ఏకాకి. మరణించినప్పుడు ఒంటరిగానే మరణిస్తాడు. ఎవరూ వెంట రారు – భార్య, తల్లి, బంధుమిత్రులూ … ఎవరూ శ్మశానందాటి రారు.”

శంకరం లేచి గర్భగుడివేపు నడిచేడు. దర్శనం ఇస్తున్నారు. కోదండరామస్వామి దివ్యమంగళవిగ్రహదర్శనంతో ఒక్క క్షణం మనసు పరవశించింది. ఏ బాధలూ, భయాలూ సోకని పవిత్ర ప్రదేశం అది. రాజసం ఉట్టిపడే ఆ రాతిబొమ్మ “నీకెందుకీ తాపత్రయాలు?” అని ప్రశ్నించినట్టయింది. అభయహస్తం, వరదహస్తం, కరుణారససమన్విత సుందరవదనారవిందం “నేనుండగా నీకెందుకీ ఆవేదన?” అన్నట్టయింది. అప్రయత్నంగా చేతులు జోడించేడు, “ప్రభూ! కల్పకం సుఖించాలి.”

వెనక్కి తిరిగి ఇంటికి వచ్చేశాడు. అన్నం తినాలనిపించలేదు. హోటలుకి వెళ్ళాలనిపించలేదు. పడుకుంటే నిద్ర పట్టలేదు. కల్పకం తన్ని నించోనియ్యడంలేదు, కూచోనియ్యడంలేదు. తీర్చలేని ఋణంలా పీక్కు తింటోంది. కల్పకం తనకేంవవుతుందని తనింత బాధ పడాలి? కల్పకం కనకేమీ బాకీ లేదు. ఎలాంటి ప్రమాణాలూ చెయ్యలేదు. …

కల్పకాన్ని చూసి ఎనిమిదేళ్ళవుతోంది.

తనవయసు ఐదు పదులు దాటింది.

ఇంతవరకూ తనకేమీ అక్కర్లేదనే అనుకున్నాడు.

“నేను పెళ్ళి చేసుకోను, నాకక్కర్లేదు,” అని తను మొరాయిస్తే, “మరి నీకేం కావాలిరా?” అని ప్రశ్నించిన తల్లికి జవాబు చెప్పనేలేకపోయేడు. అయినా పెళ్ళికి ఒప్పుకోలేదు.

“ఉన్న భవబంధాలు తెంచుకోండి అని వేదాలూ, ఉపనిషత్తులూ ఘోష పెడుతూంటే కొత్తవి సృష్టించుకోడం ఎందుకమ్మా?” అంటూ వచ్చేడు. అప్పట్లో తనకి ఎటు చూసినా అర్థం లేని జీవితమే కనిపించేది – కొంత కారణం – కొత్త టెర్లిన్ చొక్కా కుట్టిస్తే కానీ స్కూలికెళ్ళనని గోల చేసిన రవణ, డిసెంబరు పరీక్షల్లో తనకంటె పది మార్కులు ఎక్కువ వచ్చినందుకు పేపరు చూపించరా అంటే చుక్కల్లోకి చూస్తూ నడిచిపోయిన రవణ టిటెనస్ జ్వరంతో ఇరవై నాలుగ్గంటలు తిరక్కుండా చచ్చిపోయేడు. వాడి టెర్లిన్ చొక్కా, మార్కులూ, పొగరుగా చిన్నవాళ్ళని చావగొట్టే గుణం ఏవీ వాడిప్రాణాన్ని కాపాడలేదు. ఇప్పుడవన్నీ అర్థరహితంగా కనిపిస్తున్నాయి. పరీక్ష పాసయిన వాళ్ళలిస్టులో వాడిపేరూ పడింది. ఆస్పత్రిలో చూడ్డానికి వెళ్తే, “ఆఁ ఆఁ ..” అంటూ వాడు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంటే తనకి కడుపులో దేవినట్టయింది. “ఇంతేనా?” అనిపించింది. నిలబడలేక గిరుక్కున వెనుదిరిగి వచ్చేశాడు. ఇంటికొచ్చి తల్లిని పట్టుకు బావురుమని ఏడ్చేశాడు.

“ఇంకెప్పుడూ అలా ఆస్పత్రికెళ్ళకు,” అని చీవాట్లేసిందావిడ!

000

చిరాగ్గా ఉందని షర్టు విప్పి కుర్చీమీదకి విసిరేశాడు. కల్పకంతాలూకు స్మృతులు కూడా ఇలాగే విసిరేయగలిగితే …

బల్లమీద కల్పకం రాసిన కార్డు పడి ఉంది. తాను మద్రాసు వెళ్తున్నాననీ, వీలైతే గూడూరు స్టేషనుకి రమ్మనీ అరవంలోనే రాసింది. తనకి అరవం అంత బాగా రాదు. ఒక తమిళసోదరుడిని పట్టుకు చదివించుకున్నాడు. తరవాత తనే కూడబలుక్కుంటూ మళ్ళీ మళ్లీ చదువుకున్నాడు. ఏమిటో ఈ పిచ్చి …

మాగన్నుగా కునుకు పడితే కల్పకం కళ్ళలో మెదిలింది. ఎనిమిదేళ్ళక్రితం స్వంత పనిమీద ఢిల్లీ వెళ్తున్నాడు తను. కల్పకం రైల్లో కలిసింది. స్లీపరుకోచిలో ఎదురు సీటుమీద పట్టుమని పాతికేళ్ళేనా లేని కల్పకం ఆరేళ్ళకొడుకుని గుండెల పొదువుకుని బిక్కు బిక్కుమంటూ దిక్కులు చూస్తున్న కల్పకాన్ని చూస్తే తనకి జాలేసింది. అప్పట్లో జాలి అనే అనుకున్నాడు. బెజవాడ స్టేషనులో అడిగేడు కాఫీ కావాలా అని. కాఫీ అన్నమాట అర్థమయిందేమో, హార్లిక్స్ సీసా, డబ్బులూ తీసిచ్చింది కళ్ళతోనే కృతజ్ఞతలు చెప్పుకుంటూ. ఇంకేమేనా కావాలా అన్నాడు ఒకింత చిరాకుగానే. నోరు విప్పి మాటాడదేం?

“తెలుంగు తెరియాదు,” అంది.

తనే వచ్చీ రాని అరవం మాటాడి, కుర్రాడికి మాత్రం ఓ సాంబారు పొట్లం తీసుకున్నాడు. ఆ తరవాత మాటల్లో తెలిసింది – ఆ అమ్మాయికి పెళ్ళయి ఏడేళ్ళయింది. తండ్రి ఏదో చిన్న హోటల్లో కాలం గడుపుకుంటున్నాడు. ఇద్దరు అన్నగార్లు యస్సెల్సీ వరకూ చదువుకుని ఉద్యోగాల్లో ప్రవేశించేరు. ఏడేళ్లక్రితం తిరుత్తని గుళ్ళో కనిపించినవాడికి కట్టబెట్టేడు తంఢ్రి ఈపిల్లని. శోభనం రోజున చూసిన చూపులే, అతడు మళ్ళీ కనబడలేదు! ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నాట్ట. ఎప్పుడో తోచినప్పుడు ఓ ఉత్తరంముక్క రాస్తాట్ట – ఇంకా ఇల్లు దొరకలేదనీ, దొరికినప్పుడు రాస్తాననీ రాస్తాడు. గత ఏడేళ్ళలోనూ మూడుత్తరాలు రాసేడు. సరసుడే! శంకరానికి కోపం వచ్చింది. “వాడు మనిషేనా?” అన్నాడు రూక్షణంగానే, తెలుగులోనే.

“ఎన్నా?” అంది కల్పకం అసలే పెద్దవయిన కళ్ళు మరింత పెద్దవి చేసి.

“పెన్న” అన్నాడు తను విసుగ్గా.

“ఇప్పుడు ఏ ధైర్యంతో వెళ్తున్నావు?” అంటే, “ఇల్లు దొరికింద”ని ఉత్తరం వచ్చిందిట. అయితే మాత్రం ఇలా ఒక్కదాన్నీ పంపించేస్తారా? కళ్ళయెదుట లేని తండ్రిమీద కోపం తెచ్చుకున్నాడు. ఈ పిల్లకి చూస్తే నోట్లో నాలుక ఉన్నట్టు లేదు. అరవం తప్ప మరో భాష రాదు. పెళ్ళినాడు చూడ్డమే తప్ప ఆ మొగుడిమొహం మళ్ళీ చూడలేదు. గుర్తయినా పట్టగలదో లేదో. ఒక్కదాన్నీ ఇలా పంపడం ఎంత సాహసం!

“అప్పా వరతుకు పైసా ఆహుం,” అంది కల్పకం.

“ఓహో,” అన్నాడతను వేళాకోళంగా. మళ్ళీ తనకే సిగ్గేసింది. తనలా ఏ బాధ్యతలూ లేకుండా తిరగేవాడిదారి వేరు. నాలుగు వేళ్ళూ నోట్లోకి పోవడానికి ఏ పూటకాపూట తడుముకునేవారి దారి వేరు. రానూ పోనూ ఎంత లేదన్నా నూరు రూపాయలవుతుంది. ఎక్కడినుంచి వస్తాయి? అప్పిచ్చేవాడయినా తిరిగొచ్చే విధానం చూసుకునే కదా ఇస్తాడు.

“నువ్వొస్తున్నట్టు ఉత్తరం రాసేవా?” అంటే తలూపింది. అంతే.

మర్నాడు తను మీల్సు టికెట్టు తీసుకుంటూ కల్పకానికీ, ఆ కుర్రాడికీ కూడా రెండు కొన్నాడు. కల్పకం ఒణ్ణు పోరుం అంది కానీ ఒద్దనలేదు. ఒకింత చిరాకు కలిగింది క్షణంలో సగంసేపు. మరోగంట గడిచేసరికి కుర్రాడు తనతో చనువుగా కబుర్లు చెప్పడం ప్రారంభించేడు. వాళ్ళ మంచిచెడ్డలు చూడవలసిన బాధ్యత అంతా స్వయంగా స్వీకరించేడు.

ఇప్పుడాలోచిస్తే అదొక సినిమాలాగా తానొక ప్రేక్షకుడిలాగా అనుభూతి కలుగుతోంది. అప్పట్లో అదంతా సహజంగానే అనిపించింది. ఇదేమిటి అన్న సందేహం తనకి కలగనేలేదు. “అమ్మాయిని అత్తవారింటికి దిగబెడుతున్నావా?” అని అడిగిన ముసలావిడకి అవునని సమాధానం ఇచ్చేడు, ఆ ప్రశ్నలో ధ్వనిస్తున్న అభిప్రాయాలు ఆలోచించకుండానే.

“టికెట్ ప్లీజ్,” అని టికెట్టు అడిగినప్పుడు తనే కలగజేసుకున్నాడు. కలగజేసుకోవలసివచ్చింది. కల్పకంతండ్రి కుర్రాడికి కొనాల్సిన అరటికెట్టు కొనకుండా రైలెక్కించేసేడు. కల్పకం తనకేమీ తెలీదంది ఏడుప్మొహం పెట్టి. తల్లిని చూసి కొడుకు బావురుమన్నాడు. ఆ పాటకచేరీ ఏవఁత రసవత్తరంగా లేదేమో టికెట్ కలెక్టరు మాత్రం ఎక్సెస్ కట్టమని మొండికేసేడు. ఉద్యోగరీత్యా నెలకి ఇరవైరోజులు రైల్లోనే గడుపుతాడు అతను. ఇలాటి సంఘటనలు చాలానే చూశాడతను. తనకి మాత్రం కల్పకంకథ నిజమే అనిపించింది. అందుచేత టకెట్ కలెక్టరుకి కనీసమర్యాదలమీద ఘాటుగా లెక్చరిచ్చి, కుర్రాడి టికెట్టుకి డబ్బులిచ్చి, తన హృదయవైశాల్యాన్నీ సిసలైన హైందవ సాంప్రదాయాన్నీ ఋజువు చేసేడు.

“ఆ అమ్మాయికీ నీకూ ఏమిటి సంబంధం?” అని అప్పట్లో ఎవరైనా అడిగితే “మనిషికీ మనిషికీ ఉన్న సంబంధమే,” అని ఉండేవాడు. “నేను ఇవాళ ఈ ఆడకూతురిని ఆదుకుంటే రేపు మరొకరు మా ఆడవారిని కానుకుంటారు,” అని ఉండేవాడు చనువుగా ఉన్నవారైతే తమాషాకి. …

హఠాత్తుగా శంకరం ఉలిక్కిపడ్డాడు. తన ఆడవాళ్ళు … తనమటుకు తనకే విచిత్రంగా ధ్వనించిందామాట.

కల్పకందగ్గిర అతని ఆఫీసు ఎడ్రెసుంది గానీ ఇంటి ఎడ్రెసు లేదు. పంజాబీ పిండివంటలు కల్పకానికి పడవని మద్రాసీహోటలుకి తీసుకెళ్ళి భోజనం పెట్టించి ఆ తరవాత వాళ్ళని వాళ్ళహోటల్లో దింపి, తను ఆ భర్తగారి ఆఫీసుకి బయల్దేరేడు. పెద్ద పెద్ద పట్టణాల్లో ఒకరిగురించి మరొకరు చెప్పగలిగింది చాలా తక్కువ. “ఫలానావాడి ఇల్లెక్కడ?” “వాడికి పెళ్ళయిందా?” మొలైన విషయాలంతగా ఎవరూ పట్టించుకోరు.

శంకరం ఆఫీసు కనుక్కోగలిగేడు కానీ ఆ మొదలియారుని కనుక్కోలేకపోయేడు. కనిపించిన ప్రతివాణ్ణీ “నీకు ఫలానా మొదలియార్ని తెలుసా?” అంటూ అడుక్కుంటూ పోతే ఆఖరికి ఒకడు చెప్పేడు అతను రెండు రోజులుగా కనిపించడంలేదని. ఎందుచేత అంటే తనకి తెలీదనీ, వాళ్ల బాసుకి తెలియొచ్చనీ చెప్పేడు. ఆ బాసుని పట్టుకునేసరికి మరో రెండు గంటలయింది. ఆఖరికి తెలిసింది ఆ మొదలియార్ ఆఫీసుపనిమీద కలకత్తా వెళ్ళేడనీ, తిరిగొచ్చేసరికి వారంరోజులు పడుతుందనీ. ఆ వార్త మోసుకుని సాయంత్రం ఆరుగంటలకి హోటలుకి చేరుకున్నాడు. కల్పకం ఆర్నల్లుగా జ్వరపడ్డట్టు ఉంది. తను తీసుకొచ్చినమాట విని మూర్ఛ పోతుందేమో అనుకున్నాడు. హోరుమని గుండెలు బాదుకుంటూ ఏడ్చినా ఏం చెయ్యాలో తోచలేదు. తీరా శంకరం సంకోచిస్తూ అసలు విషయం చెప్పినప్పుడు కల్పకంలో ఏ విధమైన చలనం కనిపించలేదు. శంకరానికి ఒకవిధంగా కోపమే వచ్చింది. “వారంరోజులు ఎక్కడ ఉండడం? ఇప్పుడేం చెయ్యడం?” అన్న ప్రశ్నలే ఆ అమ్మాయికి తోచినట్టు లేదు. అదేదో సినిమాలో హీరోయిన్లా గదంతా కదం తొక్కలేదు. శంకరానికి ఒళ్ళు మండింది. కానీ ఏం చేస్తాడు? నోరూ వాయీ లేని ఈ అర్భకురాలినీ, వేలెడు పసివాడినీ ఆ అడవిలాటి ఊళ్ళో ఒంటరిగా వదలిపోవడానికి అతని మగతనపుఅహంభావం ఒప్పలేదు.

మర్నాడు మళ్ళీ ఆ ఆఫీసుకి వెళ్ళి కలకత్తాలో ఎడ్రెసు తీసుకుని ఒక టెలిగ్రాం ఇచ్చేడు రాజధానిలో కల్పకం దిగినట్టు. అది అందగానే ఆ భర్త రెక్కలు కట్టుకు వచ్చి ఢిల్లీలో వాల్తాడు అన్న అభిప్రాయంతో. అలా చేసి వచ్చేనని చెప్పినప్పుడు కల్పకం సరి అంది. అంతే. శంకరానికి మళ్ళీ కోపం వచ్చింది. అలా మళ్ళీ మళ్ళీ కోపం తెచ్చుకుంటూ, విసుక్కుంటూ, రుసరుసలాడుతూ వారం రోజులు గడపవలసివచ్చింది అతనికి. కల్పకంభర్త రానేలేదు. కల్పకం మాత్రం ఇదంతా నీ ఖర్మ అన్న ధోరణిలో నిశ్చింతగా ఉంది. వారంరోజుల్లోనూ కుర్రాడు బాగా చేరిక అయిపోయేడు. వాడి కాలక్షేపంకోసం, మరేం చెయ్యాలో తెలీకా శంకరం వాళ్ళిద్దరినీ రోజూ ఊరంతా తిప్పుతున్నాడు అవుతున్న ఖర్చు చూసుకోకుండా. ఒకమారు మాత్రం అంత డబ్బే అంది కల్పకం బిల్లు చూసి.

“మరి లేకపోతే ఏమిటనుకున్నావు. ఇలాటి పట్టణానికి మద్రాసునించి మూడు రూపాయల్తో దిగేవు. నేను చూడబట్టి సరిపోయింది. లేకపోతే ఏమయేదో తెలుసా! హుం. నిన్నని ఏంలాభం? మీనాన్నననాలి,” అన్నాడు శంకరం విసురుగా.

కల్పకానికి అర్థం అయిందో లేదో … జవాబు చెప్పలేదామె.

ఆ వారంరోజులూ మొదలియారుఆఫీసుచుట్టూ తిరగడం అతడి విధ్యుక్తధర్మం అయిపోయింది. ఆఖరికి ఎనిమిదోరోజున మొదలియారు దిగేడు. కాలరు పుచ్చుకు ఊచి లెంపకాయ కొడదాం అన్న కోరిక తీరకుండానే జరిగింది వివరించేడు శంకరం.

అంతా విని, “I’ve written to her I will be going to Kolkata,” అన్నాడతను భర్తగా తనధర్మం నిర్వర్తించిన తృప్తితో.

“హుఁ,” అన్నాడు శంకరం అసంతృప్తిగా. అదే నేనయితే … అని కూడా అనుకున్నాడు జరగనిది ఊహించుకుని ఆనందించే మనస్తత్వంతో.

ఆ సాయంత్రం మొదలియారు ఆఫీసునించి వస్తూ దారిలో కల్పకాన్నీ, కొడుకునీ సామానుతో సహా టాక్సీలో ఎక్కించి థాంక్సెలాట్ అన్నాడు శంకరంతో. కుర్రాడు మాత్రం శంకరంచెయ్యి పట్టుకు లాగుతూ రమ్మని మారాం మొదలెట్టేడు. టాక్సీలోకి సామాను మోసి అలుపు తీర్చుకుంటున్న శంకరం ఒక్క ఊపున వాడిని ఎత్తుకుని రెండు బుగ్గలమీదా ముద్దు పెట్టుకున్నాడు. మళ్ళీ అంతలోనే దింపేసి, టాక్సీవేపు ఒక తోపు తోసి, టాటా చెప్పేసి తనగదిలోకి వెళ్ళిపోయేడు. గదిలో అడుగెట్టగానే ఏఁవిటో బోసిగా అనిపించింది. ఇంట బుట్టిన ఆడబడుచుని అత్తవారింటికి పంపిస్తుంటే ఇలాగే అనిపిస్తుంది కాబోలు అనుకున్నాడు. .. కానీ …

000

… కానీ ఎదలో ముల్లయి తగుల్తున్నది … అదేమిటో తెలీడంలేదు. కల్పకం మాటవరసకైనా మీరూ రండి అనలేదు. ఒక్క పూట వచ్చి వాళ్ళింట్లో ఆతిథ్యం స్వీకరించవలసింది అని అర్థించలేదు. శంకరానికి ఉవ్వెత్తున కోపం వచ్చింది. ఆడవాళ్ళంతా ఇంతే. మగవాళ్ళు తమసేవలకోసమే పుట్టినట్టు పనులు చేయించుకుని అమాయకంగా మొహం పెట్టేసి చోద్యం చూస్తూ నిలబడిపోతారు.

మొదలియారు మాత్రం ఇంటిఎడ్రెసిచ్చి, “వీలయినప్పుడు రండి,” అని చెప్పేసి వెళ్ళిపోయేడు.

“ఎంత లక్షణంగా ఉందీ పిలుపు,” అనుకున్నాడు తను రూక్షణంగా.

000

రెండు రోజులనాడు తనపనంతా అయిపోయేక టెకెట్టు కొంటుంటే కల్పకాన్ని మళ్ళీ చూడకుండా ఢిల్లీ వదలడం కష్టం అని తట్టింది. ఈ రెండురోజుల్లోనూ తనేం చేస్తున్నా, ఏం మాటాడుతున్నా నేపథ్యసంగీతంలా కల్పకంనీడ ఎదలో మెదుల్తుంటే అదంతా అలవాటులో పొరపాటనీ, కర్ర వంకర నిప్పు తీర్చినట్టు దైవం గీచిన గీటు కాలమే చెరుపుతుందనీ అనుకున్నాడు.

తప్పేముంది పదిరోజుల సాహచర్యం, ఒక్కమారు చూసి రావాలనీ, కాపురం ఎలా ఉందని అడగాలనీ ఎవరికి మాత్రం అనిపించదు … కల్పకంతండ్రికి వివరాలు చెప్పొచ్చు కూడాను, పైగా ఆవిడఅన్నగారయితే మళ్ళీ చూడడా … అని శతవిధాల తనకి తనే నచ్చచెప్పుకుంటూ, అలా చెప్పుకోవలసిన అగత్యం ఏమీ లేదనుకుంటూ వాళ్ళయిల్లు చేరుకున్నాడు.

తను అక్కడికి వచ్చేసరికి కల్పకం, కొడుకు నీటుగా ముస్తాబయి బయల్దేరడానికి సిద్ధంగా ఉన్నారు. తన్ని చూడగానే “మామా, మామా,” అంటూ కుర్రాడు పరిగెట్టుకు వచ్చేడు. కల్పకం సందిగ్ధంగా “రండి,” అంది గుమ్మానికి అడ్డంగా నిలబడి. సినిమాకి వెళ్తున్నారుట. మొదలియారు లోపలినుంచి వచ్చి హలో చెప్పి, కమిన్ అనేలోపున శంకరమే మాటాడేడు, “సినిమాకి వెళ్తున్నారు కాబోలు. వెళ్ళండి. నేను రాత్రి డిలక్సులో ఊరికి పోతున్నాను. చూసి పోదామని వచ్చేను,” అన్నాడు తనకోసం అక్కడ ఎవరూ బెంగ పెట్టుకోలేదని గ్రహించినవాడై.

మొదలియారు కొంచెం ఆలోచించి, “మీరు కూడా సినిమాకి వస్తే బాగుండేది. కాఫీ అయినా ఇవ్వలేదు,” అన్నాడు.

శంకరం ఫరవాలేదని చెప్పి అక్కడినించి వచ్చేసేడు. అతనికి జీవితంలో మొదటిమారు తనమీద తనకే చిరాకు కలిగింది. తనమనసు దేనిని ఎదురు చూసిందో, తానెందుకు నిస్పృహ చెందాలో తనకే అర్థం కాలేదు.

000

‌‌శంకరం లేచి, చొక్కా తొడుక్కుని వీధిన పడ్డాడు. బజారులో అప్పుడే దిగిన ఆపిల్ పళ్ళు చూడగానే గుళ్ళో పాప జ్ఞాపకం వచ్చింది. ఒక్క క్షణం మనసు రెక్కలు విప్పుకుంది. ఒక పండు కొని, జేబులో వేసుకుని గుడివేపు నడిచేడు. తన్నెవరో తోసినట్టయి. పడబోయి, నిలదొక్కుకుని చూసేవేళకి రిక్షా ముందుకి సాగిపోయింది రోడ్డుమీద. తనే ఎన్నోమార్లు అనుకున్నాడు – ఈఊళ్ళో రిక్షావాళ్ళు గంట కొట్టరు, కొట్టినా ప్రజలు వినిపించుకోరు, అంచేత వీలైనంతవరకూ రిక్షావాడు తనే రిక్షాని తప్పిస్తూ, వీలు కానప్పుడు జనాల్ని చేత్తో పక్కకి తోసేస్తూ సాగిపోతాడు అని. అలా తోసినందుకు జనాలు కోపగించుకోరు కూడాను. ఇవాళ తనకీ అదే మర్యాద జరిగింది. అయినా ఇంత చిన్నవిషయంలో తనలో ఇంత పరధ్యానం, అంతకు రెట్టింపు చైతన్యం తీసుకురావడమే విచిత్రం!! ఆ పాపకోసం తనకెందుకింత ఆతృత?

జవాబు దొరకలేదు. ఆ పాప తనదగ్గిరికి రాకపోతే? తానిచ్చిన పండు తీసుకోకపోతే? … మ్. తనే తింటాడు. అవును. ఆ పసిదానిమీద తనకెలాటి మమకార వికారాలూ లేవు. ఈ క్షణంలో భగవంతుడు ప్రత్యక్షమై, “నీకేం కావాలి? కోరుకో,” అంటే తను … శంకరం గుండెమీద చెయ్యేసుకున్నాడు. ఆలోచించకూడదు. కూడని ఆలోచన వచ్చినప్పుడు అణిచివేయాలి. అతను నడక వేగం హెచ్చించేడు. .. ఇవాళ పాప రాదేమో. లేదు. వస్తుంది. రోజూ వస్తుంది. పదిహేనురోజుల్నించీ చూస్తున్నాడు. రోజూ వస్తోంది. ఇవాళ ఆ ముసలావిడ కాకుండా మరెవరైనా పడుచుపిల్ల వస్తే? … అయితే మటుకేం? తనేం తప్పు చేయబోవడంలేదే! తనేం కొట్టబోతాడా? తిట్టబోతాడా? పసిపిల్లచేతిలో ఓ పండు పెడితే తప్పేం? కాదు. చూసినవాళ్ళేం అనుకుంటారు? పైగా ఆ పడుచావిడకి తెలియకపోవచ్చు అసలు కారణం. అపార్థం చేసుకోవచ్చు. అవును. అందుచేత ఆ పండు తీసుకు గదికి వచ్చేసి …

పాపని చూస్తుంటే ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. ఎందుకనో! చాలా ఆత్మీయంగా అనిపిస్తుంది. మళ్ళీ కల్పకంపోలికలు కూడా లేవు. కల్పకంమొహం కోలగా ఉంటుంది. పాపమొహం గుండ్రంగా ఉంటుంది. కల్పకం నలుపు. పాప గులాబీరంగు, పెద్ద బుగ్గలు, నవ్వితే ఆ బుగ్గలమీద చక్కని సొట్టలు పడతాయి. .. ఛీ, ఛీ .. ఏమిటీ వెర్రి? తను ఎంతమంది ఆడపిల్లల్ని చూడలేదు? ఎంతమంది ఆడపిల్లల తండ్రులు తనకి వలలు పన్నడానికి ప్రయత్నించలేదు? అందర్నీ అలవోకగా తప్పించుకుని నవ్వుకున్న తను .. తనకిప్పుడు ఎందుకింత తాపత్రయం ఒక మనిషిపట్ల? ఎందుకీ తలమునకలు?

కల్పకం మాటవరసకైనా భోజనానికి రమ్మనలేదు. కాఫీ అయినా ఇవ్వలేదు. ఐదు నిముషాలపాటు నిలబడి మాటాడే ఓపిక లేనట్టు ప్రవర్తించింది ఆరోజు.

“ఒకరికి పెట్టడానికి చేతుల్రావు,” అని టైటిలు పుచ్చుకున్న తను వెనకా ముందూ చూడకుండా చేతనున్న రిస్టువాచీ తెగనమ్మి ఖర్చు పెట్టి, అరవచాకిరీ చేసేడు ఆపిల్లకి. ఏనాటి ఋణమో వసూలు చేసుకుంటున్న మార్వాడీలా చూస్తూ నిలబడిపోయింది – తనేదో మహారాణీ అయినట్టూ, అతనేమో భృత్యుడయినట్టూ సేవలు చేయించుకుంది. అంతే గానీ “నువ్వెంత మంచివాడివి,” అని మాట మాత్రం అన్లేకపోయింది.

000

‌‌‌శంకరం గుడి చేరేసరికి అప్పుడే తెర తీసేరు. క్యూలో నిలబడిన జనం మెల్లిగా కదలసాగేరు. అంతసేపూ అటూ ఇటూ పరుగులు పెడుతున్న పిల్లలు పెద్దలపక్కకి చేరుతున్నారు. శంకరం కళ్ళు పాపకోసం వెతకసాగేయి. క్యూలో ముందున్నవాళ్ళు కాబోలు దర్శనాలూ, ప్రదక్షిణాలూ ముగించుకుని వస్తున్నారు. అధ్యాత్మరామాయణ కీర్తనలు పాడుకుంటున్న వృద్ధురాలు అతన్ని చూసి నవ్వింది. శంకరం కూడా నవ్వుతూ జేబులో ఉన్న ఆపిల్ పండు తీసి “ఇంద,” అన్నాడు పాపతో. పాప ఆ పండువేపు ఆశగా చూస్తూ ఒంటికాలిమీద నిలబడి అవ్వచాటునించి చూడసాగింది. ఆవిడ పాపని ముందుకి తోసి “తీసుకో” అంది. పాప ఇంకా ముడుచుకుపోయింది.

“కొత్త కదా, సిగ్గు,” అందావిడ.

శంకరం కూడా, “కాదండీ మరి,” అంటూ తనే మరో అడుగు ముందుకి వేసి పండు పాపచేతికందించేడు.

“ఎక్కడ మీయిల్లు?” అంది వృద్ధురాలు మాట కలుపుతూ.

శంకరం సగం సగం నట్టుతూ జవాబులు చెప్పి, పాపబుగ్గమీద చిన్న చిటిక వేసి, ముందుకు సాగుతున్న క్యూలో కలిసిపోయేడు.

ఆ రాత్రి అతడి మానసికాశంలో సన్నని, అతి స్వల్పమయిన వెలుగురేఖ పొడమింది. ఒక దివ్యానుభూతితో అతడిమనసు మూగవోయింది.

అప్పట్నుంచీ రోజూ గుడికెళ్ళడం, పాపకి పిప్పరమెంట్లో, బిస్కెట్లో ఇవ్వడం అలవాటు చేసుకుంటున్నట్టు శంకరం అనుకోలేదు. తాను యదాలాపంగానే పిప్పరమెంట్లు కొంటున్నట్టూ, కాలక్షేపానికే గుడికెళ్తున్నట్టూ, గ్రహపాటునే పాప తనకి తారసపడుతున్నట్టూ నమ్మేడు. ఒకరోజు పాపతో వృద్ధురాలు కాక ఒక గృహిణి వచ్చింది. మరొకరోజు పాప రాలేదు. ఆ రెండు రోజులూ ఛాతిదగ్గర ఎడంవేపు కొంచెం నొప్పెట్టింది. ఎందుకో అతనికి అర్థం కాలేదు. రెండోరోజు తనమీద తనకే చిరాకేసింది.

తృళ్ళిపడ్డాడు.

నిజమేనా?

ఇలా పడుతూ, లేస్తూ,

తనకన్నీళ్ళు తనే తుడుచుకుంటూ

పొరపాటు పడుతూ,

తిరగరాసుకుంటూ ..

ఎంత కాలం?

అప్పుడూ ఇంతే …

ఇంతే అయింది.

తను క్షణం తరవాత క్షణం, రోజు తరవాత రోజు, నెల తరవాత నెలా ఎదురు చూసేడు. కల్పకం తప్పకుండా ఉత్తరం రాస్తుందనుకున్నాడు. ఆవిడ రాయవలసిన ఉత్తరాలు తనే కంపోజు చేసుకున్నాడు.

కల్పకం రాయలేదు. కాకమ్మచేతనైనా కబురంపలేదు తను క్షేమమేనని. శంకరం భరించలేకపోయేడు. భరించడం తప్ప మరేం చెయ్యలేకపోయేడు. మద్రాసెళ్ళి లజ్ కార్నరులో నిలబడి సిగరెట్టుమీద సిగరెట్టు కాల్చేడు. పాండీబజారులో వరసగా హోటలుతరవాత హోటలుకెళ్ళి కప్పుమీద కప్పు కాఫీ తాగేడు. సాయంత్రం నాలుగు గంటలకి కళ్ళు తిరిగినట్టయింది. హైహీల్సు టకటకలాడించుకుంటూ పోతున్న ఓ ఆంగ్లో ఇండియన్ యువతిమీద తూలిపడ్డాడు. ఆవిడ “యూ బ్రూట్,” అని కసిరి, గౌనుమడతలు సరి చేసుకుంటూ పక్కకి తప్పుకుంది.

ఛీ, ఏమిటీ వెర్రి? శంకరం మళ్ళీ బస్సెక్కి ఇంటికొచ్చి తనగదిలో మంచంమీదికి ఒరిగేడు.

000

మర్నాడు మధ్యాహ్నానికి మనసు తేలిక పడ్డట్టనిపించింది. కానీ మళ్ళీ అరగంటైనా కాకుండానే ఏమీ తోచకపోడం మొదలయింది. పత్రిక తీసినా, పేపరు చూసినా, ఆఖరికి శంకర్స్ వీక్లీలో కార్టూన్లు కూడా నవ్వించలేకపోయేయి … తనని తనే తిట్టుకున్నాడు. కల్పకం తనకేమవుతుందని తనింత బాధ పడాలి? ఆమె తనకేవిధమైన వాగ్దానాలూ చెయ్యలేదు. అసలింతా చేస్తే తనకి కల్పకంతో ఉన్న పరిచయం ఏపాటిది కనక? ఎవరైనా వింటే నమ్ముతారా? నవ్వుతారు. ఈ కాకమ్మకబుర్లు నాదగ్గర చెప్పకంటారు. కానీ తన వ్యాకులతకి కారణం కల్పకమేనని మనసు పదే పదే చెబుతోంది.

శంకరం క్రమంగా నీరసించిపోయేడు. కళ్ళలో కాంతి తరిగింది. పరిచయస్తులు, “ఏం? ఒంట్లో బాగులేదా?” అని పరామర్శలు మొదలెట్టేరు. ఆప్తులు “అలా అయిపోతున్నావేమిటి?” అంటూ సానుభూతి వెలిబుచ్చుతున్నారు. స్నేహితులు “క్షవరం చేసుకోడం మానేసేవేమిటి?” అనడగుతున్నారు. “మొక్కా?” అని పృచ్ఛించేరు ఇంకొందరు.

“అవును,” అన్నాడు శంకరం. అని కొండమీదికి బస్సు ఎక్కేసేడు.

కొండమీద నెలరోజులున్నాడు. అతడికళ్ళకి అదొక ప్రపంచంగా భాసించింది. కల్యాణకట్టదగ్గర తన కేశసంపదతోపాటు అనేకానేక ఈతిబాధల్ని కూడా దులిపేసుకుని, “అమ్మయ్య” అనుకుంటున్న జనాన్ని చూస్తుంటే తనకి తెలియకుండానే కాళ్ళు అతన్ని అటువేపు తీసుకుపోయేయి. ఆ క్షణంలో ఎవరైనా ఎదురుపడి, “అదేమిటి? నీకు ఇటువంటి బాహ్యాడంబరాలలో నమ్మకంలేదు కాబోలునే,” అంటే, “ఆఁ, ఏ సెలూనయితేనేం?” అని ఉండేవాడు మనసు కాదు, కాదంటూన్నా. కానీ ఆ క్షణంలో అతనిచేత అలా అబద్ధం పలికించడానికి అక్కడెవరూ లేరు.

గోవిందనామాలు స్మరిస్తూ పుష్కరిణిలో మునకలేస్తున్న జనాన్ని చూస్తూ ఓ మునుగు ములిగేడు. తిరిగి తిరిగి ఆలయప్రాంగణంలో అడుగు పెడుతూంటే క్రమంగా మనసులోని తమసు విచ్చిపోతున్నట్టనిపించింది. కొంచెంసేపు మండపంలో కూర్చున్నాడు. చీమగంగాయాత్రలా సాగున్న క్యూని చూస్తూ. ఎప్పుడో ఎక్కడో చదివిన గీతం జ్ఞాపకం రాసాగింది.

చిన్నిపదం

చిట్టి పదం

పొట్టి పదం

పాపి పదం

పరమ పదం

చక్కటి నేర్పరి అయిన నటిపాదాల్లాగ అంత లయబద్ధంగా ఎలా కూర్చగలిగేడో కవి! … అతనిదృష్టి గోపురంవేపు మళ్ళింది.

ఎగసి ఎగసి ఏసీమల చేర్చునవో

ఎగసి ఎగసి ఏదర్శనమిచ్చునవో

గోవిందా! గోవిందా!

శంకరం తృళ్ళిపడ్డాడు. ఒక్కక్షణంక్రితం కలిగిన దివ్యానుభూతి జన్మజన్మలా మరువలేనిది.

000

శంకరం హఠాత్తుగా మారిపోయేడు. సూట్లూ, సిగరెట్లూ, కాఫీ – అన్నీ మానేసేడు. తిరపతిలోనే స్థిరపడిపోయేడు. వ్యాపారం నామమాత్రం అయిపోయింది. స్నేహితులూ, చుట్టాలూ – అందర్నీ వదిలేశాడు. “క్షేమం తెలియజేస్తూ ఓ కార్డుముక్క రాసి పడెయ్యరా దౌర్భాగ్యుడా!” అంటూ వృద్ధురాలయిన తల్లి ఏడుస్తూ రాసిన పది పేజీల ఉత్తరం ముక్కలు ముక్కలుగా చింపేసి, “ఈనాటితో ఈ బంధం కూడా సరి,” అనుకున్నాడు.

సంవత్సరాలు గడుస్తున్నాయి. ఒకరూ ఒకరూ స్నేహితులు కూడసాగేరు. కదాచితుగా సినిమాలు చూస్తున్నాడు. ఒకొక్క సినిమాలో హీరోయిన్ ఆడిన మాట, చూసిన చూపు కల్పకాన్ని జ్ఞప్తికి తెస్తే, శ్మశానవైరాగ్యంలాటి “తెలుగుసినిమా వైరాగ్యం” కలిగి, ఇక సినిమాలకి వెళ్ళకూడదు అనుకున్నాడు. బిక్కుబిక్కుమంటూ తనని చూసిన తమిళపడుచు కల్పకానికీ, పసితనపు అమాయకత్వంతో నవ్వులు వెదజల్లుతున్న ఈ తెలుగుపాపకీ ఎక్కడా పోలికలు లేకపోయినా ఎందుకో పాపని చూస్తే తనమనసు రంజిల్లుతూంది.

“ఏమిటి భగవాన్,” అని ఎప్పుడేనా అనుకున్నా మళ్ళీ అప్పుడే మరిచిపోతున్నాడు. తనని సందుమలుపులో చూస్తూనే “మామా, మామా,” అంటూ చేతులు చాచి వచ్చేపాపని ఎగరేసి పట్టుకు హృదయానికి హత్తుకుంటాడు. తనచెంప పాపచెంపకి ఆనిస్తే పాప మూతి గుండ్రంగా పెట్టి “గుత్తుకుంతోంది,” అంది ఓసారి అతని చేతుల్లోంచి కిందకి జారిపోతూ. శంకరం నవ్వుతూ గడ్డం తడుముకున్నాడు. రెండు రోజులైంది క్షవరం చేసుకుని. ఆరోజునించి సొంత క్షవరం దినచర్య అయిపోయింది. పాపని చూడనిరోజు అతడికి శిక్ష. అప్పుడూ అప్పుడూ మద్రాసు వెళ్తివస్తున్నాడు. వచ్చినప్పుడు పాపకి ఏదో ఒకటి తేకుండా ఉండడం లేదు. పాప తల్లిదండ్రులు మొదట్లో ఒప్పుకోకపోయినా క్రమేణా అదొక సామాన్యమైన విషయంగా ఊరుకున్నారు. ఒకొకప్పుడు ఏ పార్కుకో, సినిమాకో తీసుకెళ్తున్నాడు.

000

అర్జెంటుపనిమీద మద్రాసెళ్ళి రెండురోజులు ఆలస్యంగా వచ్చేడు. రైలు దిగుతూనే తిన్నగా ఆలయానికి వెళ్ళేడు. పాప కానీ పాపతో వచ్చే ముసలావిడ కానీ కనిపించలేదు. వాళ్ళ పక్కింటికుర్రాడు కనిపించి, పాపకి రెండురోజుల్నించీ జ్వరంగా ఉందని చెప్పేడు. శంకరం చేతిసంచీతో ఉన్నపాళంగా ఉరుకులూ పరుగుల్తో వాళ్ళిల్లు చేరుకున్నాడు. అతన్ని చూస్తూనే పాప “మామా” అఁటూ కాళ్ళ చుట్టేసింది. శంకరం వంగి పాపని ఎత్తుకుని హృదయానికి హత్తుకున్నాడు. కళ్ళు చెమ్మగిల్లేయి. “ఏనాటి ఋణఆనుబంధమో,” అనిపించింది పాపతండ్రికి. పాపని శంకరంచేతిలోంచి తీసుకోడం కష్టమే అయింది. ఆయన శంకరానికి నచ్చచెప్పి బలవంతాన ఇంటికి పంపించేడు కొంచెం విశ్రాంతి తీసుకురమ్మని.

గదికొచ్చి తాళం తీసేసరికి కల్పకం రాసిన కార్డు కనిపించింది. గుండెలమీద ఎవరో బలంగా తన్నిట్టయింది. చొక్కా వేసుకుని గబగబా నాలుగు వీధులు పిచ్చిగా తిరిగేడు. కోదండరామస్వామి ఆలయానికి వెళ్ళేడు. సెకండ్ షో సినిమాకి వెళ్ళేడు. రాత్రి రెండుగంటలకి ఇల్లు చేరి పక్కమీదకొరిగేడు. …

పొద్దున్న తొమ్మిదయింది లేచేసరికి. బల్లమీద కార్డు గాలికెగిరి కిందపడి ఉంది. తీసి బల్లమీద పెట్టేడు. ఓ గంటతరవాత శంకరం నీటుగా ముస్తాపయి స్కూటరెక్కి గూడూరు బయల్దేరేడు. “పాపం, ఆడపిల్ల. చూడాలని ఉందని రాసింది. ఒకమారు చూసి వస్తే ఏం పోయింది. తను మాత్రం ఇన్నాళ్ళూ ఉత్రం రాయలేదేం అని అడక్కూడదు. అసలు తను ఏమీ మాటాడడు. కుర్రాడికి మాత్రం పళ్ళు పట్టుకెళ్ళాలి. ఇప్పుడెంత పెద్దవాడై ఉంటాడో … వాడితరవాత ముగ్గురు పిల్లలని రాసింది. అవును మరి. ఎనిమిదేళ్ళు! Past is past అని ఎవరైనా ఎలా అనుకోగలరు? అర్థం లేనిమాట. గతం ఎంప్పుడు వెన్నంటే ఉంటుంది. లేకపోతే ఖచ్చితంగా మర్చిపోయాడనుకున్న కల్పకం తన్నిలా ముక్కున తాడోసి లాక్కెళ్ళగలదా? …

అబ్బో! గూడూరు తిరపతికి దూరఁవే!

అందరూ రైళ్ళు ఆలస్యంగా వస్తాయంటే తను నమ్మలేదు కానీ నిజఁవే.

అయినా లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేసింతరవాత కూడా ఇవి బాగుపడలేదూ, హాచ్చెర్యమ్ ..

శంకరం చిరచిరలాడుతూ అడిగే ప్రశ్నలకి ఏయస్సెమ్‌కి విసుగేసింది.

“చూడండి సార్. ఢిల్లీనించి మద్రాసు పోయేబండీ ఇట్నుంచే వస్తాది. మీకు కాచుక్కూచునే ఓపికలేకపోతే ఈపట్టాలంటే నడిసిపోండి. బిట్రగుంటకాడ క్రాసింగు అవుతాది,” అన్నాడతను.

“ఆహా, అలాగా!” అన్నాడు శంకరం అంతకంటే రోషంగా.

000

కల్పకం ఒళ్ళు చేసింది. ఛాయ కూడా వచ్చింది. ఆడపిల్లలు ఇద్దరూ తండ్రి పోలిక. చిన్నవాడు మాత్రం తల్లిమూసలో పోసి తీసినట్టున్నాడు. వాడి అల్లరి పట్టశక్యం కాకుండా ఉందిట. తండ్రితో ఆఫీసుకి బయల్దేర్తాట్ట. అన్నతో స్కూలికి పోతానంటాట్ట. ఆడపిల్లలు ఆడుకుంటుంటే వాళ్ళబొమ్మలు వీధిలోకి విసిరేస్తాట్ట.

‌శంకరం నవ్వి, “పిల్లలంతే మరి,” అన్నాడు.

“వీనిమాదిరి రాక్షసున్ని ఎక్కడ చూడలేదు,” అంది. ఆవిడ తెలుగు నేర్చుకుంది. ఇరుగుపొరుగు అంతా తెలుగువాళ్ళేనట. హిందీ కూడా వచ్చేసిందిట. తను చాలా గడుసుదనం నేర్చుకుందని ఆయన దెప్పుతూంటాట్ట. ప్రమోషనొచ్చిందిట. క్వార్టర్సు కూడా ఇచ్చేర్ట. తను కూడా ఉద్యోగంలో చేరాలనుకుంటోందిట. అక్కడ అందరూ చాలా మంచివాళ్ళుట. తను లేకపోతే ఆయనకి నిండా కష్టం అయిపోతుందిట. అందుకే ఇన్నిదినాలు ఇంటికి పోలేదుట. ఇప్పుడు తండ్రికి సీరియస్‌గా ఉందని తెలిసి వెడుతోందిట. తనకి తండ్రి ఈ పెళ్ళి చేసిననప్పుడు అందరూ తండ్రిని హింస పెట్టేర్ట ఎక్కడో పదివేల మైళ్ళదూరంలో ఉన్నవాడికిచ్చి చేస్తున్నావని. “ఇప్పుడు చూస్తే అందరూ నిండా సంతోషం అవుదురు,” అంది. “అప్పా సేసింది ఎప్పుడూ నల్లదే అవును,” అంది.

రైలు కదిలింది. మద్రాసువేపు సాగిపోతున్నబండిని చూస్తూ నిలబడిపోయిన శంకరాన్ని, “అదేవిట్రా? అలా ఉన్నావు?” అని ఓ పాతస్నేహితుడెవరో పలకరించేవరకూ తేరుకోలేదు. “ఏమిటి సంగతి? బొత్తిగా మాయమయిపోయేవు. చాలా చిక్కిపోయేవు. జబ్బు పడ్డావేమిటి?” అంటున్న మిత్రుడిని వెర్రిగా చూశాడు శంకరం. కల్పకం ఒక్కమాట కూడా అలాటిమాట అనలేదు!

అతనికి భయమేసింది మరొక నిముషం అక్కడుంటే బావురుమని ఏడ్చేస్తాడేమోనని. “ఏం లేదు. మళ్ళీ కలుస్తాలే,” అని విదిలించుకుని వచ్చి స్కూటరుదగ్గర నిలబడితే పాప జ్ఞాపకం వచ్చింది. ఎలా ఉందో? అసలు రాత్రే తనని వదిలిపెట్టలేదు. .. మళ్ళీ తనకోసం అడిగితే? … ఒకవేళ జ్వరం ఎక్కువైతే … ప్రమాదిస్తే …

స్కూటరుమీద ఒక్క ఉదుటున ఎగిరి కూచుని ముందుకి తోసేడు. … తొందరగా … ఇంకా తొందరగా … ఇంకా .. ఇంకా  తొందరగా .. పాపకి ఎలా ఉందో …

పిచ్చి స్పీడుతో స్కూటరుమీద పోతున్న శంకరాన్ని ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపేడు, “ఏటయ్యా సూస్తే సదూకున్నోడిలా ఉన్నవు. ట్రాఫిక్కురూల్సులు తెలీవూ?” అంటూ.

000

(ఆంద్రజ్యోతి ఆదివారం సారస్వాతానుబంధం, డిశంబరు 13, 25 తేదీలలలో వారాలు ఋణానుబంధం అన్నపేరుతో ప్రచురితం. నా దగ్గరున్న tearsheet మీద తేదీలు, నెల ఉన్నాయి కానీ సంవత్సరం లేదు! సుమారుగా 60వ దశకం చివర అనుకుంటాను.)

(డిసెంబర్ 7, 2016)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

3 thoughts on “తాపత్రయం (పెద్ద కథ)”

 1. “మమకారాలు
  వద్దు వద్దనుకుంటూనే పెంచుకుంటాం.
  వదిలించుకుంటున్నాం అనుకుంటూనే మరింత లోతుకి దిగబడతాం”

  మీ పై మాటలకి నాదొక చిన్న పొడిగింపు:
  ఒకటి వదిలించేసుకుని – ఇంక తెంచుకోవాలి అనుకుంటూ ఆ ఒకటితో పాటు- ఇంకొకటీ కూడా హెచ్చవేసి పెంచుకుంటాం

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 2. నిదతవోలు మాలతి గారికి, తాపత్రయం/ ఋణాను బందంలో పాత్రల వ్యక్తీకరణ అద్భుతం. సమయం, సందర్భం దొరికితే ఈ కధను తమిళంలో అనువదించాలని అనుకుంటున్నాను. మీ అనుమతి కావలసి ఉంది. tkgowri@gmail.com
  ఇలాంటి కమ్మని తెలుగు చదివి చాలా రోజులయ్యింది.

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s