వంటింటి సంబరాలు – 2

నావంతుకి సంకురాత్రి సంబరాలు కూడా ఇవే అనుకోండి. కిందటేడు నా వంట చిట్కాలు కొన్ని చెప్పేను కదా. ఇప్పుడు మరో రెండు సుళువులు చెప్పాలనిపించి మొదలు పెట్టేను.

మొదటిది కాలానుగుణంగా పీచా.

మీరంతా పీజ్జా అని రాస్తారు కానీ నిజానికి ఆ పదం పలుకు తీరు పీట్చా అనే. అందులో కూడా టా స్పష్టంగా పలకడం ఉండదు. అంచేత నేను మాత్రం పీచా అనే రాస్తాను. మీకు కావలిసినట్టు మీరు మార్చుకోవచ్చు. ఇక్కడికి ఉచ్చారణ పాఠం సరి.

Pizza on naan.ఇప్పుడు ఎలా చెయ్యాలో చెప్తాను. సుళువులయుగం కనక తేలిగ్గా crust కి నేను English muffin కానీ మన నాన్ కానీ వాడతాను.

మిగతా సరంజామా

dsc00335టొమెటో పేస్ట్ – పీచా సాస్ అని అమ్ముతారు కానీ అందులో నీరెక్కువ అంచేత నాకు నచ్చలేదు. నేను టొమెటో పేస్టు కొని అందులో రెండు వెల్లుల్లి రెబ్బలు సన్నగా తరిగో, మెత్తగా దంచో కలిపేస్తాను. Oregano పొడి చిటికెడు కలపితే సిసలైన పీచా రుచొచ్చేస్తుంది.

సన్నగా తరిగిన ఉల్లిపాయ

పల్చగా చక్రాల్లా తరిగిన టొమెటో

ఇంకా వంకాయ, broccali, zuccini, mushrooms, Bell pepper, ఇలా ఏవైనా వేసుకోవచ్చు.  నాన్ మీద చిక్కగా టొమెటో పేస్టు అద్ది, మీకిష్టమైన కూరలు, ఉల్లిపాయ, టొమెటో ముక్కలు పరిచి,

dsc00337వాటిమీద Mozzarella, Parmazan cheese ఒత్తుగా పరిచి, కావలిస్తే కొంచెం ఎండుమిరిపకాయలప్పొడి కూడా చల్లి

dsc00338పది నిముషాలపాటు విద్యుత్ పొయ్యిలో పెట్టేడయమే. నేను Toaster-oven వాడతాను కాల్చడానికి. కాల్చడం అని ఎందుకంటున్నానంటే, ఒకసారి కొత్తగా ఇండియానించి వచ్చిన ఒకాయన దాన్ని దిబ్బరొట్టెతో పోల్చేరు. అంతే పీచా కథనం.

పండుగ రోజులు కనక తీపి పదార్థం కూడా చెప్తాను.

నాపద్ధతిలో మైసూరుపాకుకీ బొప్పాయికాయ హల్వాకి ఒకటే పద్ధతి. .

mysorepakమామూలుగా మైసూరుపాకు చేయడంలో అతికష్టమైనది పాకం పదును చూసుకోడం. చాలావరకూ మీవంటప్రావీణ్యం ఈ పాకంమీదే ఆధారపడి ఉంటుంది. నాకు ఆ ప్రావీణ్యం లేదు. నేను అమెరికా వచ్చి కొత్తలో పాకం తీసి, శనగపిండీ, బోలెడు నెయ్యీ వేసి తిప్పుకుంటూ కూచోడమే కదా అనుకుని మొదలు పెట్టేను. తీరా అయింతరవాత మాపిల్లముందు పెడితే, పాపం అప్పటికింకా 4,5 ఏళ్ళుంటాయేమో. ఓ  ముక్క నోట పెట్టుకుని బాగుంది మామీ అంది కళ్ళనీళ్ళు తరువాయిగా. గోడకి మేకులు కొట్టుకోడానికి పనికొచ్చేలా ఉన్నాయి ముక్కలు. అంచేత చాలాకాలం మైసూరుపాకం తలపెట్టలేదు.

ఇప్పటికి ఈ సుళువులు కనిపెట్టే తెలివొచ్చింది. ఇప్పుడు నేను చేసేది soft batch అన్నమాట. ఇది తయారు చేయు విధానము.

ముందు శనగపిండి 4 నాలుగు చెంచాల నెయ్యిలో దోరగా వేయించాలి. ఇలా చెయ్యడంవల్ల శనగపిండి ఉండలు కట్టకుండా ఉండడానికి కూడా పనికొస్తుంది. అలా శనగపిండి పచ్చి పోయేవరకూ వేయించి తరవాత పంచదార కలపాలి. సుమారుగా శనగపిండిలో సగం వంతు పంచదార చాలు. పంచదార కూడ పిండిలో బాగా కలిసేవరకూ కలిపి, మరో నాలుగు చెంచాలు నెయ్యేసి, కొంచెం నీళ్ళు చల్లితే పంచదార మూలంగా పల్లబడుతుంది. అది దగ్గర పడేవరకూ కలుపుతూండాలి. సుమారుగా 8-10 నిముషాల్లో అయిపోతుంది.

దగ్గరపడ్డతరవాత పళ్ళెంలో పోసి సమంగా నెరపండి గరిటెతో. నాలుగు నిముషాలాగి ముక్కలు కోసుకోవచ్చు.

కావలిస్తే, మైక్రోవేవ్ లో 1, 2 నిముషాలు పెడితే కరకరలాడుతూ కూడా ఉంటాయి.

మామూలుగా మాపిల్లలకి మాత్రం soft batchఏ అలవాటు చేసేసేను. ఎందుకంటే మైక్రోవేవులో ఒకొకప్పుడు మరీ గట్టిగా అయిపోయే ప్రమాదం ఉంది కనక.

పోతే, బోప్పాయికాయ హల్వా –

బొప్పాయి హల్వా
బొప్పాయి హల్వా

పచ్చి బొప్పాయికాయ తొక్క తీసి తురుముకోవాలి.

ఇందులో నీరెక్కువ కనక మైసూరుపాకుకంటే ఎక్కువ సేపు పడుతుంది. నేను తురుము ఫ్రీజరులో పెట్టుకున్నాను కనక, ఫ్రీజరులోంచి తీసేక, ఆ నీరు వేరే గిన్నెలోకి పిడిచి ఉంచుకున్నాను. ఆనీళ్ళు పులుసులో వేసుకుంటే భలే రుచి వస్తుంది.

ఇప్పడు ఆ బొప్పాయి తురుము మూకుడులో నెయ్యి 2, 3 చెంచాలు వేసి పచ్చి వాసన పోయేవరకూ వేయించాలి. టైం ఎంత పడుతుందో నేను చూసుకోలేదు. వేగిందని నమ్మకం కుదిరేక, పంచదారవేసి కలుపుతూ మరికొంతసేపు తిప్పుతూండాలి. తురుములో నీరుంది కనక మళ్ళీ వేరే నీళ్లు పోయక్కర్లేదు.

పంచదార కూడా అట్టే వద్దు. రెండు చెంచాలు వేస్తే చాలు. కాయలలో ఉన్న తీపిమూలంగా పంచదార ఎక్కువయితే మదనతీపి వచ్చేస్తుంది. అంటే మొహం మొత్తేంత తీపి అన్నమాట.

ఈ ముద్ద దగ్గరపడుతున్నప్పుడే యాలకపొడి, జీడిపప్పు, లేదా బాదంపప్పు వేసి మరికొంచెం సేపుంచి దింపి పళ్లెంలోకి మార్చండి. అన్నట్టు జీడిపప్పు, బాదం పప్పు ముందే వేయించి పెట్టుకోవాలని చెప్పడం మరిచిపోయేను. అయినా మీకు తెలుసు కదా.

సొరకాయ, బూడిద గుమ్మడికాయ తురుముతో కూడా ఇలాగే చేసకోవచ్చు.

000

(జనవరి 3, 2017)

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

5 thoughts on “వంటింటి సంబరాలు – 2”

 1. అవును. ఇప్పుడు కులప్రసక్తిలో కులాలగురించిన అవగాహన కన్నా రాజకీయాలు, వాదనలే ఎక్కువ.
  మీకు ఫేస్బుక్ ఖాతా ఉంటే నా పేజీకి లింకు ఇది. అక్కడ ఇంచుమించు రోజూ కనిపిస్తాను.
  https://www.facebook.com/thulika.malathi

  మెచ్చుకోండి

 2. మీ అభిమానానికి మనఃపూర్వక ధన్యవాదాలు. రాయదగ్గ ఆంశాలేమీ తోచడం లేదు. కానీ ఇప్పడే ఒక టపా రాస్తున్నాను. రేపు ూర్తి చేసి పోస్టు చేస్తాను.చదివి మీ అభిప్రాయాలు తెలుపుతారని ఆశిస్తున్నాను.

  మెచ్చుకోండి

 3. మీ చిట్టి-చిట్టి వంటల కబుర్లు బావున్నాయి 🙂
  నమ్ముతారో లేదో – మొన్ననే అనుకున్నాను మీ గురించి – ఈమధ్య మీరు బ్లాగ్ రాసి చాలా రోజులయింది – ఎలా వున్నారో – అని. మీ ఈ పోస్ట్ చూడగానే సంతోషంగా అనిపించింది – వారానికి కొన్ని లైన్లయినా రాయండి – please!

  మెచ్చుకోండి

 4. మాలతి గారు. బావున్నాయి మీ వంటకాలు/సంబరాలు. నేను కూడా పీచా ఇలాగే చేస్తానండీ. ఈ మధ్య Whole wheat naan (CRAZY వో మరేదో బ్రాండు ) తో చేస్తున్నాను. మీ మైసూర్ పాక్ ఏదో calorie free అన్పిస్తోంది. ఒక ప్రయత్నం చేస్తాను.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు, తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరింపబడును.

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s