నేనూ, నా బ్రాహ్మణీకమూ …

(మనలో మనమాట – 32)

ఇక్కడ రాసిన అభిప్రాయాలు కొత్తవి కాదు. పాఠకులందరూ చెప్పుకుంటున్నవే. కాకపోతే ముఖపుస్తకంలో నిన్నా మొన్నా వచ్చిన టపాలమూలంగానూ, అక్కడ వెలిబుచ్చిన అభిప్రాయాలు చూసినతరవాతానూ మరొకసారి నా అభిప్రాయాలు స్పష్టం చేయాలనిపించింది.

“నీవు గాకున్న నీదు తండ్రి,” అన్న పంచతంత్రం కథ గుర్తుకొస్తుంది 21వ శతాబ్దంలో ఇంకా “బ్రాహ్మణులని కాదు బ్రాహ్మణీకాన్ని ద్వేషిస్తున్నాం” అనేవారున్నారంటే.

అసలు ఈ వాదన ఎలా వచ్చింది? నాకు తెలిసినంతవరకూ ఇది గత అర్థ శతాబ్దంలో వచ్చింది. ఇతరకులాలవారు తమ ఆధిక్యాన్ని పటిష్టం చేసుకుంటున్న సందర్భంలో ప్రారంబించిన నినాదం. ఈనాటి సామాజికపరిస్థితులదృష్ట్యా అసంబద్ధమయినది. .

చదువులూ, ఉద్యోగాలూ, ఇతర రాష్ట్ర ఇతర దేశాలలో జీవనాలూ – వీటన్నిటి మూలంగా వివిధ కులాల, మతాలప్రజలు సామరస్యంగానో, సామరస్యం నటిస్తూనో జీవించవలసి వస్తోంది. ఒక ఉన్నతకులంవాడు దిగువకులంవాడిచేతికింద పని చేయవలసి వస్తే, “మీరు తక్కువకులంవారు, మీతో సహపంక్తి భోజనం నాకు సమ్మతం కాదు” అని చెప్పలేరు. హోటళ్లో తినడం సర్వసాధారణం అయిపోయింది. ప్రతి హోటల్లోనూ సద్బ్రాహ్మణులు మడి కట్టుకు వంట చేసి పెడుతున్నారా? నెలకి 20రోజులు ప్రయాణాల్లోనే ఉండే బ్రాహ్మణుడికి ధర్మశాస్త్రం ప్రకారం దినము గడుపుకోడం సాధ్యం కాగలదా అంటే అనుమానమే. అంతే కాదు. అసలు జీవనవిధానంగురించిన ఆలోచనలలో ఎంతో మార్పు వచ్చింది. ఇలా ఆలోచించినప్పుడు మీరు ఏ బ్రాహ్మణీకాన్ని గర్హిస్తున్నారో ఆ బ్రాహ్మణీకం ఇప్పుడు లేనూ లేదు. ఆ ఆధిపత్యమూ లేదు.

000

“అమ్మా, మనం బ్రాహ్మణులమా?” అని మాఅమ్మాయి అడిగింది. ఎప్పుడంటే తను కాలేజీలో చేరేక. “ఇప్పుడు ఈ ప్రశ్న ఎందుకొచ్చిందీ?” అనడిగేను. కాలేజీలో హిందూయిజమో ఏదో అలాటి కోర్సు చదువుతున్నపుడు అడిగేరుట.

ఇదెందుకు చెప్తున్నానంటే మాయింట్లో ఈ బ్రాహ్మణచర్చ ఎప్పుడూ జరగలేదు. ఆరోజుల్లో నేను పూజలు చేసేను. పండుగలు పద్ధతిగా జరుపుకున్నాం. అయినా మనం బ్రాహ్మణులం, మనం ఇలా చేయాలి అని ఎప్పుడూ నేను పాఠాలు చెప్పలేదు తనకి.

అవును, నేను బ్రాహ్మణకులంలో పుట్టేనన్న స్పృహ నాకుంది. అంతమాత్రాన, మిగతా కులాలవారినెవరినీ దూరం చేయలేదు. నిజానికి నాస్కూలు, కాలేజీరోజుల్లో  నాస్నేహితులలో చాలామంది అబ్రాహ్మణులే. వాళ్ళని ఇంటికి తీసుకొచ్చేను. మాఅమ్మ ఎప్పుడూ ఎలాటి అభ్యంతరమూ చెప్పలేదు. బహుశా మీలో చాలామందికి కూడా ఇదే అనుభవం కావచ్చు.  నాకు సంబంధించినంతవరకూ, నాబ్రాహ్మణీకంలో రెండే అత్యంత ముఖ్యమైన అంశాలు – అంతశ్శుద్దీ, బాహ్య శుద్ధీ. నేను పాటించేవి అవే. ఇవే అన్ని కులాలకీ, జాతులకీ కేంద్రబిందువులు.

వాల్మీకి బోయవాడు. ధర్మవ్యాధుడు ఏ కులమో నాకు తెలీదు కానీ మాంసం అమ్ముకునేవాడు. మాంసం అమ్ముకోడం బ్రాహ్మణవృత్తి కాదు కదా. విశ్వామిత్రుడు ఘోరతపస్సు చేసి బ్రహ్మఋషి అనిపించుకున్నాడు. తరవాతికాలంలో పల్నాటియుద్ధానికి కారణం కోళ్లపందేలు. అందులో కూడా బ్రాహ్మణీకం లేదు. చరిత్ర సమగ్రంగా పరిశీలించి చూస్తే ఆధిపత్యం, మూర్ఖ ఆధిపత్యం ఒక్క బ్రాహ్మణులకే పరిమితం కాదు అనే అనిపిస్తుంది.

“మాకు బ్రాహ్మణులంటే కోపం లేదు, బ్రాహ్మణీకం అంటేనే కోపం” అన్న వాదనకి ఈనాడు బలం లేదు, ప్రధానంగా ఈనాడు బ్రాహ్మణులకి ఆ ఆధిపత్యం లేదు కనక.   దుష్టగుణం ఏ ఒక్క మతానికి, జాతికి, వర్ణానికి నైజగుణం కాదు.

మతం పేరో కులం పేరో ఉపయోగించుకొని జరిపే హింసకి ఆ వ్యక్తులని తప్పు పట్టాలి కానీ మతాన్నీ, కులాన్నీ కాదు.

“వేషము మార్చెను, భాష మార్చెను … అయినా మనిషి మారలేదు” పాట గుండమ్మకథలో 54 ఏళ్ల క్రితం వచ్చింది.  గత 54 ఏళ్ళలో మనిషి మార్చుకున్నవి మరో ముప్ఫై చేర్చవచ్చు. అయినా ఇంకా నిరతాగ్నిహోత్రంలా మండుతూనే ఉన్నది బ్రాహ్మణ ద్వేషం. కాకపోతే ఇప్పుడు కొత్తగా, నాజూగ్గా, “మాకు బ్రాహ్మణులంటే కోపం లేదు, బ్రాహ్మణీకం అంటేనే కొపం” అంటున్నారు. రాజ్యాధిపత్యంకోసం ఎంత రక్తపాతం జరగలేదు? “మాకు క్షత్రియులంటే కోపం లేదు, క్షాత్రం అంటేనే కోపం,” అనడం లేదు. అలాగే రెడ్డి ప్రభువులు, కమ్మప్రభువులని తప్పు పట్టడం లేదు. రాజ్యాలు పోయేయి. ఇప్పుడు రాజకీయాల్లో, చిత్రరంగంలో, అన్నిటికంటే ముఖ్యం సాహిత్యక్షేత్రంలో ఆధిపత్యం బ్రాహ్మణులది కాదు. వీరిలో కనిపించే కులతతత్త్వాల గురించి ఎవరూ ప్రశ్నించడం లేదు.

నిన్న ముఖపుస్తకంలో ప్రచురించిన అబ్బరాజు మైథిలిగారి టపాకి నేపథ్యం ఏమిటో నాకు తెలీదు. అంచేత నేను నా పేజీలో మరో పోస్టు పెట్టేను. ఆక్కడ వ్యాఖ్యలు సుమారుగా నేను ఇక్కడ రాస్తున్నవే. కాకపోతే వ్యక్తిగతంగా నా అబిప్రాయాలు కూడా చేరుస్తున్నాను. నాకు నిజంగా మతచర్చలు చేసేంత పాండిత్యమూ లేదు, తీవ్రచర్చలోకి దిగే ఓపికా లేదు. ఈ టపాద్వారా నా అజ్ఞానం మాత్రమే తెలుపుకుంటున్నానని మీరనుకుంటే మీ ఇష్టం.

కొన్నివేల సంవత్సరాలక్రితం, కాకపోతే కొన్ని వందలసంవత్సరాలక్రితం బ్రాహ్మణులు ఏకచ్ఛత్రాధిపత్యం ఏలేరు, ఇతర కులాలవారిని అణగద్రొక్కేసేరు అని ఈనాడు మనం తగువులాడుకోడంలో సౌలభ్యం కానీ ఆనందం కానీ ఏమిటో నాకర్థం కావడం లేదు. ఇప్పుడు బ్రాహ్మణులకి ఆ ఆధిపత్యం లేదు అన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. ఏరంగం చూసినా ఎవరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు? వారిలో కులతత్త్వం తాలూకు ఛాయలు ఎంత బలంగా ఉన్నాయి? పూర్వం బ్రాహ్మణులు ప్రదర్శించారంటున్న తత్త్వానికి భిన్నంగా ఉందా వీరి తత్త్వం? టానా ఆటావంటి సాహిత్యసంఘాలలో కులతత్త్వం ఏమీ లేదా? దాన్ని ప్రతిఘటించడానికి ఎవరైనా ఏం చేస్తున్నారు? – ఇది ఒక కోణం.

ముఖపుస్తకంలో వచ్చిన మరో ప్రశ్న ఎవరిని బ్రాహ్మణులు అంటున్నారని. ఇది కూడా పెద్ద ప్రశ్నే. ఈనాటి కులాంతర, వర్ణాంతర, జ్యాత్యంతరవివాహాలూ, కులాన్ని అదిగమించిన స్నేహాలూ, వ్యాపారాలసంబంధాలు – ఈ నేపథ్యంలో సనాతనాచారాలు పాటించే బ్రాహ్మణుడిగా ఎవరిని గుర్తిస్తారు? ఇలాటి అయోమయోవస్థలో దౌష్ట్యాన్ని దౌష్ట్యంగా గుర్తించాలి గానీ బ్రాహ్మణీకంగా గుర్తించడం అసంబద్ధం. జనబాహుల్యములో చలామణీ అవుతున్న భావజాలానికి వేల ఏళ్ళనుండీ ప్రతినిథులుగా వున్నది బ్రాహ్మణులే అన్న వాదన అసంబద్ధం. జనబాహుళ్యంలో చెలామణీ చేసింది గత శతాబ్దంలో కొందరు మాత్రమే మొదలు పెట్టి వ్యాప్తిలోకి తెచ్చేరు. కనీసం వ్యాప్తిలోకి తీసుకురావడానికి ప్రయత్నించేరు. ఆనాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. అప్పట్నుంచి ఇప్పటికి సాంఘికపరిస్థితులు గుర్తుపట్టలేనంతగా మారిపోయేయి. ఆనాటి అర్థంలో ఈనాడు బ్రాహ్మణీకం లేదు. కులవ్యవస్థ మారాలనేవాళ్ళెవరూ ఇలా ఒక కులాన్ని ఇంకా దుయ్యపట్టడంలో అర్థం లేదు. మారిన మారుతున్న పరిస్థితులని ఎప్పటికప్పుడు గుర్తిస్తూ, తదనుగుణంగా తమ అభిప్రాయాలూ, భాషా మార్చుకోడమే కదా మానసికంగా ఎదిగేం అనుకోడానికి ప్రమాణం.

మరో కోణం బ్రాహ్మణ్యం, బ్రాహ్మణీకం ప్రసక్తి లేకుండా తమ పని తాము చేసుకుపోతూ నలుగురికీ మంచి పంచిపెడుతున్న వారు అన్ని కులాల్లోనూ ఉన్నారు. అలా అనుకుంటేనే నాకు మనశ్శాంతి.

పైన చెప్పిన మనిషి మారలేదు పాటకి లింకు ఇస్తున్నాను, సరదాకి.

https://www.youtube.com/watch?v=z7dtn439KAY

 

000

(జనవరి 8, 2017)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

15 thoughts on “నేనూ, నా బ్రాహ్మణీకమూ …”

 1. మీ అభిప్రాయం నాకు సరిగా అర్థం కాలేదు కానీ నేను చెప్పదలుచుకున్నది దుర్మార్గాన్ని ద్వేషించడానికి కులంపేరు వాడడం సముచితం కాదనే. బ్రాహ్మణీకం ద్వేషిస్తున్నాం అన్నది చారిత్ర్యకంగా ఏదో సందర్భంలో ఏర్పడినా, అది ఈనాడు వర్తించదు. ఆ పదం వదిలేసి, ఏ కులమైనా దుర్మార్గాన్ని మాత్రమే సరి దిద్దడానికి ప్రయత్నించాలి అని.

  మెచ్చుకోండి

 2. మనం చేసే పొరపాటే అది బ్రాహ్మణకులం గొప్పది దానిని సంకరం చెయ్యకూడదు అని చెప్పాలి మిగిలినవాళ్ళని ద్వేషించు అనకూడదు ప్రజలందరికి తిండి సమకూరుస్తున్నవాడు సూద్రుడు

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 3. మీరు చక్కగా వివిరంచేరండి. దురదృష్టవశాత్తు ఈ అవగాహన బ్రాహ్మణులలో మాత్రమే ఉందేమో అనిపిస్తోంది. చలం రాతలు అఖ్ఖర్లేదు లెండి. మీరు చెప్పిందే బాగుంది. కులప్రసక్తి లేకుండా పలుకుబడి ఉన్నవారిని ఆశ్రయించడం కూడా బ్రాహ్మణులకు తప్పడం లేదనుకుంటా పేరు తెచ్చుకోవాలంటే.

  మెచ్చుకోండి

 4. బ్రాహ్మణులు ఏ కాలంలోనైనా బలవంతులుగా ఉన్నారా అన్నది తెలియదు గానీ ఒకప్పుడు సమాజంలో బ్రాహ్మణుల పట్ల గౌరవం ఉండేది. ఇప్పుడది కొరవడింది. దీనికి కారణమైన బ్రాహ్మణ ద్వేషాన్ని మీరు కరక్ట్ గా చెప్పినట్లు “జనబాహుళ్యంలో చెలామణీ చేసింది గత శతాబ్దంలో కొందరు మాత్రమే మొదలు పెట్టి వ్యాప్తిలోకి తెచ్చేరు.” దానికి తోడు బ్రాహ్మణుల్లో ఐకమత్యం కొరవడుండం ఆ వర్గం యొక్క పెద్ద బలహీనత. ఇక మీరన్నట్లు తమ కులానికి వ్యతరేకంగా తామే మాట్లాడడం / వ్రాయడం చాలా మటుకు అధికారంలో ఉన్న బ్రాహ్మణేతరుల ప్రాపకం కోసమే అనుకోక తప్పదు. తద్వారా ఏదో లబ్ధి చేకూరుతుందనే ఆశ (నిజానికి ఏదైనా లాభం ఉండే చోట 90 శాతం ఏ కులం వారు ఆ కులం వారికే కట్టబెట్టుకుంటారు సాధారణంగా). దానివల్ల తామే పలచనైపోతున్నాం అనే స్పృహ కూడా ఉండడం లేదు. సంఘటితత్వం పెంచుకుంటేనే గానీ బలం రాదు.
  (చలం గారు తన “బ్రాహ్మణీకం” అనే పుస్తకంలో ఇటువంటి సమస్యల గురించి ఏమన్నా వ్రాసారా అన్నది ఎంత ప్రయత్నించినా గుర్తు రావడం లేదు. చదివి దాదాపు అర్ధ శతాబ్దం కావస్తోంది. ఇప్పుడు ప్రయత్నించాను గానీ పుస్తకం దొరకలేదు. ఎవరికైనా గుర్తుంటే ఇక్కడ పంచుకోగలిగితే బాగుంటుంది.)

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 5. బ్రాహ్మణులనే వారిని తిట్టిపొయ్యడం, బ్రాహ్మణీకం అంటూ డొంకతిరుగుడుగా మాట్లాడ్డం ఒక అవసరమండి. వాళ్ళను తిడుతూ ఉంటేనే “వివక్షత” అనే పదం చెలామణీ అవుతూ ఉంటుంది. అలా చెలామణీ అవుతూ ఉంటేనే కొందరి పబ్బం గడుస్తుంది. అలాగే మరికొందరికి ఇదొక ఇంటలెక్చువల్ అవసరం. బ్రాహ్మణీకం అంటూ పరోక్షంగా బ్రాహ్మణులను అదే పనిగా తిడుతూ రాస్తే ఆ రాతలకు మార్కెట్ కూడా ఏర్పడుతుంది. నలుగురూ గుర్తిస్తారు.ఈ ముసుగులో తాము ఒక వర్గాన్ని గురించి మాట్లాడటం లేదని చెప్పుకోవచ్చు. ’వర్ణవివక్షత’ ను, దానికి గల ప్రస్తుత నేపథ్యాన్ని, దాన్ని గుడ్డిగా సమర్థించే రచనలను గురించి నిజాయితీగా, నిలకడగా, సబ్జెక్టివ్ గా చర్చించేవాళ్ళు తక్కువ.

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 6. బ్రాహ్మణులకి ప్రస్తుతం బలం లేదు కనక ఉన్నత స్థాయిలో ఉన్న ఇతరకులాలవారి ప్రాపకంకోసం అలా కథలు రాయడం అనుకుంటా. అదొక ప్రదర్సన కూడా కావచ్చు ప్రచారం కోసం

  మెచ్చుకోండి

 7. అది కూడా ఒక రకమైన భావదాస్యమో భావదారిద్ర్యమో అనుకుంటాను. ప్రుస్తుతం కమ్మవారు, రెడ్డి ప్రభువులు అన్ని రంగాలూ ఏలుున్నారు కనక వారి ప్రాపకంకోసం మీరు చేప్పిన బ్రాహ్మణుల బ్రాహ్మణద్వేషం.

  మెచ్చుకోండి

 8. లలిత గారు మీరు చెప్పకపోతే బడిలో చెప్తారు. మా పిల్లలకి కులం అనే మాట ఎలా తెల్సా అని ఆశ్చర్యపోవడం నా వంతయ్యింది. ఈ అమెరికా లో ఇంకా అతి ఏంటంటే బ్రాహ్మణుడి గా పుట్టడం పూర్వ జన్మ సుకృతం అని కూడా చెప్తారు.

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 9. అమెరికా కి వచ్చాక అన్ని కులాల సంఘాలని చూసాను ఒక్క బ్రాహ్మణ సంఘం తప్ప . కులాంతర, మతాంతర,దేశాంతర వివాహాలు చేసుకోవడం బ్రాహ్మల్లోనే చూసాను. తప్పని కాదు. ఎవరి ఇష్టం వారిది. తల్లి తండ్రులు ఆమోదిస్తున్నారు. అంత విశాల హృదయం బ్రాహ్మల్లోనే చూసాను అంటే కూడా అతిశయోక్తి కాదు. బ్రాహ్మణులని తిడుతూ బ్రాహ్మలే కథలు వ్రాస్తున్నారు. బ్రాహ్మణులని తిట్టే కమ్మూనిస్టుల లో బ్రాహ్మలే ఉన్నారు. ఇంకా బ్రాహ్మణ ద్వేషం ఏంటో అర్ధం కాదు. ఈ భావజాలం గోలేమిటో నాకు అసలు ఎప్పడూ అర్ధం కాదు.

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 10. మీరన్నదాంతో నూటికి నూరు పాళ్లు ఏకీభవిస్తాను – ఏదైతే వుండకూడదు (కులం, మతం) అని ఎవరైతే అనుకుంటునారో వాళ్లు మాత్రం మళ్లీ వాటినే తగిలించుకుని మాట్లాడుతున్నారు.
  మా ఇంటి వరకు – మా పిల్లలకి ఇండియా లో caste system వుందని తెలుసు కానీ వాళ్ల తలిదండ్రులమైన మా caste(s) గురించి కనీసం పేర్లు కూడా తెలియదని చెప్పగలను – సగర్వంగా.

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s