రెండున్నర డాలర్లు బాకీ పడ్డాను!

(మనలో మనమాట 32)

పొద్దున్నే లేచి, మరో పని లేక లాండ్రీ చేసుకుందాం అని మాసినబట్టలబుట్ట తీసుకు లాండ్రీరూంకి వెళ్లేను. అక్కడ ఒకావిడ వాషర్లూ డ్రైయరూ కంతలలో చిల్లర పెట్టడం చూసి, ఆవిడ బట్టలుతుక్కుంటోంది కాబోలనుకుని, “సరే, నేను తరవాత వస్తాను,” అని వెనక్కి తిరగబోతున్నాను.

“కాదు, కాదు. నీకోసమే. ఈ చిల్లర. నువ్వు లాండ్రీ చేసుకో,” అంది.

నాచేతిలో ఉన్న చిల్లర ఇవ్వబోయేను.

“కాదు, కాదు. నేను paying forward. నువ్వు తీసుకోవాలి తప్పనిసరిగా,” అంది పట్టు బడుతూ.

నాకు ఏం చెప్పాలో తోచలేదు. Pay it Forward అని ఒక సినిమా వచ్చింది చాలాకాలం క్రితం. ప్రపంచాన్ని కొంచెం మెరుగు పరిచే ఉద్దేశంతో. ఒక అబ్బాయి పాత బాకీలు తీర్చడం కాక, ఎవరో ఒకరికి సాయం చేయడం ద్వారా చేయని అప్పు తీర్చుకోడం మొదలు పెడతాడు. సూక్ష్మంగా మంచికోసమే మంచి చేయడం. ఇక్కడ మరోవిషయం చెప్పాలి. సాధారణంగా వీరి సంస్కృతిలో పద్ధతి ఎప్పటికప్పుడే ఎక్కడికక్కడే అప్పులు తీర్చేయడానికి ప్రయత్నిస్తారు. అంటే నేను ఒకరికి రైడిస్త్, వెంటనే గాస్ మనీ అని రెండు డాలర్లు ఇవ్వజూపుతారు. ఉచితంగా ఏదీ తీసుకోడం ఇష్టపడరు అనడానికి ఇది నిదర్శనం. మనవాళ్ళు ఋణం అంటారు సుమారుగా ఇలాటిదే. ఎటొచ్చీ మన ఋణానుబంధాలు కొన్ని జన్మలకి సాగుతాయి.

ఆవిడకి ఎలా జవాబు చెప్పాలో తోచలేదు, “సరే. ఇంకెవరైనా తీసుకోవచ్చులే అది.  నాకొద్దు,” అని వెనుదిరిగి నావాటాకి వెళ్ళిపోతున్నాను. ఆవిడ వదలకుండా నావెనకపడి, వస్తూ, “ఏయ్, ఇదుగో, రా, నామాట విను, నాకోసం. ఇది నా కానుకు నీకు. ప్లీజ్, ప్లీజ్, నాసంతోషంకోసం ఒప్పుకో,” అంది.

“మరి నేను కూడా నీకు ఏదో ఇవ్వాలి,” అన్నాను.

“సరే. చూదాం,” అనేసి ఆవిడ వెళ్ళిపోయింది.

ఈ దానంగురించిన ఆలోచనలు చాలా వచ్చేయి. మన సంస్కృతిలో పాత్రమెరిగి దానం చెయ్యమంటారు. పాత్రత మాట బహుశా మనం అన్ని సందర్బాలలోనూ అనుకోం. అవసరమైనవేళ అవసరమయినవారిని ఆదుకోడం మన లక్షణం. ఆస్తికులు పుణ్యం అంటారు. నాస్తికులు సమాజసేవ, సాంఘికధర్మం అంటారు. ఈ ఋణానుబంధం మనకి ఒక జన్మలో తీరిపోదు. జననాంతరాలకి కూడా ప్రసరిస్తుంది. “చచ్చి నీకడుపున పుడతా,”లాటి జాతీయాలు వచ్చింది అందుకే.

ఔదార్యం ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రత్యక్షమవుతుందో చెప్పలేం. వీరికి డబ్బుంది కనక, వారికి అధికారం ఉంది కనక, అమెరికను కనక, భారతీయుడు కనక … అని మూక ముద్రలేయడం కన్నా దేనికదే ఒక సన్నివేశం చూసి ఆనందించడమే మంచిదనుకుంటాను.

ఇంతకీ నాకు మాత్రం ఆ చిల్లర తీసుకోడం అంతగా నచ్చలేదు. ఆవిడని తృప్తి పరచడానికి, ఆ చిల్లర వాడుకుని, ఆ రెండున్నర డాలర్లు తరవాత బయటికి వెళ్ళినప్పుడు ఏ బిచ్చగాడయినా కనిపిస్తే ఇచ్చేయాలనుకుంటున్నాను, మన సంప్రదాయం నారక్తంలో ఇంకిపోయింది మరి!

000

(జనవరి 23, 2017)

 

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

10 thoughts on “రెండున్నర డాలర్లు బాకీ పడ్డాను!”

 1. మరుజన్మ గలదు తీర్చగ
  వెరపేలా ఋణము దీర్చు వెర్రియదేలా ?
  త్వరపడుటేలా , అమెరిక
  పురజనములు మారుజన్మ వూసెరుగరనా ?

  పేయిట్ ఫార్వర్డనుటయు
  పేయింగ్ ఫార్వర్డనుటయు ప్రియభారతిలో
  శ్రేయంబుగాదు , అదిగో
  ఖాయంబుగ మారుజన్మ గలదుగ తీర్చన్ .

  మెచ్చుకోండి

 2. రెండున్నర డాలర్లకు
  నిండుగ కర్మ ఫలమొందు నిక్కము ఫార్వార్డ్
  భాండా గారము నింపుచు
  దండిగ పుణ్యముల దేలు తరుణి జిలేబీ 🙂

  జిలేబి

  మెచ్చుకోండి

 3. అది కూడా చేసేను. కానీ నాకంటే భాగ్యవంతులు అది వాడుకోవచ్చు, అది అపాత్రదానం కదా అని ఓ పక్క బాధ. పైగా మన సంప్రదాయంలో అవసరం అయినవారికి దానం చేయడం కదా ఆదర్శం.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు, తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరింపబడును.

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s