మూర్ఖత్వం అంటే?

తివిరి ఇసుమున తైలంబు దీయవచ్చు

దవిలి మృగతృష్ణలో నీరు త్రాగవచ్చు

తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు

చేరి మూర్ఖులమనస్సు రంజింపరాదు

ఈపద్యం తిరగరాయవలసిన సమయం వచ్చిందేమో అనిపిస్తోంది ఇవాళ.

ఈమధ్య ఏ ఇద్దరి మధ్య సంభాషణలు చూసినా ఎవరో ఒకరు మూర్ఖంగా వాదిస్తున్నట్టే కనిపిస్తోంది. ప్రతివారూ నామాటే ఏకైక మరియు అప్రతిహతమైన సత్యము అని గాఢంగా నమ్ముతున్నారు. “సంప్రదాయాలను పాటించడం, మతవిశ్వాసాలను గౌరవించడం మూర్ఖత్వం” అన్న వాదన బహుళజనాదరణ పొందింది.

నేను కుందేలుకొమ్ము సాధించడం సాధ్యమే అనుకుంటున్నాను ఈనాడు  విజ్ఞానపరిశోధనద్వారా పుట్టిన test tube పాపలని చూసిఉన్నదానిని కనుక. ఇంకా కావాలంటే క కి కొమ్ముస్తే, ల కి కొమ్మిస్తే లు, లేకున్న అది కందేల అగును అని కూడా వాదిస్తాను.

ఇంచుమించు అలాటదే ఈ వ్యాసం. నేను పట్టు బట్టి నమ్మకాలు ఉండాలనో ఉండకూడదనో మిమ్మల్ని నమ్మించడానికి పూనుకోబోను. అసలు అది నాతత్వంలో లేనే లేదు. సాధారణంగా గోడమీద పిల్లిలా అటూ ఇటూ ఊగుతూ, తాతతో దడి నేస్తా, అవ్వతో మంచం నేస్తాననే చిట్టి చిలకమ్మలా గడుపుకుంటాను. అయినా అసలు నాకే లేవు నమ్మకాలు, మీకేం చెప్తాను. నాకు ఏదీ నమ్మకంగా తోచదు. దేవుడు లేడని వాదించడానికి సిద్ధంగా లేను. ఉన్నాడని ఋజువు చేయడానికీ తయారు కాదు. లేడన్న వాదనలోనే నాకు ఎక్కువ లోపాలు కనిపించినమాట మాత్రం వాస్తవం. ఎందుకో చెప్తాను.

ఈమధ్య బాగవతం చదవడం మొదలు పెట్టేనని చెప్పేను కదా. అవును, ఒక వయసొచ్చేక రామా కృష్ణా అనుకుంటూ ఓ మూల కూచుని పురాణాలు చదువుకోడం మామూలే అనొచ్చు మీరు. కానీ నేనలా అనుకోను. రామా, కృష్ణా అని కాక, ఇంతమంది చదువుతున్నారు, నేను చదవలేదంటే అవమానం అయిపోతోందని ఒక బాధ. రెండోది, నాకు ప్రస్తుతం చదవడానికి మరేం లేకపోవడం.  అంతర్జాలంలో కుప్పలుతిప్పలుగా వస్తున్న సాహిత్యం నాకు నచ్చడం లేదు,  ఆ వివరాలలోకి పోనిప్పుడు. పోతే, దేనికైనా సమయం రావాలంటారు. నాకు భాగవతం చదివే సమయం ఇప్పుడొచ్చింది. అంటే చదవడం మొదలు పెట్టిందగ్గర్నుంచీ ఇంకా ఇంకా చదవాలనే అనిపిస్తోంది.

నాకు భాగవతంలో భాష, వర్ణనలూ చాలా నచ్చేయి. బహుశా, ఈమధ్య అంతర్జాలంలోనూ పత్రికలలోనూ చూస్తున్న భాషవల్ల అనుకుంటాను. తెలుగు అని వారు చెప్తే మాత్రమే తెలిసే తెలుగు అది. ఇంగ్లీషువాక్యాలు తెలుగులిపిలో రాసి కదా అనో అండి అనో చేరిస్తేనూ. లేదా ఇంగ్లీషుపదాలకి తెలుగు ప్రత్యయాలు చేరిస్తేనూ తెలుగు అయిపోతుందని వారిభావన కావచ్చు, ఈనాటి అనేక పాఠకులకి అది అభ్యంతరంగా తోచకపోవచ్చు కానీ  నాకు మాత్రం వాటిని చూస్తే కడుపులో దేవినట్టుంటోంది. ఆ భాష రాసేవారికి  నాబాధ తెలీదు.

ఈ సాహిత్యంమూలంగా నాకొచ్చిన నాలుగు ముక్కలు  మరిచిపోతున్నాను. పది రోజులక్రితం కొత్తపాళీతో మాటాడుతూ, pasttime అన్నాను. ఆయన వెంటనే కాలక్షేపం అన్నారు. నాకు కాలక్షేపం అన్న పదం తెలీదనీ కాదు. నాకు తెలుసన్న సంగతి కొత్తపాళీకి తెలీదనీ కాదు. సమయానికి నాకు గుర్తు రాలేదు. ఆయన గుర్తు చేసేరు. మనమాటల్లో తెలుగు ఎంత తగ్గిపోతోందో చెప్పడానికి చెప్తున్నాను ఈమాట. అంచేత నాకు భాగవతం చదువుతుంటే కొంత ఉపశమనం కలుగుతోందని చెప్పడానికిది.

అలాగే, ఆ గ్రంథంలో పదసౌందర్యం, వర్ణనలు కూడా. ఇన్ని సంగతులు పోతనగారికి ఎలా తెలిశాయా అనిపించింది కూడా. ఇవాళ ఏంవారం అనడిగితే, ఐఫోను చూడకుండా చెప్పలేని కాలంలో ఉన్నాం మనం!

తరులు, విరులు, ఫలజాతులు, శరీరనిర్మాణం, సృష్టిక్రమం, కాలమానం – ఏది తీసుకున్నా పోతనగారి సూక్ష్మపరిశీలన, నిశితదృష్టి అద్భుతం. ఈమాట నేను ఊతపదంగా అనడంలేదు. ఒక స్త్రీ ఏడ్చిందనడానికి కూడా ఎన్నో ఉపమానాలు కూర్చి రాసిన పద్యం చూసి అబ్భ ఎంత గొప్పగా వర్ణించేరు అని ముందు అక్కజపడి ఆ తరవాతే విచారించేను ఆవిడకి అంత దుఃఖం కలిగినందుకు. ఏరాజు చరిత్ర మొదలు పెట్టినా పదో పదిహేనో తరాలు ఉటంకిస్తారు ఆ వంశక్రమంకోసం తెలియజేయడానికి.

ఆమీద అనేక చోట్ల ఎన్నో విషయాలు ఈనాటికీ వర్తించేవిగా కనిపిస్తున్నాయి. ఆత్మవిశ్వాసం, దీక్ష, పట్టుదల, సాటిమనిషియందు దయ, సుహృద్భావం వంటివెన్నో సార్వకాలీనం, సార్వజనీనం అయినవి మనం స్వీకరించగలవి కనిపిస్తాయి.

సంప్రదాయాలకి వ్యతిరేకం అనిపించే అంశాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి ప్రహ్లాదుడిభక్తిని అందరూ మెచ్చుకుంటారు. ప్రహ్లాదుడు రాక్షసుడు. వారివంశంలో శ్రీహరి దేవుడు కాడు. పైగా చిన్నవాడు. సంప్రదాయంప్రకారం తండ్రి మాట వినాలి. ప్రహ్లాదుడు వినలేదు. ఆమేరకి ప్రహ్లాదుడిధోరణి ఆదర్శప్రాయంగా లేదు. కానీ మరోవిధంగా చూస్తే అతని దీక్ష, పట్టుదల, దృఢవిశ్వాసం ఆదర్శప్రాయాలే. తాను నమ్మినదానియందు సంపూర్ణంగా మనసు పెట్టి తనని దానికి సమర్పించుకున్నాడు. జాగ్రత్తగా పరిశీలించి చూిస్తే ఈనాడు బిజినెస్ క్లాసులలో కూడా వీటిని ప్రాథమిక లక్షణాలుగా చెప్పడం కనిపిస్తుంది.

ఈకథగురించి మాఅమ్మ ఒక మాట అనడం నాకిప్పటికీ గుర్తుంది. పరస్త్రీలు ఎదురైన మాతృభావము చేసి మరలువాడు అని ఒక వాక్యం. ప్రహ్లాదుడు ఐదు వర్షములప్రాయమువాడు. ఐదేళ్ళవాడికి మాతృభావము కాక మరేముంటుంది అంది మాఅమ్మ ఒకసారి. చిన్న హాస్యం అంతే. (ఇప్పటిపిల్లలు కాదులెండి). అలా అన్నంతమాత్రాన మాఅమ్మకి భక్తి లేదని కాదు. ఇది కూడా మనసంప్రదాయంలో భాగమే. భగవంతునికి మానవనైజమైన ప్రమాణాలు ఆపాదిస్తాం. ఇదే మాట నాస్తికులు అంటే హేళనగా అనిపిస్తుంది. మీకు అర్థం కాదులెండి అంటాం.

అజామిళుడు దుర్మార్గాలు ఎన్ని చేసినా, అంత్యదశలో నారాయణా అని కుమారుని, దైవాన్ని కాదు, పిలిచినంతమాత్రనే మోక్షం లభించింది. అలా అయితే అందరూ అలాగే చేయొచ్చు అని ప్రశ్నిస్తారు నమ్మకం లేనివారు. అలాగే తంఢ్రి ఆజ్ఞమేరకు పరశురాముడు తల్లిని వధించేడని అందరూ అలా చెయ్యొచ్చనుకోవాలా? లేదు. తండ్రి ఆమెని తిరిగి బతికించగలసమర్థుడని పరశురాముడికి తెలుసు కనకనే తండ్రిఆజ్ఞమేరకు తల్లిని వధించేడు, అందరూ అలా చేయరాదు అని స్పష్టం చేసేరు పోతనగారు.

నేను నాస్తికవాదం పుస్తకాలు అట్టే చదవలేదు. కుటుంబరావుగారి “వేదాల్లో ఏముంది” చదివేను. రెండు మూడు నాస్తికవాద పత్రికలు చూసేను ఎవరో ఇస్తే. వీటిలో తమవాదానికి ఉదాహరణలుగా ఇచ్చిన కథనాలలో మాత్రం నాకు బలం కనిపించలేదు.  కొ.కు.గారి పుస్తకంలో ఇచ్చిన ఉదాహరణలు నాకు జ్ఞాపకం లేవు సుమారుగా వారి వాదనలు ఇలా ఉన్నాయి మట్టిబొమ్మకి ప్రాణం పోయడం ఏమిటి, మనిషికి ఏనుగుతల అతికించి బతికించడం ఏమిటి, కుండలోనించి మనిషి పుట్టడం ఏమిటిలాటివి. ఇవి అసంభవాలు, వీటిని నమ్మడమేమిటి అని ఆయనవాదన. కానీ ఆయనే నడిపిన చందమామలో ఇలాటి కథలు అనేకం ఉన్నాయి. వాటిలో అద్భుత రసం ప్రధానమనే కదా. పెద్దలు కూడా చదివి ఆనందించేరవి. ఇప్పటికీ వాటిని ఎంతో ప్రేమగా తలుచుకుంటున్నారు. అలాగే జానపదగాథలు, సినిమాలు, సై-ఫై నవలలూను. వీటన్నటిలోనూ అద్భుతం. చిత్రవిచిత్రాలూ మనని ఆకట్టుకునేవి అనేకం పొందుపరచబడ్డాయి. ఇంకా సూక్ష్మంగా పరికిస్తే, వాటన్నిటిలోనూ సందేశం కూడా ఉంటుంది. మంచికి విజయం, చెడుకి అపజయం ఉంటుంది ప్రతి కథలోనూ. అంటే ఆయా పాత్రలు, రాజులు, రాక్షసులు మంచికీ, చెడుకీ ప్రతీకలు మాత్రమే. ఇదే పురాణాల్లో కూడా అని అనుకోవచ్చు కదా. నిజానికి భారతం ఆనాటి ప్రజలలో ధర్మప్రవృత్తి  పునః ప్రతిష్ఠించడానికి రాయబడింది అని చదివేను ఎక్కడో.

ఒక్కమాటలో ఏ సాహిత్యం తీసుకున్నా, ఎలా వాదించదలుచుకుంటే అలా వాదించడానికి వీలుగా అంశాలు అనేకం కనిపిస్తాయి. సైతాను సైతం తనకి అనుకూలమైన ఉదాహరణలు బైబిలులో చూపగలడని అందుకే అంటారు. ఒకొక చిన్న సంఘటన, ఒక వాక్యం విడిగా తీసుకుని తమ వాదనకి అనుకూలంగా ఉదాహరణలు ఇవ్వొచ్చు. కానీ స్థూలంగా, మొత్తం గ్రంథం ఏమి చెపుతోంది అని ఆలోచించి మనకి ఉపయోగపడే విధంగా వాడుకోవచ్చు. శాస్త్రాలలో, పురాణాల్లో, వేదాంతగ్రంథాల్లో కొన్ని నైతికవిలువలు పొందుపరచబడ్డాయి. అవి అన్నీ ఈనాటి సమాజానికి వర్తించకపోవచ్చు. కానీ ఉపయోగపడేవి తీసుకోడంలో తప్పు నాకు కనిపించడం లేదు. ఎవరు ఎలా చదువుతారు, ఎందుకు చదువుతారు అన్నది ఆయా చదువరుల ప్రవృత్తులూ, సంస్కారం, విజ్ఞానం, పాండిత్యాన్నిబట్టీ ఉంటుంది. ఇది ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నాంటే, ఎదటివారి నమ్మకాలను హేళన చేసి గెలవడం ఎప్పుడూ సాధ్యం కాదు. మాటకి మాట తెగులు కద. వారి నమ్మకాలనుండే ఉదాహరణలు తీసుకు గెలవడం తేలికా, అందమూను.

భాగవతం చదువుతుంటే అసంబద్ధం అనిపించిన ఘట్టాలు లేకపోలేదు. కానీ నన్ను అవి బాధించవు. ఎందుచేతంటే నేను భక్తిమార్గం వెతుక్కుంటూ చదవడం లేదు. అందులోని భాష ఆనందిస్తూ చదువుతున్నాను.

అవి కూడా ఇక్కడ ప్రస్తావిస్తాను. నా మొదటి ప్రతిపాదన – సాధారణంగా ఒక పుస్తకంలోని వాక్కులు గానీ ఒక జ్ఞాని చెప్పిన వాక్కులు గానీ నూటికి నూరు పాళ్ళు అంగీకారయోగ్యం కాదని చాలామంది ఒప్పుకుంటారు. అంగీకరించడానికి వీలుగా ఉండవు, ఎప్పుడో తప్ప.  ఒకొకప్పుడు ఆ సిద్ధాంతకర్తలే తమజీవితకాలంలో అంగీకరించడం కూడా జరుగుతుందది. చలం తాను అలా రాసిఉండకూడదని చరమదశలో అన్నది చాలామందికి తెలిసే ఉండాలి. ఫ్రాయిడ్ కూడా తన సిద్ధాంతాలకి అనుకూలంకానీ పరిశోధనాంశాలను దాచి పెట్టినట్టు చెప్పుకుంటారు. అయినా ఆ పుస్తకం అంటేనో ఆ వ్యక్తి అంటేనో ఎనలేని గౌరవం పెంచుకున్నవారిని చూస్తున్నాం.

చంద్రగ్రహణం సమయంలో గర్భవతి అయినభార్యని బయటికి తీసుకెళ్ళి గ్రహణం చూపి, ఆ తరవాత పిల్లవాడికి ఏలోపమూ రాలేదు కనక గర్భవతులు చంద్రగ్రహణం చూడరాదనడం మూర్ఖత్వం అని వాదించడం అలాటిదే. ఒకసందర్భంలో అది నిజం కానంతమాత్రాన ఆ సిద్ధాంతాన్ని విపక్షం చేసినట్టు కాదు. ప్రతి సిద్ధాంతానికీ మినహాయింపులుంటాయన్నది అందరికీ తెలిసిందే.

మరో చిన్న కథ చెప్పుకుందాం. సంప్రదాయాలు ఎలా వస్తాయో ఉదాహరణకి. కొత్తగా కాపురం పెట్టిన ఒక చిన్నది పుట్టింటినించి తెచ్చుకున్న పెద్ద బాణలిలో కూరొండుతోంది. అది చూసి ఆపిల్ల విభుడు, “ఎందుకంత పెద్ద బాణలి, ఇద్దరికే కదా,” అన్నాడు.

ఆ పిల్ల, “ఏమో, మాఅమ్మ ఇదే వాడేది,” అని, ఆ తరవాత తల్లిని అడిగింది ఇంత పెద్ద బాణలి ఎందుకు అని. ఆవిడ, “ఏమో, మాఅమ్మ ఇదే వాడింది,” అంది. ఆతరవాత వాళ్లమ్మని అంటే అమ్మమ్మని అడిగింది. ఆవిడ, “నాకాలంనాడు ఇంటినిండా జనం, వచ్చేపోయే చుట్టాలు. అంచేత అది కావలసి వచ్చింది. ఆ తరవాత, క్రమంగా జనం తగ్గిపోయినా, మళ్ళీ వేరే కొనడం ఎందుకని అదే వాడుతున్నా,” అని జవాబిచ్చింది. సంప్రదాయాలు ఏర్పడడానికి ఇలాటివే ఏవో కారణాలుంటాయి. అందులో ఏవి పనికొస్తాయో ఏవి పనికిరావో మనమే చూసుకోవాలి మరి.

నిజానికి సంప్రదాయాలకీ మతపరమైన విశ్వాసాలకీ తేడా ఉంది కానీ మూర్ఖత్వంలో లేదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. స్థూలంగా మనదేశంలో చిన్నవాళ్ళు పెద్దవాళ్లని గౌరవించడం తీసుకుందాం.

బ్లాగులో ఇది కొంత అనుభవమే అయినా ముఖపుస్తకం ప్రవేశించేక మరింత స్ఫష్టయింది. అక్కడ ‘మీరు’ అనొద్దు, ‘గారు’ చేర్చవద్దు అని ఎవరో ఒకరు అన్నప్పుడల్లా నాకు కనిపించేది సంప్రదాయపూర్వకమైన గౌరవమే. ఆస్తులూ, అంతస్థులూ, విద్య, ఉద్యాగాలు, ఏది ప్రమాణంగా తీసుకున్నా, వీరంతా నాకంటే అధికులే. నా అధిక్యం ఒక్క వయసులో మాత్రమే. అంటే వీరు సంప్రదాయాన్ని ఏమాత్రమో గుర్తిస్తున్నారనే కదా.

ప్రహ్లాదుడు తండ్రినీ, గురువునూ కూడా ధిక్కరించి, హరినామస్మరణ చేస్తాడు. మరి ప్రహ్లాదుడికి మర్యాదలు తెలీవా? ఈ ప్రశ్నకి సమాధానం నాకు తెలీదు. కానీ నాకు నచ్చినభాగం, మనం ఈనాటికీ తలుచుకోవలసిన భాగం, “చదువులలోని మర్మెమెల్ల చదివితి తండ్రీ,” అన్న వాక్యం. ఈరోజుల్లో పుస్తకాలు చాలామంది చదువుతున్నారు. స్థూలంగా సమాచారం గ్రహించేస్తారు. కానీ ప్రతిపుస్తకంలో మర్మంమీద ఎంతమంది దృష్టి పెడుతున్నారు? అంటే అట్టేమంది లేదనే నాకు అనిపిస్తుంది. పుస్తకం చదవడం అంటే అక్షరాలు గుర్తు పట్టడం కాదు కదా. నిజానికి కొన్ని పుస్తకాలు చదువుతున్నప్పుడు నా అనుభవం అదే. అక్షరాలు చూస్తాను కానీ అసలు విషయం ఒక్క ముక్క కూడా బుర్రకెక్కదు.

అమెరికాలో వయోబేధంతో పని లేకుండా, ఎంత పెద్దవారినీ పేరు పెట్టి పిలవడం మామూలు. అది ఆ సంస్కృతిలో తప్పు కాదు. మనకి అలా కాదు. అది మనం ఒప్పుకుంటున్నాం కానీ, హా ఇంత చిన్నవాడు లేక చిన్నది నన్ను పేరు పెట్టి పిలుస్తాడా లేక పిలుస్తుందా అని తగువేసుకోడం లేదు కదా. మరి మనవాళ్లు అమెరికనులవిషయంలో పాటిస్తారు. మనవాళ్ళని పిలిచినప్పుడు మాత్రం ఆంటీ అనో అంకుల్ అనో అంటారు. అమెరినులని ఆంటీ అనో అంకులనో అంటే వారు ఆనందించరు.

సంప్రదాయం కాయితంలాటిది.

వెయ్యిరూపాయలనోటూ కాయితమే

అమ్మా నాన్నలబొమ్మా కాయితమే

ముక్కూ మూతీ తుడిచుకోడానికీ కాయితమే.

పదిలంగా దాచుకొనేది ఒకటి

ప్రేమగా ఫ్రేము కట్టి పెట్టుకునేది ఒకటీ

వాడుకున్నాక ఛీ అంటూ చీదరించుకు పారేసేది మరొకటీ.

అంతే కాదు. మీరు వెయ్యిరూపాయలనోటుతో చేతులు తుడుచుకు పారేస్తానంటే ఎవరూ కాదనరు.

వాగ్రూపం, దృశ్యరూపం, ఈ రెంటికీ అతీతంగా స్వతస్సిద్ధమై అంతర్గతంగా ఉన్న రూపం మరొకటీ కదా. వస్తురూపాన్నిబట్టీ వాగ్రూపాన్నిబట్టి ఆ కాయితం విలువ. మతంపేరునా సంప్రదాయం పేరునా కూడా మన ప్రవర్తన అలాటిదే. ఎవరికి గానీ, వారి విద్య, సంస్కారం, సంస్కృతినిబట్టి వారి అభిప్రాయాలు ఏర్పడతాయి. ఏ సంప్రదాయం, విశ్వాసంవల్ల ఏ ఉపయోగం కానీ హాని కానీ కలుగుతుందో గ్రహించి వాడుకోడంలోనే ఉంటాయి తెలివితేటలు అని నేను గట్టిగా నమ్ముతాను. ఇది నా మూర్ఖత్వం.

ఆఖరిమాటగా, నా నిర్ణయం ఏమిటంటే నమ్మకాలున్నవాళ్ళూ లేనివాళ్ళూ కూడా దేవుళ్ళకి మానవనైజం ఆపాదించే తమ అభిప్రాయాలు ఏర్పరుచుకుంటున్నారు. నమ్మినవాళ్ళకి దేవుడు, తల్లి, తండ్రి, సఖుడు, గురుడు అనిపిస్తాడు. తద్వారా తమకి కలిగిన అభిప్రాయాలన్నీ ఆ దేవుడే ఆ రూపంలో తమకి దారి చూపుతున్నాడు అనుకుని సాంత్వన పొందుతారు.

నమ్మకాలు లేనివారు దేవుళ్ళకి మానవనైజం ఆపాదించి, ఇది లోకంలో ఎక్కడా జరగదు అంటూ ధిక్కరిస్తారు. వారూ, వీరూ కూడా అభిప్రాయాలు ఏర్పరుచుకునేది వారి వారి అనుభవాలనుబట్టీ, పరిస్థితులనుబట్టీ. అది గ్రహించి, మరొకరిమీద తమ అభిప్రాయాలు రుద్దనంతకాలం మూర్ఖత్వం కాదు.

ఎలా చూసినా దైవానికి మానవీయ విలువలు అంటగట్టడమే ప్రథమ తప్పిదం అనుకుంటున్నాను. దేవుడు ఉన్నాడనో లేడనో వాదిస్తే అట్టే లాభం లేదు. ఎవరి నమ్మకాలు వారివి. వాటిని ప్రాతిపదికగా తీసుకుని ఎదటివారిని హింసించడమే మూర్ఖత్వం.

000

(ఫిబ్రవరి 4, 2017)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

13 thoughts on “మూర్ఖత్వం అంటే?”

 1. gbr గారు పెద్ద వ్యాఖ్య రాసేరు. నాకు అర్థం చేసుకోడానికి కొంత సమయం పట్టింది. మీరు సరి చేసినందుకు ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 2. gbr గారు వ్రాసిన కథ తెలిసినదే. ఐతే వారు కొద్దిగా పొరబడ్డారు. కథ ప్రకారంగా, ఆ విధంగా మనుష్యులనూ ఏనుగులనూ పైకెగుర వేసినది భీముడు. భీష్ముడు కాదు.

  మెచ్చుకోండి

 3. మీకు నచ్చినంుకు చాలా సంతోషం చంద్రికా. మారుతున్న కాలంతోపాటు మనం అభిప్రాయాలని గుర్తించే విధానం, వాదిించే విధానం కూడా మార్చుకోవాలి. మీరు ముఖపుస్తకంలో టపా కట్టేసినందుకు చాలా చాలా సంతోషం

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 4. మాలతి గారు చాలా బాగా చెప్పారండీ. దీని మీద ఇప్పుడే నా ముఖ పుస్తకం లో టపా కట్టేసాను. ఏ విషయం అయినా మనం అర్ధం చేసుకోవడం లోనే ఉంటుంది. తల్లితండ్రుల్ని ఎదురిస్తూ మాట్లాడి ప్రహ్లాదుడి బాట లో వెళ్తున్నాను అంటే ఏం చెప్పగలము? ‘ప్రతివారూ నామాటే ఏకైక మరియు అప్రతిహతమైన సత్యము అని గాఢంగా నమ్ముతున్నారు.’ ఇది అహంకారము తప్ప మరేది కాదండి. ఎవర్ని బాధ పెడ్తున్నాము ఎందుకు బాధ పెడ్తున్నాము ఒక్కసారి అనుకోగలిగితే చాలు.

  మెచ్చుకోండి

 5. ​కాలం మారుతోంది కానీ మనం పుట్టిన పాదధాతి తినేవి ఇంకా మిగిలిన పనులు మారలేదు కదా నమ్మకాలూ పోయేయి గౌరవాలు పోయేయి ​విలువలు పోతున్నాయి నాటుకు గెట పెరిగింది 70 లలో కూడా ఓపిక బాగానే ఉంది
  జనమే జయుడికి కుష్టు వస్తుంది అప్పుడు వ్యాసుడినో శుకబ్రహ్మణో (క్షమించండి నాకు జ్ఞాపకం లేదు ఎప్పుడో ఆంధ్రప్రభలో రాసిన కధ) సంప్రతిస్తాడు 18 రోజులు మీ తాతల కదా భారతాన్ని వినిపిస్థా నీ కుష్ఠు పోతుంది కాపోతే రోజు కొత్త వస్త్రాలు కట్టుకొవాలి ఏరోజు వస్త్రం ఆరేసి ఎండబెట్టి మరు రోజు నూతన వస్త్రాన్ని కట్టుకోవాలి
  ​మొదలెట్టేరు 18 రోజులు వినేసరికి కుష్టు పోయింది వొళ్ళంతా చూసుకో అంటే తొడభాగం లో కొద్ద్దిగా ఉండిపోయింది అని విచారిస్తుంటే నీకు అందులో విన్నదానిమీద ఏదో అపనమ్మకం కలిగింది అందువల్లనే యిలా జరిగింది సరే ఆరేసిన వస్త్రాలన్నీ చూపించు అన్నారు భీష్మ పర్వం లో భీష్ముడి యుధ్ధామీద నీకు అనుమానం అలిగింది అవునా ఆడ అని అడగగానే అవును భీష్ముడు యుద్ద్ధం లో మనుషులని కాలితో తన్నేవాడని అడ్డువచ్చింన ఏనుగులనికూడా తెన్నేవాడని అవి ఆకాశంలో యెగిరి కిందకి రాకుండా గుత్వాకర్షణ శక్తిన్ దాటి అక్కడే ఉండిపోయేయని చెప్పేరు నమ్మశక్యం గా లేదు అ​న్నాడు ఆకాలం లో వాళ్ళ బలం ఆంత ఉండేది ఆకాలం లో ఆయుర్ధాయం వేల ఏళ్ళు ఉండేది అని వివరించగానే ఆమాత్రం కుష్టు కూడా పోయింది
  ఈ సన్నివేశం లో మనం ఈ కాలంలో ఎన్ని నమ్మగలం వ్యాసుడికి గురుత్వాకర్షణ శక్తీ గురించి తెలుసనీ ఇది న్యూటన్ సిధ్ధాంతం కాదని ఎంతమంది ఒప్పుకో గలరు తులసి దాసు హనుమాన్ చాలీసాలో సహస్రయోజనాల దూరం లో సూర్యుడున్నాడంటే నమ్మం అన్ని నాసా అదే దూరాన్ని మైళ్ళలో చెప్పినప్పుడు ఓహో అనుకున్నాం

  మెచ్చుకోండి

 6. “ఎవరి నమ్మకాలు వారివి. వాటిని ప్రాతిపదికగా తీసుకుని ఎదటివారిని హింసించడమే మూర్ఖత్వం”
  నేనెప్పుడూ అనుకునేవి మీ బ్లాగ్ లో చదవడం నాకెప్పుడూ బాగా అనిపిస్తుంది 🙂

  మెచ్చుకోండి

 7. ధన్యవాదాలండీ. కాలం మారుతోంది. విశ్లేషింటే విధానం కూడా మారాలి మరి. అన్ని రంగాలలోలాగే ఇక్కడ కూడా స్వతంత్రబుద్ధి అవుసరం.

  మెచ్చుకోండి

 8. మీ విశ్లేషణ చాలా బాగుంది.కవిత్వ దృష్ట్యా భాగవతం నాకు చాలా ఇష్టమైన గ్రంథం మంచి సంప్రదాయాల్ని గౌరవించడం అవసరమే.పురాణాలను లిటరల్ గా చదవకూడదు.సారం గ్రహించాలి.మన స్వతంత్ర బుద్ధి కూడా ఉపయోగించాలి.

  మెచ్చుకోండి

 9. మూర్ఖత్వంబును గనుమోయ్
  చెర్ఖా వోలెన్ జిలేబి చిట్టాడునహో !
  బుర్ఖా వీడి వెదుకగ
  న్యీర్ఖా ద్వేషము తొలంగు నీశుని మహిమన్ !

  జిలేబి

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s