1. సీతాకోక చిలుక (ఆరుద్ర)

(నాకు ఇష్టమైన పాతకథలు – 1)

నాకు ఇష్టమైన పాతకథలు ఉపశీర్షికతో ప్రారంభించిన ఈ ధారవాహినిలో మొదటిది ఇది. ఆదిలోనే హంసపాదు. కథలు అన్నాను కానీ నేను పరిచయం చేయబోతున్న మొదటి రచన కథ కాదు. మైథిలి అబ్బరాజుగారికి ఇది ఇస్తానని చెప్పేను కనకనూ, ఇంకా కొందరికి ఆసక్తి ఉండవచ్చును అనీ ఈ ఆరుద్రగారి రేడియో నాటిక “సీతాకోక చిలుక”తో మొదలు పెడుతున్నాను.

ఆరుద్ర అంటే సినీరచయిత, సమగ్రాంధ్రసాహిత్యం రచయిత, ఇంకా కొందరికి “త్వమేవాహం“ కవిగా పరిచయం. నాకు ఆరుద్ర సాహిత్యపరిచయం “త్వమేవాహం“తోనే మొదలు. 1949లో (కొన్నిచోట్ల ప్రచురణ 1948 అని ఉంది) ప్రచురంచబడింది. 1950-51 ప్రాంతాల్లో మాఅక్కయ్య కొనిచ్చింది నాకు. ఎన్నిమార్లు చదివేనో చెప్పలేను. ఆ పదసౌష్ఠవం, ఊనిక నన్నెంతగా ముగ్ధురాలిని చేసేయో మాటల్లో చెప్పడం కష్టం. ఇంచుమించు కంఠతా పట్టేశాను. మరో రెండు దశాబ్దాలు గడిచేక తెలిసింది అది తెలంగాణాపోరాటంలో హింసకీ, దౌర్జన్యాన్ని అభివ్యక్తీకరణ చేసిన కావ్యమని.

arudraఆరుద్ర ప్రతిభావ్యుత్పత్తులు గల రచయిత అని నేను వేరే చెప్పఖ్ఖర్లేదు. అయితే ఎంతవరకూ ఆరచయితకి తగిన గుర్తుంపు వచ్చింది అన్నది సంశయాస్పదం. అంతే కాదు. పాఠకులు గుర్తించడానికీ, రచయిత తనకి గుర్తింపు లభించిందన్న అనుభూతి పొందడానకీ కూడా కొంత ఎడం ఉండవచ్చు.

మరో కోణం – ప్రతి రచయితకీ తన ప్రతి రచనా అత్యుత్తమ రచన కాదు అని తెలిసే ఉంటుంది. తనకి తానుగా తనకృషికి సార్థకమైనవి అనుకున్నవి కొన్ని ఉంటాయి. వాటికి ప్రాచుర్యం లేనప్పుడు రచయిత కించపడడం జరుగుతుంది. “నేను సృష్టించిన సినిమాసాహిత్యం ఉత్తమసాహిత్యం కాకపోయినా అది కూడు పెడుతుంది,” అన్నారు ఆరుద్ర నాకు రాసిన ఒక ఉత్తరంలో. ఆరుద్రవంటి ప్రథమశ్రేణి రచయిత కూడా “ఏగతి రచియించిరేని సమకాలీకులు మెచ్చరు కదా” అన్న చామకూరకవి పద్యం ఉటంకించేరంటే ఈనాటి రచయితలగురించి ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. “త్వమేవాహం” ప్రచురించాక, ఆ కావ్యానికి తగినగుర్తింపు రాలేదన్న అభిప్రాయం ఆరుద్ర వ్యక్తం చేసేరు. ఇక్కడ శాఖాచంక్రమణమే అయినా మరొక చిన్న మాట చెప్తాను. తెలుగు సాహిత్యం విస్తృతంగా చదువుతున్న ఒక పాఠకుడు నేను ఆరుద్రగురించి ఇంగ్లీషులో రాసిన వ్యాసం చదివి, నావ్యాసంద్వారా తాను ఆరుద్రగురించి తనకి అంతకు పూర్వం తెలియని అనేక విషయాలు తెలిశాయని నాకు మెయిలిచ్చేరు. (వ్యాసం ఇక్కడ  చూడవచ్చు.) నేను చెప్పదలుచుకున్నది ఒక రచయితగురించి అందరూ చెప్తున్నవే పదే పదే రాయడం కాక, మరొక కోణం ఆవిష్కరించాలి.

ఆరుద్రని సినిమా సంగీతరచయితగానే అధికశాతం గుర్తించేరు. ఆతరవాత సమగ్రాంధ్రసాహిత్యం, కూనలమ్మ పదాలు. వారి రచనలలో ప్రత్యేకంగా చెప్పుకోవలసిన రచన త్వమేవాహం. నిజానికి ఇది చూసేక, శ్రీశ్రీ “నేనింక రాయకపోయినా ఫరవాలేద”ని అన్నట్టు ఎక్కడో చదివేను. ఇది తప్పయితే దయచేసి ఎవరైనా చెప్పండి. దిద్దుకుంటాను.

ఇక్కడ పరిచయం చేస్తున్న “సీతాకోకచిలుక“ రేడియోలో కూడా విన్నాను. ఇది నాటిక అయినా వచనకవితలా సాగుతుంది. నాటికకి కావలసిన పాత్రలూ, శిల్పమూ ఉన్నాయి. కాదనడంలేదు. నన్ను ఎక్కువగా ఆకర్షించింది పదవిన్నాణం, ఊనిక. ఇందులో ప్రధానాంశం ఒక లౌక్యుడైన తండ్రి కుమారునికి వధువుని ఏర్పాటు చేయడం. “బెండకాయ ముదరకూడదు బ్రహ్మచారి ముదరకూడదు” అన్న సామెతకి “పెళ్ళి ఈడు కొడుకున్న తండ్రికి రావలసిన కట్నం పోకూడదు” అంటూ ముగ్గురు విలాసినులను కుమారునికి చూపించి నచ్చిన అమ్మాయిని ఎంచుకోమనడంతో ప్రారంభవుతుంది. తండ్రి-కొడుకులమధ్య సంభాషణలూ, ఆ ముగ్గురు విలాసినులతో కుమారుని సంభాషణలూ ఆరుద్రశైలికి మచ్చుతునకలు. విలాసినులు అనడంలో ఒక ఔచిత్యం ఉంది. ఆ వరుడు తన అభిప్రాయాలకి అనుగుణమైన  స్త్రీని వరించడంతో ముగుస్తుంది. ముగ్గురు వధువులూ సమాజంలోని మూడు రకాల అస్తవ్యస్తమూ అగమ్యగోచరమూ అయిన ఆలోచనలకి ప్రతినిధులు. ధనవంతుల సొసైటీభావాలకి వారసురాలొకతె, సారాంశంలేని విషయాలు నిష్ఫలంగా మాటాడే నవనాగరీకతకి మారుపేరు మరో యువతి. ఆ ఇద్దరికీ భిన్నంగా నిర్దుష్టమైన అభిప్రాయాలూ, జీవితంపట్ల స్పష్టమైన అవగాహనా గలిగిన, ఏటిలో కొట్టుకొచ్చిన గులకరాయివంటి వధువుని వరిస్తాడు. రంగుని, బంగారాన్ని, వ్యాపారపుత్రికనీ కాదనీ, సంగీతానికి సప్తస్వరాలు, సాహిత్యంలో యాభైరెండు అక్షరాలే ఆస్తిగా గల చిన్నదానిని ఎంచుకోడమే ఈకథకి ఫలశృతి.

ఈ నాటికలో ఒక విశేషం మనం పాత్ర తత్త్వాలు. ప్రతి పాత్రా తన అభిప్రాయాలను, వ్యక్తిత్వాన్ని అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు చెప్పేస్తాయి.  డొంకతిరుగుడు మాటలు లేవు. గుంభనలు లేవు. ఈ పాత్రతత్వం ఏమిటి అని మనం మథనపడవలసిన అవుసరం లేదు. మరి ఉత్కంఠ ఎలా పోషింపడబడింది అంటే అక్కడే రచయితనైపుణ్యం కనిపిస్తుంది. ప్రతి వాక్యం కవిత్వమే కనక ఇంకా ఇంకా చదవాలని, లేదా వినాలనిపిస్తుంది. రెండోస్థాయిలో ఎవరిని ఎంచుకుంటాడు అన్న ప్రశ్న కలగవచ్చు.

ఈనాటికలో ప్రవేశపెట్టబడిన మరో పాత్ర నేలమన్యంలో అద్భుతమైన చచ్చిపోయినా మాట్లాడే చిలుక. మొదట ప్రవేశపెట్టబడినప్పుడు ఒక ప్రాపుగానే అనిపించినా, చివరలో కథకి ప్రధానమైన సందేశం అందించడంతో అర్థవంతమైన పాత్రగా రూపొందుతుంది.

పెళ్ళి అన్నఅంశం నిత్యనూతనం. పెద్దలు కుదిర్చిన రోజులనుండి అబ్బాయీ అమ్మాయీ తమకి తామే నిర్ణయాలు చేసుకోడంవరకూ – మధ్యలో ఎన్నో మార్పులు వచ్చేయి. ఈనాటి వధూవరుల ఎంపికలలో, స్థూలంగా మౌలికమైన విలువలు ఎలా రూపు దిద్దుకున్నాయో చూస్తాం ఈనాటికలో. ఈనాటి భావజాలంమీద బలమైన వ్యంగ్యాత్మకమైన విసుర్లున్నాయి.

ఆ వ్యంగ్యానికి ఆంగ్లపదాలు దోహదం చేసేయి. నేను ఇటీవల తెలుగుకథలలో ఆంగ్లపదాలు వాడడానికి ఇష్టపడడం లేదు. కానీ కొందరు రచయితలు, రావిశాస్త్రి, ఆరుద్రవంటివారు ఒక ప్రయోజనంం దృష్టిలో పెట్టుకు వాడినట్టు కనిపిస్తుంది. జీవితం రేడియోసెట్టుకి భర్త ఏరియల్, భార్య ఎర్తు. విద్యుచ్ఛక్తి ప్రసారానికి రెండూ అవసరమే. ఇక్కడ ఒక స్థాయిలో ఎదురుగా కనిపిస్తున్న ఉపమ తీసుకోవచ్చు. మరో స్థాయిలో, ఎర్తు భూమి సుస్థిరమైనది. భార్య లౌక్యం తెలిసి సమయస్ఫూర్థితో సంసారాన్ని నడపగలది. ఏరియల్ గాలిలో నడయాడేది, ఊహాలలో విహరించేది అని అన్వయించుకోవచ్చు.

ఆరుద్ర పదాలతో గారడీ చేయడానికి పెట్టింది పేరు. సీతాకోకచిలుకలు నాటికలో ప్రతి ఒక్క వాక్యమూ పరిపుష్టమై మనలని అలరిస్తాయి.  ప్రత్యేకంగా ఉదహరించడానికి ఏవాక్యం ఎంచుకోవాలో నాకు తెలీడం లేదు. మీరే చదివి చదివి చెప్పండి.

ఆంధ్రపత్రిక సచిత్రవారపత్రిక సౌజన్యంతో సీతాకోక చిలుక (రేడియో నాటిక)

ఈ ధారావాహికకి నా ముందుమాట ఇక్కడ

గమనిక – ఇది ఒకరకంగా నాసాహిత్యప్రస్థానంలో భాగం .అనుకోవచ్చు కూడా నామనసులో నిలిచిపోయిన కథలు కనక మీ వ్యాఖ్యానాలు ఈకథకు మాత్రమే పరిమితం చేయగలరు.

000

(ఫిబ్రవరి 9, 2017)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

6 thoughts on “1. సీతాకోక చిలుక (ఆరుద్ర)”

 1. మీ ఆదరణకు దన్యవాదాలు. ఆరుద్రగారిగురించిన సమాచారం చాలాకాలంక్రితం సేకరించినది. ఇప్పుడు అలా సమాచారం సేకరించడానికి నాకు వనరులు లేవు. నాకు గుర్తున్నవి, అడుగున పడిపోతున్నవి మళ్ళీ మీముందు ఉంచుతున్నాను. ఆమీదట ఈనాటి యువత మరింత కృషి చేసి మన కథాసాహిత్యానికి మరింత ప్రాచుర్యం తేగలరని నా ఆశ.

  మెచ్చుకోండి

 2. మాలతి గారూ,
  ఉద్దేశ్యమూ, రాయడమూ రెండూ బాగున్నాయి.
  ఆరుద్ర గారి గురించి మీర్రాసిన వాక్యాలూ బావున్నాయి. ఇది పుస్తకప్రపంచం లోనూ వచ్చింది. సినీవాలీ లోనూ వుంది.
  జగన్నాధరావు గారి గురించి మరికొంచెం రాస్తే బావుండేదేమో! ముఖ్యంగా ఆయన తెలుగు స్వతంత్ర లోనూ, ఆంధ్రజ్యోతి(పాత) లోనూ రాసిన చిన్నచిన్న కధలు (బహుశా తరువాత “ఎదురద్దాలు” అని ఎమెస్కో వాళ్ళు వేసేరనుకుంటా), తెలియనివాళ్ళకి తెలుస్తాయి. తెలిసినవాళ్ళు తలుచుకోవచ్చు.
  అలాగే కె రామలక్ష్మి గారి పార్వతీ క్రిష్ణమూర్తి కధల గురించీ, గోరా శాస్త్రి గారి రచనల గురించీ రాస్తారనే భావిస్తాను.

  అభినందనలతో,

  శ్యామ్

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 3. చాలా సంతోషం లలితా మీ స్పందనకి. నేను రాద్దాం అనుకున్నాను మనసలో చదువుకోడం కాదు పైకి చుకువుకుి చూడండి అని. నిజమే. ఇది వినడానికి శ్రావ్యంగా ఉంటుంది. కృష్ణశాస్త్రిగారిిలా అని కాకు తోచలేదు. సకాలీననురు కదా. ఆనాటి భావకవిత్రవసాహిత్యం ఛాయలు ఉండొచ్చు.

  మెచ్చుకోండి

 4. 1954 ఆంధ్రపత్రిక సంచికలో – ఆరుద్ర గారి “సీతాకోకచిలుక” నాటిక – పేజీలో పక్కన వున్న జోకులు, 15 రూపాయలకే రేడియో ప్రకటనలు చదువుతూ – చదవడమే ఎంతో గొప్పగా అనిపించింది. ఇంక నాటిక నడక poetic గా వుండి వింటే బావుండుననిపించింది. ఆ మూడో అమ్మాయిని – కొంచెం – కృష్ణశాస్త్రిగారు ఆవహించారా – అనేలా మాట్లాడింది. పంచుకున్న మీకు ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 5. మీకే ధన్యవాదాలు చెప్పాలి వనజగారూ. చాలా సంతోషం మీకు నచ్చినందుకు. వీలయినప్పుడే చదివి మీ అబిప్రాయం చెప్పగలరు.

  మెచ్చుకోండి

 6. మాలతీ గారూ .. మీరు అభినందనీయులు. ముందుగా … మీకు హృదయపూర్వక ధన్యవాదాలు . సీతాకోకచిలుక కొంత చదివాను , చాలా అబ్బురం అనిపించింది . తగిన సమయం చూసుకుని చదువుకోవడానికి దిగుమతి చేసుకుని దాచుకున్నాను . ఇంకా చాలా చెప్పాలని ఉంది . భాష చాలడంలేదు,పని ఒత్తిడి కూడా ఉంది . మీకు బహుదా ధన్యవాదాలు .

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s