2. ఇచ్ఛాపురపు జగన్నాథరావుగారి “రసభంగం”

(నాకు ఇష్టమైన పాతకథలు – 2)

ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, భారతి, తెలుగు స్వతంత్ర నేను చదివిన పత్రికలు. ఆంధ్రజ్యోతి తరవాత వచ్చింది. చందా కట్టి ఇంటికి తెప్పించుకునేవాళ్ళం. నాకు ఇష్టమైన ప్రతిరచయిత రాసిన ప్రతి కతా చదివేనని చెప్పలేను కానీ ఆ రోజుల్లో పత్రిక ఇంటికి రాగానే నాకు నచ్చిన రచయితపేరు కనిపిస్తే అది ముందు చదివేదాన్ని. అలాటి రచయితల్లో ఇచ్ఛాపురపు జగన్నాథరావుగారు ఒకరు.

ijraoమామూలుగా నాకు ప్రేమకథలమీద ప్రేమ లేదు. మనస్తత్వాలలో ఉండే భిన్నకోణాలూ,  మానవీయవిలువలూ చిత్రించేకథలు ఎక్కువ నచ్చుతాయి. అలాగే తెలుగు నుడికారం, పదాలపొందిక ఆకట్టుకునేల ఉంటేనే చదువుతాను. అసలు నన్నడిగితే మామూలు వాడుకతెలుగు తెలియాలంటే 1950, 60 దశకాల్లో కథలు చదవాలి అంటాను. అప్పటికి గ్రాంథికం పూర్తిగా వెనకబట్టి, జానుతెనుగు నుడికారం పత్రికలలో స్థిరపడింది. ఇది స్కూళ్ళలో నేర్చుకోగల, నేర్చుకోవలసిన తెలుగు కాదు. అంచేతే ఆనాటి పత్రికలకి అంత ప్రాచుర్యం వచ్చింది కూడా.

కథపేరు “రసభంగం”. కథ ప్రేమకథలబాణీలో మొదలవుతుంది. మామూలుగా అయితే దాటవేసేదాన్నే కానీ రచయితపేరు నాకు పరిచయం కనక చదివేను. నాలుగు వాక్యాలు కాగానే “శకుంతల పుస్తకం విసిరి కొట్టింది” అన్న వాక్యంతో ఇది నాకు నచ్చే కథ అనిపించిఉండాలి.

ఒక అపరిచితడినుండి ఫోను వస్తే ఎవరికైనా తికమకగా ఉంటుంది. ఆ పైన ఆ అమ్మాయి 18ఏళ్ల యువతి అయితే సహజంగానే వివిద ఆలోచనలకీ ఆనుమానాలకీ దారి తీస్తాయి. “ఎవరం”టే డొంకతిరుగుడు సమాధానాలు వస్తే, మనసు మరింత గందరగోళమై, మరే పనీ తోచకుండా చేస్తాయి. అలాటి సమయంలో ఆ యువతికి రావలిసినంత కోపం రాడం సహజమే. “ఎక్కడుంటార”న్న ప్రశ్నకి “మీలాటివారి ఔన్నత్యాలకింద,” అని జవాబు వస్తుంది. ఔన్నత్యాలకింద అనడంలో ఔచిత్యం, చమత్కారం చివరలో కానీ మనకి తెలీదు. నాకథల్లో ఎక్కడయినా ఈ పదం వాడిఉంటే, ఇక్కడినుంచి తీసుకున్నదే కావచ్చు అదే అర్థంలో అయినా కాకపోయినా ఈపదం నాకు పరిచయమయింది ఈకథతోనే అని చెప్పగలను.

కొంటెతనమో, దుర్బుద్దో అనిపించే ఫోన్ కాల్ విలాసం రచయిత చాలా బాగా నడిపేరు. ఆ వెనక నిరాడంబరమైన హాస్యమే కాక, యువతీయువకుల మనస్తత్త్వాలను గురించిన అవగాహన కూడా కనిపించడమే ఈకథలో విశేషం.

కథలో మీకుతూహలాన్ని నిలపాలి కనక ఇంతకంటే ఎక్కువ చెప్పను. మీరే చదివి మీ అభిప్రాయాలు చెప్పండి.

ఒక కథే అన్నాను కానీ జగన్నాథరావుగారి మరొక కథ, నాకు చాలా నచ్చినకథ, “దనం చేసిన దేవత” యువదంపతులమధ్య అభిప్రాయబేధాలు, ఖర్చులగురించి వాదనలూ కొత్తా కాదు వింతా కాదు. చాలామందికి అనుభవమే. పజిల్సు చూపే పెద్ద మొత్తాలుగా ఇవ్వజూరే బహుమతులకోసం శర్మ చేసే ఖర్చుకి భార్య పార్వతికి నచ్చదు ముఖ్యంగా వారి ఆర్థికపరిస్థితులదృష్ట్యా. ఈకథలో కూడా సంభాషణలు అత్యంత సహజంగా ఉన్నాయి. ఇక్కడ నాకు ఎక్కువగా నచ్చిన భాగం ఇద్దరూ రెండోవారికోణం కూడా ఆలోచించడం. పంతాలకు పోయినప్పుడు నేనే రైటు అన్న పట్టుదల బాగానే ఉంటుంది ఎవరికైనా. అయితే భార్యాభర్తలమధ్య ఆప్యాయతలమూలంగా, పాపం తను మాత్రం ఏం చేస్తుంది, ఏం చేయగలరు అనుకుంటూ రెండోవారికోణం చూడడం కూడా మద్యమద్యలో జరుగుతూంటూంది. ఈ అంతర్మథనం చక్కగా ఆవిష్కరించేరు జగన్నాథరావుగారు.

నాకీకథ గుర్తిండడానికి ఒక ముఖ్యకారణం శీర్షిక. “ధనం చేసిన దేవత,” అప్పట్లో నాకు ఆ హాస్యమే కనిపించింది. ఇప్పుడు నాకు కొత్తగా సందేహం కలుగుతోంది. ధనం చేసిన దేవత అనడంలో ధనమే ప్రధానం అనిపిస్తోంది కదా. పార్వతి తీసుకున్న నిర్ణయం, చేసినపని శర్మకి అనుకూలంగా కాకపోతే, పార్వితి దేవత కాకుండా పోతుందా? కథ చదువుతున్నంతసేపూ మనకి అలా అనిపించదు. శర్మ పార్వతి వాదన సమంజసంగానే ఉన్నట్టు, పార్వతితప్పు కాదు అనుకుంటూనే ఉంటాడు. మీరు చదివి, మీ అభిప్రాయాలు చెప్పండి.

ఇంతకంటె ఎక్కువ చెప్పను. మీకు మీరే చదివి ఆనందించాలని.

కథలకి లింకులు, కథానిలయం.కాం వారి సౌజన్యంతో.

  1. రసభంగం http___kathanilayam-com_story_pdf_50210

2. ధనం చేసిన దేవత http___kathanilayam-com_story_pdf_18214

మరిన్ని కథలు ఇచ్ఛాపురం జగన్నాథరావుగారివి చదవాలనుకుంటే ఈ లింకు చూడండి. కథానిలయం

000

(ఫిబ్రవరి 13, 2017)

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

4 thoughts on “2. ఇచ్ఛాపురపు జగన్నాథరావుగారి “రసభంగం””

  1. “రసభంగం” కథ చదివాను – చివరిలో మెలిక మేలిక 🙂 ఒక సందేహం – డిగ్రీ 18 ఏళ్లకి అయిపోతుందా ?అలాగే ఇది ఇంత పాత కథ కదా – ఆ రోజుల్లో కూడా అమ్మాయిలు అంత చొరవగా వుండేవారా – అని?!

    మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.