యు. సత్యబాల సుశీలాదేవి గారి “ఆ గదిలోనే.” (1931)

(నాకు ఇష్టమైన పాతకథలు – 4)

నేను మొట్టమొదటిసారిగా యు. సత్యబాల సుశీలాదేవిగారు రాసిన “ఆ గదిలోనే” కథగురించి విన్నది 2006లో విశాఖపట్నంలో. రావిశాస్త్రిగారు మెచ్చుకున్నకథ అని విన్నాక ఈకథకోసం అప్పట్నుంచీ వెతుకుతూనే ఉన్నాను. రెండేళ్ళక్రితం రమణమూర్తిగారిని అడిగితే, ఆకథ పంపుతూ, దానితోపాటు రాచకొండ విశ్వననాథశాస్త్రిగారి కథ “వెన్నెల” కూడా పంపేరు. ఆ రెండుకథలమీద వ్యాసం రాయమని సూచిస్తూ. అప్పట్నుంచీ ఆలోచిస్తూనే ఉన్నాను. ఇది క్లిష్టతరమైన పని. ప్రధానకారణం మొదటి కథ ఒక్క పేజీయే. రెండోకథ రెండు పేజీలు. ఏం రాయను? సూచనప్రాయంగా  పోలికలు ఉన్నాయి అనిపించింది కానీ రాయడానికేమీ తోచలేదు. ఈమధ్య చాలామంది కథంతా చెప్పేసి. కొసమెరుపు మీరు ఊహించలేనిదయితే అది కూడా చెప్పేసి సమీక్షపేరుతో తమకి తోచిన రెండు ముక్కలు రాస్తున్నారు కానీ నాకది సమ్మతం కాదు.

“ఆ గదిలోనే” కథ నవంబరు 1931 గృహలక్ష్మిలో ప్రచురింపబడింది. రచయిత్రి శ్రీమతి యు. సత్యబాల సుశీలాదేవిగారిగురించి వివరాలు ఎక్కడా దొరకలేదు. గృహలక్ష్మి పత్రికలోనే మరో నాలుగు కథలు ప్రచురించినట్టు కథానిలయం సైటులో ఉంది కనక ఆమె ఆ పత్రికకే ఎక్కువగా రాసి ఉండొచ్చు అని తోస్తోంది. యు అంటే ఉపద్రష్ట కానీ ఉపాధ్యాయుల అని కానీ అనుకుంటున్నాను. ఇది నా ఊహ మాత్రమే.

“ఆ గదిలోనే” కథ సూక్ష్మంగా ఒక బాలిక అమల జీవితం ఆగదితో ఎంతగా పెనవేసుకుపోయి ఉందో ఆవిష్కరించడం జరిగింది. ఆద్యంతాలా ప్రతి సన్నివేశమూ, ప్రతి సంఘటనా, ఆనందమయినవీ దుఃఖకారణమయినవీ కూడా ఆగదిలోనో ఆ గదిలోనించి చూస్తూనో (కిటికీలోంచో, తలుపుదగ్గర నిలబడో కావచ్చు) అమల అనుభవించినట్టు చిత్రించారు రచయిత్రి. ప్రతి సన్నివేశం రెండు మూడు వాక్యాలలో చెప్పి, “ఆగదిలోనే” అనో “ఆగదిలోంచే” అనో ముగించడంతో ఒక రకమైన ఊనిక వస్తుంది. జానపదగేయాల్లో చూస్తాం ఇలాటి ప్రయోగం – ఏలేలో అనో, ఓలమ్మా అనో. కృతులలో పల్లవి కూడా అలాటిదే. రమణమూర్తిగారు దీన్ని motif అన్నారు. ఆ గదిలోనే అన్నపదాన్ని మళ్ళీ మళ్లీ ప్రయోగించడంతో ఆ గదికి గల ప్రత్యేకతని ఒత్తి పలుకుతున్న భావన మనకి కలుగుతుంది. ఇది ఒక బాలిక కథ మాత్రమే కాదు ఆబాలికజీవితం ఆగదితో అంత బలంగానూ పెనవేసుకుపోయి ఉందని రచయిత్రి మనని హెచ్చరిస్తున్నారు. మనిషికి భావానుబంధాలు (sentiments) ఎక్కువ. ఆ భావన ఈకథలో రెండవ ప్రధానాంశంగా రూపొందింది.

ప్రతి సన్నివేశం కానీ సంఘటన కానీ రెండు, మూడు వాక్యాలలో ముగించేయడవల్ల మనమే ఆ చిత్రం సంపూర్ణంగా ఆకళించుకోవాలి. ఇంకా ఆ తలపు పచ్చగా ఉండగానే మరో సన్నివేశం మొదలవుతుంది. ఒకరకంగా చూస్తే,  ఒక చిన్న నవల కాగల సమాచారం ఒక్కపుటలో ఆవిష్కరించేరు సత్యబాల సుశీలాదేవిగారు. ఈవిధంగా కథ నడుపుతూ హృదయానికి హత్తుకునేలా ముగించడం ఒక ఎత్తు అయితే, ఈకథలో ప్రధానమైన కరుణరసం ఎవరిపరంగా చెప్తున్నారు అన్నది మరొక ఎత్తు. కథ ముగిసేసరికి మనహృదయం బరువు అవుతుంది. ప్రతిభావంతమైన ముగింపు.

ఈకథ format కొంచెం మార్చి గదిలోనే అన్నచోట విరుపు ఇచ్చి కొత్త పేరా చొప్పించితే, వచనకవితలా ఉండి, సన్నివేశంమీద సన్నివేశం, ఇటికమీద ఇటిక పేర్చినట్టు పటిష్టంగా సాగిపోతుంది. భాష ఆనాడు ప్రచారంలో ఉన్న శిష్టజనవ్యావహారికం, అప్పట్లో వాడుకలో ఉన్న సంస్కృతసమాసాలతో సహజంగా ఉంది.

రాచకొండ విశ్వనాథశాస్త్రిగారి కథ “వెన్నెల” ఆగస్టు 15, 1997, ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురించారు. “ఆ గదిలోనే” కథలో గది కేంద్రమయి కథ ఆ కేంద్రబిందువుచుట్టూ పరిభ్రమిస్తుంది.  “వెన్నెల” కథలో వెన్నెల అంతస్సూత్రంగా కథపొడుగునా దర్శనమిస్తుంది. అంటే మొదటికథలో ఇలా లేదని కాదు. ఒకరోజు వెన్నెలకీ మరోరోజు వెన్నెలకీ ఎడం ఉన్నట్టు ఆ గదికి లేదు. గది ఎల్లవేళలా ఉంది. వెన్నెల కురియడంలో ఎగుడూ దిగుడూ ఉంది కదా. అది కథలో కూడా కనిపించింది.

ఒక యువకుడిజీవితంలో జరిగే సంఘటనలమీద కురిసేవెన్నెల. ఆ యువకుడు కథ పొడుగూతా “నాబతుకెలా ఉన్నా ఆ వెన్నెల అలాగే ఉంది,” అనుకుంటున్నట్టు కూడా అనిపిస్తుంది ఒకొకచోట. రోజు రోజుకూ మారిపోతున్న తనజీవితంలో ఆ వెన్నెల ఒక్కటే మారనిది, సుస్థిరమైనది(constant) అని అతనికి ఊరట కలిగిస్తుంది. రెండు కథల్లో సామ్యం అంతవరకే.

ప్రతీత్మకంగా చూస్తే, గదికి నాలుగుగోడలు. అది పరిమితం. ఆ బాలికజీవితం ఆనాలుగు గోడలమధ్యే అంటే అదొక జైలు అని కాదు. గది భద్రతకి కూడా ప్రతీక. మనుషులందరికీ నివాసం గదే కదా. అందుకు భిన్నంగా వెన్నెల నిరవిధికం. విశ్వవ్యాప్తం. గది భౌతికం. వెన్నెల భావగర్భితం, మానవులజీవితంలో గదికున్న ప్రాధాన్యత వెన్నెలకి లేదనే అనుకుంటాను. అంతే కాదు. “ఆ గదిలోనే” రచయిత్రి వాడుకున్నంత పటిష్టంగా “వెన్నెల” కథలో లేదు. రచయిత సంఘసంస్కరణకి సంబంధించిన భావజాలఛాయలు బాగా కనిపిస్తాయి. నాదృష్టిలో ఏదో ఒకవాదంకోసం కథ మలిస్తే, సాహిత్యపరంగా పేలమయిపోతుంది. రావిశాస్త్రిగారి తొలిదశలో రాసినకథలు నేను చాలా అభిమానిస్తాను. మలిదశలో ఆయన రాసినవేవీ నన్ను ఆకర్షించలేదు. ఈ కథ “వెన్నెల” ఆయన ఒక వాదాన్ని వరించినతరవాత రాసిందే. ఆ వాదనలఛాయల లేకపోతే బాగుండు అనిపించింది. కానీ రెండు కథల్లోనూ వాక్యాంతంలో ఏవకారం లేక అవధారణ (emphasis) బలంగా ఉంది. ఆ ఏవకారం పాఠకుడిని పట్టి నిలబెడుతుంది. కడుపులోంచి దేవినట్టు కలవరపరుస్తుంది.

కొత్తగా కథలు రాయడం ప్రారంభించిన రచయితలకు ఈ రెండు కథలూ మంచి పాఠం కావచ్చు కూడా.

000

కథలకి లింకులు, రమణమూర్తిగారికి ధన్యవాదాలు. గృహలక్ష్మి, ఆంధ్రజ్యోతి సౌజన్యంతో –

ఆ గదిలోోనే –u-satyabala-suseela-devi-aa-gadilone

వెన్నెల  –rachakonda-viswanatha-sastry-vennela

ఈ రెండు కథలూ నాకు అందించి వ్యాసం రాయమని ప్రోత్సహించిన ఎ.వి. రమణమూర్తిగారికి దన్యవాదాలు.

000

(ఫిబ్రవరి 21, 2017)

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

2 thoughts on “యు. సత్యబాల సుశీలాదేవి గారి “ఆ గదిలోనే.” (1931)”

 1. చాలా కొత్త విషయాలు చెప్పేరు. అవును, భరణిగారి కవిత నేను కూడా అనుకున్నాను. మిగతా విషయాలు నాకు తెలీవు. ఏమైనా scan చేసిన పాత పత్తికలు చూడడం నాక్కూడా బాగుంది. ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 2. రెండు కథలూ చదివానండి – బాధించాయి. ముఖ్యంగా మొదటి కథ. ఆ గదిలో ఏం జరిగిందో తెలుసుకోకుండా వుంటేనే బావుండేదేమో అనిపించింది.

  రావి శాస్త్రి గారి కథల పేజీల్లో తనికెళ్ల భరణిగారి కవిత బోనస్ లా దొరికింది 🙂

  రావిశాస్త్రిగారు కథని అంకితమిచ్చినవారి పేర్లలో శ్రీరంగం రాజేశ్వరరావుగారి పేరు చూసి నేను కాలేజ్ లో వున్నప్పుడు చదివిన “ఎర్ర చీర” కథా సంకలనం గుర్తుకొచ్చింది. చాలా చిన్నవయసులోనే ఆ కథలు రాసిన రాజేశ్వరరావుగారు ఎక్కడో తప్పిపోయారని చదివాను ఆ పుస్తకం వెనకాల.

  కానీ ఇటీవల చదివిన “బీనాదేవీయం” లో అసలు సంగతి తెలిసింది – ఆయన నేలబావిలో పడిపోయారని 😦

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s