పురాణపాత్రల తిరగరాతలు!

“తిరగరాత” అంటే తిరగేసి, తలకిందులు చేసి రాయడం అని నిశ్చియించుకున్నాను నాటపాకి అవసరార్థం.

ఈ తిరగరాతలు ఎప్పుడు మొదలయేయో నాకు తెలీదు కానీ సుమారుగా పదిహేనేళ్ళయిందేమో పురాణపాత్రలను తీసుకుని కొత్తకోణం మలిచే ప్రయత్నం అని పేరు పెట్టి సామాజిక, రాజకీయనినాదాలకి అనుకగుణంగా తీరిచి దిద్దడం. దీనిని పునరుద్ధరణ అనలేం కనక ఉద్దరణ అనే అనుకుందాం. ఇలా తిరగరాస్తున్నవారు రచయితలుగా పేరు ప్రతిష్ఠలు సంపాదించుకున్నవారే కావడం గమనార్హం.

ఐదారేళ్లక్రితం నాకు స్నేహితురాలయిన ఒక రచయిత్రి ఇలా ఒక పురాణపాత్రని తీసుకుని తిరగరాస్తున్నానని చెప్పినప్పుడు నా అభ్యంతరం తెలియజేసేను నాకు తనతో ఆ మాత్రం చనువుండడంచేత. ఆ చర్చ అక్కడితో ఆగిపోయింది కానీ నన్ను మాత్రం ఆ ఆలోచన వదల్లేదు. నాకు ఎందుకు నచ్చదో, ఎందుకు నాకు సమ్మతం కాదో వివరించడానికి నాప్రయత్నం ఈ టపా.

సాహిత్యం ఏ కాలంలోనూ ప్రతీకాత్మకమే. ఉన్నదున్నట్టు, చూసింది చూసినట్టు, విన్నది విన్నట్టు సృజనాత్మక రచయితలు రాయరు. “భారతం మూలకథ నిజంగా జరిగిందేనటండి,” అన్నారొకాయన నాతో. భారతమే కాదు ఈనాడు ఏ కథ తీసుకున్నా నిజంగా జరిగిన సంఘటనే కదా ఆకథకి ఆధారం. ఒక సంఘటనకి చిలవలు, పలవలు చేర్చి, ఉత్ర్పేక్షలూ ఉపమలూ, జాతీయాలూవంటి అనేక అలంకరణలూ సమకూర్చి ఆకథలో వస్తువుని ఆకర్షణీయం చేస్తేనే కథ అవుతుంది. పాఠకులని ఆకర్షిస్తుంది.

వాల్మీకినుండీ విశ్వనాథ సత్యనారాయణగారివరకూ ఎన్నో రామాయణాలు వచ్చేయి. బహుశా వాల్మీకికి ముందూ సత్యనారాయణగారితరవాతా కూడా ఇంకా కొన్ని పాఠాంతరాలుండి ఉండవచ్చు. నేను ఇక్కడ విశదం చేయదలుచుకున్నది, నాకు చేతనయింతలో, ఇంతమంది మళ్ళీ మళ్ళీ రాస్తున్న రామాయణాలకీ ఇప్పుడు కొత్తగా కొన్ని పాత్రలను తీసుకుని వాటిని తిరగరాస్తున్నవాటికీ కొట్టొచ్చినట్టు కనిపించే వ్యత్యాసం దృక్పథాలలో.

ఆ రామాయణాల్లో మౌలికమైన పాత్రలు, వాటి తత్త్వాలను మార్చకుండా ఆవిష్కరించడం జరిగింది. ఇవన్నీ నేను చదివేనని చెప్పడం లేదు. స్థూలంగా నా అభిప్రాయం ఇది. వాటికి ప్రాచుర్యం అలా కొనసాగడానికి కారణం అదే అనుకుంటున్నాను. రాముడు ధీరోదాత్తనాయకుడు. సీత జ్ఞాని. జ్ఢాని అయిన జనకుడి పుత్రిక. సీతారామాంజనేయసంవాదం అన్న బృహద్గ్రంథంలో సీత ఆంజనేయుడికి రామతత్త్వం బోధిస్తుంది. ఇది కూడా అంతకుపూర్వం ఉన్న ఆకృతిని మరొక రకంగా తీర్చి దిద్దడమే అనుకున్నా, ఆయా పాత్రల మూలతత్వంలో మార్పు లేదు. వాటిని విస్తరించి అవే కోణాలను ఆవిష్కరించడమే ఆ గ్రంథానికి ధ్యేయం.

మరొక కోణంలో పరిశీలిస్తే, రాముడు రాజు. సీత రాజపత్ని, రాణి. పాలకులుగా వీరిద్దరికీ ధర్మం ఒకటుంది. అది ప్రజాపాలన. ప్రజల మంచి చెడ్డలు చూడడమే కాక, వారు ఏమనుకుంటున్నారో కనుక్కోడం కూడా వారి విధి. ఒకప్పుడు చారులను పంపి, ఒకప్పుడు తామే మారువేషాలలో సంచరిస్తూనూ అభిప్రాయాలు సేకరించినట్టు చెప్పుకుంటారు. ప్రజాభిప్రాయాన్ని మన్నించే సందర్భంలో, ఆ ప్రజలను నమ్మించడం, అవుసరం అయితే సరి దిద్దడం కూడా ఉంటుంది. రాముడు సీతని అగ్నిప్రవేశం చేయమన్నా, సీత అందుకు సంసిద్ధురాలయినా – ఆ చర్యవెనుక ఒక ధర్మనిర్ణయం ఉంది. ఇక్కడ మరొకసారి మనవి చేస్తున్నాను. సాహిత్యం అంతా ప్రతీకాత్మకమే. సంఘటనలు అన్నీ ఉన్నవి ఉన్నట్టు గ్రహించడం అమాయకత్వమే.

ఆనాటి ఆలోచనలు ఆదారంగా రాముడు వెన్నెముక లేనివాడు, సీత రాముడికి తన ఆసరా కావాలన్న అభిప్రాయంతో అగ్నిప్రవేశం చేసింది అని రాస్తే, అది మాత్రం ఎందుకు అంగీకరించకూడదూ అన్నప్రశ్న తీసుకుందాం. ప్రధానంగా ఈ కథలో రాముడి వ్యక్తిత్వాన్ని మూలకథలో వ్యక్తిత్వానికి భిన్నంగా చిత్రించడం జరిగింది. ఇది మూలకథలో రాముడు ధీరోదాత్తనాయకుడు. ఆ పాత్రని మార్చి రాయడంవల్ల ఇది ఆ కథ కాకుండా పోయింది.

ఉదాహరణకి నేను ఈనాడు ఏ రెంగనాయకమ్మకథనో తీసుకుని ఇలా తిరగేసి రాస్తే, ఆవిడకంటే ముందు ఆవిడగారిఅభిమానులందరూ నన్ను తొక్క ఒలిచేసి ఉప్పూ కారం చల్లరా? సున్నితంగా ఇది ఆకథ కాదమ్మా అంటూ బుజ్జగించి చెప్పరు.

రెండో కోణం చూదాం. ఇదే కథ సీత, అహల్యవంటి పురాణపాత్రలపేర్లు తీసేసి, రామాయణానికి రిఫరెన్స్ తొలగించి, రాస్తే, ఎంతమంది ఆ కథకి ఇప్పుడు వచ్చిన ప్రాచుర్యం వచ్చిఉండేదా అంటే అనుమానమే. అంటే ఆపేర్లు వాడుకోడం కేవలం ప్రచారంకోసమే అనిపించదా?

మరి ఏ పాఠకులని ఆకట్టుకుంటుంది? ఏమి సాధిస్తుంది? అన్న ప్రశ్నలు వేసుకుందాం చర్చకోసమే.

రామాయణం రంకు భారతం బొంకు అంటూ మొత్తం పురాణసాహిత్యాన్ని నిరసించేవారు మొదటివరస. రెండో వరసలో ఆధునిక భావజాలానికి అంకితమయిపోయినవారు. ఈ రెండు తరగతి పాఠకులకి తమఅభిప్రాయాలలో ఎనలేని నమ్మకం. నిజానికి అవి రామాయణం, భారతంవంటి పురాణగ్రంథాలను అబిమానించేవారికి ఉన్నంత బలంగానూ ఉంటాయి. ప్రస్తుతం చర్చలన్నీ వీరిమధ్య జరుగుతున్నాయి.

మరో తరగతి పాఠకులు – వీరే అధికసంఖ్యాకులు – ఏ కథయినా కథకోసమే చదువుతారు. వీరిలో మొదటి రెండు తరగతులవారిలాగే ఇష్టాయిష్టాలున్నా కథకోసం కథ చదివేవారుంటారు. వారు సీతని, అహల్యనీ మాత్రం పురాణాలలో పాత్రలుగానే గుర్తిస్తారు.

రామాయణం కథ రాయడానికి, దాన్ని ప్రచారంలోకి తీసుకురావడానికి ఒక నిర్దుష్టమైన ధ్యేయం ఉంది. ఒకొకకాలంలోనూ మారుతున్న సమాజానికి ప్రబోధాత్మకంగా, ప్రతీత్మకంగా పునః పునః చిత్రించడం జరిగింది. ప్రతీత్మకం అంటే నిగూఢమైన భావాన్ని స్వీకరించాలి గానీ పైపైపొరల్లో కనిపించేదాన్ని పట్టుకుని విపరీతార్థాలు తీయడం కాదు.

ఆయాకాలాలననుసరించి అనగానే, మరి అదే కదా మేం చేస్తున్నాం అని ఆ తిరగరాత రచయితలు అనొచ్చు. కానీ పైన చెప్పిన రచయితలు తిరగరాయడంలోనూ, ఇప్పటివారు చేస్తున్న తిరగరాతల్లోనూ తేడా ఏమిటంటే మూలవస్తువు తత్వాన్ని విస్మరించడం.

రెండువారాలక్రితం నేను మరొకచోట ఒక వ్యాఖ్య రాసేను,

  “చూచిరాత కంటె తిరగరాత (తిరగేసి రాయడం) ఒక మెట్టు తక్కువ.” ఆ తరవాత చర్చలో “చూచిరాతలో ఉన్నది ఉన్నట్టు రాస్తున్నాం అని ఒప్పుకోడం ఉంది. మేధ లేనివారు ఇలా తిరగరాస్తారు”

అని రాసేను. రెండోవాక్యం సరి కాదు.

ఈ తిరగరాసేవారు రచయితలుగా ప్రసిద్ధులే. ఎటొచ్చీ ఎందుకు తిరగరాస్తున్నారంటే మాత్రం నాకు తోచిన సమాధానాలు అదొకరకం ప్రచారమే అని. స్పష్టంగా కనిపిస్తున్న ఫలితాలు – ఈ కథలకి ఎకాడమీలు బహుమతులిస్తాయి. ఆ వెంటనే ఎకాడమీ బహుమతిగ్రహీతలుగా దేశదేశాలా ప్రముఖ సాహిత్యసంఘాలు సభలు పెట్టి సత్కారాలూ, పురస్కారాలూ సమర్పించుకుంటారు ఘనంగా. ఆ సభలరభసలు కొంతకాలానికి చల్లారుతాయి. అప్పుడు మళ్ళీ ఆ పురస్కారల తిరస్కారాలు మరో ఆర్భాటం.

తెలుగుదేశ సాహిత్యచరిత్రలో 1600-1775 మధ్యకాలాన్ని క్షీణయుగం అన్నారు. ఈనాటి సాహిత్యచరిత్రకి ఏం పేరు పెడితే బాగుంటుంది?

000

(ఫిబ్రవరి 28, 2017)

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

20 thoughts on “పురాణపాత్రల తిరగరాతలు!”

 1. ఆలస్యం ఏమీ లేదండి. మీ అభిప్రాయాలు పంచుకున్నందుకు చాలా సంతోషం. రావిశాస్త్రి, కాళీపట్నం రామారావుగార్లవంటి వారు కూడా అంతే చేసేరు. కొందరు సాహిత్యాభిమానం పేరుతో సృజనాత్మకతని చంపేసారు అనిపిస్తుంది నాకు. ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 2. కొంచెం ఆలస్యంగా వ్యాఖ్య పెడుతున్నాను .రచనల దేశ కాల వాతావరణాలను మర్చి పోయి ,ముఖ్యంగా పురాణ పాత్రలను తిరగ రాయటం ఎంత సబబు అన్న మా లాటి ఎందఱో చదువరుల సందేహాలకు మీ వ్యాసం ఒక లిఖిత రూపం .నిజానికి రంగనాయకమ్మ గారి తొలి రచనలు ఎన్నో సమస్యలను ,సమాజాన్ని అర్థం చేసుకుందికి ఆనాటి వారికి ఉపయోగ పడ్డాయి .కాని ఇజం -ఫెమినిజం చట్రాల్లోకి వెళ్ళాక ఆమె లోని రచయిత్రి చచ్చిపోయిందని పిస్తుంది . అయినా మనం మన కళ్ళజోడు తో చూడాలి గాని వేరేవాళ్ళ కళ్ళజోడు ను పెట్టుకుని పరిసరాలను చూడాలనుకోవటం
  లాటిదే ఇదీ అనిపిస్తుంది . డా.సుమన్ లత

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 3. మీ వ్యాఖ్య తో ఏకీభవిస్తున్నాను.రామాయణ,భారతాల్ని విమర్శించవచ్చు గాని మూలకథని,పాత్రల మౌలికతత్వాల్ని మన యిష్టంవచ్చినట్లు మార్చకూడదు.రంగనాయకమ్మగారు చేసిన తప్పు ఇదే.ఇక్కడ ఒక విశదీకరణ .చాలామంది అనుకొంటున్నట్లు రాముడు సీతను అగ్నిప్రవేశం చెయ్యమనలేదు.ఆవిడే స్వచ్చందంగా అగ్నిప్రవేశం చేసినట్లు వాల్మీకి రామాయణం లో వుంది.

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 4. ఔను, ఆ ప్రశస్తిని వాడుకొని గుర్తింపు తెచ్చుకోవాలన్న ఆలోచన.
  ఇంట్లోని వెండిపళ్ళెం తాకట్టు పెట్టి వాడుకొని, పైనుంచి ఆ వెండి మంచిదికాదు అందుకే తాకట్టుపెట్టాననే (పరీక్ష చేసే నేర్పు, నైపుణ్యం లేకుండానే) వారికీ , వీరికీ తేడా లేదని నా అభిప్రాయం.

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 5. లక్ష్మీదేవిగారూ. కంపెనీల గుడ్ విల్ నికి మరొక వికృతకోణం ఆపాదిస్తున్నట్టు కూడా. మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 6. —— విమర్శను కథ గా వ్రాయాలంటే, ఆ మూలకథ రెఫరెన్సూ ఇవ్వాలి మరి.
  అసలు ఇంకోలా జరిగినట్టు మొత్తం చిత్రీకరణ చేస్తూ పేర్లు, ఊర్లు మాత్రం వాడేసుకుంటే సాహిత్యద్రోహం అనే మాట ఎవరైనా ఒప్పుకోవాల్సిందే.
  (అది సమాజం యొక్క విలువలను ఛిద్రం చేసి అవమానించే సామాజిక ద్రోహం అనే మాట ఒప్పుకున్నా లేకపోయినా)

  కంపెనీ స్థాపించినవారు పోయారు కదాని కంపెనీ గుడ్ విల్ ను కొత్త కంపెనీ వాడుకున్నట్టే అది.

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 7. ఆ కథ విమర్శ కాదు. ఏ గ్రంథంలో పాత్రని విశ్లేషిస్తున్నారో చెప్పి, తమ ఆలోచనలు పంచుకుంటే విమర్శ.
  సీతా, అహల్య పాత్రలు మాత్రం తీసుకున, ఏవిధమైన రిఫరెన్స్ ఇవ్వకుండా, ఉపోద్ఘాతం లేకుండా, కథ రాసి, స్వీరచనగా ప్రుచురించుకోడంలో విమర్శ లేదు. ఈ రెండో కథ మాత్రమే చదివినవారికి మొదటి పాత్ర ఎటా ఆవిష్కరింపబడింతో తెలీకపోవచ్చు. స్వకీయమైన ప్రతిభతో తమ భావాలను ప్రకటించుకోడం ఆదరణీయమే కానీ కొన్ని వందలసంత్సరాలక్రితం ఆవిష్కృతమైన రచనలలో పాత్రలను తీసుకుని తిరగరాయడంవల్ల ఆరచయితలకి ద్రోహమే. ఆ పాత్రలను కాక తమ భావాలను మాత్రమే వ్యక్తీకరిస్తూ చేస్తే అది స్ఫూర్తి గల రచన అనిిపించుకుంటుంది.

  మీ అభిప్రాయంతో ఏకీభవించను కానీ తెలియజేసినందుకు ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 8. తిరగరాతలవసరమే!

  ఏరాతలనైతే ఇప్పటికీ ఆదర్శమని నమ్మబలుకుతున్నారో, ఆరాతలను విమర్శల పరీక్షకు గురిచేయవలసిందే! Apparently, తిరగరాతల గురించి మనం ఇంకొంచెం ఎక్కువ తలుచుకోవడంలోనే, అవి irrelevant కాదు అని తెలుస్తుంది. తిరగరాతలు పురాతన రచయతలమీద చేస్తున్న విమర్శలని ఎందుకనుకుంటున్నారు. ఆ రచనలను కీర్తించేవాళ్ళు, ఆదర్శాలుగా నమ్మబలికేవారు ఇప్పుడూ ఉన్నారు. అవివారిమీద విమర్శలనుకోవచ్చుగా?

  నిందితులు చనిపోయారని కేసుల విచారణ ఆపడం ఎంతతప్పో, రాసినవారు చనిపోయారని వారిని రచనలను విమర్శల లిట్మస్‌కి గురిచెయేయరాదనడం అంతేతప్పు.
  -IM

  మెచ్చుకోండి

 9. ప్రతీత్మకమా , ప్రతీకాత్మకమా చిన్న సందేహం .
  ప్రతీక అంటే సింబల్ అనుకుంటాను . ప్రతీతి అంటే ప్రసిధ్ధి అనుకుంటాను . ప్రతీత్మకం విన్నట్లుగా అనిపించలేదు , అందుకని …..
  ఇలా వ్రాయడం కూడదేమో ….. ఐనా , మన్నించి
  సందేహ నివృత్తి చేయగలరు .

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 10. సంతోషం లలితగారూ, మీక్కూడా అలాగే అనిపిస్తున్నందుకు. ముందు వ్యాఖ్యలలో చెప్పినట్టు, ఆయా కవులకు ఇది ద్రోహమే.

  మెచ్చుకోండి

 11. తమని తాము సమర్థించుకునే వాదనలు చెసుకునే అవకాశం లేని పురాణ పాత్రలని – వాటిని సృష్టించిన ముందుకాలపు కవుల్నీ పట్టుకుని విమర్శిస్తూ చేతికొచ్చినట్టు రాసే సాహిత్యం – క్షీణయుగం-దశ దాటి మృతయుగం-దశ చేరి చాలా ఏళ్లయినట్టుంది. ఖచ్చితమైన మీ బ్లాగ్ పోస్టులు భళా!

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 12. @అన్యగామి,
  పునరోక్తి లేదండి. ఇలాటి వ్యాఖ్యానాలు నాకు చాలా సంతోషం కలిగిస్తాయి. ప్రతీకాత్మకము అంటే symbolic అనే.
  మీఅభిప్రాయాలకి మరో మాట కూడా చేరుస్తాను. ఆదర్శాలు, ధర్మవిచక్షణతోపాటు, ఆ యా గ్రంథాలలో ఆ పాత్రలను సృష్టించడంలో చూపిన ప్రతిభావిశేషాలను కూడా మరుగుపరిచేస్తాయి ఇలాటి తిరగరాతలు. ఈ రెండోరకం రచనలు చదివేవారికి ఆ కవులగురించి ఏమీ తెలీకుండా పోతుంది. మీ స్పందనకి ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 13. ప్రతీత్మకము అంటే ఏమిటండి? సింబాలిక్ అనా? మీ విశ్లేషణ బావుంది. అయితే మీరు నిజాయితీగా అన్నట్టు మనం మాతృకని చదివి అర్థం చేసుకొని నిజం అవునో కాదో అని నిర్దారణ చేసుకొంటే బాధ లేదు. అలాగే మనభూమిలో పుట్టని వాదాలతో మన వాజ్మయం పరిశీలించి వితర్కవాదన చేయటంలోనూ పసలేదు. రామాయణభారతాలు నిజంగా జరిగాయా లేదా అన్న విచారణ పక్కన పెడితే, వాటిలో ఉన్న ఉన్నత ఆదర్శాలు, ధర్మ విచక్షణ మనల్ని బాగుచేసుకోవటానికి ఉపయోగించుకొంటే వాటి ప్రయోజనం చేకూరినట్టే. చేయి తిరిగిన రచయితగా, బాగా చదువుకొన్నవారిగా ఇది మీకు పునరోక్తిగా అనిపిస్తే వదిలెయ్యండి.

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 14. రాయలేదండి. రాసే ఉద్దేశం కూడా లేదు. ఉదాహరణకి ఈనాటి ప్రముఖరచయితలకథలు తిరగరాస్తే ఊరుకోరు కదా అనడంవరకే నావాదన.

  మెచ్చుకోండి

 15. ఏమండోయ్ !

  >>> ఉదాహరణకి నేను ఈనాడు ఏ రెంగనాయకమ్మకథనో తీసుకుని ఇలా తిరగేసి రాస్తే, ….

  అబ్బ ! ఓ కథ వారిది తిరగ రాసి చెబ్దురూ ! చదవాలని ఉంది 🙂

  చీర్స్
  జిలేబి

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 16. ఈ కాలానికి సాహిత్య హీన యుగం అని పెట్టాల్సిందే…ఎందుకంటే మంచి సాహిత్యానికి ఆదరణ లేదు… సృజనాత్మకత కన్నా చూచిరాతలే మిన్న అనుకుంటున్నారు…

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s