పి. సత్యవతిగారి వ్యాసం – నిడదవోలు మాలతి

నాకథలు సమగ్రంగా పరిశీలించి పి. సత్యవతిగారు వ్రాసిన ఈవ్యాసం భూమిక స్త్రీవాద పత్రికలోనూ, తరవాత సత్యవతిగారు బ్లాగు రాగం భూపాలం లోనూ ప్రచురించబడింది. “స్వాతంత్ర్యానంతర రచయిత్రులు” అన్న శీర్షికతో 11 మంది రచయిత్రుల పరిశీలనావ్యాసాలలో ఇది ఒకటి. త్వరలోనే ఇది పుస్తకరూపంలో వెలువడబోతోంది. ఇది హర్షనీయం. సత్యవతిగారికి అభినందనలు. రచయిత్రి అనుమతితో ఇక్కడ ప్రచురిస్తున్నాను.


నిడదవోలు మాలతి

పంథొమ్మిదివందల యాభైల్లో కధలు వ్రాయడం మొదలు పెట్టి ఇప్పడు తన స్వంత వెబ్ పత్రికలు తెలుగు, ఇంగ్లిష్ తూలికలు నిర్వహిస్తూ,దాదాపు వంద తెలుగు కధల్ని ఇంగ్లిష్ లోకి అనువదించి ,ఇంగ్లిష్ లో మూడు అనువాద కధా సంకలనాలు. The Spectrum of My People( జైకో బుక్స్) “From My Front Porch” (సాహిత్య అకాడెమీ ప్రచురణ) All I wanted to Read and other stories వెలువరించారు. మొదటి రెండూ ప్రసిద్ధ రచయితల తెలుగు కథలకు ఆమె చేసిన ఇంగ్లిష్ అనువాదాలు కాగా మూడవది తన తెలుగు కథలకు ఆమె ఇంగ్లిష్ అనువాదం. . ఇవి కాక Quiet and Quaint: Telugu Women’s Writing: 1950-1975 – అనే పుస్తకాన్ని పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయం ప్రచురించింది. ఇది రెండున్నర దశాబ్దాలపాటు మన రచయిత్రులు సాధించిన ఘనవిజయానికి వెనక గల సాంఘిక, కౌటుంబిక పరిస్థితులూ, వారిరచనల్లో కథా వస్తువులూ, శిల్పం పరిశీలిస్తూ రాసిన పుస్తకం. తెలుగులో “నిజానికీ ఫెమినిజానికీ మధ్య” అనే కధా సంకలనం 44 కథలతో 2005 లో వచ్చింది.మరో సంకలనం 22 కథలతో “కథల అత్తయ్యగారు “ త్వరలో రాబోతోంది,’చాతక పక్షులు”అనే నవల కూడా రాబోతోంది. ఆంధ్రాయూనివర్సిటి నించీ ఇంగ్లిష్ ఆనర్స్ ,లైబ్రరీ సైన్స్ చదివి ఢిల్లీలో లైబ్రరీ సైన్స్ లో పి.జి చేశారు. తొమ్మిది సంవత్సరాలు తిరుపతి యూనివర్సిటి లో అసిస్టెంట్ లైబ్రేరియన్ గా పని చేశారు 1973నించి అమెరికాలో వుంటున్నారు.ఆమె కధల్లో ఎక్కువ కనిపించే విశాఖపట్నం ఆమెది .చిన్నప్పుడు అమ్మ వెనుక తిరుగుతూ కమ్మని తెలుగుని సామెతలతో సహా నేర్చుకున్నారు.అందుకే ఆమె కధలన్నిటికీ చక్కని తెలుగు శీర్షికలుంటాయి. నిడదవోలు మాలతి గార్ని గురించిన స్థూల పరిచయం ఇది

కధలు వ్రాయడం చిన్న వయసులోనే, 1950 దశకానికి ముందే మొదలు పెట్టినా ఎదుగుతున్న కొద్దీ కొంత పునాది వేసుకుని రచనలకు మెరుగులు దిద్దుకున్న తరం అది. కొంత తెలుగు సాహిత్యాధ్యయనం భాషాజ్ఞానం సామాజిక పరిశీలన ఆ పునాది, … సాహిత్యాభిరుచి కల కుటుంబంలో జన్మించి, ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని బాగా చదువుకుని సంస్కృతం కూడా నేర్చుకుని,ఇంగ్లిష్ లో మాస్టర్స్ చేసి ,మానవ స్వభావాన్ని నిష్పాక్షికంగా పరిశీలించి సహానుభూతితో వారిని గురించి వ్రాసారు నిడదవోలు మాలతి. అప్పటినించి ఆమె రచన ప్రవాహశీలంగా సాగుతూనే వుంది. కొంతమంది రచయితలవలె ఏదో ఒక మలుపుదగ్గర నిలిచి అదే స్థిరభావంతో కాక సమకాలీనంగా ప్రవహిస్తోందనడానికి ఆమె నిర్వహిస్తున్న బ్లాగ్ లే దర్పణాలు. ఒక వ్యక్తి స్వభావం గురించి చెప్పినా ఒక సంఘటన ప్రభావం గురించి చెప్పినా రచయితగా ఒక పాత్ర తరఫున వకాల్తా పుచ్చుకుని ఓవర్ టోన్స్ లోకి వెళ్ళకుండా తనపాత్ర లన్నిటిపైనా సానుభూతితో వ్రాస్తారు. ఆమె రచనల్లో స్త్రీ పాత్రలు ఎక్కువగానే వుంటాయి. అయితే వాళ్ళ బాధల్ని, వాళ్ళపై హింసని మాత్రమే పట్టించుకుని వారి జీవితాల్లోని ఇతర పార్య్వాలను వదిలిపెట్టరు. జీవితాన్ని అన్ని రంగుల్లోనూ అన్నికోణాల్లోనూ ఒకింత సమతూకంతో పరిశీలిస్తారు. ”హింస మగవాళ్ళు ఆడవాళ్ళని హింసించడంతో ఆగిపోలేదు. నా అభిప్రాయంలో హింసకి మూలం బలం. అర్ధబలం కావచ్చు, అంగబలం కావచ్చు. మనిషికి ఆ బలం నిరూపించుకోవాలన్న కోరిక కలిగించేదే అహంకారం..ప్రతి ఒక్కరూ ఎదుటివారిమీద తమ ఆధిక్యం చూపించుకోడానికి బలం ప్రదర్శిస్తారు. అందుకని ముందు రావల్సింది వైయక్తిక విలువలలో సామాజిక విలువలలో మార్పు. ఎదుటివారిని గౌరవించడం నేర్చుకున్న వారు ఏ జండరు వారినైనా గౌరవిస్తారు. అందుకే నా కధల్లో బాధల్ని అనుభవించిన స్త్రీలున్నారు కానీ, కేవలం అదే అన్ని కధలకీ ప్రాతిపదిక కాదు. అనేక వస్తువులలో అదొక వస్తువు” అంటారు.(పొద్దు.నెట్ లో ఇంటర్వ్యూ నించీ)

మాలతిగారు 1973 లోనే అమెరికా వెళ్ళిపోవడం వల్ల ఆమెకు ఆ దేశంలో భారతీయుల జీవితాన్ని గురించి విశేషమైన అనుభవంతోకూడిన అవగాహన వుంది. ఇప్పుడు మనకి లభ్యమౌతున్న ఆమె వ్రాసిన 66 కథలనీ రెండు వర్గాలుగా విడగొడితే కొన్ని భారతదేశపు కథలు కొన్ని డయాస్పోరా కథలు. డయస్పోరా కథలలో ఈ ముఫై సంవత్సరాలుగా ప్రవాస భారతీయుల జీవితంలో వచ్చిన మార్పులు స్పష్టమైనట్లు భారతదేశపు కధల్లో భారతదేశంలో వచ్చిన మార్పులు అంతగా ద్యోతకమవవు. కారణం మార్పు వేగం అధికమైన ఈ రెండు మూడు దశాబ్దాలలో ఆమె ఇక్కడ లేకపోవడం కావచ్చు. ఒక్కొక్కప్పుడు, మనిషి స్వభావం, ఆయా సంఘటనలపట్ల వాళ్ళు స్పందించేతీరు, దేశకాలాతీతంగా వుంటాయి. మానవ సంవేదనలు, ఆవేదనలు, ఆరాటాలు వాళ్ళు చేసే పోరాటాలు ఒక కాలానికి ఒక దేశానికే పరిమితమైనవి కావు. ఆయా సంస్కృతులలో మనకి కనిపించే వైరుధ్యాలు ఉపరితలానివే కాని హృదంతరాలలో మానవులంతా ప్రేమించేది మానవత్వాన్ని, సౌహార్ద్రతనే. దీనికి కొంతమంది మినహాయింపుగా ఎప్పుడూ వుంటారనుకోండి. ఈ ఎరుక మాలతిగారి కధల్లో ఎక్కువగా కనిపిస్తుంది.

మాలతిగారు కధలు వ్రాయడం ప్రారంభించిన రోజుల్లో(1950దశకం లో) జనజీవితంలో ఇంత వేగం లేదు. ఇంత స్వకేంద్రీయత (self centeredness) కూడాలేదు సమయనిర్వహణ పాఠాల ప్రభావమూ లేదు. పొరుగువారికి మన సమయాన్ని ఆనందంగా పంచడం వాళ్ళ ఆనందాన్ని పంచుకోడం వుండేది.ఇందుకు “కధల అత్తయ్యగారు” అనే కధే ఒక ఉదాహరణ. ఇప్పటి ఆంటీల కన్న అప్పటి అత్తయ్యగార్ల అమాయక ప్రేమలు ఎంతో ఉదాత్తమైనవి. ఆమె ఒక కధల ఖజానా. ఆ కధలు అభూతకల్పనలే అయినా అవి చమత్కారంతో కలిసిన అచ్చ తెలుగు నుడికారంతో వుండేవి. ఒక తల్లి చేసిన మోసాన్ని కూతురు తెలుసుకుంది. ఆ విషయం తల్లికి అర్ధం చేయించడానికి తన బొమ్మకి బువ్వపెడుతుంది. బొమ్మ తినదు కదా? అప్పుడాతల్లి, ”చిలకల కొలికి చినదనా బొమ్మలు బువ్వలు తిందురటే“ అంటుంది. ఆ పిల్ల తల్లితో ఇలా అంటుంది ”మాయల దానా! మహిమలదానా మనుషులు కప్పలు కందురటే!” తల్లి తను చేసిన మోసానికి సిగ్గుపడి దాన్ని సరిదిద్దుకుంటుంది. ఇలా కధల అత్తయ్య గారి కధల ప్రభావం మాలతిగారి మీద వుంది. మాలతిగారి 66 కథల్నీ మనం ఇక్కడ స్థల పరిమితి వలన చెప్పుకోలేము కనుక ఈ దేశపు కథలు కొన్నిటిని ఆదేశపు కఠలు కొన్నిటినీ స్పృశిద్దాము. రచయిత్రి చెప్పినట్లు అమె సృష్టించిన స్త్రీల పాత్రలు కొన్నిటిలో “మంచుదెబ్బ” కధలో వకుళ, ”నవ్వరాదు” కథలో కమలిని, ”జీవాతువు” కథలో అరుంథతి, ”అవేద్యాలు” కథలో శారద. నవ్వరాదు కథలో కమలిని తన కష్టాలను నవ్వుల మాటున హాస్యం మాటున దాస్తుంది, వకుళ మహామౌనం దాలుస్తుంది. అరుంధతి జీవితంతో పోరాడి ఓడిపోతూ వుంటుంది. శారద తను అవమానానికి గురైనా చివరికి ఆత్మాభిమానానికి ఔన్నత్యానికి సజ్జనత్వానికి ప్రతిరూపంలా నిలుస్తుంది. నడుస్తున్న చరిత్ర లో కల్యాణి కి సంగీతం నృత్యం అంటే ప్రాణం కానీ పెళ్ళికోసం అవి ఆమెకు దూరమయ్యాయి. భర్తకి సంగీత కచేరీలకు వెళ్ళడం ఇష్టం అని కొంత ఊరట అయినా ఆమె ఆకాశవాణి లో స్వర పరీక్షకి వెడతానంటే వీల్లేదనడంతో సంగీత కచేరీలకు వెళ్ళడం మానుకుంటుంది. ఆమె మనసుని అర్ధం చేసుకోలేని భర్త ఆ విషయం పట్టించుకోడు. చివరికి తన మనుమరాలు తను సాధించలేనివన్నీ సాధిస్తుందన్న ఆశ తో తన నిరాశకు తెరదించుతుంది. మంచుదెబ్బ కధ లో వకుళ భర్త నపుంసకుడు. ఆ విషయం మనకి చివరిదాకా తెలియదు. దాన్ని గరళంలా కంఠంలో దాచుకుని. మౌనమే తన తిరస్కారంగా, నిరసనగా చేసుకుంటుంది. ఆమె మౌనానికి కారణం భర్తకు తెలిసినా అతను హిపోక్రైట్ కదా! ఆమెకు మానసిక వైద్యం చేయిస్తాడు. చివరికి ఆమె తల్లి అమెను తీసుకుపోతానంటే తనే కలకత్తా తీసుకు వెళ్ళి నయం చేయిస్తానంటాడు. ఆమె చనిపోతుంది. భర్త నపుంసకుడన్న నిజాన్ని ఒక్క స్నేహితురాలికి మాత్రమే చెప్పి. తన ధిక్కారాన్ని మౌనం ద్వారా, మరణం ద్వారా ప్రదర్శిస్తుంది ఈ కధ స్నేహితురాలి కధనంగా సాగి చివరి వరకూ వకుళ మౌనానికి కారణం ఒక ప్రశ్నగానే వుంటుంది. అట్లా స్నేహితురాలిని నెరేటర్ గా ఎంచుకోడం కధకి బిగువు నిచ్చింది. మాలతి గారి కధల్లో చాలా వాటికి ఇటువంటి శిల్పాన్నే ఎన్నుకున్నారు. “”ఫలరసాదులు కురియవే పాదపముల” అనే కధలో ఒక మహాశ్వేత గురించి చెప్పినా ,”మామూలు మనిషి “ అనే కధలో రాజేశ్వరి గురించైనా, ”జీవాతువు”కధలో అరుంధతి గురించైనా ప్రధమ పురుష అనుభవాలనించే ముఖ్యపాత్ర జీవితం మనకి తెలుస్తుంది. నవ్వరాదు కధలో కమలిని కూడా అంతే. ”తృష్ణ” కధలో బాలయ్య గురించి కూడా. సాధారణంగా ఉత్తమ పురుషలో కధ చెబుతుంటే “నేను” కి చాలమంది రచయితలు కొన్ని ఉత్కృ ష్టమైన గుణాలని అంటగడతారు. కానీ మాలతి గారు ఈ “నేను” ని కూడా ఒక సామాన్య వ్యక్తిగ నే వుంచుతారు. అదే ఆమె ప్రత్యేకత. తృష్ణ కధ ఒక లైబ్రేరియన్ చెప్పడంగా వుంటుంది. లైబ్రరీలో అటెండర్ బాలయ్య. అతన్ని గురించి లైబ్రేయన్ గారికి చాలామంది ప్రతికూల వ్యాఖ్యలు హెచ్చరికలు చేస్తారు. ఆమె తన విధి తను చేసుకుపోతూ వుంటుంది. కానీ అతిగా స్పందించదు. బాలయ్యమీద పుస్తకాల దొంగతనం అభియోగింపబడి అతని ఇంటిని సోదా చేసేవరకూ వెడుతుంది. ఆ సోదా లో అతనికి పుస్తకాలు చదవాలనే అభిలాష అభిరుచి, ఊర్కే చదవడమే కాక వాటిలోని కొన్ని పంక్తుల్ని వ్రాసిపెట్టుకోడం కూడా లైబ్రేరియన్ ని చకితురాలిని చేస్తుంది. బాలయ్య నిజానికి పుస్తకాలు ఏవీ ఎత్తుకు పోలేదు. పోయిన పుస్తకాల్లో ఒకటే అతని ఇంట్లో వుంది. అదికూడా చదివి ఇచ్చేసే ఉద్దేశం తోనే తెచ్చాడు. ఉద్యోగం పోయాక బాలయ్య కనిపించలేదు. చివరికి మూర్ మార్కెట్ లో సెకండ్ హాండ్ పుస్తకాల షాపు నిర్వహిస్తూ కనపడ్దాడు. అనేక పుస్తకాల మధ్య ఉన్న బాలయ్యకిప్పుడు పుస్తకం ఒక అమ్మకపు సరుకులా మారిపోవడం ఒక ఐరనీ. ఈ కధని మాలతిగారు వ్రాసిన తీరు చాలా సహజంగా వుంటుంది. అట్లాగే విషప్పురుగు అనే కధలో స్కూల్ అటెండర్ రోశయ్య. అతనికి పాములు పట్టడంలో నేర్పుంది. అతను ఎక్కడ పాము కనిపించిందన్నా వెంటనే వెళ్ళిపోయి వాళ్ళకి సాయపడతాడు. ఆ విధంగా అతను స్కూల్ కి ఆలస్యంగా రావడం, విధి నిర్వహణలో అలక్ష్యం కారణంగా మెమోలు అందుకోడమే కాక అతనిపై స్కూల్లో అంతా నేరాలు చెబుతూ వుంటారు. స్కూల్ కివచ్చిన ఒక రిజిస్టర్డ్ పార్సెల్ పారేశాడనే అభియోగంతో అతనికి బదిలీ వేటు పడినా ఆనందంగానే వెళ్ళిపోతాదు. కానీ అతనిపై నేరం మోపడానికి మరొకరెవరో ఆపార్సెల్ ని సైన్స్ లాబ్ లో పారేస్తారు. రోశయ్య వ్యక్తిత్వాన్ని ప్రధానోపాధ్యాయురాలైన “నేను” ద్వారా చెప్పిస్తారు… మాలతి గారికి బహుమతి వచ్చిన కధ “చిరుచక్రం“ సర్వసాక్షి దృక్కోణం లో వచ్చింది. ఇందులో కూడా స్కూల్ ప్యూన్ వెంకన్న వ్యక్తిత్వ చిత్రణే ప్రధానం. అతనికి తను చేసే పని మీద ప్రేమ. ఒకరకమైన భక్తి కూడా. అల్పసంతోషి.. తనదికాని తోటమాలి పనికూడా నెత్తిన వేసుకుని తను పండించిన పూయించిన ఫలపుష్పాలను ఎవరైనా మెచ్చుకుంటే పరవశించిపోతాడు.స్కూల్ ఇన్ స్పెక్షన్ రోజున ఉరుకులు పరుగులుగా వొళ్ళువిరుచుకుని పనిచేసి అందుకు ప్రతిగా అతనికి అయిదు రూపాయిల ఫైన్ పడినా ఆ రోజు తన పువ్వుల్నీ కూరగాయల్నీ ఎవరెంత మెచ్చుకున్నదీ భార్యతో చెప్పి పొంగిపోతాడు. ఫైన్ మాట చెప్పడు. ఈ కధని “ఎక్స్ ప్లాయిటేషన్” కోణంలోనించీ ఓవర్ టోన్స్ లో రాయచ్చు. కానీ రచయిత ఆవిషయం ఎక్కడా ఎత్తకుండా చివరికి ఆ మాట పాఠకులకు తట్టేలా చేస్తారు. ఒక అమాయకుని స్వభావాన్ని మాత్రమే చెబుతారు. అది ఆమె శిల్ప నైపుణ్యం. మాలతిగారి కధల్లో ఎక్కువ స్వభావ చిత్రణ వుంటుంది.”మామే స్త్రీత్వం” అనేది ప్రతీకాత్మక కధ. స్త్రీచైతన్యానికీ రాగద్వేషాలకూ ప్రతీక. చైతన్యమూ రాగమూ ఎక్కడుంటాయో ద్వేషమూ అసూయాకూడా అక్కడికి వఛ్చి చేరాతాయని అంచేత నాకీ స్త్రీత్వం (రాగద్వేషాలు) వద్దు అని. ఈ కధలో రాగద్వేషాతీతమైన ఒక వూరికి ఒక స్త్రీ వస్తుంది. ఒక పిల్ల వాణ్ని చేరదీస్తుంది. ఆమె మనుమడు వస్తాడు. అతన్ని ఆమె ప్రేమగా చూడ్డం చేరదీసిన పిల్లవాడికి ఈర్ష్య కలిగించి అతన్ని కొట్టించి చివరికి క్షమాపణ అడుగుతాడు.

మాలతి గారి రాబోయే సంకలనంలో (కధల అత్తయ్యగారు) ఉన్న ఇరవై రెండు కధల్లో చాలా వరకూ డయస్పోరా కధలు కాగా మొదటి సంకలనం లో కూడా దాదాపు 14 కధలున్నాయి. ఆమె కధాసంకలనానికి శీర్షికైన “నిజానికీ ఫెమినిజానికీ మధ్య’అనే కధతో కూడ… ఈ కధలన్నింటిలో అమెరికా వెళ్ళిన ఆంధ్రుల అనుభవాలు అప్పటివీ ఇటీవలివీ కూడా వున్నాయి. అమెరిక లో ఎలా మెసులుకోవాలో పదిమందీ పది సలహాలూ హితవులూ చెబుతారే కానీ ఏ వొక్కరూ మంచులో జారిపడతావు జాగ్రత్త అని పనికొచ్చే ఆ ఒక్క ముక్కా చెప్పరెందుకో అనే కధలో చమత్కారం బావుంటుంది. అక్కడికి వెళ్ళాక కొంతమంది ప్రతిదాన్నీ డబ్బుతో కొలవడం తమకెలా లాభం అని చూడ్డం “కొనే మనుషులు” “డాలరుకో గుప్పెడు రూకలు” “గుడ్డిగవ్వ”కధల్లోనూ, తమకెవరైనా ఏదైనా ఇచ్చినప్పుడు వెంటనే ఆ ఋణం తీర్చే అమెరికనుల పధ్ధతి “జమాఖర్చుల పట్టిక” లోనూ చెబుతూ మనసంస్కృతిలో ఏదైనా ఎవరికైనా ఒక బహుమతి ఇవ్వడమూ పుచ్చుకోడమూ కూడా ఇటువంటి బేరీజులకతీతంగా ఒక ఆత్మీయ స్పర్శతో వుంటాయంటారు. అమెరికా వెళ్ళినా మన “sense of rumour” (sense of humour కాదు) అట్లాగే వుంటుందనీ ఆత్మీయంగా ఎవరితోనైనా అంతరంగంలో మాటచెబితే అది ఇండియాలో నీలాటిరేవులో పాకిపోయినంత త్వరగా పెసిఫిక్ అట్లాంటిక్ రేవుల్లోకూడా పాకుతుందనీ ఆ కందిరీగల్ని ఎలా తప్పించుకోవాలో చెప్పే కధ ”అడవి దారంట”. అట్లా పెళ్ళికో పేరంటానికో పార్టీకో ఒంటరిగా వచ్చిన స్త్రీని అక్కడకూడా “ఎవరి తాలూకా?” అని ఆరాలు తీయడం, అమెరికాలో డ్రైవింగ్ రాకపోతే వుండే కష్టాలు అక్కడుండే వాళ్ళకే కాదు చుట్టం చూపుగా వెళ్ళొచ్చే వాళ్లకి కూడా తెలుస్తాయి. అలాంటప్పుడు కారుండి డ్రైవ్ చేసే వాళ్ళు అది లేని వాళ్ళకి లిఫ్ట్ ఇవ్వడం సాయంచెయ్యడం మామూలే. కానీ అదికూడా ఓర్వలేని వాళ్లు చేసే వ్యాఖ్యానాలు ఇద్దరు స్నేహితురాళ్ళనూ బాధపెడతాయి. కానీ ఆపత్సమయంలో మళ్ళీ ఒకరికొకరు దగ్గరైపోతారు ”అత్యంత సన్నిహితులు” కధలో. అమెరికా లో పైచదువులకి రావడానికి ఇండియాలోనే రిహార్సల్ వేసుకునొచ్చి,అత్యుత్సాహంతో యాక్సిడెంట్ పాలైన ఒక ధనిక తండ్రి గారాల కొడుకు, ఒక కొడుకుని సరిగా తీర్చిదిద్దలేక దేశాల పాల్చేసి, రెండో కొడుక్కి అతిగారాం పెట్టి ఆకాశమార్గాన నడిపించిన తండ్రి. ”పై చదువులు” కధలోనూ అంత గొప్ప ప్రజాస్వామిక దేశంలోనూ ఇంకా కొనసాగుతున్న వర్ణ వివక్ష “రంగుతోలు’ కధలోనూ అక్కడి “లే ఆఫ్’ లప్రభావం పైన”హాలికులైన నేమి” “నీకోసం “కధల్లోను మన సంస్కృతి లోని భక్తి భావన ఒక చిన్ని పాప మనసుని స్పర్శించడం “చివురు కొమ్మ చేవ” కధలోనూ కొత్తగా వచ్చిన ప్రవాసులపై స్థానికులు కొంత జులుం ప్రదర్శించడానికి ప్రయత్నిస్తే ఎలా తిప్పికొట్టాలో నేర్చుకున్న అమ్మాయి కధ ”పలుకు వజ్రపు తునక” కధలోనూ చూస్తాము. ”నీకోసం” కధలో ఉద్యోగం పోయి మరొకటి వెతుక్కోకపోవడం కూడా భార్యకోసమేననే భర్తకి ఒక హెచ్చరిక చేసిన భార్య. ఇంక నిజానికీ ఫెమినిజానికీ అనే కధకు కొంత నేపధ్యం “దేవీ పూజ” అనే కధలో వుంది. వివాహపు పదహారో వార్షికోత్సవం ఒక మొక్కుబడి తంతుగా సాగుతుంది సీతకీ ఆమె భర్త సీతాపతిక. అతనికెంతసేపూ ఆర్తస్త్రీ రక్షణ పరాయణత. అది ఎక్కడికి దారి తీస్తుందోన్న కలత సీతది. నిజానికీ ఫెమినిజానికీ మధ్య కధ దీనికి కొనసాగింపులా అనిపిస్తుంది. పదిహేడేళ్ళుగా ఇంటికోసం చాకిరీ చేసి, ఉద్యోగం చేసి అతన్ని తప్ప వేరొకర్ని మదిని తలవక ఉన్న భార్యతో అబధ్ధాలాడి ఇతర స్త్రీలతో సంబంధాలు పెట్టుకుని సీతాపతి ఆమెకు షాక్ ఇచ్చాడు. కళ్ళెదుట కనిపిస్తున్న నిజాలను అబద్ధాలుగా నమ్మింపజూశాడు. అతని విలువలపతనాన్ని ఆమె ఆమోదించలేకపోయింది. అతని స్త్రీలలో ఒక స్త్రీగా వుండలేక వేరే అపార్ట్మెంట్ కి మారడానికి ఆయత్తమైంది. ఈ కధని మాలతిగారు ఒక్కొక్క మెట్టుగా చాలా సహజంగా మలుచుకుంటూ వచ్చారు, అతని ఉత్తరాలు చూసేదాకా అతనిమీద అనుమానాన్ని స్థిరపరుచుకోలేకపోవడం, కొంత ఆలోచన,చివరికి నిర్ణయం. పదిహేడు సంవత్సరాల సహజీవనం ఇంటికి తనెంతగా అంకితమైందీ, ఇవ్వన్నీ ఆమె ఆత్మాభిమానాన్ని కాపాడుకునేలా ఒక నిర్ణయానికి వచ్చేలా చేసిన తీరు చాలా సమతూకంతో వ్రాశారు. అట్లాగే “ఆనందో బ్రహ్మ”.. అనే కధలో బ్రహ్మకూడా ఆర్తస్త్రీ పరాయణుడే. మాలతి గారి కధలు కొంత సీరియస్ గా వున్నా ఆమెలో హాస్యమూ వ్యంగ్యమూ కూడా మిక్కిలిగా వున్నాయి.”కోపం” అనే డయాస్పోరా ఇండియా కలగలిసినకధ, మద్రాస్ టూ తిరుపతి అనే కధ, కప్పు కాఫీ అనే కధ మరికొన్ని డయస్పొరా కధల్లోనే కాక ఆమె బ్లాగ్ తెలుగు తూలిక(www.tethulika.wordpress.com) లో “ఊసుపోక” లో ముఖ్యంగా ఈ హాస్య వ్యంగ్య ధోరణి చూడవచ్చు. మాలతిగారు ఆనాటి రచయిత్రి కారు. ఆవిడ ఎప్పటి రచయిత్రి. ప్రస్తుతం విస్కాన్సిన్ లో వుంటున్న మాలతి గారు సాహిత్యమే స్వదేశాన్ని మరిపించే స్నేహసాధనం అంటారు “నాకు జీవితంలోనూ.సాహిత్యంలోనూ ఒకటే విలువలు. చిత్తశుద్ధీ ఆత్మ వివేచనా, ఉన్నదానితోనే తృప్తి పడటం నాకు చిన్నప్పటినుంచీ ముఖ్యమైన విలువలుగా వుంటూ వచ్చాయి” అనే మాలతి గారు ఎంత గొప్ప రచయితపై నయినా తన అభిప్రాయాన్ని నిస్సంకోచంగా చెప్తారు. “ఈనాటికీ అప్పారావుగారి దిద్దుబాటు గొప్ప సాంఘికకథ అంటే నాకు ఆశ్చర్యంగా వుంటుంది. నేను చూసినంతవరకూ, వేశ్యాలోలత్వం, జూదంవంటి దురలవాట్లు చాలా బలమైనవి. క్షణాలమీద మార్చుకోగల అలవాటు కాదు అది. అప్పారావుగారికథలో భార్య పుట్టింటికి వెళ్లిపోయిందని తెలియగానే ఆ భర్త నిల్చున్న పళాన మారిపోయాడంటారు రచయిత. నాకు తెలిసినంతవరకూ నిజజీవితంలో భార్య పుట్టింటికి పోతే, వేశ్యాలోలురకి మరింత ఆటవిడుపు, అదేకథ స్త్రీ రాసివుంటే ఇంత అమాయకంగా వుండదు.” అంటారు.

అట్లాగే ఫెమినిజం పైన ,అన్ని ఇజాల చట్రాల లో వచ్చే కథలపైన తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా సూటిగా చెప్తారు. “అసలు బాధ ఏమిటంటే, మనకి వ్యక్తిపూజలే కానీ వస్తునిష్ఠ లేదు. రచయితపేరుని బట్టి, అది అచ్చయిన పత్రికపేరుని బట్టీ రచనవిలువ నిర్ణయించడం మన రాచరికపు సంప్రదాయమేమో మరి. ఏమైనా, రచనని మాత్రమే రచనగా తీసుకుని విశ్లేషిస్తే, మన సాహిత్యం మెరుగు పడే అవకాశం ఉంది.” అంటారు.” కలం కాలం నించి ఇప్పటి కీబోర్డు కాలం దాకా విరామమెరుగని కలం. రాత నుంచి కంప్యూటరు దాకా ఎంతో ఓపికగా, శ్రద్ధగా రూపాంతరం పొందడమే కాకుండా, రచనా స్వభావాన్ని కూడా కాలానుగుణంగా మార్చుకున్న మాలతి గారు అటు ఆంధ్రా, ఇటు అమెరికా తెలుగు జీవితాల మధ్య సామ్యాలనూ, సామరస్యాలనూ వెతికే ప్రయత్నం చేశారు. స్వీయ రచనల్లోనూ, అనువాదాల్లోనూ వొక నిష్టతో, నియమంతో పని చేస్తున్నారు. వయసూ, బతుకు బాధలతో నిమిత్తం లేకుండా ఎత్తిన కలం…(టచ్ చేసిన కీబోర్డు అనాలా?!) వదలకుండా, అన్ని అవరోధాలనీ జయించి రచయితగా తన ఉనికిని సదా కాపాడుకుంటున్నారు. అచ్చు లోకంలోనే కాకుండా, అంతర్జాల లోకంలో కూడా సుపరిచితమయిన పేరు నిడదవోలు మాలతి.,”అంటారు అఫ్సర్

Posted by సత్యవతి at Wednesday, October 06, 2010 1 comment: 

Labels: స్వాతంత్య్రానంతర తొలి కథా రచయిత్రులు

SATURDAY, SEPTEMBER 18, 2010

<div style=”border: 5px solid blue; margin: 6px;”> ముఖ్య గమనిక –

నాసాహిత్యం pdf లో అన్న పేజీలో సత్యవతిగారు ప్రస్తావించిన కథలూ,  Quiet and Quaint: Telugu Women’s Writing: 1950-1975 పుస్తకమూ కావలిసినవారు ఇదే బ్లాగులో నాసాహిత్యం pdfలో అన్న పేజీలోనుండి దింపుకోవచ్చు.  ఇవి ఉచితము.

కథలు – కథామాలతి – 5 సంపుటాలుగా ఉన్నాయి.

ఇంగ్లీషు పుస్తకం పేరు Telugu Women Writers,  19590-1975, Analytical study చూడండి /div>


(మార్చి 5, 2017)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

3 thoughts on “పి. సత్యవతిగారి వ్యాసం – నిడదవోలు మాలతి”

  1. మీరే ముందుమాట రాసుకున్న మీ ‘కధల అత్తయ్యగారు’ చదవడం పూర్తి చేశాను ఇటీవలే. సత్యవతిగారి మాటల్లో మళ్లీ ఇంకొకసారి ఇలా గుర్తుచేసుకోవడం బావుంది.

    మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.