బలివాడ కాంతారావుగారి దగా పడిన తమ్ముడు సమీక్ష

సంస్కారం గల ఒకడు జపానుమీద బాంబు వేసిన రోజునే వంశధార నదీతీరాన సంస్కారం లేని ఒకమనిషి పదిహేను వందల పల్లీయులని గజగజలాడించేడు అంటూ మొదలవుతుంది ఈ కథ.

ఇక్కడ సంస్కారం అన్న పదం భావగర్భితమైనది. సంస్కారం, నాగరికత, సాంకేతికాభివృద్ధి – ఇవన్నీ పురోభివృద్ధి చిహ్నాలుగా భావిస్తాం. మనస్ఫూర్తిగా కోరదగ్గవి. అణుశక్తిని కనిపెట్టిన శాస్త్రజ్ఞులు అది మానవజాతి వినాశనానికి ఉపయోగిస్తారని అనుకున్నారో లేదో నాకు తెలీదు కానీ ఇప్పుడు జరుగుతున్నది మాత్రం అదే. పైగా ఆ వినాశం రెండు స్థాయీలలో జరిగింది. ఒక బాంబు విసిరేసి లక్షలాది ప్రజలను హతం చేయడం ఒక ఎత్తయితే, మిగిలినవారిని ఆర్థికంగా నాశనం చేయడం మరొక ఎత్తు. ఈ నవలలో ఆద్యంతాలా ఆ భావం అంతర్లీనంగా ఉంది.

సవిరి పల్లెవాసులు ఓ నీలమ్మతల్లిని నమ్మడం అమాయకత్వమేనా? దాసుడు, సంస్కారం లేనివాడు,  నీలమ్మతల్లి పూనకంతో పల్లీయులని గజగజలాడించేడు. ఆ సంస్కారహీనులు సంస్కారవంతులు తమను ఉద్దరిస్తారని ఆశించడమే ఈ కథలో సంక్లిష్టసమస్య.

రెండవ మహాసంగ్రామం నేపథ్యంలో ఈ సంస్కారహీనులు ఎలా మట్టి కరిచిపోయినవిధానం అత్యంత బలంగా ఆవిష్కరించేరు కాంతారావుగారు ఈ కథలో.

సూక్ష్మంగా, ప్రధాన పాత్ర, పుల్లయ్య, సవిరి గ్రామంలో సాముగారడీలలో ఆరితేరిన మొనగాడు. గేరాగిరజాలూ, ఉక్కుపిండంలాటి కండలూ, మీసకట్టుతో “పసున్న”మొగాడు. సవిరిలోనే కాక చుట్టుపట్ల గ్రామాలలో కూడా పెద్దగా పేరు తెచ్చుకున్నవాడు. కొంచెం ఆలస్యంగానే కులం తక్కువే అయినా మనసు పడి నీలిని పెళ్లి చేసుకుంటాడు.

నీలి కన్నవారింట కష్టాలు పడ్డా, నీతికి నిలబడ్డ మనిషి. తనకోసం దాచుకున్న గంజి గుమ్మంంలోకొచ్చిన బిచ్చగాడికి పోసి తృప్తి పడగల ధర్మబుద్ధి ఆమెది. మాట పడిందే కానీ మాట తూలలేదు ఏనాడూను.

వీరిద్దిరి పాత్రచిత్రణలో రచయిత ప్రత్యేక శ్రద్ధ మనకి చక్కగా ద్యోతకమవుతుంది. ఏ మనిషీ మూస పోసిన సన్మార్గుడో దుర్మార్గుడో కాడు. ప్రతిమనిషిలోనూ మంచీ చెడ్డా ఉంటాయి. నీలిమాటల్లో

పుల్లయ్య జైల్లో ఒకరోజు గడపి ఇంటికొస్తే నీలి కోపం, పౌరుషం అదుపులో పెట్టుకుంటే జైలు తప్పేదంటుంది. అతను ఏ ఏజెంటుమీద విరుచుకుపడ్డాడో ఆ బాబే నీలి నోటిమంచితనంవల్ల రెండు పుట్లకి బదులు ఒక పుట్టి తీసుకుని వదిలేసేడు. అత్యంత వాస్తవికంగా అనిపించే ఇలాటి సన్నివేశాలు ఈనవలలో ఎన్నో ఉన్నాయి.

నీలి వాక్కులు వేదవాక్కులు పుల్లయ్యకి. ఈ అంశాన్ని ప్రతిభావంతంగా ఎత్తి చూపుతారు రచయిత. ఊళ్ళో నాయుడిలాటి పెద్దలు తనకి అన్యాయం చేయబోతే, ఎదురు సవాలు విసరగల మొనగాడు. అంత ఘనంగానూ నీలి మంచేదో చెప్తే  తప్పు ఒప్పుకోడానికి వెనకాడని మనిషి.

అసలు వీరిద్దరి పెళ్ళే వారిద్దరికీ ఒక విచిత్రమైన అనుభవం. పాఠకులు తొందరపడి ఒక అభిప్రాయానికి రాకూడదిక్కడ. చదవడం కొనసాగిస్తే కానీ ఎంత అందమైన  అనుబంధమో తెలీదు. నాకైతే దాంపత్యం ఇలా ఉండాలి అనిపించింది.

నీలి అందం చూసి, పట్టలేని తమకంతో మీద పడి బలవంతం చేయబోతే, నీలి అతనిచేయి కొరికి, విడిపించుకుని పారిపోతుంది. అందులో విచిత్రం లేదు. విచిత్రం నీలి పోతూ పోతూ ఆడినమాటలోనే, “ఛీ, సిగ్గులేదూ?” అని మరీ పారిపోతుంది. ఆ ప్రశ్నలో ప్రత్యేకమైన చతురత ఉంది. పుల్లయ్యలాటి పోటుగాడిని “సిగ్గు లేదూ” అనడం అంటే ఆయువుపట్టులో కొట్టడం. అది నీలికి తెలుసు అని రచయిత ఎక్కడా చెప్పలేదు కానీ అనేక సందర్భాలలో నీలి మృదువుగానే అయినా దృఢంగా విషయం విశదీకరించగల నేర్పరి.

మొగుడికి ప్రాణాంతకమైన సమయంలో కూడా సత్యమే పలుకుతుంది.   “నీకళ్ళు మూస్తాను, లోకం కళ్ళు మూస్తాను. కానీ దేముడికళ్ళు ముయ్యగలవా? మన మంచీ చెడూ సూసేవాడు పైనున్నాడని నువ్వు నాయంగా నమ్మకంగా యెల్లకపోతే బతికెందుకు?” అన్న ప్రశ్న చాలు నీలి వ్యక్తిత్వం తెలపడానికి. పుల్లయ్యే కాదు, ఊళ్ళోవాళ్ళకి కూడా నీలి అంటే గౌరవమే. “సల్లని సెందురుడినాగ నీ శాంతమే ఆడి కోపం మాయం చేస్తాది” అంటాడు వెంకన్న నీలితో. నీలి నాయం చెప్పినప్పుడల్లా తాను ఆమెకంటె గొప్పవాణ్ణి అనుకోలేకపోతున్నాడు. “నీలి తన పెళ్ళామని మరిచిపోతాడు. అదేదో ఒక పవిత్రమైనదిగా కనిపిస్తుంది. ఆమెమాటల్లో సత్యం అతని ప్రతికణంలోనూ ప్రతిధ్వనిస్తుంది.” ఆమెని పంతానికి పెళ్ళాడేనన్న గర్వం పుల్లయ్యకి లేదు. ఒకనాడు తనని సిగ్గు లేకుండా బలవంతం చేసాడన్న తలపు లేదు నీలికి. ఈ రెండు పాత్రలూ చిత్రించడంలో రచయిత చూపిన శ్రద్ధ

మెచ్చుకోకుండా ఉండలేం.

వీరిద్దరి కథే దగా పడిన తమ్ముడు. ఈ తమ్ముడు దగా పడడానికి కారణం అప్పట్లో రెండవ ప్రపంచయుద్దం తెచ్చిన ఆర్థిక సంక్షోభం. చిన్న మడిచెక్క కౌలుకి తీసుకుని, సాము గరడీలతో, చిన్ని మల్లు తన వంశప్రతిష్ఠ నిలపుతాడన్న ఆశతో, ఉన్నదానితో తృప్తిగా సాగించకుంటున్న జీవితం యుద్ధం తెచ్చిన రేషనుతో అల్లకల్లోలమయిపోతుంది.

రెండో ప్రపంచయుద్ధం వచ్చేక, ప్రొక్యూర్మెంటు పేరుతో కరణం, మునసబు, ఏజెంట్లూ, దోచుకుంటుంటే ఉన్నదాంతో తృప్తిగా బతికుతున్న చిన్న రైతుల జీవితాలు ఎలా ఛిన్నాభిన్నం అయిపోయేయో కళ్ళకి కట్టినట్టు వర్ణంచేరు. కాంగ్రెసోడు వచ్చి అందర్నీ సమానం చేసేస్తాడనీ దున్నేవాడిదే భూమి అనీ అమాయకంగా నమ్మిన సన్నకారు రైతులు ప్రక్యూర్మెంటుకి బలయిపోతారు. “కర్ర తీసుకుని కొలవడానికి మాదగ్గరేం లేదు, నాపొలంలో అడుగు పెడితే కుళ్ళబొడిచేస్తాన”ని సవాలు చేసే పుల్లయ్యలాంటివాళ్ళూ తలొంచక తప్పలేదు. ఉన్నవాళ్ళు మరింత పోగు చేసుకుంటే లేనివాళ్ళు ఉన్న ఎకరా, రెండెకరాల మడి చెక్కలమ్ముకు ఊరొదిలి పోయేరు.

పంచె ఎగ్గట్టి మీసాలు మెలివేస్తూ కర్రసాము చేసే సంజీవీ, నారచీరె కట్టి మీసాలతోనే ఆడవేషం వేసి శశిరేఖాపరిణయం కథ చెప్పే బుడబుడక్కలవాడు పద్మనాభం, దాసుడి ఆధ్వర్యంలో జరిపే అమ్మవారి సంబరాలు, నీలి గర్భవతిగా ఉన్నప్పుడు ఆనవాయితీగా జరిపే ముచ్చట్లు, నీలి పుల్లయ్య విలోమవివాహంవెనక గల స్థలపురాణం లాటివె్న్నో సవిరి గ్రామాన్ని మనకళ్ళముందు సజీవంగా నిలబెడతాయి.

ఎత్తుగడలోనే సనిరి పల్లెవారి మాటతీరు, రూపురేఖలు లేని, గతిలేని బొట్టికీ రూపురేఖలుండి నలుగురిచేత శబాషనిపించుకున్న పాపడితో పెళ్ళి వేడుకలు నాలుగు పేజీలుంది!

గుఱ్ఱానికి తోకుంటాది రొయ్యకి బారెడు తోకుంటాది, మనిషి చస్తే మాట మిగుల్తాది, ఎద్దు చస్తే ఎముక మిగల్తాదిలాటి సామెతలూ, మెట్ట (కొప్పు), గూటాలూ, టోకుర్లు, అంబారంలాటి పదాలు, విశాఖపట్నం, హార్బరు ప్రాంతాలూ, చదువుతున్నంతసేపూ నాకైతే “ఇంటి కొచ్చిన” అనుభూతి కలిగింది. అలాగే, నీలమ్మతల్లి సంబరాలు, బుడబుడక్కలవాడు చెప్పే శశిరేఖాపరిణయం కథనం, సంజీవి, పుల్లయ్య గారడివంటివి వర్ణించడంలో రచయిత అనేక విషయయాలు ఈనాడు చాలామందికి తెలీనివి రచయిత పొందుపరిచారు. ప్రధానంగా, యుద్దసమయంలో బక్కరైతులు మట్టి కొట్టుకు పోయేరు. మాయలు నేర్చిన ధనికులూ, పెద్ద భూస్వాములూ మరింత ఆస్తులు పోగు చేసుకున్నారు. బహుశా ధనికులు మరింత ధనవంతులూ, బీదా బిక్కీ మరింత కుంగిపోవడం ఈ యుద్ధకాలంలోనే మొదలయిందేమో. ఇది దేశవ్యాప్తంగా జరిగింది కనకే మొత్తం భారతీయులందరినీ ఈ నవల ఆకర్షించిందేమో.

తండ్రీ కొడుకుల అనుబంధం కూడా హృద్యంగంగా అవిష్కరించబడింది. లేక లేక పుట్టిన కొడుకు. తనకొడుకు గొప్పవాడు కాగలడని పుల్లయ్య్ కోరిక. ఇది లోకంలో అసాదారణం కాదు. ప్రతి తండ్రీ కొడుకు గొప్పవాడు కావాలనే కోరుకుంటాడు. ప్రతి కొడుకూ తనతండ్రంత గొప్పవాడు మరి లేడనే అనుకుంటాడు. ఆ అనుబంధాన్ని మన మనసులను ఆకట్టుకునేలా చిత్రించేరు రచయిత. తండ్రి దొంగతనం చేయడం కళ్ళారా చూసినా, తండ్రి గొప్పవాడే. చూసింది చూసినట్టు పోలీసులకి చెప్పి, మాఅయ్య చాలా మంచోడు, గొప్పోడు, ఆణ్ణి వదలేకపోతే ఏం చేస్తానో చూడండి అంటూ చిన్న వెదురుపుల్ల పుచ్చుకుని పోలీసులని బెదిరించే సన్నివేశం హృద్యంగమంగా ఉంది.

యుద్దకాలంనాటి రైతుల జీవితం, ఆనాటి నుడికారం, మనుషులగురించి తెలుసుకోవాలంటే ఈ నవల చదవండి.

ఇక్కడ లింకు – dagaapadina-tammudu.

(మార్చి 8, 2017)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

2 thoughts on “బలివాడ కాంతారావుగారి దగా పడిన తమ్ముడు సమీక్ష”

 1. సుమన్ లతగారూ, నాకు మీ వ్యాఖ్య పరమానందం కలిగించింది. మెప్పులు కాదు కానీ అర్థం చేసుకునేవారు ఉన్నారని తెలుసుకోడం కన్నా పెద్ద సత్కారం లేదు. మీరు డా. చర్ల అన్నపూర్ణగారికి పంపినందుకు సదా కృతజ్ఞురాలిని.
  విదేహరాజు లా అనకండి. నాకున్న పాండిత్యం ఎంత కనక.
  మీ ఉత్సాహం చూస్తే చెప్పకుండా ఉండలేను. అంగర వెంకట కృష్ణారావుగారి కథ ఒకటి నాకు నచ్చింది ఉంది. ఆ తరవాతేం చేస్తానో తెలీదు.

  మెచ్చుకోండి

 2. మాలతి గారికి ,పాత సాహిత్య పరిచయాలనిచ్చి మీరు మహోపకారం చేస్తున్నారు .అందులో మొదటి రెండు కథలు రచించ బడేసరికి నేను పుట్టలేదు .దగాపడిన తమ్ముడు రచన హైస్కూల్ లో చదివేక మళ్ళీ చదవలేదు .అప్పుడు విశాఖపట్నం లోనే ఉండటం వలన అన్నీ తెలిసిన పరిసరాలు .(మీ రచనలు కూడా ) ఇప్పుడు మీ విశ్లేషణ పునశ్చరణ లాగ ఉంది . ఈనాడు సామాన్యులం అందరమూ దగా పడిన -పడుతున్న – పడబోతున్న తమ్ముళ్ళమే! వ్యవస్థ ఆనాటికీ ఈనాటికీ రూపు మార లేదు . ముఖ్యంగా మీరు విదేహ రాజు లాగ వ్రాస్తారని ఇంతకూ ముందే చెప్పెను కదా!అది నాకు చాలా నచ్చుతుంది .
  మీ బ్లాగ్ చదవమని మా స్నేహితురాలికి ( డా.చర్ల అన్నపూర్ణ -వార్ధా మహాత్మా గాంధీ విశ్వ విద్యాలయం లో ప్రొఫెసర్ ) మీ దగా పడిన తమ్ముడు విశ్లేషణ మెయిల్ను ఫార్వర్డ్ చేసే ను .అనువాద సమస్యల పోస్ట్ లను పరిశీలించమని చెప్పేను.ఈసారి దేని గురించి రాస్తారు అని ఆలోచిస్తూ ………………డా.సుమన్ లత.

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s