అంగర వెంకట కృష్ణారావుగారి పోయిన పుటలు

(నాకు ఇష్టమైన కథలు 5)

నాకు తరుచూ గుర్తొచ్చే కథల్లో ఒకటి ఈ “పోయిన పుటలు”. మార్చి 1952 భారతి సాహిత్యపత్రికలో ప్రచురించినది. ముఖ్యంగా ముగింపు బలంగా నాటుకుపోయి, సదా నామనసులో మెదుల్తూంది.

అసలు ఆ వివరాలే రమణమూర్తిగారికిస్తే, ఆయన ఆ కథని ఇట్టే గుర్తు పట్టేసి నాకు కాపీ పంపేరు. రమణమూర్తిగారికి ధన్యవాదాలు.

ఏదో ఒ చిన్న పల్లెలో వేదపాఠశాలలో “ఘన” పరీక్షకి చదువుకోడానికి వచ్చేనాటికి పతంజలిశాస్త్రికి 18 సంవత్సరాలు. పాడు పడిన ఆంజనేయస్వామిగుడిలో అల్లరి చిల్లరగా సాటి పిల్లలతో ఆడుకుంటున్న 5వ ఫారం విద్యార్థి గోపాలం పతంజలిశాస్త్రి గంభీరమైన కంఠానికీ, రెండోసూర్యునిలా వెలిగే ముఖవర్ఛస్సుకీ ముగ్ధుడై అతనియందు గౌరవం పెంచుకుంటాడు.

ఎత్తుగడలో ఏదో చిన్న గుమాస్తా ఉద్యోగం చేసుకుంటున్న గోపాలం 15 ఏళ్లతరవాత పతంజలిశాస్త్రి తటస్థపడగా అతని మానసావనికమీద గతకాలం “దృశ్యాలుగా మహోద్ధృతితో విరిసి మాయమవుతున్నాయి”. శాస్త్రి విగ్రహం ఎంత బలంగా అతనిమదిలో నాటుకుందో అతనిమాటల్లో స్పష్టమవుతుంది మనకి.

వెడదైన ఫాలభాగం, కాంతి తేరి బాలారుణబింబంవంటి కుంకురేఖతో విరాజిల్లింది, తరుణరక్తం పూరించి బుగ్గలు మిసమిసలాడేయి. అధ్యయనప్రభావంవల్ల తేజస్సు కలిగిన ఆ నేత్రాలు తళుకులు కురిసేయి. కెరటంలా ఛాతి లేచింది. దండలలో కండలు కమ్మెచ్చులు తిరిగేయి.  ఇది చాలు పాఠకుడిని ఆకట్టుకోడానికి.

సాటిస్నేహితులతో ఆడుకోడానికి పాడుపడిన ఆంజనేయస్వామిగుడికి వెళ్ళిన గోపాలం శంఖారావంవలె జీర లేని కంఠగాంభీర్యంతో” శాస్త్రి చేస్తున్న గీతాపఠనానికి మంత్రముగ్ధుడై వెళ్శి ఓరోకలిగా ఉన్న గదిలోకి తొంగి చూస్తే గాయత్ర్యుపాసనాలబ్ధమైన ఓజస్సుతో శాస్త్రి కనిపించాడతనికి.

సంప్రదాయాలపట్ల అచంచలవిశ్వాసం గల పతంజలిశాస్త్రి గోపాలాన్ని శిష్యవాత్సల్యంతో చేరదీసి చెడుమార్గంలో పడకుండా కాపాడడమే ధ్యేయంగా సాగుతుంది కథ. ఓ బొక్కి హార్మొనీతో అపశ్రుతులతో భజనపాటలు పాడుకుంటున్న ఆ పిల్లలకి నచ్చచెప్పి రవంత సంగీతజ్ఞానం కూడా కలిగించి ఒక బాలభక్తసమాజం ఏర్పాటు చేస్తాడు. ఆయనంటే అంటే ఊళ్ళో పెద్దలకి గౌరవభావం ఏర్పడుతుంది.

ఈ నేపథ్యంలో పాత్రలసంఘర్షణ – కొత్తగా యౌవనదశలో అడుగుపెట్టిన గోపాలం, వకుళలకథ ఒకవేపూ, పతంజలిశాస్త్రిని ప్రేమించిన బాలవితంతువు తమిళ యువతి అలమేలు మరోవేపూ, వీరిమధ్య కీలకపాత్ర వహించిన పైడి – ఆ సంఘర్షణలూ, పాత్రచిత్రణా కూడా రచయిత ఎంతో చాకచక్యంతో నడిపేరు.

అలమేలు గోపాలంసహాయం అర్థించినప్పుడు అతడిలో ఆమెగురించి కలిగిన భావన ఒక మంచి ఉదాహరణ. “జీవితంలో మధురరహస్యం గుర్తెరిగిన నన్నామె (ఒకవేళ ఉంటే) అయిదేళ్ళ తమ్ముడిగా భావిస్తూంది.” ఈవాక్యంలో ఆర్ద్రత నన్ను ఆకట్టుకుంది. గోపాలానికి అలిమేలు ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి.

గోపాలానికి ఆమెకోరిక నెరవేరగలదన్న నమ్మకం లేదు. “నిప్పుకు చెద పట్టొచ్చు కానీ శాస్త్రిగారంటే మహాగ్నిజ్వాల తెలుసా,” అంటూ హచ్చరిస్తాడామెను.

అలమేలు జవాబు, “ఆచారాలు, కట్టుబాట్లు ప్రచారం చేసే పెద్దమనుషులే చివరకు ఎంతో అనాచారాలకి దిగిపోతారు” అని. ఆమె జీవితంలో మధురరహస్యాలు ఎరిగిన స్త్రీగానే కాక ప్రపంచాన్ని చూసిన జాణగా కూడా ద్యోతకమవుతుంది మనకి ఈమాటల్లో.

ఈ నలుగురిమధ్య పైడి కీలకపాత్ర వహించినా, కథలో మాత్రం తాత్కాలికంగా, అట్టే ప్రాధాన్యత లేని పాత్రగా రచయిత చిత్రించడంలో ఒక చమత్కారం ఉంది.

వాక్యనిర్మాణం మాటకొస్తే ఒకటిరెండు చోట్ల నాకు అసందర్భంగా అనిపించింది. గోపాలం అలిమేలుగురించి “జీవితంలో మధురరహస్యం ఎరిగిన నన్నామె” అంటాడు. ఇక్కడ అన్వయం సరిగా లేదు. ఆమాటలు అలమేలుపరంగా అయితే “మధురరహస్యం ఎరిగిన ఆమె నన్ను” అని కదా వాక్యనిర్మాణం.

అలాగే పైడి గురించి “సన్నని పైడి అవరుద్ధకంఠం వినిపించింది” అంటాడు గోపాలం.  అవరుద్ధ అంటే అంతఃపురమందు ఉంచబడిన స్త్రీ అని నిఘంటువులో ఉంది. ఇది పైడికి నప్పుతుందా అంటే నాకు అనుమానమే. “పైడి మత్తిలోచనాలు” కూడా నాకు అర్థం కాలేదు. బహుశా మత్తు లోచనాలు అనేమో.

ఆరోజుల్లో వాడకంలో ఉన్న కొన్ని నుడికారాలు నాకు నచ్చేయి – “మేదరమంచం వేస్తూ ఉండేవాళ్ళు” (వీపు సాపు చేయడం), బంతిపువ్వురంగు శాలువ, ఓరోకలిగా (ఓర వేసిన వాకిలి) లాటివి.

శిల్పం దృష్ట్యా నిర్దుష్టమైన రచించబడిన కథ. గోపాలానికి శాస్త్రియందు గల భక్తిప్రమత్తులు, శాస్త్రికి సంప్రదాయాలపట్ల గల దృఢవిశ్వాసం ఎంతో నేర్పుగా నిర్వహింపబడ్డాయి. కథకుడి భావావేశాలకి అనుగుణంగా పాఠకుడు స్పందించగలుగుతాడు.

పాత్రచిత్రణలగురించి ఇక్కడ కొంత వివరంగా చెప్తాను నాఅభిప్రాయాలు, ముఖ్యంగా స్త్రీపాత్రచిత్రణగురించి. ఈకథలో మూడు పాత్రలున్నాయి – వకుళ, అలిమేలు, పైడి. ముగ్గురూ లౌక్యమెరిగిన జాణలుగానే ప్రత్యక్షమవుతారు మనకి.

ఆ కాలంలో సాంప్రదాయాలపట్ల గౌరవం గల రచయితలు స్త్రీపాత్రలని ప్రౌఢలుగా చిత్రించడమే ఎక్కువేమో. మహా పతివ్రతలే కానఖ్ఖర్లేదు. మామూలు మనుషులుగా, లోకరీతిని చక్కగా ఆకళించుకు, తదనుగుణంగా స్వతంత్రంగా ఆలోచించుకుని జీవించడం కనిపిస్తుంది ఈకథల్లో. అందుకు భిన్నంగా పాశ్చాత్యవిలువలు గ్రహించిన కుటుంబరావు, చలంవంటి రచయితలు స్త్రీలదుస్థితిని చిత్రించేరు కానీ వీరిధోరణి సూక్ష్మంగా పరిశీలించి చూస్తే నాకు కనిపించింది వారు సృష్టించిన పాత్రలు మూసపోసిన దుఃఖం, దుర్భరపరిస్థితిలో ఉండి కాగితపుపులులాగ తోస్తాయి. మన చుట్టూ ఉన్న జనాన్ని చూస్తే, ఏ ఒక్కరూ కూడా అలా సంపూర్ణంగా మూస పోసిన దుఃఖంగా ఉండరు. ఉండరనే నా నమ్మకం. ఎంతటి దుఃఖంలోనూ కొంత ఉపశమనం కూడా ఉంటుంది. దుఃఖితులు లేరనడంలేదు నేను. ఆపాత్రని ఒక మనిషిగా చూపాలంటే, మరొక కోణం చూపువాసి అయినా చూపకపోతే ఆ పాత్రని చీమూ నెత్తురూ గల, ప్రాణమున్న జీవిగా గుర్తించలేం. “ధగా పడిన తమ్ముడు” కథ కూడా నాకు ఇందుకే నచ్చింది. ఎంత హీనమైన బతుకులోనూ ఏమూలో చిన్నదీపం వెలుగు ఉంటుంది. అది కూడా ఆరిపోయిననాడు జీవితం లేదు. అలాటివాళ్ళే ఆత్మహత్యలకి పాల్పడతారు. సాహిత్యపరంగా స్త్రీలదుస్థితిని చిత్రించిన కథలలో అనౌచితి ఎక్కువ అని అందుకే అంటున్నాను.

మరొకలా చెప్పాలంటే ఆ కథలలో వాదాలకి ఉన్న ప్రాధాన్యం శైలికి లేదు. ఆ రచయితలు దుస్థితి ఎంత ఘోరమో చూపించడానికి అవలంబించిన పద్దతి సాహిత్యపరంగా ఆమోదించదగ్గది కాదు. కన్నులకు కట్టినట్టుగా ఆ ఘోరాలను వర్ణించడంలో కృతకృత్యులయేరు కానీ మనసుకి హత్తుకునేలా చెప్పలేదనే నా అభిప్రాయం.

సాహిత్యంలో సాంప్రదాయకరచయితలు ధ్వనికి ప్రత్యేకస్థానం ఇచ్చేరు. ఈకథలో కొన్ని సన్నివేశాలలో శృంగారం ఎంతైనా అభివర్ణించి ఉండవచ్చు. కానీ ధ్వని ప్రధానం చేసి, తద్వారా ఔచిత్యం పోషించడం జరిగింది.

ఈ కథలో రచయిత అటువంటి ఔచిత్యాన్ని పాటించేరు. చెప్పకయే చెప్పి ఒప్పించడానికి ప్రతిభ కావాలి.  నిత్యజీవితంలో మామూలుగా ఏదీ స్పష్టంగా, నేరుగా చెప్పకుండా గడిపేయవచ్చు తలా చేతులూ అడ్డంగా నిలువుగా ఆడిస్తూ. కానీ కథల్లో పాఠకుడి ఆసక్తిని ఆకట్టుకోవాలి కనక అలా వీలు కాదు, ముఖ్యంగా అవాంఛనీయమైన, క్రూరమైన, దుష్టచర్యలు, సన్నివేశాలను. “చెప్పకయే చెప్తూ” కథనం సాగించడానికి సృజనాత్మకత కావాలి. పాఠకుడిమనసులో బలంగా నాటుకునేలా చెప్పడానికి అవాంఛనీయమైనవి తదనుగుణమైన పదాలతో వివరించాలన్న ఆతృతని తప్పించుకుని, అదే అనుభూతిని ధ్వనింపజేయడానికి కొంత శ్రమ పడాలి. ప్రతిభ గల రచయితలకు మాత్రమే అది సాధ్యమని నేను అనుకుంటాను.

అంగర వెంకటకృష్ణారావుగారి “పోయిన పుటలు” లో కనీసం రెండు మూడు చోట్ల శృంగారం ఎంతైనా గుప్పించి ఉండవచ్చు. కానీ రచయిత ఒచిత్యాన్ని పాటిస్తూ తనదైన శైలిలో ఎంతో బలంగా మనసున నాటుకునేలా చెప్పకయే చెప్పేరు. అందుకే నాకీ కథ చాలా నచ్చింది.

ఆఖరి అంశం ముగింపు. మూడు సన్నివేశాలు వరసగా ఒకటి తరవాత ఒకటి మూడేసి వాక్యాలలో ముగించేరు రామకృష్ణారావుగారు. ప్రతి సన్నివేశమూ మరో పేజీకి పొడిగించి ఉండవచ్చు కానీ రచయిత పొడిగించలేదు. అలా మూడు వాక్యాలలో ముగించడంద్వారానే ఆ సన్నివేశం బరువు సూచించడం రచయిత నైపుణ్యానికి మచ్చు.

మరో చిన్నమాట – కథ పిడియఫ్ లో 13 పేజీలుంది కానీ రెండు పేజీలు పూర్తిగా ప్రకటనలే. అవి తొలగించుదాం అనుకున్నాను కానీ ఆనాటి ప్రకటనలు చూస్తారని ఉంచేను. 🙂

పోయిన పుటలు

అంగర వెంకటకృష్ణారావుగారి ఇతర కథలు కొన్ని కథానిలయం సైటులో చూడవచ్చు. లింకు ఇక్కడ

000

మార్చి 19, 2017.

 

 

 

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.