కంప్యూటరురచనలో పదచ్ఛేదం

తెలుగులో కలిపి రాయడం, గొలుసుకట్టు వ్రాత అలా ఉండగా, వ్యవహారంలో మాటాడుతున్నట్టు రాయడం వచ్చేక,  కంప్యూటరే వత్తులూ, కొమ్ములూ, గుడిదీర్ఘాలూ చూసుకుంటోంది కనక అవెక్కడ పెట్టాలన్న చింత వదిలిపోయింది. కానీ, అందుకు ప్రతిగా ఈ కీలు కొట్టడలంలో మరో బాధ ఎదురైంది.

రెండో మూడో అంగుళాలు పొడవున్న సమాసం కంప్యూటరుతెరమీద ఎలా కనిపిస్తుంది, ఎక్కడ పదాలు విరిచి రాస్తే కంటికి సుఖం అన్న ప్రశ్న నేను ముఖపత్రంలో అడిగేను. అక్కడ వచ్చిన అభిప్రాయాలు, సలహాలు, సూచనలు సమీకరించి, నా ఆలోచనలు కూడా చేర్చి ఇక్కడ పెడుతున్నాను.

మొదట నాకు ఈ ప్రశ్న ఎదురైంది అనిల్ అట్లూరి justification నా సంకలనాలను పిడియఫ్‌లో చేస్తే బాగుంటుందని సూచించినప్పుడు. అప్పట్లో నాకు ఈ సుదీర్ఘ సమాసాలమూలంగా మాటకీ మాటకీ మధ్య ఎడం ఎక్కువై మరింత వికృతంగా ఉందని అనిపించింది. ఇంతకాలం తరవాత కొన్ని సుళువులు తెలిశాయి. విడదీసి రాయడం ఒకటి. లేదా మాటలు ముందూ వెనకా మార్చి గిట్టించడం రెండో పద్ధతి.

ఉదాహరణకి,

అక్కటికి వెళ్ళి, కొంచెం బెదిరి, మళ్ళీ సర్దుకుని ప్రముఖవిజ్ఞానశాస్త్రవేత్తలనిపించుకున్నవాళ్ళందరిమాటలూ విన్నాను,

ఇది చూడ్డానికీ బాగులేదు. చదవడానికీ సుకరం కాదు.  మొదటి లైనులో ఖాళీజాగాలు మరీ ఎక్కవా, రెండో లైనులో అక్షరాలు కిక్కిరిసిపోయి ఉన్నాయి కదా. అలాటప్పుడు నేను వాక్యం మార్చేను. ఇలా –

అక్కడికి వెళ్లి ప్రముఖవిజ్ఞానశాస్త్రవేత్తలనిపించుకున్నవాళ్ళందరిమాటలూ విన్నాను, ముందు కొంచెం బెదిరి, తరవాత సర్దుకున్న తరవాత.

ఒకొకప్పుడు విడదీసాను – ప్రముఖ విజ్ఞానశాస్త్రవేత్తలు అనిపించుకున్నవాళ్ళందరి మాటలు …

వ్యాకరణరీత్యా విశేషణం, విశేష్యం కలసి ఒకటే పదం అవుతుంది. కలిపి రాయాలి. పొట్టివాడు అనే కాని పొట్టి వాడు అని రాయడం సరి కాదు. అలాగే సీతారాముడు ఒక్కడే, సీతా రాముడు అని రాస్తే ఇద్దరు అనుకునే అవకాశం ఉంది.  కానీ కంప్యూటరు తెరమీద అక్షరాలు చదవడం అన్నీ స్పష్టంగా ఉండవు. ముఖ్యంగా కొన్ని ఫాంట్స్. నేను గౌతమి ఫాంట్స్ వాడుతున్నాను. గతిలేనివారికి గౌతమి ఖతి అన్నారు వీవెన్ గారు. కానీ చాలాకాలంగా అదే వాడుతున్నాను. (వీవెన్ సూచనప్రకారం గౌతమి 2001లో వచ్చింది) ఇతర ఖతులు చూసేను కానీ నాకు వీలు పడలేదు. ఆ కష్టాలన్నీ రాయను కానీ ఈ ఖతి నాకు అలవాటయిపోయింది, కానీ ఈ ఖతిలో చా, దా ఇంచుమించు ఒక్కలాగే కనిపిస్తాయి. చెప్తూ అని రాస్తే ప కింద త-వత్తు వెతుక్కోవాలి. ఇలాటి బాధలమూలంగా అన్నమాట సుదీర్ఖ సమాసాలూ కూడా విడదీసి రాస్తే చదవడానికి సుళువు అన్న నిశ్చయానికి వచ్చేను. అయితే ఎక్కడ నప్పుతాయి, ఎక్కడ నప్పవు అన్నది సమస్య.

మనకి ఒక పాతజోకుంది రామునితోక పివరుండిట్లనియె అని. అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఈ కంప్యూటరులిపి వచ్చేక ఇలాటివి కోకొల్లలుంటున్నాయి. ఈ వాక్యంలోనే కోకొల్లలు ఉంటున్నాయి అని రాస్తే నయం కదా. అయితే మాటాడేటప్పుడు కోకొల్లలు ఉంటున్నాయి అనం. పిల్లలకి కొత్తగా తెలుగు నేర్పుతున్నప్పుడు ఎలా నేర్పాలి అంటే విడదీసి నేర్పడమే సబబు అనుకుంటాను మొదట పదస్వరూపం వాళ్ళకి తెలియాలి కనక. తరవాత మాటాడుతున్నప్పుడు మనం వేరే చెప్పఖ్ఖర్లేదు నాలుకే నిర్ణయించేస్తుంది ఆ పదబంధం.

అలాగే ఇంగ్లీషు పదాలు తెలుగులో రాస్తున్నప్పుడు వాటిలో ఉండే హల్లులసముదాయంవల్ల తెలుగులో కొంత అసౌఖ్యం కనిపిస్తుంది.  Next time అన్నపదం కీలు కొట్టుకుంటూ పోతే నెక్స్టైం అని కనిపిస్తుంది. నెక్స్ట్ టైం అని రాస్తే కొంత నయం కానీ అక్కడ కూడా 3 హల్లులు – క స ట – కలసిపోవడం జరిగింది. మరో ఉదాహరణ – లాప్టాపు అని రాస్తాను నేను. లాప్ టాప్ అని రాయొచ్చు కానీ నాకు అది సరి కాదు అనిపిస్తుంది. లాప్ వేరూ, టాప్ వేరయితే laptop అన్న అర్థం రాదు. సీతారాముడు ఒక్కడే కానీ సీతా  రాముడు అని రాస్తే ఇద్దరన్న అర్థం రావచ్చు తెలుగులో. ఇద్దరయితే సీతా, రాముడూ అన్నదే సరిపోతుంది. కానీ ఈరోజుల్లో అనేక రచనల్లో ఈ సూక్ష్మవిషయాలకి అట్టే ప్రాధాన్యం ఉన్నట్టు లేదు. మరొకరితో “మీ రచనలో తప్పులున్నాయండీ” అని చెప్పడానికి తప్ప.

పోతే, విభక్తి ప్రత్యయాలు విడదీయవచ్చా అని మరో సందేహం. నిజానికి విడదీయకూడదు. రామునితో అనే కానీ రాముని తో కాదు.

ఇంగ్లీషువాడుకవల్ల విడదీయవలసివస్తోంది కొన్నిచోట్ల. నేను సీరియస్గా అని రాసినప్పుడల్లో నాకు అది తప్పుగానే కనిపిస్తుంది. అంచేత సీరియస్ గా అని రాస్తున్నాను. అలాగే, అఫ్కోర్స్. ఈ గుణింతం నాకు of courseలా కనిపించడం లేదు.

మామూలుగా తెలుగులో హలంతాలు లేవు కానీ ఈమధ్య రాహుల్, చరణ్ లాటి హలంతాలు గల పేర్లు వచ్చేయి కనక ఇక్కడ కూడా విభక్తి ప్రత్యయాలతో పేచీ వస్తుంది. రాహుల్కి, చరణ్తో అని రాస్తే చూడడానికి ఇబ్బందిగానే ఉంటోంది. Word లో zero-width joiner (200C in symbols box) అని ఒక వసతి ఉxది. అది వాడితే హలంతానికి విభక్తి ప్రత్యయాలు చేర్చినా రెండు అక్షరాలు విడిగా ఉంటాయి. ఆ 200Cకి నేను ఒక shortcut కూడా సృష్టించుకున్నాను. ఉదాహరణకి పేరు తరవాత ఎడం ఇవ్వకుండా, zero-width joiner (200C in symbols box), అంటే నా shortcut cntl+J టైపు చేస్తే రాహుల్‌‌కి అని కనిపిస్తుంది.

ఏతావాతా చెప్పొచ్చేదేమిటంటి, LCD screen, fonts కారణంగా కంటికి ఇంపుగానూ, చదవడానికి తేలికగానూ ఉండేవిధంగా పదాలమధ్య విరుపులు చొప్పించడం జరుగుతోంది.

ఎటొచ్చీ ఆ విరుపులు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే బాగుంటుంది, రామునితోక పివరుండు అన్నట్టు కాకుండా.

000

కృతజ్ఢతలు –

ఈ చర్చలో పాల్గొని తమ అభిప్రాయాలు వెలిబుచ్చిన సర్వశ్రీ సురేశ్ కొలిచాల, లక్ష్మీ వసంత, వనజ తాతినేని. నారాయణస్వామి,  నారాయణరావు, ప్రసాద్ చరసాల, కెవిఆర్‌బి సుబ్రహ్మణ్యం, మాధవ్ కృష్ణ మేడూరి, ప్రభాకర్ ఎకె, విజయభాస్కరం రాయవరం, బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి, భరద్వాజ రెంటాల, పి.వి. రామారావు, కిరణ్ కుమార్, శివరామకృష్ణారావు వంకాయల గారలకు మనఃపూర్వక ధన్యవాదాలు.

ఇతరత్రా వేలిముద్రలతోనూ, కొత్తవిషయాలు తెలిసాయివంటి వ్యాఖ్యలతోనూ ఆమోదించిన మిత్రులందరికీ ధన్యవాదాలు.

(ఏప్రిల్ 5, 2017)

 

 

 

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

16 thoughts on “కంప్యూటరురచనలో పదచ్ఛేదం”

 1. మీకు ఉపయోగపడుతుందంటే సంతోషమండి. కళ్ళు అన్నిది వీరభాషాభిమానులు అంటున్నారు కానీ వ్రముఖ వ్యావహారిక భాషావాది గిడుగు రామమూర్తి పంతులుకారి పుస్తకంలో కళ్లు అని ఉంది.అలాగే మావూరు కూడా. మీరు మరీ అంత పట్టింపు పెట్టుకోకండి. నేను ఒకొకప్పుడు అలాటి సందేహాలు వచ్చినప్పుడు ఆంధ్రభారతి నిఘంటువు చూస్తాను.

  మెచ్చుకోండి

 2. మీ ఈ వ్యాసం వల్ల మంచివిషయాలు చాలా తెలిశాయి. నా బ్లాగ్‌లో రాసేటప్పుడు బోల్డు అనుమానాలు వస్తూ వుంటాయి. ఉదాహరణకి కళ్లు-కళ్ళు, మా ఊరు-మా వూరు లాంటివి. నేర్చుకుంటాను ఎప్పటికైనా అని ఆశ.

  ^ గురించి చెప్పిన అనిల్ అట్లూరి గారికి ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 3. మీ వ్యాసం మూలంగా చాలా నేర్చుకుంటున్నాము. ధన్యవాదాలు మాలతీ గారు. కలం పట్టి తెలుగు వ్రాయటం ఎలాగూ మర్చిపోయాను. ఈ టపా చదివాకా టైపింగ్ లో ఎన్ని తప్పులున్నాయో తెలుస్తోంది 🙂

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 4. మంచి వ్యాసం. నాలాగా ఈమధ్యనే వ్రాయటం మొదలు పెట్టిన వాళ్ళకి ఉపయుక్తంగా ఉంది. మీరు desktop client applications వాడి వ్రాస్తున్నట్టున్నారు. అన్ని tools తోను ఏదో ఒక ఇబ్బంది ఉంది. ఈక్రింది లంకె వాడే ఉంటారు. లేనట్టయితే ఒకసారి చూడండి. ప్రూఫ్ రీడింగ్ లేకుండా మొట్టమొదటిసారే సవ్యంగా వ్రాయటం ఇప్పుడున్న వాటితో సాధ్యం కాదేమో. కానీ ఈ అప్లికేషన్ మిగిలిన వాటి కంటే ఎక్కువ పదాలని చూపెట్టి, intuitiveగా, సరిగ్గా వ్రాయటానికి ఉపకరిస్తుంది.

  http://telugu.indiatyping.com/

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 5. గౌతమి 20 ఏళ్ళగా కాదు. సరే. అంతకుముందు శ్రీలిపి, ఇంకా ఏవో వాడేను కానీ నాకు సరిగా కుదరలేదు. గౌతమి ఒక్కట్ నాకు బాగా వస్తోంది. పోతే మిగతా సమాచారానికి ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 6. మంచి విషయం ఎత్తుకున్నారు. ఇలాంటివన్నీ ఒకచోట సూత్రాలుగా క్రోడీకరిస్తే బావుంటుందేమో.

  ఇక ZWNJ ఉన్నది మీరు చెప్పిన విషయాల కోసమే. యూనికోడ్ ప్రకారం ఆ వాడుక ప్రామాణికమే. (విండోస్ ఇన్‌స్క్రిప్టు లేయటువు వాడేవాళ్ళు Right Alt + 2 ద్వారా దీన్ని సాధించవచ్చు. లేఖినిలో ^ అనే గుర్తు వాడవచ్చు.)

  మీరు ప్రస్తావించిన విషయాలపై నేను అనుసరించే పద్ధతులు:

  విభక్తి ప్రత్యాయాలు: ప్రత్యయం ఒకటి రెండు అక్షరాలే అయితే పదంతో కలిపి రాస్తాను. రెండు కంటే ఎక్కువయితే, విడదీసి రాస్తాను. ఉ.దా. తెలుగులో, తెలుగు లోనికి అనువదించండి

  ఇంగ్లీషు పదాలకు తెలుగు విభక్తులు: ఇంగ్లీషు పదాలను పొల్లుతో (హలంతం) రాస్తున్నప్పుడు ZWNJ వాడి (ఉ.దా. సీరియస్‌గా) అనే రాస్తాను. కానీ నేను ఎక్కువగా వాడేది ఆ పదాలను డుమువులతో తెలుగులోకి మార్చి అప్పుడు విభక్తి ప్రత్యయాలను చేరుస్తాను. (ఉ.దా. సీరియస్సుగా, ఇంగ్లీషులో)

  మరో విషయం: ఇంగ్లీషులో రెండు పదాలుగా రాసే కొన్ని ఉళ్ళ పేర్లు తెలుగులో ఒకే పదంగా రాస్తున్నాం. ఉ.దా. హాంకాంగ్, న్యూయార్క్, న్యూజీలాండ్. వీటిని విడదీసి రాస్తే ఇబ్బందే.

  (పీకిన) ఈకలు: గౌతమీ ఖతిని మీరు 20 ఏళ్ళకి మించి వాడుతూండే అవకాశం లేదు. ఈ ఖతి విండోస్ xp (2001) నుండి జనాలకి అందుబాటులోకి వచ్చింది. 🙂

  పలు తెలుగు ఖతుల నమూనాలు చూడండి: https://photos.google.com/search/_tra_/photo/AF1QipOK9ojHGon_64AHiBYBg9-UESDarYh5QPQwMubM

  మెచ్చుకోండి

 7. ^వాడకంతో మీరు వాడిన కొన్న పదాలు. ఉదాహరణకిః నెక్స్టైం > నెక్స్‌టైం. (నె క్ స్ ^ టైం ) ఇందాక ఫేస్‍బుక్ (ఫే^స్^బుక్) లో వ్యాఖ్యానించినట్టు లాప్‍టాప్. అది వాడితే చాలా మట్టుకు ఈ పదబంధం సమస్యలు తూచ్!

  మెచ్చుకోండి

 8. జిలేబి గారి పద్యవ్యాఖ్యలా 🙂? ఏదైనా కొత్తగా మొదలెట్టినప్పుడు కనబరిచే అత్యుత్సాహం గురించి చెప్పడానికి తెలుగులో రెండు సామెతలున్నాయి, మీకు తెలియనిదేముంది 🙂. ఇక్కడ కూడా అదే జరుగుతున్నట్లుంది 🙂.
  కనెక్టెడ్ స్పీచ్ తెలుగులో కంప్యూటర్ లో వ్రాయడంలో గల సాధకబాధకాల గురించి ఆసక్తికరమైన టపా వ్రాసారు. మీరు సూచించిన ZWJ నేను కూడా ప్రయత్నించి చూస్తాను. ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 9. మీరు పద్యాలలో తప్ప అభిప్రాయాలు చెప్పరా? ఒకోకప్పుడు మీ అభిప్రాయం తెలీడం లేదు. 🙂 దయచేసి, మీ పద్యాలకి ఇది వేదిక చేయకండి. టపాకి సంబంధి, టపాని మరింత విస్తృతం చేసే వ్యాఖ్యలని నేను ఆహ్వానిస్తున్నాను.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s