బలివాడ కాంతారావు సాహితీయానం

తూలిక.నెట్ లో బలివాడ కాంతారావుగారిమీద నేను రాసిన వ్యాసానికి బుసిరాజు లక్ష్మీదేవి దేశాయిగారి తెలుగుసేత వార్త Sunday Magazine ఏప్రిల్ 9, 2017 లో ప్రచురించబడింది. వార్త సౌజన్యంతో తిరిగి ఇక్కడ పాఠకులసౌకర్యార్థం ప్రచురిస్తున్నాను, చిన్న చిన్న సవరణలతో, ఉపయుక్తగ్రంథపట్టిక చేర్చి.

బుసిరాజు లక్ష్మదేవి దేశాయిగారికి ధన్యవాదాలు నావ్యాసం అనువదించినందుకు.                 000

బలివాడ కాంతారావు సాహితీయానం

ఆంగ్లమూలం – నిడదవోలు మాలతి

తెలుగుసేత – బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి

—————–

బలివాడ కాంతారావు గారు ప్రసిద్ధులైన ప్రామాణికత గలిగిన రచయిత. వీరు ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా మడపాం గ్రామంలో జులై 3, 1927 న జన్మించారు. ఎనిమిదేళ్ళ వయస్సులో వీరి కుటుంబం విశాఖపట్టణానికి తరలివెళ్ళారు.

వీరు ఎనిమిదవతరగతి చదువుతుండగా ‘విద్యార్థి’ అనే హస్తలిపి పత్రికకు సంపాదకత్వం వహించేవారు. ‘సూర్యనారాయణ’ అనే పేరు గల ఇద్దరు వ్యక్తులు (తండ్రి, ఉపాధ్యాయుడు) తనకు స్ఫూర్తి ప్రదాతలనీ, రచయితగా తన అభిరుచిని తీర్చిదిద్దుకోవడానికి ఎంతో తోడ్పడినవారనీ కాంతారావు గారు చెప్పారు.

పదిహేడేళ్ళ వయసులో భారతనేవీ లో గుమాస్తాగా ఉద్యోగానికి చేరి అతి త్వరలో సివిలియన్ ఆఫీసర్ అయ్యారు. నేవీలో పనిచేసేటపుడు ఉద్యోగబాధ్యతలవల్ల ఎక్కువ ప్రయాణాలు చేసేవారు. అందువల్ల దేశంలోని వివిధ ప్రాంతాల గురించి , సంస్కృతుల గురించి , ముఖ్యంగా గిరిజన జాతుల గురించి మంచి అవగాహన పెంచుకున్నారు. ఈ అవగాహన కాంతారావు గారి కాల్పనిక సాహిత్య సృష్టిని మరింత సుసంపన్నం చేసింది.

కాంతారావు గారి గురించి క్లుప్తంగానే వ్రాసినందుకు ముందుగా క్షమించమని కోరుకుంటున్నాను. మార్గాంతరం లేక పోబట్టే నేను ఇంత సంక్షిప్తంగా వ్రాస్తున్నాను. ఇది చదివినవారిలో ఎవరికైనా బలివాడ కాంతారావు గారి సాహిత్యవ్యాసంగం గురించి మరింత తెలుసుకొనడానికి పూనుకొనే ఉత్సాహం కలిగితే, ఈ వ్యాసం  సార్థకమైనట్లేనని భావిస్తాను.

బహుశా ఏదైనా ఒక సిద్ధాంతాన్నిపట్టుకొని, దాన్నే బలపరుస్తూ వ్రాసి ఉండి ఉంటే కాంతారావు గారు మరింత ప్రసిద్ధులయి ఉండేవారేమో. కానీ అలా చేయకపోవడమే వారి బలమైంది. ఏదో ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉంటే వారి సృజనాత్మకతను అంతవరకే పరిమితమై ఉండేది. దానికి బదులు జీవితాన్ని విభిన్నమైన కోణాలలో వారు దర్శించారు, పరిశీలించారు, పద్ధతి ప్రకారం అధ్యయనం చేశారు. గిరిజనుల ప్రపంచాన్ని కూడా తమ కథల్లో సదవగాహనతో ప్రతిబింబించగలిగారు. కాంతారావుగారికి తెలుగూ, ఇంగ్లీషూ మాత్రమే కాక బెంగాలీ,  హిందీ, ఒరియా భాషాసాహిత్యంతో కూడా పరిచయం ఉంది. వారి రచనాపరిధి ఒక్క ఆంధ్రప్రదేశ్ కే కాదు యావద్భారతదేశానికి సంబంధించినది.

కాంతారావు గారి మొట్టమొదటి నవల ‘శారద’ 1947 లో ప్రచురింపబడింది. ఒక పత్రిక ఈ నవలను తిరస్కరించగా ‘చిత్రగుప్త’ కు పంపానని వారు తెలిపారు. తిరస్కరణ వారి రచనాభిలాషపై ఏమన్నా ప్రభావం చూపిందా అని అడిగినపుడు  నిజానికి తిరస్కరణలు మరింతగా తమ రచనావ్యాసంగాన్ని బలవత్తరమే చేశాయని అన్నారు. (యోహన్ బాబు గారితో ఇంటర్వ్యూలో.)

వారి స్థిరచిత్తం, ఆత్మవిశ్వాసం వారికెంతో లాభించాయి. ‘Short Stories of Kantha Rao’ సంకలనంలో ఆనాటి ప్రచురణ ముచ్చట్ల గురించి వారు ఇలా ప్రస్తావించారు. ‘ నాటి ప్రఖ్యాత సాహిత్య పత్రిక భారతికి  ఒక కథను పంపగా దానిని వారు భారతిలో ప్రచురించకుండా తామే నడిపే ఆంధ్రపత్రిక అనే పేరుగల నాటి సుప్రసిద్ధవారపత్రిక లో ప్రచురించారు. తర్వాత ఆంధ్రపత్రికకు పంపిన మరొక కథను భారతి మాసపత్రికలో ప్రచురించారు.’

వారి తొలి నవలలైన ‘గోడ మీద బొమ్మ(1953), దగా పడిన తమ్ముడు (1957) లలో ఒక దశాబ్దకాలవ్యవధిలో జరిగిన కుటుంబగాథలను చిత్రించారు. ఉదాహరణకు, దగా పడిన తమ్ముడు కేవలం పదేళ్ళకాలంలో జరిగిన కథ. తర్వాతి నవలల్లో కొన్ని తరాల జీవితాల్ని చిత్రిస్తూ, అనేక అంశాల మీద తమ దృష్టికోణాన్ని చెప్పారు. ‘వంశధార’ అనే నవల అటువంటిదే అని చెప్పవచ్చు. ఇందులో మూడు తరాల జీవితకాలాన్ని ప్రతిబింబించారు. సామాజికంగా వచ్చిన మార్పులను ప్రతీకాత్మకంగా చూపించడానికి మూడు తరాలలో జీవించిన పాత్రల అవసరం ఏర్పడిందని వారు విశ్వసించారు.

దిల్లీలో నివసిస్తున్న కాలంలో వారీ నవల వ్రాశారు. ఈ నవలలో వేదికగా నిలిచిన ప్రాంతం వారి స్వగ్రామం కావడం వల్ల , ఒక యాభయ్యేళ్ళ వ్యవధిలో అంటే 1918 నుంచి జరిగిన ఘటనాక్రమాన్ని అధ్యయనం చేయడానికి, విషయసేకరణకు, ఎప్పుడో  1936 లోనే వదిలేసిన ఊరికి తిరిగి వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు. వారి స్నేహితులు, వారి తండ్రి స్నేహితులు అనేకులు ఎంతో విలువైన సమాచారం ఇచ్చి తనకు సహాయం చేశారు, తత్ఫలితంగానే నవలలోని  యథార్థమైన పాత్రల్నీ, భాషావాదాల్నీ, భేదాల్నీ కూడా చక్కగా పొందుపఱచగలిగారు.

‘వంశధార’ నవల రెండో ముద్రణ పొందినపుడు నవలలోని ముగింపు ఎందుకు మార్చారన్న ప్రశ్నకు సమాధానంగా, ‘తన కథనానికీ , వాస్తవానికీ ఉన్న వైరుధ్యాలను తన స్నేహితులు సూచించగా మార్చానని’ డా. యోహన్ బాబు గారికి కాంతారావు గారు జవాబిచ్చారు. “ రచయిత ఇష్టాయిష్టాలప్రభావం రచనలమీద పడనివ్వరాదనీ, … తొందరపడి స్థిరమైన అభిప్రాయాలు ఏర్పరుచుకోరాద”నీ, స్పష్టంగా చెప్పారు. అది పుస్తకం గా బయటకు రావడానికి తొమ్మిది సంవత్సరాలు పట్టినా, మొత్తం మీద తృప్తి కరంగా వచ్చిందని అభిప్రాయపడ్డారు. భావితరాల వారిని అందులోని దృష్టికోణాలు ఆలోచింపజేస్తాయని ఆశిస్తున్నట్టు చెప్పారు.

ఈ నవల అనేక కోణాల్ని స్పృశిస్తుంది – వివిధ వర్గాల్లోని రాజకీయ సిద్ధాంతాలు, మతపరమైన విశ్వాసాలు, సామాజిక పద్ధతులు, జీవనరీతులు మొదలైన వాటిని సవిస్తరంగా చర్చించిన నవల ఇది. ఈ నవల విస్తృతిని, లోతును చూస్తే ‘ఆధునిక భారతదేశ కథ’ గా దీనిని పిలువవచ్చని డా. యోహన్ బాబు అంటారు.

‘దిల్లీ మజిలీలు ‘ అనేది కాంతారావుగారి మరొక సుప్రసిద్ధ రచన. “ఇది బాగా పరిశోధించి వ్రాసినది. దీనిని పూర్తి చేసినపుడు డాక్టరేట్ పట్టా పుచ్చుకున్న భావన కలిగింది. పూర్తి చేయడానికి ఆరేళ్ళు పట్టింది. కథలలో కథలు ఉండి దీని రచనా పద్ధతి కూడా విభిన్నంగా తయారైంది. ధర్మరాజు యొక్క ఇంద్రప్రస్థపురం నాటి నుండి నేటి కొత్తదిల్లీ వరకూ గల రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక కోణాల్లోంచి మన జీవితాలను చర్చించిన నవల ఇది. దీనివల్ల నాకు గుర్తింపు ఇంకా రానప్పటికీ, సంతృప్తి మాత్రం లభించింది. అమ్మకాలు తక్కువే. హిందీలోకి అనువదించితే ఈ రచనకు కొద్ది గుర్తింపు వస్తుందేమో.”

యోహన్ బాబు గారితో  ముఖాముఖిలో కాంతారావు గారు వెలిబుచ్చిన మరి కొన్ని అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.

సమకాలీన రచయితల గురించి – ‘మంచి రచయితలను గొప్ప రచయితలుగా ముద్ర వేస్తే వారు సాధారణ రచయితలైపోయే ప్రమాదం ఉంది. రచయితలు పేరు, డబ్బు మీద మాత్రమే దృష్టి పెడితే మంచి రచనల నాణ్యత తగ్గిపోతుంది. చాలా మంది రచయితలీనాడు ఈ పరిధులను దాటి చక్కగా వ్రాస్తున్నారు. ఈ రకమైన సాహితీ సేవను వారు ముందు ముందు మరింత చక్కగా కొనసాగించగలరు.’ అన్నారు.

నవలలను వ్రాయడం తగ్గించి, కథలు కొనసాగించడానికి కారణం చెప్తూ వారు నవల వ్రాయడమూ కష్టమే, తర్వాత ప్రచురించబడడమూ కష్టమేనన్నారు.

కాంతారావు గారికి స్ఫూర్తిగా నిలిచినవారి గురించి చెప్తూ, బెంగాలీ రచయిత శరత్ చంద్ర ఛటర్జీ గారి ప్రభావం తన నవల ‘అన్నపూర్ణ’ మీద ఉందంటూ, “ఇతర భాషల్లోని గొప్ప గొప్ప కాల్పనిక సాహిత్యాన్ని చదివినపుడు వాటి ప్రభావం నామీద ఉంటుంది, నా కథల్లో కనిపిస్తుంది, కానీ నవలను గొప్పనవలగా తీర్చాలంటే ..ఏదో అసందిగ్ధత ఉంది.”  యథాలాపంగా మాట్లాడుతూ అన్నారు.

మనస్తత్వ శాస్త్రము చదువుకున్నందువల్ల ఆ ప్రభావం వారి పాత్రలలో ఉందా అన్న ప్రశ్నకు బదులుగా వారు మాట్లాడుతూ పనిగట్టుకొని మనస్తత్వ శాస్త్ర సిద్ధాంతాలతో పాత్రలను తీర్చిదిద్దలేదని, ఆ కోణంలో వాటిగురించి ఆలోచించలేదని అన్నారు. ఒక సారి రూపొందాక ఆ యా సిద్ధాంతాలలో ఆ పాత్రల్ని ప్రతిక్షేపించి చూడవచ్చుననడంలో సందేహం లేదు అన్నారు.

మూడు నవలలు జన్మభూమి, పుణ్యభూమి, కర్మభూమి వారి రాజకీయ దృష్టికోణాల్ని ప్రతిబింబిస్తాయి. ఒక ప్రభుత్వోద్యోగిగా యథార్థ పరిస్థితులను చిత్రించలేనప్పటికీ, ఒక ఊహాప్రపంచపు పోకడలుగా అయితే అభివర్ణించానని చెప్పుకొచ్చారు.

సంప్రదాయాలనేవి వాడిపోతున్న కొమ్మలవంటివనీ, వాటిని పట్టుకు వేళ్ళాడడం వల్ల మార్పు రాదనీ నమ్ముతూ, మార్పు కు అవకాశం లేనిదే ఏ సమాజమూ ప్రగతి సాధించజాలదన్నారు. బహుశా అందువల్లే వారి రచనల్లో కొన్ని  పాత్రలు సంప్రదాయ విరోధులుగా సృష్టించబడతాయి.

తను కల్పించే పాత్రల పట్ల నిజాయితీతో ఉంటూ ప్రతీ సూక్ష్మమైన అంశం పట్లా జాగ్రత్తగా ఉండడం సరియైన పద్ధతని నమ్ముతారు. స్వంత కథల సంకలనం ‘బలివాడ కాంతారావు కథలు’ లోని ముందుమాటలో అందులోని కథలన్నీ తన స్వంత జీవితంలో గమనించిన విషయాలపైనేననీ, అన్ని పాత్రలూ తన జీవితంలో తారసపడినవే ననీ అన్నారు. ‘మనిషి, పశువు’ కథలో గతంలో ముంబయిలో పనిచేస్తున్న రోజులలో చూసిన వ్యక్తి కథే అన్నారు. అందుకే వారు సృజించిన స్త్రీ పాత్రలన్నీ బలమైనవే. పుట్టిపెరిగిన గ్రామంలో అటువంటి విశిష్ట వ్యక్తులను, గౌరవప్రదమైన నిజాయితీ గల బ్రతుకులను ఇష్టపడే వారిని చూసి ఉండడం వల్లే అటువంటి పాత్రలను సృజించగలిగానన్నారు.

ఉపర్యుక్తమైన కథ ‘మనిషి, పశువు’ కథను గురించి చర్చించుకుంటే, అది కథకుడు(కథ చెప్పే పాత్ర) సైబా పనిచేసే ఒక కార్యాలయంలోని నాలుగోతరగతి ఉద్యోగి పాటిల్ గురించిన కథ. పాటిల్ ఎప్పుడూ మద్యం పుచ్చుకొని ఉంటాడు. సమయానికి పనిలోకి రాడు. సంపాదనంతా త్రాగుడుకు ఖర్చు పెట్టడమే కాక, ఇంకా డబ్బు కావాలని భార్యను సతాయిస్తుంటాడు. ఆమెకు డబ్బు ఎక్కడినుంచి వస్తుందని ఏమాత్రం ఆలోచించిన పాపాన పోడు. సైబా అతనికి కావలసిన డబ్బిచ్చి హితబోధ చేయాలనుకుంటాడు.  కానీ పాటిల్ సమాజం గురించి, అన్యాయాల గురించీ ఏదేదో వాగి తన త్రాగుడు అలవాటుని సమర్థించుకుంటూ మాట్లాడుతాడు. సైబా దగ్గర పాటిల్ ప్రశ్నలకు సమాధానం లేదు. పాటిల్ కు డబ్బు ఇవ్వడమూ మానలేదు సైబా.

క్రమంగా పాటిల్ ప్రవర్తనలో మార్పు కొంచెం కనిపించినా అదెక్కువ కాలం నిలువదు. ఒకరోజు ఇద్దరు పోలీసులు తన భార్య గురించి చెడుగా మాట్లాడడం విని , నమ్మలేని పాటిల్ వారిమీద దాడి చేస్తాడు. పోలీసులు అతన్ని జైల్లో వేస్తారు. పాటిల్ సైబాకు ఫోన్ చేసి సహాయం అర్థిస్తాడు. తర్వాత అతను తన భార్య తన త్రాగుడుకు అడిగే డబ్బు సంపాదించడానికి నిజంగానే వ్యభిచారం చేస్తోందని తెలుసుకొని, ఆమెను చంపేస్తాడు. సైబా మాత్రమే తననొక మనిషిగా గుర్తించినట్టు సైబా ఇంటికి వెళ్ళి చెప్తాడు.

ఈ కథలో చాలా అస్పష్టత ఉంది. ఎన్నో ప్రశ్నలు లేవదీస్తోందీ కథ. నిజంగానే సామాజిక దురంతాల కారణంగానే పాటిల్ త్రాగుతున్నాడని రచయిత చెప్పాలనుకుంటున్నారా? మరయితే, భార్య పట్ల అతని ప్రవర్తన కూడా ఏమాత్రం సమంజసం కాదు. పైగా కారణం తెలుసుకున్నాక భార్యను చంపి ఈ పాత్ర సందిగ్ధతను మరింత సంక్లిష్టం చేస్తూ, పాత్ర స్వభావాన్ని సందేహాస్పదం చేస్తోంది. చాలా చర్చలు నడిపాక నాకర్థమైందేమిటంటే రచయిత మానవస్వభావంలోని సంక్లిష్టస్వభావాన్ని చిత్రించదలచుకున్నారు. తఱచుగా మానవస్వభావం కూడా స్పష్టమైన నిర్వచనానికి లొంగదు. ఒక సిద్ధాంతంలో అమరిపోయే వీలు లేకుండా ఉంటుంది. రచయిత ఏదన్నా మినహాయింపు ఇవ్వదలచుకుంటే పాటిల్ పాత్రలో కొంత మార్పుని కథకుడు చూస్తున్నట్టు గా వ్రాయవచ్చు. అంతే.

‘కోరికలసత్యం’ కథ ఒకట్రెండు కారణాలవల్ల నాకు బాగా నచ్చింది. జీవితాన్ని మరింత మెఱుగు పఱచుకోవడం కోసం ప్రయత్నించడం మానవసహజం. దానికి ప్రగతి అనో, మంచి జీవితమనో ఏ పేరు పెట్టినా, ‘ఇంకొంత’ కావాలని కోరుకోవడమే. ఆ మెఱుగు కోరుకోవడం, దానికై ప్రయత్నించడం ఒకవేళ పొరబాటున కీర్తికాంక్షతో అయితే అది వినాశనానికే దారితీస్తుంది.

కాంతారావు గారి చిన్నకథల్లో ఒకటి ‘నాలుగు మంచాలు’ . ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నలుగురు రోగుల కథ. నిజానికి సుందరం అనబడే ఒక వ్యక్తి, మిగిలిన ముగ్గుర్నీ బయటి ప్రపంచంతో కలుపుతూ, తనవ్యాపారంతో పాటు వారి వ్యాపారాలనూ శ్రద్ధగా చూసుకుంటూ వారి పై ప్రభావం చూపిస్తాడు. తన వ్యాధి కారణంగా అతడు ఆసుపత్రికి వస్తూ వెళ్తూ ఇవన్నీ చేస్తుంటాడు. ఒకరితో ఒకరు సంబంధంలేని వ్యక్తులు ఒక బాంధవ్యంలో పెనవేయబడడం అనే కథా వస్తువు ఆసక్తి కరమైనది. మంచి రచన.

కాంతారావు గారు తన రచనాకౌశల్యానికి మూడు దృష్టాంతాలు కారణాలుగా చెప్తారు.

బాల్యంలో గొల్ల రామస్వామి అనే హరికథాకారుడు తమ ఊళ్ళో ఒక చెట్టు క్రింద రకరకాల కథలను ప్రేక్షకులకు చెప్తుండేవాడు. “అతని నుంచే ఆసక్తి కరంగా కథ చెప్పేదెలాగో నేను నేర్చుకున్నాను.” అంటారు.

యుక్తవయస్సులో ఉండగా ఒకరోజు చిన్నపిల్లల తగాదా మొదలై పెద్దవాళ్ళు కొట్టుకోవడం వరకూ వచ్చిన సంఘటన చూసిన కాంతారావు గారు, వారిలో ఒకామె సోదరుడు దూరంగా  ఆ గొడవను చూస్తూ ఊరకే నించోవడం చూసి అతన్ని మీరెందుకు వాళ్ళ తగాదా తీర్చకుండా ఇలా దూరంగా నిలుచున్నారని అడిగారు. పక్షపాతం లేకుండా గొడవ గురించి తెలుసుకోవాలంటే దూరం నుంచి వాళ్ళను చూస్తేనే తెలుస్తుందని అతను జవాబిచ్చాడు. “ఈ సంఘటన ద్వారా రచయిత కూడా నిష్పక్షపాతంగా ఉండితీరాలని నేను నేర్చుకున్నాను” అని చెప్పారు.

ఇంకో సందర్భంలో ఒక జూనియర్ ఆఫీసరు పని గురించిన ఒక చిన్న మెమో చూశారు కాంతారావుగారు. “చాలా మంది సీనియర్ ఆఫీసర్లు , పై అధికారులకూ కార్మికులకూ మధ్య తగాదాలెలా తీర్చాలన్నది ఈ జూనియర్ ఆఫీసర్ నుంచే నేర్చుకున్నారని ఆ నోట్ లో ఉంది. ఆ జూనియర్ ఆఫీసర్ తన సీనియర్ ఆఫీసర్లకన్నా పెద్ద పెదవికి ప్రమోషన్ ద్వారా పొందాడు. “ ఈ సంఘటన ద్వారా మనము కథను సూటిగా, క్లుప్తంగా చెప్తేనే మంచి ఫలితాలు వస్తాయని నేర్చుకున్నాను.” అని చెప్పారు.

కాంతారావు మే 6, 2000 నాడు స్వర్గస్తులైనారు.

బలివాడ కాంతారావుగారి కథలు కొన్ని కథానిలయంవారి సైటులో పిడియఫ్ ఫార్మాట్ లో లభ్యం.  
తెలుగు వికిపీడియాలో వారి జీవితవిశేషాలు, సంపూర్ణ రచనలపట్టిక చూడవచ్చు. 

ఈ వ్యాసానికి ఆధారగ్రంథాలు-

  1. యోహన్ బాబు గారి “బలివాడ కాంతారావు గారి నవలలు- ఒక పరిశీలన. “దిప్తేజ ప్రచురణలు, 1995.
  2. కాంతారావు గారి “బలివాడ కాంతారావు కథలు.”విశాలాంధ్ర ప్రచురణసంస్థ, హైదరాబాదు. 1994

సుజాతా పట్నాయక్ గారి గారి  పుస్తకం “The Secret of Contentment and Other Telugu Short Stories.” లోని బలివాడ కాంతారావు గారి కథల  ఆంగ్ల అనువాదాలు. ISBN 8120724604.

డా. యోహన్ బాబు గారికి, బలివాడ కాంతారావు గారికి కృతజ్ఞతలు.

 

(ఏప్రిల్ 12, 2017)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

5 thoughts on “బలివాడ కాంతారావు సాహితీయానం”

  1. మీరిచ్చిన “దగాపడిన తమ్ముడు” చదువుతున్నాను – ఈ వ్యాసంతో బలివాడ కాంతారావుగారి మిగిలిన రచనల పేర్లు తెలిశాయి. పంచుకున్న మీకు ధన్యవాదాలు – మీ వ్యాసాన్ని తెలుగులోకి అనువదించి అందించిన బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి గారికి ధన్యవాదాలు.

    మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

  2. నేను వైజాగ్ లో చదువుకొనే రోజుల్లో బలివాడ కాంతారావు గారు కొద్దిగా తెలుసును.తెలుగులో మంచి నవల,కథా రచయిత అనడంలో సందేహం లేదు.ఆయన కథలపై విశ్లేషణ బాగుంది.సరళమైన శైలి ,ఉత్తరాంధ్ర నేపథ్యం ఎక్కువగా కనిపిస్తాయి.’ గోడ మీద బొమ్మ ‘ ,దగా పడ్డ తమ్ముడు ‘ నవలలు చదివాను.ఆ రోజుల్లో ఆంధ్రపత్రికలో ఆయన్ కథలు ఎక్కువగా ప్రచురించబడేవి.

    మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.