ప్రతిఫలం ఇస్తే “మంచి”కథలు వస్తాయా?

జాలపత్రికలు ప్రతిఫలం ఇస్తే మంచికథలు వస్తాయని ఒక సాహితీప్రముఖుడు అన్నాక నాకు ఈ సందేహం వచ్చింది. “మంచి”కథ రాయడానికీ, అందుకొనబోయే ప్రతిఫలానికీ సంబంధం ఉందా అని. ఇక్కడ “మంచి” అన్నపదం ప్రత్యేకించి నొక్కి చెప్పడమైనదిగా గుర్తుంచుకోవాలి.

నాకు తెలిసినంతవరకూ సృజనాత్మకత స్వతస్సిద్ధంగా జనించేదే కానీ శ్రమించి సాధించేది కాదు. ప్రతి వ్యక్తిలోనూ సృజనాత్మకత సాంసిద్ధికంగా ఉత్పన్నమయి ఉంటుంది. అందరిలోనూ తెలివితేటలు ఒకేస్థాయిలో ఉండవు కనకనే ఐక్యూలు కొలిచి మేధావులూ, సామాన్యులూ అంటూ హెచ్చుతగ్గులు గుర్తించడం జరుగుతోంది. అలా కాక, ఏదో ఒక ప్రేరకం – ధనమో, పురస్కారమో, మరొకటో ఇస్తే సృజన పైస్థాయిలో ప్రకటితమయితే, ఈసరికి ప్రతివారినీ మేధావిగా చేసేయవచ్చు. అప్పడు సృజనకీ ప్రతిఫలానికీ తప్పనిసరిగా లంకె ఉన్నట్టు ఒప్పుకోవచ్చు. నేను ఈ ప్రశ్న ముఖపుస్తకంలో అడిగితే, కొందరు ప్రతిఫలం ప్రోత్సాహకరం అన్నారు. అది ముఖ్యం కాదన్నారు మరికొందరు. ఈ అంశాలను ఈనాటి సాహితలోకం నేపథ్యంలో ప్రస్తావిస్తాను.

మొదట పోటీలు, బహుమతులు తీసుకుంటే, అవి పెద్ద మొత్తాలు. బహుశా కొంత ప్రోత్సాహకరం కావచ్చు. అ పోటీ నిర్వాహకులు ఎవరు, వారి ధ్యేయం, నిబంధనలు ఏమిటి అన్న అంశాలు సహజంగానే రచయితమనసులోకి వస్తాయి. తాను ఎంచుకున్న అంశం ఆ నిర్వాహకుల అభిప్రాయాలకి అనుగుణంగా ఉందో లేదో చూచుకుంటాడు. ఆతరవాత ఇష్టమైతే రాయొచ్చు, లేకపోతే, ఇది నాకు పనికిరాదు అని వదిలేయవచ్చు. కానీ అలా తయారయిన కృతిలో సృజనపాలెంత అంటే చెప్పడం కష్టం కదా. నేను ఒక ఉదాహరణ చెప్తాను. నామాట చాలామందికి నచ్చకపోవచ్చు కానీ సాహిత్యఎకాడమీ పురస్కారం అందుకున్న భూమిపుత్రి చదివినప్పుడు ఇది పంచవర్షప్రణాళికకి ప్రచారంలా ఉంది అనుకున్నాను. ప్రభుత్వంవారిఆశయాలకి అనుకూలంగా ఉంటేనే ఆ పురస్కారం మరి.

అచ్చుపత్రికలలో చాలాకాలంగా కొనసాగుతున్న  ప్రతిష్ఠాత్మకమైనవి ఆంధ్రజ్యోతి, రచన, స్వాతి, విపుల, యువ లాటివి. నాకాలంలో ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి ప్రతిఫలం ఇచ్చేవారు. వాటిలో ఆంధ్రజ్యోతి ఇప్పుడు కూడా ఉంది కానీ ప్రతిఫలం ఇస్తున్నట్టు లేదు. వెనకటిరోజుల్లో  నాలాటి రచయితలు ఆ పత్రికలలో మాకథలు ప్రచురించడమే గౌరవం భావించుకునేవారం. సాధారణంగా ప్రతిఫలం ఇవ్వకపోయినా ప్రసిద్ధులయిన రచయితలు తమరచనలను ఈ పత్రికలకి పంపేరు. ఇంక చిన్న పత్రికలకి బతికి ఉండడమే గగనం కనక వారు ఇవ్వడం లేదు. కొన్ని పత్రికలు కనీసం పత్రిక కాపీ పంపేరు కానీ. కొన్ని అది కూడా లేదు. అయినా అన్ని పత్రికలకి  రచనలు పంపేవాళ్లం డబ్బు ఇస్తారా లేదా అన్న ఆలోచన లేకుండా. తెలుగు స్వతంత్ర నాకెప్పుడూ ఇవ్వలేదు కానీ భమిడిపాటి రామగోపాలంగారు మాత్రం “వారితో దెబ్బలాడి పుచ్చుకున్నాను,” అన్నారు నాతో. అంటే పేరుగల రచయితలు కొంతవరకూ సాధించేరనకోవాలి.

10, 15 ఏళ్ళయిందనుకుంటా జాలపత్రికలు వచ్చి. తెలుగుసాహిత్యం అంటే అభిమానం గలవారు ప్రారంభించి నడుపుతున్నారు వాళ్ళ సాహిత్యాభిమానం కారణంగా వాటిలో సాహిత్యస్థాయిని నిలబెట్టి ఉండవచ్చు. నేనంత పరీక్షగా చూడలేదు కానీ చూసినవారిమాట నమ్ముతున్నాను.

సృజనాత్మకరచనకీ, మేధోపేతరచనకీ మధ్య కొంత తేడా ఉంది. కథ సృజనాత్మకం. వ్యాసాలు మేధోపేతం. వెయ్యి రూపాయలిస్తానంటే, వ్యాసకర్త మరింత శ్రమించి మంచివ్యాసం రాయవచ్చు. తాను తీసుకున్నఅంశానికి సంబంధించిన వివిధవాదనలు సేకరించి మంచివ్యాసమే అంటే పాఠకులకి ఉపయోగపడే వ్యాసం రాయవచ్చు. గట్టిగా ఆలోచిస్తే ఇది కూడా పరిమితమేనేమో. స్వకీయమైన అభిప్రాయాలు కూడా చేర్చి రాసిన వ్యాసం మరింత అర్థవంతమూ తద్వారా ఫలదాయకమూ కనక.

కానీ వెయ్యి రూపాయలు ఇస్తారు కదా అని కథారచయిత తనకథని మరింత ఎక్కువ “మంచి” కథగా తయారు చేయగలడా అంటే నామటుకు నాకు అనుమానమే. నాఅనుభవంలో ప్రతిఫలానికీ సృజనాత్మకతస్థాయికీ సంబంధం లేదు. నేను రాయడానికి కూర్చున్న ప్రతిసారీ మంచికథ రాయాలనే అనుకుంటాను. ఒకప్పుడు కుదురుతుంది, ఒకప్పుడు కుదరదు. పైగా, ఎంతో మంచికథ రాసేను అని నేననుకోవచ్చు కానీ మీరు ఒప్పుకోకపోవచ్చు. డబ్బు ఇస్తాం అంటే కథలు రావచ్చు. అవి “మంచి” కథలు కాగలవన్న హామీ లేదు. నిజానికి పత్రికలు ప్రతిఫలం ఇవ్వకపోవడానిక కారణం వారికి కుప్పలుతిప్పలుగా కథలు అందుతూండడమేనేమో. కథలు వస్తుంటే ఎందుకు వేరే ప్రేరేపకాలెందుకు? అవి మంచికథలు కావడంలేదు అంటే దానికి వేరే కారణాలున్నాయి. ప్రతి పత్రికకి కొన్ని ధ్యేయాలుంటాయి. వారిపరిధిలో ఉన్నవే వారు ప్రచురించుకుంటారు, అలా లేకపోతే ఎలా సవరించాలో సలహాలిస్తారు. మూసకథలు మాత్రమే కనిపించడానికి ఇది ఒక పెద్ద కారణం. అలాగే కొన్ని పత్రికలకి ఆస్థానరచయితలున్నారు. వారు ఏం రాసినా వేసుకుంటారు, మరికొందరు రాసినవి ఎంత సృజనాత్మకంగా ఉన్నా వేసుకోరు.

“డబ్బుకోసమే రాస్తున్నాం,” అన్న రచయితకి రచన ఒక ముడిసరుకు. ఎవరు చదువుతున్నారు, ఏ అంశం ఎలా రాస్తే ఎక్కువమంది చదువుతారువంటి ప్రశ్నలు వేసుకుని, తదనుగుణంగా రాస్తాడు ఆ రచయిత. వాటిలో సృజనాత్మకత ఉంటుందా అంటే ఉండొచ్చు కానీ స్వేచ్ఛగా రచనకోసమే రచన అన్నంతగా ఉండకపోవచ్చు, చదివించేగుణం, సృజనాత్మకత ఒకటి కాదు.  మంచి సృజన చదివించేది అవుతుంది కానీ చదివించేగుణం ఉన్న ప్రతి రచనా మంచి సృజనాత్మకత గల రచన అనలేం.

ప్రస్తుతం జాలపత్రికలు నడుపుతున్నవారు ఆర్థికంగా ఇబ్బంది లేనివారే. పైగా ఈ ప్రతిఫలాలు పన్నులు తగ్గించుకోడానికి ఉపయోగపడవచ్చు. ఇవన్నీ రెండోస్థాయి ఆలోచనలే. ప్రధానంగా ఇక్కడ నావాదం – డబ్బు చూపితే కథనాణ్యత, సృజనాత్మకత మెరుగు పడుతుందని నేను నమ్మను అనే.

ముఖపుస్తకంలో నాప్రశ్నకి సమాధానంగా కొందరు ప్రతిఫలం రచయితకి మరింత ప్రోత్సాహం ఇస్తుందన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చేరు. డబ్బుకోసమే రాయకపోయినా, డబ్బుందంటే మరింత ఉత్సాహం అని. ఇది ఈనాటిసమాజంలో డబ్బుకి గల ప్రాధాన్యాన్ని తెలియజేస్తోంది. నా మొదటి సందేహం – సృజనాత్మకతని పెంచుతుందా అన్నది మాత్రం అలాగే ఉంది. నేను నాపొడుగు పెంచుకోలేను, తొక్కరంగు మార్చుకోలేను. అలాగే నేను ఏమాత్రం మేధతో పుట్టేనో అది అలాగే ఉంటుంది. నాసృజనాత్మకత కూడా అంతే. నాసామర్థ్యం, మేధ మారవు నిలువెత్తు ధనం పోసినా, ఏడు పుఠాలు వేసినా అని నాఅభిప్రాయం.

రచయితలకి పాఠకులు ఇచ్చే ప్రోత్సాహంవిషయంలో వేరేవ్యాసం మొదలుపెట్టేను కానీ ఇది కూడా ప్రోత్సాహానికి సంబంధించిందే కనక ఆ ఆలోచనలు కూడా ఇక్కడే చేర్చేస్తున్నాను.  జాలపత్రికలొచ్చేక రచయితలపాఠకుల అనుబంధంలో గొప్ప మార్పులొచ్చేయి. పోతనగారు నాకావ్యం ఎవరు చదువుతారు, ఏమనుకుంటారు అనుకుంటూ రాయలేదు. పెద్దనగారికి ప్రభువులు మెచ్చి పట్టుశాలువలు సరిపోయి ఉండవచ్చు అనుకుంటాను. అచ్చుయంత్రాలు వచ్చి విరివిగా పుస్తకాలు అందుబాటులోకి రావడంతో, అంటే గత వందేళ్ళగా, సాహిత్యచరిత్ర మరొక మలుపు తిరిగింది. అచ్చుపుస్తకాలు పాఠకులకి పంచిపెట్టవలసిన అవుసరం వచ్చింది. ఆ తరవాత క్రమంగా ఎవరు చదువుతారు, వారిచేత చదివించడానికి ఏమి చేయాలివంటి సమస్యలు కూడా తలెత్తినట్టు కనిపిస్తోంది. దాంతోటే డబ్బుకీ సృజనాత్మకతకీ – తలతోపని రూపంలో- లంకె పడిపోయింది. దాంతో రచయితబాధ్యత స్వరూపం కూడా మారిపోయింది.

అచ్చు పత్రికలు మాత్రమే ఉన్నరోజుల్లో ప్రోత్సాహం అట్టే తెలిసేది కాదు. కొందరు చాలా పెద్ద రచయితలయితే తప్ప, అనేకమంది రచయితలకి పత్రికలో ప్రచురించడమే ప్రోత్సాహం. 2, 3 వారాలతరవాత ఒకటో రెండో వ్యాఖ్యలు అభిప్రాయాలపుటలో కనిపిస్తే గొప్ప. జాలపత్రికలొచ్చేక, అభిప్రాయాలు వెంటనే కనిపించడం మొదలయింది. అభిప్రాయాలు వెలిబుచ్చే పాఠకులసంఖ్య కూడా పెరిగింది. బ్లాగులు మొదలయేక సాహిత్యచరిత్రలో పాఠకులభాగస్వామ్యం పుంజుకుంది. విమర్శకులు అనిపించుకున్నవారే పాఠకులు కూడా  కూడా తమ స్పందనలను తెలియజేసే అవకాశం ఏర్పడింది. రచయితలకు పాఠకులు ఏమనుకుంటున్నారో తెలుసుకోగల అవకాశం కలిగింది. ఇది ఆనందించదగ్గవిషయం. ముఖపుస్తకం వచ్చేక వేలిముద్రల(like)ద్వారా ఇంకొంచెం ఎక్కువ తెలిస్తోంది. చాలామటుకు ఈ వేలిముద్రలు ఈకథ వచ్చిందని తెలిసిందని చెప్పడానికి మాత్రమే. అంచేత అదొక అభిప్రాయంగా లెక్కలోకి రాదు. చదివినవారు తమస్పందనలు తెలియజేస్తారు. ఇది ముదావహం. ఇంతవరకూ బాగుంది.

ఇతరఉద్యోగాలలో ఉన్నవారికి ఉద్యోగవిరమణకాలం ఉంది కానీ రచయితలకీ, కళాకారులకీ లేదేమో అనిపిస్తుంది ఒకొకమాటు. ఇలా ఎందుకంటున్నానంటే, తాము అభిమానించే రచయితరచన కనిపించకపోతే, వారిఅభిమానులు “ఎందుకు రాయడంలేదండీ? అని అడుగుతారు. “మీరు రాయాలండీ,” అని సూచిస్తారు.

నాకు గుర్తు లేదు కానీ నేనలా అడిగేనని కాళీపట్నం రామారావుగారు 5,6 ఏళ్ళక్రితం అని, పాఠకులనుండి  అలాటి సూచనలు రచయితలకు ప్రోత్సాహకరం అన్నారు. నేను రామారావుగారిని అలా అడిగేవేళకి నాకు పాతికేళ్ళలోపే. ఇప్పుడు తల్చుకుంటే  అది సాహసంగానే అనిపిస్తోంది. ఆయనతాహతేమిటి, నాతాహతేమిటి అని.

కానీ ఈ మార్పు జాలంలో వసతులమూలంగానే ఇంకొంచెం పైస్థాయికి చేరింది.  ఇప్పుడు ఏ స్థాయిలో ఉందంటే, “ఏయ్, మీరు మాకోసం రాస్తున్నారు, మేం చెప్పినట్టు, మాకు కావలిసినట్టు రాయాలి తెలుసా?” అని పాఠకులూ, పత్రికాసంపాదకులూ గదమాయించే స్థాయికి చేరింది అని కూడా అనిపిస్తోంది.

ఈ పరస్పరసంబంధాలు ఇనుమిక్కిలిగా వృద్ధి పొందడం నామటుకు నాకు కొంత విచిత్రంగానూ అప్పుడప్పుడు ఇబ్బందిగానూ ఉంది. ముఖ్యంగా ముఖపుస్తకం (ఇంకా ఇతర జాలగుంపులు) వచ్చేక, ఇల్లుకంటె గుడి పదిలం అన్నట్టు, ఇంట్లో మనుషులకంటే ముక్కూ మొహం తెలీని జాలమిత్రులధాటి నిరవధికంగా పెరిగిపోయింది. ముఖాముఖీ మాటాడుకున్నట్టే, సాహిత్యం, సంగీతంలాటి కళలను మించి స్వవిషయాలు చెప్పుకోడం ఎక్కువయిపోయింది. ఇరుగూ పొరుగనే కాదు, ఇంచుమించు ఎవరో ఒకరి నట్టింట ఉన్నట్టే.

ఆ ఊపులో పాఠకులు రచయితలను ఆత్మీయులుగా ఎంచి, రచయితలజీవితాల్లోకి చొచ్చుకుపోవడం జరుగుతోంది అన్నాను కదా. రచయితలు రాయడం ఎందుకు మానేస్తారో, కనీసం ఎందుకు ఆపుతారో ఆలోచించరు. తమకి వారి రచనలు కావాలనే కానీ, రచయితలకోణంనుండి ఆలోచించరు. ఇక్కడ అది చెప్తాను. రచయిత ఎప్పుడు ఈ జీతం బత్తెంలేని ఉద్యోగంనుండి విరమించడం జరుగుతుంది అని తరిచి చూసుకుంటే మూడో నాలుగో కారణాలు కనిపిస్తున్నాయి.

రాసి రాసి వేసారిపోయినప్పుడు. లోకంలో సమస్త వస్తువులకు పరిమితులు ఉన్నాయి. మేధకి కూడా అంతే. రెండు, మూడు తరాలపాటు రాసుకుంటూ పోయేవారికి తెలుస్తాయి ఈ పరిమితులరీతులు. దేశదేశాలు తిరిగే రచయితలకీ, సామాజికవ్యవహారాలలో మునిగితేలే రచయితలకీ వస్తువుకి కొదువ ఉండదు. వారికి అనుదినమూ రాయడానికి ఏదో ఒక వస్తువు దొరుకుతుంది. అందుకు భిన్నంగా నాలుగ్గోడలమధ్యా కూపస్థమండూకాల్లా  ఉండే రచయితలకి అట్టే వస్తువులు దొరకవు రాయడానికి. ఏదో ఓసమయంలో చెప్పిందే చెప్తున్నాను పాడిందే పాడరా అన్నట్టుంది అని గ్రహించడం కూడా జరుగుతుంది. ఈరాత కొనసాగించడం క్షేమం కాదన్న జ్ఞానం కలుగుతుంది. అదే రిటైర్మెంటు స్వచ్ఛందరిటైర్మెంటు అన్నమాట. “చాలమ్మా, చదవలేకున్నాం నీరాతలు” అని పాఠకులచేత చెప్పించుకోకముందే తప్పుకోడం అది. మీకు తెలుసుకదా చిన్నకథకి ఒక ముఖ్యమైన ప్రమాణం – “ఇంకా ఉంటే బాగుండు అనిపిస్తుండగానే ముగిసిపోవాలి కానీ ఎప్పుడయిపోతుందా అని అనిపించకూడదు”. రచయితకి రచనాకాలమూ అంతే.

టీవీలోనూ, ముఖపుస్తకంలోనూ కనిపించే సంగతులు కొంత పనికొస్తాయి కథలు రాసుకోడానికి. సాధారణంగా వీటిమీద ఈ రచయితలకి (మళ్ళీ అస్మదాదులే) ఈవిషయంలో అభిప్రాయబేధాలుంటాయి. రెండు, మూడు తరాలవెనకటి భావజాలంతాలూకు ఛాయలు, ఇంగువకట్టినగుడ్డలా, గతపువాసనలు వేస్తూంటాయి. వాటిని ఆదరించే పాఠకులు ఉన్నారు. వీరున్నంతకాలం ఈ రచయితలు ఏదో ఒకటి రాస్తూండవచ్చు.

అయితే రచయిత పడే ఈ అవస్థ పాఠకులకి తెలీదు. అంచేత వారికి ఇది కొంత అయోమయం కలిగిస్తుందేమో. తమకి నచ్చినవారికథలకోసం చూడడం సర్వసాధారణం. వాళ్ళరచనలు కనిపించకపోతే కొరతగా అనిపిస్తుంది. పైన చెప్పినట్టు మృదువుగా మీరు “ఈమధ్య మీరేమీ రాస్తున్నట్టు లేదే” అని అడిగే స్థాయి దాటి, ఇంట్లో మనిషిలా రచయితల వ్యక్తిగతజీవితాల్లోకి చొచ్చుకొచ్చేసి, సలహాలు చెప్పడం కూడా జరుగుతోంది. ఇది ఆనందదాయకం కాదు. నారచనల్లో కాన్సర్ ప్రసక్తిలేకపోయినా తమకి తామే ఊహించుకొనేసి, కాన్సర్ బాధితులు ఎంత ఆనందంగా జీవించవచ్చో నాకు చిన్నక్లాసు పెట్టేరు ఒకాయన, అలాగే ఈమధ్య మరొకరు నాకు “morbid ఆలోచనలు” కూడదంటూ పాఠం చెప్పేరు. ఇది కూడా కాన్సరులాగే తమకి తాము ఊహించుకున్నదే కానీ నారచనల్లో ఎక్కడా morbidఆలోచనలు లేవు. నాపోస్టులు చదివినవారికి, నిజంగా చదివినవారికి, ఈ సంగతి తెలుసే ఉంటుంది.

ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, పాఠకులు అలా రచయితలని psychoanalyze చెయ్యడం, లేని రుగ్మతలు అంటగట్టడం తగదు. ఇది సాహిత్యరంగంలోనే వచ్చినమార్పో ఇతరరంగాల్లో కూడా ఉందో నాకు తెలీదు కానీ నామటుకు నేను మాత్రం ఈమార్పుని హర్షించను.

అలాగే పాఠకుల అభిప్రాయాలలో నిరుత్సాహన్ని కలిగించే మరో కోణం వారు ప్రస్తావించే విషయాలు. బ్లాగు మొదలు పెట్టినకొత్తలో పాఠకులు మంచి అభిప్రాయాలు వెలిబుచ్చేవారు. మూడు, నాలుగేళ్ళక్రితం, ముఖ్యం 2011, 12 లలో టపాలదగ్గర వ్యాఖ్యలు చూస్తే ఎంత అర్థవంతంగా ఉండేవో మీకే తెలుస్తుంది.  ఇప్పుడు ఒకటో రెండు వ్యాఖ్యలు, అవి కూడా టపాలో నా అభిప్రాయాలని నేరుగా చర్చించేవి కావు. అవి కూడా ప్రోత్సాహకరం కావు.

ఇకమీదట నాకు రాయాలనిపించే విషయాలు దొరికితే రాస్తాను. మీరు కూడా ప్రోత్సహించదలుచుకుంటే టపాలలో ప్రస్తావించే అంశంమీద వ్యాఖ్యానించమని కోరుతున్నాను.

000

(ఏప్రిల్ 19, 2017)

 

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

16 thoughts on “ప్రతిఫలం ఇస్తే “మంచి”కథలు వస్తాయా?”

 1. పోతనకాలంనాటి జీవనసరళే వేరు అసలు. ఈనాటి జీవితంలో సామాజికపరిస్థితులలో ధనానికున్న ప్రాధాన్యతని కూడా మనం గుర్తించాలి నచ్చినా నచ్చకపోయినా. “విల్లు రాసి చూడు” కథలో ఈ వ్యత్యాసం మీరు గమనించేవుంటారు. పూర్వం మరణం ఇంత క్లష్టతరం కాలేదు. కాళీపట్నం రామారావుగారు ఆం.ప్ర. సా.ఎ. పురస్కారాన్ని తిరస్కరించేరు. రావిశాస్త్రిగారు తీసుకున్నారు. కారణాలమాట వదిలేస్తే, రెండు సందర్భాలలోనూ వారి సృజనాత్మకతమీద ఆ ధనంప్రభావమేమీ లేదు. అదీ నా వాదన.
  మీరన్నట్టు అదేపనిగా ప్రచారాలు, డబ్బు లంచం (ఏమనాలో నాకు తెలీడంలేదు) వంటి సాధనాలకీ సృజనాత్మకతకీ అనులోమ, విలోమ సంబంధాలు లేవనే నేను అనుకుంటున్నాను.

  మెచ్చుకోండి

 2. చాలా వివరంగా వ్రాశారు. బాగుంది. ఈ వ్యాసంలోని అన్ని విషయాలపై మీ ఆలోచనలు నాకూ నచ్చాయి.
  ఇంకొక్కమాట – మీరు సరిగ్గా చెప్పారు పోతనగారు తన కావ్యం ఎవరు చదువుతారు, ఇంకెంతమందితో ఎలా చదివించాలి అని ఆలోచించి ఉండరు.
  నావీ రెండు మాటలు.
  ఇప్పటి వాళ్ళు పోతనలో డబ్బు ఆశించకపోవడం, తన వృత్తి ప్రవృత్తి విడిగా పెట్టుకోవడం మాత్రం చూస్తే ఎలా?
  ఆశించకపోవడం వేరు, డబ్బు కోసం వ్రాయను అని ఖచ్చితంగా నియమం పెట్టుకోవడం వేరు. వ్రాశాక ఏ పత్రికైనా సంతోషించి ఇస్తామంటే కాదనగలిగినప్పుడు పోతన ప్రసక్తి తేవాలి. వెయ్యి రూపాయలు కాదు లక్ష,కోటి ఇస్తామన్నా కూడా కాదనగలిగినప్పుడు.
  అంతే కాదు, కుటుంబం, మిత్రబృందం మొదలైన వాటి ద్వారా ప్రచారాన్ని కూడా కోరనప్పుడు.

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 3. నాది కేవలం ఊహే. మీరు చెప్పిందే నిజం. ఒప్పుకుంటా. మంచి అయినా కాకపోయినా కతలుంటూ వస్తాయి కనక అప్పుడు ప్రతిఫలం ఇవ్వండి అని రచయితలు గట్టిగానే అడగొచ్చు కూడా.

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 4. నిజానికి పత్రికలు ప్రతిఫలం ఇవ్వకపోవడానిక కారణం వారికి కుప్పలుతిప్పలుగా కథలు అందుతూండడమేనేమో. మొన్నటి వరకు ఆ పరిస్థితి…ఇప్పుడు లేదు. త్వరలో మాకు కధలు కావాలి రాయండి అనే ప్రకటనలు కూడ వెలువడొచ్హు

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 5. సృజనాత్మకత అన్నది జుట్టు ఉన్న అమ్మ ఏ కొప్పు పెట్టినా అందమే అన్న సామెత లాంటిది…పారితోషకంతో సంబంధం లేదు . మీరు అన్నట్టు.

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 6. మీ అభిప్రాయాలకు ధన్యవాదాలండి. లేదు, కారా మాష్టారు తప్పుగా తీసుకోలేదు. తమకి అది ప్రోత్సాహకరమే అయిందని చెప్పేరు. ఈవిషయం నావ్యాసంలో ఇప్పుడే దిద్దుతాను. నాకు ఇలాటి వాక్యాలే ఎక్కువ ఆనందం, ఉపయోగకరం.

  మెచ్చుకోండి

 7. రచయితల గురించి చాలా వివరంగా, చాల కోణాలని విశ్లేషిస్తూ వ్రాసారు. వ్రాయటం వృత్తిగా చేసుకున్న, చేసుకోవలసి వచ్చిన వాళ్లకి డబ్బు ప్రతిఫలంగా తప్పనిసరి. అయితే ఆ తరహా రచయితల రచనల్లో సృజనాత్మకత అన్నివేళలా ఉంటుందా అన్న మీ ప్రశ్న సహేతుకమే. కారా మాస్టారుగారికి మీ అభ్యర్ధన తప్పుగా అనిపించిందని నేననుకోను. మిగిలిన వ్యాసంలో మీరన్నట్టు పాఠకులు మీ వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూస్తేనే ఇబ్బందులు మొదలవుతాయి. మొత్తం మీద మీరు చెప్పదలచుకున్నది స్పష్టంగా, సూటిగా చెప్పారు.

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 8. మీకు నచ్చిన అంశాలను గురించే వ్రాయండి ,కాని మానెయ్య వద్దు .అంటే మీకు సౌకర్యంగా అనిపించినంత వరకు అని !ఇదేమీ తప్పనిసరి సబ్జెక్ట్ లా కాదు కదా .కొన్ని రచనలు (salable) అమ్ముడు పోయేవి మరికొన్ని (stable)నిలిచిపోయేవి అనికదా వాడుక .మీరు ఇస్తున్న పాత సాహిత్య పరిమళాలను ఆస్వాదించగలిగే అదృష్టం మాకు మరిన్ని రోజులు కలగాలని ,మీకు అదే ప్రేరణ కావాలనీ కోరుతూ …………..డా.సుమన్ లత

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.