యోగవాసిష్ఠము పరిచయం నామమాత్రంగా

నామమాత్రంగా అని ఎందుకంటున్నానంటే నేనింకా చదవడం పూర్తి చేయలేదు. ఇప్పుడప్పుడే పూర్తి చేసే ఆశల్లేవు కూడా. ఇది పెద్ద పుస్తకం. 3 వేల పేజీలు, అంటే నాప్రాణానికి 3 లక్షలపేజీలకింద లెఖ్ఖ. ముందుకీ వెనక్కీ వెళ్తూ, సంస్కృతశ్లోకాలను పదచ్ఛేదం చేసి చూసుకుంటూ, తీరిగ్గా చదువుతాను కనక ఇది దీర్ఘకాలిక ప్రణాళిక, చాలా చాలా దీర్ఘం ఆ కాలం. ప్రస్తుతానికి నాకు తోచిన మాటలు రాసిచూసుకుందాం అన్నఊహతో ప్రారంభిస్తున్నాను. ఇలాటి పుస్తకం ఒకటి ఉందని చెప్తే, ఆసక్తి గలవారు చూస్తేరేమో అని మరో ఆలోచన.

ఆరు ప్రకరణాలలో సత్త, భ్రాంతి, మోక్షము వంటి గహ్వరమైన తత్త్వవిచారణ ఈనాటి సరళ వ్యావహారికంలో వివరించేరు. నేను చదువుతున్న కాపీ గ్రంథకర్త సైటులో చూడవచ్చు. రామకృష్ణామఠం వారి ప్రచురణ ప్రామాణికమైన గ్రంథం అనే చెప్పుకోవాలి.

http://www.yhramakrishna.com/simple.html.

చిన్న హెచ్చరిక. ఆసైటులో ఉన్న పుస్తకాలన్నిటికి ఈ లంకెని నా ఆమోదముద్రగా భావించరాదు. నేను చూసిన వసిష్ఠ రామసంవాదం కొరకు మాత్రమే ఈలంకె ఇస్తున్నాను. మిగతావి మీఇష్టం.

ఈ యోగవాసిష్ఠం లేక “వసిష్ఠరామసంవాదం”లో కర్మ, జ్ఞానం పరస్పరవిరుద్దం కాదనీ, రెంటినీ ఆచరిస్తూ మోక్షం సాధించవచ్చన్న ప్రతిపాదనతో ఆదునికులను కూడా ఆకట్టుకునేవిధంగా ఆవిష్కరించడం జరిగింది. ఇంకొంచెం వివరంగా చెప్పాలంటే, కర్మసాదనకి జ్ఞానమార్గం తోడవుతుంది. మూలవిషయం అర్థం చేసుకోకుండా ఏ కార్యమూ సాధించలేము అన్నది లోకవిదితమే కదా. ఇటువంటివే నాకు ఆసక్తికరంగా ఉంటాయి.  ఇది ఎవరికి పఠనయోగ్యం అంటే “తాను సంసారబంధంలో చిక్కుకున్నట్టు గ్రహించి, వీటినిండి ముక్తి పొందగల మార్గం అన్వేషించాలన్న మానసికస్థితి” చేరుకున్నవారికి అంటారు. పతంజలి యోగసూత్రాలుగ్రంథం “అథ” అని ప్రారంభమవుతుంది. అక్కడ ఆ పదానికి ఇలాటి అర్థమే చెప్పేరు విజ్ఞులు.

రామునికి 16 వత్సరాల వయసు. విశ్వామిత్రుడు రాముని యజ్ఞసంరక్షణకి పంపమని కోరినసందర్భంలో ప్రాపంచికవిషయాలగురించి తనవేదన వెలిబుచ్చుతాడు. మొదటి ప్రకరణంలో ఈ ప్రకరణం దాదాపు 60 పుటలుంది. ఇందులో రాముడు వెలిబుచ్చిన సంశయాలు, సదసద్వివేచనా చాలా విపులంగా ఉన్నాయి. ఇలాటి సందేహాలు చాలామందికి ఏదో ఒక సందర్భంలో కలగవచ్చు. ఉదాహరణకి ఈ శ్లోకం చెప్పుకోవచ్చు.

తరవో2పి హి జీవన్తి, జీవన్తి మృగపక్షిణః

స జీవతి మనో యస్య మననేన నజీవతి (XIV-II)

వృక్షాలు, మృగాలూ, పక్షులూ కూడా జీవిస్తున్నాయి. కానీ ఏం లాభం? ఎవనికైతే ఈ దృశ్యసంకల్పముయొక్క మననము క్షీణిస్తుందో అట్టి మనసు కలవాడే వాస్తవమైన జీవితమును అనుభవిస్తున్నాడని నాఅభిప్రాయము. ఈ జీవితముపట్ల ఈ కనబడే దృశ్యవ్యవహారముపట్ల సరైన అవగాహన కలిగి ఉండాలి అంటాడు రాముడు. అలాగే రాముడికి జీవితపరమార్థంగురించిన అవగాహన –

పరోపకార కారిణ్యా, పరార్తి పరితప్తయా

బుద్ద ఏవ సుఖీమన్యే, స్వాత్మ శీతలయాధియా (XXVI-39)

ఎవరైతే పరోపకారపారాయణులై ఉంటారో ఇతరులకష్టములు తమవంటివేనని అనుకుని పరితపించుతారో, బుద్ధిబలంచేత తత్త్వజ్ఞానమును సంపాదించి స్వాత్మయందే రమిస్తూ ఉంటారో … అట్టి మహనీయులే ధన్యులు. వారే ఈ మాయాజగత్తునందు ఉత్తమమైన సుఖమును పొందుచున్నారని నాకు అనిపిస్తోంది అంటాడు రాముడు.

మానవజీవతంపట్ల ఎంతో గహనమైన అవగాహన కలిగిన రాముడు లౌకికవ్యవహారాలపట్ల విముఖత చూపడం గమనించి, విశ్వామిత్రుడు వశిష్టుని కోరుతాడు రామునికి జ్ఞానబోధ చేయమని. ఆ బోద కలిగిన తరవాత రాముడు, “ప్రకృతిసిద్ధమగు రాజ్యపాలన మొదలైన లౌకికవ్యవహారములకు, మోక్షస్థితికి, … ఒకదానితో మరొకదానికి … విరోధమేమీవాస్తవానికి లేదు. ఆత్మవిచారణచే ఉత్తమ యోగస్థితి పొంది, ఆ పై ఎప్పటిలాగానే వ్యవహరింవచ్చు”నని చెప్తాడు.

వశిష్టుడు చక్కగా సక్రమపద్ధతిలో రామునిసందేహాలకు తగిన సమాదానాలుగా జననమరణాలు, జీవుడు, విముక్తివంటి అనేక విషయాలు విశదంగా బోధించడమే ఈ గ్రంథం. నేనింకా పుస్తకంలో పదోవంతైనా చదవలేదు కనక ఇంతకంటే ఎక్కువ చెప్పలేను.

వస్తువుఅమరిక విషయంలో గ్రంథకర్త తీసుకున్న నిర్ణయాలు రెండు. మొదటిది  భాష – 1950లో ప్రచారంలోనికొచ్చిన వ్యావహారిక భాష ఎంచుకున్నారు. ఆ క్రమంలోనే అక్కడక్కడ ఇతరమతాలలోనుండి సామ్యాలు స్పృశించేరు. కొన్ని పదాలకి ఇంగ్లీషులో సమానార్థకాలు కూడా ఇచ్చారు.

రెండోది వసిష్ఠుని సమాధానాలు సుదీర్ఘం అయినచోట, వాటిని నేర్పుగా విరిచి, రామునిపరంగా ప్రశ్నలు చొప్పించడం. ఇందుమూలంగా మనకి విషయం అర్థం చేసుకోడం తేలికవుతుంది. రామునిప్రశ్నలు నేను అడిగినట్టే అనిపించింది నాకు. ఈవిధంగా పాఠకుడికి చర్చలో పాల్గొంటున్న భావన కలుగుతుంది.

అట్టే పెద్ద దోషం కాదు కానీ కొన్నిచోట్ల “… అని వసిష్ఠులు చెప్పుచున్నారు” వంటి వాక్యాలు కనిపించాయి. అలాటి సందర్భాలలో ఇది రచయిత అవగాహనేమో, మూలగ్రంథం యథాతథంగా అనువదించలేదేమో అనిపిస్తుంది. ఇది చిన్న సందేహం, నిజం కాకపోవచ్చు.

వసిష్ఠుడు తనవాదనలని సమర్థిస్తూ దృష్టాంతాలను చిన్న కథలరూపంలో ఇవ్వడం బాగుంది. ఇక్కడ నాకు నచ్చినభాగం, దృష్టాంతాలపేరుతో మితిమీరి సాగదీయకపోవడం. వస్తువు అతి సూక్ష్మమైనది అయినందున అక్కడక్కడ పునశ్చరణ అయినట్టు తోచినా, విషయం అవగాహన క్లిష్టతరమైనది కనక నామటుకు నాకు బాగుందనే అనిపించింది.

ఇంతవరకూ చదివినభాగంలో నాకు చాలా బాగుందన్న ఉపాఖ్యానం – శుకుడు జ్ఞానసముపార్జనకోసం జనకునిదగ్గరికి వెళ్ళడం, జనకుడు శుకుని మూడువారాలపాటు పరీక్షించి, తరవాత బోధ చేయడం. ఈవ్యవహారం నిత్యజీవితంలో సర్వసామాన్యం. సర్వే సర్వత్రా ఇలా జరిగే అవకాశం ఉంది. రెండోకథ లీలోపాఖ్యానం. ఈకథలో లీల సరస్వతీదేవిని భర్త పద్ముడు మరణించనతరవాత తనతోనే ఉండేలా వరమిమ్మని కోరడం. ఈకథలో సరస్వతీదేవి లీలకి వరమిచ్చినప్పుడు నాకు కలిగిన సందేహం, ఆ తరవాత చిదాకాశంగురించిన చర్చతో కొంత విశదమయింది. లీలా, విధ్వుడు పూర్వజన్మలో బ్రాహ్మణదంపతులనీ ఆవిధంగా వారు ఎప్పుడూ విడిపోలేదనీ చెప్తుంది. పుస్తకం పూర్తిగా చదివేక నాసందేహాలకి సమాధానాలు దొరుకుతాయనుకుంటాను.

000

(మే 1, 2017)

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

5 thoughts on “యోగవాసిష్ఠము పరిచయం నామమాత్రంగా”

  1. ఈవిషయంలో మీకు ఆవగాహన ఉంది కనక కేవలం మూలగ్రంథంలోని శ్లోకాలు మాత్రమే ప్రస్తావించినపుస్తకం, పతంజలి యోగసూత్రాలలాగ, బాగుంటుందేమో ఈ గ్రంథం కొంత చదివేక, రచయితవివరణ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తోంది. కేవలం శ్లోకాలకి అర్థాలు మాత్రం ఇచ్చిన ఇంగ్లీషు పుస్తకాలు చూస్తే 100-150 పేజీలే ఉన్నాయి. మూలం చూస్తే కానీ తెలీదు.

    మెచ్చుకోండి

  2. “ముందుకీ వెనక్కీ వెళ్తూ, సంస్కృతశ్లోకాలను పదచ్ఛేదం చేసి చూసుకుంటూ, తీరిగ్గా చదువుతాను కనక ఇది దీర్ఘకాలిక ప్రణాళిక, చాలా చాలా దీర్ఘం ఆ కాలం. ” — మీరు చదివినవన్నీ ఎలా గుర్తుంచుకొంటారో తెలియచేసే మీ రహస్యం ఒకటి పంచుకున్నందుకు కృతజ్ఞతలు. చాలమంది పెద్దలు చదవమని చెప్పిన పుస్తకమిది. ఇటువంటివి కథ చదివినట్టు చదవాలన్నా నాలాంటి వాళ్ళకి కనీసం ఒక ఏడాది పైమాటే పడుతుంది. మంచి రివ్యూ.

    మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

  3. చాలా బాగుందండి మీరు రాసిన వివరాలన్నీ. రాముడు కూడా ఇంచుమించు గౌతముడి మనఃస్థితిలోనే ఉండి ఉంటాడు. అదృష్టవశాత్తు రామునికి సంశయనివృత్తికి వశిష్టుని వంటి మేధావి ఉన్నాడు. గౌతముడు తానే వెతుక్కోవలసి వచ్చింది.

    మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.