మరిన్ని కబుర్లు రామక్కా అంటే తామరాకా అని!‌

జాలగుంపులవచోవిలాసం అని కూడా అనొచ్చు. నాలుగురోజులక్రితం “రామక్కా అంటే తామరాకా అన్న సామెత” మీద నాకతని ముఖపుస్తకంలో పెట్టేక, అదేవిషయంమీద మరో చుట్టు కొనసాగిద్దాం అన్న సరదా కలిగింది కొత్తగా వచ్చిన జ్ఞానంతో. అదే ఈపోస్టు.

జాలగుంపులు అన్నాను కానీ నాతో ఎవరు మాటాడినా సంభాషణలు ఇలాగే ఉంటున్నాయి మరి నాముఖవిశేషమో, నాజాతకమే అంతేనో తెలీదు. లేదా నేను మారిపోయిఉండాలి. అదీ కాకపోతే లోకం మారిపోయి ఉండాలి ఈరోజు పొద్దున్నే నేను మేలుకొనేసరికి. మరో ఆలోచన – చదువుకున్నవారు, చదువుతున్నవారూ అధికతరం అయిపోయేక విధులు మారిపోయేయోమో కూడా. తమకి తెలిసిందేదో చెప్పేయాలని ఉంటుందో, ఏదో ఒకటి “చెప్పడమే” ప్రధానం అనుకుంటారో గట్టిగా చెప్పలేను. “నీమొహం నీకేం తెలుసు. నేం చెప్తా వినుకో,” అన్న అభిప్రాయం అంతరాంతరాలలో ఏమూలో కెలుకుతూ ఉండవచ్చు కూడా.

నేను బ్లాగుతో మొదలుపెట్టి దరిమిలా ముఖపుస్తకంలో ప్రవేశించడానికీ కారణాలు రెండు – మరో వ్యాపకం లేకపోవడం ఒకటీ, రెండోది నాకు తోచిన “అపరిపక్వ” ఆలోచనలు కీబోర్డుపాలు చేయడం. రోజూవారీజీవితంలోలాగే రచనలో కూడా ఎవరి వెర్రి వారికానందం. నావెర్రి రచనలో ప్రధానంగా వస్తువుమీద దృష్టి కేంద్రీకరించడం. నేనేదైనా మాటాడితే ఆవిషయంమీదే అభిప్రాయాలకోసం చూస్తాను. అదేం ఖర్మో కానీ పాఠకులలో చాలామందికి ఇలాటి ఆలోచన ఉన్నట్టు కనిపించదు. అందరూ కాదు. ప్రస్తుతానికి ఇద్దరు, ముగ్గురు ఉన్నారు నాపరిధిలో. వారిని మినహాయిస్తే, నాటపాలమీద వ్యాఖ్యలు ఎలా సాగుతాయో చూడండి మచ్చుకి …

నేను వంకాయకూరమీద ఓ టపా పెడతాను.

దానిమీద వ్యాఖ్య

– “నేను దోసావకాయ చేసేను.” ఇది కొంతవరకూ నయమే. ఎందుకంటే ఇంకా వంటకాలమీదే ఉంది కనక.

మరోవ్యాఖ్య – “బొమ్మలో వంకాయ వంకాయలా లేదు.” సరే ఇది కూడా వస్తువుగురించే అనుకుందాం.

ఆ తరవాత –

“మొన్న బెజవాడలో కొంపలంటుకున్నాయిట.”

“మా చిన్నవదినది బెజవాడే. అక్కడికి మంగళగిరి ఎంతో దూరం లేదు.”

“తెల్లారే అనకాపల్లిలో బస్సెక్కితే మజ్జానానికి అన్నవరంలో దిగిపోతాం.”

“అన్నంలో కందిపొడి కలుపుకు తింటే ఆ రుచి అడక్కు మరి.”

“Rich Little సినిమా చూసేనివాళ.”

“మళయాళం రాదు నాదు.”

“మార్క్ ట్వేన్ది గొప్ప హాస్యం.”

“కార్ల్ మార్క్స్ సిద్ధాంతం ఒక్కటే మానవాళిని ఉద్దించేది.”

“ఎన్ని మార్కులొస్తే ఏముందిలే. ఇప్పుడంతా పలుకుబడి”.

“తెలుగుబడిలో కూడా తెంగ్లీషే నేర్పుతున్నారు తెలుసా.”

000

ఇలా ఏదో ఒక మాట పుచ్చుకు, నేలమీద ఒలికిన పాలు నల్దిక్కులా పారినట్టు చిందరవందరగా తలోవేపుకీ లాక్కుపొతారు అసలు విషయం వదిలేసి. మూలవిషయం గంగలో మునిగి గోదావరిలో తేల్తుంది.

ఇక్కడ ఒకమాట చెప్పకతప్పదు. ఆ మాటాడుకుంటున్న ఇద్దరిలో ఏ ఒక్కరికీ, ఆ సామెతలో చెప్పినట్టు, “వినిపించకపోవడం” లేదు. “వినిపించుకోకపోవడం” మాత్రమే అది.

ఒక్క నాటపాకే కాదు ఏ టపాదగ్గర చూసినా సగానికి సగం ఇలాగే ఉంటున్నాయి.

నాకిది కొత్తే. నాకాలంలో, అంటే సుమారుగా 30ఏళ్ళక్రితంమాట, వ్యాఖ్యలు ప్రస్తావించిన విషయంమీదే ఉండేవి కానీ ఇలా ఒక పదం పుచ్చుకుని ఊరంతా తిరగడం లేదు. కానీ ఈ నూత్నపద్ధతి ఎవర్నీ బాధిస్తున్నట్టు లేదు నన్ను తప్ప. ఇది సర్వసాధారణం అయిపోయింది.

వ్యాఖ్యలతరవాత చెప్పుకోవలసింది నాతో సంభాషణలు – ఫోనులో కానీ మాఇంటికొచ్చి ముఖాముఖీ కానీ.

నా రాతలరాత కూడా పైవ్యాఖ్యలలాగే ఉందని చెప్పడానికి రవంత సిగ్గుగానే ఉంది. ఇది ఒక్క నాఅనుభవం మాత్రమే అన్న నమ్మకం కూడా ఉంది నాకు. ఉదాహరణకి నాకు ఏమాత్రం పరిచయం లేనివారు, కేవలం నాబ్లాగు చూసో  మరెక్కడో నాకథలు చదివో నన్ను వారికి తెలుసు అన్న అభిప్రాయానికి వచ్చేస్తారనుకోండి. ఆ తరవాత నన్ను కలుసుకోడానికో ఇంటర్వ్యూ చేయడానికో వస్తాం అంటారు. నేను చాలా అమాయకంగా, వారు నారాతలగురించి మాటాడతారు అనుకుంటాను.

ఆ సంత ఇలా ఉంటుంది.

“మీకథలు చదివేనండి.”

“ఆహా, అలాగా.”

“మీపేరు పరిచయమే. మీకు రావలసిన గుర్తింపు రాలేదండి.”

“చాలామంది చెప్పేరండి ఆమాట నాతో.” (నాతో మాత్రమే)

అంతే. ఆతరవాత టాపిక్కు పక్కకి మళ్లిపోతుంది.

“ఫలానావాడికి మరో ఫలానావాడిమీద కోపం ఎందుకో తెలుసా?”

“నాకు అలాటివిషయాలు మాటాడ్డం ఇష్టం లేదండి.”

“అది కాదు. అసలేమయిందంటే,”

“నాకు చెప్పకండి అంటున్నాను కదా,” అంటున్నాను కానీ మానవుడికి పట్టలేనంత ఉత్సాహం ఆసంగతి చెప్పేయాలని. అంచేత నాగోల వినకుండా తాను చెప్పదలుచుకున్నది చెప్పేదాకా వదలడు.

విషయం మార్చడానికి నేను అడుగుతాను, “మీకు ఏకథలు నచ్చేయి?”

“అలా అడిగితే ఏం చెప్తాను?” అని చిన్నబుచ్చుకుని, “మీకు మాత్రం అన్నీ గుర్తుంటాయేమిటి?” అంటూ నన్ను సవాలు చేస్తాడు.

నిజమే. గుర్తుండవు. కానీ నేను రచయితలని కలుసుకోడానికి వెళ్లినప్పుడు  ఆరచయితవి కొన్నైనా మరోమారు చూసుకుని, మాటాడ్డానికి వెళ్ళేను. ఎప్పుడూ ఎవరిదగ్గరా వారిసొంత వివరాలు అడగలేదు, నాసొంతవిషయాలు చెప్పలేదు, అలాగే మరొకరిగురించి మాటాడలేదు. అందుచేతన్నమాట ఈయనగారి వరస నాకు ఆశ్చర్యం.

నాకు ఏం మాటాడాలో తోచదు. ఇంతలో ఆయనగారు కాస్త మేలుకుని, “మీరు ఊసుపోక అని రాసేరు. అవి బాగున్నాయి,” అంటాడు.

నాకు ప్రాణం లేచొస్తుంది. అది ఒక్క లిప్తపాటు మాత్రమే. ఎందుకంటే మరుక్షణంలో “తరవాత మీరు ఎన్నెమ్మకతలు అని రాస్తేరు. అవి బాగులేవు,” అంటాడు. నాప్రాణం ఉసూరుమంటుంది. బాగులేవు అన్నందుకు కాదు. ఆ రెండూ ఒకటే. ఎన్నెమ్మకతలు ఉపశీర్షిక అని ఆయనకి తెలీలేదు అని నాకు తెలిసినందుకు!!

ఆ తరవాత ఆయనవ్యాపకాలూ, తన అపారమేధాసంపత్తి, ఇష్టమైన సినిమాలూ, పెళ్ళాం, పిల్లలూ, వాళ్ళవ్యాపకాలూ మున్నగునవి  మరోవిడత కచేరి పెట్టి శలవు పుచ్చుకుంటాడు. మళ్ళీ మనం కలవాలండీ అని కూడా అంటాడు.  నేను పైకి ఏం అన్నా, మనసులో ఏమనుకుని ఉంటానో మీరు గ్రహించేఉంటారు.

మామూలుగా కాకపోతే కదాచితుగా ప్రముఖ రచయిత్రులనీ రచయితలనీ కలుసుకుని జరుపుకున్న విజ్ఞానదాయకమైన, వినోదాత్మకమైన, సంతృప్తికరమైన, ఆనందదాయకమైన సంభాషణలు, రంగులబొమ్మలూ ఫేస్బుక్కులోనూ జాలపత్రికలలోనూ చూస్తున్నాను కదా. ఒఖ్ఖ నన్ను చూస్తేనే తమప్రతిభో గోడో తప్ప మాటాడ్డానికి మరేం ఉండిఉన్నట్టు లేదు అని నాకు చిరాకు.

మరోవిషయం – నారాతలుగురించి మాటాడ్డానికేం లేదు అంటే ఒప్పుకోడానికి నాకేమీ అభ్యంతరం లేదు. కానీ నేను psychotherapistని కూడా కాను అని వారు గ్రహించాలి. నారచనల్లో ఆసక్తి లేకపోతే ఫరవాలేదు. కానీ ఆ వంక పెట్టుకుని నన్ను కలుసుకోవాలంటూ ఫోను చేయడం కానీ మాయింటికి రావడం కానీ మోసమే నాదృష్టిలో. అది రామక్కా అంటే తామరాకా అనే దోరణికేమాత్రమూ తీసిపోదు.

000

ఇప్పుడు ప్రమాణపూర్తిగా ఉన్నమాట చెప్తాను. దీనినే ఉపసంహారము లేక స్వీకృతి అనుకోవచ్చు. – నేను కూడా ఇలాటివ్యాఖ్యానాలు చేస్తున్నాను. ఆర్నెల్లు సావాసం చేస్తే వారు వీరవుతారని కదా అంటారు. వాటికి స్ఫూర్తి అనేకం – అవతలివారి ఉత్సాహం అంటువ్యాధయి, నాక్కూడా హుషారొచ్చేయడం, నాలో హాస్యరసం ఎగజిమ్మడం, అప్పుడప్పుడు మొహమాటం, కొంత మర్యాద, ఇలా అనేకకారణాలవల్ల వారిధోరణిలోనే కొనసాగిస్తాను. కానీ అట్టే సాగదీయను. అనే అనుకుంటున్నాను, కనీసం నేను. ఆతరవాత ఒక మంచిరోజు లేక వ్యాఖ్యధారలో ఒక మంచి క్షణం చూసి చుక్క పెట్టేస్తాను ఆధోరణికి.

000

(జూన్ 10, 2017)

 

 

 

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

4 thoughts on “మరిన్ని కబుర్లు రామక్కా అంటే తామరాకా అని!‌”

  1. ఊసుపోక రాసినా చాలా ముఖ్యమయిన విషయం ప్రస్థావించారండి. మీ టపాల్లో నాకు తెలియదు కానీ కొంతమంది సంబంధం లేని విషయాలు, ఎక్కడినుండో కాపీ పేస్ట్ చేసిన విషయాలు, వారి వ్యాపారప్రకటనలు లేదా అసందర్భ శుభోదయ, శుభరాత్రులు. అంత శ్రమ తీసుకుని టపాలోకి వచ్చినందుకు టపా చదివి దానిగురించి ఆ రాసే రెండు ముక్కలూ రాయచ్చు కదా. అబ్బే! ఇంటర్వ్యూల గురించి మీరు చెప్పినవి బావున్నాయి. విషయజ్ఞానం లేకుండా చేసే పనులవి. బావుందండి ” రామక్కా అంటే తామరాకా”!!

    మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.