వంటింటి సంబరాలు – 3 అరిసెలు, సొజ్జప్పాలు

(మనలో మనమాట 35)

అరిసెలు, సొజ్జప్పాలూ సులభసాధ్యమైన వంటకాలు.

మొదట అందరూ ఎంతో ఇష్టపడే, ఎంతో కష్టం అని చెప్పుకునే అరిసెలగురించి  చెప్పుకుందాం. మామూలుగా ఎవర్నడిగినా బియ్యం నానబోసి, ఆరబోసి దంచి, జల్లించి … ఇలా రెక్కలు ముక్కలు చేసుకునే విధానం చెప్తారు. నేను సునాయాసంగా చేసే పద్ధతి కనిపెట్టేను.

హెచ్చరిక – ఇక్కడ  ఇస్తున్న కొలతలు ఉజ్జాయింపుగా మాత్రమే. నేను కళ్లతో కొలుస్తాను. గిన్నెలో పిండి పోసి సుమారుగా ఇంత ఉంటుదనుకుని చేస్తాను.  మీకు అలాగే చెప్తున్నా.

మొదట అరిసెలు.

ఒక కప్పు బియ్యప్పిండి, బజారులో  కొన్నదే,  కొంచెం నీళ్ళు చల్లి బాగా కలిపి ఓ పక్కన పెట్టుకోవాలి. నీళ్లు చల్లడం ఎందుకంటే నానబెట్టిన బియ్యం దంపిన అనుభూతికోసం.  బియ్యప్పిండిని మోసం చేస్తున్నాను.

మరో గిన్నెలో  ఒక కప్పు బెల్లం తురుము లేదా చిన్నముక్కలు వేసి బెల్లం  నాలుగు చెంచాలు నీళ్లు పోసి పొయ్యిమీద పెట్టి ఉండపాకం  చేసుకోవాలి.  మధ్యలో ఒకటి రెండుమాట్లు కలుపుతాను. ఎందుకంటే నాకు తెలీదు. తోచక కావచ్చు. పాకం ఓ చుక్క నీటిలో వేస్తే పాకం నీళ్ళలో కలిసిపోకుండా ఉండగా నిలిస్తే ఉండపాకం.

కొందరు రెసపీకారులు ఉండపాకం అన్నారు, కొందరు తీగపాకం అన్నారు. అంచేత ఆ రెండు కలిపి రెండు పెట్టి భాగిస్తే ముదురుపాకం అని జవాబు చెప్పుకున్నాను. నాకు అది పని చేసింది.  పాకం కుదిరిందన్న నమ్మకం కుదిరేక, స్టౌ సెగ  తగ్గించి, ఒక చెంచాడు నువ్వులు, బియ్యప్పిండి కొంచెం కొంచెం వేస్తూ ఉండలు కట్టకుండా కలపాలి. యాలకపొడి కూడా అప్పుడే వేసి,  మరో రెండు నిముషాలు పొయ్యిమీద ఉంచి మరోసారి బాగా కలిపి దింపితే అరసెలపిండి సిద్ధం అయిపోయినట్టే. బియ్యప్పిండి ఆ పాకంలో సరిగా కలవకపోతే, మరో చెంచాడు నీళ్ళు పోసి మరో రెండు నిముషాలు పొయ్యిమీద ఉంచి, నీరు ఇగిరిపోయేక స్టౌ ఆర్పేయొచ్చు..

ఆ మిశ్రమం కొంచెం చల్లారేక, పిండి ఉండలు చేసి, పల్చగా పూరీల్లా వత్తుకుని, నూనెలో వేయించుకోవాలి. నేను అరచేతిలో ఒత్తుకుంటాను. లేకపోతే ప్లాస్టిక్ ముక్కమీదో అల్యూమినియం ముక్కమీదో కూడా వచ్చుకోవచ్చు.

వేగినతరవాత రెండు అట్లకాడలతో వొత్తితే అధికంగా ఉన్న నూనె ఓడిపోతుంది. ఇలా ఒత్తడానికి వేరే సాధనాలు ఉంటాయిట కానీ చెప్పేను కదా నామటుకు నాకు ఉన్నవాటితో జరిపేసుకోడమే సుఖం. ఇది కూడా ఒక కారణం నేను చేతిలో చిన్నవిగా ఒత్తుకోడం.

ఎంతకాలం ఉంటాయో నాకు తెలీదు తినేస్తాను కనక. కరకరలాడే తీపి పిండివంట ఇదొక్కటేనేమో.

000

సొజ్జప్పాలు – ఇది ఇంకా తేలిక. ఇక్కడ రాస్తుంటే చాలా విధులు ఉన్నట్టు అనిపిస్తోంది కానీ నిజంగా చెయ్యడం మొదలుపెడితే అట్టే శ్రమ లేని పనే.

మొదట రెండు కప్పులు మైదాపిండిలో నాలుగు చెంచాలు నూనె వేసి బాగా కలపాలి.

తరవాత కొంచెం నీళ్లు పోసి పూరీలపిండిలా కలపాలి. పూరీలపిండికంటె కొంచెం పల్చగా కలపాలి. సాగదీ్స్తే రబ్బరులా సాగాలి.

ఒక కప్పు గోధుమరవ రెండు చెంచాలు నేయిలో దోరగా వేయించాలి. కొందరు పచ్చికొబ్బరి తురుము కూడా కలిపుతాం అన్నారు కానీ నేను వేయలేదు. పంచదార కూడా చాలామంది ఎత్తుకెత్తు వేస్తారు కానీ నేను ఒక పావు తగ్గిస్తాను. అంటే కప్పులో మూడువంతులు పంచదార గోధుమరవలో వేసి రెండూ చక్కగా కలిపి పక్కన పెట్టుకోవాలి.

మరో గిన్నెలో మరో రెండు చెంచాలు నేతిలో జీడిపప్పు వేయించి, అందులోనే ఎండుద్రాక్ష (కిస్మిస్), యాలకులపొడి, ఇంకా ఉంటే కుంకుమపూవు, పచ్చకర్పూరం, వేసి ఓ కప్పున్నర నీళ్ళు పోయాలి.

నీళ్ళు ఉడుకుతుండగా, సెగ తగ్గించి,  రవ, పంచదార మిశ్రమం  నెమ్మదిగా కలుపుతూ పోయాలి. (ఉప్మాలాగే). మరోమారు కలిపి, స్టౌ సెగ తగ్గించి, మూతపెట్టి నాలుగు నిముషాలు ఉంచాలి.

రవ ఉడకలేదనిపిస్తే మరో నిముషమో రెండు నిముషాలో పొయ్యిమీద ఉంచండి.  ఒక్కమాటలో సత్యనారాయణవ్రతానికి చేసే ప్రసాదం ఇదే. రవకేసరి కూడా ఇదే.

ఒకొక వాయకి నాలుగైదు కేసరిఉండలు, మైదాపిండి ఉండలు చేసి పెట్టుకుంటాను. ఇలాగే చె్యాలని నియమం లేదు కానీ వేయిస్తున్నప్పుడు టైం కలిసొస్తుంది.

ఒత్తడానికొకరు, వేయించడానికొకరు ఉంటే ఇలా ఉండలు విడిగా చేసి పెట్టుకోనక్కర్లేదు.

మొదట నేళ్ళకి కొంచెం నూనే రాసుకుని మైదా ఉండ పూరీలా కొంచెం సాగదీసి,  మధ్యలో రవఉండ పెట్టి,, అంచులు మూసేసి, చేత్తోనే పూరీలా వత్తుకోవాలి. ఇది కూడా అరిసెలలాగే అరిటాకుమీదో ప్లాస్టిక్ ముక్కమీదో కూడా వత్తుకోవచ్చు.

మథ్యలో మొదలు పెట్టి అంచులవేపు వత్తితే రవ సమంగా పరుచుకుంటుంది.

నేను పెనంమీద దోసెలా కాలుస్తాను. కొందరు నూనెలో వేయిస్తారుట.

సొజ్జప్పాలు తేలిగ్గా జీర్ణం అవుతాయిట. పిల్లలకి ఆరోగ్యంట. నాకు ఆరోగ్యంగానే ఉంది!!

(జూన్ 15, 2017)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

6 thoughts on “వంటింటి సంబరాలు – 3 అరిసెలు, సొజ్జప్పాలు”

  1. ఆహా, అరిసెల గురించి అందరూ నన్ను భయపెట్టారు… అందుకే ఎప్పుడూ ప్రయత్నించలేదు. ఈసారి మీ పద్ధతి చూస్తా. సొజ్జప్పాలు ఈజీ అని తెల్సు కానీ చేయలేదు. ఎవళ్ళన్నా చేస్తే తినడమే కాని 🙂

    మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.