“నేను నీకు సాయము చేయవచ్చునా?”

(మనలో మనమాట 36)

కొత్తగా ఈదేశం వచ్చేక నేర్చుకున్న కొత్త నుడికారం ఇది, may I help you?

ఈవిషయంలో ఇప్పటికీ నాకు సంపూర్ణమైన అవగాహన లేదు. ఏ దుకాణంలో అడుగు పెట్టినా సాయం చేయనా అంటూ వచ్చేవాళ్ళ్. ఈమధ్య ఇది కొంచెం తగ్గింది, “నీకు నువ్వే సాయం చేసుకో” అని చెప్పే సదుపాయాలు రావడంతో.

మరిప్పుడు ఎందుకు రాస్తున్నానంటే –

నేను రోజూ నడిచేదారిలో పూలూ పళ్లూ పుష్కలంగా కనిపిస్తాయి. ఒకొకప్పుడు ఓ పళ్లచెట్టుదగ్గరో పూలమొక్కదగ్గరో ఆగి తనివితీరా వాటి అందాలు చూచి అనందించి, వాటిపేర్లు ఏమయి ఉంటాయో అనుకుంటూ ఆలోచిస్తూ ముందుకు సాగుతాను. దారిన పోయేవారు చేతికందిన పళ్ళు రెండు కోసుకుపోతారు. హేయ్, నాపళ్లు కోసుకుపోతావేం అంటూ ఎవరూ ఎవర్నీ అదిలించడం నేను చూడలేదెప్పుడూ. అది నాకు మరింత సంతృప్తిగా ఉంటుంది.

ఈ బొమ్మలో చూసేరా కుడివేపు, అంటే వీధివేపు కొమ్మలు బోసిగా ఉన్నాయి. నేను మొదట చూసినప్పుడు చెట్టంతా పళ్ళే. తరవాత క్రమంగా తగ్గుతూ వచ్చేయి. దారిన పోయేవారు కోసుకుపోయేరు. ఎడమవేపు చేతికందనంతదూరంలో ఉన్నవి ఇంకా కనిపిస్తున్నాయి. నాలుగు రోజులు పోయేక అవి కూడా కనిపించలేదు.

మనసాహిత్యంలో పొలాలవెంట నడిచిపోయే పాంధులకు రైతులు దోసపళ్లు ఇచ్చినట్టు వర్ణనలున్నాయి. అలాటివి గుర్తుకొస్తాయి ఇవి చూసినప్పుడు.

000

నిన్న అలాగే ఓ పళ్ళచెట్టుదగ్గర నిలబడి చూస్తున్నాను. ఆ యింటివాళ్లెవరూ కనిపించలేదు కానీ  “హేయ్, నేను నీకు సాయము చేయవచ్చునా” అన్నకేక వినిపించింది..

నేను ఉలిక్కిపడి, అటు తిరిగి చూసేను.

వీధికి అటు అటువేపు వందగజాల దూరంలో కుక్కపటకా పుచ్చుకు ఒకావిడ కనిపించింది. నేను విన్న సహాయకస్వరం ఆవిడదన్నమాట.

“ఇవి ఏం పళ్ళా అని చూస్తున్నాను,” అన్నాను.

“ఓ” అంది ఆ దయామయి. ఆవిడ చేయగలిగిందేమీ లేదని తేలిపోయింది. అవునో కాదో తేల్చుకోడానికి, కొంచెం దగ్గరగా వెళ్ళి, “ఆ పళ్ళేమిటో తెలుసా?” అనడిగేను.

తెలీదుట హా. ఆమాత్రం దానికి “సాయం చేయనా అనడగడం ఎందుకు?” ఆవిడ చేయగల సాయం ఏమై ఉంటుందా అని ఆలోచించేను. చెప్పేను కదా మామూలుగా ఇక్కడెవరూ పట్టించుకోరని. వెనకొకసారి నేను అలా మరొచెట్టు దగ్గర నిలబడి చూస్తున్నప్పుడు, ఇంటివాళ్ళు చూసి, ఆ పళ్లే కాదు ఆ పక్కనున్న గులాబీలు కూడా తీసుకోమన్నారు.

పోనీ అది ఆవిడగారి ఇల్లయితే అనుకోవచ్చు. అదీ లేదు. నేను ఇటు తిరగ్గానే, ఆవిడ అటు తిరిగి రెండేవేపు నడక సాగించింది. ఇదంతా చూస్తుంటే నాకు తోచిందొక్కటే – నేను ఆయింటికి కన్నం వేయడానికి చూస్తున్నాను అనుకుంటోందని.

“నేను కన్నం వేయాలనుకుంటున్నాను. ఓ చెయ్యేస్తావా?” అనడిగితే ఏం జవాబు ఇచ్చేదో! ఠక్కున సెల్లు తీసి 911 పిలిచేసేదా? లేక, ఓ, దానికేముంది, పద, ఎటుపేవేద్దాం అంటూ రంగంలోకి ఉరికేదా?… తెలీదు మరి.

000

మాపిల్లలిద్దరూ నన్ను చూడ్డానికొస్తే ఉన్న గంటసేపులోనూ పదిసార్లు అడుగుతారు ఏమైనా సాయం కావాలా అని, చేయడానికేమైనా పనులులున్నాయా అని.

మాయింట్లో నాకే లేవు పనులు. వాళ్ళకేం చెప్పను గిన్నెలు కడగమనో బట్టలుతకమనో తప్ప. అది కూడా అన్నాను హాస్యానికే, “బట్టలుతుకు,” అని.

సరేనంటూ ఇద్దరూ సిద్గమయేరు కానీ నేనే మళ్ళీ వద్దులే అన్నాను. ఆ రెండు పనులూ వాళ్ళు చేసేస్తే, నాకు కాలక్షేపం ఎలా మరి?

ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే నాకాలంలో ఇలా అడగడం లేదు. ఇక్కడే మరొక హెచ్చరిక కూడా విదితం చేయాలి. ఆచరణలో చిన్న చిన్న తేడాలుండొచ్చు కానీ స్థూలంగా అంతస్సూత్రం ఒకటే. ఒకజాతికీ మరొక జాతికీ ఉన్న తేడాలకంటే ఒక తరానికీ మరొక తరానికీ ఉన్న తేడాలే ఎక్కువ.

నాకిప్పటికీ మనసులో ఉండిపోయింది – ఒకమారు వంటింటిగుమ్మందగ్గర నిలబడి నేనేమైనా చెయ్యనా అని మాఅమ్మనడిగేను.

“పనివాళ్ళకి చెప్పినట్టు చెప్పాలేమిటి?” అని విసుక్కుంది మాఅమ్మ. ఆవిడఅభిప్రాయం చేసేదేమైనా ఉంటే చెయ్యాలనిపిస్తే చేయడమేనని. అసలు మనిళ్లలో ఏదీ వాచ్యం చేయడం లేదు. అనేకవిషయాలు మనకి ముఖకవళికలలోనే తెలుస్తాయి. 000

మనకి సాయం చేయనా అని అడగడం ఒక ఎత్తు, మనని సాయం చేయమని అడగడం మరో ఎత్తు.. సాయం కావలిసినవారికి సాయం చేయడం అనూచానంగా వస్తున్న సంప్రదాయం. నమ్మినవారికి పుణ్యం, స్వర్గం అని చెప్పుకుంటాం. నమ్మనివారికి సామాజికసేవ, మానవదర్మం. ఇప్పుడు దానం చెయ్యి అని చెప్పడం, చెప్పించుకోడం నాగరీకమైంది.

అసలు ఈదేశం ఆదేశం అని కాదు కానీ వెనకటి తరాలలో సాయం జీవనసరళిలో ఒక భాగం. సత్రాలూ ధర్మశాలలూ కట్టించినవాళ్ళూ చలివేంద్రాలు పెట్టించినవాళ్ళూ ఎవరో చెప్తే చేసినవి కావు. కలవాడు లేనివాడికి, అవుసరమైనవాడికి అవుసరమైనది ఇవ్వడమే సర్వసాధారణమైన ధర్మసూత్రం.

క్రమంగా నవనాగరీకం రూపు దిద్దుకుంటూ వచ్చి, ప్రతిదానికీ క్రమపద్దతులు ఏర్పడిపోయేయి. ఆ ఉధృతంలో కొన్ని పద్దతులు విపరీతధోరణులకి కూడా దారి తీసేయనే అనిపిస్తోంది నాకు. పైన చెప్పినట్టు చిన్న చిన్న సాయాలు ఎవరికి తోచినట్టు వారు చేస్తున్నారు ఇప్పటికీ. అది బాగానే ఉంది. కానీ సాయం చెయ్యి అని అడిగే పద్ధతులలో కొన్ని మాత్రం నాకు అస్సలు నచ్చడం లేదు.

ఫోనులో టెలిమార్కటర్లు, టీవీలో ప్రకటనలు, తపాలాపెట్టిలో ఉత్తరాలు – మనలో దానగుణాన్ని మేలుకొలపడానికే అంటూ చేసే ప్రచారం విశ్వరూపం ధరించింది. ఇవి ఎఁదుకు చిరాకు కలిగిస్తాయో చెప్తాను.

“నువ్వు పది డాలర్లు దానం చేస్తే నీకు ఓ అద్దపుముక్కో చేతిసంచీవో ఇస్తాం” అని మరో దానచిహ్నం ఆశ పెట్టడం ఒకటి. ఆలోచించండి వీటివెనక తతంగం – నాకు అలా చెప్పడానికి టెలిమార్కటరు, పోస్టులో వచ్చిన కాయితపుముక్క, పోస్టేజి స్టాంపూ, ఈ పనులు నిర్వర్తించేవాడిజీతం – ఇవన్నీ ఖర్చులే. ఆమధ్య ఒక వార్త ఉన్నాను ప్రపంచప్రసిధ్ధి పొందిన World Health organization వాళ్ళప్రయాణాలకే 200 మిలియన్లు ఖర్చు పెడుతున్నారనీ, అది ఆర్తులకి అందించేసహాయంకంటే పెద్ద ఖర్చు అనీ. ఇదే కాదు. అనేక సంస్థలు 60, 70, ఒకొకప్పుడు 80 శాతం నిర్వహణకే ఖర్చు చేస్తారు. “మీరు ఏ సంస్థకి ఇవ్వదలుచుకున్నారో వారిసైటులో చూసుకోండి ఇచ్చేముందు” అని సలహాలిచ్చే సంస్థలు కూడా ఉన్నాయి.

మరోబాధ మనం ఒక సంస్థకి ఇస్తే ఆ సంస్థ మరోసంస్థకి చెప్తారు ఫలానామనిషి మాకిచ్చేరోచ్ అని. ఆ తరవాత రెండు సంస్థలూ ఇంకా ఇంకా ఇవ్వమంటూ వదలకుండా ఆజన్మాంతం పోరు పెడుతూనే ఉంటారు ఒక్కమారు ఓ పది దానం చేసిన నేరానికి. మనదేశంలో గుడిమెట్లమీద ముష్టివాళ్ళని కసురుకుంటాం కానీ ఈ సంస్థలపోరు అందుకు తీసిపోదు. ఇవ్వగలవారిమాట నాకు తెలీదు కానీ నాలాటి అసమర్తులకి మాత్రం అది కంటకప్రాయమే. పాశ్చాత్యసంప్రదాయలో ఎక్కడిక్కడ అప్పు తీర్చేయడం జరుగుతుంది కానీ మనకి కొన్ని జన్మలకి సాగుతుంది. ఏ తీరు ఎక్కువ లాభిస్తుంది అని కాక దీనివల్ల మనకి ఏది ఎక్కువ మనశ్శాంతి అని ఆలోచిస్తే మాత్రం నాకు మనపద్ధతే హాయిగా ఉంది. ఎందుకంటే మనపద్ధతిలో నాకు అవుసరంలేని వస్తుసంచయం పోగుచేసుకోడం లేదు. రెండోది, ఇచ్చినదాన్నిగురించి ఇంక ఆలోచించడం లేదు. ఇద్దాం అనుకున్నాను, ఇచ్చేను. అంతటితో ఆ కార్యక్రమం సరి. అంతేగానీ మళ్ళీ మళ్ళీ పిలిచి అడిగినవాళ్లందరికీ నావల్లకాదు అంటూ క్షమాపణలు చెప్పుకోవలసిన అవుసరం లేదు.

ఒక హెచ్చరిక. ఇక్కడ నేనేం చెప్పినా అదే వేదవాక్కు, అది తిరుగులేని ఏకైక నియమం అని అర్థం కాదు. నేను ఇక్కడ చెప్తున్నా ప్రతి పద్ధతికీ మినహాయింపులు కూడా ఉన్నాయి.

000

ఏ కారణమూ లేకుండా, అడక్కుండా సాయం చేసినవాళ్లు కూడా నాకు తటస్థపడ్డారు. ఒకసారి హైవేమీద flat tire అయితే ఎవరో దారిన పోయేవారు ఆగి, ఆ టైరు మార్చేరు. వారి సౌదన్యానికి ఆశ్చర్యపడి, ఎందుకు చేస్తున్నారని అడిగేను కూడా. ఆతరవాత వారి ఎడ్రెస్ అడిగి తీసుకుని ఏదో పుస్తకం పంపించేను. ఆ ఎడ్రెస్ లేదని ఆ పుస్తకం నాకు తిరిగొచ్చేసింది1 అదీ “అవుసరమైనవారికి అవుసరమైనప్పుడు అవుసరమైన సాయం చేయడం అంటే. అలాగే కూరలబజారులో పైఅరలో ఉన్నవి నాకు అందక దిక్కులు చూస్తుంటే దగ్గర్లో ఉన్నవారు అందుకుని తీసిచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

నేననేదేమిటంటే, “నీకు సాయము నేను చేయవచ్చునా? అని అడగడం ఈనాటి సమాజంలో అవుసరం కావచ్చు. నాకు మాత్రం అర్థరహితంగానే అనిపిస్తుంది. నాకు ఏది అవుసరమో అది చేస్తే చాలు. నేను ఏదైనా ఇస్తే అందుకు ప్రతిఫలంగా నాకు అఖ్ఖర్లేని అద్దమో తోలు సంచీవో పలుదోముకునే పుల్లో ఇవ్వొద్దు. దానికి సమానమైన ధనము కూడా అవుసరమైనవారికే ఇచ్చేయండి. మరియు, నా చిరునామా, ఫోన్నెంబరు ఇత్యాదులు దేశమంతా దండోరా వేయకండి. అది నాకు కష్టము కలిగించును.

000

(జూన్ 23, 2017)

 

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

4 thoughts on ““నేను నీకు సాయము చేయవచ్చునా?””

  1. అడక్కుండా చెయ్యడం చాలా ఉదాత్తమైన, ఉత్తమమైన మార్గం. కానీ అడగందే అమ్మయినా పెట్టదంటారు కదా. కనుక ఒక్కోసారి ఇతరులను అడగక తప్పదేమో సాయం కావాలని. అలాగే కొందరు మొహమాటస్థులు ఉంటారు. వాళ్ళు దిక్కులు చూస్తుంటారు కానీ అడగడానికి మొహమాటమో, అహమో అడ్డొస్తుంది. అలాంటి వారిని గ్రహించి చిన్నచిన్న సాయాలు మే ఐ హెల్ప్ యూ అని అడిగి చేయచ్చు. అయితే మీరన్నట్టు ఇవి మినహాయింపులు మాత్రమే! నిజానికి దానానికి, సాయానికీ డబ్బాకొట్టుకోనక్కరలేదు. సేవాదృక్పధం ఉంటే చుప్ చాప్ చేసేయడమే. చాలా మంచి విషయం రాసారండి.

    మెచ్చుకోండి

  2. చాలా నచ్చింది. చిన్నవారికి,తోటివారికి మార్గదర్శకత్వం అంటే ఇలాంటి ఆలోచనలు పంచి వారిని ఆలోచింపజేయడమే అని నా అభిప్రాయం మాలతీ గారూ ..ధన్యవాదాలు.

    మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.