జీవనమాధుర్యం

“వెళ్తావు కదూ!”

కిక్కిరిసి ఉన్న కంపార్టుమెంటులో కింద పడ్డానికి కూడా జాగా లేక, ఊపిరాడక కొట్టుకుపోతున్నసమయంలో కూడా వినిపిస్తున్న స్వరం అది. వెనకనించి ఎవరో తోసేరు. ఆ వెనక మరొక మనిషి కాబోలు అతన్ని తోసేడు. “ఉండవయ్యా, నువ్వొకడివి. నించోడానికేనా చోటు లేక మేం అవస్థ పడుతుంటే,” అన్నాడు విసుగ్గా టికెట్ కొనుక్కుని ఇక్కట్లు పడుతున్న ఆసామి.

“మరేం చెయ్యమంటారు సార్? మాకోసం స్పెషల్ బోగీ వేయిస్తారా?” అన్నాడు అడుక్కోడానికొచ్చిన గుడ్డి బిచ్చగాడు అవహేళన చేస్తూ.

“ఏమో మరి. నీతరవాతివాళ్ళమే కదా మేం,” అన్నాడు మొదటిమనిషి.

చుట్టూ ఉన్న జనం నవ్వేరు అందులోనే సందు చేసుకుని.

“వెళ్తావు కదూ అరుంధతిదగ్గరికి.”

తుళ్ళిపడ్డాను.

“క్రాసింగుట. మరో అరగంటదాకా కదిలేట్టు లేదు బండి.”

బండిలో నించోలేక మెల్లిగా కిటికీలోంచి దారి చేసుకుని ప్లాట్ ఫారంమీదికి జారుకున్నాను కనీసం ఊపిరయినా ఆడుతుందని.

“కాస్త మంచినీళ్ళు ఇటొస్తే చూడు బాబూ,” అంది నన్నుద్దేశించి కిటికీపక్కన కూచున్నావిడ, మరచెంబు చేత్తో పుచ్చుకుని అటూ ఇటూ చూస్తూ,

నేను అటూ ఇటూ చూసి, కనుచూపుమేరలో మంచినీళ్ళవాడు కనిపించకపోగా, నేనే అందుకున్నాను ఆ మరచెంబు.

మంచినీళ్ళు తెచ్చేసరికి అటునించి రావలసిన ఎదురుబండి దిగబడింది. ఇహ రైలు కదుల్తుందని మళ్ళీ కిటికీలోంచే లోపలికి దూరి ఇందాకా నేను నిలుచున్నసందుకోసం వెతుకుతున్నాను.

“ఇలా కూచో బాబూ. అన్నకు స్థలమియ్యరా,” అంది మంచినీళ్ళు పుచ్చుకున్న మహాయిల్లాలు, తన కొడుకుని పక్కకి తోస్తూ.

ఒదిగి కూచున్నాను ఈ కలికాలంలో కూడా ఇంకా ధర్మమూ, మంచివాళ్ళూ ఉన్నారు కాబోలు అనుకుంటూ. సంచిలో చక్కిలాలపొట్లం వెక్కిరించినట్టు వేళ్ళకు తగిలింది. ధర్మపన్నాలు వల్లించుకుంటున్న నేను నాలుక్కొరుక్కున్నాను.

ఆ చక్కిలాలు అరుంధతికివ్వాలి.

“ఒక్కమారు వెళ్ళు బాబూ,” అంది ఆ తల్లి. అది ఆజ్ఞ. పసుపూ, ఎరుపూ కలనేత చీరెలో సంధ్యాసమయాన్ని స్ఫురింపజేసే స్వచ్ఛతతో, చాముండేశ్వరీ విగ్రహాన్ని తలపింపజేస్తూ నవ్విన నవ్వు నాపాలిట సీతకోసం సౌమిత్రి గీచిన గీటు. లోకానికే ఆదర్సప్రాయమై అనుసరణీయమయిన ఒక పుణ్యమూర్తి పెట్టిన ఆంక్ష. అది అధికారరోగపూరిత బధిరాంధకశవము వేసిన ఆర్డరు కాదు. ఒక మాతృమూర్తి తన బిడ్డకు చెందవలసిన అమృతాన్ని నాకు పంచి పెట్టి, ప్రతిగా కోరిన ఒకే ఒక్క చిన్ని కోరిక. పరమకిరాతుడైనా మృత్యువుసన్నిధికి పంపుతున్న శతృవుని నీ చివరికోరిక ఏమిటనే ప్రశ్నకి జవాబు.

“ఒక్కమారు అరుంధతిని చూసి రా, నా కళ్ళు పెట్టుకుని.”

అలా అలమటించిపోతున్న మాతృశ్రీని క్షోభ పెడుతున్న ఆ నింద్యురాలిమొహం ఎలా చూడను? చూడలేనని ఆ తల్లికి ఎలా చెప్పను?

“ఆడదాన్లా అంత పగేమిట్రా నీకు?” అంటుంది అమ్మ. మగవాడికి మాత్రం రాగద్వేషాలుండవు కాబోలు.

“ఎక్కడిదాకా?” ఎవరో ప్రశ్నించేరు.

చెప్పేను.

“అబ్బో చాలా దూరఁవేనే,” అని ఆవులించేరు.

నేను మాటాడలేదు.

“ఒక్కడివే వెళ్తున్నావా? ఏం పనిమీద? మరి మీవాళ్ళని మళ్ళీ వచ్చి తీసుకెళ్తావా?” — వెయ్యి ప్రశ్నలు.

నసిగేను. ఒంటిగాణ్ణి. ఎక్కడుంటేనేమిటి?

“అరుంధతి మాట?” – గుడిగంటలా హెచ్చరింపు అంతరాంతరాల్లో.

నన్ను పలకరించినాయన్ని అడిగేను రాయపూర్‌లో ఫలానావారిల్లు తెలుసా అని నాదగ్గరున్న ఎడ్రెసు చూపించేను.

ఇల్లు తెలీదు కానీ ఆ వీధి చూపిస్తానన్నారాయన. వాళ్ళయింటికి ఆ వీధి దాటి వెళ్ళాలిట.

కాంటాబాంజీ స్టేషనులో టీ తాగి మళ్ళీ రైల్లో కూచున్నాను. అరుంధతి ఎలా ఉంటుందో? అది కూడా నేనెప్పుడూ ఆలోచించలేదు. నాకు తెలిసిన అరుంధతి ఒక నరరూప రాక్షసి. అమృతభాండం అందిస్తే మట్టిపాత్ర అని విసిరి పారేసిన మూర్ఖురాలు. కోరి వరించిన ఐశ్వర్యాన్ని కాలదన్నుకున్న అజ్ఞాని. అర్థరాత్రి అప్పటికప్పుడు బియ్యం దంపి చుట్టిన ఈ చక్కిలాలు నా మొహాన విసిరి కొట్టినా కొట్టొచ్చు. ఆవిడ పిచ్చి కాకపోతే రసమలాయీ, రాజభోగ్ తినే అరుంధతి ఈ పాతకాలపు పిండివంటకోసం మొహం వాచి ఉందా?

రాయపూర్ స్టేషనులో దిగి దిక్కులు చూస్తున్న నన్ను ఇందాకా దారి చూపిస్తానన్న తోటి ప్రయాణీకుడు తీసుకెళ్ళి అరుంధతి ఇంటిముందు వదిలిపెట్టేడు.

తలుపు మెల్లిగా తట్టేను. పాతివ్రత్యం పరీక్షించడానికి అగ్నిప్రవేశం చేయమన్నప్పుడు ఆనాడు జనకసుత ఎట్టి అనుభూతులకు లోనయిందో కానీ సామాన్యమానవుడినైన నేను ఒక వృద్ధమూర్తియందు నాకు గల అభిమానాన్ని ఋజువు చేసుకోడానికి – డాంబికంకోసం కాక – నిండుమనసు నొప్పించలేక, వచ్చి నిలబడ్డాను అరుంధతి ఎదుట. నరకద్వారాల్లా తెరుచుకున్నాయి తలుపులు. ఆ తలుపులవెనక తన ఐదవతనానికి చిహ్నంగా గాజులు ఘల్లున మ్రోగుతుండగా ప్రత్యక్షమయిన పార్వతీదేవిలా నిలబడింది ఆ తలుపులు తెరిచిన జవరాలు. ఆ ముగ్ధమోహనమూర్తి అరుంధతి కాజాలదు. బహుశా క్షణక్షణానికి ఇంతింతై మాయావటుడిలా పెరిగిపోతున్న నాకోపాగ్నిని శాంతింపజేయడానికొచ్చిన దేవదూత కావచ్చు. నేను వీలయినంత సంక్షిప్తంగా నా వచ్చినపని వివరించేను.

“లోపలికి రా,” అందావిడ నాకోసమే ఎదురు చూస్తున్నట్టు.

అత్తవారింటికి వెళ్ళిన కొత్తకోడలు తన అనుంగు తమ్ముని ఆహ్వానించే పిలుపు అది. స్కూలికి వెళ్ళిన పసివాడు తిరిగి ఎప్పుడొస్తాడో అని ఎదురు చూసి చూసి విసిగి వేసారి వెనుదిరుగునంతలో ఆ పసివాడు పరుగున వచ్చినప్పుడు ఎదురయే సుస్వాగతం అది.

“అమ్మ కులాసాగా ఉందా? ఎంతగానో బతిమాలేను. ఒక్కదాన్నీ ఈ దేశం కాని దేశంలో నా అన్నవాళ్ళు లేకుండా పడి ఉన్నాను. వచ్చి నాదగ్గర ఉండమంటే రాను గాక రాను పొమ్మంది. ఏనాడు ఏ తల్లీ బిడ్డల్ని వేరు చేసేనో ఈనాడు నాకు తల్లి ఉండీ లేనిదే అయింది. పోనీలే. తక్కువ నోములు నోచి ఎక్కువ ఫలము కావాలంటే ఎలా వస్తుంది?” అంది అరుంధతి కనుల నీరు తొణుకుతుండగా.

అరుంధతిమాటలు నేను నమ్మలేదు. ఆమె నటనావైదగ్ధ్యానికి ముగ్ధుడనైనమాట నిజం.

ఆవిడ అంతలోనే తేరుకుని, “లేచి స్నానం చెయ్యి. భోజనం చేద్దువు గాని. నిన్న ఎప్పుడనగా తిన్నావో,” అంది.

“ఇప్పుడు మీరనవసరంగా శ్రమ తీసుకోకండి. మీఅమ్మ ఇవి ఇచ్చి చూసి రమ్మనడంచేత వచ్చేను,” అన్నాను సంచీలోంచి చక్కిలాల పొట్లం తీస్తూ, ఆ యింట్లో ప్రవేశించడానికి నాకు గల అభ్యంతరం సువ్యక్తం చేస్తూను.

“అయితే మా అత్తగారు పని చెప్పకపోతే వచ్చేవాడివి కాదన్నమాట. ఇంకా ఆలీబాబాకథలోలాగ ఉప్పు తిననని నియమం కూడా పెట్టుకున్నావా? నేను క్రైంబ్రాంచివాణ్ణి. మారు మాటాడకుండా పద,” అన్నాడు అప్పుడే రంగంలోకి ప్రవేశిస్తూ రమణారావు. ఆ ఇన్స్పెక్టరుగారిముందు నాకు నోరు పెగల్లేదు.

తల ఒంచుకుని భోంచేస్తున్నాను. వంటింట్లో చేస్తున్న ఏర్పాట్లని బట్టి ఆ ఇంట్లో ఓ వారాలకుర్రాడు ఉన్నాడనీ, అతనివంతు అన్నం నాకు పెట్టి ఆ కుర్రాడికోసం మళ్ళీ ఎసరు పడేసిందనీ గ్రహించుకున్నాను.

భోజనం చేస్తున్నంతసేపూ క్రైంబ్రాంచి ఇన్స్‌పెక్టరుగారు నాపక్కనే కూచున్నారు. అరుంధతి ఏవేవో ప్రశ్నలు వేస్తూనే ఉంది. వాటితో పోటీ పడుతూ ఖాద్యపదార్థాలు నా ఆకులో పడిపోతున్నాయి.

నేను తినలేక ఉక్కిరిబిక్కిరైపోతుంటే, అరుంధతి, “అయ్యయ్యో, అసలేమీ తినడమే లేదు. అలా అయితే పద. నీకు ఇష్టమయిన హోటల్లోనే తిందువు గానీ,” అంటూ గొడవ చేసింది.

భోజనం అయేక నాకథ సూక్ష్మంగా చెప్పేను. పార్వతీపురందగ్గర ఓ చిన్న పల్లెటూరిలో యస్.యస్.యల్.సీ వరకూ చదువుకున్నాను. తరవాత పైచదువులకి నాన్నగారు ఒప్పుకోలేదు. కానీ నేను మొండిగా పార్వతీపురం వచ్చి, అరుంధతి తల్లిగారింట్లో ఓ చిన్న గది అద్దెకి తీసుకుని చదువు కొనసాగించేను. అప్పుడే నాన్నగారిదయకు అపాత్రుడిణ్ణి అయేను. అప్పుడే నవ్యనవనీతసమానమయిన నిండుమనమ్ము ఎటువంటిదో తెలుసుకున్నాను. ఆ గదిలో ఉండగానే గుప్తదానం చేస్తున్న ఒక పుణ్యపురుషునిమూలంగా నెలకి ఏభై రూపాయలు అందుకుంటూ బి.ఎ. డిగ్రీ పుచ్చుకున్నాను.

తన తల్లికి వారసుణ్ణి కాగలనన్న భయంతో అరుంధతి అసూయాగ్రస్తురాలై విషం కురిపిస్తే నేను నిశ్చయంగా సంతోషించి ఉండేవాణ్ణి. నన్ను ఏవిధంగానైనా అరుంధతి వంచిండానికి ప్రయత్నిస్తే ఆ మాయాజాలంనుండి తప్పించుకుని అలవోకగా నవ్వి అవనితముఖి అయిన అరుంధతిని చూసి ఆనందించి ఉండేవాణ్ణి.

“అదృష్టవంతుడివి, తమ్ముడూ! నేను పరితపించిపోతున్న అమ్మ నీకు అనాయాసంగా లభ్యమయింది,” అంది అరుంధతి. కాంప్ కాట్ వేసింది కొంచెంసేపు విశ్రాంతి తీసుకోమని.

నేను వెంటనే వెళ్ళిపోవాలన్నాను.

“అదేం కుదరదు. కనీసం రెండు రోజులైనా ఇక్కడ ఉండందే కదలడానికి వీల్లేదు. కాదూ కూడదని నువ్వు బయల్దేరితే పోలీసుకుక్కలని పంపించి వెనక్కు లాక్కొస్తామని చెప్పమన్నారు మీ బావగారు,” అంది. “అమ్మ అక్కడ ఎలా ఉంది? రైతులు పేచీలు పెట్టడం లేదు కదా? అన్నీ చూసుకోగల ఓపిక అమ్మకుందా?” అరుంధతి పదే పదే తల్లిని గురించి ప్రశ్నించసాగింది.

“ఆవిడ అసలు నేను సాయం చేస్తానన్నా చెయ్యనివ్వదు,” అన్నాను. “ఆవిడ నాకు ఒక సలహా చెప్పింది, ‘నాయనా, పెద్దదాన్నీ, చేసుకోగలదాన్నీను. నాకు దైవసహాయముంది. మరే సాయమూ నాకఖ్ఖర్లేదు. రేప్పొద్దున్న నీ పెళ్ళాం వచ్చినప్పుడు దాన్ని ఏడిపించకు. అదే నేను నీకు చెప్పగల ముక్క’ అని.” చెప్పేశాక అనుకున్నాను అరుంధతికి ఎందుకు ఈమాట చెప్పడం?

“భేషయినమాట శలవిచ్చేరోయి ఆవిడ. కానీ ఈ ఆడజాతి ఉంది చూశావూ, మనం ఒద్దన్నా వినకుండా వాళ్ళే ఉత్తుత్తినే ఏడుస్తారు. ఉదారహరణకి మీఅక్క ఉందా, చెట్టంత మొగాణ్ణి నేనున్నానా? అయినా ఇంట్లో మనుషుల్లేరు, అమ్మ రమ్మంటే రాదూ అని ఏడుస్తుంది. తెగించి ఆవిణ్ణి తీసుకొస్తానేమో …”

“చాల్లెండి ..” అంది విప్రలబ్ధవలె కోపానికీ తాపానికీ మధ్య గల భావవిన్యాసంతో, “మరొకరైతే నిజమనుకోగలరు.”

“అయ్యో ఖర్మమా! అసత్యం అనుకోడూ అతను నువ్వలా గదమాయిస్తే,” అన్నాడు రమణారావు విస్తుపోతూ.

అరుంధతి మారు పలకలేదు.

“అదృష్టహీనుడికి నవరత్నాలతో నిండిన కూష్మాండం కూడా ఒట్టి గుమ్మడికాయలాగే కనిపిస్తుంది,” అన్నాను కసిగా.

“అలాగనకోయ్. ఆవిడని నువ్వు పూర్తిగా ఎరగవు,” అన్నాడు రమణారావు సీరియస్‌గా మొహం పెట్టి.

000

మొదట వాళ్ళు కొత్తగా కాపురం పెట్టినరోజుల్లో ఆవిడ ఇక్కడికి వచ్చింది. ఆప్పట్లో ఇల్లు చిన్నది తీసుకున్నాడు రమణారావు. అతడి ఉద్యోగమూ చిన్నదే. మార్కుదారులయింట పుట్టి జమీందారులయిల్లు మెట్టిన అుంధతితల్లి ఆ ఇంట ఉండలేకపోవడంలో ఆశ్చర్యం లేదు.

“పెద్ద ఇల్లు ఒకటి చూడు. కొనేద్దాం,” అందావిడ.

రమణారావు అంగీకరించలేదు. “నాటకంలో వేషం వేసినట్టు ఇవాళ మీరొక పెద్ద ఇల్లు కొనేస్తే, నాకు దానికి పన్ను కట్టే తాహతు కూడా లేదు. లాటరీలో కారొస్తే పెట్రోలొస్తుందా? పుణ్యానికి పిడికెడు బిచ్చం పెడతారు కానీ పంచభక్ష్యపరమాన్నాలతో విందులు చేయరు. నాకు చేతనయినంత నేను చేస్తాను. సర్దుకోండి,” అన్నాడతను.

ఈమాట పౌరుషవంతురాలయిన అత్తగారికి రుచించలేదు. పాలకడలిలో పుట్టి సిరికి చెల్లెలయి చెలగిన తనకి సర్దుకుపోవలసిన ఖర్మమేమిటి? అల్లుడువాడు కనక ఆ మాట అన్నాడు. ఇవాళ ఈ విషయం అయింది. రేపు మరొకటి కావచ్చు. ఆ రోజే ఆవిడ ప్రయాణమై జననితో సమానమైన జన్మభూమి చేరుకుంది. పుట్టినగడ్డమీదే మట్టి అవడానికి నిశ్చయించుకుంది.

నేను ఈకథంతా నమ్మలేకపోయేను. పెద్దావిడ అంతటి మూర్ఖురాలా తాహతుకు మించిన పరుగులు తీయమని కోరడానికి? ఆవిడ అటువంటి మనిషి కాదు.

నేను ఆవిణ్ణి ఐదేళ్ళగా చూస్తున్నాను.

“నేను ఇరవైయేళ్ళగా చూస్తున్నాను. నా అన్నవాళ్ళు లేరు నీకు. ఆవిడ పట్టెడన్నం పెడితే దయాసముద్రురాలనుకుంటున్నావు నువ్వు. కూరలసంచీ చేతికిచ్చి నిన్ను బజారుకి తరమలేదు కనక ఒరుల నొప్పింప నిచ్చగించని సౌజన్యమూర్తి అనుకుంటున్నావు. అంతేగదా నీకు తెలిసింది?” అన్నాడు రమణారావు.

నా హృదయం భగ్గున మండింది. “అన్నమంతా పట్టి చూడఖ్ఖర్లేదులెండి,” అన్నాను రోషంగా.

రమణారావు చిత్రంగా నవ్వేడు, “నేనొక కథ చెప్తాను వింటావూ?”

నేను కథలు వింటూ కూర్చోడానికి కాదు ఇక్కడికి వచ్చింది. పురాణాలు వల్లించినంత మాత్రాన తప్పులు ఒప్పులై పోవు. అయినా రమణారావు నా జవాబుకోసం ఎదురు చూడనూ లేదు.

“మా ఊళ్ళో నలుడికీ భీముడికీ దీటు రాగల వంటవాడొకడు ఉండేవాడు. అప్పట్లో మా ఇంట మూడు బంతులు లేచేవి. మొదటిబంతి కుర్రకారు కూచునేవాళ్ళం. మాకు మీదవరస అన్నం గోడకేసి కొడితే మేకుల్లా నిలబడేవి మెతుకులు. పెద్దవారికి అంటే మానాన్నగారికి మధ్య వరస అన్నం సమపాళంగా ఉండేది. ఆఖరిబంతి ఆడవాళ్ళకు అడుగు పెచ్చులు – దోరకజ్జాయం. భోజనాలయేక అందరం సావిట్లో చేరి తన్నుకునేవాళ్ళం. అన్నం ఉడకలేదని మేం, ఫస్టుగా ఉందని నాన్నగారూ, మాడిందని మా అమ్మా. .. మొత్తమ్మీద అన్నంగిన్నెలో రహస్యం మటుకు మాకొకంతట పట్టుబడలేదు,”

“మీకు తెలిసింది కాబోలు,” అన్నాను మృదువుగానే.

“లేదోయ్ భగవాన్లూ, అందుకే ఇంగ్లీషువాడు ఏ ప్రశ్నకైనా రెండు వేపులుంటాయి అన్నాడు. ఒకే చెట్టుకి కాసినా ఒక కాయలా మరో కాయ ఉండదు. ఒక తల్లికి పుట్టిన నలుగురు పిల్లలు నాలుగు రకాలుగా ఉంటారని నీకూ తెలుసు కదా. అమ్మ అయినా నువ్వైనా నేనయినా మార్పు సహజం. పట్టూ విడుపూ ఉండాలి దేనికైనా.”

“అయితే నేరస్థుడిని నేరస్థుడు అనకూడదన్నమాట.”

రమణారావు వాచీ చూసుకుని పులివేషంలాటి మేకప్ మొదలెట్టేడు స్టేషనుకెళ్ళడానికి,

“నేరం ఒకమారు చేసినవాడు మనిషైతే మళ్ళీ అదే నేరం చెయ్యడంటున్నాను. అందుకే మన పెద్దలంతా అనుభవమో అని కొట్టుకోడం.”

“సరేలెండి. చిన్నవాణ్ణి చేసి అతనిదగ్గరే మీ ప్రతిభంతా,” అంది అరుంధతి ఎత్తిపొడుస్తూ.

“బావుంది. ఏదో చిన్నవాడు కదా అని నాలుగు నీతివాక్యాలు నేర్పబోతే నేనేదో మీతమ్ముడిమీద పడి కొట్టేస్తున్నట్టు ఇదయిపోతావేం?” అని “నాజోళ్ళు తే. మళ్ళీ సాయంత్రందాకా కనిపించను,” అన్నాడు రమణారావు బెల్టు బిగించుకుంటూ.

నాకిది యం.ఐ. క్లాసులా, లాజిక్ చేసే మేజిక్కులా అనిపించింది. దొంగైనా తన్ను తాను సమర్థించుకోగలడు. నోరుంటే తల కాస్తుంది మరి.

“ఒక్కమాట జ్ఞాపకం ఉంచుకో శ్రీపతీ! Old order must give place to new order. The new order can never adjust to the old. కొత్తతరం పాతతరాన్ని గౌరవిస్తుంది కానీ అనుసరించదు.”

రమణారావు వెళ్లినవేపే చూస్తూ పడుకున్నాను. ఆవరించుకున్న నల్లని మేఘాలని అధిగమించి సూర్యకిరణాలు ఏడురంగుల్లో ప్రతిఫలిస్తున్నాయి. మనుషుల్లో మార్పు సహజమైతే అమ్మ మారదా? అమ్మకంత పట్టుదలా? అసలు ఇందులో నేరస్థులెవరు? “అమ్మ, అమ్మ” అంటూ పలవరిస్తోంది అరుంధతి ఇక్కడ. “అరుంధతి, అరుంధతి” అంటూ తపిస్తోంది అమ్మ అక్కడ. ఐదేళ్ళనించి చూస్తున్న నేను అమ్మకి అరుంధతికన్నా ఆస్తి ఏమీ ఎక్కువ కాదని నిశ్చయంగా చెప్పగలను. రమణారావేమీ అక్రమవర్తనుడు కాదన్నది స్పష్టమే. ఈ చిక్కులనే కాబోలు భవబంధాలంటారు. వాళ్ళు అన్న రెండురోజూలూ ఉండి కాని అక్కడినించి కదల్లేదు నేను. ఈ దంపతులకు నాయందు కలిగిన అవ్యాజానురాగానికి కారణఁ నేను చెప్పలేను. అది అనురాగమవునా కాదా అన్న సందేహం ఎప్పుడో అంతరించిపోయింది. అందుకే వారిమాట కొట్టివేయలేకపోయేను ఉద్యోగార్థినై వెళ్తూ కూడా.

అరుంధతి అమ్మ సుగుణాలను పుణికి పుచ్చుకుందేమో నేను బయల్దేరే రోజున పండుగంత హడావుడి చేసింది. కొత్తబట్టలు తెప్పించి నేను తొడుక్కునేదాకా ఒప్పుకోలేదు. చేతిసంచితో రైలు దిగిన నేను ఇంత భారంతో ఎక్కలేనేమో అనిపించింది.

“వస్తానమ్మా,” అన్నాను తలొంచుకుని రిక్షా ఎక్కబోతూ. ఇరవయ్యో శతాబ్దపు నాగరికత ఒంటబట్టి రెండు చేతులూ జోడించడం కూడా అసభ్యంగా పరిగణించే కాలేజీలో చదవకపోతే ఆమెపాదాలు స్పృశించి ఉండేవాణ్ణి తనయందు నేను పెంచుకున్న దురభిప్రాయాలకి ప్రాయశ్చిత్తంగా.

“కనీసం నువ్వైనా అప్పుడప్పుడు వచ్చి కనిపిస్తూండు తమ్ముడూ,” అంటూ కళ్ళనీళ్లతో సాగనంపుతున్న అరుంధతి ఋణం సప్తజన్మలెత్తినా తీర్చుకోలేనేమో అనిపించింది.

రైలెక్కుతుంటే రమణారావు ఒక ఉత్తరం ఇచ్చేడు. దానిమీద ఉన్న ఎడ్రెసుకి వెళ్తే తప్పకుండా ఉద్యోగం దొరుకుతుందని, “నామాట తీసెయ్యడు,” అన్నాడు.

ఆ ఉత్తరంమీద దస్తూరి నాకు సుపరిచితం. ఏ అజ్ఞాతవ్యక్తి అయితే మా ప్రిన్సిపాలుపేరున ప్రతినెలా ఏభై రూపాయలు పంపి, పరోక్షంగ నాచదువుకి సాయం చేశారో ఆ వ్యక్తిదే ఆ హస్తం. ఆ మాత్రం పోల్చుకోలేకపోతే నేను చదివిన చదువంతా వృథా.

తీసిన కొద్దీ ఊరే జల వంటిది అరుంధతీ రమణారావులకీ నాకూ మధ్యగల అనుబంధం అనుకున్నాను ఉత్తరం మడిచి జేబులో పెట్టుకుంటూ.

000

(ఆంధ్రప్రభ వారపత్రిక, 10 నవంబరు 1961 లో ప్రచురితం.)

ఆత్మీయతలూ అంతఃకరణలూ వేరు. అవి ఎదుటివారికి కనిపించేతీరు వేరు.

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

6 thoughts on “జీవనమాధుర్యం”

 1. సంతోషం సుమన్ లతగారూ మీ విపుల వ్యాఖ్యానానికి. మీరన్నది నిజమే. అభివ్యక్తీకరణలో చాలా మార్పులు వచ్చేయి. ధన్యవాదాలు

  మెచ్చుకోండి

 2. మాలతి గారూ !మీ రెండు కథలు చదివి అనివార్య కారణాలవలన ఆలస్యంగా స్పందిస్తున్నాను .చదివేక మనసు ఒక రకమైన భావానికి లోనయింది .నాలాటి వారికి తెలిసిన ,చూసిన వాతావరణం కావటం వలన ఆత్మీయంగా అనిపించటం సహజం .ఆత్మీయతలు ఎప్పుడూ ఉండేవి ;ఉంటాయి కూడా !వాటిని అభివ్యక్తీకరించే విధానం కాలం తో బాటు మారవచ్చు . ఆనాడు చాలా మంది ఇలాగే ఉండేవారు నాకు తెలిసి ఈనాటి ముఖపుస్తకం లో లాగ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తూ పిల్లలికి ఇన్ని ఏళ్ల నుండి ,ఇన్ని నెలల నుండి అంటూ యిన్ని క్షణాల వరకు లెక్క బెట్టి నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడం కొత్త గా అనిపిస్తుంది .ఎవరి పధ్ధతి వారిదే కదా !అభివ్యక్తం చెయ్యటం లో తేడా అనిపించ వచ్చు కాని ప్రేమించటం లో లోపం ఉండదు అనుకోవాలేమో ! . దస్తూరీ తో బాటు హృదయం కూడా ఆవిష్కృతంకావటం కధకి మకుటాయ మానం ! ఇలాటి కథలు ఎప్పుడూ పాత బడవు .మీవి మరిన్ని ఇక్కడ అందించమని నా కోరిక .

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 3. ఇది మానవ బంధాల గురించిన కథ కావటం వాళ్ళ ఎప్పుడో వ్రాసిన నిత్యనూతనంగా ఉంది. ఈ వాక్యం కథ ముందు ఉంటే ఇంకా బావుంటుందేమో. “ఆత్మీయతలూ అంతఃకరణలూ వేరు. అవి ఎదుటివారికి కనిపించేతీరు వేరు.”

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 4. బాగుంది మీ కధ అందరు ఆదర్శ ప్రాయులు కానీ ఎవరి సుగుణం వారిది ఎవరికి ఎవరు ఒప్పరు మీరు చెప్పింది నిజమే గౌరవించి నంతమాత్రాన అనుసరించరు…

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s