నాజీవనదృక్పథం నాసాహిత్యదృక్పథమే మలిభాగం.

ముఖపుస్తకంలో జీవితచరిత్రలమీద చిన్న చర్చ పెట్టేక, ఇది రాస్తే బాగుండు అనిపించింది.

పదేళ్ళక్రితం “ఈభూమి” పత్రికకోసం ఒక వ్యాసం రాసేను. (లింకు ఈవ్యాసం చివరలో ఇచ్చేను). వారు అడిగింది నా జీవనదృక్పథం మీదే కానీ రాయడం మొదలు పెట్టేక, జీవనదృక్పథం అంటూ నాకు వేరే ఏమీ లేదని తోచింది. ఇప్పుడు అంటే పదేళ్ళతరవాత మళ్లీ అది చదువుతుంటే, కొన్ని అంశాలు తాజీకరించవలసిన అవుసరం కనిపిస్తోంది. అలా చేయకపోతే,  గత పదే్ళ్లలోనూ కలిగిన అనుభవాలు, తెలుసుకున్నసంగతులమూలంగా నా ఆలోచనాసరళిలోనూ,విశ్వాసాలలోనూ వచ్చిన మార్పులు మీకు తెలీకుండా పోతాయి. అది గొప్ప నష్టం కదా. ఆ సవరణలకోసం ఈ పోస్టు.

నేను ఆత్మచరిత్ర రాస్తే బాగుంటుందని కొందరు మిత్రులు సూచించేరు కానీ అది సాధ్యం కాదు నాకు. నా అభిప్రాయంలో ఆత్మచరిత్రలు రాయడానికి కొన్ని అర్హతలు ఉండాలి. సంఘర్షణలూ, భగ్నహృదయాలూ, బీదార్పులూ వంటి మసాలాదినుసులు పుష్కలంగా కావాలి. నాది నేలబారు జీవితం.

రెండోది, నిజానికి ఇదే మొదటిది, జ్ఞాపకశక్తి. అది శూన్యం.

మూడు – జీవితచరిత్రలో ఒకవ్యక్తి వారికోణంలో చెప్పడం జరుగుతుంది ఉత్తమపురుషకథల్లాగ ఒక కోణం మాత్రమే తెలుస్తుంది. Fact check కోసం మళ్ళీ మరికొన్ని పుస్తకాలు చదవాలి. ఇది అందరికీ నచ్చే వాదన కాదు కానీ నాకు తృప్తిగా ఉండదు. ఈవిషయం మరిత వివరంగా కింద వివరించేను.

ఈ జీవితచరిత్ర రాయడంలో మరో బాధ మంచి సామాజికావగాహన చాలా అవుసరం. ఎక్కడేం జరుగుతోందో, ఆ పరిస్థితులకి దారి తీసిన సంఘటనలేమిటో తరిచి చూడగల మేధ కావాలి. నాకది కూడా లేదు. ఈమధ్య అమెరికా రాజకీయాలమూలంగా కొంత గమనిస్తున్నాను కానీ మనదేశంలో ఉన్నప్పుడు నేనేమీ గమనించలేదు

ఇవన్నీ ఒక కొలిక్కి తెచ్చి చూసినప్పుడు నాకు జీవితచరిత్రలు అచ్చిరావనే అనిపిస్తోంది. నావంటలపుస్తకం రెండు పేజీలయితే నాజీవితచరిత్ర నాలుగు పేజీలు.

మామూలుగా ప్రతిమనిషికీ ఒకకథ ఉంటుందంటారు. ఆ కథ ఎవరిని ఆకర్షిస్తుందంటే, వారి పరిచయస్థులనీ, వారికి సంబందించిన రంగాలలో ఆసక్తిగలవారినీను.

ఆత్మకథ ఉత్తమపురుష కథనం కనక ఒక కోణం మాత్రమే తెలుస్తుందన్నాను కదా. ఇందుకు మంచి ఉదాహరణ కందుకూరి వీరేశలింగంగారి జీవితచరిత్ర. ఆ పుస్తకంలో వారిసతీమణి రాజ్యలక్ష్మిగారు తమకార్యక్రమాలలో అండదండగా నిలిచేరని రాసేరు. ఒక అధ్యాయం ఆవిడకి అంకితం కూడా చేసినట్టు గుర్తు. ఇలా భార్యలని పొగడడం ఆత్మకథల్లో సర్వసాదారణం. నిజంగా అవతలివారి అభిప్రాయాలు కానీ ఆలోచనలు కానీ అక్కడ మనకి తెలీవు. వాటికోసం ఇతర వనరులు వెతుక్ోవాలి.

“వీరేశలింగము, యుగపురుషుడు” అన్న వ్యాససంకలనంలో. నార్ల వెంకటేశ్వరరావుగారు,

వీరేశలింగంగారు వితంతువివాహాలవంటి కార్యక్రమాలు చేపట్టినతరవాత, వాటికి నిరసిస్తూ ఊరివారు వారిని వెలి వేయగా, పనివారు కూడా పనులు మానివేస్తే, పంతులు గారు తీసుకొచ్చిన బాలవితంతువులు చిన్నపిల్లలు కనక వారిని అనునయించి, కావలసినవి అమర్చడం, ఇంటిపనీ, వంటపనీ, చెరువుకెళ్ళి నీళ్ళు తెచ్చుకోడంలాటి పనులతో అనేక బాధలు పడ్డారనీ, ఆపనులవల్ల కష్టంగా ఉందని చెప్తే ఆయన “చేయలేకపోతే పుట్టింటికి పొమ్మ”న్నారనీ రాసేరు.

కనుపర్తి వరలక్ష్మమ్మగారు రాజ్యలక్ష్మిగారిగురించి తమవ్యాసంలో కూడా ఇదే అభిప్రాయం వెలిబుచ్చేరు. “వీరీశలింగము పంతులుగారు  బాలవితంతువులను తెచ్చి ఇంటిలో ఉంచినతరవాత, ఆబాలికలకు జడలు వేయుట, వారు ఏడ్చిన ఓదార్చుటవంటివి రాజ్యలక్ష్మమ్మగారే చేసుకొనవలసి వచ్చేను. ఆకుటుంబమును వెలివేయుటచేత ఏటినుండి నీరు కూడా ఆమెయే తెచ్చుకొనవలసియుండెను. ఈ పనులన్నీ చేయుట కష్టముగా ఉన్నది అని ఆమె చెప్పిన, వీరేశలింగముగారు చేయలేకున్న పుట్టింటికి పొమ్మ”ని చెప్పారట. అక్షరాలా ఇవే మాటలు కావు కానీ నాకు గుర్తున్నంతవరకూ స్థూలంగా విషయం ఇదే.

ఆరోజుల్లో చిన్నతనంలోనే పెళ్లి కనక రాజ్యలక్ష్మమ్మగారికి కూడా అట్టే పెద్ద వయసు కాకపోవచ్చు. ఆ పరిస్థితుల్లో ఆమె మనఃపూర్వకంగా ఆయనకార్యక్రమాల్లో పాల్గొనడం జరిగిందా, ఆమెచేత చేయించుకోడం జరిగిందా అన్నది ఈనాడు మనకి కలిగే సందేహం.

మరొక కోణం కూడా మనం పరిశీలించాలి. వీరేశలింగంగారు నమ్మి ప్రచారం చేసిన సతీధర్మాలే ఆమె ఆచరించేరు. ఆకాలంలో అదే సర్వజనసమ్మతం అయిఉండవచ్చు. రాజ్యలక్ష్మమ్మగారు చేయలేకుండా ఉన్నాను అని ఆయనకి చెప్పేరు అని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఒక్కమాటలో – మనకి ఆఇంటి పరిస్థితులు పూర్తిగా తెలీవు కనక ఏ ఒక్క అభిప్రాయానికి రాలేం. కానీ ఆ జీవితచరిత్ర నూటికి నూరుపాళ్ళూ నిజం కాదని అనడానికి ఆస్కారం మాత్రం ఉంది.

ఆత్మకథలు చిత్తశుద్ధితో రాస్తే, తాను సాదించిన ఘనకార్యాలే కాక ఆనాటి సాంఘికపరిస్థితులూ, ఆలోచనాధోరణులు, ఆచారాలు వివరంగా రాస్తే దానికి విలువ ఉంటుంది.

000

వెనకటి టపాలో నేను రాసిన విషయాలు అప్పటికి సత్యం. ఆతరవాత అంటే గత పదేళ్ళలోనూ నాకు అనేక విషయాలు అనుభవమయేయి. కొత్త విషయాలు అవగాహన అయేయి. ఈ అవగాహనతో ప్రస్తుతం మారిని నా అభిప్రాయాలు ఇక్కడ చేర్చకపోతే పాఠకులదృష్టిలో ఆ అభిప్రాయాలే తుది నిర్ణయాలుగా స్థిరపడతాయి. ఈనాటి సాహిత్యక్షేత్రంలో జరుగుతున్న నాటకాలదృష్ట్యా నాఅభిప్రాయాలు తాజీకరిస్తే, మీరు ఆలోచించుకోడానికి అవకాశం ఉంటుందనుకుంటున్నాను.

మొదట తూలిక వెబ్‌సైటు తీసుకుంటాను. సభ ఏర్పాటు చేసినప్పుడు 200మందికి పైగా వచ్చినప్పుడు నాకు చాలా ఆనందం కలిగినమాట నిజమే. కాని తరవాతికాలంలో తెలిసినవిషయాలే నన్ను మరొకసారి గట్టిగా ఆలోచించుకునేలా చేసేయి. ప్రప్రథమంగా చెప్పవలసింది నాకు రచయితగా గుర్తింపు లేదు. నేను రాసినకథలు, వ్యాసాలు ఎవరికీ తెలీదు, తెలిసినా లెఖ్ఖ లేదు. అందరికీ తూలిక సైటుగురించి తెలుసు. వారికి కావలిసింది వారికథలకి ఇంగ్లీషు అనువాదాలు మాత్రమే. ఆకథలు తూలిక ధ్యేయానికి అనుగుణంగా ఉన్నాయా లేదా అన్న ప్రశ్న కూడా లేదు. నేను అనేకసార్లు తూలిక ధ్యేయం వివరిస్తూనే ఉన్నాను. మరోసారి చెప్తాను ఇప్పుడు అనవరసమే అయినా. నేను మనసంస్కృతి సంప్రదాయాలు విదేశీయులకి తెలియజేయడంకోసం మొదలు పెట్టేను. రెండోది – నేను అనువాదం చేసిన కథల రచయితలు తూలికకి ఏ ప్రాధాన్యమూ ఇవ్వకపోవడం. తమకథ మాలతి అనువాదం చేసింది, తూలికలో వచ్చింది అని చెప్పుకునే రచయిత్రులు కూడా సైటు ఎందుకు పెట్టేను అన్నవిషయం తమవ్యాసాల్లో ఉపన్యాసాల్లో ప్రస్తావించపోవడం.

 1. అమెరికానించి వచ్చేను కనక తమపుస్తకాలు అనువాదం చేసి నేనే అమెరికాలో ప్రచురించే ఏర్పాటు చెయ్యమనో, తాము అమెరికాకి రావడానికి ఏర్పాటు చేయమనో అడిగినవాళ్లు ఉన్నారు. ఆశ్చర్యం ఏమిటంటే వీరెవరూ నేను అనువాదం చేస్తే ప్రతిఫలం ఇస్తాం అనలేదు. అమెరికా వచ్చే ఏర్పాట్లు చేయమని అడిగడం ఇప్పుడు లేదులెండి. ఇప్పుడందరికీ అమెరికా అంటే పొరుగురే కదా.
 2. విడాకులుచ్చుకున్న ఆడమనిషి ఎలా ఉంటుందో చూదాం అని. ఈ అభిప్రాయం నేనింత ఖచ్చితంగా నిర్ద్వందంగా చెప్పడానికి కారణం సబాధ్యక్షులు మూడు సభాలయేక నన్ను కలుసుకున్నప్పుడు అడిగినప్రశ్నలు. అసలు అంతకు పూర్వమే వారిసంకలనంలో నాగురించి రాసిన నాలుగు ముక్కలు చూసినప్పుడే తెలిసింది ఆవిడకి నారచనావ్యాసంగంగురించి ఏమీ తెలీదని. మాయింట్లో ఉన్నంతసేపూ ఆవిడ ప్రశ్నలు – ఆయనెక్కడున్నారు, ఆయేనేం చేస్తున్నారు అనే. గొప్పచదువులు చదివి, నన్ను తగలేసేంత డిగ్రీలు తగిలించుకుని, సాంస్కృతిక, చైతన్య సంఘాలు నడుపుతూ ఇంత లేకిగా మాటాడగలరని అప్పుడే తెలిసింది. ఇలాటి మాటలు ఒక్క ఆడవాళ్ళకే పరిమితం కాదు. ఇలా మాటాడే మగవాళ్లు కూడా నాకు తటస్థపడ్డారు. అఁచేతే ఆతరవాత సభలకీ సన్మానాలకీ, శాలువలకీ, ఇంటర్వ్యూలకీ కూడా ఓ నమస్కారం పెట్టి ఊరుకున్నాను. ఇప్పుడు నేను ప్రాణం తెరిపిన పడింది. హాయిగా ఉన్నాను.

అనువాదాలవిషయంలో మరోమాట కూడా చెప్పాలి. అఅనువాదాలు చాలా తేలిక అనీ, స్వయంగా రాయలేనివారు మాత్రమే అనువాదాలు చేస్తారనీ అనుకోడం సరి కాదు. అనువాదకులకి రెండు భాషలలో ప్రావీణ్యమే కాక, రెండు సంస్కృతులగురించిన అవగాహన కూడా ఉండాలి. అలాటి అనువాదాలే రాణిస్తాయి. అలాగే అనువాదకులలో స్వీయరచనలు చేసినవారు, చేస్తున్నవారు ఉన్నారు. ఇలా రెండు ప్రక్రియలలోనూ కృషి చేస్తున్నవారినిగురించి మాటాడుతున్నప్పుడు సరిగా తెలీకపోతే వారిప్రస్తావన తేవడం ఉచితం కాదు. నన్ను అనువాదకురాలిగా మాత్రమే  గుర్తించడం అన్యాయం అనే నాఅబిప్రాయం. అంతకంటే నాపేరు పూర్తిగా వదిలేయడం నయం.

ఈనాడు తెలుగుసాహిత్యక్షేత్రంలో “వ్యవసాయానికి” చాలా విలువుంది. వెనకటి టపాలో చెప్పినట్టు నేను మొదట్నుంచీ పదిమందిలో తిరిగేరకం కాదు కనక ఈ వ్యవసాయానికి కూడా సిద్ధంగా లేను. రెండోది నేను అల్పసంతోషిని. చాలా చిన్న చిన్న విషయాలు నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. అంచేత ప్రస్తుతం నీలితెరమాటున ఉండి, virtual సమాజంలో మాత్రమే నామమాత్రంగా చేస్తున్న సాహిత్యకృషి చాలు. నాకు చాలా సుఖంగా ఉంది.

అంతే నాజీవితచరిత్ర. చెప్పేను కదా నాలుగు పేజీలని.

000

(జూలై 2, 2017)

వెనకటి టపా నాసాహిత్యదృక్పథమే నాజీవనదృక్పథం లింకు

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

4 thoughts on “నాజీవనదృక్పథం నాసాహిత్యదృక్పథమే మలిభాగం.”

 1. మీ అభిప్రాయాలకి ధన్యవాదాలు సుమన్ లతగారూ. అవును. పుంజీడులాటి పదాలు వాడడానికే నేను రాస్తున్నాను. మీరు అట్టే పొడిగించనందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 2. మాలతిగారికి ,మీ జీవిత ,సాహిత్య దృక్పథాలను వివరిస్తూ వ్రాసిన వ్యాసాలు రెండూ చదివేను.నేను కొన్ని రోజుల కిందటి ఒక బ్లాగు లో మీరు విదేహ రాజులా ……అని వ్రాసెను ,.నా ఉద్దేశం లో జ్ఞానంతో మీ అనుభవాలని కలగలుపుకుంటూ , మిమ్మలి నుండి మీరు వేరు చేసుకుని వ్రాస్తారని .దానికి కారణం మీరు ఈసారి చెప్పిన నిర్మోహమే కదా !నా అభిప్రాయం మీ మాటలతో సరిపోయిందని అనుకుంటున్నాను .అందుకే మీరు మీ పాత్రలకి తగినంత ఊపిరి పీల్చుకునే జాగా ఇవ్వగలుగు తున్నారు .ఈనాడు అందరూ ఉపయోగించే పదాలు —–ప్రైవసీ &బ్రీతింగ్ స్పేస్ పుష్కలంగా !
  ఇక అనువాదాలంటే ఈమధ్య కాలం వరకూ ద్వితీయ శ్రేణి గానే భావించేవారు కదా ! నేను హిందీ లో అందరూ వాడే మాట చెప్పనా ?”అనువాద్ కర్ డాలియే “!అదేదో ఇలా చిటికెలలో చే సి పడెయ్యొచ్చు అన్నట్లు !
  మీ కథన సౌందర్యం గురించి వేరే రాద్దామనుకున్నా కాని మా మిత్రురాలు పుట్టపర్తి నాగ పద్మినిగారు చెప్పేరు కదా !
  ఈ’ తాజీకరణ ,పుం జీడు’ లాటి మాటలు ఎందరు వాడుతున్నారు?మహా ఆనందం గా అనిపిస్తుంది .
  ఇంకా ఎక్కువయితే మరీ ౨౦ మార్కుల జవాబులా ………………..అనిపించదూ?

  మెచ్చుకోండి

 3. మాలతీ గారు ..చాలా నిజాయితీగా, వేదనతో వ్రాసారు మీరు . అసలు సాహిత్యరంగమే ఒక రాజకీయం అనే మాట ఎప్పుడో విన్నాను. నాకున్న కొద్దిపాటి అనుభవాల వల్ల అది నూరుశాతం నిజమని మరింతగా నమ్ముతున్నాను. కొందరికి పేరాశ. వారిని మోసే కొందరు వారి వారిప్రయోజనాలని ఆశించి ముఠా కూలీల్లా వారి రచనలని మోస్తూ ఉంటారు. అందరూ అలాగే ఉంటారని ఉండాలని ఆశిస్తారు. కొందరు రచయితలూ మీలా అజ్ఞాతంలో ఉండిపోతారు. తూలిక సైట్ గురించి విపులంగా ఇక్కడే చూసాను. నిర్మొహమాటంగా మీ దృక్పథం వెల్లడించినందుకు అభినందనలు. నమస్సులు .

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.