చిలిపి భాషలు

ఏెంటో మహారచయితల చమత్కారాలు అపురూపమయినట్టు మళ్ళీ మళ్ళీ చెప్పుకుంచారు కానీ ఏపేరు ప్రతిష్ఠలూ లేని అనామకులలో హాస్యానికి, చమత్కారబాషణలకీ  కొదువ లేదు. అలాటివారి కథలివి. ఈ వినోదం కూడా చెప్పుకు ఆనందంచవలసిందే అని నా అభిప్రాయం. ఇది అనామకులకు నివాళి..

అప్పుడెప్పుడో చెప్పేను కదా నాసంచారంలో ఒకాయన కనిపిస్తుంటారు. రెండవప్రపంచ మహాసంగ్రామంలో పాల్గొన్న veteran. ఈ పదానికి ఆంధ్రభారతిలోబహుదినాల ముసలిబంటు అని ఇచ్చేరు కానీ నాకు అది బాగులేదు. యుద్ధరంగంలో కానీ మరోరంగంలో కానీ ఆరితేరినవారిని వెటరన్ అంటారు. వయసుతో నిమిత్తం లేదు. అంచేత వెటరన్ అనే అనుకుందాం. ఇంతకీ చెప్పబోయే కథ 93ఏళ్ళ వెటరన్‌గురించి. ప్రతిరోజూ నన్ను హెచ్చరిస్తూ ఉంటారు జాగ్రత్తమ్మా, చూసుకోకోరు డ్రైవర్లు అంటూ. ఆయన ఏమి పని చేసేరో నాకు తెలుసు, ఆయనవయసు తెలుసు. నావయసు ఆయనకి తెలుసు. అంచేత పేరు కూడా తెలుసకోడం న్యాయమే అని తోచింది నాకు.

పేరేమిటని అడిగేను ఒకరోజు.

ఆయన చెప్పిరు కానీ నాకు అర్థం కాలేదు.

మళ్ళీ అడిగేను.

మళ్లీ అర్థం కాలేదు.

నేను వెర్రిమొహం వేసుకు చూస్తుంటే, ఆయన, “నేనిలాగే అందరికీ చె్ప్తాను. అప్పుడు ఆ ముఖం చూడాలి,” అని రెండు క్షణాలాగి, “తిరగేసి చెప్తున్నానమ్మా ,” అన్నాడు.

ఏం చెప్పను?

అతనే మళ్ళీ చెప్పేడు, ఈమారు తిరగేయడం, బోర్లేయడం చేయకుండా, “లారెన్స్. లారెన్స్ సూపర్డాల్ సూపర్మాన్ లాగ.”

సూపర్డాల్ అని వదిలేస్తే సరే, సూపర్మాన్‌లాగ అంటే నాకు  మళ్ళీ సందేహం. సూపర్ డాల్ నిజమేనా, అందులో కూడా ఏదైనా తికమక ఉందా అని. Superdahl అయితే నిజమే కావచ్చు. Super Doll అయితే అనుమానమే.

అదే అడిగేను.

“Superdoll like superman,” అనేసి తనదారిని నడక సాగించేడు. ఇంక అడగడం అనవసరం అనుకుని శలవు తీసుకుని నాదారిన నేను పోయేను.

లారెన్స్ సూపర్డాల్ అఁటే పెద్దపేరే కదా. ఆయన తిరగేసి చూసుకోడానికి ఎంత సేపు పట్టిందో కానీ ఒకసారి చూసుకున్నాక మరింక కష్టం లేదు. ఎన్నిమార్లు చెప్పినా అది మారదు కదా.

ఇది పదే పదే తలుచుకుని నవ్వుకున్నాను. ఆ హుషారులోనే నాపేరు తిరగేసి చూసుకున్నాను. నాపేరు మూడక్షరాలే కనక తేలికే. తెలుగులో అయితే తిలమా. ఇంగ్లీషయితే ఇహ్తలామ్ ఇంటిపేరు కూడా కలిపితే తిలమాలువోదడని. కొంచెం కష్టమే. ఇంగ్లీషులో ఉతోవో్డడన్ ఇహ్తలామ్. ఇది మరింత గాబరా పెట్టొచ్చు. మన తెలుగుపేర్లు అసలు ఎలా చెప్పినా, హా? అంటూ తెల్లవాడిముఖము మరింత తెల్లబడిపోవచ్చు. దిగ్దంతుల ప్రజ్డావర్థనత్ర్యంబకేశ్వరశాస్త్రి అని చెప్పి చూడండి. సరే ఇలాటి పేరులు అరుదు. బొగ్గుల విఘ్నపతి అన్నా చాలు వాళ్ళని తికమక పెట్టడానికి.

000

మొన్నామధ్య నాకు మరో ఆలోచన వచ్చింది. ఇంగ్లీషులో పొడక్షరాలవాడుక ఈమధ్య మరీ ఎక్కువయిపోయింది. OMG, LOL, IMHO – ఇవి నాకు అర్థం చేసుకోడానికి చాలాకాలమే పట్టింది. ఇప్పటికీ మూడో నాలుగో తప్ప అన్నీ తెలీవు. అంచేత ముఖపుస్తకంలో ఒక చిన్న వ్యాపకం పెట్టేను నామిత్రులకి.

ఇదేమిటో కనుక్కోమని.

బా మీ క ! 
నే ఏ రా మీ మ ఏ చె 
ఇం ఒ మ మా రా 
మ మ ఒ మ ఏ రా 
ఇ మీ క చె ఉం 
నా కా అ పో 
నే అ చ న కుం

అ అ అ…టా

ఈ కురుచ పదాలకి పూర్తి వాక్యాలు ఇవి –

బాగున్నాయి మీ కబుర్లు

నేను ఏదో రాస్తాను మీరు మరి ఏదో చెప్తారు

ఇంక ఒకరు మరొ మాట రాస్తారు

మళ్లీ మరి ఒకరు మరి ఏదో రాస్తారు

ఇలా మీ కబుర్లు చెప్తూ ఉండండి

నాకు కాలక్షేపం అయిపోతుంది

నేను అవి చదువుకు నవ్వుకుంటాను

అందరికీ అర్థం అయిందనుకుంటాను.

తెలిసింది కదూ. ఇంగ్లీషులో ప్రత్యయాలు విడిగా ఉంటాయి కానీ తెలుగులో ధాతువుతో మమేకం అయిపోతాయి కనక కుదరదు. అయితే సందర్భం చూచాయగా తెలియడంమూలంగానూ, అక్కడ అందరూ కుశాగ్రబుద్ధులు కనకనూ సరిగానే కనిపెట్టేశారు.

000

నాచిన్నప్పుడు క భాష అని ఒకటుండేది. ప్రతి అక్షరానికి ముందు క చేర్చి మాటాడ్డం. కమాకలకతికని కచూకసేకవా? అంటే ఏమిటో నేను చెప్పక్కర్లేదు కదా.

మరో పద్ధతి అచ్చులు అలాగే ఉంచి హల్లులు గల్లంతు చేసేయడం. కీము సెతులా అంటే మీకు తెలుసా అని.

మరి ఇవన్నీ నాకు నచ్చితే తెంగ్లీషు ఎందుకు నచ్చదు అంటే పై భాషలన్నిటిలోనూ పద్దతి ఉంది. తెంగ్లీషు ఎవరికి తోచినట్టు వారు రాస్తున్నారు. ఎక్కడ అన్న పదం ikkada, ekkada ekada — ఇలా. ఎలా చదవాలో సందర్బం తెలిస్తేనే సరిగా చెప్పుకోగలం. Transliteration అని ఒక పద్ధతి ఉంది కానీ అది పద్ధతిగా పాటించేవారు నాకు తెలిసి నలుగురు కూడా లేరు.

000

(జులై 12, 2017)

 

 

 

 

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

4 thoughts on “చిలిపి భాషలు”

  1. నిజమే! హాస్యం ప్రముఖులకే కాదు ప్రతి మనిషి జీవితం లో అంతర్భాగం…..భాషతో బోలెడన్ని తిక మకలు చేయడం వికటకవి గారినుంచి మనకి అలవాటే కదా మేకతోకకి మేక మేక తోకా మేక తోక మేక…

    మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు, తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరింపబడును.

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s