వానరహస్తం

శీర్షిక వివరణ

ఈకథ 1971లో జయశ్రీ పత్రికలో ప్రచురించారు. అప్పట్లో పాఠకులతో చర్చలు ఇప్పుడున్నట్టు లేవు కనక ఈ శీర్షికగురించి ఎవరూ నన్ను అడగనూ లేదు. నేను చెప్పనూ లేదు. ఇప్పుడు కనీసం కొందరు పాఠకులతో చర్చలు జరుగుతున్నాయి కనక, ముఖ్యంగా ముఖపుస్తకంలో. అంచేత నాకథల్లో వివరాలు అవుసరం అనుకున్నవి ఇప్పుడు ఇస్తున్నాను, కొంచెం ఆలస్యంగా (చిరునవ్వు).

వాటిలో ఒకటి వానరహస్తం శీర్షిక. ఈమధ్యనే లక్ష్మీదేవి దేశాయిగారు అడిగేరు ఈవిషయం. ఇదీ ఆ శీర్షికవెనక పూర్తి కథ.

ఆంధ్రాయూనివర్సిటీలో నేను అడుగెట్టేవేళకి కొండముది శ్రీరామచంద్రమూర్తిగారు ఆఖరేడు చదువుతున్నారు. నాకు రెండేళ్ళు సీనియరు. అప్పటికే ఆయనకథలు, నాటకాలు భారతిలో చూస్తున్నాను. వాటిలో ఒకటి వానరహస్తం అన్న నాటకం. భారతిలో ప్రచురించేరు. ఆనాటకానికి ఆధారం W.W. Jacobs 1902లో ప్రచురించిన Monkey’s Paw అన్న కథ. ఒక సాధువు ఇచ్చిన ఒక వానరహస్తం మూడు వరాలను ప్రసాదించగలదు ఇంటియజమానికి. అయితే ఆ వరాలనంటిపెట్టుకుని విపత్కర పరిణామాలు కూడా ఉంటాయి. మనం ఏమైనా కోరినప్పుడు పరిణామాలగురించి కూడా ఆలోచించాలన్న హెచ్చరిక ఉందిక్కడ. తానొకటి తలిచిన దైమొకటి తలుచు లాటదే ఇది కూడా. ఈ భావన మాత్రమే స్ఫూర్తి నాకథకి. ఇతరత్రా నాకథ పూర్తిగా భిన్నం.

000

వానరహస్తం కథ

 

చేసినతప్పు నలుగురిముందూ ఒప్పుకోకపోయినా తప్పు చేసేనని తెలుసుకుని, దాన్ని దిద్దుకోడానికి నాచేతనైన ప్రయత్నం చేసి, చేసేనన్న సంతృప్తితో హాయిగా నిద్రపోయేను ఆరాత్రి. కన్నుమూసి తెరిచేసరికి ఎనిమిది గంటలైంది. కరెంటు పోయిందేమో భక్తిరంజని వినిపించలేదు. వంటింట్లోంచి ఎవర్నో ఉద్దేశించి అమ్మ చేస్తున్న పుణ్యావాచనాలు అస్పష్టంగా వినిపిస్తున్నాయి. దుప్పటి ఒపక్కకి తన్నేసి హుషారుగా లేచేను. టూత్ బ్రష్ అందుకోబోతుంటే బల్లమీద లైటుపక్కనే పదిరూపాయల నోట్లు బొత్తి కనిపించింది. అట్టే దానివేపు చూస్తుంటే, “లెక్క పెట్టుకో. సరీఘ్ఘా ఇరవైఅయిదుంటాయి,” అన్నట్టనిపించింది. నిన్ననే బాంకులోంచి తీసుకుని ఆ నోట్లు అలాగే తీసుకొచ్చి అమ్మకిచ్చేను. అమ్మ ఆ డబ్బు తీసుకోడం నాకు బాగా జ్ఞాపకం ఉంది.

“… అవునే వెధవ ఒళ్ళు కొవ్వెక్కి ఉన్నాడు. వాళ్లూ వీళ్ళూ తిన్నప్లేట్లలో మిగిలిన ఎంగిలిమెతుకులు తింటూ రోడ్డంట తిరుగుతున్న వెధవని తీసుకొచ్చి రెండు అక్షరపుముక్కలు చెప్పించి, నిక్షేపంలాంటి నౌకరీ చేసుకోరా అని పంపించినందుకు ..” అమ్మమాటలు ఈమాటు స్పష్టంగా తెలుస్తున్నాయి.

అమ్మ మాటాడుతున్నది పనిమనిషి నూకాల్తో.

ఆశీర్వదిస్తున్నది దానికొడుకు ముత్తయ్యని.

“ఏమిటమ్మా?” అన్నాను వంటింటిగుమ్మంలో నిలబడి.

“చూడరా వాడికావరం. వేలెడంత వెధవగా ఉన్నప్పుడు సుందరికి స్కూలికి కాఫీ తీసుకెళ్ళమని మనం కదూ పని నేర్పింది ..”

నాకు తెలీదు. నాచదువంతా తాతగారింట్లో సాగింది.

మళ్ళీ ఆమధ్య ఎక్కడో కాకాహోటల్లో తిని తిరుగుతున్నాడని ఈ ముండ నెత్తీ నోరూ బాదుకుంటే మళ్ళీ వాడిని పిలిచి స్కూల్లో చేరమని డబ్బులిచ్చి పంపించేను కదా ..”

నాకు తెలీదు.

“వాడు ఫోర్తుఫారంకొచ్చేసరికి నాకు పూజకి నాలుగు పువ్వులు కోసుకురావడం నామోషీ అయిపోయింది. తోటిపిల్లలు వేళాకోళం చేస్తారు, నేనలాటి పన్లు చెయ్యను అన్నాడు వెధవ.”

కాబోలు.

“ఇప్పుడు ఉద్యోగంలో పోనీ గదా అని సాయం చేయబోతే, ‘ఆ డబ్బు ఆబాబుకే ఇచ్చీ, నా తప్పు నేను కాసుకోగల్ను,’ అన్నాట్ట. తప్పు చేయందే నేనెందుకు డబ్బు కట్టాలని లా పాయింట్లు తీస్తున్నాట్ట నీతిమాలినవెధవ.”

నాకు కడుపులో దేవినట్టయింది.

“వాడికి చెప్పు నన్నోమారు కలుసుకోమని,” అన్నాను ఎందుకో నాకే తెలీకుండా.

నాకు వాణ్ణి మెచ్చుకోవాలనిపిస్తోంది. తక్కువజాతివాడు వాడు కాదు. నేనే అని నా అంతరాత్మ ప్రబోధిస్తోంది.

“ఎందుకూ? నువ్వు చెప్తే మాత్రం వాడు వింటాడా? ఆజాత్తీరే అంత. నాలుగు వేళ్ళూ నోట్లోకెళ్లేసరికి కళ్ళు నెత్తికెక్కుతాయి. ఆ తీసుకెళ్ళినడబ్బు ఎక్కడ తగలెట్టేడో, మళ్ళీ డబ్బిచ్చి ఉద్యోగం నిలబెట్టుకోరా అంటే తీపి దిగలాగిందేం?”

నిన్నటివరకూ వాడు నిర్దోషేనని నాతో వాదించినఅమ్మ కూడా ఇవాళ ‘ఆ తీసుకెళ్ళిన జబ్బు’ అంటోంది!

పెరట్లోకెళ్ళి మొహం కడుక్కొచ్చి కాఫీగ్లాసుతో హాల్లో కూచుని ఆరోజు పేపరు చూస్తున్నాను. ఏముందీ .. హత్యలూ, దొంగతనాలూ, రైలు ప్రమాదాలూ, బస్సు ప్రమాదాలూ, మరణించినవారి సంఖ్య, గాయపడినవారి సంఖ్య … … ముత్తయ్య తప్పు చేశాడా? లేదా? ఒకవేళ చేసి ఉంటే, చేసినతప్పుకీ, వేసిన శిక్షకీ సమన్వయం కుదిరిందా? లేదా? లేదూ? కుదిరిందా?!!

000

మూడు రోజులకిందట డిస్పాచిసీటులో ఉన్న సావిత్రి వచ్చి, “సార్,” అంటూ ఏడ్చేసింది. ఆడపిల్లల్ని ఆఫీసుల్లో వేసుకుంటే ఇదో బాధ!

“ఏం తల్లీ! డబ్బువిషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలీదా? నీడబ్బయితే అంత సాదాగా రెండు వందలరూపాయలు బల్లమీద పెట్టేసి చక్కర్లు కొడతావా?”

“అది కాదు సార్. …”

“ఏది కాదు? నువ్వు డబ్బు బల్లమీద పెట్టలేదా?”

“అది కాదు సార్. …”

“లేదూ?”

“పెట్టేనండీ.”

“మరి?”

“బ్రాంచిఆఫీసు ముత్తయ్య అప్పుడే వచ్చేడండీ. ట్రెజరీకి పంపడానికి ఇక్కడ ప్యూనెవరూ లేరు. ముత్తయ్య అటే వెళ్తాడు కదా అని …”

ఈ కథంతా మీ సూపరెంటెండెంటు చెప్పేడమ్మా!

“ అని ముత్తయ్యచేతికిచ్చేనండీ.”

“చేతికిచ్చేవా?” సూటిగా మొహంలోకి చూస్తూ ప్రశ్నించేను.

“ఉహు. అంటే చేతికివ్వలేదండీ. నువ్వు వెళ్ళేటప్పుడు ఈ ఫారమూ, డబ్బూ తీసుకెళ్ళి ట్రెజరీలో కట్టెయ్ అని చెప్పేనండీ.”

“చెప్పడానికీ, చేతిలో పెట్టడానికీ నీ పరిభాషలో బేధం లేదేమిటి?” అన్నాను. ఆ అనడంలో నామనసులో లేని అభిప్రాయాలు స్ఫురించేయి. సావిత్రికళ్ళు ఆశతో మెరిశాయి.

సావిత్రికళ్ళు ఆశతో మెరిశాయి.

“క్షమించండి సార్.”

“క్షమిస్తానమ్మా. అది చాలా సులభం కూడాను. నా అంతరాత్మ ప్రబోధం కూడా అలాగే ఉంది. కానీ ఆఫీసుడబ్బు అలా ఎక్కడ పడితే అక్కడ మాయమవుతుంటే ఆడిటర్లూ, మేనేజిమెంటూ కూడా సంతోషించరమ్మా.”

“సార్, మీరే దిక్కు సార్. ఇంట్లో పరిస్థితులు మీక్కూడా తెలుసు కదా సార్.”

అవును. విన్నాను. పూటకి ఎనిమిది కంచాలు లేస్తాయి. నెలసరి ఆదాయం ఈపిల్లకొచ్చే నూటడెబ్భై మాత్రమే.

“ఇప్పటికే చాలా అప్పులున్నాయండీ. మా పెద్దతమ్ముడిచదువు కూడా మానిపించేశాం.”

“ఊఁ,” అన్నాను తల ఫైళ్ళలో దూర్చేస్తూ.

“మరి అంత అజాగ్రత్త అయితే ఎలా ఉద్యోగంలో?”

“అజాగ్రత్త కాదండీ. చిన్నతమ్ముడు సైకిలుకింద పడ్డాడని ఎవరో చెబితే, తొందరతొందరగా వెళ్ళిపోయేనండీ.”

“డబ్బు బల్లమీద పారేసి …”

“ముత్తయ్యతో చెప్పేనండీ.”

“సరే. నీపని చూసుకో,” అన్నాను.

అంత సంసారం ఈదుతున్న ఆడపిల్ల ఉద్యోగం నిలపమని ప్రాధేయపడుతోంది. పోనీ ఆడబ్బు నేనే ఇచ్చి, ఆఫీసులో జమ చేయించేద్దాం అంటే – ఆ అమ్మాయి మొదట మిసప్రోప్రియేట్ చేసినట్టు ఒప్పుకోవాలి. బ్లాక్ మార్క్. ప్రమోషను రావలసినపిల్ల, కుటుంబాన్నాదుకుంటున్న పిల్ల.

సాయంత్రం మళ్ళీ కనిపించింది.

మర్నాడు కనిపించమన్నాను.

మర్నాడు ఆఫీసుకెళ్ళగానే మళ్ళీ కనిపించింది.

ఆపద్బాంధవా! ఏం చెయ్యను? ఆ పిల్లకేం చెప్పను?

“ఎలాగైనా నన్ను ఈచిక్కులోంచి బయటపడేయండి సార్, మీకు నా కుటుంబం అంతా ఆజన్మాంతం కృతజ్ఞులమై ఉంటాం.”

ఆ కళ్ళు! వాటినిండా నీళ్ళు!

000

అప్పుడే చెప్పేను? సరిగ్గా గుర్తు రావడంలేదు. “అదే రాసియ్యి,” అన్నట్టు జ్ఞాపకం. ఏది వ్రాసి ఇస్తున్నావో? ముత్తయ్యపేరు నేనే సూచించేనా? ఆ అమ్మాయి అంటే నేను తలూపేనా? ఉహుఁ. ఏమైందో సరిగ్గా గుర్తు రావడంలేదు. అంతకుముందు బ్రాంచి మేనేజరు వచ్చి, కొత్తగా ఉద్యోగంలో చేరిన ముత్తయ్యగురించి – పని సరిగా చెయ్యడంలేదనీ, పొగరుబోతనీ, నమ్మకస్తుడు కాడనీ, ఎక్కడికి పంపినా ఆపూటంతా ఎగనామం పెడతాడనీ .. ఏవేవో చెప్పేడు. … ఇవన్నీ నేను సావిత్రితో ఎందుకు చర్చించేనో జ్ఞాపకం రావడంలేదు. సావిత్రికి ఇవన్నీ చెప్పవలసిని అవసరం లేదు. అయినా చెప్పేను.

“ఆ డబ్బు ముత్తయ్య తీసుకుని, తీసుకోలేదని బుకాయించడానిక అవకాశం ఉంది కదండీ,” అంది సావిత్రి.

ఆ పిల్లమొహం సుదూరంలో లైట్‌హౌసు కనిపించిన కళాసీమొహంలా వెలిగింది.

“కావచ్చు. ముత్తయ్యలాటివాళ్ళు మరో తొంభైమంది కూడా వచ్చి ఉండొచ్చు నీసీటు దగ్గిరికి,” అన్నాను. ఆ అనడంలో హెచ్చరిక లేదు. స్లిపరీగ్రౌండులో అడుగెట్టేనని అప్పుడు అనుకోలేదు.

“కానీ ముత్తయ్యకి ప్రత్యేకంగా చెప్పేనండీ. చలాన్ ఫారం మడిచి అందులో డబ్బు పెట్టి బల్లమీద పెడుతున్నానని.”

సావిత్రి ఎక్కడికి నడిపిస్తోందో తెలుస్తూనే ఉంది.

“జరిగింది జరిగినట్టు రాసియ్యి. తరవాత చూస్తాను,” అన్నాను. నేను సావిత్రికి చెప్పింది అంతే అనుకుంటాను. నాకు అలాగే జ్ఞాపకం.

సావిత్రి మాత్రం ‘తాను ఆ డబ్బూ, చలాన్ ఫారమూ ముత్తయ్యచేతికిచ్చినట్టు, అలా ఇచ్చినందువల్ల తనబాధ్యత, విధినిర్వహణవిషయంలో ఏమీ లోపం లేనట్టూ రాసి ఇచ్చింది. ఆ కాయితమ్మీద నేను సంతకం పెట్టేను. దానిమీద సూపరెంటెండెంటుకి నోటు రాసేను. ఆ నోటుమీద సంతకం పెట్టేను.

ఆ సాయంత్రం ఇంటికొచ్చేసరికి, “సంపేసినాడు బాబో,” అంటూ నూకాలు నాకాళ్ళు పట్టుకుంది.

“ఏమిటయిందమ్మా?” అన్నాను చిరాకు పడుతూ.

అమ్మ చెప్పింది, “దానికొడుకు చెంగల్రావుపేటలో అదేదో ఆఫీసులో పని చేస్తున్నాడు కదా. అదెవరో అమ్మాయి రెండొందల్రూపాయలు పారేసుకుంటే, అది వీడిమీదకి తోసేసి, ఆడబ్బు తెచ్చి కట్టమంటున్నారుట.”

చచ్చేను ఫో. జగద్రక్షకా! నన్ను నేనెలా కాపాడుకోనిప్పుడు?

“కల్లూ, వొల్లూ తిప్పుకుంటా కబుర్లు సెప్పే ఆడకూతురనని ఆయమ్మనొగ్గేసి, ఆ ఆపీసరుబాబు నాకొడుకు పొట్ట కొట్టీసినాడు,” అంటూ శోకాలు పెట్టింది నూకాలు.

“‌సరేలే. నువ్వింటికి పో. నేంతరవాత చూస్తాను,” అన్నాను.

000

ఆ రాత్రి అమ్మ చాలాసేపు రికమెండు చేసింది వాడికేసు. వాళ్ళబతుక్కి వాళ్ళు రెండు వందలెక్కడ తేగల్రంది.  కుర్రవెధవ, ఇంతప్పట్నుంచీ మనకళ్ళముందు పెరిగేడు కదా అంది. వాడసలు డబ్బు తియ్యలేదుట, వాడు అలాంటివాడు కాదుట.

ఆఖరికి అన్నాను, “లేదమ్మా. వాడి ఆఫీసరు చెప్పేడు ఆఫీసులో పని సరిగ్గా చెయ్యడుట. ఎవరన్నా లక్ష్యం లేదుట,” అని.

“అయితే, అందుకని, చెయ్యని నేరాలు వాడినెత్తిన రుద్దుతారుట్రా? తప్పొకటీ, శిక్షొకటీనా?”

ఏం సమాధానం చెప్పను?

అందుకే, నిన్న సాయంత్రం ఆ డబ్బు తెచ్చి, అమ్మకిచ్చి, “ముందు ఈ డబ్బు ట్రెజరీలో కట్టీమను. తరవాత చూస్తాను,” అన్నాను. అలా అన్నప్పుడు వాడిఉద్యోగానికి మాత్రం ఏ ముప్పూ రాకుండా చూడాలనే అనుకున్నాను. ఆ పని చాలా సుళువు అని కూడా అనుకున్నాను. నా అంతరాత్మ అలాగే ప్రబోధించింది కూడాను. నిశ్చింతగా నిద్రపోయేను.

తెల్లార్తూనే తెలిసినవిషయం – వాడు ఆ డబ్బు తిరగ్గొట్టేడు. దానింతటికీ వెనకనున్న ఆఫీసరుబాబుని నేనేనన్న సంగతి అమ్మా, నూకాలూ పోల్చుకోలేదు కానీ వాడికి తెలుసు.

“ఇదన్నేయం. నానెందుక్కట్టాల ఆడబ్బు? ఆయమ్మ నాకీయనేదు. నాకేటీ తెలవదు. జెయిలుకయినా పోతాను గానీ నాను చైని తప్పు నానెందుకొప్పుకోవాల?” అన్నాడుట.

“వాడిపొగరెలా ఉందో చూడు,” అంది అమ్మ, “బాగుపడే లక్షణాల్లేవు. అడుక్కుతినిపోతాళ్ళే.”

వాడికి బాగుపడేలక్షణాలు లేవని కాదు నాబాధ. వాణ్ణి బాగుచేసే లక్షణం నాకు లేకపోయిందే అన్నదే నాచింత.

000

(జయశ్రీ 1971 సంక్రాంతి ప్రత్యేకసంచికలో ప్రచురితం.)

(ఆగస్ట్ 1, 2017)

 

 

 

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

8 thoughts on “వానరహస్తం”

 1. నాబ్లాగులో చర్చకి ఆస్కారం ఉంది. నా కథకో వ్యాసానికో పరిమితం చేయమని మాత్రమే ఆడిగేను. అర్థం కానప్పుడు కూడా ఫలానాఅంశం స్పష్టంగా లేదని అడగవచ్చు. అది కూడా చర్చే. అవును. ముత్తయ్య ప్రత్యెకమైన కుర్రవాడు. కిందితరగతి వ్యక్తులలలో ఆత్మగౌరవం ఉంటుందని చిత్రించానికి ప్రయత్నించేను.
  నేను పరిచయం చేసిన కథలు మీకు నచ్చినందుకు సంతోషం. మీరు చెప్పండి నాకథల్లో ఏకథమీద మరింత వివరంగా చెప్పాలో. తప్పకుండా చర్చించుకుందాం. నాకథలు కాక వేరేవారికథలయితే అవి నాకు అందుబాటులో ఉండాలి. నా అబిరుచులకి తగ్గట్టుం ఉండాలి.

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 2. పాఠకులకి అర్ధం అయితే చర్చకి వస్తారు కానీ ఎటూ తేల్చుకోలేనపుడు చర్చకి రాలేరు. అందులోనూ మీ బ్లాగులో చర్చలకి ఆస్కారమే లేదు కదా ? పొగరుబోతు ముత్తయ్యనే నేను సమర్ధిస్తాను. మీరు పరిచయం చేసిన కధలే చదువుతున్నాను. మరి కొన్ని ప్రచురించండి. ఈ కధ బాగుంది.

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 3. నాకూ రా.వి .శాస్త్రి గారి క్రిస్పీనెస్ (ఇంకో తెలుగు మాట గుర్తు రాక వాడేను) కనిపించింది ముత్తయ్య లని ఈరోజులలో బతకనిస్తున్నారా ?అని సందేహము !
  సంభాషణలతో కే జి హెచ్ ,ఏవిన్ కాలేజి .కలెక్టర్ ఆఫీస్ ………………….13 నెంబరు బస్సులో మళ్ళీ ప్రయాణం చేసిన అనుభూతి .
  వానర హస్తం అన్న ప్రయోగం కొత్తది తెలిసింది .ధన్యవాదాలు .ఇంగ్లీష్ లో నుడికారం గా వాడే సందర్భాలు నాకు తెలియదు .డా.సుమన్ లత రుద్రావఝల.

  మెచ్చుకోండి

 4. మీరు అనేకవ్యాపకాలమధ్య నాకథలు చదువుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది వనజగారు. ఇప్పుడు అని కాదు కానీ వేరే ఎవరైనా రాసి ఉంటే చాలా చర్చ జరిగిఉండేదనే నాకు అనిపిస్తుంది. ముత్తయ్యపాత్ర నాక్కూడా చాలా నచ్చినపాత్ర. మరొకసారి ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 5. చాలా బాగుంది మాలతీ గారు. ఇప్పుడైతే ఈ కథకి బోలెడన్ని చర్చలు చేసేవారు. ముత్తయ్య పాత్ర నచ్చింది. అమ్మో ! సావిత్రి అనిపించింది ఆమె.

  మెచ్చుకోండి

 6. నైతిక విలువలు ఓ వర్గం సొత్తు కాదని మీ దైన స్టైల్ లో బాగా చెప్పారు. నాకు రా.వి.శాస్త్రి గారు గుర్తుకొచ్చారు.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.