జాలి ఒక విశేషభోగము

జాలి విశేషభోగము (luxury) అని ఎందుకన్నానో తరవాత చెప్తాను. అసలు జాలి చూపడానికి కారణం కష్టాలు కదా.

ఎవరికైనా కష్టం వచ్చిందంటే అయ్యో అనిపిస్తుంది. మొదట కష్టం అంటే ఏమిటో చూదాం. ఎవరైనా కాలు జారి పడితే చూసినవాళ్లు నవ్వుతారన్నది సర్వసాధారణంగా చెప్పుకునే హాస్యకత. అలాగే నువ్వు పడితే హాస్యం, నేను పడితే అవుమానం అని కూడా. ఈమధ్య కొట్టడాలూ తిట్టడాలూ సినిమాల్లో టీవీలో గొప్ప హాస్యం అయిపోయింది. అయితే ఇక్కడ చిన్న కిటుకు ఏమిటింటే నన్ను ఎవరైనా తిడితే ఆమాట నేను మీకు చెప్తే మీకు నామీద జాలి, నన్ను తిట్టినవాడిమీద కోపం వస్తాయి. తత్క్షణస్పందన అదీ. కళకీ జీవితానికీ మధ్యగల కనీ కనిపించని గీత అది.

అలాగే కత్తులు మింగేవాళ్ళూ, తోలుపటకాతో చర్మం ఊడిపోయేవరకూ కొట్టుకునేవాళ్లూ, పులినోట్లో తల పెట్టేవాళ్ళూ – వీళ్లందరూ అవి చేసేది మన నినోదంకోసమే. ఆవి చూసి ఆనందిస్తాం, ఆశ్చర్యపోతాం, మెచ్చుకుంటాం. ఇవి కెమెరా ట్రిక్కులు కావు. నిజంగా వాళ్లు అలా తమని తాము హింసించుకుంటున్నారు. వారు అలా చేయడంలో ఒకరకమైన తెగువ, సాహసం, శారీరక దారుఢ్యం ఉన్నాయి. అవి నువ్వు, నేనూ ప్రదర్శంచగలవి కావు. అందుకూ మెచ్చుకుంటాం.

కానీ నువ్వో నేనో మరొకరిని అలా అక్షరాలా తాట ఒలిచేస్తే ఎవరూ ఆనందించరుు. అడ్డం వస్తారు. మనని కోప్పడతారు. దెబ్బలు తిన్నవాడిమీద జాలి పడతారు.

ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఏ సమయంలోనూ మనం తీరిగ్గా ఇప్పుడు ఆనందించాలా, జాలి పడాలా, కోపగించుకోవాలా అని చర్చ పెట్టుకోం. ఈ స్పందనలన్నీ స్వతస్సిద్ధంగా యంత్రవతు జరిగిపోతాయి.

సూక్ష్మంగా ఒక్కమాటలో చెప్పమంటే మాత్రం ఎదటివారి కష్టాలు చూస్తే బాధేస్తుంది అంటారు. తమ కష్టాలు చెప్పుకోవచ్చు. తాత్కాలికంగా సానుభూతి ఆశించవచ్చు. కానీ అదే పనిగా అస్తమానం ఆమాటే తెస్తే చిరాకేస్తుంది.

ఆమధ్య ముఖపుస్తకంలో యథాలాపంగా చెయ్యి నొప్పి అన్నాను. అక్కడినుండి, ఒకావిడ నేను ఏ టపా పెట్టినా, “మీచెయ్యి ఎలా ఉందమ్మా?” అనే వ్యాఖ్య. మరేదో కారణంగా ఆవిడ నా జాబితాలోంచి తప్పుకున్నాjరు. దాంతో ఇద్దరి ప్రాణాలు తెరిపిన పడ్డాయి. ఇలాటి సందర్భాలలో అన్నమాట నాకు జాలి ఒక విశేషభోగము (luxury) అనిపిస్తుంది.

ఇప్పుడు మరి కొంచెం పరిశీలనగా చూదాం. ఈ ప్రశ్నలు చూడండి.

నిత్యజీవితంలో ఏది కష్టం? ఏది తాత్కాలిక కష్టం? ఏది ఆజన్మాంతం ఉండిపోయే కష్టం?

ఆకష్టం మీకు కలిగినప్పుడు ఏం చేస్తారు?

మరొకరికి కలిగినప్పుడు ఏమి చెప్తారు?

వీటికి నేను జవాబులు ఇవ్వను కానీ మీకు మీరు వేసుకుని మనస్సాక్షిగా ఆలోచించుకోండి. నాకు చెప్పఖ్ఖర్లేదు. మీకు నాపాయింటు అర్థమయితే చాలు.

చర్చపరంగా చూస్తే, ఉన్నవాడు పాలలోకి పంచదార లేదని ఏడిస్తే లేనివాడు గంజిలోకి ఉప్పు లేదని ఏడ్చాడని సామెత. తిండి లేకపోతే కష్టం. ఉండడానికి ఇల్లు లేకపోతే కష్టం. కట్ట బట్ట లేకపోతే కష్టం. కుటుంబం, స్నేహితులు ఎవరైనా మరణిస్తే కష్టం.

చనిపోయినట్టు నటించడం కూడా కష్టమే కొందరి దృష్టిలో. నిడుదవోలు వెంకటరావుగారు చిన్నతనంలో హరిశ్చంద్రనాటకంలో లోహితాస్యుడివేషం వేయబోతే వారి తల్లి అంగీకరించలేదుట చనిపోయినపాత్ర అని. మరణం అన్నపదం అనడం వినడం కూడా అమంగళం. అలాగే కారు ఉన్నవారికి ఒక్కరోజు కారు చెడిపోతే చాలా కష్టం. ఓపూట పనిమనిషో వంటమనిషో రాకపోతే, ఓరి బాబో ఇప్పుడు నాకేమి గతి అని దరువులేస్తూ పోస్టు పెడితే, పనిమనుషులూ, వంటమనుషులూ ఉన్నవాళ్ళకి అందులో హాస్యం కనిపిస్తుంది. నవ్వుతారు. ఆ సౌకర్యాలు (కొందరికి సౌభాగ్యం) లేనివారికి, నిత్యం ఆ పనులు స్వయంగా చేసుకునేవారికి అందులో హాస్యం కనిపించదు.

ఒకసారి ఒక చిన్న షాపులో ఏదో కొని, డబ్బే ఇచ్చేను చిన్నమొత్తం కనక. చిల్లర చూస్తే నాదగ్గరున్న పెన్నీలతో సహా. లెక్క బెడుతూ, పర్సు ఊడ్చి ఆఖరి పెన్నీ ఇచ్చేస్తున్నా అన్నాను హాస్యానికే. కానీ ఆ అమ్మాయికి అది హాస్యంగా తోచలేదు. ఆరోజు ఆ అమ్మాయి నావేపు చూసిన జాలిచూపు ఇప్పటికీ, ముప్ఫై ఏళ్ళతరవాత కూడా మరిచిపోలేను. అదే నేను కాక మరో మెర్సిడెస్ బెంజ్ కార్లోంచి దిగిన భాగ్యవతి అయితే ఆ అమ్మాయి తప్పకుండా భలే జోకు అని నవ్వేదేమో. నవ్వుతుందనే నా నమ్మకం.

పి. శ్రీదేవిగారి కథ వాళ్ళు పాడిన భూపాలరాగంలో ఒక సన్నివేశం ఉంది. వివాహితుడని తెలిసి ఒక ధనవంతురాలు పెళ్ళి చేసుకోడానికి సిద్ధపడుతుంది. రహస్యాలేమీ లేవు. భార్యకి కూడా తెలుసు. ఆమెగురించి అతను అంటాడు, “ఆ రెండోభార్య డబ్బు వాడుకోడం ఆమెకి బాధ లేదు. కానీ ఇరుగూపొరుగూతో మాత్రం “నాఖర్మ ఇలా కాలింది, ఏం చేయను, అంటూ రాగాలు తీస్తుంది” అంటాడు.మనకి ఆ మొదటిభార్య అంటే కలుగగల జాలిని మార్చేస సందర్భం అది.   ఇది నా అభిప్రాయం కాదు. కథలో అలా ఆవిష్కరించడం జరిగింది.

ఇది వాస్తవంజీవితంలో మీకు తటస్థపడడితే, మీస్పందన ఎలా ఉంటుంది? మీకు మొదటిభార్యమీద సానుభూతి కలుగుతుందా, భర్త మాట నమ్మి ఆమె నటిస్తోంది అనుకుంటారా.

ఇది నేను నిర్ణయించలేను. ఎందుకంటే ఎవరికి వారు తమ అనుభవాలు, వివేచనను బట్టి స్పందిస్తారు కనక.

అలాటిదే మరో కథ. ఈమధ్య నాలుగైదు నెలలుగా ఇల్లు మారుదాం అనుకుంటున్నాను. సొంతఇళ్ళవాళ్ళకి ఒకటే ఇల్లు కానీ అద్దెవాళ్ళకి అన్నీ ఇళ్లే అంటుంటాను, హాస్యానికే.

“ఇక్కడ అద్దెలు ఆకాశవీధుల్లో విహరిస్తున్నాయి. నీకు మళ్లీ ఇంత తక్కువలో దొరకదు.”

“సరే. చూదాం.”

ఆ మద్యాహ్నం ఇంటివాడిదగ్గర్నుంచి తాఖీదు వచ్చింది అద్దె పెంచినట్టు. దాంతో నాకు ఇల్లు మారిన అనుభూతి వచ్చేసింది, ఇంక ఇల్లు మారఖ్ఖర్లేదు అనిపిస్తోంది.

బహుశా ఇది  మీకు నవ్వు తెప్పించేది కాకపోవచ్చు. నామటుకు నేను నవ్వుకున్నాను. ఇది బాధాకరమైన విషయాన్ని హాస్యంగా మార్చడంలాంటిదే.

ఏదో ఒక సమయంలో ఏదో ఒకటి బాధించడం జరగని జీవితాలు లేవు. వాటిని ఎవరు ఎలా సమన్వయపరుచుకుంటారు అన్నది ఆ యా వ్యక్తుల తత్వాలనుబట్టి ఉంటుంది. పైన శ్రీదేవిగారి కథలో చెప్పినట్టు కొందరు కేవలం ఎదటివారిసానుభూతికోసం అదే విషయం పదే పదే ప్రస్తావిస్తారు. అలాటివారంటే నాకు సానుభూతి లేదు. వారిని నేను పట్టించుకోను. కొందరికి తమబాధలు మాటాడడం ఇష్టం ఉండదు. ఇంగ్లీషు వ్యావహారికంలో చెప్పాలంటే, మనసుని చేతసంచీలా పట్టుకు తిరగడంలాటిది (wearing your heart on your sleeve). నాదృష్టిలో అది ఆత్మగౌరవం లేనివారు చేసేపని.

నేను ఒకసారి ఒక సభకి వెళ్లేను. ఒక సందర్భంలో చక్రాలబండిలో తిరిగేవారికి కొన్ని ఇళ్లలో కలిగే అసౌకర్యాలగురించి మాటాడుతున్నాడు వక్త. ఎవరైనా సాయం కావాలంటే నేను చేస్తానంటూ రంగంమీదకి వెళ్లేను. చక్రాలబండిలో కూర్చున్నాను. తోసుకుంటూ రెండు గదులు తిరిగేను. అక్కడ ప్రదర్శించడానికి ప్రయత్నించింది – చక్రాలబండిలో కూర్చున్నవారికి వంటింట్లో పైవరసలో ఉన్న అరలు అందవు. గుమ్మాలు తగినంత వెడల్పు లేకపోతే గుమ్మం దాటడం కష్టం. అలాగే బాత్రూములూను. ఇవన్నీ స్థూలంగా తెలుస్తాయి.

కానీ ఈ ప్రయోగం నాకేమంత నచ్చలేదు. నాఆలోచనలు వేరు. ఉదాహరణకి, నేను ఆ బండిలో ఉన్నది తాత్కాలికం. మరోక్షణంలో లేచి నిలబడగలను. అంచేత నిజంగా ఆజన్మాంతం ఆబండికే అంకితమైపోయిన మనిషి మనసు ఎలా ఉంటుందో నాకు తెలీదు. వాటిని అధిగమించి తమ వర్తనలో ఎలాటి సుళువులు ఏర్పరుచుకున్నారో నాకు తెలీదు. తమని తాము ఎలా సమాదానపరుచుకున్నారో మనకి తెలీదు. ఆవ్యక్తిమీద జాలి చూపించేముందు మనం ఆలోచించవలసింది అదీ. జాలి ఒక విశేషభోగము అని అందుకే అన్నాను. అది అందుకునేవారికి సమ్మతం కాకపోవచ్చు అని జాలి చూపించేవారికి తెలీదు. నేను చూసినంతవరకూ వారికి కావలసిందిి మీ జాలి కాదు, ఒక మనిషిగా గుర్తింపు. ఇతరత్రా వారి జీవనసరళిని మనస్ఫూర్తిగా అంగీకరించడం.

 నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి. దెబ్బ తగలగానే కలిగిననొప్పి క్రమంగా అలవాటయిపోతుంది. అది ఆవ్యక్తిలో సుస్థిరమైన భాగం.

“నవ్వరాదు,” కథలో సందేశం అదే. నాబతుకు మీకొలమానాలకి అందకపోవచ్చు. కానీ నాకు నేను సరి చూచుకొని, నన్ను చూసి నవ్వడం నేర్చుకున్నాను. ఇది నేను ఏర్పరుచుకున్నతీరు. మీరు నాకోసం ఏడవవొద్దు  నాతోపాటు నవ్వడం నేర్చుకోండి. ఎందుకంటే నవ్వినా ఏడ్చినా రోజు గడిచిపోతుంది. ఆమాత్రందానికి ఏడుస్తూ ఎందుకు గడపడం?”

నవ్వరాదు కథకి లింకు

 

నేను వేరని అనేకసార్లు చెప్పేను కదా. నాకు ఇలాటి ఆలోచనలే వస్తాయి మరి.

000

(ఆగస్ట్ 5, 2017)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

2 thoughts on “జాలి ఒక విశేషభోగము”

  1. సంతోషం లలిత గారూ. ఈమద్య జాలి చూపడం నాగరీకం అయిపోయి అర్థం ఉన్నా లేకున్నా అతిశయోక్తులు పలకడం ఎక్కువయిపోయింది. మీస్పందనకి ధన్యవాదాలు.

    మెచ్చుకోండి

  2. నాకు ఈ పోస్ట్ భలే నచ్చిందండి – ఏది నచ్చిందో చెప్పాలంటే అన్ని లైన్లూ ఇక్కడ రాయాలి – అందుకని ఒక్క వాక్యంలో చెప్తాను – I feel “sympathetic resonance” with the content of this post 🙂

    మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.