మాతోటలో

మరో పాతకథ. అప్పుడే కొత్తగా కథలు రాయడం మొదలుపెట్టిన తొలి రోజుల్లో రాసింది. తెలుగు స్వతంత్రలో ప్రచురించడం జరిగింది. ఇది  ఇప్పటికీ చాలామందికి గుర్తుంది. 6, 7 ఏళ్ళక్రితం మునిపల్లె రాజుగారు ఏదో సభలో కలిసినప్పుడు మీరు నాకు గుర్తేనండి, మాతోటలో అవీ … అన్నారు. అదే నాకు ఒక గౌరవం అని భావించి మళ్ళీ ప్రచురిస్తున్నాను.

000

“ఇదుగో ఇదే ఆఖరు, మరి నీ ఇష్టం,” అంది అత్తయ్య అయిదోమారు మొక్క అందిస్తూ.

ఇదివరకు నాలుగు మొక్కలు ఆవిడచేత్తో ఇచ్చినవే అదే వరసక్రమంలో భూస్థాపితం చేసేశాం.

తగుమాత్రం బాధ పడ్డాం కూడాను అలా జరిగినందుకు. అంచేత వేసంగిలో ఏమైనా సరే దక్షిణగాలి మా సంపెంగమొక్కమీదుగా వీచాలి అని మేం గట్టిగా నిశ్చయించుకున్నాం. ఎందుకైనా మంచిదని మాబాబు మరొకమొక్క కూడా తెచ్చాడు. రెండూ కలిపి నాటాలి, ఒకవేళ ఒకటి చస్తే ఏది చచ్చిందో తెలీకుండా (రెండూ చస్తే తగువే లేదు.)

ఏదైనా ఇంకా తయారీలోనే వున్నప్పుడు చూడకూడదు అంటుంది మా అక్క.. అందుకే కాబోలు పెద్దవాళ్లు వంటిల్లు మొగవాడు చూడకూడదు అంటారు. ఏమైనా మా “తోటపని”లో నావంతు మటుకు సూపర్విజను. ఎప్పడైనా తోస్తే మాట సాయం చేస్తా. అంతే. గొప్పులు తవ్వడం, నీళ్లు పోయడం, పురుగు పట్టకుండా చూడడం, పట్టేక చూడడం – ఇవన్నీ అక్క వంతు. అసలు నిజానికి నాపనే కష్టం అని మా అమ్మ చెబుతూ వుంటుంది. మరి మా అక్కది కాయకష్టమూ, నాది తలతో పనీను. ఈ సందర్భంలో నేను బోలెడు కథలు చెప్పగలను. ఇప్పుడెందుకు గానీ …

మా ఇంట్లో  బొప్పాయిచెట్లు బ్రహ్మజెముడు డొంకల్లా పెరుగుతాయి మాకు ఇష్టంలేదు కనక.  జామిచెట్టూ, సన్నజాజి చచ్చినా పెంచలేకపోయాం. కారణం భూసారం అంటుంది మాఅమ్మ. మా అక్క హస్తమ్మీద “మాచెడ్డ నమ్మకం“ మాకు.

మొత్తంమీద సంపెంగచెట్టు బాలాప్రాయంలో బాలారిష్టాలు గడిచి “నూనూగు మీసముల నూత్న యౌవనం” ప్రవేశించేసరికి అయిదేళ్లు పట్టింది. మాపక్కింటి మామయ్యగారింట్లో కొత్తగా పుట్టిన చిన్నారిపాప అక్షరాభ్యాసం చేసుకుంది. హైస్కూల్లో అల్లీబిల్లీ తిరిగిన నేను యూనివర్సిటీ స్టూడెంటునయ్యాను. మా సంపెంగ మొగ్గ తొడగలేదు. అందరూ “తొడుగుతుంది, తొడుగుతుంది“ అన్నారు. స్వాతివానకి ముత్యపుచిప్పలు ఎదురు చూస్తాయంటారు. మేం మటుకు సంపెంగ మొగ్గకోసం పడ్డ వేదన అనుభవైకవేద్యం.

మేం అంటే మా ప్రియమైన సంపెంగికి దిక్పాలకులం అన్నమాట. మొక్కకి పశ్చిమాన సాయంత్రంవేళ డాబామీదా, అపరాహ్నం ఆ పక్కనే ఉన్న చిన్న కొట్టుగదిలోనూ నా స్థిరనివాసం. పోతే తూర్పుదిక్కున మా అప్పాయమ్మా, దక్షిణదిక్కున పక్కవాళ్ల అప్పాయమ్మా ఓ కన్ను వేసి వుంచారు. మొక్కకి ఉత్తరదిశన కొత్తగా అక్షరాభ్యాసం చేసుకున్న పాప సోల్ మోనార్కు. అటువేపు మేం ఎవ్వరం చూడరాదు అన్నది షరా.

మొక్క తాలూకు వేరు మట్టుకు మా అక్క సంరక్షణంలో సదా వృద్ధి పొందుతోంది.

రోజూ పొద్దున్నే చూసేదాన్ని  అందినకొమ్మనల్లా వంచి. ఎక్కడా కనుచూపుమేరలో – అదే ఆకొమ్మ చివుళ్లలో – మొగ్గలాటిది కనిపిస్తుందేమోనని. కనిపించేది కాదు. దేముడు బొత్తిగా లేడనిపించింది ఆఖరికి. కానీ, పసిపిల్లలు ప్రత్యక్ష దేముళ్లు అంటుంది మా అమ్మ. నిజమే కాబోలు. లేకపోతే డాబామీంచి నాకు కనిపించని మొగ్గ పక్కపెరట్లో ఆ పాపకెలా కనిపించింది? ఆరోజు మాయింట్లో పండుగ చేసుకున్నాం. అదే, మామొహాలు చూసినవాళ్లు అలా అనుకుంటారు.

చంద్రుడిలో మచ్చలాగ మాలో చిన్న సందేహం మెరిసింది. ఆ ఒంటరి మణిపూస ఏ ఒక్కరికి చెందాలి? అది చిటారి కొమ్మన గగనంలోకి దృష్టి సారించింది చూపరులని ఊరిస్తూ. అక్కది నిష్కామకర్మ. నాది “పుష్పవిలాపం” రచయిత మనసు. పాప మటుకు అది తన హక్కుభుక్తములుగా భావించింది. మిగిలిన ఇద్దరు దిక్పాలకులూ – మా అప్పాయమ్మా, పక్కింటి అప్పాయమ్మా – కొంచెం ధైర్యం తక్కువరకం వాళ్లు.

“తొలిపంట దేముడికివ్వాలి“ అంటుంది మామ్మ.

“ముందసలు అది పూర్తిగా పుయ్యనియ్యండి ముందు“ అంటుంది అమ్మ.

మేం దాన్ని పుయ్యవద్దంటే కదా!

అయిదోరోజు సాయంత్రానికి మొగ్గ విడే లక్షణాలు కనిపించేయి. మామనసులు కేరింతాలు కొట్టేయి.

“అయితే దాన్ని కొయ్యడం ఎలా” అన్నాను. పుష్పంమీద గోరానితే నా మనసు గిలగిల్లాడుతుంది అని ఇప్పటివరకూ ఎవరూ గ్రహించలేదు. కానీ ఏమైనా నా సందేహం ఓడు కాలేదు.

మర్నాడు తెల్లవారుఝామునే లేచి, స్నానాదికాలు ముగించి సంపెంగచెట్టుకింద సమావేశమయ్యాం. నేను మంచి పొడుగైన వెదురుకర్ర పందిరిలోంచి అమ్మ చూడకుండా లాగేశాను. పాప వాళ్లన్నయ్య పుస్తకాలడ్రాయరులోంచి చిన్నచాకు – చోరద్రవ్యమే – తీసుకొచ్చింది. మాబాబు దొనెకర్ర తయారు చేశాడు. ఆరున్నరా, ఏడయేసరికి పొలోమని చెట్టుమీద పడ్డాం అందరం. గగనమార్గాన గాలిలో కులాసాగా ఉయ్యాలలూగుతూ ఉంటే ఆమొగ్గని పట్టుకోడం మాకు తలకు మించిన పనయింది. సగం సగం విడుతూ నీరెండలో నిగనిగలాడుతూంటే నాకు నిజంగా పుష్పవిలాపం జ్ఞప్తి కొచ్చింది.

“నాది కూడా కవిహృదయమేమో“ అన్నాను సాలోచనగా, జాలిగా చూస్తూ.

అందరూ విరగబడి నవ్వేరు.

హమ్ అంటూ బాధగా మూలిగేను. అందుకే కదూ “అరసికాయ కవిత్వనివేదనం శిరసి మాలిఖ మాలిఖ” అని మొత్తుకున్నాడు ఆయనెవరో ..

“మమ్మల్నిలా నాశనం చేస్తే మీకేమిటి లాభం?“ అన్నాయి చాకుకి తగిలి రాలిన రెండు రేకులు.

“మీబాధ నాకర్థం అయిందిలే“ అన్నాను మూకగా వాటివేపు చూస్తూ.

మొత్తమ్మీద శ్రమపడి రేకులు రేకులుగా పువ్వంతా రాలగొట్టేం. నిజానికి ఈ కిరాతకృత్యంలో నేను మనసా పాల్గొనలేదు. అంతమాత్రంచేత పువ్వు రాలగొట్టిన కీర్తిలో నా పాలు నాకు రాకుండా పోలేదు.

మర్నాడు పొద్దున్నే పాప వచ్చింది. నాకింకా నిద్రమత్తు వదల్లేదు.

“అక్కల మూలు పూలు కాతేయి” అంది.

మూడు! గ్లోరియస్!

″ఎక్కడ?″ అన్నాను.

″మూలు కాతేయి అక్కల″ అంది చేతులు తిప్పుతూ.

″మరి మీ తపోతా తెత్తు పూతిందా?″ అన్నాను నవ్వుతూ.

″తపోతా తెత్తు పూత్తుందేమితి?″ అంది నన్ను నిలదీసి.

″అబ్బో చాలా తెలుసే″ అన్నాను అట్టే పెంచకుండా.

వారంరోజులు తిరిగేసరికి మా చంపకవృక్షం జత పువ్వులు అందించే స్థితికొచ్చింది. పంపకం నావంతు. బాగుండదని ముందురోజు మా అక్కకిచ్చేను. రెండోరోజు పాపకిచ్చాను. తరవాతి ఛాన్సు మామ్మది అంటే నిర్గుణస్వరూపుడయిన దేముడిది. వంటింట్లో దేముడిపట్టు వెనక సంసారం సాగిస్తున్న మూషికమహారాజుది. ఆ తరవాత అహం బ్రహ్మాస్మి.

ఆరెంజిరంగు చీరెమీద అద్దాలు కుట్టిన నల్లబ్లౌజు వేసుకున్నాను. నల్లని ముఖమల్ చెప్పులూ, కళ్లకి కాటుకా, తల్లో సంపెంగపూలు – ఒకటీ రెండూ కాదు నాలుగు పెట్టుకుని బస్సెక్కుతుంటే ఎంత గర్వంగా అనిపించిందనీ … .. అదే అంత గర్వం కూడదు. కాకపోతే ఏమని చెప్పను? కుంజరయూధము దోమ కుత్తుక సొచ్చితే ఎలాటి ఫీలింగులు కలిగేయో నాకు తెలీదు కానీ నా సంపెంగి పూలమీద ఒక్క అమ్మాయి అయినా కామెంటు చెయ్యకపోవడం నా ఆత్మగౌరవానికి గొడ్డలిపెట్టు. అంతకంటే ఘోరం డిపార్ట్‌మెంటులో ప్యూను అడగడం.

“మీ ఇంట్లో పూసేయాండీ?” అన్నాడు మొహం చింకిచేటంత చేసుకుని.

“ఊఁ” అన్నాను మామూలుగా.

“నాకు తెచ్చియ్యరండీ?” అన్నాడు మళ్లీ అవే హాసరేఖలు మొహంమీద మెరుస్తూ.

తృళ్లిపడ్డాను. హైరోడ్ క్రాపు పెట్టించుకున్న ఒకానొక మొగజీవికి సంపెంగిపూలెందుకూ?

“నువ్వేం చేస్తావు?” అన్నాను నవ్వుతూ.

“మా పిల్లకిస్తానండీ” అన్నాడు తెగ సిగ్గు పడిపోతూ.

వెయిటింగ్ రూంలో ఆడపిల్లలందరూ ఒక్కమారు గొల్లుమన్నారు. నేనింక అక్కడ వుండడం క్షేమం కాదని మెల్లిగా జారుకున్నాను పుస్తకాలు సర్దుకుని.

ఆ సాయంత్రం ఇంటికొచ్చేసరికి అక్కచేతిలో ఓ కార్డుముక్క కనిపించింది.

“రేపు పువ్వులు కోయ్యడానికి ఆర్డర్లు లేవుట.” అని పాప చెప్పింది. ఇది కొత్త అలవాటు మాయింట్లో.

“ఎందుకని?” అన్నాను కొంచెం ఆశ్చర్యపోతూ.

“మా ఫ్రెండు కలకత్తా వెళ్తోంది. స్టేషనులో కలుసుకోమని రాసింది” అంది కార్డుతో విసురుకుంటూ.

“దానికి పూలగుత్తీ వైజయంతీమాలా పట్టుకెళ్తావా?” అన్నాను హాస్యంగా.

“ఏం పట్టుకెళ్లకూడదా?” అంది లాయరులాగ.

“నాకేం. పట్టుకెళ్లు, అసలు పువ్వులు పంపించి నువ్వు మానేయ్”

“తనకి సంపెంగి అంటే చాలా ఇష్టం”

“బాగుంది. సంపెంగిపువ్వులన్నా గొడ్డుఖారం అన్నా సరదా పడనిదెవరు నేనూ అమ్మా తప్పించి” అన్నాను గుంటూరు ఫెండుని తలుస్తూ, అమ్మని చూస్తూ.

“ఊఁ బాగుందే నీ సరసం. కల్లా కపటం లేకపోతే కన్నతల్లితో సరసం ఆడమనీ” అంది అమ్మ – మావాదోపవాదాలు పండు మిరపకాయపచ్చడిలా అనిపించి కావచ్చు.

మెయిల్ మరో అరగంటకి వస్తుందనగా తాజా‌గా అప్పటికప్పుడు కోసి, తడిగుడ్డలో జాగ్రత్తగా చుట్టి పట్టుకెళ్లేం ఆ పువ్వులు నేనూ అక్కా.

ఆ కంపార్ట్‌మెంటు వాళ్లకోసం స్పెషల్‌గా వేసేరుట. చుట్టలూ, ముష్టివాళ్లూ, మురికిగుడ్డలూ – అదే చివరి బోగీ. గాంధీ ఇలాటి పెట్టెల్లోనే ప్రయాణం చేసినట్టు పెద్దవాళ్లు చెప్తుంటే చాలాసార్లు విన్నాను. అప్పట్లో థర్ఢు క్లాసులో ఫానులు కూడా వుండేవి కాదుట. ఎంత కష్టపడి ఉండాలో ఆలోచించు అన్నారు పైన చెప్పిన పెద్దవాళ్లు. మరి ఇలాటి సహప్రయాణీకులు ఆరోజుల్లో ఆయనకి దొరికారా ఎప్పుడయినా? నేను అడగలేదు. అలా అడగడం అవిధేయతకింద వస్తుంది కదా!

“ఈ సంపెంగిపూల వాసనలు ఈచుట్టపొగలమధ్య వింతపరిమళాలు వెదజల్లుతున్నాయి ఉగాదిపచ్చడిలాగ” అంది మాఅక్క స్నేహితురాలు.

“జీవితం అంటే అదే మరి” అంది పైగా. నిజమేననిపించింది నాకు. ఇంతటి గుణపాఠం నేర్పిన మా సంపెంగ చెట్టుకి మనసులోనే ధన్యవాదాలర్పించేను.

పదిరోజులు తిరిగేసరికి నావైపు కొమ్మలు పూత అయిపోయింది. ఇదికాదు పని అని మా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కృష్ణపరమాత్మతో చెప్పాను  ముప్ఫై ఒక్క పువ్వులు పూస్తే నాకు పదిహేనూ ఆయనకి పదహారూ అని. ఎలాగైనా దేవుడు మంచివాడే. లంచం పుచ్చుకుని పని చెయ్యనివాళ్ల మాటేమిటి?

సరిగ్గా ముప్పై ఒక్క పువ్వులు పూయించి దేముడు దేముడిననిపించుకున్నాడు. కాని అన్ని పురాణాల్లోలాగే ఇక్కడ కూడా క్లిక్కు పెట్టేడు. గోపాలుడు ఎంతైనా గడుసువాడు. తీరా కొయ్యబోతే సరిగ్గా పదహారు పువ్వులే అందేయి.

“ఇంత ′లేని వాడివై′ వున్నావేమయ్యా శ్రీకృష్టా! నీలీలలు మాలాటి అల్పులకి అవేద్యం కదా!” అన్నాను నా పదిహేను పువ్వులూ నేను తీసుకుని, ఒక పువ్వు ఆ బొమ్మముందు వుంచి. మామ్మ ఉరిమి చూసింది.

నేను నాస్తికురాల్ని కానని చెప్పినా నమ్మదావిడ.

ఇంతలో డాబామీద ఏదో చప్పుడు వినిపించి గబగబా పరుగెత్తాను. అనకాపల్లి బాణాకర్రలాటి గడకర్ర ఒకటి తీసుకుని అక్క అక్కడ నిలబడి వుంది.

“మందారనూనెలో వేసుకోవచ్చు కనీసం ఒకరేకు అయినా కొయ్యగలిగితే” అంది నన్ను చూసి.

సరేనని మరొకమాటు మామూలుగా పువ్వుపాళంగా కొయ్యాలని చూసేం. రాలేదు. సరే పూర్తిగా విడిపోతే మర్నాడు చెట్టు వూపి రాల్చెయ్యొచ్చు అనుకున్నాం. అదీ కుదరలేదు. పైన చెప్పిన గడకర్ర తీసుకుని గట్టిగా నొక్కాను తొడిమదగ్గర. మెల్లిగా రేకులమీద కొట్టేను తరవాత గట్టిగా కొట్టేను.

“ఏమిటర్రా ఏజన్మలోనో మీరు కిరాతకులయి పుట్టినట్టున్నారు” అమ్మ కిందనించి కేకలేస్తోంది. “సంపెంగ వేడి చేస్తుంది. తలనొప్పి వస్తుంది …”

ఈరాక్షసలీలమీద ఏ కరుణశ్రీ అయినా మళ్లీ పుష్పవిలాపం మలిభాగం రాస్తారేమోనని ఎదురు చూస్తున్నా.

(తెలుగు స్వతంత్ర.. జూన్ 13, 1959)

మనవి – నేను ఫాంటు ఎంత పెద్దవి పెట్టినా ఇక్కడ చాలా చిన్నవిగా వస్తున్నాయి. ఇది మార్చేమార్గం ఎవరికైనా తెలిస్తే, తెలుపగలరు. ముందే థాంక్స్. – మాలతి

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

15 thoughts on “మాతోటలో”

 1. చాలా సంతోషం సునీతగారూ. మీస్పందన చాాలా బాగుంది. హైదరాబాదులో మొక్క బతకలేదా. అయ్యో. సంపెంగకి విశాఖపట్నం, సింహాచలం వాతావరణం కావాలేమో.

  మెచ్చుకోండి

 2. మీ- మాతోటలో ..సంపంగి పూలు ఎంత గుభాళించాంయండి.
  వెదురు కర్ర తో కోయటం..రేకులు రాలటం,పూలకోసం వంతులు పడటం..పక్కింటి పసికూనతో సహా..చాలా బాగుంది. మీ కధలు చదువుతుంటే..ఇప్పడే తాజాగా రాసినట్లు ఉంటుంది..కథావస్తువు అటువంటి ది.
  సంపంగి మొక్క వైజాగ్ నుంచి తెచ్చి హైదరాబాదులో మా యింట్లో వేశాం కాని బతకలేదు.

  మెచ్చుకోండి

 3. @స్ఫురిత, అయ్యో, నేను మీమెయిలుకి జవాబు ఇవ్వలేదా. సాధారణంగా నేను వెంటనే జవాబు ఇస్తానండీ. ఏమయిందో అప్పుడు మరి. ఏమయినా సారీ. మీఅభిమానానికి ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 4. మా వూరు నచ్చినందుకు సంతోషం మాలతి గారూ. నేను ఎప్పట్నుండో మీ రచనలు చదువుతున్నా. అసలు నేను blog మొదలు పెట్టడానికి inspiration కూడా ఒకరకం గా మీరే. మీకు ఒక చిన్న size అభిమానిని అనుకోండి.నా blog చూడమని మీకు ఒక సారి mail కూడా పంపి కొన్నాళ్ళు జవాబు కోసం ఎదురు చూసాను. మొత్తానికి ఇవాళ మీ రాక నాకు మంచి surprais

  మెచ్చుకోండి

 5. @ భావన, అయ్యో, మిమ్మల్ని అంతబాధ పెట్టేనా? హుమ్. మాచెట్టు మాడాబా పిట్టగోడ పక్కనే వుండేది కానీ పిట్టగోడని మించి మరో పదడుగులు ఎదిగిపోయింది. అంచేత, కర్రకి కత్తి కట్టి … ఏంచేస్తాంలెండి. :p.
  @ రాధిక, నిజమే, ఆస్తులకోసం తగువులాడుకున్నట్టు..:)

  @ వసంతలక్ష్మి, సంతోషమండీ. 🙂 మీబ్లాగు ఇప్పుడే చూశాను. మీది కూడా విశాపట్నఁవేనన్నమాట. సింహాచలం, విశాఖపట్నం అంటే సంపెంగలూ, జీడిపప్పూ నాకు.
  @ మరువం, సందెపొద్దుకాడ .. పాట లేదండీ వినలేదు. కానీ, నాకు తెలిసిన మరోపాట, చికిలింత చిగురూ, సంపెంగ గుబురూ, చినదాని సొగసూ అని. యం.యస్. రామారావు పాడేరానుకుంటాను. ఏంటో ఆపువ్వులూ, ఆపాటలూ … ఈజన్మలోవి కాదేమో అనిపిస్తుంది ఇప్పుడున్న వాతావరణం చూస్తే.

  మెచ్చుకోండి

 6. అలా ఓ మొక్క నుండి చెట్టు వరకు చిత్రం గీయించారు. నిజమే కదా పూలవిషయంలో మన కోమలత్వం ఎటు పొతుందో ఓ మొగ్గనైనా తుంపని నారీమణి కనపడదేమో..
  “సందెపొద్దులకాడ సంపంగి నవ్వింది…” పాట విన్నారా?
  బహుశా సింహాచలం సంపంగి అనుకుంటున్నాను. మల్లెమొగ్గలు కొంటే ఒకటి రెండు సంపెంగలు, లేదా గులాబీలు తామరాకులో చుట్టి ఇచ్చేవారు మా వైపు. ఎంత తగాదాలో వాటితో ఆస్తిపంపకాల మాదిరి. వైజాగ్ లో చదివినపుడు మాత్రం ఆ చెట్లు చూసి తరించి [కోసి తల్లో తురుముకున్న కిరాతకురాలిని] .. మా అమ్మగారింట్లో మామూలు సంపంగి వుంది. ఆ మొగ్గలకీ నేను అన్నయ్య వాళ్ళ పాపతో సమానంగా పోటీ కి సిద్దం.

  మెచ్చుకోండి

 7. భలే వుందండి.ఆస్థుల కోసం తగువులాడుకున్నట్టు చిన్నప్పుడు పువ్వులకోసం దెబ్బలాడుకున్నవి గుర్తొచ్చినియ్యి.పువ్వులు వాళ్ళెవరికో ఇచ్చావు,మాకివ్వలేదంటూ కోపగించుకున్న చుట్టాలు,ఇరుగుపొరుగువారు,స్నేహితులు ఎంతమందో?ఈ కధ చాలా జ్ఞాపకాలు తట్టిలేపింది.

  మెచ్చుకోండి

 8. అబ్బబ్బ ఏం వుందండి కధ.. సంపెగ పువ్వు లా గుబాళించిందనుకోండీ. సంపెగలు సన్నజాజులు మల్లెలు మాలతీలత లు, కనకాంబరాలు, రాధా మనోహరాలు, దవనం మరువం అబ్బా ఏంటి మాలతి గారు మీకిది భావ్యమా ఈ పూలన్నిటి తోటీ అనుభందాన్ని ఇలా గుర్తు చెయ్యటం మీకు తగునా చెప్పండి. ఐనా సంపెగ గోడ వాలు కు పెట్టూకుంటే గోడ ఎక్కో,, పక్కన వున్న గడ్డీవాము ఎక్కో కోసుకోవచ్చు గాని మీరు ఏ ఆను లేకుండ చెట్టు ను పెట్టించి అమ్మాయిలను కష్ట పెట్టేసేరు పాపం.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.